ఇక
రాహుల్ రాజ్యమేనా?
వనం
జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (18-11-2012)
అందరూ అనుకున్నట్లే అయింది. "దేశ్
కీ నేతా రాహుల్ గాంధీ" అన్న ఆబాల గోపాలం కాంగ్రెస్ వర్గాల నినాదాలు సోనియా
గాంధీ చెవిన పడ్డాయి. పన్నెండేళ్లకు పైగా మౌన ముద్ర వహించిన మేడం, కార్యకర్తల
మొర ఆలకించారు. తనయుడు రాహుల్ గాంధీకి గురుతర బాధ్యత అప్పగించారు. గతంలో ఆయన ఇంత
పెద్ద బాధ్యత నిర్వహించలేదని కాదు. ఐతే, అది ఏదో ఒక్క ఉత్తర
ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమై పోయింది. ఇప్పుడేమో యావత్ భారత దేశానికి రాబోయే
సార్వత్రిక ఎన్నికలలో పార్టీ పరంగా దిశా నిర్దేశం చేయాల్సిన బృహత్తర బాధ్యత
అప్పగించబడింది. బహుశా రాహుల్ దృష్టికి రాకుండా ఏ ఒక్కరు కూడా ఎన్నికలలో పోటీ చేసే
వీలుండదేమో! ముఖ్యంగా లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఆయన చేతుల
మీదుగానే రూపొందించాల్సి వుంటుంది. తన టీంను తానలా పూర్తిగా తయారు చేసుకుని,
ఎన్నికల రంగంలో దిగి, విజయం సాధించి, ఆ విధంగా పార్టీని బలోపేతం చేసి, ఎన్నికల అనంతరం
ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన సోనియా గాంధీ చేసి వుండవచ్చు. ఐతే ఇదంతా
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించే స్థానాలపైన, దాని
ఎన్నికల ముందస్తు-ఎన్నికల తదనంతరం అవగాహన కొచ్చే మిత్ర పక్షాలు సాధించే స్థానాలపైన
ఆధార పడి వుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొనసాగుతున్న యుపిఎ
ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలుగా వున్న పార్టీలు ఒక్కొక్కటిగా
ప్రభుత్వానికి-కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నాయి. కొన్ని పార్టీలు
గోపీలుగా వుంటూ ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టే ప్రయత్నంలో వున్నాయి. ఒక్క మాటలో
చెప్పాలంటే, ఇప్పుడు కేంద్రంలో కొనసాగుతున్నది మైనారిటీ
ప్రభుత్వమే! సంఖ్యాపరంగా చూస్తే అది ఏ క్షణాన్నైనా కూలి పోవడానికి సిద్ధంగా
వుందనాలి. పూర్తిగా దింపుడు కళ్లెం ఆశ మీద వుంది. తృణమూల్ ప్రభుత్వంలోంచి వైదొలగిన
తరువాత ప్రారంభమైన ఈ పతనం కరుణానిధి అలకతో పతాక స్థాయికి చేరుకుంది. మజ్లిస్ కూడా
దూరమైంది. మాయావతి, ములాయంలు దోబూచులాడుతున్నారు. ఈ
నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు పోవడం కంటే కాంగ్రెస్ పార్టీకి మరో గత్యంతరం లేనే
లేదు. అదే పనిలో మునిగి పోయింది కాంగ్రెస్ పార్టీ, దాని నూతన
బాస్ రాహుల్ గాంధీ.
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోక్ సభ
ఎన్నికలకు, అవి కూడా అనుకున్న దానికంటే ముందుగానే జరుగవచ్చన్న ఊహాగానాల నేపధ్యంలో,
పూర్తి స్థాయిలో సమాయత్తమౌతోంది. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్గ
పునర్వ్యవస్థీకరణలో కొందరు కొత్త వారిని చేర్చుకుంటే, మరి
కొందరు పాతవారిని పార్టీ పని కోసమని బయటకు పంపింది. పార్టీని నష్ట పరుస్తున్నారని
భావించిన మరి కొందరిని ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టింది. అలక పానుపు ఎక్కిన
వారిని ఓదారుస్తోంది. ఎన్నికల్లో గెలుపు
గుర్రాల కోసం కాంగ్రెస్ యువ నేత రాహుల్‌గాంధీ తనదైన శైలిలో వేట ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా, వివిధ నియోజక
వర్గాలలో భారీ స్థాయిలో సమాచార సేకరణకు శ్రీకారం చుట్టారు. విజయావకాశాలున్న నేతలు, ఇతర ప్రముఖుల కోసం ఆయన లోతుగా ఆరా తీస్తున్నారు. వారు పార్టీ సభ్యులు
కాకపోతే, ఎలా వారిని తమలో చేర్చుకోవాలన్న అంశంపైనా దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ప్రతి లోక్‌సభ స్థానానికీ తన సొంత వేగులను పంపుతున్నారు! ప్రతి సెగ్మెంట్ నుంచీ ప్రాధాన్యత క్రమంలో ముగ్గురి పేర్లను వారు గుర్తించి డిసెంబర్ తొలి వారానికల్లా రాహుల్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందుకొరకు, స్వయానా రాహుల్
గాంధీ తనదైన శైలిలో ఎంపిక చేసి, ప్రత్యేక తరహా శిక్షణ ఇచ్చిన
పరిశీలకులు, ఆంధ్ర ప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలలో
పర్యటిస్తున్నారు. ఇలా వివిధ రాష్ట్రాలకు పోయే బృంద సభ్యులలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన
ఆరుగురు నేతలు కూడా వున్నారు. ఈ సభ్యులకు పది-పదిహేను లోక్ సభ సెగ్మెంట్ల బాధ్యతలు
అప్పగించారు. దేశవ్యాప్తంగా వారు
ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, పలు వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడి.. గెలుపు గుర్రాలు కాగల అభ్యర్థులను గుర్తించనున్నారు.
ఇంతకూ ఈ పరిశీలకులు చేయాల్సింది ఏంటి? ముందుగా తమకిచ్చిన
సుమారు ముప్పై ప్రశ్నలతో కూడిన పత్రాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. దీని
కొరకు శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వినికిడి. అభ్యర్థుల
ఎంపిక పరిశీలన ఏ కోణంలో జరగాలి అన్న అంశంపై వ్యక్తిగత నైపుణ్యంతో కూడిన జాగ్రత్తలు
తీసుకోవాలి. స్థానికంగా
గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో అంచనా వేయడం పరిశీలకుల ప్రధమ కర్తవ్యం.
ఒక్కో నియోజక వర్గానికి మూడేసి పేర్లతో కూడిన జాబితా రూపొందించాలి. వారి విజయావకాశాలకు వివిధ కోణాల నుంచి గల కారణాలను
విశ్లేషణా పూర్వకంగా అంచనా వేయాలి. పరిశీలనా క్రమంలో మండల స్థాయి పైనుంచి, జిల్లా
స్థాయి-రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను సేకరించి తమ విశ్లేషణకు
వాటిని జోడించాలి. సిట్టింగ్ ఎంపీల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వారికి
టికెట్ ఇవ్వకుండా వుండడానికి గల కారణాలను సహేతుకంగా పొందుపరచాలి. వీటన్నింటి కీ
అదనంగా పరిశీలకులు సిఫార్సు చేస్తున్న అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి
వారు ఆ కోణంలో గెలుపు గుర్రాలా? కారా? అనేది
తేల్చి చెప్పాలి. కిందటి ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి
దారితీసిన కారణాలను అంచనా వేసి, అవి సరి చేయడానికి, అదే అభ్యర్థి సరైన వాడా? కాదా?
అనేది విశ్లేషణ చేయాలి. ఇక అభ్యర్థి సామాజిక నేపధ్యం, కులం,
మతం, గుణగణాలు, నిజాయితీ
తనం, ఎలాగూ అంచనా వేయాలి. అభిప్రాయ సేకరణ కొరకు కేవలం పార్టీ
ప్రముఖులనే కాకుండా, పార్టీతో అంతో-ఇంతో
ప్రత్యక్షంగానో-పరోక్షంగానో అనుబంధం వున్న వారిని, స్థానికంగా
ప్రముఖ వ్యాపార వేత్తలను, స్వచ్చంద సంస్థల కార్యకర్తలను,
ప్రభుత్వేతర సంఘాల నాయకులను, పాత్రికేయులను,
ఇతర ప్రముఖులను కూడా సంప్రదించాలి. మొత్తం మీద రాహుల గాంధీ అంచనాల
మేరకు నివేదిక రూపొందించాలి. ఎవరికి టికెట్ కేటాయించాలనేది రాహుల గాంధీకి
వదిలేయాలి!
రాహుల్ గాంధీ రాజకీయం ఫలిస్తుందా? ఆయన అనుకున్న
అభ్యర్థులు దొరుకుతారా? అసలాయన మనస్సులో ఏముంది? ఈ కసరత్తంతా ఏదో విధంగా గెలిచే అభ్యర్థుల కొరకా? లేక,
భవిష్యత్‍లో అవినీతికి తావులేని అభ్యర్థులనే రంగంలోకి దింపాలన్న
మంచి ఆలోచనా? ఇవ్వాళ దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా
ఆందోళన కొనసాగుతోంది. సాక్షాత్తు రాహుల్ కుటుంబ సభ్యుడైన వాద్రాపైనే అవినీతి
ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో, తాను అవినీతికి దూరం అని
తెలిపే విధంగా అభ్యర్థుల ఎంపికకు రాహుల్ శ్రీకారం చుట్ట దల్చుకున్నాడా? ఆయన నిజంగా అలా భావిస్తే అలాంటి అభ్యర్థులు దొరకడం అంత సులువైన పనేనా?
నేర చరిత్ర లేనివారు, నీతిమంతులు, కుల-మతాలకు అతీతులు అసలెవరైనా మిగిలారా? కోట్ల
రూపాయలలో ఆర్థిక స్తోమత లేనివారు ఎన్నికలలో నిలబడి గెలిచే పరిస్థితులున్నాయా?
ఇవన్నీ రాహుల్ గాంధీ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నాడనేది
ప్రధానమైన ప్రశ్న. ఎన్నో ఆశలతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్టానం రాహుల్‌ను
రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సంపాదించుకుంటే, భావి భారత ప్రధాని ఆయనే సుమా అనే రీతిలో రాహుల్‍కు బరువు బాధ్యతలు
అప్పగించారు. కనీసం మన్మోహన్ సింగ్ ప్రసక్తే లేకుండా ఎన్నికలకు సంబంధించిన ప్రధాన
కమిటీలను ఏర్పాటు చేశారు. ఆంటోనీ, ద్విగ్విజయ్ సింగ్‌లకు
ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మన్మోహన్ సింగ్‌కు ఇవ్వలేదు. ఇదంతా గమనిస్తుంటే రాబోయే
రోజుల్లో అంతా రాహుల్ గాంధీదే హవా అనిపిస్తోంది.
ఇదిలా వుండగా, ముందస్తుగానే రావచ్చని భావిస్తున్న లోక్‌సభ ఎన్నికలకోసం పార్టీపరంగా రాహుల్‌గాంధీకి అత్యధిక ప్రాధాన్యమిచ్చి, కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీలు కూడా అందుకు ధీటుగా సమాధానం చెపుతున్నాయి.
వారికి తోచిన భాష్యం
వారు
చెప్పుకుంటున్నారు. ఒకటి వెంట మరొకటి యుపిఎ భాగస్వామ్య పార్టీలు ప్రభుత్వం నుంచి
తొలగి పోతుంటే, దిగజారిన
ప్రతిష్టను తిరిగి పొందేందుకు, తద్వారా అన్నివిధాలా కలిగిన నష్టాన్ని చక్కదిద్దుకునేందుకు, కాంగ్రెస్ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఒక పక్క ఖండిస్తూనే, మరో పక్క తన
ప్రయత్నాలలో తానుంది. ప్రతిపక్షాలు కూడా ముందస్తు ప్రయత్నంలో వున్నాయనడానికి
ఉదాహరణ సమాజ వాది పార్టీ తీసుకున్న తాజా నిర్ణయమే! వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అప్పుడే 55 మంది పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఎన్నికలకు వెళ్లవచ్చని సిపిఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి చెప్పడం మరో ఉదాహరణ. ప్రతిపక్షాలు చేస్తున్న
ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే ఖండించింది. తమ సారధ్యంలోని యుపిఎ
ప్రభుత్వానికి పూర్తిగా
అయిదేళ్లు, అంటే 2014 వరకు, పాలించమని
ప్రజలు అధికారమిచ్చారని, ప్రభుత్వం తన పూర్తి కాలపరిమితిని పూర్తిచేస్తుంది అని అంటుంది. యూపీఏ 2 అధికారంలోకి
వచ్చినప్పటి నుంచీ ఇలాంటి పుకార్లు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
‘అయిదేళ్లు పాలించేందుకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అయిదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు తీర్పిచ్చారు. అలాగే ప్రభుత్వం అయిదేళ్ల వరకూ అధికారంలో ఉంటుంది’ అని ఆ పార్టీ అంటుంది. ముందస్తు
ఎవ్న్నికలకు అవకాశమే
లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వానికి ముప్పేమీ లేదని బల్ల గుద్ది మరీ చెప్తోంది ఆ
పార్టీ.
ఐతే, రాజకీయ పార్టీగా ఎన్నికలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమేనని ఏఐసిసి వర్గాలంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఎవరి దగ్గర నుంచీ రాదు. కాకపోతే, కాంగ్రెస్ పార్టీ రాహుల్‌కు మరింత విస్తృతమైన పాత్ర ఇవ్వడం అనేది ఆయనను వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించ డానికి సూచనే కదా? దీనికి సమాధానంగా పార్టీ
వర్గాలు, ‘పార్టీలో రాహుల్‌కు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ ముఖ్యమైన వ్యక్తి. ఆయన స్థానం అలాగే ఉంటుంది’ అని చెప్తున్నారు. రాహుల్‌కు కాంగ్రెస్‌లో కొత్త పాత్ర ఇచ్చారు కనుక మధ్యంతర ఎన్నికలు వస్తాయా?’ అన్న ప్రశ్నకు, ‘ఇది పూర్తికాలం కొనసాగే ప్రభుత్వమే కానీ, మధ్యంతర ప్రభుత్వం కాదు’ అని సమాధానం వస్తుంది.
ఏదేమైనా రాహుల్ రాజ్యం
రాబోతోంది. ఒక వేళ కాంగ్రెస్ ఓడితే అంతా తారుమారు కావచ్చు. అది వేరే సంగతి!
రాజులు తాము రాజులమని చెప్పుకుని రాజ్యమేలటం పూర్వపథ్థతి.
ReplyDeleteప్రస్తుతం ప్రజాస్వామ్యం పేరున రాచరికపు పాలనలు నడుస్తున్నాయి స్వాతంత్ర్యం అనేది వచ్చినప్పటినుండీ.
ప్రజలు తమ ఓటు విలువ, ప్రజాస్వామ్యం యొక్క విలువా తెలుసుకున్న రోజున యీ అనైతికరాచరికాలకు తెర పదుతుంది.
ఆ రోజు వచ్చే దాకా యెన్నికల నాటకాలు జనానికి ఒరిగించేది యేమీ లేదు.
Noting new will happen. same old story repeats
ReplyDeleteధర్మ భ్రష్టత్వం... దౌష్ట్య విడంబనం మధ్య మనం జీవిస్తున్నాం.
ReplyDeleteరాబోయే కాలం ఇంతకంటే బాగుందబోడు.
అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ సుభాసుభం. అస్తు. విజయ రాఘవాచార్యులు