నర్సాపూర్ లేస్ మార్కెటింగ్ చేసిన తిలక్
వనం జ్వాలా
నరసింహారావు
ఎల్. వి. ప్రసాద్ గారు చెన్నపట్నం వెళ్ళిన తర్వాత కూడ
ఇంకొంతకాలం పాటు తిలక్ బొంబాయి నగరంలో వుండిపోయారు. కారణం
పెద్దగా ఏమీ లేక పోయినా ఆయన సంబంధం పెట్టుకున్న కార్యకలాపాలు ఆయన్ను అక్కడుండేలా
చేశాయి. ఎట్లాగూ వుండిపోయారు కాబట్టి ఖర్చుల కొరకు
మల్లిఖార్జున రావు గారి ప్రెస్‌కు ఆర్డర్లు సంపాదించడం కొనసాగించారు. ఆ సంపాదన సరిపోయేది కాదు. కె.
ఎల్. ఎన్. ప్రసాద్ (ఆంధ్రజ్యోతి)
సోదరుడు కానూరు రామానంద చౌదరి గారు నెలకొల్పిన దానామర్ అనే
డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో (ఫిల్మ్ ది కాదు) సేల్స్ బోయ్ గా కూడ పనిచేసేవారు. దానామర్ సంస్థ
కాస్మెటిక్స్ తయారు చేయడం డిటర్జెంట్ల
ఏజెంటుగా వ్యవహరించడం చేస్తూండేది. సేల్స్ బోయ్‌గా తిలక్
గారు బొంబాయి చుట్టు ప్రక్కల ముఫస్సల్స్ లోనూ, లోనా
వాల ప్రాతంలోనూ తిరుగుతూ కాస్మెటిక్స్ డిటర్జెంట్సు వ్యాపారాన్ని అభివృద్ది
చేస్తుండేవారు. అప్పట్లో బహుళ ప్రచారం పొందిన ఓ బాంబు
పేలుడు సంఘటనలో (స్వాతంత్ర్య - తెలంగాణా
ఉద్యమంలో భాగంగా) చౌదరిగారు ఇరుక్కునేలా చేసింది నాటి
ప్రభుత్వం. అది వేరే సంగతి.
బొంబాయిలో వున్న రోజుల్లోనే, ఆంధ్రప్రదేశ్
లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వున్న నర్సాపూర్ ప్రాంతపు హస్త కళాకారులు తయారు
చేస్తుండే ప్రపంచ ప్రఖ్యాత లేస్‌ను తిలక్ గారు అక్కడ నుండి తెప్పించుకుని
మార్కెటింగ్ చేయిస్తూ అంతో ఇంతో మిగుల్చుకునేవారు. బొంబాయిలో
వుండాలన్న సోషల్ అర్జ్ కు అవసరమైన ఆర్థిక వనరులు (స్వల్ప
మొత్తంలోనే కావచ్చు) ఏదోవిధంగా కష్టపడి సమకూర్చుకునే తిలక్,
ఏనాడూ ఒకరిపై ఆధారపడి జీవించిన వ్యక్తి కాదు.
ఎల్. వి. ప్రసాద్ గారు సినిమా షూటింగుల్లో బిజీగా వున్న
సమయంలోనూ, తనకు తీరిక దొరికిన సమయంలోనూ ఎల్.వి.గారు వున్నప్పుడు, లేనప్పుడూ
కూడ తిలక్ స్టూడియో లకు వెళ్తుండేవారు. అక్కడున్న వారందరూ
ఆయన్ను అప్యాయంగా పలుకరించేవారట. కారణం, తాను
ఎల్.వి. మేనల్లుడిని కావడం కొంతమేరకైతే, తానెప్పుడూ
ఇతరులతో స్నేహంగా వుండే మనస్తత్వం కావడం కూడా కారణం అంటారాయన. అయితే సినిమా రంగానికి చెందినంత వరకు తాను ఎల్.వి.ప్రసాద్ మామయ్యకు ఏకలవ్య శిష్యుడిని మాత్రమేనని, తనకెపుడూ
ఆయన ప్రత్యక్ష శిష్యరిక భాగ్యం లభించలేదనీ అన్నారు.
బొంబాయి నగరం జ్ఞాపకాలతో పాటు, తన
స్వగ్రామం దెందులూరు సంగతులూ, ఏలూరు మున్సిపల్ స్కూల్లో నాటి విషయాలూ అప్పటికీ ఇప్పటికీ
నెమరేసుకుంటూనే వుంటారు. తన వూరుతో తనకున్న అనుబంధం అలాంటిదంటారాయన.
దెందులూరుకు మూడు మైళ్లున్న ఏలూరు మున్సిపల్ పాఠశాలలో తిలక్‌ను 1930 దశకం ఉత్తర భాగంలో మూడవ ఫారంలో చేర్పించారు వాళ్ల నాన్న వెంకటాద్రిగారు.
పోనూ రానూ ఆరు మైళ్లు, తాను సైకిలు కొనేంత వరకు నడకనే
చేరుకునే వాడిననీ, అయితే సైకిల్ ను స్కూల్లో చేరిన
కొన్నాళ్లకే కొనడ జరిగిందనీ గుర్తుచేసుకున్నారు తిలక్. సైకిల్‌పై
సాధారణంగా తను ఒక్కడే తన భోజనం క్యారియర్‌తో సహ తిరిగేవాడాయన. సైకిల్ కొన్న రోజుల్లో తొక్కడం నేర్చుకుంటూ పలుమార్లు క్రింద పడడం
జరిగింది. దెబ్బలు తగిలాయట కూడా. ఆదివారం
రాగానే సైకిల్‌ను ఏ పార్టుకు ఆ పార్టుకు వూడతీసి, శుభ్రంగా
కడిగి, మళ్లీ ఎక్కడివక్కడ ఫిట్ చేయటం ఆయనకో సరదా. తన ఆఖరు మేనమామ, వయస్సులో తన కంటే చిన్నవాడు అయిన, సంజీవి
తనతో పాటే చదువుకున్నందున, ఆయనపై వున్న అభిమానంతో తన సైకిలును తానుపయోగించిన తర్వాత
పూర్తిగా ఆయన కిచ్చేసాడు తిలక్.
ఏలూరు స్కూల్లో
చదువుతున్నప్పుడు తనకు డ్రిల్ నేర్పిన మాస్టర్ పహిల్వాన్ జాలయ్య, తన
మేనమామలకు కూడ డ్రిల్ మాష్టరే నట. ఆ విషయం చెప్పిన జాలయ్య గారు, తన
మేనమామలతో ఇసుక బస్తాల వ్యాయామం ఎలా చేయించిందీ వివరించేవారట తిలక్‌కు. ఏలూరులో చేర్చక ముందు తిలక్ గారికి ఓ ట్యూటర్‍ను నియమించారు వాళ్ల
నాన్నగారు. ఆ ట్యూషన్ మాష్టారుని ప్రక్క గ్రామమైన
పెదపాడునుండి పిలిపించారు. ట్యూషన్‌లో తిలక్‌తో పాటు చదివిన
ఆయన కజిన్ కె.నాగేశ్వర రావు రిజర్వ్ బ్యాంక్ లో
ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తిలక్ స్కూల్ హాకీ
కెప్టన్‌గా ఎన్నిక కావడమే కాకుండా అప్పుడప్పుడు ఫుట్‌బాల్ కూడ ఆడేవారట.
తన ఈడు వాళ్లతోనూ, వయస్సులో
పెద్దవారితోనూ కూడా తిలక్ సరదాగా గడిపేవాడు. తమ భూముల్లో కొన్ని
పడావు పడివుండి బీడు నేలలుగా తయారైనందున వూళ్లో పశువులకు ఉపయోగపడేవట అవి. ప్రతిపక్ష వర్గానికి చెందిన తమ గ్రామంలోని ఓ పెద్ద మనిషి శ్రీ కొల్లిపర
సుబ్బయ్యగారి విషయం చెప్తూ ఆయనకు ముగ్గురు కొడుకులుండేవారన్నారు. పెద్ద కుమారుడు వెంకట నారాయణ వూళ్లో ఎటువంటి గొడవలు వుండ వద్దని భావించే
మనస్తత్వం కలవాడట. ఆయన కూతురునే నటసామ్రాట్ పద్మభూషణ్ శ్రీ
అక్కినేని నాగేశ్వర రావు వివాహమాడారు. ఆమే శ్రీమతి అన్నపూర్ణగారు.
సుబ్బయ్యగారి మరో కుమారుడు రామ్మోహనరావు ఆ వూళ్లోని వట పర్తి
కుటుంబానికి దత్తత పోయి వట పర్తి రామ్మోహనరావుగా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం
నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత.
రామ్మోహన రావు తిలక్ మంచి
మిత్రులు. స్కూలు ఎగ్గొట్టి పొలాల వెంట తిరిగేవారు. స్కూల్లో తినాల్సిన క్యారియర్ భోజనం పొలాల్లోనే తిని స్కూలు వదిలి ఇంటికి
వెళ్లాల్సిన సమయంలోకెల్లా గూటికి చేరుకోనేవారు, పెద్దలకు
అనుమానం రాకుండా. రామ్మోహనరావు కొడుకు ప్రసాద్ నాబార్డు బ్యాంకులో సీనియరు
అధికారిగా పని చేస్తున్నట్లు తిలక్ గుర్తు చేసుకున్నారీ సందర్భంగా.
ఆ
రోజుల్లో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థిగా వున్నప్పుడు తమ గ్రామంలో తాము వేసిన భక్త
ప్రహ్లాద నాటకాన్ని గుర్తు చేసుకుంటూ, తానందులో నరసింహావతారం పాత్ర
పోషించానన్నారు. తమ గ్రామం దెందులూరులో యూత్ లీగ్
కార్యకలాపాలు నిర్వహిస్తూ బాలానందం సంఘం స్థాపించామని అందులో శ్రీమతి అక్కినేని
అన్నపూర్ణను కూడ సభ్యురాలిగా చేర్పించామని అన్నారు తిలక్. గ్రామంలో
వున్న గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను కూడ యూత్ లీగ్ తరపున సేకరించేవారు.
బ్రతుకు తెరువు కోసం రాస్తుండే ఈనాటి అశ్లీల సాహిత్యం మోస్తారు
పుస్తకాలు వ్యతిరేకిస్తూ ఉద్యమం లేవదీశారు యూత్ లీగ్ పక్షాన. ఈ సందర్భంగా కొవ్వలి లక్ష్మి నరసింహారావుగారు లాంటి రచయితలు
రాస్తుండే రోజువారీ పుస్తకాలను ఉదహరిస్తూ అవి విరివిగా రైల్వే ప్లాట్ ఫామ్‌ల మీద దొరికే
వనీ, వాటి అమ్మకాలను వ్యతిరేకిస్తూ అరసం లాంటి ఉద్యమాలకు నాంది ఆ
రోజుల్లోనే పలికా మన్నారు.
ప్రజా
నాట్య మండలి, స్పూర్తితో కమ్యూనిస్టు భావాలు సంతరించుకున్న శ్రీ తిలక్
ఆదిలో తన గ్రామంలోని కమ్యూనిస్టులను వ్యతిరేకించేవారు. దానికి కారణాలున్నాయన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం
కాలంలో బ్రిటీష్ వారి పంథాను పరోక్షంగా సమర్థించి హిట్లర్‌కు వ్యతిరేకంగా అగ్ర
రాజ్యాల కలయికను వారు ప్రజా యుద్ధంగా చిత్రీకరించడం కూడా అందులో ఒకటి. గ్రామంలో కమ్యూనిస్టుల ఇళ్ల బయట గొళ్లాలు పెట్టేవారు. ఇల్లొదలలేకుండా తాము చేసిన అకతాయితనం గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నారాయన.
ఇలా ఎందుకు చేశారంటే క్విట్ ఇండియా ఉద్యమంలో తాము పాల్గొంటున్నందున
అందులో భాగంగా ఉద్యమాలు నిర్వహిస్తుండే తాము, తత్ సంబంధ నినాదాలు గోడలపై వ్రాస్తున్న
తమను వారు అడ్డుకోకుండా వుండాలనే ఆలోచన తమతో అలా చేయించదని అన్నారాయన. గ్రామంలోని మహిళలు, యువతులు, అశ్లీల సాహిత్యం చదవకుండా వుండేందుకు
యూత్ లీగ్ తమ వంతు కర్తవ్యంగా మంచి సాహిత్యం సేకరించి వాళ్లతో చదివించేవారు. తన ప్రక్క గ్రామం సీతంపేటలో నివసిస్తున్న కాంగ్రెస్ వాది సీతా రామస్వామి కుష్ఠు
వ్యాధి గ్రస్తుడైనందున ఆయన దగ్గరకు ఎవరూ వెళ్లేవారు కాదనీ తాము అందుకు భిన్నంగా తమ
యూత్ లీగ్ కార్యకలాపాలను విస్తరించి ఆయన ఇంటినుండే పని చేస్తుండేవారమని చెప్పారాయన.
స్వాతంత్ర్య పూర్వపు రోజుల్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ
రాజేంద్ర ప్రసాద్ బీహార్ భూకంప బాధితుల కుటుంబాలకు చందాలు సేకరిస్తూ తమ గ్రామం
మీదుగా పోయారనీ ఆ సందర్భంగా (1939 ప్రాంతంలో) తమ జట్టు ఆయన కారు ఆపు చేసి తమతో గొంతుకలిపి బోలో స్వతంత్ర భారత్‌కి జై
అనిపించామనీ గర్వంగా చెప్పుకున్నారు తిలక్. (ఇంకా వుంది)
No comments:
Post a Comment