Wednesday, October 23, 2013

"ఖమ్మం ఆదివారం సంఘం" - "సండే సిండికేట్ ఆఫ్ ఖమ్మం" : వనం జ్వాలా నరసింహారావు

భారత పౌర హక్కుల ఉద్యమానికి 
శ్రీకారం చుట్టిన అలనాటి

"ఖమ్మం ఆదివారం సంఘం" 
"సండే సిండికేట్ ఆఫ్ ఖమ్మం"

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్య సభ సభ్యుడు, సిపిఎం నాయకుడు, పౌర హక్కుల ఉద్యమానికి ఏనాడో రాష్ట్ర-దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రముఖ వైద్యుడు డా. యలమంచిలి రాధాకృష్ణమూర్తితో ఐదేళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా)

          నిన్న మొన్నటి వరకూ మన మధ్యన వున్న మాజీ రాజ్యసభ సభ్యుడు, సిపిఎం రాష్ట్ర-జాతీయ స్థాయి నాయకుడు, సామాజిక కార్యకర్త, ప్రజా వైద్యుడు, నిరీశ్వరవాది, సాహిత్యాభిలాషి, తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచే విప్లవ భావాలను అలవరచుకున్న వ్యక్తి, పౌరహక్కుల నేత, ఖమ్మం జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న "సీమాంధ్ర తెలంగాణ వాసి", డాక్టర్ యలమంచిలి రాధా కృష్ణమూర్తి గారు తన 86 వ ఏట, అక్టోబర్ 19, 2013 న హైదరాబాద్ కేర్ బంజారా ఆసుపత్రిలో మరణించారు. వివిధ కోణాలలో డాక్టర్ గారి వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చు. గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్య శీలుడు, సమర్థుడు, నిబద్ధత కల వాడు, నిశ్చల సంకల్పుడు, కమ్యూనిస్టు సదాచారం మీరనివాడు, ప్రజలకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, సాహిత్యాభిలాషి, కోపమంటే ఎరుగని వాడు, ప్రతిభావంతుడు, వృత్తిలో నిపుణుడు, ప్రవృత్తిలో అసూయ లేనివాడు, వేదికపై ఉపన్యాసం ఇస్తే వైరి వర్గాలు కూడా మెచ్చుకునే సామర్థ్యం కల వాడు, మానవ విలువలకు కట్టుబడిన వాడు, పౌర హక్కులను కాపాడగలనని నిరూపించి "షోడశ కళల" ను పుణికి పుచ్చుకున్న అరుదైన మహామనిషి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి. ఆయన జీవన యానాన్ని "అనుభవాలే అధ్యాయాలు" పేరుతో గ్రంధస్థం చేసే అవకాశం ఆయన నా కిచ్చారు. ఆ నేపధ్యంలో డాక్టర్ గారిని ఎన్నో పర్యాయాలు కలుసుకున్నాను. అలాంటి ఒక సందర్భంలో ఆయన బీజం వేసి, రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకెళ్లిన పౌర హక్కుల ఉద్యమం గురించి సంభాషించడం జరిగింది. ఆయనకిష్ఠమైన పౌర హక్కుల ఉద్యమాన్ని మరో సారి గుర్తుచేసుకునే ప్రయత్నమే ఇది.

ప్రప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ చైనా పర్యటించి పంచశీల సూత్రం పఠిస్తూనే, సోవియట్ యూనియన్ తో మైత్రీ సంబంధాలు పెంపొందించుకుంటూ వచ్చారు. చైనా-సోవియట్ దేశాలతో భారత దేశం కొనసాగిస్తున్న సత్సంబంధాలతో నిమిత్తం లేకుండానే (ఉమ్మడి) భారత కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ విధానాలను కొన్నింటిని ఘాటుగా వ్యతిరేకించేది. సోవియట్ యూనియన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా-భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్ ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని సామ్యవాద-సామ్రాజ్యవాద దేశాల మధ్య సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభి ప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారితీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్ - చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజా నిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై 1964లో సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. సోవియట్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులు, 1964 అక్టోబర్- నవంబర్ లో కలకత్తాలో సమావేశమై కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)ను ఏర్పాటు చేయగా, రెండో వర్గం వారు మరో నెల రోజులకు బొంబాయిలో సమావేశమై, తామే అసలైన కమ్యూనిస్టుల మని ప్రకటించుకున్నారు.


యుద్ధం నేపథ్యంలో చైనా వాదులుగా ముద్రపడిన భవిష్యత్ కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకులను దేశవ్యాప్తంగా పి.డి. చట్టం కింద ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అలా అరెస్ట్ అయినవారిలో, పోలిట్ బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద కూడా తీవ్రంగా పడింది. తెలంగాణ సాయుధపోరాటం కాలం నుండే ఖమ్మం జిల్లాకు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుండడంతో ఆ జిల్లాలో ముఖ్యమైన కమ్యూనిస్ట్ నాయకులందరినీ నిర్భంధించింది నాటి ప్రభుత్వం పిడి చట్టం కింద. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న రోజుల్లో, సహజంగా దాని ప్రభావం ఖమ్మం కమ్యూనిస్టుల పైన కూడా పడింది. చాలా కాలం వరకు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోక పోయినా పార్టీ నిర్ణయాలను, విధానాలను తు.. తప్పకుండా ఆజన్మాంతం అమలు జరిపిన ప్రజా వైద్యుడు, డాక్టర్. యలమంచిలి రాధాకృష్ణమూర్తి (డాక్టర్ వై.ఆర్.కె.) ఇంట్లో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే గొడుగు కింద సమావేశమై సిద్ధాంత పరమైన విషయాలను చర్చించుకునే వారు. 1961వ సంవత్సరంలో ప్రారంభమై క్రమం తప్పకుండా జరుగుతుండే ఆ సమావేశాలకు, జిల్లా సీనియర్ నాయకులైన చిర్రావూరి లక్ష్మి నరసయ్య (ఎన్నో మార్లు ఖమ్మం మునిసిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు), మంచికంటి రాం కిషన్ రావు (1983లో ఖమ్మం ఎమ్మెల్యే), 25-30 మంది పుర ప్రముఖులతో సహా పలువురు విద్యార్థి నాయకులు, యువకులు హాజరయ్యేవారు. వారందరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పంథాకు అనుకూలురే కాకుండా, పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఎం లోనే వుండిపోయారు. స్థానిక కాలేజీ విద్యార్ధి నాయకులు కూడా వస్తుండడంతో ఆ వేదిక కింద మార్క్సిజం-లెనినిజం అధ్యయన తరగతులు నిర్వహించడం కూడా జరిగేది.

ఈ నేపధ్యంలో పార్టీ చీలిపోవడం, సిపిఎం నాయకులందరూ నిర్బంధానికి గురికావడం జరిగాయి. ఇంట్లో తను స్థాపించిన మార్క్సిస్ట్ ఫోరం కింద నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న వారంతా సిపిఎం పక్షాన చేరడంతో అది తనకో నైతిక విజయంగా భావించారు డా. రాధాకృష్ణమూర్తి. పార్టీ పట్ల, సిద్ధాంతాల పట్ల సంపూర్ణ విశ్వాసమున్న డా. వై.ఆర్.కె. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి అనుకూలురైన ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులందరూ అరెస్ట్ కావడంతో వారంతా విడుదలయ్యే వరకూ పార్టీని ఏకతాటిపై నడిపిస్తూనే, ఏ విధంగా బలోపేతం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు. వారి విడుదలకెలా ప్రయత్నం చెయ్యాలన్న ఆలోచనలో భాగంగా స్థానిక అడ్వొకేట్లయిన బోడేపూడి రాధ, కె.వి.సుబ్బారావుల మద్దతు పొందారు. ఆ ముగ్గురి (మేధావుల) కలయికే భవిష్యత్ "భారత పౌర హక్కుల ఉద్యమానికి" నాంది అవుతుందని బహుశా ఆనాడు వారూ-ఎవరూ ఊహించి ఉండరు. ఆశ్చర్యకరమైన విషయం అప్పటికి, ఆ ముగ్గురు కూడా పార్టీ సానుభూతి పరులే కానీ సభ్యులు కాకపోవడం.

ముగ్గురూ వారి వారి వృత్తుల్లో నిరంతరం బిజీగా ఉండే వారు కావడంతో పార్టీ పరమైన పనికి ఎక్కువగా రాత్రి వేళలు కేటాయించేవారు. ఆపాటికే ఆదరణ పొందిన "మార్క్సిస్ట్ ఫోరం" వేదిక కార్యకలాపాలు ముమ్మరం చేసారు. అప్పట్లో వారికదో పెను సవాల్. ఒకవైపు సిపిఐ నాయకత్వమంతా (ఆ పక్షాన ఖమ్మం జిల్లాలో చేరింది అతి కొద్ది మందే అయినప్పటికీ కూడా) ఏకతాటిపై పని చేస్తూ, సిపిఎం కార్యకర్తలను తమ వైపుకు ఆకర్షించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. సిపిఐ పక్షాన జిల్లా అగ్రనాయకుల్లో ఒకరైన ఎన్. గిరి ప్రసాద్ ఉండడంతో అది మరో సవాలుగా మారింది. నిజానికి చీలికొచ్చేంత వరకూ గిరి ప్రసాద్ సిపిఎం పంథాకు అను కూలంగా ఉండేవారని అనుకునేవారు. మొత్తం మీద రెండో స్థాయి నాయకత్వం, మేధావి త్రయం మార్గదర్శకంలో చేసిన కృషి ఫలితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని పటిష్ట పరచగలిగారు. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో కాని ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండే సమావేశాలకు హాజరయ్యే వారిని ఆదివారం సంఘంగా- "సండే సిండికేట్" గా ఎద్దేవా చేస్తూ, పిలవడం జరిగేది ఓ రకమైన హేళనతో అప్పట్లో. ఇప్పటికీ ఆదివారం సంఘంతో అనుబంధమున్న వారు ఆ జిల్లాలో పలువురున్నారు.

నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావి త్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆ రోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు నచ్చ చెప్పారు మేధావి త్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్ ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను- ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్లలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పిడి యాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల కమిటి, పి.యు.డి.ఆర్, పంజాబ్ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, .ఎం.ఎస్ లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్ ఎన్.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లో ఉన్న సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావి త్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందల మంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి., సీ.పి.ఎం పార్టీ వారితో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది. సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వర రావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం పార్టీకి చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా బహిరంగ సభకు హాజరవ కూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం-డాక్టర్ వై ఆర్. కె, బోడేపూడి రాధ, కె. వి. సుబ్బారావులు.

.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్. ప్రసాద రావులను, సభ్యులుగా కర్నాటి. రామ్మోహన రావు-డాక్టర్. వై. రాధా కృష్ణమూర్తి లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్ని సభాముఖంగా బహిరంగ పరిచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాల రావులున్నారు. నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి వై. ఆర్. కె కు ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంత రావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావి త్రయం"-డాక్టర్. వై. ఆర్. కె, బోడేపూడి రాధ, కే. వి. సుబ్బారావు లను, వారితో పాటు అడ్వొకేట్ కర్నాటి రామ్మోహన రావును, రాష్ట్ర వ్యాప్తంగా వున్న దిగువ స్థాయి నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం. వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు-బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు-సభ జరిగింది. .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాల రావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది.

సరిగ్గా అదే రోజుల్లో, ఆ పాటికే అరెస్ట్ జైలు జీవితం గడుపుతూ అనారోగ్యానికి గురైన ప్రముఖ సీ.పి.ఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెరోల్ పై విడుదల చేసి, చికిత్స కొరకు సోవియట్ యూనియన్ పంపించి, కుదుట పడింతర్వాత ముషీరాబాద్ జైలుకు తీసుకొచ్చారు. ఖమ్మంలో అరెస్టయిన నలుగురినీ (వై.ఆర్.కె, బోడేపూడి రాధ, కే.వి.సుబ్బారావు, కర్నాటి రామ్మోహన రావు) కూడా ముషీరాబాద్ జైలుకే పంపారు. ఆ విధంగా వీరికి ఆపాటికే జైలులో వున్న సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి లాంటి ప్రముఖులందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మాస్కో నుండి తిరిగి వస్తూ ఢిల్లీలో ఇందిరా గాంధిని, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డిని కలుసుకుని అరెస్టులపై తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు సుందరయ్య. డాక్టర్. రాధాకృష్ణమూర్తి అరెస్ట్ విషయాన్ని ప్రశ్నించిన సుందరయ్యతో "మీకంటే అతడే ప్రమాదకరమైన వ్యక్తి" అని జవాబిచ్చాడు బ్రహ్మానంద రెడ్డి. ఆ విషయాన్ని స్వయంగా వై.ఆర్.కె కు తెలియచేసిన సుందరయ్య, పౌరహక్కుల ఉద్యమ ప్రభావం అంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని కుదిపేసినందుకు ఆయన్ను-మేధావి త్రయాన్ని అభినందించారు.

ఇక అప్పటినుంచి ఉద్యమాన్ని జైలునుంచే కొనసాగించాలని నిర్ణయించారు నాయకులందరు. న్యాయ పోరాటం చేయాలనుకొని, "హెబియస్ కార్పస్ పిటీషన్" వేయాలని భావించారు. జైల్లోనే కర్నాటి న్యాయశాస్త్రంలో పరీక్షలకు తయారయి, జైల్లో వుంటూనే రాసి, డిగ్రీ తెచ్చుకొని, భవిష్యత్ లో విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. కే. వి. సుబ్బారావు హైకోర్టును, వై ఆర్. కె, బోడేపూడి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ న్యాయవాది కన్నభీరన్ వీరికి సహాయపడేందుకు ముందుకొచ్చాడు. కే.వి. సుబ్బారావు పిటీషన్ ను హైకోర్ట్ కొట్టివేసింది. వై ఆర్. కె, బోడేపూడిల పిటీషన్ విచారణకు వచ్చినప్పుడు వారిని ఎలా ఢిల్లీకి తీసుకుపోవాలని చర్చించిన ప్రభుత్వం చివరకు తీసుకున్న నిర్ణయం వారిద్దరినీ ఆశ్చర్య పరిచింది. భద్రతా కారణాల వల్ల, ఒక సీనియర్ పోలీసు అధికారి వెంటరాగా, విమానంలో ఢిల్లీకి తీసుకుపోయి, విచారణ ముగిసేంతవరకూ వారిద్దరినీ తీహారి జైల్లో వుంచారు. అదే వారికి మొదటి విమాన ప్రయాణం. వీరు అక్కడకు చేరేటప్పటికే, అదే తీహారి జైలుకు, హెబియస్ కార్పస్ పిటీషన్ విచారణ కొరకు ప్రముఖ నాయకులైన సుందరయ్య, బసవ పున్నయ్య, . కె. గోపాలన్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బీ. టి. రణదివే, హరే కృష్ణకోనార్, నాగభూషణం పట్నాయక్ లాంటి వారందరినీ తరలించింది ప్రభుత్వం. వారందరూ ఒక ప్రణాళిక ప్రకారం అనధికారికంగా పోలిట్ బ్యూరో సమావేశం జరుపుకునేందుకు జైలుకు చేరారు!

తమ పిటీషన్ విచారణకొరకు వై. ఆర్. కె, కే. వి. సుబ్బారావులు రెండో పర్యాయం కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. తమ కేసును వారే స్వయంగా వాదించుకున్నారు. అప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయం నిర్బంధాలకు వ్యతిరేకంగా వెల్లువెత్తడంతో, ఏప్రియల్ 29, 1965 , పీ. డి చట్టం కింద అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ విషయాన్ని కోర్టుకు తెలియచేసింది. ఆ సాయంత్రమే సుందరయ్యగారిని తీహారి జైలునుంచే విడుదల చేసింది ప్రభుత్వం. ఆయనతో కలిసి హైదరాబాద్ తిరిగొచ్చిన వారిద్దరినీ ముషీరాబాద్ జైలునుంచి మర్నాడు విడుదల చేసారు. ఖమ్మం తిరిగొచ్చిన వారందరికీ, "నభూతో న భవిష్యతి" అన్న చందాన రైలు స్టేషన్ లో స్వాగతం లభించింది.

ఈ నేపధ్యంలో, చాలాకాలం తర్వాత 1982 సంవత్సరంలో, ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రాతిపదికగా-రాజకీయ, పౌర హక్కుల వేదికగా-పౌర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా, విస్తృత పరిధి పౌరహక్కుల ఉద్యమ సంస్థను నెలకొల్పాలని సుందరయ్య భావించారు. అది కేవలం సీ. పి. ఎం నాయకత్వంలో నడిచేదిగా వుండరాదని, అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో నడపాలని అనుకున్న ఆయన, ఆ బాధ్యతను డాక్టర్. రాధాకృష్ణమూర్తికి అప్ప చెప్పారు. ఎన్టీఆర్ సారధ్యంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరుగనున్న రోజులవి. వై.ఆర్.కె సంప్రదించి ఉద్యమానికి ఒప్పించిన వారిలో సీ. పి. . కి చెందిన గిరి ప్రసాద్-సురవరం సుధాకర రెడ్డి, బీ. జె. పి కి చెందిన రామారావు, జనతా పార్టీకి చెందిన బాబుల్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకుడు నాదెండ్ల భాస్కర రావులతో సహా గౌతు లచ్చన్న లాంటి ప్రముఖులెందరో వున్నారునవంబర్ 1982 లో విజయవాడలో నిర్వహించిన సదస్సుకు జస్టిస్. జీవన రెడ్డి, రఘునాధ రెడ్డి కూడా హాజరయ్యారు. రఘునాధరెడ్డిని అధ్యక్షుడుగా సుందరయ్య ప్రతిపాదించినప్పుడు, ఆయనకు ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరా గాంధి హయాంలో వున్న అనుబంధం వల్ల, కొంత వ్యతిరేకత వచ్చింది. గతం తవ్వుకోవద్దని భావించి, సుందరయ్య ప్రతిపాదనకు అందరు అంగీకరించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వై. ఆర్. కె, కార్యదర్శులుగా ఎ. పి. విఠల్, సురవరం సుధాకరరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులతో ఏ. పీ. సీ. ఎల్. ఏ పేరుతో పౌర హక్కుల ఉద్యమ సంస్థ ఆవిర్భవించింది మరో మారు. 1989 వరకూ దాని కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా సాగేవి. వార్తా బులెటిన్ కూడా వెలువడేది. దరిమిలా వై. ఆర్. కె పూర్తి స్థాయి సీ. పి. ఎం సభ్యుడయ్యారు. ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ అనంతరం రఘునాధరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చారు. పౌర హక్కుల ఉద్యమ పూర్తి బాధ్యతను నిర్వహించేవారు లేకపోవడంతో కార్యకలాపాలు ఆగిపోయినా ఏదో ఒక రూపంలో ఉద్యమం కొనసాగుతూనే వుంది.


అలనాడు "ఖమ్మం ఆదివారం సంఘం" వేసిన పునాదులపై లేచిన పౌర హక్కుల ఉద్యమం వివిధ రకాలుగా వూపందుకుంటున్నదనాలి. ప్రభుత్వాలు కూడా హక్కుల పరిరక్షణ తమ బాధ్యతగా పరిగణిస్తున్నారిటీవల కాలంలో. జాతీయ మానవ హక్కుల కమీషన్, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమీషన్లు అందులో భాగమే. ఒక విధంగా వాటి పనితీరు చాలా తృప్తికరంగా వుందనాలి. ప్రభుత్వాలు కూడా వాటి ఆదేశాలను అమలు పరుస్తున్నారు. అయినా జరగాల్సిందెంతో వుంది.

No comments:

Post a Comment