Friday, November 9, 2012

రావణుడు దేవుడెలా అవుతాడు?: వనం జ్వాలా నరసింహారావు


రావణుడు దేవుడెలా అవుతాడు?
వనం జ్వాలా నరసింహారావు

రావణాసురుడు దేవుడని, ఇటీవల కొందరు ప్రబుద్ధులు, పని కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకొస్తే, ఒక్క రావణుడే కాదు..... మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్య కశిపుడు, శిశుపాలుడు...ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో రాక్షసులుగా ముద్రపడిన ప్రతి వారినీ వారు దేవతలంటున్నారు. అంతటితో ఆగకుండా, రావణుడిని అగ్రవర్ణాల వారు అణగదొక్కారని, అతనెంతో నీతిమంతుడని కూడా వాదిస్తున్నారు. వాల్మీకి రామాయణంలో అతడి గురించి తప్పుడు ప్రచారం జరిగిందన్న వాదననూ లేవదీశారు. వారి వాదన తప్పని చెప్పే ప్రయత్నమే ఇది.

రావణాసురుడి పుట్టుకే అతి జుగుప్సాకరమైంది. అగ్రవర్ణాల వారు వాడిని అణగ తొక్కారనే వాదన సరైంది కాదు. కారణం రామాయణం రాసిన వాల్మీకి అగ్రవర్ణానికి చెందిన వాడు కాకపోవడమే! అది కాకుండా రావణుడు పుట్టింది కూడా బ్రాహ్మణ -క్షత్రియ జంటకు. అలాంటప్పుడు వెనుకబడిన వర్గానికి చెందిన వాడెలా అవుతాడు? వాడు బుద్ధి తెల్సినప్పటి నుంచే ఘోరాలు-నేరాలు చేసిన వాడే!. బ్రహ్మ గురించి తపస్సు చేసి, మనుష్యులను, అంతకన్నా తక్కువ జీవులను తాను లక్ష్య పెట్టనని, మిగిలిన వారితో చావు లేకుండా వరమివ్వమని అడిగి, అలాగే వరం పొందాడు. సవతి సోదరుడు కుబేరుడిని ఆ వర బలంతో లంక నుంచి వెళ్ల గొట్టాడు. ముల్లోకాలను బాధ పెట్టడం వాడికొక దిన చర్య. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. తప్పని చెప్పిన అన్న కుబేరుడి మీద యుద్ధానికి పోయి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ రోజులు గడిపేవాడు. నందీశ్వరుడిని అవమానించి శాపానికి గురయ్యాడు. కామంతో వేదవతిని అవమానించాడు. ఆమె పార్వతి శాపం నిజం చేస్తానని మళ్లీ శపిస్తుంది. అయోధ్య రాజు అనరణ్యుడిని అవమానించి ఆయన శాపానికీ గురవుతాడు. యముడి మీదకు, ఇంద్రుడి మీదకు దండెత్తుతాడు. బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది. రంభను చెరిచి నలకూబరుడి శాపానికి గురవుతాడు. కార్తవీర్యార్జునుడితో , వాలితో కయ్యానికి దిగి గర్వభంగమవుతాడు. సీతాదేవిని అపహరిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాడు చేసినవన్నీ అరాచకాలే! వాడెలా దేవుడవుతాడు. మరిన్ని వివరాలకు పోతే.....
బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుడి కొడుకు విశ్రవసుడికి భరద్వాజుడి కూతురైన దేవవర్ణి ద్వారా కుబేరుడనే కొడుకు పుట్టాడు. ఆతడి నివాస స్థానం లంకా నగరం. దక్షిణ సముద్రంలో, త్రికూట పర్వత శిఖరంలో వుంది లంక. దానిని రాక్షసులు కాపురం చేయడానికి విశ్వకర్మ నిర్మించాడు. బ్రహ్మ తనకిచ్చిన పుష్పక విమానంలో తిరుగుతూ కుబేరుడు అక్కడ కాపురముంటాడు. కుబేరుడు ఈశ్వరుడి స్నేహం సంపాదించుకుని కొడుకులతోను, మనుమలతోను, అక్కడ శాశ్వత సుఖాలను అనుభవిస్తుంటాడు. సుమాలి అనే రాక్షస రాజు కుబేరుడిని చూసి, తన రాక్షస వంశం వృద్ధి చెందాలంటే, అంతటి వాడి అవసరం వుందని భావించాడు. కూతురు కైకసిని విశ్రవసువును వివాహం చేసుకో మంటాడు. తండ్రి సూచన ప్రకారం, కైకసి, విశ్రవసుడుని చేరబోతుంది. మునీశ్వరుడిని కామంతో చూస్తూ నిలుచుంటుంది. ఆమె వివరాలు అడిగి, మనసులోని భావాన్ని గ్రహించి, వచ్చిన సమయం మంచిది కానందున, క్రూరులైన రాక్షస శ్రేష్టులు ఆమెకు కొడుకులుగా పుట్తారని అంటాడు. విశ్రవసుడికి కైకసి వివాహిత భార్య కాదు. కొంతకాలానికి ఆమెకు నిడుపాటి కోరలు, పది తలలు, ఎర్రని వెంట్రుకలు, ఇరవై చేతులతో భయంకరమైన ఆకారం కలవాడిని కంటుంది. వాడికి దశకంఠుడు అని పేరు పెట్టాడు తండ్రి విశ్రవసుడు. ఆ తరువాత వాడికి రావణుడనే పేరు మిగిలింది. రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక ఐనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీయందు కలిగిన వాడు క్షత్రియుడే. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, అగ్ర కులాలకు చెందిన వాడే! మరి కొంతకాలానికి కైకసికి కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు. వీరూ క్రూరులే. చివరకు విభీషణుడనే ధర్మాత్ముడైన కొడుకు పుట్టాడు.  
          గోకర్ణానికి పోయి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు దశకంఠుడు. మనుష్యులను, అంతకన్నా తక్కువ జీవులను తాను లక్ష్య పెట్టనని, మిగిలిన వారితో చావు లేకుండా తనకు వరమివ్వమని అడిగి, బ్రహ్మనుంచి అలాగే వరం పొందాడు. ప్రాణం పోయేంతవరకూ తన మనసు ధర్మమందే నిలవాలని విభీషణుడు కోరాడు. అడగకపోయినా విభీషణుడికి అమరత్వం, కుంభకర్ణుడికి నిద్రాత్వం వరంగా ఇచ్చాడు. లంకా నగరం రాక్షసులదని, సవతి సోదరుడు కుబేరుడి దగ్గర నుంచి దానిని వశ పర్చుకొమ్మని సుమాలి బోధించాడు. రాక్షసులను ఉద్ధరించ మంటాడు. రావణుడు, ప్రహస్తుడనే వాడిని కుబేరుడి దగ్గరకు పంపి, తనకు లంకను వశం చేయమంటాడు. కుబేరుడు లంకను విడిచిపోవడానికి సమ్మతించి, తండ్రి సూచన మేరకు, కైలాస పర్వతం దగ్గరకు పోతాడు. అమితమైన సంతోషంతో రావణుడు లంకా నగరం చేరాడు. సోదరి శూర్పణఖకు, విద్యుజ్జిహ్వుడనే వాడికిచ్చి వివాహం జరిపించాడు.
మయుడనేవాడు, తన కూతురు మండోదరిని, రావణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కూతురుతో పాటు మయుడు రావణుడికి "శక్తి" అనే ఒక అస్త్రాన్నిచ్చాడు. దానితోనే రావణుడు లక్ష్మణుడిని మూర్చ పోయేటట్లు చేయగలిగాడు యుద్ధంలో. తమ్ముడు కుంభకర్ణుడికి వైరోచనడి మనుమరాలైన వజ్ర జ్వాలను, శైలూషుడనే గంధర్వుడి కూతురు సరమను విభీషణుడికి ఇచ్చి వివాహం చేయించాడు రావణుడు. కొంతకాలానికి మండోదరి-రావణాసురుడికి ఒక కొడుకు పుట్టాడు. వాడు భూమిమీద పడగానే మేఘాలు గర్జించడం వల్ల అతడి పేరు మేఘనాథుడని పెట్టాడు రావణుడు.
ఇక అప్పటినుంచి రావణుడు ముల్లోకాలను భాదించడం మొదలెట్టాడు. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. తప్పుడు పనులు మానమని కుబేరుడు బోధించాడు. కుబేరుడిని మీదకు యుద్ధానికి పోతాడు రావణుడు. యుద్ధంలో రావణ సేనదే పైచేయవుతుంది. కుబేరుడిని జయించి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు రావణుడు. పుష్పక విమానంలో లంకకు మరలిపోతుండగా, కైలాస గిరి ప్రాంతంలో, విమానం కదలదు. పార్వతితో కలిసి శంకరుడు క్రీడలో వున్న ఆ సమయంలో ఎవరికీ అటుగుండా పోవడం సాధ్యపడదని అన్న నందీశ్వరుడిని, కోతితో పోల్చి హేళన చేశాడు. కోతులే భవిష్యత్‍లో జరగబోయే యుద్ధంలో రావణ సేనను ఓడించుతారని నందీశ్వరుడు శపించాడు. రావణుడు కైలాసాన్ని పెకలించడానికి పూనుకుంటాడు. శివుడు తన కాలి బొటన వేలుతో, ఆ పర్వతాన్ని అణచి వేశాడు. రావణుడి చేతులు కొండ కింద పడి బాధించసాగాయి. ఏడవడం మొదలెట్టాడు. శంకరుడిని ప్రార్థించాడు. అలా వేయేళ్లు ఏడవగా శంకరుడు కరుణించాడు. ఆ విధంగా ముల్లోకాలు కలతచెందేట్లు ఏడ్చినందున అతడికి "రావణుడు" అని శివుడు పేరు పెట్టాడు. నాటి నుంచి రావణుడు శివపూజ చేయడం మొదలెట్టాడు. తనకు ఎదురులేదన్న గర్వంతో, ఇష్టం వచ్చినట్లు పుష్పక విమానం మీద తిరుగుతూ, శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ, తిరగసాగాడు.
హిమవత్పర్వత ప్రాంతంలో రావణుడికి వేదవతి కనిపించింది. కామంతో కళ్లు మూసుకున్న రావణుడు ఆమెను చేరబోయాడు. తల వెంట్రుకలు పట్టుకుని వేదవతిని లాగుతాడు. రావణుడు అవమానించిన ఆ దేహాన్ని ఇక తాను వుంచుకోనంటుంది. అగ్ని ప్రవేశం చేస్తానని, రావణుడి గర్వమణచడానికి మళ్లీ జన్మించుతానని అంటూ, చెప్పినట్లే చేస్తుంది. అంతకు ముందు పార్వతి రావణుడిని స్త్రీ నిమిత్తంగా నాశనమవుతావని శపిస్తుంది ఒక సారి. దానికి తోడు ఇప్పుడు వేదవతి తానే ఆ స్త్రీనంటుంది. నందీశ్వరుడు శాపం ఎలాగూ వుంది. ఆ విధంగా రావణ వినాశానికి బీజాలు పడ్డాయి. ఆ వేదవతే, జనక మహారాజు కూతురై, భూమిలో పుట్టి, సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది.
రావణుడు యజ్ఞం చేస్తున్న మరుత్తు అనే రాజును యుద్ధానికి రెచ్చగొట్టి, అక్కడున్న మునులందరినీ చంపి, వారి నెత్తురు తాగి, తృప్తి చెంది అక్కడ నుండి వెళ్లిపోతాడు. పరాక్రమం గల రాజుల వద్దకు పోయి యుద్ధమన్నా చేయాలని, లేదా, ఓడి పోయామనన్నా అనాలని బలవంతం చేస్తాడు. వాడు వర బలం కలవాడనీ, ఓడించడం శక్యం కాదనీ, భావించిన రాజులు ఓటమిని అంగీకరించారు. అయోధ్యకు వెళ్లాడు రావణుడు. ఆ సమయంలో అనరణ్యుడు అయోధ్యను పాలించేవాడు. ఆతడిని యుద్ధానికి పురిగొల్పాడు రావణుడు. యుద్ధంలో ఓడిపోయాడు అనరణ్యుడు. తన వంశంలోనే దశరథ మహారాజు కుమారుడైన రాముడు, యుద్ధంలో రావణుడిని చంపుతాడని శపించాడు. ఇది రావణుడికి నాలుగో శాపం.
నరులను చంపటం ఆతడికి ధర్మం కాదని బోధించాడు నారదుడు రావణుడికి. దేవతలు, గంధర్వులు, యక్షులు, దీర్ఘకాలం బతికేవారని వారిని జయించడం గొప్ప అని అంటాడు. యముడిని యుద్ధంలో జయించమని రావణుడికి దుర్భోధ చేశాడు. యముడిని చంపడానికి పోతాడు. యమ పురికి చేరుతూనే, పాప-పుణ్య ఫలాలను అనుభవిస్తున్న ప్రాణులను చూశాడు. కింకరులు రావణుడితో పోరాటానికి దిగారు. స్వయంగా యముడే రావణుడితో యుద్ధానికి బయలుదేరతాడు. యమ-రావణ యుద్ధం జరుగుతుంది. ఇరువురు సరిసమానంగా పోరు సల్పారు. రావణుడిపై యమ దండం వేయడానికి సిద్ధ పడతాడు యముడు. ఆ పని చేయవద్దని బ్రహ్మ దేవుడు యముడిని వారించాడు. దేవతల చేతుల్లో చావకుండా తాను రావణుడికి వరం ఇచ్చానని, తన మాట అసత్యం చేయవద్దని కోరాడు. యముడు అదృశ్యమైపోయాడు. యముడిని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమ పురిని విడిచి పోయాడు.
"నివాత-కవచు" లనే రాక్షసులు, రావణాసురుడితో సమరం చేయాలనుకుంటారు. వారు ఒకరిపై మరొకరు గెలవడం సాధ్యం కాదని, సంధి చేసుకోవాలని బ్రహ్మ సూచించాడు. తరువాత నశ్మ నగరాన్ని పాలిస్తున్న కాలకేయులను జయించి, వరుణ నగరంపై యుద్ధానికి పోతాడు. కాలకేయులను చంపే ప్రయత్నంలో, యుద్ధంలో గెలిచి తీరాలన్న పట్టుదలలో, దేహం తెలియక, రావణుడు బాణాలను ప్రయోగించగా, ఆ క్రమంలో శూర్పణఖ మొగుడు చనిపోతాడు. తనపై నిష్టూరాలాడిన శూర్పణఖను ఓదార్చడానికి, ఖర-దూషణులనే ఇద్దరు రాక్షసులను, పదునాలుగువేల సమూహంతో, ఆమెకు తోడుగా వుండేందుకు దండకారణ్యాణంలోని జన స్థానానికి పంపుతాడు రావణుడు.
వరుణ నగరంలో కామధేనువును చూసి, తన యుద్ధ కాంక్షను రాజుకు కబురంపుతాడు. వరుణ తనయులు రావణుడితో యుద్ధం చేసి ఓడిపోతారు. వరుణుడు అప్పుడు రాజ్యంలో లేడు. రాజు లేనప్పుడు, కొడుకులు ఓడిపోయినప్పుడు, ఇక రావణుడు గెలిచినట్లేనని అంటాడు మంత్రి. ఎలాగూ గెలుపు తనదే కదా అనుకుంటూ, లంకా నగరానికి బయల్దేరాడు రావణుడు. పోతూ-పోతూ, దారిలో, బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. వారందరినీ పుష్పక విమానంలో పడేస్తాడు. వారిలో నాగ కన్యలు, మనుష్య స్త్రీలు, అసుర కాంతలు, రాక్షస వనితలు, యక్ష సతులు, దానవాంగనలున్నారు. వారిలో పెళ్లి ఐన వారు, కాని వారు కూడా వున్నారు. చెరబడిన స్త్రీలందరూ విలపించినా రావణుడు పట్టించుకోడు. చెరబడిన స్త్రీలు రావణుడిని శపించారు. పర స్త్రీలను తన భార్యలుగా చేసుకోవాలను కోవడం కంటే పాప కార్యం లేదని, తమను కామంతో వశ పర్చుకో చూస్తున్నాడని, తామే పతివ్రతలమైతే, రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది.
చెరబట్టిన స్త్రీలను లంకకు చేర్చడం చూసిన విభీషణుడు అన్నకు నీతి బోధ చేస్తాడు. కీర్తిని, ధనాన్ని, వంశాన్ని నాశనం చేసే ఇలాంటి పని చేయడం తగదని అంటాడు. ఆ మాటలు లెక్క చేయకపోగా, చెల్లెలు కుంభీనసి భర్త మధును వెంట పెట్టుకుని దేవతల మీదకు దండయాత్రకు పోతాడు. మార్గమధ్యంలో, దేవతా సౌందర్యవతి రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. మూడు లోకాలలో తనను పోలిన మగవాడెవ్వడు లేడని, ఉపేంద్రుడైనా, ఇంద్రుడైనా, అశ్వినీ దేవతలైనా, చక్కదనంలో తనకు సాటి రారని, తనను విడిచి వేరొకని వద్దకు పోవద్దని వేడుకుంటాడు రంభను. రావణుడు తనకు తండ్రి లాంటి వాడని, తాను ఆయనకు వరుసకు కోడలని, తన మీద దయ చూపాలని, ఇతరులు తనను అవమానిస్తే రక్షించాల్సిన వాడు ఇలా చేయడం తగదని, తనను నగుబాట్లపాలు చేయవద్దని వేడుకుంటుంది రంభ. రావణుడా మాటలు పట్టించుకోకుండా రంభను చెరిచి విడిచి పెట్తాడు. రావణుడు చేసిన చెడ్ద పనిని భర్త నలకూబరుడి(కుబేరుడి కొడుకు) తో చెప్తుంది రంభ. పర స్త్రీని చెరిచినట్లయితే రావణుడు మరణించుతాడని నలకూబరుడు శపించుతాడు. రావణుడు బలవంతంగా ఎత్తుకుని వచ్చిన పతివ్రతా స్త్రీలు ఆ శాపం తెలిసి కొని సంతోషించారు. రావణుడి వలన భయం వదిలారు. ఆ దినం మొదలుకుని, పర స్త్రీ సంగమం విషయంలో మనస్సు పోనిచ్చినవాడు కాదు రావణుడు.
ఇంద్రుడిమీదకు యుద్ధానికి పోతాడు. దేవ-దానవ యుద్ధం జరుగుతుంది. రావణుడి కొడుకు మేఘనాధుడు ఇంద్రుడిని బంధించుతాడు. నాటి నుంచి వాడు ఇంద్రజిత్తుగా పిలవబడతాడు. బ్రహ్మ లంకకు వెళ్లి ఇంద్రుడిని విడిచి పెట్టమని అడుగుతాడు. ఆయన కోరికను అంగీకరించారు రావణ-ఇంద్రజిత్తులు. అప్పటినుంచి, తనకెలాగూ కుమారుడు ఇంద్రజిత్తు తోడున్నాడు కదా అని, మరింత లోక కంటకుడై విర్రవీగుతుండేవాడు రావణుడు. కనిపించిన ప్రతి వారినీ, రాజులందరినీ బాధించుతూ, భుజ బల గర్వంతో, కళ్లు మూసుకొనిపోయి, ఒకనాడు మాహిష్మతీ నగరాన్ని పాలిస్తున్న కార్తవీర్యార్జునుడి మీదకు యుద్ధానికి పోతాడు. కార్తవీర్యార్జునుడు వాడిని బంధించి చెరసాలలో పడేశాడు. ఇది తెలుసుకున్న రావణుడి తాత పులస్త్యుడు అక్కడకు చేరుకుని, రావణుడిని చెరసాలనుంచి విడవమని కోరాడు. ఆయన కోరికను మన్నించాడు కార్తవీర్యార్జునుడు. రావణుడు కార్తవీర్యార్జునుడితో స్నేహం చేస్తూ, తరువాత, మళ్లా రాజులను ఓడించాలన్న కోరికతో, పొగరు పడుతూ, భూమి మీద తిరుగుతుండేవాడు.
రావణుడు లోకాలలో సంచరిస్తూ, ఒకనాడు కిష్కింధకు వచ్చి, వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ సమయంలో వాలి సంధ్య వార్చడానికి నాలుగు సముద్రాలకు పోయాడు. అప్పుడు దక్షిణ సముద్రంలో సంధ్య వారుస్తున్నాడని తెలుసుకుని పుష్పక విమానం ఎక్కి అక్కడకు చేరుకుంటాడు రావణుడు. వాలిని వెనుక నుంచి వెళ్ళి బంధించాలనుకుంటాడు. వాడి ఉద్దేశం కనిపెట్టిన వాలి, రావణుడిని తన చంకలో ఇరికించి, ఆకాశ మార్గంలో పోయి, పడమటి సముద్రంలో, ఉత్తర సముద్రంలో, తూర్పు సముద్రంలో సంధ్య వారుస్తాడు. కిష్కింధకు తిరిగొచ్చి రావణుడిని విడిచి, ఏమీ తెలియని వాడివలె అతడి క్షేమ సమాచారం అడుగుతాడు. తాను వాలితో యుద్ధం చేయడానికి వచ్చానని, గర్వభంగం ఐందనీ, అగ్ని సాక్షిగా అతడితో స్నేహం చేయాలని వుందని అంటాడు. ఆ తరువాత వారిరువురు స్నేహితులౌతారు.
అరణ్యవాసం చేస్తున్న శ్రీరామ లక్ష్మణ సీతాదేవిలు పంచవటికి చేరుకుంటారు. రావణుడి సోదరి శూర్పణఖ శ్రీరాముడిని చూస్తుంది. తానతిడిని మోహిస్తున్నట్లు చెప్తుంది. తమ్ముడు లక్ష్మణుడు వద్దకు పొమ్మని సలహా ఇచ్చాడు రాముడు. శూర్పణఖ ముక్కు-చెవ్వులు కోస్తాడు లక్ష్మణుడు. కురూపిని చేస్తాడు. శూర్పణఖకు తోడుగా వున్న ఖరుడు ఆమె వికృత రూపాన్ని చూసి కోప్పడతాడు. రాముడిమీద యుద్ధానికి పద్నాలుగు వేల మంది రాక్షసులను పంపుతాడు. వారందరినీ చంపుతాడు రాముడు. స్వయంగా ఖరుడే యుద్ధానికి పోతాడు. ఆతడికి తోడుగా దూషణుడు వెళ్తాడు. ఖర-దూషణులిద్దరూ రాముడి చేతిలో ఓడి చనిపోతారు. ఇది గమనించిన అకంపనుడనే వేగులవాడు, లంకా నగరానికి పోయి, రావణాసురుడితో సీతాపహరణం చేయమని, శ్రీరామ వధోపాయం అదేనని సలహా ఇస్తాడు. సీతాదేవి సౌందర్యాన్ని రావణుడికి వివరంగా చెప్తాడు. శూర్పణఖ కూడా సీతాపహరణం చేయమని బోధిస్తుంది.
రాముడు శూర్పణఖను కురూపిని చేయడం, ఖర-దూషణాదులను సంహరించడం, ఇతర రాక్షసులను మట్టుబెట్టడం రావణుడి మదిలో మెలిగాయి. పగ తీర్చుకోవాలను కుంటాడు. రహస్యంగా మారీచుడి వద్దకు బయల్దేరాడు. సాయం చేయమని మారీచుడిని వేడుకుంటాడు. సీతాపహరణానికి తనకు తోడుగా రమ్మంటాడు. జవాబుగా మారీచుడు శ్రీరాముడి బల పరాక్రమాలను రావణుడికి తెలియ పరుస్తాడు. శ్రీరాముడితో తాను స్వయంగా పడిన పాట్లను వివరించాడు. ఎలా తాను రావణుడి బారి నుంచి తప్పించుకున్నాడో తెలియచేశాడు. రావణుడు నిష్టూరాలాడి, పరుషంగా మాట్లాడి, తనకు తోడుగా రావడానికి మారీచుడిని అంగీకరింప చేశాడు. రావణ-మారీచులు పంచవటికి కలిసి పోతారు. మారీచుడు మాయ మృగం వేషం వేస్తాడు.
మాయా మృగం రూపంలో వున్న మారీచుడిని సీత చూస్తుంది. దాన్ని పట్టి తెమ్మని రాముడిని కోరుతుంది. దాని వెంటబడి పోతాడు. రాముడి బాణం తగలగానే, "హా లక్ష్మణా!" అని అరిచి మారీచుడు చనిపోతాడు. ఆ అరుపు విన్న సీత లక్ష్మణుడిని రాముడికి సహాయంగా పొమ్మంటుంది. లక్ష్మణుడు రాముడి దగ్గరకు వెళ్తాడు. ఇదే అదను అనుకుని రావణుడు సన్నాసి వేషంలో సీతను అపహరించదల్చి ఆమె దగ్గరకు పోయాడు. ఆ వేషంలో వున్న రావణుడిని సీత సత్కరిస్తుంది. రాక్షస నాయకుడు రావణాసురుడిని తానే అంటాడు. తన భార్యవు కమ్మని అంటాడు. సీత రావణుడిని నిష్టూరాలాడుతుంది. తన నిజ స్వరూపం చూపించి రావణుడు ఆమెను భయపెడ్తాడు. చివరకు సీతను రావణుడు బలాత్కారంగా ఎత్తుకుని పోతాడు. దారిలో కనిపించిన జటాయువు రావణుడిని అడ్డుకుంటాడు. జటాయు-రావణుల మధ్య యుద్ధం జరుగుతుంది. రావణుడు జటాయువు రెక్కలు నరికేసి, సీతను ఎత్తుకుని పరుగెత్తుతాడు. సీత ఎంతగా రావణుడిని నిందించినా ఫలితం లేకపోతుంది. చివరకు సీతతో రావణుడు లంక చేరుకుంటాడు. సీత మీద రాక్షస స్త్రీలను కాపలాగా వుంచుతాడు. సీత తనను కామించడానికి పన్నెండు నెలల గడువిస్తాడు. ఆ మర్నాడు మాట వినని సీతను తన భోజనం కొరకు వంటవారు ముక్కలుగా కోసి వండుతారని బెదిరిస్తాడు.
రావణుడి రూపం, తేజం, బలం, ధైర్యం అనుపమానవైనవే. సౌందర్యం, సంపద, ఆకర్షణ రాముడిలో ఎంత వున్నాయో, రావణుడి దగ్గర కూడా అంతే మోతాదులో వున్నాయనవచ్చు. ఐతే, "రూప దాక్షిణ్య సంపన్నత", ఇతరుల పట్ల కరుణ, రక్షించాలనే బుద్ధి రాముడిలో వున్నాయి కాని రావణుడిలో లేవు. రావణుడు ధర్మ విరుద్ధమైన పనులే చేసి వుండకపోతే, ఇంద్రుడున్న స్వర్గాన్ని కూడా తన శక్తి-యుక్తులతో పాలించేవాడే మో. వాడిది కఠినమైన మనస్సు. భూతదయ వాడికి లేనందునే జనులు దూషించారు. దేవదానవులు వణకుతున్నారు. రావణుడు, విధానాన్నసురించి ధర్మ శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేశాడు. ప్రపంచం మెచ్చే రీతిలో తపస్సు చేశాడు. ఇంత గొప్పవాడు పర పురుషుల స్త్రీలను బాధ పెట్టడం భావ్యమా? రాక్షస వంశాన్ని ఈ అధర్మ కార్యం, కూకటి వేళ్లతో నాశనం చేసే విపత్తుకు దారితీయదా? రావణుడిలాంటి బుద్ధిమంతుడు ఇలాంటి పనులు చేయవచ్చా? ఎంతో కష్టపడి తపస్సు చేసినా, అది మర్చిపోయి, తపో ధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేశాడు. అతడి తపస్సు వ్యర్థమైపోయింది. తన తపస్సుతో దేవదానవులెవరూ జయించకుండా వరం పొంది, ఇంక తనకేం భయమని గర్వపడ్డాడు. వాస్తవానికి, ఆ వరాలేవే అతన్ని ఎల్లప్పుడూ రక్షించ లేవనే సంగతి అతడి ఆలోచనకే రాలేదు.   
రావణుడు దేవతలతో - దానవులతో - రాక్షసులతో - గంధర్వులతో -నాగులతో చావకుండా వరం పొందాడు. ఆ వరాలు ఆయన నెట్లా రక్షిస్తాయి? ఆ వరాల బలంతో రావణుడెట్లా బ్రతుకుతాడు? కాబట్టి తపోబలం వుందన్న గర్వం వదులుకోవాలి. చీకటి-వెలుతురు ఒకేసారి రానట్లే, పాప-పుణ్య ఫలాలు రెండూ ఒకేసారి అనుభవించలేం. పుణ్యం అనుభవించుతున్నంత వరకూ, పాప ఫలం దరికి రాదు. ధర్మ ఫలం అధర్మ ఫలాన్ని చెరిపేస్తుంది. చీకటి ఎలాగైతే వెలుతురును చెరచ లేదో, అలానే అధర్మ ఫలం ఇంకా రావణుడికి అనుభవం లోకి రాలేదు. తపఃఫలం వల్ల రావణుడు తనకు పాప ఫలం రాదనుకుంటున్నాడు! అష్టైర్యాలను అనుభవించే వాడికి రోగాలు రావా? రావణుడి తపస్సు అతడికి దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, వాడు చేసిన పర స్త్రీ అపహరణనే పాపపు పని వల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరగవు కాబట్టి, అతడి చావింత వరకూ ఆగింది. అతడి వ్రత ఫలంగా దేవ దానవుల చేతుల్లో చావు లేకుండా వరం కోరాడు. నర వానరులను నిషేధించాడు. వాడి తపఃఫలం వారి నుండి కాపాడదు. ఇక రావణుడి పూర్వ పుణ్యం పూర్వ పాపాన్నే హరిస్తుంది. కాని ఇప్పుడు చేస్తున్న పాప కార్యాలనుండి అతడిని రక్షించదు. నేడు చేస్తున్న భోజనం, నిన్నటి ఆకలి బాధ తీరుస్తుంది కాని, రేపటి బాధను కాదు కదా! పశ్చాత్తాపం చెందితే, ప్రాయశ్చిత్తముంటుంది. రావణుడు బలవంతంగా ఎత్తు కొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరి వారికి వారిని అప్పగిస్తే అతడి దోషం పోతుంది. తపఃఫలం సదా రక్షిస్తుందనేమాట భ్రాంతే! తపఃఫలం పుణ్యమనుభవించిన కొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు.
సీతాన్వేషణలో భాగంగా లంకలో ప్రవేశించిన హనుమంతుడు, అశోక వనంలో వున్న సీత దగ్గరకు వచ్చిన రావణుడిని చూస్తాడు. కామంతో సీతను తలచుకుంటూ, మనసంతా సీతపైనే నిలిపి, అతిశయించిన కామ మదంతో, కామాన్ని కొంచెం కూడా అణచుకోలేని దుస్థితిలో, తన కున్న మహాసంపదనంతా ప్రదర్శిస్తూ కనిపిస్తాడు రావణుడప్పుడు. సీతకు తన కోరికను చెప్తాడు. ఆమెను "ప్రియురాలు" అని సంబోధిస్తాడు. జగదేక మోహినీ అంటాడు. సౌందర్య గనీ అంటాడు. సమీపంలో ఎవరూ లేరని, ఎవరూ చూడడం లేదని, తన కామం తీర్చమనీ పలుకుతాడు. పరుల భార్యలను అపహరించడం, వారిని పొందడం, ఇతరుల ధనం అపహరించడం, తమ రాక్షస కుల ధర్మం అంటాడు. సీతాదేవిని బెదిరించుతాడు. తాను ధనవంతుడినని, బలవంతుడినని, శౌర్యవంతుడినని, రూపవంతుడినని, లోకాలెల్ల "హా! హా!" అనేటంతటివాడినని అరుస్తూ, తననెందుకు కాదంటున్నావని కోప్పడతాడు. ఆ సమయంలో ధాన్యమాలిని అనే రాక్షస స్త్రీ, రావణుడి చిన్న భార్య, సీతను బెదిరిస్తున్న రావణుడికి అడ్డు తగులుతుంది. రావణుడు అంతఃపురానికి వెళ్లిపోతాడు ఆనాటికి. సీతాదేవిని కలిసిన హనుమంతుడు, ఆ తరువాత, అశోక వనాన్ని పాడు చేస్తాడు. ఆ సంగతి రావణుడికి తెలిసి, హనుమంతుడిపై యుద్ధానికి కింకరులను పంపుతాడు. కింకరులను, చైత్య పాలకులను, ప్త్రహస్తుడి కొడుకు జంబుమాలిని, మంత్రి పుత్రులందరినీ, ఐదుగురు సేనా నాయకులను చంపుతాడు హనుమంతుడు. రావణుడి కొడుకు అక్షకుమారిడినీ చంపి రావణ వంశ ధ్వంసన ప్రారంభిస్తాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో బంధించగా, కట్టేసి రావణుడి దగ్గరకు తీసుకుపోతారు రాక్షసులు. హనుమంతుడు రావణుడికి నీతి బోధ చేస్తాడు.
రావణుడు తపఃఫలం ఎంత వరకు అనుభవించాలో, అంతా ఇప్పటి వరకూ అనుభవిస్తూ వస్తున్నాడు. అది పూర్తయింది. ఇకనుండి చేసిన పాప ఫలం ఆ రోజు నుంచే అనుభవించాలి. దాని ఫలితం త్వరలోనే రావణుడికి అర్థమవుతుంది. జన స్థానంలో వున్న రావణుడి తమ్ములందరూ చావటంతో మొదలయింది అతడి పాప ఫలం అనుభవించే రోజు. తర్వాత స్నేహితుడు వాలి చచ్చాడు. అతడి విరోధి సుగ్రీవుడు రాముడికి మిత్రుడయ్యాడు. ఇవన్నీ రావణుడికి అరిష్ట సూచనలే! రావణుడి వశమందున్న జానకి ఉత్తమ స్త్రీ అని, ఆమె లంకనంతా పాడుచేసేందుకు వచ్చిన కాళ రాత్రని, ప్రళయ కాలంలో కాళ రాత్రి ఏ విధంగా లోకాన్నంతా నాశనం చేస్తుందో, అట్లాగే, ఈమె లంకంతా నాశనం చేయబోతున్నదని, రావణుడి మెడలో తగులుకున్న యమపాశం ఈమె అని, బ్రతకాలనుకుంటే, లంకను కాపాడు కోవాలంటే, ఆమెను వదిలి పెట్టటమొక్కటే మార్గమని అంటాడు హనుమంతుడు. మనుష్య్లులు - దేవతలు - అసురులు - యక్షులు - కింపురుషులు - గంధర్వులు - పన్నగులు - విద్యాధర సమూహాలు - సిధ్ధులు - ఇతర దేవ జాతుల వారు-కిన్నరులు, వీరందరిలో పరాక్రమంలో మొదటి వాడైన విష్ణుమూర్తితో సమానమైన వాడు శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే అని చెప్తాడు. రాముడిని యుద్ధంలో, ఎవ్వరూ-ఏ కాలంలో-ఏ ప్రదేశంలో-ఏ ప్రాణి కూడా ఎదిరించ లేదంటాడు. "అంశ" పూర్ణ స్వరూపాన్ని ఏదైనా ఎదిరించ గలదా? సముద్రంలోని అలలన్నీ కలిసినా, సముద్రంతో శత్రుత్వం తెచ్చుకుని బ్రతక గలవా? రాముడు త్రికాల సత్యమైన "పర బ్రహ్మ" స్వరూపం. పూజ్య స్వభావం కలిగి, సమస్త లోకాలకు ప్రభువైన రామచంద్రమూర్తికి రావణుడు ద్రోహం చేసాడు కనుక వాడు ఇప్పుడు ఏం చేసినా బ్రతుక లేవంటాడు. రావణుడు ఒక్కడే కాకుండా-వాడితోపాటు, నాగ-యక్ష- రాక్షస- గంధర్వ- దేవ దానవులందరినీ తెచ్చుకున్నా ఆయనపై  గెలుపు అసాధ్యం అని స్పష్టం చేశాడు. చిల్లరదేవుళ్ల మాట అటుంచి, రావణుడి మీద ప్రేమతో వరాలిచ్చిన స్వయంభు-చతురాస్యుడైన బ్రహ్మ దేవుడైనా, ముక్కంటి త్రిపురాంతకుడైన రుద్రుడైనా, ముప్పై మూడుకోట్ల దేవతలకు అధిపతైన ఇంద్రుడు-మహేంద్రుడైనా, లేక ఈ ముగ్గురూ కలిసొచ్చినా, యుద్ధంలో రాముడి బారినుండి రావణాసురుడిని రక్షించ లేరని, శరణాగతియే  రక్షణని, రాముడినే శరణు కోరమని సలహా ఇచ్చాడు.     
హనుమంతుడి మాటలను, అవి కఠినంగా వుండడంతో, పైగా ధైర్యంగా నొక్కి చెప్పడంతో, సహించలేకపోయాడు. హనుమంతుడిని చూసిన రావణుడు ఆలోచనలో పడిపోతాడు. కైలాస పర్వతాన్ని పెకలించినప్పుడు తనను శపించిన నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చాడా అని భయపడ్తాడు. హనుమంతుడిని చంపమని భటులను ఆజ్ఞాపించాడు. అది విన్న విభీషణుడు, రాజాజ్ఞ నీతికి విరోధమని, దోషమని అంటాడు. దూతను చంపడం దోషమని చెప్పాడు. రావణుడు క్షత్రియ ధర్మంలో పండితుడని, సామాన్య ధర్మం తెలిసిన వారిలో ఆయనకు సమానమైన వారు లేరని, పరమార్థం తెలిసిన పండితులలో శ్రేష్టుడని, ఔచిత్యం ఆలోచించి, దూత నెట్లు దండించాలో అలానే చేయమని బోధించాడు. చివరకు విభీషణుడి మాటలను ఆలకించిన రావణుడు, హనుమంతుడి తోక కాల్చమని ఆదేశించాడు. కాల్చిన తన తోకతోనే లంకను దహించి వేశాడు హనుమంతుడు. రాక్షస విలాపం జరుగుతుంది.
హనుమంతుడు చేసిన అసాధ్య కార్యం, రాక్షస వధ, రావణుడిని భయపెట్టింది. ఒక కోతే అంత పని చేస్తే, వానర సేనంతా వస్తే ఇంకెంత ఘోరం జరగబోతుందో అని ఆలోచనలో పడ్డాడు. మంత్రులను సలహా కోరతాడు. ఇంతలో శ్రీరాముడు కపిసేనతో సముద్ర తీరం చేరుతాడు. అప్పుడు విభీషణుడు రాజనీతిని తెలియచేస్తాడు. సామ, దాన, భేద ఉపాయాలను వివరించి, ఈ మూడింటి వల్ల కార్యం సాధ్యపడదేని అప్పుడే దండోపాయం అవలింభించాలని బోధించాడు. యుద్ధానికి దిగడం శాస్త్ర విరుద్ధం అంటాడు. రాముడి పరాక్రమం గురించి చెపుతాడు. సుగ్రీవుడి శక్తినీ తెలియచేస్తాడు. వానర సేనను తక్కువ అంచనా వేయొద్దని అంటాడు. అసలు రాముడు చేసిన అపకారం ఏంటి అని ప్రశ్నించాడు. రాముడి భార్యను అపహరించడం రావణుడు చేసిన తప్పని అంటాడు. తన భార్యను తాను మరల తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్పెలా అవుతుంది అని నిలదీశాడు. ఖర-దూషణులను చంపడం, శూర్పణఖ ముక్కుచెవ్వులు కోయడం విషయంలోనూ తప్పు ఆతడిది కాదంటాడు. సీతను వదిలిపెట్టమని సలహా ఇస్తాడు. శ్రీరాముడి దేహబలంతో పాటు దైవ బలం, ధర్మ బలం వుందని, ధర్మం వున్న చోట జయం తప్పక వుంటుందని స్పష్టం చేశాడు. ఈ మాటలు విన్న తరువాత, మొట్ట మొదటి సారి రాక్షసులకు రావణుడు సీత వృత్తాంతం చెప్తాడు. కుంభకర్ణుడు కూడా రావణుడిపై కోప్పడతాడు. ఎవరినడిగి సీతను అపహరించావని అడుగుతాడు. కొందరు మంత్రులు సీతను వదల రాదని, యుద్ధం చేయాల్సిందేనని సలహా ఇచ్చారు. తనకు ఎవరెవరు ఏఏ శాపాలు పెట్టారో మంత్రులకు చెప్పాడు రావణుడు. ఇంద్రజిత్తు విభీషణుడిని ధిక్కరించి మాట్లాడుతాడు. ఇరువురు ఒకరినొకరు నిందించుకుంటారు. రావణుడు విభీషణుడికి జ్ఞాతి లక్షణాలు చెప్పి నిష్టూరాలు పలుకుతాడు. విభీషణుడు సభను విడిచి ఆకాశానికి ఎగిరి రావణుడికి మరో మారు హితోక్తులు పలికి, నలుగురు మంత్రులతో కలిసి శ్రీరాముడున్న చోటుకు పోతాడు.
రావణుడు నియమించిన శార్దూలుడనే వేగులవాడు, యుద్ధాన్ని ఆపుచేయమంటాడు. రావణుడు వెంటనే శుకుడిని సుగ్రీవుడి దగ్గరకు రాయబారానికి పంపుతాడు. ఆ రాయభారం విఫలమవుతుంది. రావణుడు సీతను రాముడికి ఇవ్వడానికి అంగీకరించడు. శుక-సారణులతో కలిసి ప్రాసాదమెక్కి కపి సేనను పరికించి చూశాడు రావణుడు. అంగదాదుల గురించి రావణుడికి వివరిస్తారు వారు. హరాదియూధనాథుల గురించీ చెపుతారు. మైందాదుల గురించి చెపుతారు. శ్రీరామ లక్ష్మణులను చూపారు రావణుడికి. తాను చూసి వచ్చిన వానర సేనా సంఖ్యను శుకుడు రావణుడికి వివరించాడు. చేసేదేమీ లేక రావణుడు తమకీ విషయాలను తెలియచేసిన శుకసారణులను నిందించాడు. శ్రీరాముడి చర్యలను కనుగొని రమ్మని శార్దూలాదులను పంపుతాడు. వారు కపుల దాడికి గురవుతారు. వేగులవారి మాటలు విన్న రావణుడికి కించిత్తు భయం కలిగింది. మాయలు నేర్చిన రావణుడు, తన కంటె ఎక్కువ మాయలు నేర్చిన విద్యుజ్జిహ్వుడుని చూసి, సీతాదేవిని మోసగించాలంటాడు. ఏ మాత్రం భేదం లేకుండా వుండే విధంగా, శ్రీరాముడి శిరస్సు, బాణంతోటి అతడి వింటిని, తన శక్తితో కల్పించి తన దగ్గరకు తీసుకు రమ్మంటాడు. ఆ తరువాత రావణుడు సీత దగ్గరకు పోయి రాముడు యుద్ధంలో చనిపోయాడంటాడు. అంతటితో ఆగకుండా సీతాదేవికి రాముడి కల్పిత శిరశ్చాపాలను చూపుతాడు. అవి చూసి సీత దుఃఖిస్తుంది. రావణుడు సీతను రక్షించేందుకు నియమించిన సరమ అనే రాక్షసి, సీతను ఓదార్చి, వాస్తవం చెపుతుంది. రాముడు చనిపోలేదని స్పష్టం చేస్తుంది.
ఇదిలా వుండగా రావణుడి తల్లి కైకసి, మరో వృద్ధ మంత్రి విద్ధుడు, శ్రీరాముడికి సీతను ఇవ్వమని రావణుడికి బోధించారు. రావణుడి తల్లికి పెదనాన్న ఐన మాల్య వంతుడు కూడా సీతను ఇవ్వమని అంటాడు. రాముడికి వానర బలమే కాకుండా దైవ బలం కూడా వుందంటాడు. " బ్రహ్మ దేవుడు లోకంలో ధర్మం, అధర్మం అని రెండు పక్షాలను సృష్టించాడు. గొప్ప బుద్ధికల దేవతలు ధర్మాన్ని ఆశ్రయించారు. అసురులు అధర్మాన్ని ఆశ్రయించారు. తనను ఆశ్రయించిన వారిని ఉద్దరించుట ధర్మం లక్షణం. అణగదొక్కడం, అధోగతి పాలు చేయడం అధర్మం లక్షణం" అని అంటూ మాల్య వంతుడు, రావణుడు పరాక్రమంతో ధర్మాన్ని నాశనం చేసి, అధర్మాన్ని సంపాదించాడని, అధర్మం ఆయనకు కీడు చేయక మానదని, జాగ్రత్తగా వుండమని చెప్తాడు. రావణుడు మాల్య వంతుడిని కూడా ధిక్కరించాడు. ఇక యుద్ధం తప్పదనుకున్న రావణుడు పుర ద్వారాలను రక్షించడానికి నాలుగు దిక్కులా నలుగురు ప్రముఖులను నియమించాడు.
ఈ నేపధ్యంలో యుద్ధం ఆరంభమవుతుంది. అంగదుడిని రాయబారానికి పంపుతాడు రావణుడి వద్దకు రాముడు. సగౌరవంగా సీతను తెచ్చి, వెంటనే తనకు అప్పగించి, శరణు వేడక పోయినట్లయితే, రావణుడిని చంపి, రాజ్యాన్ని విభీషణుడుకిస్తానని రాముడి మాటలుగా అంగదుడు రావణుడికి చెప్తాడు. అంగదుడిని పట్టుకుని చంపమంటాడు రావణుడు. రాక్షసులను చంపి శ్రీరాముడి వద్దకు తిరిగొస్తాడు అంగదుడు. రావణుడితో లంకను వానరులు ముట్టడి చేసారని చెప్తారు రాక్షసులు. యుద్ధానికి పొమ్మని రాక్షసులకు ఆజ్ఞ ఇస్తాడు రావణుడు. వానర రాక్షస ద్వంద్వ యుద్ధం ప్రారంభమవుతుంది. శ్రీరాముడు రాక్షసులను వధించుతాడు. యుద్ధంలో అంగదుడి చేతిలో ఓడిన ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేస్తాడు. శ్రీరామ లక్ష్మణులను నాగ పాశ బద్ధులను చేస్తాడు ఇంద్రజిత్తు. వారు చనిపోయారని రాక్షసులతో, తండ్రి రావణాసురుడితో చెప్తాడు. నాగ పాశ బద్ధులైన రామలక్ష్మణులను హనుమంతుడు-ఇతరులు వలయంగా పన్ని రక్షించుకుంటారు. రావణుడు రాక్షస స్త్రీలతో రాముడిని సీతాదేవికి చూపమని ఆజ్ఞాపించుతాడు. పుష్పక విమానంలోంచి సీతాదేవి వారిని చూసి దుఃఖిస్తుంది. రామలక్ష్మణులు జీవించే వున్నారని త్రిజట అనే రాక్షసి సీతాదేవికి చెప్తుంది. శ్రీరాముడు మూర్ఛ తేరుకుంటాడు. గరుత్మంతుడు వచ్చి శ్రీరామ లక్ష్మణులను నాగ పాశ బంధ విముక్తులను చేస్తాడు. అది చూసి కపులు ఆనందపడతారు. రావణుడికి ఈ విషయం తెలుస్తుంది. సంగతి తెలుసుకున్న రావణుడు చింతిస్తాడు. తన కుమారుడి మహాస్త్రాలెప్పుడూ వృధా కావని, అటువంటి బాణాలనే వారు విడిపించుకోగలిగారని, తన బలం ఇక తనను రక్షించుతుందన్న నమ్మకం లేదని, సందేహంలో పడతాడు.
ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు, అకంపనుడు, ప్రహస్తుడు, ఒకరి వెంట ఒకరు యుద్ధానికి పోయి చని పోతారు. అప్పుడు రావణుడు తొలిసారిగా యుద్ధానికి బయల్దేరతాడు. ఇంతవరకు, ప్రభువైన రావణుడు ప్రత్యక్షంగా యుద్ధానికి పోకుండా, ఇతరులతో వానరులను జయించుదామనుకుంటాడు. ఎంతటి వారిని పంపినా వారు చనిపోవడంతో, తానింట కూర్చుండి ఇతరులను పంపిస్తున్నాడన్న నింద పడుతుందని ఆయనే బయలుదేరతాడు. శ్రీరాముడు రావణుడిని యుద్ధంలో చూసి ఆశ్చర్యపడతాడు. వాడి మీద తన కోపమంతా చూపిద్దామనుకుంటాడు. రావణుడు సుగ్రీవాదులతో పోరాడతాడు మొదలు. రావణుడు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛిల్లి పోతాడు. ఆ సమయంలో అతడిని ఎత్తుకుని పోయే ప్రయత్నం చేస్తాడు రావణుడు. ఇంతలో హనుమంతుడొచ్చి, రావణుడిని తన్ని, లక్ష్మణుడిని ఎత్తుకుని రాముడి దగ్గరకు పోతాడు. లక్ష్మణుడు మూర్చ నుంచి తేరుకుంటాడు.
శ్రీరాముడు, హనుమంతుడి పైకి ఎక్కి రావణుడి మీదకు యుద్ధానికి పోతాడు. రామ-రావణుల ప్రధమ యుద్ధం ఆరంభమవుతుంది. రామ బాణాల ధాటికి తట్టుకోలేక పోతాడు రావణుడు. చేతులో విల్లును బుద్ధిపూర్వకంగా వదిలి పెట్తాడు రావణుడు. విల్లు లేనివాడిని రాముడు చంపడని వాడికి తెలుసు. యుద్ధ ధర్మ పద్ధతిని అనుసరించి రాముడు, రావణుడి తలకు గురి పెట్టిన బాణంతో, కిరీటాన్ని మాత్రమే పడగొట్టాడు. ఐనా వాడికి జ్ఞానోదయం కాలేదు. కిరీటం పోయిందంటే వాడి ప్రభుత్వం కూలిపోయినట్లే కదా! ఇక కొట్టనని చెప్తూ, నిర్భయంగా లంకకు పారిపొమ్మంటాడు రావణుడిని రాముడు. పోయి బడలిక తీర్చుకుని, అస్త్రాలన్నీ తీసుకుని మళ్లీ యుద్ధానికి రమ్మంటాడు. అప్పుడు వాడిని విరథుని-నిరాయుధిడిని చేయకుండా చంపుతానని పరోక్షంగా హెచ్చరిస్తాడు. రావణుడు పరాజితుడై లంకకు పోతాడు. పోయి, తన పరాభవాన్ని తలచుకుంటూ దుఃఖిస్తాడు. ఒక మనుష్యుడిని గెలవలేక పోయానే అని చింతించాడు. దురహంకారంతో, తనను మనుష్యులేమీ చేయలేరని భావించి, వారితో చావు లేకుండా వరం పొందలేదే అని విచారించాడు. అనరణ్యుడిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకుంటాడు. వేదవతి శాపం కూడా గుర్తుకొచ్చింది. సీతే వేదవతి అని నిర్ధారించుకుంటాడు. సీతారాములిరువురు మనుష్య జాతి వారే అనుకుంటాడు. పార్వతి శాపం, రంభ నిమిత్తం నలకూబరుడిచ్చిన శాపం, బ్రహ్మ శాపం గుర్తుకొచ్చాయి. ఇవన్నీ గుర్తుకొచ్చి యుద్ధాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటాడు. కుంభకర్ణుడిని నిద్ర లేపమంటాడు.
రాక్షసులు కుంభకర్ణుడిని నిద్ర లేపుతారు. రావణుడు కుంభకర్ణుడితో రాముడివలన కలిగిన విపత్తును గురించి చెప్పాడు. విన్న కుంభకర్ణుడు రావణుడిని నిందించాడు. సీతను ఎత్తుకొచ్చినప్పుడు ఎందుకు తమను సంప్రదించలేదని ప్రశ్నించాడు. చేసింది తప్పంటాడు. కుంభకర్ణుడిపై కోపం ప్రదర్శించాడు రావణుడు. ప్రతిగా రావణుడిని సమాధాన పరిచాడు కుంభకర్ణుడు. యుద్ధానికి పోతానంటాడు. ఒంటిగా రాముడి మీదకు యుద్ధానికి పోవద్దని సలహా ఇస్తాడు. కుంభకర్ణుడు భీకరంగా యుద్ధం చేస్తాడు. శ్రీరాముడు కుంభకర్ణుడితో యుద్ధానికి దిగుతాడు. మొదలు కుంభకర్ణుడి కాళ్లు-చేతులు నరుకుతాడు. తరువాత వాడి శిరస్సును తెగ వేస్తాడు. వాడి మరణానికి రావణుడు దుఃఖపడ్తాడు. మత్తుడు-యుద్దోన్మత్తుడు అనే వారిని యుద్ధానికి పంపుతాడు. వారిరువురు, వారికి తోడుగా పోయిన మరికొందరు రాక్షస వీరులు కూడా యుద్ధంలో చనిపోతారు. మళ్లీ రావణుడిది అదే పరిస్థితి. దుఃఖిస్తాడు.
ఇంద్రజిత్తు మొదటిసారి యుద్ధానికి బయల్దేరతాడు. తన మాయా బలంతో, బ్రహ్మ వర బలంతో, యుద్ధంలో విజృంభించి పోరాడుతాడు ఇంద్రజిత్తు. యుద్ధానికి వెళ్లిన కుంభ నికుంభులు మరణిస్తారు. మకరాక్షుడికీ అదే గతి పడుతుంది. రెండో సారి ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్తాడు. ఇంద్రజిత్తును చంపమని లక్ష్మణుడిని పురమాయించాడు రాముడు. ఇంద్రజిత్తు-లక్ష్మణుల మధ్య యుద్ధం జరుగుతుంది. తన సారధి చనిపోవడంతో, లంకకు పోయి మరలి వచ్చి మళ్లీ యుద్ధం చేస్తాడు ఇంద్రజిత్తు. చివరకు లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించాడు. వాడి మరణానికి రావణుడు తీవ్రంగా విలపిస్తాడు. ఐనా జ్ఞానోదయం కలగని రావణుడు తన పరాక్రమాన్ని తానే పొగడుకుంటాడు. సీతను చంపబోతాడు. సుపార్శ్వడు రావణుడికి నీతి బోధ కావించి మరలిస్తాడు
ఐన వారందరూ చచ్చిపోయారని దిగులు పట్టుకుంటుంది రావణుడికి. మిగిలిన రాక్షస సేనలను-మూల బలగాల్ని పిలుస్తాడు. చతురంగ సేనతో యుద్ధానికి పోయి, వానరులతో పోరాడకుండా, రాముడిని చుట్టుముట్టి, చంపమంటాడు. తాను యుద్ధానికి వచ్చేటప్పటికి రాముడిని అలసి పోయేటట్లు చేయమంటాడు. శ్రీరాముడు మూల బలాల్ని సంహరిస్తాడు. పౌరుషోక్తులు పలుకుతూ రావణుడు యుద్ధానికి వెళ్తాడు. వెళ్తున్న వాడికి అపశకునాలు కనిపిస్తాయి. విరూపాక్షుడిని, సహోదరుడిని, సుగ్రీవుడు చంపగా, మహాపార్శ్వుడు అంగదుడి చేతిలో హతమవుతాడు. రామ రావణ యుద్ధం మొదలవుతుంది. ఇరువురూ దివ్యాస్త్రాలతో పోరాడుతారు. మధ్యలో రావణ లక్ష్మణ యుద్ధం జరుగుతుంది. లక్ష్మణుడు రావణ శక్తి వల్ల మూర్ఛ పోతాడు. లక్ష్మణుడిని వానరులకు అప్పగించి రాముడు యుద్ధంలోకి దిగుతాడు. రావణుడు పరాజితుడై లంకకు పరుగెత్తుతాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చిన తరువాత లక్ష్మణుడు మూర్ఛనుంచి తేరుకుంటాడు. రామరావణుల కడపటి యుద్ధం ప్రారంభమవుతుంది. రావణుడి శూలాన్ని విరగగొట్టాడు రాముడు. రావణుడిని కాపాడాలన్న ఉద్దేశంతో, రథాన్ని, సారథి మరలించుతాడు. ఆ పని చేసినందుకు సారధిని దూషించుతాడు రావణుడు. రావణుడి మేలు కోరి తానలా చేసానని అంటాడు సారథి. ఆ తరువాత మళ్లీ రాముడి మీదకు యుద్ధానికి పోతాడు. రావణుడి ధ్వజాన్ని నరుకుతాడు రాముడు. రావణుడి శిరస్సును ఖండించాడు. తల నరకగానే తల మొలిచింది కాని వాడు చనిపోవడం లేదు. చివరకు బ్రహ్మాస్త్రంతో రావణుడిని వధించాడు రాముడు. రావణుడి మరణానికి లోకాలన్నీ సంతోషించాయి.
కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది రామాయణం కావడంతో అది ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు, అర్థం చేసుకో గలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. శ్రీ సీతారాముల పేరు విన్న ప్రతి ఆర్యుడు మనస్సులోనైనా భక్తితో నమస్కారం చేసుకోవాల్సిందే. సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే ! వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో, తన శక్తికొలది వివరించాడు. రామాయణ గాథలో, శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకే మో ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది.
శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రావణుడి పాత్ర కూడా అందులో భాగమే!

7 comments:

  1. సముద్రం దగ్గర నత్తలు, పీతలు, గులకరాళ్ళు దొరుకుతాయి ,లోపల వజ్రవైడూర్యాలు, నవనిధులు సర్వం దొరుకుతాయి. ఒడ్డున నత్తగుల్లలు మాత్రమే ఏరుకుంటామనేవారినేమనగలం? అలా రామాయణం ఒక మహా సాగరం, ఎవరి ఓపిక వారిది.

    ReplyDelete
  2. రాముడి గొప్పతనం రావణవారసులెలా ఒప్పుకోగలరు ? ఓర్చుకోగలరు ?

    ReplyDelete
  3. great job sir!!! ramayananni inta kluptamga, mariyu vipulikarinchadam adbhutam.

    yes. kastephale cheppinattu, what you see is what you want to see.

    ReplyDelete
  4. Jwala garu,
    Very informative article. I know many of these stories and some I do not know. Many of these stories are not in Valmiki Ramayanam. They are not in Uttara Ramayanam. I have not read Adhyatmaka Ramayanam, are they from that? or they are from one of the puranas? I know you refer to Vavikolanu gari Andhra Ramayanam, but want to know the original source.


    It is interesting that this blog has come in the same week when Ram Jetmalani commented that Rama was a bad husband. That brings an interesting discussion about on what basis do we consider Rama as God. Is it because of his life example or is it because we are told that he was God Incarnate by scriptures following Vedic tradition. If it is by life example, then do we ignore few glaringly inexplicable episodes of Rama's life? Or if it is because we follow Vedic injunctions, then if one does not follow Vedic tradition, then do we consider him as God? Intellectuals like you and spiritual leaders need to bring a cultural discussion to clarify few gaps in our understanding of Rama.

    Though the recent discussions on this topic is due to recent episode of banning a lecture series on Ramayana in JNU that discusses other Ramayanas which portray Rama and Sita as siblings, the whole concept of Ravana being a "Dalit" was introduced by Karunanidhi and DMK in their complete hatred towards anything "Vedic". DMK actually declared celebration of Ravana, till Sunbrahmanya Swami pointed it out Karunanidhi that "Ravana Brahma" is actually a Brahmana. But that line of thinking is taken by more "Dalit" leaders like Kancha Illiah and Katti Padma Rao in carving out an unique identity for Dalits. First to strengthen their argument they bring "Sambhuka" story. That one act of Rama was, in my opinion, very difficult to justify.

    Kancha Illiah and Katti Padma Rao have joined forces with few communist elements in the society to spearhead Dalit Freedom Network. They are joined by few neo indologists like Prof. M. Ninan, Harvard's Michale Witze and University of Chicago's Wendy Dorneir , Romila Thapar, and many professors in JNU. These are the folks who are furthering the Maxmuller's propogated Aryan Invasion theory. They add biblical touch to the whole episode and bring Myth of Ham into the picture and show that how the black race is formed by Ham, the cursed son of Noah and how the Ham's descendants migrated to South India via Africa as Dravids and the other sons of Noah who are light skinned have invaded the north India in the form Aryans and are imposing the their culture on dravids in the form Vedic rituals and deities. So much so that many of these believe that all the Vedic rituals are just imaginary concepts imposed by Brahmins for furthering their superiority and there is no inherent truth in Vedas.

    Thanks for very informative article.

    Cheers
    Sudhesh

    ReplyDelete
  5. Thank You very much for the "MORE INFORMATIVE" comments. My source is "Andhea Valmeeki Ramayanam" by Vavilikol;anu Subbaa Rao elias vasudasa Swamy. Regards, Jwala

    ReplyDelete
    Replies
    1. Let us see Rama as An Idealist King and person,Whotaught how to be successful member of a family and has shown to the world that a ruler should go by Dharma or morality and not by the law framed by him.Just imagine if his ministers or officers have to try him for his actions.Needless to say that the greatness of Rama is evident from the fact he successfully inspired leaders like Mahatma and Gandhi and his contemporaries by givin priority to people over self..tvs

      Delete
  6. Great, chala chakkaga vivarincharu.. Padabhivandanam...

    ReplyDelete