Monday, February 24, 2014

Will Kiran Start a New party and succeed?...Discussion on HMTV

Monday, February 17, 2014

అజరామరం (రడ్ యార్డ్ కిప్లింగ్) "ఇఫ్" పోయం:వనం జ్వాలా నరసింహారావు

అజరామరం (రడ్ యార్డ్ కిప్లింగ్) "ఇఫ్" పోయం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (17-02-2014)

భారతదేశంలో జన్మించి నోబెల్ బహుమతి అందుకున్న వారిలో రెండవ వ్యక్తి రడ్ యార్డ్ కిప్లింగ్.  ఆయన రచనలలో 1906 లో రాసిన "పాక్ ఆఫ్ పోక్స్ హిల్ ", 1910 లో రాసిన పద్య సంకలనం "రివార్డ్ అండ్ ఫెయిరీస్", 1905 లో రాసిన "విత్ ది నైట్ మెయిల్", 1912 లో రాసిన "యాజ్ ఈజీ యాజ్ ఎ బి సి" లాంటివి వున్నాయి. రడ్‌యార్డ్ కిప్లింగ్, బ్రిటిష్ పాలన కాలం నాటి బొంబాయి ప్రెసిడెన్సీ లో వున్న, నేటి ముంబాయి నగరంలో, 1865వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన జన్మించారు. తండ్రి జాన్‌లాక్ ఉడ్ కిప్లింగ్, తల్లి ఆలీస్. వీరిది భారతదేశంలో స్థిరపడిన ఆంగ్లేయ కుటుంబం. రడ్ యార్డ్ కిప్లింగ్‌ ని ఆరవ యేట ఇంగ్లండ్‌కు పంపించారు ఆయన తల్లిదండ్రులు. ఇంగ్లండులో ఎన్నో కష్టాలనుభవిస్తూ కిప్లింగ్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన కిప్లింగ్, అప్పటి అవిభక్త భారతదేశంలోని లాహోర్ పట్టణంలో ఒక ప్రచురణ కర్త వద్ద సహాయకుడిగా ఉద్యోగం చేశారు కొంతకాలం. క్రమేపీ రడ్ యార్డ్ కిప్లింగ్‌ రచయితగా రూపుదిద్దుకోవడం మొదలయింది. కొంతకాలం తరువాత రడ్ యార్డ్ తిరిగి లండన్‌కు వెళ్లిపోయారు. లండన్‌లో ఆయన తొలి నవల ద లైట్ దట్ ఫెయిల్డ్ ప్రచురితమైంది. రడ్ యార్డ్ కిప్లింగ్‌కు అమెరికన్ ప్రచురణ కర్త వోల్‌కాట్‌తో పరిచయం కావడం, ఆ పరిచయం స్నేహం గాను, బాంధవ్యం గాను మారడం, వోల్‍కాట్ సోదరి కారొలీన్‌ను రడ్ యార్డ్ కిప్లింగ్ వివాహం చేసుకోవడం, దరిమిలా అమెరికాలో జీవించడం మొదలయింది.

ముంబాయి లోని జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ కాంపస్‌లో ఇప్పటికీ, కిప్లింగ్ జన్మించిన ఇల్లుంది. చాలా కాలం పాటు ఆ ఇంటిని కళాశాల డీన్ వసతి గృహంగా ఉపయోగించేవారు. కిప్లింగ్ తల్లిదండ్రులు తాము ఆంగ్లో-ఇండియన్ల మని చెప్పుకునేవారు. చిన్నతనంలో తనకంటే చిన్నైన సోదరితో కలిసి ఇంగ్లాండ్ వెళ్లడం, అక్కడ వారిని వుంచుకుని చదువుసంధ్యలు నేర్పించిన సారా హోలోవే అనే మహిళ వారిద్దరినీ పెట్టిన ఇబ్బందులు కిప్లింగ్ రచనలపై ప్రభావం చూపాయి. ఆ విషయాలను ఆయన తన జీవిత చరిత్రలో కూడా పేర్కొన్నారు.


రడ్ యార్డ్ కిప్లింగ్ 

అనారోగ్యానికి గురైన కిప్లింగ్‌ తిరిగి ఇంగ్లండుకు చేరుకున్నారు. ఇంగ్లండ్‌లో రడ్ యార్డ్ కిప్లింగ్ బాలల కోసం, సైనికుల కోసం ఎన్నో రచనలు చేశారు. ఎన్నో పద్యాలు రాశారు. వాటిలో "ది సెవెన్ సీస్" అనే పద్య సంపుటి, "కెప్టెన్స్ కరేజియస్" అనే నవల ముఖ్యమైనవి. అంతకు ముందు "నౌలాహ్‌క" మోగ్లీ కథలు రాశారు. 1902లో రడ్ యార్డ్ రాసిన జస్ట్ సో కథాసంపుటి ప్రచురితమైంది. రడ్‌యార్డ్ రచనలను ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత 1907వ సంవత్సరం సాహిత్యంలో ఆయనకు నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. నోబెల్ బహుమతి గ్రహించిన తర్వాత లార్డ్ బిరుదును పొంది ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు కిప్లింగ్. ప్రతీ తరంలోనూ పిల్లలు చదువుకుని ఆనందించే కథల పుస్తకాల్లో రడ్ యార్డ్ కిప్లింగ్ "హ్యూమరస్‌ టేల్స్" ఒకటి. కిప్లింగ్‌ భారత దేశంలో ఉన్న సమయంలో అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా పిల్లలకు మంచి హాస్య రస కథలు రాశారు. వాటిలో ఆణిముత్యాల లాంటివి ఏరి కూర్చిన సంకలనం ఈ పుస్తకం. కడుపుబ్బనవ్వించే ఈ కథల పుస్తకంలో "ది టాకింగ్‌ లంగ్‌టంగ్‌పెన్‌", "మై సండే ఎట్‌ హోమ్‌", "పిగ్‌", "అల్నాషర్‌ అండ్‌ ది ఓక్సన్‌", "ది బుల్‌ దట్‌ థాట్‌", "ది మాస్టర్‌ కుక్‌", "గాలియోస్‌ సాంగ్‌", "మోతీ గుజ్‌ మ్యూటినర్‌", "మై లార్డ్ ది ఎలిఫెంట్‌" లాంటి అనేక కథలున్నాయి.

రడ్ యార్డ్ కిప్లింగ్‍ను, ప్రధానంగా, బ్రిటీష్ ఇండియాలోని సైనికుల గురించి రాసిన గేయ రచయితగా యావత్ ప్రపంచం గుర్తించింది. చిన్న-చిన్న కథలను కళాత్మకంగా రచించడంలో కిప్లింగ్ ఒక నూతన ఒరవడిని సృష్టించాడని ప్రసిద్ధి. అలానే ఆయన రచించిన అనేక కథలు బాల బాలికలను విభిన్న ధోరణిలో ఆకట్టుకునే విగా వుంటాయి. నోబెల్ బహుమతి గ్రహీతలలో ఆయనే మొట్టమొదటి ఆంగ్ల భాషా రచయిత. అత్యంత పిన్న వయసులో ఆ బహుమతిని పొందిన మొదటి వ్యక్తి కూడా కిప్లింగే. బ్రిటన్ ఆస్థాన కవిగా వుండమని ప్రభుత్వం ఆయనను కోరినప్పటికీ దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. బ్రిటీష్ వలస వాద ప్రవక్తగా సైన్స్ ఫిక్షన్ రచయిత జార్జ్ ఆర్వెల్ కిప్లింగ్‍ను  సంబోధించేవాడు.

బ్రిటీష్ ఇండియాకు తిరిగొచ్చిన కిప్లింగ్ లాహోర్ నగరంలో "సివిల్ అండ్ మిలిటరీ గెజెట్" అనే వార్తా పత్రికలో ఉద్యోగంలో చేరాడు. ఏడాది పొడుగూతా ప్రచురించబడే ఆ పత్రిక వారానికి ఆరు రోజులు మాత్రమే వెలువడేది. నాటి ఆ పత్రిక సంపాదకుడు స్టీవెన్ వీలర్ కిప్లింగ్‌కు చాలా కష్టతరమైన పనులను అప్పగించినప్పటికీ, రచనా వ్యాసంగంపై తనకున్న మక్కువను మాత్రం కొనసాగించ లేకుండా వుండలేక పోయాడు. 1886 లో కిప్లింగ్ తన మొదటి వ్యాస సంపుటి "డిపార్ట్ మెంటల్ డిట్టీస్" ను ప్రచురించాడు. ఆయన పనిచేస్తున్న పత్రిక సంపాదకుడు మారి, మరొకరు వచ్చిన తరువాత, కిప్లింగ్ కు కొంత స్వేచ్ఛ లభించింది. సంపాదకుడి ప్రోత్సాహంతో అదే పత్రికకు కథలు రాయడం మొదలుపెట్టాడు. అప్పట్లో వేసవి విడిది కోసం కిప్లింగ్ ప్రతి సంవత్సరం సిమ్లాకు వెళుతుండేవాడు. అక్కడ ఆయనకు కనిపించిన, వినిపించిన పలు ఆసక్తికరమైన విషయాలనే తన కథా వస్తువులుగా మలచుకుని, గెజెట్ పత్రికలో రాసేవాడు. గెజెట్ పత్రికలో ప్రచురితమైన కిప్లింగ్ కథలు "ప్లెయిన్ టేల్స్ ఫ్రం ద హిల్స్" పేరుతో పుస్తక రూపంగా వచ్చాయి. ఆ తరువాత అలహాబాద్ నుంచి ప్రచురితమయ్యే "ద పయనీర్" అనే పత్రికలో కొన్నాళ్లు పనిచేశాడు కిప్లింగ్. పయనీర్ లో ఉద్యోగం వదిలిన తరువాత కూడా చాలా కాలం ఆ పత్రికలో ఆయన వ్యాసాలు వస్తుండేవి. కిప్లింగ్ రాసిన "కిం" నవలంటే జవహర్లాల్ నెహ్రూకు చాలా ఇష్టం.

కిప్లింగ్ రాసిన వాటిలో అత్యంత ఆదరణ లభించింది "ఇఫ్" ఆనే గేయ కవితకు. 1895 లో ఆయన రాసిన ఈ గేయ కవిత మొట్టమొదట "రివార్డ్స్ అండ్ ఫెయిరీస్" అనే పుస్తకంలో ప్రచురించబడింది. బ్రిటీష్ వలస వాద రాజకీయ నాయకుడు లియాండర్ స్టార్ జేమ్సన్ కు నివాళి గాను, తన కుమారుడు జాన్ కు తండ్రిగా ఒక సందేశం ఇచ్చే విధంగాను కిప్లింగ్ "ఇఫ్" ను రాశాడు. మన దేశానికి చెందిన చారిత్రక కారుడు, రచయిత కుష్వంత్ సింగ్ మాటల్లో చెప్పుకోవాలంటే, ఆ గేయ కవిత, "ఆంగ్లంలో భగవద్గీత  సందేశ సారం". బోయర్ యుద్ధంలో లియాండర్ స్టార్ జేమ్సన్ విఫలం కావడంతో ఉత్తేజితుడైన కిప్లింగ్ ఆ సందేశాత్మక కవిత రాశాడు. "ఇఫ్ యు కెన్ కీప్ యువర్ హెడ్ వెన్ ఆల్ ఎబౌట్ యు ఆర్ లూజింగ్ దెయిర్స్ అండ్ బ్లేమింగ్ ఇట్ ఆన్ యు......యువర్స్ ఈజ్ ద అర్త్ అండ్ ఎవ్రీ థింగ్ దట్ ఈజ్ ఇన్ ఇట్, అండ్-విచ్ ఈజ్ మోర్-యు విల్ బి మాన్, మై సన్" అని ఆంగ్లంలో వున్న ఆ కవితకు "సంపూర్ణ మానవుడు" అన్న శీర్షికతో, ప్రేమ మాలిని తెలుగు అనువాదం ఇలా సాగుతుంది.

"తమదంతా కోల్పోతూ - దానికి నిను నిందిస్తూ,
ఆరోపణలు వేస్తున్నా - తలెత్తుకుని తిరుగు!
ఎవరికెన్ని అనుమానాలు వచ్చినా, ఆ అనుమానాలకు తావిస్తూ
కుంగి పోకుండా అలసట లేని నిరీక్షణకు అలవాటు పడుతూ
అసత్య వ్యవహారాలకు అపరిచితుడిగా వుంటూ
ద్వేషించబడుతున్నా ద్వేషానికి దూరంగా మెదులుతూ
మరీ సౌజన్యంగా, మరీ సచ్చీలంగా, మరీ వివేకంగా మెలగక
ఆత్మ విశ్వాసమే నీ ఊపిరిగా ముందుకు సాగిపో!
కలలెన్ని కంటున్నా, ఆ కలల్లోనే విహరించకు
ఆలోచించగలిగినా, ఆ ఆలోచనలనే నీ అంతిమ లక్ష్యం కానీకు
జయాపజయాలను సమతుల్యంగా పరిగణించి
నీవు పలికిన సత్యాన్ని వంచకులు అసత్యం చేసినా విని భరించు
నీ కొరకు నీవు సమకూర్చుకున్నవి తునాతునకలైనా ఓర్పు వహించు
కళా విహీనమైన జీవితాన్ని తిరిగి అందంగా మలచడానికి ప్రయత్నించు
ఓటమి ఎదుర్కొన్నా తిరిగి ఆదినుండి ఆరంభిస్తూ విజయానికి బాటలు త్రొక్కు
నీ మనసుకి ఎనలేని ధైర్యాన్నిస్తూ ఒక్కసారైనా ఓటమి ఊసెత్తకు
సామ్రాట్టులతో తిరిగినా సామాన్యులను మరవకు
ఎందరిని కలిసినా ఎందరితో మాట్లాడినా నీ గౌరవాన్ని కాపాడుకో
మనుషులందరినీ విశ్వసించినా అధికంగా ఎవరినీ నమ్మకు
జారవిడిచిన అమూల్యమైన నిమిషాన్ని తిరిగి సంపూర్ణంగా సిద్ధించుకో
అప్పుడే అవుతుంది ఈ విశ్వం సర్వం నీ సర్వస్వం
అందులోని ప్రతి అంశం నీ సొంతం
అన్నిటికన్నా అపూర్వం
సంపూర్ణ మానవునిగా నీ పునర్జన్మం!"


            జనవరి 18, 1936 న రడ్ యార్డ్ కిప్లింగ్ మరణించారు. ఆయన రచించిన "ఇఫ్" పోయం అప్పటికీ - ఇప్పటికీ పదిమంది బధ్రంగా పదిలపరచుకునే ఒక చక్కటి సందేశాత్మక గేయ కవిత అనాలి. 

Friday, February 14, 2014

నర్సాపూర్ లేస్ మార్కెటింగ్ చేసిన తిలక్:వనం జ్వాలా నరసింహారావు

నర్సాపూర్ లేస్ మార్కెటింగ్ చేసిన తిలక్
వనం జ్వాలా నరసింహారావు

ఎల్. వి. ప్రసాద్ గారు చెన్నపట్నం వెళ్ళిన తర్వాత కూడ ఇంకొంతకాలం పాటు తిలక్ బొంబాయి నగరంలో వుండిపోయారు. కారణం పెద్దగా ఏమీ లేక పోయినా ఆయన సంబంధం పెట్టుకున్న కార్యకలాపాలు ఆయన్ను అక్కడుండేలా చేశాయి. ఎట్లాగూ వుండిపోయారు కాబట్టి ఖర్చుల కొరకు మల్లిఖార్జున రావు గారి ప్రెస్‌కు ఆర్డర్లు సంపాదించడం కొనసాగించారు. ఆ సంపాదన సరిపోయేది కాదు. కె. ఎల్. ఎన్. ప్రసాద్ (ఆంధ్రజ్యోతి) సోదరుడు కానూరు రామానంద చౌదరి గారు నెలకొల్పిన దానామర్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో (ఫిల్మ్ ది కాదు) సేల్స్ బోయ్‌ గా కూడ పనిచేసేవారు. దానామర్ సంస్థ కాస్మెటిక్స్ తయారు చేయడం డిటర్జెంట్ల ఏజెంటుగా వ్యవహరించడం చేస్తూండేది. సేల్స్ బోయ్‌గా తిలక్‌ గారు బొంబాయి చుట్టు ప్రక్కల ముఫస్సల్స్ లోనూ, లోనా వాల ప్రాతంలోనూ తిరుగుతూ కాస్మెటిక్స్ డిటర్జెంట్సు వ్యాపారాన్ని అభివృద్ది చేస్తుండేవారు. అప్పట్లో బహుళ ప్రచారం పొందిన ఓ బాంబు పేలుడు సంఘటనలో (స్వాతంత్ర్య - తెలంగాణా ఉద్యమంలో భాగంగా) చౌదరిగారు ఇరుక్కునేలా చేసింది నాటి ప్రభుత్వం. అది వేరే సంగతి.

బొంబాయిలో వున్న రోజుల్లోనే, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వున్న నర్సాపూర్ ప్రాంతపు హస్త కళాకారులు తయారు చేస్తుండే ప్రపంచ ప్రఖ్యాత లేస్‌ను తిలక్ గారు అక్కడ నుండి తెప్పించుకుని మార్కెటింగ్ చేయిస్తూ అంతో ఇంతో మిగుల్చుకునేవారు. బొంబాయిలో వుండాలన్న సోషల్ అర్జ్ కు అవసరమైన ఆర్థిక వనరులు (స్వల్ప మొత్తంలోనే కావచ్చు) ఏదోవిధంగా కష్టపడి సమకూర్చుకునే తిలక్, ఏనాడూ ఒకరిపై ఆధారపడి జీవించిన వ్యక్తి కాదు.

ఎల్. వి. ప్రసాద్ గారు సినిమా షూటింగుల్లో బిజీగా వున్న సమయంలోనూ, తనకు తీరిక దొరికిన సమయంలోనూ ఎల్.వి.గారు వున్నప్పుడు, లేనప్పుడూ కూడ తిలక్ స్టూడియో లకు వెళ్తుండేవారు. అక్కడున్న వారందరూ ఆయన్ను అప్యాయంగా పలుకరించేవారట. కారణం, తాను ఎల్.వి. మేనల్లుడిని కావడం కొంతమేరకైతే, తానెప్పుడూ ఇతరులతో స్నేహంగా వుండే మనస్తత్వం కావడం కూడా కారణం అంటారాయన. అయితే సినిమా రంగానికి చెందినంత వరకు తాను ఎల్.వి.ప్రసాద్ మామయ్యకు ఏకలవ్య శిష్యుడిని మాత్రమేనని, తనకెపుడూ ఆయన ప్రత్యక్ష శిష్యరిక భాగ్యం లభించలేదనీ అన్నారు.


బొంబాయి నగరం జ్ఞాపకాలతో పాటు, తన స్వగ్రామం దెందులూరు సంగతులూ, ఏలూరు మున్సిపల్ స్కూల్లో నాటి విషయాలూ అప్పటికీ ఇప్పటికీ నెమరేసుకుంటూనే వుంటారు. తన వూరుతో తనకున్న అనుబంధం అలాంటిదంటారాయన. దెందులూరుకు మూడు మైళ్లున్న ఏలూరు మున్సిపల్ పాఠశాలలో తిలక్‌ను 1930 దశకం ఉత్తర భాగంలో మూడవ ఫారంలో చేర్పించారు వాళ్ల నాన్న వెంకటాద్రిగారు. పోనూ రానూ ఆరు మైళ్లు, తాను సైకిలు కొనేంత వరకు నడకనే చేరుకునే వాడిననీ, అయితే సైకిల్ ను స్కూల్లో చేరిన కొన్నాళ్లకే కొనడ జరిగిందనీ గుర్తుచేసుకున్నారు తిలక్. సైకిల్‌పై సాధారణంగా తను ఒక్కడే తన భోజనం క్యారియర్‌తో సహ తిరిగేవాడాయన. సైకిల్ కొన్న రోజుల్లో తొక్కడం నేర్చుకుంటూ పలుమార్లు క్రింద పడడం జరిగింది. దెబ్బలు తగిలాయట కూడా. ఆదివారం రాగానే సైకిల్‌ను ఏ పార్టుకు ఆ పార్టుకు వూడతీసి, శుభ్రంగా కడిగి, మళ్లీ ఎక్కడివక్కడ ఫిట్ చేయటం ఆయనకో సరదా. తన ఆఖరు మేనమామ, వయస్సులో తన కంటే చిన్నవాడు అయిన, సంజీవి తనతో పాటే చదువుకున్నందున, ఆయనపై వున్న అభిమానంతో తన సైకిలును తానుపయోగించిన తర్వాత పూర్తిగా ఆయన కిచ్చేసాడు తిలక్.

ఏలూరు స్కూల్లో చదువుతున్నప్పుడు తనకు డ్రిల్ నేర్పిన మాస్టర్ పహిల్వాన్ జాలయ్య, తన మేనమామలకు కూడ డ్రిల్ మాష్టరే నట. ఆ విషయం చెప్పిన జాలయ్య గారు, తన మేనమామలతో ఇసుక బస్తాల వ్యాయామం ఎలా చేయించిందీ వివరించేవారట తిలక్‌కు. ఏలూరులో చేర్చక ముందు తిలక్ గారికి ఓ ట్యూటర్‍ను నియమించారు వాళ్ల నాన్నగారు. ఆ ట్యూషన్ మాష్టారుని ప్రక్క గ్రామమైన పెదపాడునుండి పిలిపించారు. ట్యూషన్‌లో తిలక్‌తో పాటు చదివిన ఆయన కజిన్ కె.నాగేశ్వర రావు రిజర్వ్ బ్యాంక్‌ లో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తిలక్ స్కూల్ హాకీ కెప్టన్‌గా ఎన్నిక కావడమే కాకుండా అప్పుడప్పుడు ఫుట్‌బాల్ కూడ ఆడేవారట.

తన ఈడు వాళ్లతోనూ, వయస్సులో పెద్దవారితోనూ కూడా తిలక్ సరదాగా గడిపేవాడు. తమ భూముల్లో కొన్ని పడావు పడివుండి బీడు నేలలుగా తయారైనందున వూళ్లో పశువులకు ఉపయోగపడేవట అవి. ప్రతిపక్ష వర్గానికి చెందిన తమ గ్రామంలోని ఓ పెద్ద మనిషి శ్రీ కొల్లిపర సుబ్బయ్యగారి విషయం చెప్తూ ఆయనకు ముగ్గురు కొడుకులుండేవారన్నారు. పెద్ద కుమారుడు వెంకట నారాయణ వూళ్లో ఎటువంటి గొడవలు వుండ వద్దని భావించే మనస్తత్వం కలవాడట. ఆయన కూతురునే నటసామ్రాట్ పద్మభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వర రావు వివాహమాడారు. ఆమే శ్రీమతి అన్నపూర్ణగారు. సుబ్బయ్యగారి మరో కుమారుడు రామ్మోహనరావు ఆ వూళ్లోని వట పర్తి కుటుంబానికి దత్తత పోయి వట పర్తి రామ్మోహనరావుగా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత.

రామ్మోహన రావు తిలక్ మంచి మిత్రులు. స్కూలు ఎగ్గొట్టి పొలాల వెంట తిరిగేవారు. స్కూల్లో తినాల్సిన క్యారియర్ భోజనం పొలాల్లోనే తిని స్కూలు వదిలి ఇంటికి వెళ్లాల్సిన సమయంలోకెల్లా గూటికి చేరుకోనేవారు, పెద్దలకు అనుమానం రాకుండా. రామ్మోహనరావు కొడుకు ప్రసాద్ నాబార్డు బ్యాంకులో సీనియరు అధికారిగా పని చేస్తున్నట్లు తిలక్ గుర్తు చేసుకున్నారీ సందర్భంగా.

ఆ రోజుల్లో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థిగా వున్నప్పుడు తమ గ్రామంలో తాము వేసిన భక్త ప్రహ్లాద నాటకాన్ని గుర్తు చేసుకుంటూ, తానందులో నరసింహావతారం పాత్ర పోషించానన్నారు. తమ గ్రామం దెందులూరులో యూత్ లీగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ బాలానందం సంఘం స్థాపించామని అందులో శ్రీమతి అక్కినేని అన్నపూర్ణను కూడ సభ్యురాలిగా చేర్పించామని అన్నారు తిలక్. గ్రామంలో వున్న గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను కూడ యూత్ లీగ్ తరపున సేకరించేవారు. బ్రతుకు తెరువు కోసం రాస్తుండే ఈనాటి అశ్లీల సాహిత్యం మోస్తారు పుస్తకాలు వ్యతిరేకిస్తూ ఉద్యమం లేవదీశారు యూత్ లీగ్ పక్షాన. ఈ సందర్భంగా కొవ్వలి లక్ష్మి నరసింహారావుగారు లాంటి రచయితలు రాస్తుండే రోజువారీ పుస్తకాలను ఉదహరిస్తూ అవి విరివిగా రైల్వే ప్లాట్‌ ఫామ్‌ల మీద దొరికే వనీ, వాటి అమ్మకాలను వ్యతిరేకిస్తూ అరసం లాంటి ఉద్యమాలకు నాంది ఆ రోజుల్లోనే పలికా మన్నారు.


ప్రజా నాట్య మండలి, స్పూర్తితో కమ్యూనిస్టు భావాలు సంతరించుకున్న శ్రీ తిలక్ ఆదిలో తన గ్రామంలోని కమ్యూనిస్టులను వ్యతిరేకించేవారు. దానికి కారణాలున్నాయన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో బ్రిటీష్‌ వారి పంథాను పరోక్షంగా సమర్థించి హిట్లర్‌కు వ్యతిరేకంగా అగ్ర రాజ్యాల కలయికను వారు ప్రజా యుద్ధంగా చిత్రీకరించడం కూడా అందులో ఒకటి. గ్రామంలో కమ్యూనిస్టుల ఇళ్ల బయట గొళ్లాలు పెట్టేవారు. ఇల్లొదలలేకుండా తాము చేసిన అకతాయితనం గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నారాయన. ఇలా ఎందుకు చేశారంటే క్విట్ ఇండియా ఉద్యమంలో తాము పాల్గొంటున్నందున అందులో భాగంగా ఉద్యమాలు నిర్వహిస్తుండే తాము, తత్ సంబంధ నినాదాలు గోడలపై వ్రాస్తున్న తమను వారు అడ్డుకోకుండా వుండాలనే ఆలోచన తమతో అలా చేయించదని అన్నారాయన. గ్రామంలోని మహిళలు, యువతులు, అశ్లీల సాహిత్యం చదవకుండా వుండేందుకు యూత్ లీగ్ తమ వంతు కర్తవ్యంగా మంచి సాహిత్యం సేకరించి వాళ్లతో చదివించేవారు. తన ప్రక్క గ్రామం సీతంపేటలో నివసిస్తున్న కాంగ్రెస్ వాది సీతా రామస్వామి కుష్ఠు వ్యాధి గ్రస్తుడైనందున ఆయన దగ్గరకు ఎవరూ వెళ్లేవారు కాదనీ తాము అందుకు భిన్నంగా తమ యూత్ లీగ్ కార్యకలాపాలను విస్తరించి ఆయన ఇంటినుండే పని చేస్తుండేవారమని చెప్పారాయన. స్వాతంత్ర్య పూర్వపు రోజుల్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ బీహార్ భూకంప బాధితుల కుటుంబాలకు చందాలు సేకరిస్తూ తమ గ్రామం మీదుగా పోయారనీ ఆ సందర్భంగా (1939 ప్రాంతంలో) తమ జట్టు ఆయన కారు ఆపు చేసి తమతో గొంతుకలిపి బోలో స్వతంత్ర భారత్‌కి జై అనిపించామనీ గర్వంగా చెప్పుకున్నారు తిలక్. (ఇంకా వుంది)

Sunday, February 9, 2014

"పీపుల్స్ వార్" పేపర్ బాయ్ తిలక్:వనం జ్వాలా నరసింహారావు

"పీపుల్స్ వార్" పేపర్ బాయ్ తిలక్
వనం జ్వాలా నరసింహారావు

మేనమామ ఎల్. వి. ప్రసాద్ గారితో మద్రాసు చేరుకున్నప్పటికీ తిలక్ గారి మదిలో బొంబాయి జ్ఞాపకాలు, అక్కడి అనుభవాలు, అనుభూతులు అహర్నిశం మెదులుతూనే ఉన్నాయి. స్వగ్రామం దెందులూరులో స్వతంత్ర సంగ్రామానికి చెందిన కార్యకలాపాల్లో యూత్‌ లీగ్ ఆర్గనైజర్‌గా పాల్గొంటున్న తనను మేనత్త బొంబాయికి తీసుకెళ్లి మేనమామ గారి ఆలనా పాలనలో వుంచినందుకు, ఆయనకు ఎలా ఆసరాగా ఉండగలనా అని ఆలోచించేవారు ఆయన. దానికి తోడు సినీరంగంలో పట్టు సంపాదించాలన్న కోరిక ఓ వైపు, స్వాత్రంత్ర్య ఉద్యమంలో ఏదో విధంగా తన వంతు పాత్ర నిర్వహించాలన్న తపన మరో వైపు తిలక్ గారిని వేధించసాగాయి. అన్నిటికన్నా ముఖ్యమయింది కొద్దో గొప్ప తనంత తాను, దినసరి ఖర్చుల కన్నా అంతో- ఇంతో సంపాదించుకోవటం ఎలా అనేది.

బొంబాయి నగరంలోని గ్రాంట్ రోడ్ ప్రాంతంలో వున్న "ఒపేరా హౌస్" అనే సినిమా టాకీసు ఆ రోజుల్లో వామపక్ష వేదికయిన ప్రజా నాట్య మండలి సమావేశాలకు ప్రధాన కూడలి. కన్నడ, తెలుగు, హిందీ విభాగాలకు అక్కడ వేర్వేరు సెక్షన్లుండేవట. తెలుగు విభాగంలో తిలక్‌ గారు పాల్గొంటుండేవారు.

ఎల్. వి. ప్రసాద్ గారుంటున్న ఇల్లు కూడా గ్రాంట్ రోడ్డులోనే వుండేదట. ఓ బెడ్‌ రూమ్, కిచెన్, కామన్ బాత్‌రూము వున్న ఆ ఇంట్లో తిలక్ గారుండటానికి కూడా కొంత చోటుండేది. ఉండటానికైతే ఆ జాగా చాలుకాని-- దినసరి ఖర్చు మామయ్యగారిని అడగలేరు కదా! అదే సమయంలో తిలక్ గారికి పరిచయమయ్యారు కృష్ణా జిల్లా నుండి వచ్చి బొంబాయిలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటున్న మల్లిఖార్జున రావు గారనే పెద్ద మనిషి. మేనమామ ప్రసాద్ గారుంటున్న ఇంటి క్రింద భాగంలో ఉంటున్న ఓ సింధీ వ్యాపారస్తుడితో కూడా స్నేహం కుదిరింది. ఆ సింధీ వ్యాపారస్తుడు "లోటస్" అనే పేరుతో తంబోలా కూపన్‌లను అచ్చు వేయించి బొంబాయిలోని మిలిటరీ క్లబులకు అమ్ముతుండేవాడట. ఆ ప్రింటింగ్ ఆర్డరును తిలక్‌గారు చాకచక్యంగా మల్లిఖార్జునరావు గారి ప్రెస్‌కు ఇప్పించటంతో కూపన్లు అచ్చు వేసినప్పుడల్లా కొంత కమీషన్ రూపేణా ముట్టుతుండేది.


ఆ రోజుల్లోనే  ఎల్.వి.ప్రసాద్‌గారి పొరుగింటిలో, అప్పట్లో ప్రఖ్యాత సినీ కళాకారుడు, అంతో ఇంతో చెప్పుకోదగ్గ ప్లేబ్యాక్ సింగర్ డబ్ల్యు. ఎమ్. ఖాన్ ఉంటుండేవారు. ఆయన దగ్గరకు వస్తూ పోతుండే  సింధీ కమెడియన్ గోపి తో కూడ తిలక్‌కు స్నేహం అయింది. ఆ తర్వాత రోజుల్లో తిలక్ గారు సినీరంగంలో ప్రవేశించటానికి, రాణించడానికి గోపీ స్నేహం దోహదపడింది. ఎల్. వి. ప్రసాద్ గారి వద్ద తన ఏకలవ్య శిష్యరికం కూడా తోడ్పడింది - అది వేరే సంగతి. అప్పట్లో ఎల్. వి. ప్రసాద్ గారు ప్రఖ్యాత సినీ దర్శక - నిర్మాత ఎస్. ఎమ్. యూసఫ్ దగ్గర సహాయకుడిగా పనిచేసేవారట. "ఐనా", “లేడీ డాక్టర్" లాంటి కుటుంబ కథాచిత్రాలను ఎన్నో రూపొందించారు యూసఫ్.

సినీరంగంలో అప్పుడప్పుడే అడుగిడి, బిజీగా వుంటుండే ప్రసాద్‌గారికి అదనపు ఆదాయం సమకూర్చేది ఆయన బాతు గుడ్ల వ్యాపారం. ఆ వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఆయనకు ఓ స్వంత మనిషి అవసరమయ్యాడు. అది గ్రహించిన తిలక్ గారు ఆ రంగంలోకే దిగారు. స్వాతంత్ర్యోద్యమం ప్రథమ కర్తవ్యం గానూ, సినిమారంగంలోకి దిగటం ద్వితీయ కర్తవ్యం గానూ భావించిన తిలక్, బాతు గుడ్ల వ్యాపారంలోకి దిగటం యాదృచ్చికమే అయినప్పటికీ, ఆ వ్యాపారం ద్వారా బొంబాయి మహానగరంలో నివసిస్తున్న తెలుగు కార్మికులకు, కూలీలకు చేరువయ్యారు. తిలక్ సీనియర్‌గా, ప్రసాద్‌గారి బాతు గుడ్ల వ్యాపారాన్ని చూస్తున్న వ్యక్తి 'ఇమామ్'. ఆ కార్యక్రమానికి ఆయన మస్జీద్ పరిసరాలను వాడుకునేవారట. ఎక్కడి దెందులూరు పెద్దింటాయన, ఎక్కడ ఎలాంటి పనిచేయాల్సివచ్చిందో...!

కృష్ణాజిల్లా కైకలూరు నుండి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నుండి, ఇతర ప్రాంతాలనుండి బాతు గుడ్లను ఉత్పత్తిదారులు, మధ్య దళారులు బొంబాయి రైల్వేస్టేషన్‌కు చేర్చేవారు పెద్ద పెద్ద గంపల్లో, గుడ్ల బేరానికి పెద్ద పోటీ వుండేది. గంపలను చేజిక్కించుకోవడానికి కొంత చాకచక్యం కూడా చూపాల్సి వచ్చేది. గంపలను తెచ్చిన వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు ఇచ్చి, చేయి-చేయి కలిపినప్పుడు పైన రుమాలు వేసి చేతులను కప్పేవారట తిలక్‌గారు. తన చేతి వేలితో, అతని చేతి మీద సైగల ద్వారా బేరం కుదుర్చుకుని, అలా కొన్న గుడ్లను బేకరీలకు, ఇరానీ హోటళ్లకు ఉదయం పది గంటలలోపే సరఫరా చేసి పని ముగించుకునేవారు ఆ రోజుకు - ఇక ఆ తర్వాత, షరా మామూలే.

ఓ పర్యాయం గుడ్లను ఓ బజారులోని బేకరీలో అమ్ముతుండగా అకస్మాతుగా మత కలహాలు చేలరేగాయట. ఫలితంగా రెండు మూడు రోజుల వరకు అక్కడక్కడ తలదాచుకుని ఆ తర్వాత ఇంటికి చేరుకున్న తిలక్‌ను చూసి విలపించిందట ఆయన మేనత్తగారు. తల్లి కన్నా మిన్నయిన అమెగారంటే తిలక్‌గారికి ఎంతో గౌరవం.

ఇదిలా ఉండగా. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తిలక్‌గారు బాగా పాడతారన్న పేరు కూడా తెచ్చుకున్నారు. మీటింగులు ఏర్పాటు చేయటం, నిర్వహించటంలో ఆయన కార్య దక్షతను గమనించుతున్న పెద్దలు ఆయన్ను "టాస్క్ మాస్టర్" అని పిలవటం మొదలెట్టారు బొంబాయిలోని తెలుగు కార్మికులు నివసిస్తున్న వాడల్లో ఆయన గొంతెత్తి "లేవరా.. లేవరా.. కార్మికుడా..." అని పాడిన పాటను గుర్తు చేసుకున్నారు తిలక్. మీటింగులు జరుగుతున్నప్పుడు, గిట్టనివారు, ఇళ్ల చాటునుండి రాళ్లు రువ్విన సందర్భాలు ఎన్నో వున్నాయన్నారు. రాళ్ల బారి నుండి రక్షించుకోడానికి, మీటింగులకు వెళ్లేటపుడు తమ వెంట మడత కుర్చీలను తీసుకెళ్లేవారు. ఎందుకంటే వాటిని మడిచి తలపై పెట్టుకోవడానికి జవాబిచ్చారు.

కమ్యూనిస్ట్ అగ్రనాయకులైన కామ్రేడ్ బి. టి. రణదివే, విమలా రణదివే, వైద్య, అధికారి.. లాంటి వారితో పాటు కానూరు రామానంద చౌదరి (కె. ఎల్. ఎన్. ప్రసాద్ సోదరుడు), అట్లూరి జయరామ్, రమేష్ చంద్రలతో తిలక్ తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. అందరికన్నా ఆయన గొప్పగా చెప్పుకున్నది మొహనకుమారమంగళంతో తనకు ఏర్పడ్డ పరిచయం.

కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో ప్రచురిస్తుండే "పీపుల్స్ వార్" అనే పత్రికకు పేపర్‌ బోయ్‌గా పనిచేశారు తిలక్. పి. సి. జోషిగారో లేక అధికారిగారో అప్పట్లో ఆ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసేవారట. బొంబాయి కమ్యూనిస్టు పార్టీకి చెందిన సెంట్రల్ స్క్వాడ్‌లో పనిచేసే వారందరూ ఇలా ఏదో ఒక పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం ఆనవాయితీ అప్పుడు. అదో డ్యూటీగా భావించే వారందరూ. అయితే అంతో-ఇంతో పైకం కూడా లభించేది తద్వారా తిలక్‌గారికి. దాంతో తన "చాయ్" ఖర్చులు వెళ్లే వట.

అప్పట్లో మొహన్‌కుమార్ మంగళంతో ఏర్పడ్డ పరిచయం పెరిగి, ఆయన తండ్రి డాక్టర్ సుబ్బరాయన్ గారితో సాన్నిహిత్యానికి దారి తీసింది. మద్రాసులో ఆయన గారింట్లో అ తర్వాత కాలంలో అజ్ఞాత కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ పరిచయాలు ఉపయోగపడ్డాయని గుర్తుచేసుకున్నారు తిలక్.

సెంట్రల్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న రోజుల్లోనే, ప్రపంచ శాంతి సంస్థకు దీర్ఘకాలం పనిచేసిన రమేష్ చంద్రగారితో కూడా పరిచయం కలిగింది తిలక్ గారికి.

తనకు కమ్యూనిస్టు పార్టితో ఉన్న సంబంధాలను, దిన ఖర్చులకు తాను చేస్తున్న అరకొరా పనులను ఏనాడూ మేనమామ ప్రసాద్‌గారికీ, మేనత్త గారికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు తిలక్. బొంబాయి డాక్‌యార్డ్ లో తానున్న రోజుల్లో తలెత్తిన "నేవీ విప్లవం" సందర్భంగా తన వంతు పాత్రను గూడా నెమరేసుకున్నారు తిలక్.


జ్ఞాపకాల ఊపిరితో మద్రాసు చేరుకున్నాను అన్నారాయన. (ఇంకా వుంది)

Wednesday, February 5, 2014

తిలక్ జ్ఞాపకాల నేపధ్యం:వనం జ్వాలా నరసింహారావు

తిలక్ జ్ఞాపకాల నేపధ్యం
వనం జ్వాలా నరసింహారావు

దశాబ్దంన్నర క్రితం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా శ్రీమతి కుముద్‌బెన్‌జోషి పదవిలో ఉన్న రోజుల్లో, నేను రాజ భవన్‌కు చెందిన చేతన అనే స్వచ్చంద సంస్థలో పనిచేస్తున్నప్పుడు, మొట్టమొదటి సారిగా శ్రీ కె. బి. తిలక్‌ గారితో పరిచయం కాగానే, ఆయనో 'పిచ్చి మనిషి'గా అనిపించాడు. అయితే నా భావన అప్పుడూ, ఇప్పుడూ కూడా తప్పని నేనను కోవటం లేదు. తను అనుకున్నది సాధించేటంత వరకు శ్రీ తిలక్ ఓ పిచ్చివానిలాగా వ్యవహరించడం, నాటి నుండి నేటి వరకు నేనెరుగుదుఅది 'గాంధీ' సినిమా విషయంలోనూ, రాజభవన్ ప్రాంగణంలో 'డోమ్' ఇల్లు నిర్మాణం విషయంలోనూ, సినీరంగంలో పనిచేసే కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ విషయంలోనూ, సినీనటుడు కృష్ణ రాజకీయరంగ ప్రవేశం విషయంలోనూ, ఇండో-పాక్‌ మైత్రి సంబంధమైన కార్యక్రమ నిర్వహణ విషయంలోనూ.. ఇలా... ఏ విషయంలోనైనా కార్య దక్షత ఆయన సుగుణం.

అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకుడిగా శ్రీ  తిలక్ గారు చాలామందికి సుపరిచితులే. ఆయన్ను గురించి మరింత తెలుసుకోవాలని, ఓ రోజు ఉదయం 'మార్నింగ్ వాక్'లో మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ను కదిలించగా బయటపడ్డ విషయాలను పాఠకులతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆయన నోటి నుండి విన్న ఆసక్తికరమైన సంఘటనల్లో కొన్ని   పాఠకుల ముందుంచుతున్నాను

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అనే కుగ్రామంలో 'పెద్దింటివారు' అని పిలువబడే కుటుంబంలో జన్మించిన శ్రీ తిలక్ తండ్రి పేరు వెంకటాద్రిగారు. రైతు గానూ, స్వాతంత్ర్య సమరయోధుని గానూ మాత్రమే వెంకటాద్రిగారు ఆ చుట్టు ప్రక్కల గ్రామాల వారికి పరిచయం. పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వాతంత్ర్య సమరం ఉద్యమంవైపు ఆకర్షితుడైన శ్రీ తిలక్‌కు 1942 నాటి 'క్విట్ ఇండియా' మరింత స్పూర్తి వచ్చింది. రైలు పట్టాలను తొలగించటం, టెలిఫోన్ తీగెలను కత్తిరించటం, రైళ్లను ఆపు చేయటం లాంటి బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న శ్రీ తిలక్‌ను భీమడోల్‌లో 1942 ఆగస్టు/ సెప్టెంబర్ ప్రాంతంలో అరెస్టు చేసి ఏలూరు సబ్‌ జైలుకు పంపారు. ఆ తరువాత శిక్ష పడి, అది అనుభవించటానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కదిలించారు ఆయన్ను.

జైలులో తన అనుభవాలను గురించి చెప్తునప్పుడు ఆయన చలించిపోయారు, దానికి కారణం ఆయన పడ్డ బాధలు కాదు, ఇతరుల బాధలు చూడలేని పరిస్థితులో తామున్నందుకు. స్వాతంత్ర్య సమరయోధునిగా తిలక్‌ను, ఆయన సహచరులను వుంచిన సెల్, "సింపుల్ ఇంప్రిజన్‌మెంట్‌ సెల్" గా వ్యవహరించగా, వెనుక వున్న మరో దానిని "కండెమ్డ్స్ ఇంప్రిజనర్స్ సెల్" గా పిలిచేవారట. ఆ సెల్‌లో వున్న వారందరూ అచిర కాలంలో వురిశిక్షకు గురి కాబోయే పరిస్థితిని తలచుకొని భోరున విలపించటం - అందునా రాత్రిళ్లు మరీ ఎక్కువగా విలపించటం తలచుకొని శ్రీ తిలక్ వాపోయారు.


శ్రీ తిలక్ జైల్లో వున్నప్పుడు ఆయనతో శిక్ష అనుభవించిన వారిలో ఇప్పటికీ గుర్తున్న వ్యక్తుల పేర్లను ఎన్నో చెప్పారాయన. గద్దె విష్ణుమూర్తి గారి విషయం చెప్తూ, ఆయన వినాయక చవితి నాడు మట్టితో గణేశ్‌ విగ్రహం తయారు చేసిన సంగతి గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెసు పార్టీ పక్షాన ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడు అయ్యారు.

శ్రీ తిలక్ స్వగ్రామం దెందులూరు‌. "పెద్దింటివారు" గా పిలువబడే ఆయన కుటుంబం గురించీ, తాను చిన్నతనంలో గడిపిన నాటి పరిస్థితులను గురించీ, తల్చుకొని తిలక్ బాధపడ్డారు. గ్రామ పెద్దలు కొందరు, తమ స్వలాభం కొరకు, స్వార్థం కొరకు, బ్రిటిషువారి "విభజించి-పాలించు" అనే నీతిని అమలుపర్చిన తీరు ఆయనింకా మర్చి పోలేరు. హరిజనులుగా మహాత్మా గాంధీచే పిలువబడిన, తమ గ్రామంలోని కొందరిని, మాలలుగా, మాదిగలుగా విభజించి గ్రామ పెద్దలు తమ పబ్బం ఎలా గడుపుకొందీ తిలక్ వివరించారు. దుర్భరమైన జైలు జీవితంలో మరపురాని సంఘటనలు కూడా కొన్ని వున్నాయని అన్నారు శ్రీ తిలక్. తమ మూత్రాన్ని తామే కుండల్లో పట్టుకుని, జైలర్ అనుమతి ఇచ్చినప్పుడు బయట పారబోయటం, తాము తినటానికి జైలులో పెట్టేది తిన దగ్గ వస్తువుగా ఏమాత్రం అనిపించుకోని విషయం, ప్రక్క నున్న సెల్లో వారి ఆక్రందనాలు.. దుర్భరమైన సంఘటనలుగా పేర్కొన్నారు ఆయన. అయితే, తనతోపాటు జైలులో వున్న తన గ్రామానికి చెందిన హరిజనులు, తాను "పెద్దింటివారి" అబ్బాయిని అయినందున మర్యాదగా, గౌరవంగా వారు త్రాగే బీడీలను జైలువార్డెన్‌కు అమ్మి, ఆ డబ్బుతో తనకు రొట్టెలు (తిన తగినవి) తెప్పించిన విషయం చెప్పినప్పుడు శ్రీ తిలక్ కళ్లు చెమ్మగిల్లాయి. కాకపోతే, తానూ అందరి లాగానే కష్టాలు అనుభవిస్తానని, తనకి ప్రత్యేక మర్యాద వద్దనీ వారికి చెప్పానని అన్నారాయన. తాను జైల్లో వున్నప్పుడు తన తండ్రిగారి ఆస్తిని దెందులూరులో జప్తు చేయించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఆ రోజుల్లో.

రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయిన తర్వాత, జేబులో చిల్లిగవ్వ కూడా లేని తిలక్‌ గారు, కాలినడకన తన స్వగ్రామమైన దెందులూరు వెళ్లారు. ఆ తర్వాత "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని పేపర్ డిస్ట్రిబ్యూషన్ బోయ్‌గా స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తిని ప్రచారం చేసారు శ్రీ తిలక్. ముదిగొండ జగ్గన్న శాస్త్రిగారి ప్రోద్భలంతో, సహకారంతో, ప్రజా నాట్య మండలి వైపు ఆకర్షితుడైన శ్రీ తిలక్ అతివాద పంథా కళాకారుల ఉద్యమాలతో చేతులు కలిపారు. నాటకాలు వేయడం వేయించడంతో పాటు, డప్పులు మ్రోగించుతూ ప్రజా నాట్య మండలి విప్లవ గీతాలని ఆలపించుతూ గ్రామ గ్రామాన తిరిగేవారు. "పెద్దింటివాళ్ళము... తప్ప త్రాగి వచ్చి డప్పు కొట్తున్నాము... తప్పుకోండి... తప్పుకోండి" అంటూ తమ బృందం ఆ రోజుల్లో కొంటెగా ఆలపించిన జానపధాన్ని గుర్తుచేసుకుని... ఆ రోజుల్లో ప్రజల స్పందనను మననం చేసుకున్నారాయన.

మాజీ మంత్రి కీర్తిశేషులు పరకాల శేషావతారంతో పనిచేస్తూ ఆనాటి యూత్ లీగ్ కార్యకలాపాల్లో తాను, తన సహచరులు ఏ విధంగా చురుకుగా పాల్గొన్నదీ వివరించారాయన. ఇదంతా ఒక ఎత్తైతే.. ఇక అక్కడి నుండి బొంబాయి (నేటి ముంబాయి) కి, సినీ పరిశ్రమలో చేరేందుకు దారితీసిన పరిస్థితులను కూడా ఆయన నెమరువేసుకున్నారు.

విశ్వ విఖ్యాత చలన చిత్ర దర్శక, నిర్మాత స్వర్గీయ శ్రీ ఎల్.వి.ప్రసాద్‌గారికి శ్రీ తిలక్ స్వయానా మేనల్లుడు. ఆయన ఆ రోజుల్లో బొంబాయిలో వుంటుండే వారు. తిలక్‌గారి మేనత్త ఒకావిడ, ఈయన్ను వెంటేసుకుని బొంబాయికి ప్రయాణం కట్టింది. దారిలో విజయవాడ (నాటి బెజవాడ) లో రైలు మారవలసి వుంది. ఏలూరు నుండి విజయవాడ చేరుకోగానే, బొంబాయికి వెళ్లాల్సిన రైలు బయలుదేరటానికి ఇంకా కొంత ఆలస్యమున్నందున, అ కాస్త సమయం ఎందుకు వృధా చేయాలన్న ధ్యాస తిలక్‌లోని అతివాద మనస్తత్వానికి కలిగింది. వెంటనే అత్తకు చెప్పా-పెట్టకుండా, మొగల్రాజపురంలో వుంటున్న స్వర్గీయ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుగారి ఇంటికి పరుగెత్తారు శ్రీ తిలక్. గడ్డం గీసుకుంటున్న ఆయనతో కాసేపు కబుర్లు చెప్పి, అయన వద్ద నుండి బొంబాయిలోని స్వర్గీయ శ్రీపాద అమృతడాంగె గారికి తిలక్‌ను పరిచయం చేస్తూ వ్రాసిన ఓ ఉత్తరాన్ని సంపాదించుకున్నారు తిలక్. వెంటనే రాజేశ్వరరావుగారి వద్ద శెలవు తీసుకుని రైలు కదిలే సమయానికి స్టేషన్‌కు చేరుకుని, తాను రైలెక్కిన సంగతి తన మేనత్తకు తెలియకుండానే బొంబాయి చేరుకున్నారాయన. బొంబాయి రైలు స్టేషన్లో తిరిగి కలుసుకున్నారు వారిరువురూ.

బొంబాయి సినీ పరిశ్రమలో  అడుగిడిన  శ్రీ తిలక్‌లోని స్వతంత్ర సమరాభిలాష అక్కడా కొనసాగింది. ఆ నగరంలోని నాటి "పీపుల్స్ థియేటర్" లో చేరి, ప్రముఖులు బల్‌ రాజ్‌ సహానీ, రమేష్ తాపర్‌లతో సాన్నిహిత్యం సంపాదించుకున్నారప్పట్లో.


ఓ రెండేళ్ల్లు బొంబాయిలో గడిపిన అనంతరం (1943-1945) మద్రాసు (నేటి చెన్నై) కు "గృహ ప్రవేశం" అనే చలనచిత్రానికి దర్శకత్వం వహించేందుకు బయలు దేరిన ఎల్.వి.ప్రసాద్ గారితో అక్కడికి చేరుకున్నారు శ్రీ తిలక్ 1945 ప్రాంతంలో. (ఇంకా వుంది)

Sunday, February 2, 2014

అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్ అనుభవాలు-జ్ఞాపకాలు:వనం జ్వాలా నరసింహారావు

అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్
అనుభవాలు-జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు

ద్దరు దుస్తులేసుకుంటున్న ఆయన్ను కాంగ్రెసువాదన్నారు, స్వాతంత్ర్యోద్యమం రోజుల్లో ఆయన పాల్గొన్న విధానాన్ని తెలిసినవారు ఆయన్ను మార్క్సిస్టు అన్నారు. కాదు.. కాదు... ఆయనో సినిమా మనిషన్నారు మరి కొందరు. నిజానికి ఆయనకు అవన్నీ వర్తిస్తాయి. సీదా-సాదాగా తిరుగుతూ, అందర్నీ పలకరిస్తూ, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా మెసిలే ఆ వ్యక్తే శ్రీ కె.బి.తిలక్.

ఆయనో మానవతావాది. ఎక్కడ సాంఘిక దురాచారాలున్నాయో... అక్కడ వాటికి వ్యతిరేకంగా పోరాడేవారిలో ఆయన కనిపిస్తాడు. సినీ కార్మికుల బాధామయగాధలు విని వారి మంచికోసం రంగంలోకి దిగాడాయన.

ఎక్కడో.. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో 1926లో జన్మించిన శ్రీ తిలక్ పిన్న వయసులోనే.. చదువుకు స్వస్తి చెప్పి.. 1939లో స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. జైలు కెళ్లారు.
ఆయన.. ఆ తర్వాత కాలంలో స్వతంత్ర భారతావనిలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, అలాంటి ఇతివృత్తాలే కథావస్తువుగా పలు చిత్రాలను నిర్మించారు... దర్శకత్వం వహించారు. ఆదుర్తి సుబ్బారావు లాంటి ఉద్దండ సినీ దర్శకులతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సినిమాల నిర్మాణ దర్శకత్వంలో కీలక పాత్ర పోషించారు. ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఉయ్యాల జంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం, చోటీబహు, కంగన్ లాంటి చిత్రాల రూపకర్త ఆయన.

తిలక్ గారు జీవించి వున్న రోజుల్లో ఓ దశాబ్దంన్నర క్రితం ఆయన జ్ఞాపకాలను గ్రంధస్థం చేసే అవకాశం నాకు కలిగింది. అలా...ఆయన్ను గురించి ఆయన మాటల్లోనే పాఠకులకు  తెలియచేసే ప్రయత్నమే ఇది. (ఇంకా వుంది)