Wednesday, January 2, 2013

పెళ్లికాని తల్లి: వనం జ్వాలా నరసింహారావు



పెళ్లికాని తల్లి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (21-4-1991)

          అత్యంత గౌరవ ప్రదమైన, అతి విలువైన మాతృత్వం, చట్టం ఆమోదం లేకపోతే, స్త్రీ జీవితం ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఇక అప్పటి నుంచి మొదలవుతాయి, ఆ అవివాహిత తల్లికి ఎన్నో చిక్కులు.

          మన దేశంలో ఎక్కువ శాతం పురుషులు వివాహానికి పూర్వమే సెక్స్ అనుభవం పొందుతున్నారని, మహిళలలో ఈ సంఖ్య తక్కువేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. క్యూరియాసిటీతో, సమ వయస్కులతో, తోటి వారితో ఇలాంటి అనుభవాలను చవి చూస్తున్నారు నేటి యువత.

          చట్ట వ్యతిరేకంగా పుట్టిన పిల్లలే పలు రకాలుగా "దత్తత" కు గురవుతున్నారు. మామూలుకంటే, వీరిలో చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువే! బ్రతికిన వారిలో పలువురు బాల నేరస్తులుగా చలామణి అవుతుంటారు. వివిధ కారణాల వల్ల, పెళ్లి కాని తల్లులు, తమకు తెలియకుండానే, పిల్లల ఆరోగ్య సంక్షేమ పథకాల అమలుకు ఒక సవాలుగా తయారవుతున్నారు.

          సమాజం అంటే వున్న భయం వల్ల, పెళ్లికాని స్త్రీ తాను గర్భం ధరించిన విషయాన్ని గోప్యంగా వుంచే ప్రయత్నం చేస్తుంది. ఇంత జరిగాక, తాము ఇంక అదనంగా పోగొట్టుకునేదేంటిలే అనే భావన వారిలో కలుగుతుంది. చెడిపోయిన తమకు, ఈ సమాజం ఆశ్రయం ఇవ్వదని వారు భయపడుతారు. మనముంటున్న ఈ సమాజంలోని పలువురు వ్యక్తులు కూడా, పెళ్లి కాకుండా తల్లి ఐన స్త్రీని, ఘోరాతి ఘోరమైన పాపం చేసినట్లు, అది క్షమార్హం కాని నేరమైనట్లు, వేలెత్తి చూపుతారు. దీనికి పురుషుడి బాధ్యత కూడా సమానంగా వున్నదనే విషయాన్ని మర్చిపోతారు వీళ్లు.


          పెళ్లికాని తల్లుల సంఖ్య ఇద మిద్ధంగా చెప్పడం కష్టం. కారణం అతి రహస్యంగా వుంచడమే. కనీసం ఆసుపత్రుల నుంచి కూడా సరైన సమాచారం లభ్యం కాదు. అందుకే, శాస్త్రీయ పద్ధతులలో సమస్యను అధ్యయనం చేయడం తేలికైన విషయం కాదు.

          వివాహానికి పూర్వమే గర్భిణీ కావడానికి ఎన్నో కారణాలుండవచ్చు.

          తల్లిదండ్రులకు-పిల్లలకు, మధ్య చీకాకు కలిగించే పరిస్థితులు నెలకొన్నప్పుడు, తల్లిదండ్రుల వైవాహిక జీవితం ఒడిదుడుకుల్లో వున్నప్పుడు, తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు దూరమైనప్పుడు. సెక్సులో పాల్గొనడం ఒక ఉపశమనంగా భావించి, సంతోషం పొందవచ్చు. ఇక ఆ తర్వాత జరిగేది మామూలే! మాన మర్యాదలు పోయాయన్న దిగులుతోను, పెళ్లి కాదన్న భయం తోనూ, చదువు మానేయాలని, ఉద్యోగం దొరకదన్న దిగులుతోనూ, అమ్మాయిలు కృశించి పోతారు.

          పెళ్లికాని స్త్రీ గర్భిణీ అయితే, పర్యవసానాలు వివిధ దృక్కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. తల్లి అయింతర్వాత, తాను కోరుకొనని బిడ్డకు పోషణ బాధ్యత వహించాలి. భద్రత కరువై, సంఘానికి బెదురుతూ బ్రతకాలి. గర్భిణీగా పలువురికి తెలియకూడదని మొదట్లో రహస్యంగా వుంచడం మూలాన్నే గర్భస్రావం చేయించుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. చివరకు గర్భ విచ్ఛిత్తికి సలిపే ప్రయత్నాలు ఫలించకపోగా, పుట్టిన బిడ్డ అంగవైకల్యంతో వుండవచ్చు. ఇవన్నీ స్త్రీని మానసికంగా, శారీరకంగా కృంగ తీస్తాయి. యుక్త వయస్సులో ఈ బాధలకు గురైన స్త్రీలు, ఆర్థిక స్వాతంత్ర్యం పూర్తిగా కోల్పోయి, చివరకు తల్లిదండ్రులకు కూడా బరువై పోయి బ్రతుకునీడుస్తుంటారు. మానసికంగా, శారీరకంగా, తల్లిదండ్రుల హింసకు గురయ్యేవారు కూడా వుంటారు. ఇక పుట్టిన బిడ్డల సంగతి కూడా బాధాకరంగానే వుంటుంది. పౌష్టికాహార లోపం కలుగ వచ్చు. వ్యాధి నివారణ చర్యలకు వారి నోచుకోరు. కుటుంబంలోని వారంతా వ్యతిరేక భావంతో చూసే ఈ పిల్లలు సంఘానికి ఒక సమస్యగా తయారవుతారు.

          ఈ "అజ్ఞాత తండ్రులు" సాధారణంగా బంధువర్గం లోని వారో, సహాధ్యాయులో, దగ్గరి వారో అయి వుంటారు. "రేప్" హీరోలు సరేసరి. పెళ్లయిన మగవారు కూడా ఈ అవకాశాలను విడిచి పెట్టరు. అదో సరదా! వీరి కోర్కెలు తీర్చుకోవడానికి స్థలాలు పుష్కలం!

          సమాజంలో విప్లవాత్మక మార్పులు రానంత కాలం ఈ దురవస్థలు తప్పవేమో!

          (21 సంవత్స్రరాల క్రితం ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో రాసిన వ్యాసం)

1 comment:

  1. ఈ వ్యాసం ఇంకొక 20 సంవత్సరాల తర్వాత వ్రాసినా పరిస్థితిలో ఏమాత్రం మార్పుండదు.

    ReplyDelete