Friday, October 11, 2013

'కోలాహలంగా నిలిచిన అనుభవం': వనం జ్వాలా నరసింహారావు

జి. కృష్ణ 90 వ జయంతి (విజయదశమి) సందర్భంగా...

'కోలాహలంగా నిలిచిన అనుభవం'
ఆంధ్ర జ్యోతి దినపత్రిక (12-10-2013)
వనం జ్వాలా నరసింహారావు

          కళ్యాణ వేణుగోపాల కృష్ణమూర్తిగా పెద్దలతో పేరు పెట్టించుకున్న గొడవర్రు అగ్రహారికులు, మధురా పుర వాసులు, కృష్ణగారు గా పాత్రికేయ లోకానికి చిరపరిచితులు, "జగమెరిగిన జర్నలిస్ట్" జి. కృష్ణగారు మన మధ్యనుంచి వెళ్లిపోయి పుష్కర కాలం దాటింది. ఆయన మన మధ్య లేరంటే, బాధకంటే వెలితి, గత పన్నెండేళ్లు గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది. బ్రతికుంటే ఆయన ఈ రోజున తన 90 వ జన్మదినం జరుపుకుండేవారేమో! పోనీ మనలాంటి వాళ్లం ఆయనకు ఇష్టమున్నా, లేకపోయినా జరిపేవాళ్లమేమో! ఆయన చనిపోవడానికి ముందు కొంతకాలం పాటు చెన్నైలోని తన కుమారుడి దగ్గర అనారోగ్య కారణాల దృష్ట్యా వుంటుండేవారు. కొద్ది రోజుల్లో చనిపోతాడనగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారాయనను. వచ్చిన మరుసటి రోజే కృష్ణ గారిని కలవడం జరిగింది. వొరవడని ఉత్సాహం ఆయనలో ఆనాడు కనిపించినా, మాట్లాడలేని స్థితిలో వున్నారనే చెప్పాలి. అస్తమానం మాట్లాడుతుండే ఆయనను ఆ పరిస్థితిలో చూడగానే చాలా బాధ వేసింది. కృష్ణగారు (విజయదశమి) అక్టోబర్ 20, 1924 న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర లోని గొడవర్రు అగ్రహారంలో పుట్టి, కృష్ణ జిల్లాలోని సొంత గ్రామం మధురా పురంలో పెరిగారు. సికిందరాబాద్‌లో పాఠశాల విద్యాభ్యాసం, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్, నిజాం కళాశాలలో డిగ్రీ చదువు పూర్తి చేసారు. మీజాన్, ఫ్రీ ప్రెస్, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పని చేసి అక్టోబర్ 19, 1982 లో పదవీ విరమణ చేసి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా, నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ సంపాదకుడుగా, మరణించేంతవరకు పాత్రికేయ వృత్తిలోనే వున్నారు. ఆంగ్లంలో "నాయన", "హిస్టరీ ఆఫ్ తెలుగు అండ్ దెయిర్ కల్చర్", "కొమర్రాజు జీవిత చరిత్ర": తెలుగులో "మెడోస్ టైలర్ ఆత్మ కథ", "టపా కథలు", "ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జీవిత చరిత్ర...తోడేళ్ల పాలు చేశారు", "గాంధి", "మాదన్న మహామంత్రి" అనే పుస్తకాలను రాసారు కృష్ణగారు.

దుర్భర దారిద్ర్యంలో నిత్య సంతోషి కృష్ణగారు. ఆయన నోట "లేదు"-"కాదు" అన్న మాట ఏ విషయంలో రాలేదు. ఐనా, ఆయనకూ ఇష్టా-అయిష్టాలుండేవి. ఉదాహరణకు...ఆయనకు రుచించని ఏదైనా అంశంపైన కాని, ఎవరైనా వ్యక్తి గురించి కాని, ఏదైనా ఒక వార్త కాని కృష్ణగారితో రాయించడం ఎవరి తరం కాదు. ఇక ఆయన భాష వేరు...వ్యవహార శైలి వేరు...రాసే విధానమే వేరు. అలానే ఆయన ఎడిటింగ్ నేర్పరి తనం. మనం రాసింది రాసినట్లే వుంచి, చక్కగా ఎడిట్ చేసి, ఇది రాసింది మనమేనా అన్నట్లు మార్పు చేసి ఇచ్చేవారు మన వ్యాసాన్ని. ఆయన చివరి రోజుల్లో, కృష్ణగారి చివరి కాలమ్ "విలేఖరి లోకం" పుస్తకావిష్కరణ సభలో ప్రముఖ రచయిత, ఆయన స్నేహితుడు సదాశివ ఆయన గురించి మాట్లాడుతూ...కృష్ణగారు "వ్రాస్తారు", మనం "రాస్తాం" అన్నారు. వాస్తవానికి, కృష్ణగారి గురించి ఎంత రాసినా ఏం సరిపోదు. ఏ ఒక్క కోణంలో ఆయనను చూపించగలం? ఆయనో సీనియర్ పాత్రికేయుడు అంటే చాలా? రచయిత అని సర్దుకోవచ్చా? అనువాదకుడందామా? స్వాతంత్ర్య సమరయోధుడందామా? ఓ పాతికమందికైనా డాక్టరేట్ పొందడానికి సహాయపడ్డ వ్యక్తి అందామా? బహుశా సమాధానం లేదేమో! నిజం చెప్పాలంటే కృష్ణగారొక విజ్ఞాన సర్వస్వం!


నేను బి.హెచ్.ఇ.ఎల్ సంస్థకు చెందిన హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్ ఉద్యోగంలో చేరి, హైదరాబాద్‌కు వచ్చిన రోజుల్లో, 1974 లో, స్వర్గీయ భండారు పర్వతాల రావుగారి ద్వారా కృష్ణగారితో మొదటిసారి పరిచయం అయింది. అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయం లిబర్టీ డౌన్‌లో, హిమాయత్ నగర్ లో వుండేది. పర్వతాల రావుగారి రిఫరెన్స్ తో ఆయనను కలిసిన మరుక్షణంలోనే, కృష్ణ గారు ఒక విచిత్రమైన వ్యక్తిగా అనిపించాడు. ఆ రోజున ఆయన ఉర్దూలో రాసిన ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లు గుర్తు. నాతో సంభాషణ మధ్యలో "హిజ్ మదర్" అనే పదాన్ని ఎందుకో వాడి, దాని అర్థం ఆయనదైన శైలిలో విడమర్చి చెప్పి కడుపుబ్బా నవ్వించారు. ఇక ఆ తరువాత కొన్ని వందల సార్లు ఆయనను కలిసి వుంటాను. దురదృష్ట వశాత్తు, ఆయన చివరిసారి ఫోన్ చేసి, "జ్వాలా గారూ...ఒక్క సారి కబుర్లు చెప్పుకుందాం...రాకూడదు"? అని అడగడం, నేను ఖమ్మంలో వున్న కారణాన కలవలేకపోవడం, వచ్చేసరికి ఆయన మరణ వార్త వినడం జరిగింది. పిలిచినప్పుడు వెళ్లలేకపోయానే అన్న బాధ ఈ నాటికీ మిగిలిపోయింది.

          కృష్ణగారు ఆయనను గురించి తప్ప, ఇంకే విషయమైనా అక్షరం పొల్లు పోకుండా, ఏమాత్రం మరచి పోకుండా చెప్పగలరు. అలా చెప్తూ...చెప్తూ.. మధ్య మధ్యలో పొరపాటున తనకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పేవారు. విన్న సంగతి మరచిపొమ్మని కోరేవారు. అలా చెప్పినవి కొన్ని మరిచిపోకుండా వుండలేనివి వున్నాయి. ఉదాహరణకు: ఆయన పనిచేస్తున్న పత్రికలో, సంపాదకుడిగా వున్న వ్యక్తి పదవీ విరమణ చేసినా. పదవి నుంచి ఏదో కారణాన వైదొలగినా, ఇంకొకరిని నియమించాల్సి వస్తే, "ఎవర్ని" చేస్తే బాగుంటుందని కృష్ణగారి సలహా అడిగేవారు కాని "నువ్వే" వుండమని ఎన్నడూ అడగలేదు. ఒకసారి ఆయనను "ఛీఫ్ రిపోర్టర్" గా నియమించితే, అది తనకెందుకని యాజమాన్యాన్ని ప్రశ్నించారట. పి. వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా, అక్కిరాజు వాసుదేవరావు సమాచార శాఖ మంత్రిగా వున్న రోజుల్లో, కృష్ణ గారు నిరుద్యోగిగా విజయవాడలో వుంటూ, సంగీతం-సాహిత్యం, నాట్యంపైన, పుస్తకాలపైన, సమీక్షలు రాసుకుంటూ పదో-పరకా సంపాదించుకుంటుండేవారు. పి. వి గారు సమాచార శాఖ మంత్రిని విజయవాడ పంపి, కృష్ణగారిని ఆ శాఖ డైరెక్టర్‌గా చేసేందుకు ఆయన అంగీకారం అడగమన్నారు. ఆ ఉద్యోగంలో తానేం చేయాలని ఎదురు ప్రశ్న వేసి, కాలి దగ్గర కొచ్చిన ఉద్యోగాన్ని తన్నేశాడు. ఇంకొకళ్లయితే, ఎగిరి గంతేసి ఒప్పుకునేవారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కృష్ణగారిని ఉద్యోగం మానమని చెప్పిన యజమాని తండ్రి (రామనాథ్ గోయెంకా) స్వయానా విజయవాడ వచ్చి, ఆయన్ను మెప్పించి-ఒప్పించి, మళ్లీ అదే ఉద్యోగం హైదరాబాద్‌లో తనకిచ్చిన సంగతి కొంత చెప్పారొకసారి. అలా వచ్చిన రోజుల్లోనే నాకు ఆయనతో పరిచయమైంది. ఆ ఉద్యోగంలో చేరడం వలన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆయనకు ఉపయోగపడ్దదో, లేక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఆయన ఉపయోగపడ్డాడో, కృష్ణగారికి, రామనాథ్ గోయెంకాగారికి తప్ప ఇతరులెవరికీ తెలియదు. ఇలా చెప్పాలంటే మరికొన్ని వున్నాయికాని, బహుశా అలా బయట పెట్టడం కృష్ణగారికి ఇష్టం కాదని రాయడం లేదు.

తననెవరూ, ఏ పేపర్లో పనిచేసినా, సంపాదక బాధ్యతలు ఇవ్వలేదని, ఆ పని నేను, డాక్టర్ ఏ. పి. రంగారావు గారు చేశారని అంటుండేవారు కృష్ణగారు. దానికి కారణం, ఆ రోజుల్లో మేం నడుపుతుండే "నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్" అనే ఓ అనామక (అంతగా ప్రాచుర్యం పొందని) ద్విభాషా వార్తా సంస్థకు కృష్ణగారిని గౌరవ సంపాదకుడిని చేయడమే! ఆయన తన బై లైన్‌తో నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ ద్వారా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తుండేవారు కూడా. అలా ఆయన సహచర్యంతోనే నాకు కూడా రాయడం అలవాటై, ఆ వ్యాసాలు పత్రికలలో ప్రచురించే స్థాయికి చేరుకున్నాయి. "నిస్ కార్డ్" అన్న పేరుతో నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ ద్వారా ఆయన రాసిన  చాలా ఆర్టికల్స్ తో పాటు, నావి కొన్ని, రమేష్ అనే మరో యువ పాత్రికేయుడివి కొన్ని కలిపి ఒక పుస్తకంగా వేయడం కూడా జరిగింది. ఆ పుస్తకాన్ని నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ గౌరవ అధ్యక్షురాలు అలనాటి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి ఆవిష్కరించడం కూడా జరిగింది. దాని మొదటి ప్రతిని రాజ్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ కృష్ణగారికి ఇవ్వడం నాకింకా బాగా గుర్తు.

          కృష్ణగారి దగ్గర ఎన్నో అపురూపమైన-అత్యంత విలువైన-విలువ కట్టలేని పుస్తకాలుండేవి. ఒక నాడు వాళ్లింటికి వెళ్లే సరికి అవన్నీ మాయమయ్యాయి. ఏమయ్యాయంటే ఆయన దగ్గరనుంచి కబుర్లే కాని సమాధానం రాలేదు. ఆయన దగ్గర అతి పురాతనమైన ఒక టైప్ మిషన్ వుండేది. దాని మీద ఆయన వ్యాసాలు టైప్ చేస్తుంటే, ఆ చప్పుడు, విజయవాడ సమీపంలోని కృష్ణా బ్రిడ్జ్ మీద రైలు పోతున్నట్లుండేది! ఆ టైప్ మిషన్ కూడా ఆ తరువాత కాలంలో కనిపించలేదు. ఆటోలో ప్రయాణం చేస్తుంటే, సరాసరి శ్మశానికి వెళ్తున్నట్లుగా వుంటుందని అంటూ, ఎక్కడానికి నిరాకరించేవారు. నా స్కూటర్ వెనుక సీటుపై సందేహిస్తూనే కూర్చునేవారు. ప్రయాణపు బడలిక ఆయనలో ఏనాడు కనిపించకపోయేది. కాకపోతే, మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మాత్రం, చాలినంత విరామం, ఐదారు సిగరెట్ల ఆస్వాదన ఆయనకు తప్పనిసరి.

          అందరూ రాసేది ఆయన వ్రాయరు. ఏదో ప్రత్యేకత ఆయన రిపోర్ట్ లో-ఆర్టికల్ లో వుండాలి. ఏ బావి కొండ నిక్షేపాల గురించో, సింధూ లోయ నాగరికత గురించో, ఫలక్ నుమా ప్యాలస్ గురించో, నిజాం నవాబులు పెట్టిన తద్దినాల గురించో, రావి నారాయణ రెడ్డి గారిలోని గాంధేయవాదాన్ని గురించో, చందా కాంతయ్య ధార్మికత్వమో, అయితరాజు రాం రావు హరిజన సేవ గురించో, కాళన్న కవిత్వం గురించో....ఇలా.. అందరూ అనుకోని కథా వస్తువులు ఆయన ఆర్టికల్స్ లో దర్శనమిస్తాయి. ఆయన రాసిన ఆర్టికల్, తాను రాసినట్లుగా, ఎవరన్నా తమ పేరుతో ప్రచురించుకుంటా మంటే, ఆయన నిరభ్యంతరంగా అంగీకరించేవారు. ఐనా, మన పిచ్చికాని, ఎవరి పేరు మీద అచ్చు అయినా, అది కృష్ణ గారు వ్రాసిందని సులభంగా తెలిసి పోదా? ఆ శైలి ఆయనకు తప్ప ఇతరులెవరికీ రాదు.

          ప్రజాతంత్ర వార పత్రిక ప్రారంభానికి ముందు, నేను, దేవులపల్లి అమర్, అజయ్, కృష్ణ గారిని కలిసి, ఆ పత్రికకు ఒక కాలమ్ రాయమని అడిగాం. అలా మొదలైందే "విలేఖరి లోకం". మాట ఇచ్చినట్లే, క్రమం తప్పకుండా, వంద వారాలకు పైగా ఆయన వ్రాసిన "విలేఖరి లోకం", సమకాలీన పాత్రికేయ జీవన యానం అనవచ్చు. నాకు పరిచయమైన పాతిక-ముప్పై సంవత్సరాలలో ఆయన దగ్గర ఎన్నో సంగతులు విన్నాను. ఆయన వ్రాసినవి ఎన్నో చదివాను. కాని, "విలేఖరి లోకం" లో ఆయన వ్రాసినవన్నీ నాకు తెలిసినంతవరకు కొత్త విషయాలే. తెలియని సంగతులే. బహుశా "విలేఖరి లోకం" ఆయన చిట్టచివరి కాలమ్ కావచ్చు. "విలేఖరి లోకం" లోని ఒకటి రెండు విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సమంజసమేమో!   

కృష్ణ గారి "విలేఖరి లోకం" భూత, భవిష్యత్, సమకాలీన పాత్రికేయ జీవన యానం. అది ఆయన ఆత్మ కథ కావచ్చు...స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర కావచ్చు...ఆయనకు పరిచయమున్న వివిధ రంగాలలో రాణించిన వ్యక్తుల గురించీ కావచ్చు....సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరిశోధనాత్మక వ్యాస పరంపరే కావచ్చు...ఇవన్నీ కూడా కావచ్చు. ఆయన రాసిన ప్రతి విషయం మళ్లీ, మళ్లీ చదవాల్సిందే....మళ్లీ, మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అందులోని అంశాలన్నీ అసలు-సిసలైన జీవితానుభవాలే. ఆ ఆణిముత్యాల పరంపరలో కొన్ని....

          "పత్రికా రచయితకు చదువు" అన్న ఆర్టికల్ లో, లక్ష్మీనాధం అనే ఒక ఉపాధ్యాయుడి గురించి, రామమూర్తి అనే ప్రధానోపాధ్యాయుడి గురించి వ్రాస్తూ... "ప్రధానోపాధ్యాయుడు పాఠం చెప్తే, విద్యార్థికి నోటికి వచ్చేది. మరి అదేమి ప్రజ్ఞో! చక్కగా చెప్పిన పాఠాన్ని అప్పగించుకుని ఇంటికి పంఫేసేవాడు" అన్నారు. ఇంతకూ ఇదెందుకు వ్రాసారంటే, కృష్ణగారు, ముందు ముందు పత్రికా విలేఖరి కావడానికి రామ మూర్తి వంటి ఉపాధ్యాయులు సహాయపడినారట. పత్రికా విలేఖరికి ఎవరు, ఏమిటి, ఎందుకని, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడారో జ్ఞాపకం వుండడం అవసరమని, అది ఆయన విత్తి ధర్మమని అంటూ, ఇతరులు చెప్పేది వినాలని, వినినవాడు మర్చిపోడని అంటారు.  "నేనెందుకు రిపోర్టర్ అయ్యాను" అన్న శీర్షిక కింద, తనకు ఇతిహాసం అంటే ఇష్టమని, అంతమాత్రాన ఇతిహాసం వచ్చునని అనడం లేదని అంటూ, తాను చదువుకున్న సైన్స్ లో కూడా ఇతిహాసం వుంటుందని చెప్తారు. పి. వి. సుబ్బారాయుడు, సి. ఎస్. నాయుడు అనే పాత్రికేయుల గురించి వ్రాస్తూ... "నాకు ఎంత పెద్ద ధనికుడిని చూసినా, ఎంత పెద్ద అధికారిని చూసినా మోజు కలిగేది కాదు కాని, ఈ ఇద్దరినీ చూసి, నా చిన్నతనంలోనే, నేను అసూయ లాంటి మోజు పడ్డాను. పత్రికా విలేఖరిని చూసి మోజు పడిన వాళ్లను నేను ఎరుగుదును. పత్రికా యజమానులే అసూయ పడడం ప్రారంభించిన తరువాత దృష్టి దోషం కలిగిందని ఎప్పుడైనా అనుకుంటూ వుంటాను" అని అంటారు. అప్పట్లో తనకు "రిపోర్టర్ కు, డిక్టేటర్ కు" తేడా తెలియదని చెప్పుకుంటారు. పాఠశాలలో పాఠాన్ని ఇతిహాసంగా చెప్పే, కథ చెప్పినట్లు చెప్పే, చమత్కారాలు కురిపించే పలువురు ఉపాధ్యాయులుండేవాళ్లు కాబట్టే తనకు "విలేఖరిత్వం" అవలీల అయిందని రాశారు. "వినే ఆసక్తి వుండాలి....వినిన దాన్ని బుద్ధిలో ధరించే శక్తి వుండాలి. ఇట్లా వుండాలంటే అటువంటి పోలికను ప్రసాదించగల తల్లితండ్రులుండాలి. ఇన్ని కలిసి వస్తే, విలేఖరి అవుతాడు-న్యాయ మూర్తి అయినా అవుతాడు. ఇవేవీ కాకుండా విలేఖరి అవుతే రాజకీయ కరపత్రాలు రాసేవాడు అవుతాడు" అంటారు మరో చోట. తనకు, పత్రికా రచయితకు కావాల్సిన శిక్షణ కొంతవరకు చిన్ననాడే సంప్రాప్తించిందని, చిన్ననాడే మంచి గాలి పీల్చానని, మంచి నీరు తాగానని, మంచి ఉపాధ్యాయుల వద్ద మెలిగానని గర్వపడతారు.

తాను ఈ లోకానికే శిష్యున్ని అని భావించేవారు కృష్ణగారు. ఆయనే నాడు, ఏ దరఖాస్తులోను, తన కులం గురించి కాని, శాఖ గాని రాసుకోలేదు. తాను పత్రికా రచయిత కావడానికి తగు చదువు చెప్పిన గుంటూరు హిందూ కాలేజీ, హైదరాబాద్ నిజాం కాలేజీ గురించి ముచ్చటించడం ఆయనకు చాలా ఇష్టం. నిజాం కాలేజీలో ఆర్థిక శాస్త్రాచార్యుడుగా పని చేసిన బి. వి. రామ నర్సు (బి. పి. విఠల్ గారి తండ్రి) బోధనా సరళి ప్రభావం కృష్ణ గారిపై బాగానే పడింది. "విద్యార్థి దశలో వినాలి...అధ్యాపక దశలో చదువుకోవాలి...రామ నర్సు గారు రెండు పద్ధతులు బాగా అవలంబించిన వ్యక్తి. విద్యార్థులలోను తెలివి గల వాళ్లు, చదువరులు వుంటారని ఆయన నమ్మకం కాబోలు. వాళ్లతో చర్చించే వాడు. ప్రశ్నలు, జవాబులు ప్రతి ఉపన్యాసంలోనూ వుండేవి" అని ఆయనను గురించి ఆరాధనా పూర్వకంగా రాశారు. అలా అంటూ...ఆ విధమైన బోధనా పద్ధతి, ముందు ముందు పత్రికా రచయిత అయ్యే వాళ్లకు ఎంతో ఉపయోగపడ్తుందని భావిస్తారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతూ "క్విట్ ఇండియా" ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగా, జైలు జీవితం అనుభవించారు కృష్ణ గారు. దేశ సేవకు ఉపయోగపడే, గౌరవ ప్రదమైన ఉద్యోగం చేయాలనుకున్న ఆయనకు అప్పట్లో తట్టింది "విలేఖరిత్వం". లక్నో లోని నేషనల్ హెరాల్డ్ పత్రికలో చేరాలన్న ఆశ నెరవేరలేదు. అయితే..."సరిగ్గా వ్రాయక పోతే రూళ్ల కర్ర పెట్టి వేళ్లు విరగ్గొడ్తా" అన్న కోటంరాజు రామారావు గారి మాటల్లోని అర్థాన్ని, "వ్రాయటం నేర్చి, పత్రికలకు వ్రాయమని" హితవు చెప్పిన చలపతి రావు గారి భావాన్ని అర్థం చేసుకున్న కృష్ణ గారు, సికిందరాబాద్‌కు తిరిగి వచ్చి "మీజాన్" లో చేరారు విలేఖరిగా. ఆ రోజుల్లో ఆయన "విలేఖరి" హోదాను నిలబెట్టుకోవడానికి పడిన పాట్లు అనంతం అని ఆయనే చెప్పుకుంటారు. మొత్తానికి మూడు నెలలు మీజాన్ లో పని చేసి, రాం భట్ల, సి. ఎస్. నాయుడు లాంటి వారి మెప్పు పొంది, చెన్నపట్టణానికి వెళ్లారు కృష్ణ గారు.

పత్రికా రచన కోసమే తాను పుట్టినట్లు చెప్పుకుంటారు కృష్ణ గారు. ఆ రంగంలో ప్రవేశానికి తప్ప, మరే సందర్భంలోనూ, ఆయన సిఫార్సుల కోసం తంటాలు పడలేదు. ఆయన దృష్టిలో "పత్రికా రంగం అనేది, ఎవ్వరేమనుకున్నా, తెలిసినంతవరకు, ఆశించినంతవరకూ, మానవత కోసం అన్వేషణ". "పత్రికా రచయితకు తన నిత్య అన్వేషణలో, ఎక్కడైనా మానవుడు, మానవత గల ద్విపాది, కనపడితే, అతడి జీవితం ధన్యం" అని ఎంత చక్కగా చెపుతారో! అయితే, ఆయనను ఎవరూ, "మానవత గల మనిషిని ఎక్కడైనా కలిశావా" అని అడగలేదట. ఎంత ఆశ్చర్యం! ఇలాంటి వ్యక్తి పత్రికా రచయితగా, వ్యాపార స్థాయిని ఆధారం చేసుకున్న వ్యవస్థలో పడ్డానని చెప్పుకోవడం మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఖాసా సుబ్బారావు గారి ప్రవేశ సిఫార్సు కాగితంతో చెన్నపట్టణంలోని "ఫ్రీ ప్రెస్" పత్రికలో చేరిన కృష్ణ గారు, చేరిన నాడే తయారు చేసిన చాలా వార్తల్లో, ఒక దానిని చూపించి అక్కడ పని చేస్తున్న ఐరావతం గారు, "ఉన్నట్లుండి పాఠాలు బట్టీ పట్టే విద్యార్థి వ్రాసే శైలిలో ఇదేమిటి?" అని ఒక ఉపన్యాసం కొట్టారట. ఆ విషయం గుర్తు చేసుకుంటూ, "పత్రికలో పడే వార్తలన్నీ సరిగానే వుండాలి కానీ, మధ్య మధ్య సరిగ్గా వ్రాయని వార్త వుండే వీలు లేదు కదూ!" అని రాసుకున్నారు. చిన్న వాక్యాలే అందరికీ అర్థమయ్యే భాషలో రాయమని ఐరావతం ఇచ్చిన సలహాను ఆయన ఎప్పుడూ గుర్తుంచుకునేవారు. పత్రికా రచనే ఒక్కొక్కప్పుడు గంభీరమనీ, ఒక్కొక్కప్పుడు లోకానికి పట్టిన వెలికితనమనీ, అయినా పత్రికా రచన కోసమే పుట్టాననీ అంటారు కృష్ణ గారు.

          కృష్ణ గారి దృష్టిలో పత్రికా విలేఖరికి ప్రతి క్షణమూ చదువుల కాలమే. ఉదాహరణగా ఫీ ప్రెస్‌లో పని చేస్తున్నప్పుడు న్యూస్ ఎడిటర్ ఎం. ఎస్. సుబ్రహ్మణ్యం (ఖాసా సుబ్బారావు గారి స్నేహితుడు-తోటి ఖైదీ) రాజీనామా వ్యవహారం రాస్తారు ఒక ఆర్టికల్ లో. హిందూలో వచ్చిన ఓ పతాక వార్త, ఫీ ప్రెస్‌లో రానందుకు, ఆక్షేపణగా స్నేహితుడైన సుబ్రహ్మణ్యంను ఖాసా గారు ప్రశ్నించారట. ఐదు నిమిషాలలో రాజీనామా లేఖను సుబ్రహ్మణ్యం గారు ఇవ్వడం, దాన్ని ఒక సెకండ్‌లో ఖాసా గారు ఆమోదించి, కాఫీ ఇచ్చి వీడ్కోలు చెప్పటం జరిగిందట. ఇది రాస్తూ..."ఆ రోజుల్లో సంపాదకులనే వాళ్ళు, పత్రికలో వార్తలు ఏవేవి, ఎట్లా పడేవో చూసుకునే వాళ్లు! పైగా తప్పు చేస్తే, అది తప్పే! అది చట్ట ప్రకారం ఒప్పు అవుతుందేమో చూసే వాళ్ళు కారు. వాళ్ళు అట్లా బ్రతికారు" అని అంటారు. పత్రికా రచయితల "లేమి" ని గురించి అర్థం చేసుకున్న విద్యావంతుడు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాన రాలేదనీ, అనేకులు పత్రికా రచయితలే అర్థం చేసుకో లేదనీ కృష్ణ గారంటారు. "మాకు కావాల్సింది విజ్ఞతతో, వాత్సల్య గుణంతో, విజ్ఞానంతో, ఉపాధ్యాయుడు లాంటి పత్రికా సంపాదకుడు......ఐ. ఎస్. ఎస్, ఐ. పి. ఎస్ లాంటి అధికారి సంపాదకుడు కాదు" అని రాస్తూ, అలాంటి వారు విద్యారంగంలోనే లేనప్పుడు పత్రికా కార్యాలయంలో మాత్రం ఎట్లా వస్తారు? అని సర్దుకుంటారు. పత్రికా సంపాదకుడంటే తెలుసుకునే వీలు ఖాసా గారిని ఎరిగి వుండడం వల్లనే అని చెప్తూ, "సంపాదకుడు ఆలోచనా మార్గదర్శి! సంపాదకుడు సమదర్శి" అని రెండు గొప్ప పదాలు వాడారు కృష్ణ గారు. "పత్రికా రచయితలం ఉపనిషద్వర్ణితులం" అంటారు.

"వ్యవహారిక అన్యాయం" అనే పదాన్ని వాడుతూ, కృష్ణ గారు, పత్రికలలో భాషను గురించిన ప్రస్తావన తెస్తారు. ఆయన అనుభవంలో "చెన్న పట్టణంలో వినే తెలుగు విలక్షణమైనది". అంతటితో ఆగకుండా, ప్రతి ద్విభాషా ప్రాంతంలోనూ భాష విలక్షణంగానే వుంటుందంటారు. తన లాంటి కొందరు ఆంధ్రపత్రికలో పని చేస్తున్నప్పుడు, "గ్రాంథికం" అనే శైలిని ఓపిక వున్నంత మేరకు రాసేవాళ్లట. అయితే అది చాలావరకు "చదువుకోని వాళ్ల గ్రాంథికం" అంటారు. ఆంధ్ర పత్రిక గ్రాంథికం రాసేది అని చెప్తూనే, ఆంధ్ర ప్రభ వ్యావహారికం రాసేది అని అంటూ, "చాలా పూనిక, చాలా ప్రయత్నం, చాలా పట్టుదల వుంటేనే, ప్రజల ఆదరంతో భాష చెడుతుంది" అని చమత్కరిస్తారు. "రచయితకు భాష కావాలి" అంటూ....పత్రికా విలేఖరికి ఈ లోకంతో సమగ్ర సంబంధం వుంది అని చెప్తారు. "ఈ ప్రపంచం నా అవగాహనకు లోబడి వుండాలి అని కోరుకునే వ్యక్తి ఒక్క పత్రికా విలేఖరి మాత్రమే....విలేఖరికి తగు భాషా పాండిత్యం వుండాలి-వుండి తీరాలి. లేకపోతే ఈ ప్రపంచం వ్యవహారాన్ని పాఠకులకు ఎట్లా చెప్పగలడు?" అని ప్రశ్నించుతాడు.

          "అవ్యక్త కోలాహలం" అన్న పేరుతో తన "విలేఖరి లోకం" పుస్తకానికి ముందు మాట రాస్తూ... " నా విలేఖరిత్వం జారచోరభజనా"....నా విలేఖరిత్వం దేశానికి సేవా?" అని ప్రశ్నించుకుంటాడు కృష్ణ గారు. ఏదేమైనా అది "కోలాహలంగా నిలిచిన అనుభవం" అని చెప్పుకుంటారు.


No comments:

Post a Comment