(మాజీ రాజ్య సభ సభ్యుడు, ప్రజా వైద్యుడు,
ప్రముఖ సిపిఎం నాయకుడు
డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి
అక్టోబర్ 19,
2013 న మరణించిన నేపధ్యంలో...)
మార్క్సిస్ట్ మార్గదర్శి యలమంచిలి
ఆంధ్ర
జ్యోతి (22-10-2013)
వనం
జ్వాలా నరసింహారావు
వై.ఆర్.కె గా సన్నిహితులందరూ
సంబోధించే డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి తన 86 వ
జన్మదినం నాడే మరణించడం, బాగా తెలిసున్న వాళ్లతో సహా,
ఆయన పరిచయస్తులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అస్వస్థతకు గురైన డాక్టర్ గారిని, హైదరాబాద్ కేర్
ఆసుపత్రికి వారం రోజుల క్రితం తీసుకు రావడానికి ఒక రోజు ముందు కూడా పరిపూర్ణ
ఆరోగ్యంతోనే వున్నారు. తెలుగులో నేను రాసిన ఆయన జీవిత చరిత్ర
"అనుభవాలే అధ్యాయాలు" ఆంగ్ల
అనువాద ప్రతిని సరిదిద్దుతున్న సందర్భంలో స్వల్పంగా గుండె పోటుకు గురికావడం,
ఒకటి రెండు రోజులు ఖమ్మం ఆసుపత్రిలో వుంచి హైదరాబాద్‌కు తరలించడం
జరిగింది. నలబై సంవత్సరాలకు పైగా నేనాయనను ఎరిగున్నప్పటికీ,
ఆయన జీవిత చరిత్రను గ్రంధస్థం చేసే కార్యక్రమంలో వున్న నాకు,
గత మూడేళ్లు గా అనుబంధం కొంచెం పెరిగిందనాలి. ఈ
నేపధ్యంతోనే ఈ వ్యాసం రాస్తున్నాను.
కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను తు. చ
తప్పకుండా పాటిస్తూ, నాలుగు దశాబ్దాలు పార్టీ సభ్యత్వం
లేకపోయినా-తీసుకోక పోయినా, ఒకనాటి
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత భారత కమ్యూనిస్టు
(మార్క్సిస్టు) పార్టీకి పనిచేసి,
ఆ తర్వాత పార్టీ ఆదేశం మేరకు సభ్యత్వం తీసుకుని, ఏడు దశాబ్దాలకు పైగా పార్టీకి సేవ చేసి, సమాజం తనకు
అప్ప చెప్పిన ఇతర బాధ్యతలను కూడా నెరవేర్చిన కమ్యూనిస్టు యోధుడు-పౌర హక్కుల ఉద్యమ ఆద్యుడు-ప్రజా వైద్యుడు-మాజీ రాజ్య సభ సభ్యుడు, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న
"సీమాంధ్ర-తెలంగాణ" వాసి, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవన యానం
కమ్యూనిస్టులకు-కమ్యూనిస్టే తరులకు ఆదర్శప్రాయం. సీపీఎం దిద్దుబాటు ఉద్యమానికి ఆయన లాంటి వారి అరుదైన జీవితం ప్రామాణికం.
సీపీఎం పార్టీ వారు తప్పనిసరిగా డాక్టర్ జీవిత కథ నుంచి పాఠాలు
నేర్చుకోవాల్సిందే మరి.
డాక్టర్ గారు చిన్నతనం నుండే నిరీశ్వరవాది. సహధర్మచారిణి
కూడా, వివాహమైన కొద్ది కాలంలోనే ఆయన బాటలోనే పయనించడంతో,
ఇంట్లో పూజలు-దేవుళ్ల బొమ్మలు లేవు. అయితే, సాహిత్యాభిలాషైన వై.ఆర్.కె పుస్తక పఠనం
విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను నిరీశ్వర వాదాన్ని-హేతువాదాన్ని అంటిపెట్టుకునేంత "కన్సర్వేటివ్"
కాదనాలి. ఆయన కన్సర్వేటివిజం అంతా, ఆహార పానీయాల్లోను, వేష భాషల్లోను, అలవాటున్నంతవరకు ధూమపానం చేయడంలోను మాత్రమే. ఐదు
పర్యాయాలు జైలు జీవితం గడిపిన డాక్టర్ గారు, వరంగల్ జైలులో
వున్నప్పుడు, తోటి ఖైదీల దగ్గర షడ్దర్శనాలు, భగవద్గీత, ఇస్లాం మతం, ఆయుర్వేద
రహస్యాలు లాంటి విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు.
1985లో సభ్యత్వం తీసుకున్న డాక్టర్, పార్టీలో ఎన్నడూ ఆర్థికపరమైన బాధ్యతలు తీసుకోలేదు. సభ్యత్వం
తీసుకున్న తర్వాత "ఆస్తి" సమకూర్చుకోలేదు.
పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. పార్టీలో
ఏ పదవినీ ఆశించని ఆయన, ఇచ్చిన బాధ్యతను ఎన్నడూ కాదనలేదు.
వంట్లో శక్తి వున్నంతవరకు పార్టీకి సేవ చేసిన యలమంచిలి, ఎన్నికల పదవులపట్ల కూడా విముఖత చూపించినా, మూడు
పర్యాయాలు ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. రెండుసార్లు
సభ్యత్వం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు "బాధ్యత"
గా ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కావాలని
కూడా ఆయనెప్పుడూ కోరుకోలేదు సరి కదా, ఊహించనూలేదు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నెల నెలా పార్టీకి జమ
కట్టాల్సిన మొత్తం పోను, మిగాతాదాంట్లో, తన కుటుంబ నిర్వహణకు ఖర్చుచేసి, మిగిలిందంతా "చిత్త శుద్ధి" తో పార్టీకి జమచేశారు. సభ్యత్వం అయిపోయిన తర్వాత వస్తున్న పెన్షన్ మొత్తాన్ని పార్టీకి ఇవ్వడంతో
పాటు, తన తదనంతరం తన భార్యకు పంపితే, అది
కూడా పార్టీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పుస్తక పఠనం,
రచనా వ్యాసంగం, మిత్రులతో కబుర్లు, పార్టీకి అవసరమైనప్పుడు సూచనలు-సలహాలు ఇస్తూ
కమ్యూనిజాన్ని అభిమానిస్తూ, అందులోని మంచిని పది మందికి
తెలియచేస్తూ, ప్రశాంత జీవితం గడిపి, మరణించిన
ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమే!.
నేనాయన జీవిత చరిత్రను గ్రంధస్థం చేస్తున్న సందర్భంలో, తన
అనుభవాలను వివరంగా చెప్పారాయన. తానెందుకు ఐదు పర్యాయాలు జైలుకు వెళ్లాల్సి
వచ్చింది, ఎలా ఐదు సెంట్రల్ జైళ్లను చూసింది, ఎలా తాను రాజ్యసభకు నామినేట్ కాబడింది, రాజ్యసభ
సభ్యుడుగా ఏం చేసింది, ఎలా ఎంపీ నిధులను సద్వినియోగం చేసింది,
ఎలా జీవితంలో ఎదిగింది, ఎలాంటి కష్ట-సుఖాలను అనుభవించింది, వైద్య విద్యను
అభ్యసించినప్పుడు ఏం జరిగింది... లాంటి విషయాలెన్నో చెప్పారు.
కాకపోతే...జిల్లాలో కాని, రాష్ట్రంలో కాని, ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో కాని,
గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ పరంగా చోటుచేసుకుంటున్న పరిణామాల
విషయంలో, వివరాలలోకి లోతుగా వెళ్లడానికి డాక్టర్‍గారు అంతగా
ఇష్టపడలేదు. "ఔను.. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ పరంగా సంతోషం కలిగించని కొన్ని
అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న మాట వాస్తవమే. వాటికి
కారణాలు, ఫలితాలు, తలెత్తనున్న
పర్యవసానాలు భవిష్యత్ నిర్ణయిస్తుంది. నేనింకా పార్టీలో-పార్టీ సభ్యుడుగానే వున్నాను. సిపిఎం పార్టీ
అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా చర్చించడం సమంజసం కాదు." అని స్పష్టంగా చెప్పారు. అదీ...ఆయనకు పార్టీపైనున్న నిబద్ధత!
డాక్టర్ గారి స్వగ్రామం, కృష్ణా జిల్లా, "జమీ దింటకుర్రు" లో కమ్యూనిస్ట్
కార్యకర్తలుండేవారు. మిక్కిలినేని వెంకటేశ్వరరావు, కొల్లి (అంజయ్యగారి) సుబ్బారావు,
జాస్తి పున్నయ్య, ఎన్.వీ.ఎస్.ప్రసాదరావు వీరిలో ముఖ్యులు. "స్వతంత్ర భారత్" అనే సైక్లో పత్రిక రహస్యంగా
పంచేవారు. ఆసక్తి కొద్దీ దాచుకుని చదువుతుంటే (ఏమీ అర్థం అయ్యేది కాదు) తండ్రిగారు చూసి,
"నీకవన్నీ ఎందుకు? పుస్తకాలు చదువుకో"
అని మందలించేవారట. 1944 లో, ఆయన ఇంటర్ రెండో సంవత్సరంలో
వున్నప్పుడు, పెద్ద ఎత్తున జరిగిన ఆ నాటి "బెజవాడ" అఖిల భారత రైతు మహా సభలను డాక్టర్ గారు
ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేవారు. ఈ నాటికీ, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో అవి ముఖ్య ఘట్టాలుగా చెప్పేవారాయన. ఆ సందర్భంగా డాక్టర్ గారు బందరు నుండి తన మిత్రులతో కలిసి, ఆ మహా సభలకు ప్రేక్షకులుగా వెళ్లి, అక్కడే చండ్ర
రాజేశ్వరరావు, సుందరయ్య, చలసాని వాసుదేవరావు
గార్లతో పాటు, బీహారుకు చెందిన ప్రసిద్ధ రైతు నాయకుడు స్వామీ
సహజానందను (కాషాయ వస్త్రాలతో) వేదిక
మీద చూశారు మొదటిసారి. ఇంటర్ చదువుతున్నప్పుడే, ఆనాటి విద్యార్థి ఫెడరేషన్ తో సంబంధాలుండేవి డాక్టర్ గారికి. పార్టీతో పెద్దగా సంబంధాలు లేకపోయినా, పట్టణ
విద్యార్థి ఫెడరేషన్ కమిటీలో తీసుకున్నారు డాక్టర్ గారిని. అప్పటినుంచే,
భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నాయకుడు, రాజ్య
సభ సభ్యుడు దాసరి నాగభూషణ రావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన
వైద్య విద్య సాగుతున్నప్పుడే వీర తెలంగాణ రైతాంగ విప్లవ సాయుధ పోరాటం సాగింది.
జరిగింది తెలంగాణ ప్రాంతంలోనే అయినప్పటికి, పుచ్చలపల్లి
సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి ఆంధ్ర ప్రాంతం వారి
సహాయ సహకారాలతో పాటు నాయకత్వం కూడా దానికుండేది. రాధాకృష్ణమూర్తికి
అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయి. నేరుగా
తెలంగాణ సాయుధ పోరాట నాయకులతో సంబంధాలు లేకపోయినా ఉద్యమానికి తన వంతు సేవ
చేస్తుండేవారు.
1949 నాటి "కాటూరు ఎలమర్రు సంఘటన" నేపధ్యంలో, పోలీసు దౌర్జన్యానికి, హింసా కాండకు వ్యతిరేకంగా,
వైజాగ్ పట్టణంలో గోడలకు పోస్టర్లు అంటించే కార్యక్రమాన్ని రాధాకృష్ణమూర్తికి,
ఆయన స్నేహ బృందానికి అప్పగించింది కమ్యూనిస్ట్ పార్టీ. స్నేహితులను పోగు చేసుకుని, పోస్టర్లు తయారు చేసి,
రాత్రి పూట అతికించ సాగారు రాధాకృష్ణమూర్తి బృందం. గస్తీ తిరుగుతున్న బీట్ కానిస్టేబుల్ డాక్టర్ గారిని పట్టుకుని దగ్గరలో
వున్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెట్టి జైలుకు పంపారు. అలా రాధాకృష్ణమూర్తికి మొదటి జైలు అనుభవం కలిగింది.
ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత, వైద్యంలో ఉన్నత చదువులు చదివే
అవకాశం లేకుండా పోయింది ఆయనకు. సదరన్ రైల్వే సర్వీసులో తాత్కాలికంగా,
మద్రాస్ పెరంబూర్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రిలో చేరారు. మద్రాస్ లో వుండగానే పొట్టి శ్రీరాములుగారి ఆమరణ నిరాహార సత్యాగ్రహ దీక్ష
మొదలైంది. ఆయన ప్రాణత్యాగం చూశారు. రైల్వే
ఉద్యోగంలో వుండగానే, రాష్ట్ర సర్వీస్ కమీషన్ మెడికల్
ఆఫీసర్స్ సెలక్షన్ కు పిలిచారు. కాని ఆయన విషయంలో పోలీసు
రిపోర్టు సెలక్షన్ కు అడ్డుపడింది. రాధాకృష్ణమూర్తి గారు తన
మెడిసిన్ నాలుగో సంవత్సరంలో వుండగానే (1949) అరెస్టు కాబడి,
కమ్యూనిస్ట్ గా ముద్రపడి వున్నాడు. ఆ
రికార్డంతా ప్రభుత్వం దగ్గర, సెలక్షన్ కమిటీ దగ్గర వుంది.
ఉద్యోగం రాలేదు. రైల్వే ఉద్యోగం నచ్చలేదు.
రాజీనామా చేసి, ఖమ్మం పట్టణానికి వచ్చి,
ప్రయివేట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.
వైద్య వృత్తిలో నైతిక విలువలకు, మానవత్వానికి కట్టుబడి వున్న
ప్రతి డాక్టర్‌కు ప్రజల అభిమానం లభిస్తుందని నమ్మిన యలమంచిలి, తన వైద్య శాల ద్వారా ఆ మార్గంలోనే ప్రాక్టీస్ చేయడంతో, అచిర కాలంలోనే ఆయన వద్దకు చికిత్సకొరకు వచ్చే వారి సంఖ్య పెరగ సాగింది.
అదనంగా ఆయనకున్న వృత్తి పరమైన నైపుణ్యం వైద్యుడుగా మంచి పేరు తెచ్చి
పెట్టింది. వృత్తిలో కొన్ని నియమాలను పాటించేవారు. మొదట్లో అసలు కన్సల్టేషన్ ఫీజు వుండేది కాదు. సంఖ్య
పెరిగి, తట్టుకోవడం కష్టం కావడంతో, తలకు
రెండు రూపాయలు వసూలు చేసేవారు. విద్యార్థులకు, పార్టీ పూర్తికాలం కార్యకర్తలకు - వారి కుటుంబాలకు
ఉచితంగా చేయడం, ఇన్ పేషంట్లకు - సర్జరీలకు
బిల్లు వేస్తే ఇచ్చుకోలేమనే వారికి, వారికి చేతనైనంతే
ఇవ్వమనడం, ఎన్నాళ్లు సేవలందించినా సరే చనిపోయిన వారికి
బిల్లు వేయకపోవడం పాటించేవారు. ఆస్తిపరులు స్వచ్చందంగానే ఏదో
ఒక మొత్తం ఇచ్చి వెళ్లేవారు. ఎంత ఇచ్చారనేది చూసుకునేవారు
కాదు. కొందరు వార్షికంగా ఇచ్చే వారు. వుండడానికి అవసరమైన అన్ని
ప్రమాణాలను, నైతిక విలువలను తప్పక పాటించేవారాయన.
భారత చైనా యుద్ధం నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన కమ్యూనిస్ట్
నాయకులందరినీ నిర్భంధించింది నాటి ప్రభుత్వం పిడి చట్టం కింద. ఉమ్మడి కమ్యూనిస్ట్
పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న రోజుల్లో, సహజంగా దాని ప్రభావం ఖమ్మం కమ్యూనిస్టుల పైన
కూడా పడింది.
చాలా కాలం వరకు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోక పోయినా పార్టీ నిర్ణయాలను, విధానాలను అమలు జరుపుతుండే డాక్టర్. రాధాకృష్ణమూర్తి
ఇంటి ఆవరణలో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు "మార్క్సిస్ట్ ఫోరం"
అనే గొడుగు కింద సమావేశమై సిద్ధాంత పరమైన విషయాలపై చర్చించుకునే
వారు. 1961వ సంవత్సరంలో ప్రారంభమై
క్రమం తప్పకుండా జరుగుతుండే ఆ సమావేశాలకు, జిల్లా సీనియర్ నాయకులైన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, మంచికంటి
రాంకిషన్‍రావు లతో సహా పలువురు విద్యార్థి నాయకులు, యువకులు హాజరయ్యేవారు. వారందరూ
పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఎంలోనే వుండిపోయారు. ఆ వేదిక కింద
మార్క్సిజం-లెనినిజం అధ్యయన తరగతులు నిర్వహించడం కూడా
జరిగేది. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో కాని ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం
ప్రతి ఆదివారం నిర్వహిస్తుండే సమావేశాలకు హాజరయ్యే వారిని “ఆదివారం సంఘం” గా-"సండే సిండికేట్" గా
ఎద్దేవా చేస్తూ, పిలవడం జరిగేది ఓ రకమైన
హేళనతో అప్పట్లో. ఇప్పటికీ ఆదివారం సంఘంతో అనుబంధమున్న వారు ఆ
జిల్లాలో పలువురున్నారు.
నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది
కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన
వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో
ఆలోచన చేయాల్సిన సమస్యని గ్రహించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఆయన మిత్రులు
అడ్వకేట్ రాధ, సుబ్బారావులు. అలా చేయాలంటే
రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను
నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. అలా మొదలైందే ఆంధ్ర ప్రదేశ్ పౌర
హక్కుల సంస్థ. పౌర హక్కుల ఉద్యమం ఆరంభించిన నేపధ్యంలో,
ఆ ఉద్యమానికి ఆద్యుడైన డాక్టర్ రాధాకృష్ణమూర్తిని, ఆయనకు తోడ్పడిన ఇతరులను ప్రభుత్వం నిర్బంధించింది. రెండో
పర్యాయం జైలు జీవితం అలా ప్రారంభమయింది. డాక్టర్ వై.ఆర్.కె ని మరో మారు కూడా జైలుకు పంపింది ప్రభుత్వం.
అఖిల భారత స్థాయిలో జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రైల్వే
కార్మికుల సమ్మె జరిగింది 1974లో. కమ్యూనిస్ట్
(మార్క్సిస్ట్) పార్టీకి ఆ సమ్మెతో
పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ, ఆ పార్టీ కార్యకర్తలను కూడా
అరెస్ట్ చేసింది ప్రభుత్వం.
నాలుగు దశాబ్దాల క్రితం ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అధ్యాయానికి
తెర లేసింది.
ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన
డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అరెస్ట్ చేసి,
వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. జనవరి 1977
లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. జైలు
నుంచి విడుదలై, ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో జరుగుతున్న
వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారం
రోజులపాటు, ఎమర్జెన్సీ ఇంకా అమలులో వుండగానే జరుగుతున్న సభలు,
విజయవంతంగా జరగడాన్ని దగ్గరగా గమనించిన పోలీసులు, వాటిని భగ్నం చేసి, నాయకుడని భావించిన డాక్టర్ వై.ఆర్.కె ను అరెస్ట్ చేసి, మళ్ళీ
జైలుకు తరలించారు. అలా ఐదవ సారి అరెస్ట్ చేయడం జరిగింది.
జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే, సార్వత్రిక
ఎన్నికల ప్రకటన వెలువడింది. ఖమ్మం నుంచి లోక్ సభ స్థానానికి
సిపిఎం అభ్యర్థిగా డాక్టర్ వై.ఆర్.కె
ను పోటీ చేయించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జైల్లో
వున్న ఆయనకు కబురు చేసి విషయం చెప్పారు. ఆయన నామినేషన్
పత్రాలపై జైలులోనే సంతకాలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు
పోటీలో వున్న అభ్యర్థిగా విడుదల చేశారు. అలా డాక్టర్ గారి అయిదో
పర్యాయం జైలు జీవితం ముగిసింది.
డాక్టర్ గారు తనకిష్టం లేకపోయినా, మూడు పర్యాయాలు లోక్‌సభకు
జరిగిన ఎన్నికలలో పోటీ చేయవలసి వచ్చింది. మొదటి సారి పోటీ
చేసింది 1977లో. ఫలితాలు అనుకున్నట్లే
వచ్చాయి. ఆయన ఓడిపోయారు. కేంద్రంలో
జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ నాయకత్వాన కొన్నాళ్లు సాగిన తరువాత, అంతర్గత కుమ్ములాటతో అర్థాంతరంగా కూలిపోవడంతో, మధ్యంతర
ఎన్నికలు 1980లోనే వచ్చాయి. ఈసారి కూడా
డాక్టర్‌గారినే అభ్యర్థిగా నిలబెట్టింది పార్టీ. మళ్ళీ
ఓడిపోయారు డాక్టర్ గారు. 1984 సార్వత్రిక
ఎన్నికలలో ఒక కొత్త శక్తి ప్రవేశించింది. 1989 లో లోక్ సభకు మరో మారు ఎన్నికలొచ్చాయి. సిపిఎం తన అభ్యర్థిగా డాక్టర్ వై.
రాధాకృష్ణమూర్తిగారి పేరును ప్రకటించింది. ప్రత్యర్థిగా
కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి వెంగళరావు వున్నారు. ఈ సారీ ఆయన ఓడిపోయారు. 1971, 1980, 1989లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్ధిగా డాక్టర్‌గారి
డ్యూటీ ప్రచారం చేసుకోవడం మాత్రమే. అదికూడా ఏ వేదికమీద కూడా తనకు
ఓటు వేయమని అడగలేదు. "మా పార్టీకి, మా పార్టీ అభ్యర్ధికి మీ మద్దతు కావాలి" అని
అభ్యర్ధించేవారు. ఎన్నికల ఆదాయ వ్యయాల సంగతికి డాక్టర్‌గారు
ఎప్పుడూ దూరంగానే వుంటానని ముందుగానే పార్టీకి చెప్పారు. వ్యక్తిగా
ఆయన ఎవ్వరినీ ఎన్నికల నిధులు అడగలేదు. కొందరు మిత్రులు,
శ్రేయోభిలాషులు స్వయంగా ఇస్తే, మరికొందరు
మనియార్డర్-చెక్‍ల ద్వారా పంపేవారు. ఆ
మొత్తం వెంటనే పార్టీ ఆర్థిక వ్యవహారాలు చూసే కామ్రేడ్ చేతికి అందించి వారికి
రసీదు పంపమని కోరేవారు. డాక్టర్‌గారి కుటుంబ సభ్యులు,
నేరుగా పార్టీకే ఇస్తూ వచ్చారు.
తాపీ ధర్మారావుగారి "పెళ్లి-పుట్టు పూర్వోత్తరాలు", "దేవాలయాలపై
బూతుబొమ్మలు", ప్రముఖ హేతువాది రావి పూడి వెంకటాద్రిగారి
"వివాహ పద్ధతి" చదివి,
ఆ నేపధ్యంలో డాక్టర్‍గారు ఆదర్శ వివాహాలు చేయించేవారు. ఎక్కడ-ఎవరు-ఏ సందర్భంలో వక్తగా పిలిచినా, అక్కడి అవసరాలకు అనుగుణంగా-తాను నమ్మిన మార్క్సిజం
సిద్ధాంతాలను అన్వయించుకుంటూ మాట్లాడడానికి, ఉపన్యాసంలో
పొందుపరచాల్సిన అంశాలను, సమయం-సందర్భానికి
తగినట్టుగా తయారు చేసుకునేవారు. భాష విషయంలోను తగినంత శ్రద్ధ
తీసుకునే వారు. అదే ఆయనను మంచి వక్త కావడానికి దోహద పడింది.
అదే ఆయనను రాజ్యసభ సభ్యుడుగా వున్నప్పుడు మంచి పార్లమెంటేరియన్ గా
అనిపించుకోవడానికి తోడ్పడింది. ఖమ్మం పట్టణంలో, జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ నెలకొనడానికి, కారణభూతులైన వారిలో ఆయనొకరు. ఖమ్మం శాఖకు కార్యదర్శిగా, తెలంగాణ ప్రాంత ఐఎంఎ విభాగం ఉపాధ్యక్షుడుగా డాక్టర్ వై.ఆర్.కె పనిచేశారు. జన విజ్ఞాన
సంస్థతో, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తో ఆయనకు సంబంధాలుండేవి.
ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నీలం రాజశేఖరరెడ్డి, తరిమెల
నాగిరెడ్డి లాంటి నాయకులు, చీలిక తర్వాత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకులు పలువురు, ఖమ్మంలోని డాక్టర్ వై.ఆర్.కె
ఇంట్లో ఆతిథ్యం పొందారు. సాహిత్యం - విస్తృతంగా చదవడం అలవాటు. పార్టీ సాహిత్యానికి
పరిమితం కాలేదు. అన్నిరకాల సాహిత్యాన్ని, కాస్తో - కూస్తో
చదువేవాడిని అనేవారాయన.
డాక్టర్ గారు తన జీవిత చరిత్రకు ముందు మాట రాస్తూ..."వయస్సు 84 నడుస్తోంది. ప్రస్తుతం
పూర్తి వానప్రస్థం. బతుకుదెరువు కోసం చాలా ఏళ్లు వైద్య
వృత్తి చేశాను. ఆసక్తి కొద్దీ చాలా కాలం రాజకీయ కార్య కర్తగా
పని చేశాను. సాదా సీదా మధ్య తరగతి జీవితంలో, అందరి లాగానే ఎత్తు పల్లాలు, పువ్వులూ-రాళ్లూ-రెంటి రుచీ చూశాను. మెచ్చుకున్న
వారు కొందరైతే, నొచ్చుకున్న వారు మరికొందరు. నా గొప్ప, అదృష్టం ఇటు విస్తృత కుటుంబంలోనూ, బయట సమాజంలోనూ చాలా మంది అభిమానులు వుండడం”. అని
ముగించారు.
No comments:
Post a Comment