Thursday, January 3, 2013

క్యాబరే డాన్సర్: వనం జ్వాలా నరసింహారావు


క్యాబరే డాన్సర్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (28-04-1991)

          "బాబ్ ఫాసీ తాను నిర్మించిన ’క్యాబరే’ సినిమాలో ఒక పాటను, హాస్యంతో కూడిన వెకిలి చేష్టగా చిత్రీకరించాడు. హిందీ సినిమాలనో, లేక, సెక్స్ ప్రధానమైన ఇతర చిత్రాలనో, ఆదర్శంగా తీసుకొని, సంగీతానికి అనుగుణంగా, వికారంగా నృత్యం చేస్తూ, ఒకటి వెంబడి ఇంకొకటి దుస్తులను శరీరంపై నుంచి తొలగిస్తూ, అవయవ ప్రదర్శన చేస్తున్నారు ఈ నాటి క్యాబరే డాన్సర్లు"-ఎడిటర్

          బొంబాయి నగరంలో సాగుతున్న క్యాబరే డాన్సులు, కోర్టుల తీర్పులకు లోబడే జరుగుతున్నాయి. "సాధన" అనే ఒక క్యాబరే డాన్సర్‌ను, న్యూఢిల్లీలోని ఒక రెస్టారెంటులో నృత్యం చేస్తున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్సును, డాన్స్ ద్వారా ప్రదర్శించే తన హక్కుకు భంగం కలగకుండా చూడాలని, ఆమె హైకోర్టులో దావా వేసింది. మానసిక వత్తిడులకు గురవుతున్న పురుషులు వ్యభిచారానికి దాసులు కాకుండా, ఉత్తేజ పరిచేది, ఈ క్యాబరే వినోదమని క్లబ్ యజమాని సాధనను సమర్థించాడు. వినోదం కొరకు, అసభ్య ప్రదర్శన అని తెలిసి కూడా వ్యక్తులు ఇష్ట పూర్వకంగా క్లబ్‍లకు వెళ్తున్నారు కాబట్టి, ఇది న్యాయ సమ్మతమేనని కోర్టు తీర్పిచ్చింది.

          అందుకే నెలకు నాలుగు నుంచి ఎనిమిది వేల దాకా సంపాదిస్తున్న బొంబాయి క్యాబరే డాన్సర్లు సాధనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కోర్టు ఉత్తర్వులను అడ్డుబెట్టుకొని, బొంబాయి నగరంలో క్యాబరే క్లబ్బులు డబ్బు చేసుకోవడం మొదలు పెట్టాయి. ఆస్కార్ హోటెల్ యజమాని దిలీప్ చాందీరామ్ దత్వాని, తన హోటల్‌పై పోలీసులు దాడి జరిపితే కోర్టును ఆశ్రయించాడు. ఐపిసి 294 సెక్షన్ క్రిందకు ఇది రాదనీ, క్యాబరే డాన్స్ అసభ్యంగా వున్నప్పటికీ అది చూసేవారికి ఇబ్బంది, చీకాకు కలిగించనంతవరకు న్యాయ సమ్మతమేనని, న్యాయ మూర్తి శరద్ మనోహర్ తీర్పు ఇచ్చారు.

          ఇంకేముంది.....సాలీ, రీటా, అనితా...ఇలా ఎంతో మంది హొయలొలుకుతూ రంగ ప్రవేశం చేశారు. నైట్ క్లబ్బులపై పోలీసు దాడులు ఆగిపోయాయి. వీరి డాన్సులు ప్రేక్షకులకు ఇబ్బంది, చీకాకు కలిగించినా, అది వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

          కర్నాటక, మద్రాస్, హైదరాబాద్ నగరాల నుంచి బొంబాయికి చేరుకుని క్యాబరే డాన్సులు చేస్తున్న అమ్మాయిలు ఈ వృత్తికి చెడ్డ పేరు తెస్తున్నారని పాతకాలం నాటి వారంటున్నారు. నెలకో ఆరు వేలు ఇస్తే సంతోషంతో దుస్తులు ఇప్పి డాన్సులైతే చేస్తున్నారు కాని, ఆ డాన్సును సరిగ్గా వారు అభ్యసించడం లేదని వీరి అభిప్రాయం.

          తమకు లభిస్తున్న జీతంలో మిగిలేదెంత? అని క్యాబరే డాన్సర్లు వాపోతుంటారు. మేకప్‌కు, తాగుడుకు, దుస్తులకు ఖర్చు చేయడంతో పాటు, నెల నెలా ఉద్యోగాన్వేషణలో వుండాల్సిందే వీరు. వంట్లో నలతగా వున్నా శెలవు దొరకదు. భద్రత అసలే లేదు. యజమానులు, క్లబ్‌లు మారినా, అక్కడకు వీరిని చేర్చే మధ్య దళారులు-పింపులు మాత్రం మారరు. వారిని వదుల్చు కోవడం కూడా చాలా కష్టం. నియమనిబంధనలు, ప్రవర్తనావళి సరేసరి.

           అంధేరీలోని నైట్ క్వీన్, కొలాబాలోని బ్లూనైల్, ఘట్ కోపర్ లోని మేఘరాజ్, బాంద్రాలోని నంది, బొంబాయిలోని పేరొందిన నైట్ క్లబ్బులు. మేఘరాజ్ తప్ప మిగిలినవన్నీ వికారం పుట్టించే ప్రదేశాలే. కేవలం 150 చదరపు అడుగుల హాలులో, 35 నుంచి 40 మంది వరకూ వుంటారు.

          ఇటీవల కాలంలో క్యాబరే డాన్సర్లు కూడా కొంత పుంతలు తొక్కుతున్నారు. దుస్తులు విప్పి వేస్తూ, భారత దేశపు సాంప్రదాయ నృత్యాలు చేస్తున్నారు నేటి క్యాబరే డాన్సర్లు.

          బొంబాయిలో లైసెన్సులున్న వి 60, లేనివి 30 వరకు నైట్ క్లబ్‌లు నడుస్తున్నాయి.

          "ఏంజిల్, డాన్స్, వైన్" అనే కార్యక్రమంతో, నారి మన్ పాయింట్ లోని సోనియా మహల్ లో తెల్లవార్లూ ఆటా-పాటా కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదయిందంటే అటుగా వచ్చే టాక్సీలకు అంతుండదు. వినోదంతో పాటు, చైనా-భారత దేశపు వంటకాలు ఇక్కడ రుచి చూపిస్తారు. రు. 80 లు ఖర్చు పెడితే, మెత్తటి కుర్చీతో పాటు, చెవులు మారు మ్రోగే హిందీ పాటలు వినవచ్చు. షఫాన్, సాటిన్ దుస్తుల్లో అక్కడ కూర్చున్న వారి చుట్టూ క్యాబరే డాన్సర్లు తిరుగుతుంటారు. ఆ హోటల్ యజమాని గగన్ దాస్ వధ్వానీ దృష్టిలో ఈ కార్యక్రమం "ముజ్రా" లాంటిది. డాన్సర్లు నవాబీ కుటుంబాలకు చెందినవారని ఆయన చెప్తుంటారు. అక్కడ కొచ్చి, పీకల దాకా తాగి, వళ్లు మర్చిపోయి, డాన్సర్ల మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తుంటారు "కస్టమర్స్". ప్రతిఫలంగా వారి నుంచి ఓ ముద్దో, వారి చేత్తో తమ జుట్టును సవరింపచేసుకోవడమో వీరు పొందుతారు.

          క్యాబరే డాన్సర్లను ప్రతివారూ చిన్న చూపే చూస్తారు. తాము సాంప్రదాయ కుటుంబాలకు చెందిన వారమని వీరు చెప్తుంటారు. తమ తాత ముత్తాతలు ఏ నవాబ్ లనో, లేక, లక్నో రాజనో కూడా వీరంటారు. నిజానికి వీరిలో చాలామంది ఫోరాస్ రోడ్డులోని నూటికి పైగా వున్న కోఠాల కుటుంబానికి చెందినవారే.

          క్యాబరే డాన్సులుగా భారతీయ సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించబడుతున్నప్పటికీ దుస్తులను తొలగించే ప్రక్రియ మాత్రం ఆగిపోయే సూచనలేవీ కనబడడం లేదు. క్యాబరే డాన్సులు ఆపు చేసే అవకాశం కూడా లేదు. అనాదిగా వస్తున్న ఓ కామ క్రీడ ఇది. పురుషులకు ఓ సెక్సువల్‌ థ్రిల్ కావాలి.

          క్యాబరే డాన్సులు ఎందుకు చూడాలి? అని అడిగితే, ఓ పెద్ద మనిషిచ్చిన సమాధానం: "చూసినంత సేపు ఉల్లాసంగా వుంటుంది. అయిపోయింతర్వాత కూడా ఆ డాన్సర్ గురించే ఆలోచన చేస్తాం. చివరకు ఆ క్యాబరే ఓ జ్ఞాపకంలాగా మనస్సులో మిగిలి పోతుంది".  

క్యాబరే డాన్సర్లకు, ప్రదర్శనకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి

·       అర్ధనగ్నంగా వున్న స్త్రీల ఫొటోలను క్లబ్ బయట ప్రదర్శించరాదు
·       అలాంటి ఫొటోలను పత్రికల్లో ప్రచురించరాదు
·       అసభ్య పదజాలంతో పత్రికల్లో క్యాబరే డాన్సుకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వకూడదు
·       కార్యక్రమానికి నిర్దేశించిన ప్రత్యేక స్థలంలోనే డాన్సర్లు ప్రదర్శనలివ్వాలి
·       క్లబ్‌కు వచ్చే వ్యక్తులతో డాన్సర్లు కలిసి మెలిసి వుండరాదు
·       డాన్సర్లు, కస్టమర్ల తొడలపై కూచోడం నిషేధం
·       తమ శరీరాన్ని డాన్సర్లు తాకనీయకూడదు
·       చూపుల ద్వారా క్లబ్‌కు వచ్చిన వ్యక్తులను ఆకర్షించుకునే సూచనలివ్వరాదు
·       డాన్సర్లు ప్రదర్శనలోనూ, ప్రవర్తనలోనూ అసభ్యంగా వ్యవహరించకూడదు

యజమానికి - డాన్సర్‌కు మధ్య ఒప్పందం వివరాలు

·       దుస్తులు, మేకప్, ఇతర ఖర్చులు డాన్సరే భరించాలి
·       క్రమశిక్షణతో మెలిగి యజమానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి
·       రోజుకు మూడు, శని-ఆది వారాలలో నాలుగు ప్రదర్శనలివ్వాలి
·       పల్చటి దుస్తులు ధరించడం కాని, దుస్తులు విప్పి వేసే ప్రదర్శన చేయడం కాని జరుగ రాదు. పరిమితులకు లోబడి దుస్తులు తీసివేయడం ఆమె చేయాలి. డాన్సుకు నిర్దేశించిన స్థలానికే ఆమె పరిమితం కావాలి. జిల్లా మెజిస్ట్రేట్ వుత్తర్వులకు లోబడి మాత్రమే ఆమె డాన్స్ చేయాలి. హద్దు మీరితే కలిగే నష్టాన్ని ఆమే భరించాలి
·       ఇతర వుద్యోగులతో కలిసి మెలిసి వుండరాదు. అర్థరాత్రి దాటాక ఆమె నివాసంలో ఆతిథ్యం ఇవ్వడం కాని, లేక, బయటకు వెళ్లి రావడం కాని వీల్లేదు. తాగిన మైకంలో వచ్చినా, వేరే చోట అనుమతి లేకుండా ప్రదర్శన ఇచ్చినా రు. 500 లు అపరాధ రుసుం చెల్లించాలి
·       అనుకోని పరిస్థితుల్లో క్యాబరే డాన్సులు నిర్వహించకపోతే, ఒప్పందం రద్దవుతుంది. యజమాని ఎటువంటి నష్ట పరిహారం చెల్లించనవసరం లేదు.

చీకట్లో నృత్యం

          "మీరా నాయర్" నిర్మించిన డాక్యుమెంటరీ "ఇండియా క్యాబరే" లో నటించి, పేరు ప్రఖ్యాతులు గడించిన "రేఖ" కు ఆ ఆనందం ఎంతో కాలం వుండలేదు. తిరిగి తన "చీకట్లో నాట్యం" చేసే వృత్తికే చేరుకుందామె.


          మరింత సంపాదించాలని హైదరాబాద్ నుంచి బొంబాయికి చేరుకున్న "రేఖ" కు ఉద్యోగంతో పాటు "సలాం బాంబే" ఫేమ్, "మీరా నాయర్" తో పరిచయం కూడా కలిగింది. సంప్రదాయంగా, గౌరవంగా బ్రతికే స్త్రీలకు-క్యాబరే డాన్సర్లకు గల తేడాను విశదీకరించే చిత్రం ఇది. క్యాబరే డాన్సర్ల ఫ్లాష్ బ్యాక్ జీవితం, వారెందుకు ఈ వృత్తి చేపట్టిందీ, వారెవరివల్ల మోసపోయిందీ చెప్పడంతో ప్రారంభమవుతుందీ చిత్రం.

          హఠాత్తుగా భర్త వదిలి పెట్టడంతో, బెంగుళూరులో క్యాబరే డాన్సర్‌గా చేరి, ఆ తరువాత బొంబాయికి చేరుకుంది రేఖ. "సార్ మంచి జీతం ఇచ్చి, వుండడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేశారు" అని మేఘరాజ్ హోటల్ యజమానిని గురించి చెప్తుంది రేఖ. తమని వ్యభిచారిణులుగా ముద్ర వేయడం తప్పని, తనను ఏ కస్టమర్ అయినా అలా కోరితే, "రాంగ్ నంబర్" అని సమాధానం ఇచ్చే దాన్ననీ రేఖ తెలియచేసింది.

          రేఖ బీచ్‍లో పడుకున్న సీన్‌తో ముగుస్తుంది చిత్రం. సినిమాల్లో నటించడం ద్వారా తనకేం తృప్తి కలిగిందో రేఖకే తెలియదు. మరికొన్ని చిత్రాలలో నటించమని ఆమెకు అవకాశాలు కూడా వచ్చాయట. మొత్తానికి పాపులర్ అయితే అయింది. మూడేళ్ల సినిమా జీవితం తరువాత తిరిగి తన ప్రపంచంలోకి వచ్చి చేరింది. మేఘరాజ్‍లో డాన్స్ చేయసాగింది. "సముద్రంలో ఈత కొట్టడం ద్వారా నా జీవన విధానంలో మార్పేమీ రాలేదు. నాకు సంబంధించినంత వరకు, ప్రేక్షకుల కొరకు దుస్తులు విప్పేసిన నాడే, నాలో జ్ఞానోదయం కలగడం ప్రారంభమైంది" అని అంటూ రేఖ, సంఘం గీచిన హద్దులకు ఆవలి పక్కన వున్న మనుషులు, జన జీవన స్రవంతిలో చేరడం జరగని పని అని తేల్చి చెప్పింది.

          ఇదేం పట్టనట్లు, మీరా నాయర్ మాత్రం తన తదుపరి చిత్రం "మిస్సిసిప్పి మసాలా" నిర్మాణంలో నిమగ్నమయ్యారు.

          (21 సంవత్సరాల క్రితం ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో వచ్చిన వ్యాసం ఇది)


No comments:

Post a Comment