(నవంబర్ 13, 2013 న కాళోజీ 11 వ వర్ధంతి)
"కాళోజీ
యాదిలో"
వనం జ్వాలా నరసింహారావు
స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ "ఇదీ నా గొడవ" ను
నేను గత పది-పదిహేను సంవత్సరాలలో అనేక సార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి
అంశమూ, పది మంది తెలుసుకోవాల్సిందే! అసలా పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో? లేదో? తెలియదు. మొన్నీ మధ్య ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో
పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్ద
మనిషి, తనకా పుస్తకం చదవాలని ఎన్నేళ్లగానో వున్నప్పటికీ,
ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదని అన్నాడు.
అప్పుడనిపించింది...ఎందుకు అందులోని విషయాలను కనీసం కొన్నైనా, పంచుకోకూడదని. అందుకే ఇది.. ఆసక్తి గల వారికి ఇదొక
అవకాశం. ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు...ఒక్కొక్కటే...
నైజాం కాలంలో తెలంగాణాకు వచ్చిన కుటుంబాల వ్యవహార శైలి, వాళ్ల
ఆధిపత్యం, ముల్కీ-నాన్ ముల్కీ నేపధ్యం, తెలంగాణా వాళ్లని అణచిపెట్టిన విధానం గురించి ప్రస్తావిస్తూ కాళోజీ ఇలా
అంటాడు:
"ఢిల్లీ నుంచి మొదటి నైజాముల్ ముల్క్ తో పాటు
ఇక్కడికి (తెలంగాణ) వచ్చిన కుటుంబాలల్ల అరబ్బు, పర్షియన్
పండితులెక్కువ. ఆధిపత్యం వీళ్లదే. మొగలాయీలు ఎట్లయితె బయటనుంచి వచ్చి అధికారం
చెలాయించిండ్రో, వీండ్లు కూడా అంతే. వీండ్ల ఇండ్ల పేర్లు
ప్రత్యేకంగ వుంటయి. సిద్దిఖీ వగైరా. అరబ్ దేశం నుంచి వచ్చి ఇరవై తరాలైనా, గొప్పగా ’మేం సీదా అరేబియా నుంచీ వచ్చిన వాండ్లం’ అని చెప్పుకుంటూ,
’ఇక్కడి వాళ్లకి మా వుఛ్చారణ ఏమొస్తది, ఏం
మాట్లాడతరు?’ అని ఈసడిస్తరు-బెజవాడవాండ్లు, సర్కారు జిల్లాల వాండ్లు మమ్మల్ని ’మీకు తెలుగేం ఒస్తుంది’? అన్నట్లు. వీడు తెలుగు రాదంటడు, వాడు ఉర్దూ రాదంటడు,
మరోడు ఇంగ్లీషు రాదంటడు. మరి మనకొచ్చెడిదేమిటని ప్రశ్న. ఇక్కడి
యాసని కూడ ’నీ యాస పనికి రాదు’ అనబట్టె".
"ఈ ముల్కీ, నాన్ ముల్కీ సమస్య 300 ఏండ్లనుంచీ వుండె.
బహమనీ రాజ్యంల కూడ ప్రాంతేతరుల సమస్య వుండేటిది. రాజుల వెంట కొన్ని కుటుంబాలు
రావడం, వాండ్లతోపాటు వాండ్ల బంధువులు రావడం, ఆ సంఖ్య పెరగడం,
దీనివల్ల స్థానికులకి ఉద్యోగావకాశాలు తగ్గడం మొదలైంది. ఇప్పుడు
ఉత్తర దక్షిణ భారత దేశాల మధ్య, ఆంధ్ర తెలంగాణాల మధ్య ఈ సమస్య
తలెత్తింది. ఇది ఆర్థిక సమస్య, బతుకు తెరువు సమస్య. ఉమ్మడి
మద్రాసు రాష్ట్రంల తెలుగు వాండ్లు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావలెనని ఆందోళన
చేసిన్రు. తమకు ఉమ్మడి రాష్ట్రంల కలిగిన అన్యాయాలకి తమిళులే కారకులనీ, వాండ్ల ఆధిపత్యాన్ని సహించేది లేదని అన్నరు. మరి వాండ్లే తెలంగాణావాండ్లని
అణచి పెట్టిన్రు. ’మన ఇద్దరిదీ ఒకటే భాష. నువ్వు ఆందోళన చేయగూడదు. వేర్పాటు ధోరణి కుదరది. అన్యాయం’ అంటూ ధర్మోపన్యాసాలు దంచిన్రు. తాము ఏ
పెత్తందారీ తనానికి, అవమానాలకి గురి అయిన్రో అన్నీ మర్చి
పోతున్నరు. అదే పెత్తందారి తనం తాము ఇక్కడ స్థానికుల మీద చేస్తున్నరు. తాము తమిళుల
నుంచీ ఎందుకు వేరు పడదమనుకున్నరో గుర్తు చేసుకుంటె, తెలంగాణ
వాండ్ల ఆందోళన అర్థమవుతుంది. ఎప్పుడైనా ఎదటవాడి రొమ్ముమీద కాలేసి తొక్కెటోడికి బాధ
ఏముంటది? కిందపడి వుండేవాడికే బాధంతాను. నన్ను తొక్కుతున్నవ్
అని గోలపెడితె, ’నేనెక్కడ తొక్కుతున్నను...ఊరకె కాలు
పెడ్తినంతె’ నంటడు. ఇతరుల భుజాల మీద ఎక్కి కూచున్నవాడు తన భుజం మీద ఎక్కినవాడిని
’దిగురా, దిగురా’ అంటడే గానీ తాను ఎవరి భుజాల మీదన్నా ఎక్కి
కూచున్నానేమోనని ఆలోచించడు....."
వరంగల్ లో నివసించే ఒక బ్రాహ్మణ వకీలు గురించి ప్రస్తావించారు కాళోజీ
తన ఆత్మకథలో. హిందువైనా ఆయన ఏ విధంగా ఇస్లాం మతానికి దగ్గరైందీ, ఆయన
చనిపోయిన తరువాత ఆయనను ఇస్లాం మతా ఆచారాలకు అనుగుణంగా గోరీ కట్టించిన వైనం
వివరించారు కాళోజీ.
"శ్రీ రామారావు గారనే పెద్ద వకీలు వుండేవారు
వరంగల్ ల. వయో వృద్థుడు. ఆ కుటుంబానికి సంబంధించిన సంప్రదాయం ఒకటి చెప్పుకోవలసి
వుండె. కొన్ని బ్రాహ్మల కుటుంబాలల్ల కూడ లోపాయికారీగా ఇస్లాం మతానికి సంబంధించిన
వన్నీ అవలంబిస్తరని ప్రతీతి. పెద్దపల్లి దేశ్ ముఖ్ శ్రీ రామారావు గారికి మేనమామ
వరస. సంవత్సరానికి కాష్ గ్రాంట్ అరవై వేలుండేదాయనకు. ఆయనకి ధర్మ సత్రాలుండేవి.
రోజూ 50-60 మంది
బ్రాహ్మలు భోంచేసెటోళ్లు. ఒక హోదా, స్టేటస్, పెత్తనం,
దానికోసం వుండే అట్టహాసం అంతా వుండేటిది. ఆయన గురించి కూడా ఓ
ప్రతీతి ఏమిటంటే లోపాయికారీగా ఆయన నమాజు చదువుతాడనీ, ఆయన
బంధువులు కూడా చదువతరీను. ఈ శ్రీ రామారావు కూడా అంతే. వారింట్లో పూజలు, పునస్కారాలు గానీ, హిందూ సంప్రదాయానికి
సంబంధించినవేమన్న గాని జరిగినట్లు ఎవరికీ తెల్వది. కాని ఇస్లాం మతానికి సంబంధించి
నమాజు, రోజా (వుపవాసం) పాటించకుండా వుండేది కాదు. ఎక్కడికి
పోయినా వాండ్ల ఇండ్లల్ల మంచి నీళ్లు తాగిన వాళ్లున్నరు. నమాజు మాత్రం చదవకపోయిరి.
శ్రీ రామారావు బైట ఎక్కడా కూడ మంచి నీళ్లు కూడా తాగెటోడు కాదు. కాని నమాజు,
రోజా మాత్రం పాటించేది. ఆయన చనిపోయిండు. మరి దహనం చేయాల్నా, సమాధి (గోరి) కట్టాల్నా అని లోపాయికారీగా చర్చలు జరిగినై. సాధారణంగ వరంగల్
ల ఎవరన్నా చనిపోతే అందరం స్మశానానికి పోయి దహనం చేసెటోళ్లం. ఈయన విషయంల బంధువులు
అక్కడికి తీస్కపోతం, ఇక్కడికి తీస్కపోతం అని తర్జనభర్జనలు
పడ్డరు. కొంతమంది ముస్లిం వకీళ్లు వచ్చి చూసి ఆయన ఇట్ల వుండె, అట్ల ఉండె, ఇక్కడనే సమాధి కడతం అన్నరు. కొసకు వాళ్ల
బంధువులు ఆ శవాన్ని హైదరాబాద్ తీస్కపోయిన్రు. ఇంకో పెద్ద లాయరు ఆవంచ వెంకట్రావు
గారు శ్రీ రామారావు గారికి స్నేహితుడూ, జూనియర్ అవడాన్ని ఆయనా
పోయిండట. కొసకి బార్కసులో చాంద్రాయణగుట్ట అవతల గోరీ కట్టిండ్రని విన్న. అప్పుడు
నేను ’గబ్బిలం చావు’ అని ఓ స్కెచ్ రాసిన. శవం వెంబడి పోయిన పెద్ద వకీలు గారిక్కూడ
చూపిన. ఆయన కన్నడం, సంస్కృతం, ఉర్దూ,
పారశీకం-అన్నింటా ప్రవీణుడే. తెలుగు సరేసరి. ఆ స్కెచ్ ల ఈ
వకీలుగారిని పెద్ద పిట్టగా చెప్పిన. గబ్బిలం పక్షా, పశువా
అని ఒక పాఠం చదివిన జ్ఞాపకం. చచ్చిన వాడు హిందువా, ముస్లిమా
అనేది అట్నే తేలలేదు. ’ఇది కథ కాదు...కల్పన కాదు’ అన్నడాయన ఇది చదివి. ఈ విధంగా
ఏదైనా సంఘటన జరిగితే దాన్ని తీసుకుని రచన చేయడం జరిగేది. దాన్నే రన్నింగ్
కామెంట్రీ అంటూంటా...."
"పరాభవ హేమంతం" శీర్షికతో కాళోజీ రాసిన ఆయన జీవితానుభవాల
స్వగతం, ఆయన జీవన శైలికి అద్దం పడ్తుంది. తనకెలాంటి నియమ నిబంధనలు లేవని, ఎవరెక్కడికి రమ్మంటే అక్కడకే పోయేవాడినని అంటూ ఇలా చెప్పారు:
"నా జీవితంలో నేను వేరే పని పాటలు ఏమీ
పెట్టుకోలేదు కాబట్టి, ఫలాని చోటుకి, ఫలాని
రోజుకి పోవలె అనే నియమం లేదు. నాతోటి కలిసిన వాండ్లతో గంటో అర్థో మాట్టాడేవరకు
వాండ్లతో ఆత్మీయత ఏర్పడ్డం, వాండ్లు ఇంకో దిక్కు పోదామంటే,
వాండ్ల వెంబడి పడిపోవడం. అసలు ఇంటినుంచి బయల్దేరి పోదామనుకున్న
ప్రదేశానికి పోకుండానే, మరో దిక్కు పోవడం చాలా సార్లు
తటస్థించింది. నేను ఏ రోజున ఎక్కడ వుంటానో ఎవరికీ తెల్వది అన్న మాట. అంటే నావరకు
నేను నిర్ణయించుకునేది లేదు. అటువంటి జీవితం గడిచిందన్న మాట నాటినుంచీ నేటిదాక.......మిత్రుల
ఇండ్లకి పోయినప్పుడు భవనాలల్లనూ వున్న, గుడిసెల్లనూ వున్న.
భవనంల విందు భోజనం చేసినా, గుడిసెల ఇంత రొట్టె తిని చాయ్
తాగినా నాకు ఒకటే. కాలినడకనీ తిరిగిన, కారుల్లోనూ పోయిన.
అట్నే రకరకాల మనుషుల తోటి - సాహితీ పరులు, రాజకీయ వేత్తలు,
సంఘ సంస్కర్తలు, ఏ రకమైన అభిప్రాయాలు లేని
వాండ్లు - కలిసి గడిపిన. జైళ్లల రకరకాల నేరస్థులతో కలిసి మెలిసి వున్న. ఈ రకరకాల
జీవితానుభవాల గురించి ’నా గొడవ’ (పరాభవ హేమంతం) లో వున్న స్వగతంలో రాసిన
ఇలా:"
"అతిథివోలె వుండి వుండి, అవని విడిచి
వెళ్లుతాను...పల్లెపట్టణంబులనక పల్లేరై తిరిగినాను….మురికి
నీటి నడుమ వున్న ఇరుకులలో ఇరికినాను….కూటి పేద తన కబళము నోటకీయ
గుడిచినాను…పూల వాసనలు నిండిన పాల రాతి మేడలలో ఆయాసము
కలిగించేడి పాయసాలు మెక్కినాను…..వాయువుతో పోటీపడు వాహనాలు
ఎక్కినాను...కంటకాల మధ్య నేను కాలనడక నడిచి నాను...కాలు బైట పెట్టకుండ కాలమెంతొ గడిపి
నాను...గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారి నాను...లోయలలో దూకి దూకి లోతులెన్నొ
చూచినాను...నే ప్రాకని ఎత్తులేదు...నేజారని లోతులేదు...మూలజేరి మునులవోలె మూగనోము
బట్టినాను...ఈగవోలె దోమవోలె...వాగుచు తిరుగాడినాను...అతిథివోలె వుండి వుండి...అవని
విడిచి వెళ్లుతాను".
సర్దార్ జమలాపురం కేశవరావు గారంటే కాళోజీకి అమితమైన గౌరవం. ఆయన మాటలు, చేతలు
ఆయనకెంతో నచ్చాయి. తనతో ఆయన జైల్లో వున్నప్పుడు జరిగిన సంఘటనను, ఆయన వుదాత్తతను వివరించడంతో పాటు ఆయన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడైనప్పుడు తను
రాసిన గేయాన్ని ఆత్మ కథలో ప్రస్తావించారు. తానూ, జమలాపురం
ఒకేసారి వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం, ఎలా ఓడిన
విషయం కూడా చెప్పారు.
"నేను వరంగల్ జైల్లో (1947) ఉన్నప్పుడు నిజాం మీద
అంతిమ పోరాటం జరుగుతుండె. కాంగ్రెస్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం
తీవ్రస్థాయిలో జరుగుతున్నయి. అట్టనె వాటితో పాటు ప్రభుత్వ నిర్బంధం కూడా పెచ్చు
పెరిగి పోయింది.......నా మీద పెట్టిన కేసు తీర్పు ప్రకారం నాకు సంవత్సరంన్నర
శిక్ష. ఆ తీర్పొచ్చే సమయానికి తొమ్మిది నెల్ల నుంచీ నేను జైల్ల వున్న. చిన్న
కట్టెపుల్లకి జండా పెడ్తె నేను పోయి పక్కనె నిలబడ్డను. జెండా వందనం చేస్తినని నా
మీద కేసు. నిజానికి నేను నిలబడ్డనె గాని వందనమైతె చెయ్యలేదు. ఇది వాస్తవం. శిక్ష
ఖాయం చేసి నన్ను బారక్ ల వేసిన్రు. జమలాపురం కేశవ రావు, హీరాలాల్
మోరియా, వల్లభి (అయితరాజు) రామా రావు, పాల్వంచ
రంగారావు, ఊటుకూరు నారాయణ రావు, సి.
వెంకట రావు, అప్పి వెంకట రాజయ్య-ఇలా పది, పదిహేను మంది వున్నం లోపట. వాండ్లతో పాటు నన్నూ పెట్టిన్రు......ఈ పదిహేను
మందితోనె గడపాలె....బాగా తినెటోళ్లం. ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు వరకు
చదువుకునెటోండ్లం. అప్పి రాజయ్య గారు ప్రహ్లాద చరిత్ర బాగా చదివి వినిపించేటిది.
మోతుకూరి నారాయణ రావుగారు కూడా పురాణాలు బాగా చదివెటోడు. అందరికంటె పెద్దవాడు,
మొదటి నుంచీ ఉద్యమంల వున్నవాడు కష్ట నష్టాలు ఓర్చినవాడు జమలాపురం
కేశవ రావుగారు. వల్లభాయ్ పటేలుకి లాగానే ఈయనక్కూడా సర్దార్ బిరుదుండేది. అందరి
బదులు తనొక్కడే పని చేస్తుండేవాడు. ఆయన తీరే అంత. చెత్తగిన పడివున్నప్పుడు ఎవరికి
చెప్పినా వూడుస్తరు. కాని ఎవరికి చెప్పకుండా చీపురు తీసుకుని తనె వూడ్చెటోడు.
ఒకరోజు నేను లోపలికి పోయి చూసేవరకు ఆయన వూడుస్తున్నడు. వల్లభి రామారావు అనే ఆయన
కూచుని వున్నడు. ’ఏమయ్యా రామారావ్! పెద్దన్న అట్ల వూడుస్తుంటే నువ్వు కూచున్నవ్?’ అని అడిగిన. ’ఆ! అన్ని పనులూ తనే చేస్తున్నననే గొప్పదనం, కీర్తికోసం చేస్తున్నడు. చెయ్యనీ’ అని ఆయన అనగానే. ఈడ్చి చెంప మీద
కొట్టిన. రామారావును ఓదార్చి నన్ను కోప్పడ్డరు కేశవ రావుగారు. అదీ ఆయన
వుదాత్తత!"
"కందిలో సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన
ఆఖరి ఆంధ్ర మహాసభ (1946 మే 10, 11 తేదీలలో) జరిగింది.
నేనందులో పాల్గొన నందువల్ల కేశవరావు గారి గురించి ఒక గేయం రాసి మిత్రులతోటి అక్కడ
చదవమని చెప్పి పంపిన. ఆ గేయం: ’ముస్తాబు చేసుకుని మోటర్ల వూరేగు మురిపెంబు నీ కేమి
లేదన్నా...మొండి చేతుల అంగి మోకాలు దాక నీ మొలగుడ్దతోటి తిరుగు కేశన్న!...పల్లె
బాటల బాధ ప్రజలతో బాటు నీ బరికాళ్లకె (చెప్పులు లేని కాళ్లు) బాగ
గురుతన్నా!...సర్దారు నామంబు సహజ నామంబుగా సరిపోయింది నీకు కేశన్నా!...దిద్ది
తీర్చని జుట్టు, ముద్దులొలకని మోము, పెద్దవానికి
లోటు కావన్నా!...జబ్బులేని ఒళ్లు, డబ్బులేని జేబు, మబ్బులేని మనసు నీదన్నా!’. జమలాపురం కేశవరావు గారికి వెంకటపతి, నాగేశ్వర్రావు అని ఇద్దరి శిష్యులుండెటోళ్లు. ఈ ముగ్గురూ కలిసి తెలంగాణాలో
ఊరూరా తిరుగుతూ, (అటుకులో, బొంగు
పేలాలో, బుక్కుకుంటూ, బెల్లం
నములుకుంటూ) ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేసిండ్రు. వాండ్లు తిరగని వూరు లేదని
చెప్పవచ్చు. జమలాపురం కేశవరావు గారు
ఆజానుబాహుడు. ధోతి పైకి చెక్కుకునెటోడు. మంచి ఆహార పుష్టిగల మనిషి. ఏది దొరికితే
అది తిని, నేలమీద పడుకునీ, బండలమీద
పడుకునీ, కాగితాలు పరచుకుని వాటిమీద పడుకుని
తిరిగినవాడు....ప్రహ్లాదునిది హరి భక్తి. వీండ్లది ప్రజా భక్తి. ప్రజాసేవకు సర్వం
అంకితం చేసిచేసి తిరిగెటోళ్లు. పట్టుదల, కార్యదీక్ష, చొరవ, త్యాగం గల వాండ్ల కృషి వల్లనే ఈ ప్రజా
వుద్యమాలు నడిచినై.....అసలు కార్యకర్తలు మాత్రం జమలాపురం లాంటి వాళ్లే".
"జమలాపురం కేశవరావు ఉత్తమోత్తముడు. సామాన్యుల్లో సామాన్యుడు.
అసామాన్యుల్లో అసామాన్యుడు. 13 వ ఆంధ్ర
మహాసభకు అధ్యక్షుడాయనే. తర్వాత కాంగ్రెస్ లో కూడా ప్రముఖుడయిండు. జిల్లా
కాన్ఫరెన్సులకి అధ్యక్షుడయిండు. ఆ మహానుభావుడు తాను అధ్యక్షుడిగా వున్న చోట,
తన సహచరులతో పాటు పదేసి రోజులు కాంపు వేసి కూర్చుని గుంజలు పాతడం,
పందిళ్లు వేయడం, తడికలు కట్టడం దగ్గర్నుంచీ
ప్రతిదీ తాను కూడా చేసెటివాడన్న మాట. అతన్ని ‘పెద్దన్నా’ అని
పిల్చెటోన్ని.....1952 లొ వరంగల్లులో నేను పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డా. ఆ పార్లమెంటరీ
నియోజక వర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి సర్దార్ జమలాపురం కేశవరావు
పోటీ చేసిండు - కాంగ్రెస్ అభ్యర్థిగా. అటువంటి మహానుభావుడు, త్యాగి,
ఉద్యమ శక్తిగలవాడు, కాంగ్రెస్ లోపట ఉండేటువంటి
కుళ్లు, ద్వేషంతోటి ఓడిపోయిండు. కమ్యూనిస్ట్ అభ్యర్థి
పెండ్యాల రాఘవరావు గెలిచిండు. పార్లమెంటు సీటూ గెలిచిండు. అది వుంచుకుని అసెంబ్లీ
సీటు రిజైన్ చేసిండు....వర్ధన్నపేట బై ఎలక్షన్ లలో కేశవరావు గారు మళ్లీ నిలబడి
ఓడిపోయిండు. కాంగ్రెస్ లో భేదాభిప్రాయాల వల్ల కేశవరావు ఓడిపోయిండు....కేశవరావు
స్థానికుడు కాదు. ఆయనకి మధిర లోనో, ఎర్రుపాలెంలోనో టికెట్
ఇస్తే తప్పకుండా గెలిచెటోడు. కాని టికెట్లు ఎలాట్ చేసినోండ్లు కుట్ర చేసిన్రు. హయగ్రీవా
చారికి, బొమ్మకంటి సత్యనారాయణకి టికెట్లు రాకపోవడం
గమనించాలె. కేశవరావు గారు మంచి నడి వయసులోనె చచ్చిపోయిండు".
ఎవరైనా తమకు అవమానం జరిగినప్పుడు ఏ విధంగా తమ కింద వారి మీద
ప్రతీకారం తీర్చుకుంటారో తెలిపే విషయాన్ని సోదాహరణంగా వివరించారు కాళోజీ. అదే
విధంగా కలిమి లేముల తేడా పాటించే విధానాన్ని కూడా చెప్పారు.
“నా షష్టి పూర్తి హైద్రాబాదులో కృష్ణదేవరాయాంధ్ర భాషా
నిలయంలో జరిగింది. పి. వి. నరసింహారావు అప్పుడు మాజీ మంత్రి. కాంగ్రెస్ లో
వున్నడు. సంచికకో గేయం రాసిండు. ఆ సభలో మాట్లాడుతూ...’కాళోజీ నాకంటె వయసులో ఆరు
సంవత్సరాలు పెద్ద. చదువులో మాత్రం మూడు సంవత్సరాలె. చదువుకుంటున్నప్పుడు సీనియర్స్
కీ, జూనియర్స్ కి కూడా ఆయన నడవడి వుత్సాహం, వుత్తేజం కలిగించేటివి. అయితే మా పెద్దలు (పి. వి. భూస్వామి వర్గానికి
చెందిన వాడు) కాళోజీ దగ్గరకు పోకండి, ఆయనతో మాట్లాడకండి,
సావాసం పట్టకండి, అతను ఖతర్ నాక్ మనిషి అని
చెప్పేవాండ్లు’ అన్నడు. ఇదన్నదెవరు? ముస్లిములు కాదు.
ప్రభుత్వాధికారులు కాదు. పి. వి. నరసింహారావు గారి పెద్దలు. వారు భూస్వాములు,
పట్వారీలు, పెత్తందార్లు. తమ పిల్లల్ని
స్నేహితానికైనా కాళోజీ దగ్గరకు పోవద్దు, అతను ఖతర్ నాక్
మనిషి అనెటోళ్లన్నమాట......ఇక్కడ నైజాం సర్కార్, స్థానిక
ముస్లిములు కాక మూడో ప్రమాదం పెత్తందార్ల నుంచీ కూడా వుండేది.......హిందువుల్లో
కాపువాడు, రెడ్డి వాడు ఒకే దిక్కున కూర్చుని భోంచేయరు. దేశ్
ముఖ్ రెడ్డి, మామూలు రెడ్డిని పక్కన కూర్చో పెట్టుకోడు గద!
బ్రాహ్మణ దేశ్ ముఖ్ తన పక్కన కరణాన్ని (బ్రాహ్మణ) కూర్చో బెట్టుకు భోంచేయడు. రాచ
వెలమ వేరు, మామూలు వెలమలు వేరు. పెదకమ్మ వేరు, చిన కమ్మ వేరు. గద్వాల రాజావారూ, వనపర్తి రాజావారూ
వేర్వేరు. ఒకే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులాల వాండ్లతో కలిసి మెలిసి వుండడం కలలో మాట. హిందువులలో ప్రతివారూ
కూడ కొందర్ని గొప్ప వాండ్లని వాండ్లకి లొంగిపోవడం, కొందర్ని
చిన్నవారని వాండ్లని లొంగదీసుకోవడం పరిపాటి. ఒకనితో తన్నులు తినేటోనికి ఇంకొకరిని
తంతేగాని తృప్తిగాదు. దీనికో కథ చెప్తరు. ఒక తాశీల్దారు పేష్కారును తిట్టిండట. ఆ
పేష్కారు గిర్దావరును తిట్టిండట. గిర్దావరు పటేలు, పట్వారీలను తిట్టిండట. వాండ్లు సుంకరివాడిని కొట్టి
వాడి మీద విరుచుకు పడ్డరట. అతను ఇంటికి పోయి భార్యను కొట్టిండట, ఆ భార్య ఏం చేసిందీ? కుండలు బద్దలు కొట్టి తానే
ఏడ్చిందట. అంటే ఎవరైనా సరే తమకు అవమానం జరిగినప్పుడు ప్రతీకారం తమ కింది వాని మీద
తీర్చుకుంటరన్న మాట. తరతమ బేధాలు సమసిపోతే తమ పెత్తనం
పోతుందని ఈ పెత్తందార్ల భయం".
కాలోజీకి తన గురువుగారు గార్లపాటి రాఘవరెడ్డి అంటే అమితమైన గౌరవం. ఆయన
ఎలా తనను తీర్చిదిద్దిందీ, ఎలా తన కవితలను సరిచేసింది, బడి
పలుకుల భాష అంటే ఏంటీ, పలుకు బళ్ల భాష అంటే ఏంటీ, గురువుగారి మీద విశ్వనాథ సత్యనారాయణ గారికి కలిగిన సదభిప్రాయం విషయం,
విశ్వనాథ సత్యనారాయణ ద్వంద్వ
ప్రవృత్తి గురించి కూడా సవివరంగా చెప్పారు ఆత్మకథలో. అలాగే ఆయన విశ్వనాథ సత్యనారాయణ
గారిని తెలుగులో రాయడం మానుకోమని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వివరించారు.
"కవిత్వం విషయంలో నాకే సందేహం వచ్చినా ఆయనకి (గురువుగారు
రాఘవరెడ్డి) చూపించి, సరి చేయించుకోవడం అలవాటు. యతి ప్రాసలు సరి చూడడం,
మాట లేమైనా మార్చడం మాత్రమే ఆయన పని. నా ఐడియా, అభిప్రాయం మారకుండా చూసెటోడు. ఏది రాసినా గాని ’ఇదేంది? ఈ అభిప్రాయం బాగా లేదు’ అని ఎన్నడూ అనకపోయేటిది. భాషా శాస్త్రవేత్తలు ఏమంటారొకానీ,
నా అభిప్రాయంలో ఈ యతి ప్రాసలు సామెతల్లో పుట్టినయ్. ప్రతి సామెతలోనూ
యతో, ప్రాసో, అంత్యప్రాసో వుండడం వల్ల
చప్పున మాటలు స్ఫురణకు వచ్చి జ్ఞాపకం పెట్టుకోడానికి వీలు. అయితే ఛందస్సు ఎక్కడ
నుంచి వచ్చింది? దీన్ని శాస్త్రంగా తర్వాత రాసిన
వాండ్లుండవచ్చు. భాష విషయంలో నాకింకో అభిప్రాయం వున్నది. (నా అభిప్రాయాన్ని
శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అనే గొడవలో నేను పడదలుచుకోలేదు). భాష రెండు విధాలు -
ఒకటి బడి పలుకుల భాష, మరొకటి పలుకు బళ్ల భాష. బడి పలుకుల భాష
అంటే గ్రాంథిక భాషే - కావ్యాల్లో, గ్రంధాల్లో వాడిన మాటలు
తీసుకోవడం, ఆవిధంగానే మాట్లాడ్డం, అట్నే
రాయడం. అయితే పాత పుస్తకాల్లో పలుకు బళ్ల భాష లేదా? అంటే తక్కువే ననిపిస్తుంది. ఎందుకంటే ఈ మహానుభావులు సంస్కృత కావ్యాలు,
తెలుగు కావ్యాలు చదువుకుని, అట్నే రాసిన
వాండ్లు. వీరి కవిత్వాన్ని చూస్తే వీండ్లు పలుకు బళ్ల విషయంలో అంత పట్టింపుతోని
వున్నట్టు లేదు. ఎంత పెద్ద వాళ్లయిన గానీ ’ఎంత గొట్టు పదం వేసినం? ఎంత క్లిష్ట సంస్కృత సమాసం వాడిన?’ అనే చూసిన్రు.
నాది పలుకు బళ్ల భాష. బడి పలుకుల భాష కాదు. ఎట్టంటే అది నేను చదువుకోలేదు. నేను
పంతుళ్ల దగ్గర ఆ భాషయినా, దానికి సంబంధించిన వ్యాకరణమైనా
చదువుకోలేదు. అందువలన నాది పలుకు బళ్ల భాష.....మా గురువుగారు బతికి వుండగా నేను
రాసిన వాటికీ, ఆయన చనిపోయినంక రాసిన వాటికీ బేధం
వున్నది.....ఒక వేళ ఒక మాత తప్పు పడినా దానిని మార్చుకునేటిది లేదు. ఆ చెప్పే
మహానుభావుడు లేడాయె......అయితే రాఘవరెడ్డి గారుంటే, ఇటువంటి
తప్పు జరక్కకపోయేది.....అయ్యగారు - గార్లపాటి రాఘవరెడ్డి గారు నేను తప్పు చేసినా
తన శిష్యుడిని ఎక్కడా సమర్థించలేదు".
"విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సారి మా ఇంట వున్నప్పటి సంగతి. ఆయన మంచం మీద
పడుకుని వున్నరు. ముందటి సోఫాలో నేను కూచుని మాట్టాడుతున్న. ఇంతలో రాఘవరెడ్డి గారు
వచ్చిన్రు. నేను పరిచయం చేసిన - మా గురువు గారు, సంస్కృతం
వచ్చును, తెలుగులో కవిత్వం రాస్తరు . విశ్వనాథ
అట్నే పడుకుని ’రెడ్డి గారూ, ఏవన్నా రెండు పద్యాలు
వినిపించండి’ అన్నడు. ఆయన నోటికి వేనవేల పద్యాలు వచ్చేటివి - తనవీ, వేరే వాళ్లవీ కూడా. మంచి పద్యం లక్షణం - అది వినగానే జ్ఞాపకం వుండి పోవాలె
- అదే మంచి పద్యానికి గీటు రాయి అనెటోడాయన. తన వేణుగోపాల శతకంలోంచి ఒక పద్యం
వినిపించిండు. వింటున్న విశ్వనాథ లేచి కూచున్నడు. రెండో పద్యం విని మంచం దిగిండు.
సోఫాలో వున్న మాదగ్గరకి వచ్చి, రాఘవరెడ్డి గారి పక్కన కూచుని,
రెండు చేతులూ పట్టుకున్నడు - సంతోషంతో కన్నీళ్లు! విశ్వనాథ ఎంతో
ఆనందపడ్డడు. ఆయన వానమామలై వరదాచార్యుల వారి ’మణిమాల’ కావ్యానికి పీఠిక రాస్తూ,
’ఈ సారి వరంగల్ పోయి వచ్చినప్పుడు రాఘవరెడ్డి గారనే మంచి కవి పరిచయం
కావడం, కాళోజీ గారి ఆతిధ్యం మర్చిపోలేని విషయాలు’ అన్నడు.
విశ్వనాథ విచిత్రమైన వ్యక్తి. ప్రైవేటుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరి కవిత్వమైనా
బాగుంటే మెచ్చుకునెటోడు. ప్రభావితుడయెటోడు. మంచి రసికుడనిపించేటిది. మరి వేదిక
ఎక్కినప్పుడు ఏమయ్యేదో ఏమిటో, తానే తప్ప ప్రపంచంల
కవిలేడన్నట్టు విచిత్రంగ మాట్టాడెటోడు. ఈ బేధం అంచనాకి అందదు.....వానమామలై
’మణిమాల’ కు పీఠిక రాసినప్పుడు విశ్వనాథ ’తెలంగాణాకు చెందిన కవులలో ఇతను
ప్రసిద్ధుడు’ అని రాసిండు. అంటే తెలంగాణా కవులు వేరూ, ఆంధ్ర
కవులూ వేరూ అన్న మాట. వాళ్ల స్టాండర్డ్ వేరు, వీళ్ల
స్టాండర్డ్ వేరన్న మాట. అదీ విశ్వనాథ లాంటి పెద్దల దృష్టి!.....విశ్వనాథ స్ప్లిట్
- Split- పర్సనాలిటీ (ద్వంద్వ
ప్రవృత్తి) మన అంచనాకి తట్టనిది అని మాత్రం తేల్చుకున్న సుమా!"
విశ్వనాథ సత్యనారాయణ గారితో కాళోజీ చెప్పిన మాట... "మీరు
తెలుగుల రాసింది నా బోటి వాండ్లకు కూడా తెలివకపోయె. తెలుగుల రాయడం వల్ల తెలుగు రాని
ప్రాంతం వాండ్లకి మీ ప్రతిభ తెల్వడం లేదు. కాబట్టి దయచేసి మీరు తెలుగు రాయడం
మానుకుని సంస్కృతంలోనె రాస్తె సంస్కృతం తెల్సిన వాండ్లకి మీ ప్రతిభ బోధపడుతుంది.
మీ స్థాయీ వాండ్ల కర్థమవుతుంది. మీరు తెలుగులో రాయడమెందుకు? మీ భాష
అర్థం కాక మేం బాధపడడమెందుకు? ’నీకేం తెలుస్తుందిలే’ అని
మీరనడమెందుకు? సంస్కృతంలో రాయండి". (విశ్వనాథ ప్రతిభ ఉత్తరాది
వారికి తెలిసేటందుకు వీలుగా వారి "వేయి పడగలు" ని నాటి ప్రధాని పి. వి.
నరసింహారావు "సహస్ర ఫణి" పేరుతో హిందీలోకి అనువదించిండు).
మడులు దడులు కట్టుకోవడానికి కాళోజీ వ్యతిరేకం. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా
చెపుతారు ఆయన. దివంగత ముఖ్యమంత్రి అంజయ్య తెలుగు భాష మీద ఎలా గల్లంతు లేచింది, ఎలా కార్టూనులు
వచ్చిందీ తెలియచేస్తారు. ఒకరి భాష విషయంలో, యాస విషయంలో ఎగతాళి
చేస్తే అతడి ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని అంటారు.
"జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా
మడులూ, దడులు కట్టుకోడం, గీతలూ,
గిరులు గీసుకోవడం సరికాదని నేను భావిస్తను. మనం ఎప్పుడో ఒకప్పుడు
బతుకు తెరువుకోసం ఎక్కడెక్కడికో పోతుంటం. ఎవరెవరితోనో వుంటూంటం. మనం అప్పుడు అక్కడ
మందిలో ఒకరుగనే కలిసిమెలసి వుండాలె. నేను వేరు, వారు వేరు
అనేటి ఆలోచనలే తప్పు. కాని బాగా చదువుకున్నోళ్లు, పెద్ద
పెద్దోళ్లు కూడా ఇలాంటి ఆలోచనల్లోంచి అంత తేలిగ్గా బయటపడలేరు. తమకు అనుకూలమైన,
తమకిష్టమైన మార్పు అయితే సంస్కారవంతమైన దనుకోడం, తమ కిష్టం కానిదైతే భ్రష్టమైన దనుకోడం, చెడిపోయిందనుకోడం
తప్పు. తన విషయంలో, తన అలవాట్ల విషయంలో, తన చర్యల విషయంలో అయితె ఇంకో అభిప్రాయం మంచిది కాదు. నా ’ఇజం’ గేయంలో
దీన్నే ఎండగట్టిన.....భాష, సాహిత్యం, సంస్కృతి,
మనల్ని (తెలుగువాండ్లని) ఒకటి గనే వుంచెగద. నన్నయ్య మహాభారతం,
పోతన భాగవతం, పెద్దన మనుచరిత్ర, విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి, రాయప్రోలు ఆంధ్రావళి,
అడవి బాపిరాజు గోన గన్నారెడ్డి, అన్నే తెలుగు
పుస్తకాలే. అవీ ఇవీ కూడా మనవే అని అప్పుడూ అనుకున్నం. ఇప్పుడూ అనుకుంటం. వాండ్లు
వేరు, మనం వేరు అనే భావం తెలంగాణా వాండ్లకి ఎన్నడూ లేదు.
కాని, వీండ్లూ మనవాండ్లే, వీండ్లదీ మన
భాషే, వీండ్లదీ మన జీవిత విధానమే, అనేటి
భావాలు, మా గురించి పైనుంచి వచ్చినోళ్లకి వుండేటివి కాదు.
కాని తెలంగాణ లోపటి పరిస్థితి వేరు......కృష్ణదేవరాయలు, రాజరాజ
నరేంద్రుడు, నన్నయ్య భట్టులాగా ప్రతాపరుద్రుడు కూడా మన
తెలుగువాడేనని మేమనుకునెటోళ్లం. నన్నయ్య తెలుగువాడు, తిక్కన
తెలుగువాడు, ఎల్లయ్య తెలుగువాడు, పుల్లయ్య
తెలుగువాడు అని మా అభిప్రాయం. సాహిత్యంతో పరిచయమున్న పది మందికే ఇది పరిమితం"
"మేం తెలుగువాండ్లం, మాది తెలుగు భాష, మాది తెలుగు సాహిత్యం అని మాకు చాలా గొప్పగా వుండేటిది. తెలంగాణా, రాయలసీమ - రెండూ కూడా కలిసి వుంటేనే అది తెలుగు రాష్ట్రమవుతది. మొదటి
నుంచీ తెలుగు భాషకీ, సంస్కృతికీ, సాహిత్యానికి
ఈ మూడు ప్రాంతాల వాండ్లూ కలిసికట్టుగనే తోడ్పడిన్రు. కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంక
మాత్రమే మనం రాజకీయంగ ఒకటైనం. ఈ మాట మర్చిపోయి, ఆంధ్రప్రదేశ్
ఏర్పడక ముందు తెలంగాణా వాండ్లు తెలుగువాళ్లే కాదన్నట్టు ఒక వ్యవహారముండేటిది గద!
ఎవరిదాకానో ఎందుకు? ముఖ్యమంత్రి అంజయ్య (తెలంగాణా) తెలుగు
మీద ఎంత గల్లంతు లేచిందీ! ఎన్ని కార్టూనులచ్చినై? అంజయ్య
తెలుగు ఎంతచదువుకున్నడు అనేటిది అనవసరం. అతని ఇంట్లో భార్యా బిడ్దలతో గానీ,
బయట ఇరుగు పొరుగుతో గానీ, తెలుగులోనె
మాట్లాడిండు గద! అతని మాతృ భాష (తెలుగు) లో ఆరణాల కూలీగా కొన్ని వేల కూలీ సభల్లో
మాట్టాడిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ఆరణాల కూలీగా పని చేసినోడు ముఖ్యమంత్రి
కాకూడదా? కూలీల మాటలు తెలుగు భాష కాదనా? అందరిదీ తెలుగే. అందరం తెలుగోండ్లమే......రావి శాస్త్రి విశాఖ భాషని
తెలుగు కాదని మేమూ, నల్గొండ వాండ్లది వేరే యాస కాబట్టి అది
తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగుకాదని బెజవాడ
వాడు, బెజవాడ వానిది తెలుగు కాదని రాయలసీమవాడు - ఇట్లనుకుంటపోతె
మన మధ్య సహృద్భావం ఎట్టొస్తది? మనమందరం తెలుగువాండ్లం అని
చెప్పే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ - అత్మీయత ఏముంటది? ఒకని భాష
విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో
ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బతింటది. దానికి వెల కట్టలేం....."
హైదరాబాద్ రేడియోలో బాలల కార్యక్రమంలో తెలంగాణా పిల్లలు పాల్గొనే అవకాశం
రాకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఎలా కేవలం రెండు జిల్లాల భాషనే ఇతరులపై రుద్దే ప్రయత్నం
జరిగిందో కూడా వివరిస్తారు.
"......... మన విద్యా శాఖ వారు వాడుక భాషలో పాఠ్య
పుస్తకాలు పెడ్తమన్నరు. అవి ఎవరి వాడుక భాషలో రాయిస్తరు? కృష్ణా,
గుంటూరు జిల్లాల వాడుక భాష అయితే వరంగల్ పోరడు ఎట్ట చదువుతడు?దీని వల్ల తర తరాల ప్రజకి ఎంతో ద్రోహం జరుగుతది. ఇవాళ పాఠ్య గ్రంధాలకి
పరిమితమైన భాష రేపు ప్రభుత్వ కచేరీలకు, కోర్టులకు కూడా
పాకుతుంది. ప్రామాణిక భాష అనో, శిష్టవ్యావహారిక భాష అనో
పేర్లు పెట్టి ఒక గ్రాంధికాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం. నువ్వేదైనా పేరు
పెట్టు. నీ వాడుక భాషలో నువ్వు రాస్తే నీ జిల్లా వాడికి సౌలభ్యం వుంటుంది. తక్కిన
జిల్లాల వాండ్లు ఎన్నేళ్లు తపస్సు చేసినా నీ వ్యావహారికం, నీ
యాస వాండ్లు రాయలేరు. ఇవాళ సినిమా భాష, పత్రికా భాష, టి. వి. ల భాష ఎవరిది? రెండు జిల్లాల వాండ్లదే కదా?
అన్నిట ఈ రెండు జిల్లాల వాండ్లే ముందుంటరు. తక్కిన జిల్లాల వాండ్లు
ఏ నాటికైనా ముందుకు రావడానికి వీల్లేదు. వారికి అడుగడుగున అసౌకర్యం. అడుగడుగునా
కష్టమే......మన తెలంగాణా వాండ్లు ఏం మాట్టాడరాదు. ఏవో లెక్కలు
చూపిస్తరు........హైద్రాబాద్ రేడియోలో బాలల కార్యక్రమం వుంది. ఆంధ్రప్రదేశ్
ఏర్పడిన (1956) నాటినుంచీ ఈ
నాటి (1985) దాకా అంటే దాదాపు
30 ఏండ్లపాటు బాలల
కార్యక్రమాలు వందలు వేలు జరిగి వుండాలె కదా. వీటిల్లో తెలంగాణా పిల్లలు (ఆడ మగ)
ఎందరు పాల్గొన్నారు? ప్రతి ప్రోగ్రాంల 15 మందో, 20 మందో పాల్గొంటే అందుల
తెలంగాణా పిల్లగాండ్లేరి? వాండ్ల వాడుక భాష ఏది? వాండ్లు
కనపడరు. వాండ్ల భాష వినపడదు......బిరుదురాజు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు
ఎన్నడైనా బాలానందంల పాల్గొన్నరా? వీండ్లంత పెద్ద పెద్దోండ్లు - వీండ్ల పిల్లలకే గతిలేకపోతే తక్కినోండ్ల
పిల్లల గురించి చెప్పేటిదేముంటుంది?మాట్టాడాల్సిన పనే లేదు.
ఎందుకంటే రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాస ఏదీ తెలంగాణాది కాదు.....".
{తూర్పు మల్లారెడ్డి, ఎబికె.
ప్రసాద్, వాసుదేవరావు (ఉదయంలో ఉన్నప్పుడు), స్మైల్, మరికొందరు కాళోజీ అభిమానులు రికార్డు చేసిన
కాసెట్ల ఆధారంగా ("మనిషి కథ" పేరుతో ముందుమాట
రాసింది వరవరరావు) వెలువడిన కాళోజీ ఆత్మకథ "ఇదీ నా
గొడవ" నుంచి సేకరణ-జ్వాలా}