అజరామరం
(రడ్ యార్డ్ కిప్లింగ్) "ఇఫ్" పోయం
వనం
జ్వాలా నరసింహారావు
సూర్య
దినపత్రిక (17-02-2014)
భారతదేశంలో
జన్మించి నోబెల్ బహుమతి అందుకున్న వారిలో రెండవ వ్యక్తి రడ్ యార్డ్ కిప్లింగ్. ఆయన రచనలలో 1906 లో రాసిన "పాక్ ఆఫ్
పోక్స్ హిల్ ",
1910 లో
రాసిన పద్య సంకలనం "రివార్డ్ అండ్ ఫెయిరీస్", 1905 లో రాసిన "విత్ ది నైట్
మెయిల్", 1912 లో రాసిన "యాజ్ ఈజీ యాజ్ ఎ బి
సి" లాంటివి
వున్నాయి. రడ్‌యార్డ్ కిప్లింగ్, బ్రిటిష్ పాలన కాలం నాటి బొంబాయి
ప్రెసిడెన్సీ లో వున్న,
నేటి ముంబాయి నగరంలో, 1865వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన
జన్మించారు. తండ్రి జాన్‌లాక్ ఉడ్ కిప్లింగ్, తల్లి
ఆలీస్. వీరిది భారతదేశంలో స్థిరపడిన ఆంగ్లేయ కుటుంబం. రడ్ యార్డ్ కిప్లింగ్ ని
ఆరవ యేట ఇంగ్లండ్‌కు పంపించారు ఆయన తల్లిదండ్రులు. ఇంగ్లండులో ఎన్నో
కష్టాలనుభవిస్తూ కిప్లింగ్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. భారతదేశానికి
తిరిగి వచ్చిన కిప్లింగ్,
అప్పటి అవిభక్త భారతదేశంలోని
లాహోర్ పట్టణంలో ఒక ప్రచురణ కర్త వద్ద సహాయకుడిగా ఉద్యోగం చేశారు కొంతకాలం.
క్రమేపీ రడ్ యార్డ్ కిప్లింగ్ రచయితగా రూపుదిద్దుకోవడం మొదలయింది. కొంతకాలం
తరువాత రడ్ యార్డ్ తిరిగి లండన్‌కు వెళ్లిపోయారు. లండన్‌లో ఆయన తొలి నవల “ద లైట్ దట్ ఫెయిల్డ్” ప్రచురితమైంది. రడ్ యార్డ్ కిప్లింగ్‌కు అమెరికన్
ప్రచురణ కర్త వోల్‌కాట్‌తో పరిచయం కావడం, ఆ
పరిచయం స్నేహం గాను,
బాంధవ్యం గాను మారడం, వోల్‍కాట్ సోదరి కారొలీన్‌ను రడ్
యార్డ్ కిప్లింగ్ వివాహం చేసుకోవడం, దరిమిలా
అమెరికాలో జీవించడం మొదలయింది.
ముంబాయి లోని జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ కాంపస్‌లో
ఇప్పటికీ,
కిప్లింగ్ జన్మించిన ఇల్లుంది. చాలా కాలం పాటు ఆ ఇంటిని కళాశాల డీన్
వసతి గృహంగా ఉపయోగించేవారు. కిప్లింగ్ తల్లిదండ్రులు తాము ఆంగ్లో-ఇండియన్ల మని
చెప్పుకునేవారు. చిన్నతనంలో తనకంటే చిన్నైన సోదరితో కలిసి ఇంగ్లాండ్ వెళ్లడం,
అక్కడ వారిని వుంచుకుని చదువుసంధ్యలు నేర్పించిన సారా హోలోవే అనే
మహిళ వారిద్దరినీ పెట్టిన ఇబ్బందులు కిప్లింగ్ రచనలపై ప్రభావం చూపాయి. ఆ విషయాలను
ఆయన తన జీవిత చరిత్రలో కూడా పేర్కొన్నారు.
రడ్ యార్డ్ కిప్లింగ్
అనారోగ్యానికి గురైన కిప్లింగ్ తిరిగి ఇంగ్లండుకు
చేరుకున్నారు. ఇంగ్లండ్‌లో రడ్ యార్డ్ కిప్లింగ్ బాలల కోసం, సైనికుల కోసం ఎన్నో రచనలు చేశారు.
ఎన్నో పద్యాలు రాశారు. వాటిలో "ది సెవెన్ సీస్" అనే పద్య సంపుటి, "కెప్టెన్స్ కరేజియస్" అనే నవల
ముఖ్యమైనవి. అంతకు ముందు "నౌలాహ్‌క" మోగ్లీ కథలు రాశారు. 1902లో రడ్ యార్డ్ రాసిన “జస్ట్ సో” కథాసంపుటి ప్రచురితమైంది. రడ్‌యార్డ్
రచనలను ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత 1907వ సంవత్సరం సాహిత్యంలో ఆయనకు నోబెల్
పురస్కారాన్ని అందజేశారు. నోబెల్
బహుమతి గ్రహించిన తర్వాత “లార్డ్”
బిరుదును పొంది ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు కిప్లింగ్. ప్రతీ తరంలోనూ పిల్లలు
చదువుకుని ఆనందించే కథల పుస్తకాల్లో రడ్ యార్డ్ కిప్లింగ్ "హ్యూమరస్
టేల్స్" ఒకటి. కిప్లింగ్ భారత దేశంలో ఉన్న సమయంలో అనేక పుస్తకాలు రాశారు.
ముఖ్యంగా పిల్లలకు మంచి హాస్య రస కథలు రాశారు. వాటిలో ఆణిముత్యాల లాంటివి ఏరి
కూర్చిన సంకలనం ఈ పుస్తకం. కడుపుబ్బనవ్వించే ఈ కథల పుస్తకంలో "ది టాకింగ్
లంగ్‌టంగ్‌పెన్",
"మై
సండే ఎట్ హోమ్",
"పిగ్", "అల్నాషర్ అండ్ ది ఓక్సన్", "ది బుల్ దట్ థాట్", "ది మాస్టర్ కుక్", "గాలియోస్ సాంగ్", "మోతీ గుజ్ మ్యూటినర్", "మై లార్డ్ ది ఎలిఫెంట్" లాంటి
అనేక కథలున్నాయి.
రడ్ యార్డ్ కిప్లింగ్‍ను, ప్రధానంగా,
బ్రిటీష్ ఇండియాలోని సైనికుల గురించి రాసిన గేయ రచయితగా యావత్
ప్రపంచం గుర్తించింది. చిన్న-చిన్న
కథలను కళాత్మకంగా రచించడంలో కిప్లింగ్ ఒక నూతన ఒరవడిని సృష్టించాడని ప్రసిద్ధి.
అలానే ఆయన రచించిన అనేక కథలు బాల బాలికలను విభిన్న ధోరణిలో ఆకట్టుకునే
విగా వుంటాయి. నోబెల్ బహుమతి గ్రహీతలలో ఆయనే మొట్టమొదటి
ఆంగ్ల భాషా రచయిత. అత్యంత పిన్న వయసులో ఆ బహుమతిని పొందిన మొదటి వ్యక్తి కూడా
కిప్లింగే. బ్రిటన్ ఆస్థాన కవిగా వుండమని ప్రభుత్వం ఆయనను కోరినప్పటికీ దానిని ఆయన
సున్నితంగా తిరస్కరించారు. బ్రిటీష్ వలస వాద ప్రవక్తగా సైన్స్ ఫిక్షన్ రచయిత
జార్జ్ ఆర్వెల్ కిప్లింగ్‍ను సంబోధించేవాడు.
బ్రిటీష్ ఇండియాకు తిరిగొచ్చిన కిప్లింగ్
లాహోర్ నగరంలో "సివిల్ అండ్ మిలిటరీ గెజెట్" అనే వార్తా పత్రికలో
ఉద్యోగంలో చేరాడు. ఏడాది పొడుగూతా ప్రచురించబడే ఆ పత్రిక వారానికి ఆరు రోజులు
మాత్రమే వెలువడేది. నాటి ఆ పత్రిక సంపాదకుడు స్టీవెన్ వీలర్ కిప్లింగ్‌కు చాలా
కష్టతరమైన పనులను అప్పగించినప్పటికీ, రచనా వ్యాసంగంపై తనకున్న
మక్కువను మాత్రం కొనసాగించ లేకుండా వుండలేక పోయాడు. 1886 లో
కిప్లింగ్ తన మొదటి వ్యాస సంపుటి "డిపార్ట్ మెంటల్ డిట్టీస్" ను
ప్రచురించాడు. ఆయన పనిచేస్తున్న పత్రిక సంపాదకుడు మారి, మరొకరు
వచ్చిన తరువాత, కిప్లింగ్ కు కొంత స్వేచ్ఛ లభించింది.
సంపాదకుడి ప్రోత్సాహంతో అదే పత్రికకు కథలు రాయడం మొదలుపెట్టాడు. అప్పట్లో వేసవి
విడిది కోసం కిప్లింగ్ ప్రతి సంవత్సరం సిమ్లాకు వెళుతుండేవాడు. అక్కడ ఆయనకు
కనిపించిన, వినిపించిన పలు ఆసక్తికరమైన విషయాలనే తన కథా
వస్తువులుగా మలచుకుని, గెజెట్ పత్రికలో రాసేవాడు. గెజెట్
పత్రికలో ప్రచురితమైన కిప్లింగ్ కథలు "ప్లెయిన్ టేల్స్ ఫ్రం ద హిల్స్"
పేరుతో పుస్తక రూపంగా వచ్చాయి. ఆ తరువాత అలహాబాద్ నుంచి ప్రచురితమయ్యే "ద
పయనీర్" అనే పత్రికలో కొన్నాళ్లు పనిచేశాడు కిప్లింగ్. పయనీర్ లో ఉద్యోగం
వదిలిన తరువాత కూడా చాలా కాలం ఆ పత్రికలో ఆయన వ్యాసాలు వస్తుండేవి. కిప్లింగ్
రాసిన "కిం" నవలంటే జవహర్లాల్ నెహ్రూకు చాలా ఇష్టం.
కిప్లింగ్ రాసిన వాటిలో అత్యంత ఆదరణ
లభించింది "ఇఫ్" ఆనే గేయ కవితకు. 1895 లో ఆయన
రాసిన ఈ గేయ కవిత మొట్టమొదట "రివార్డ్స్ అండ్ ఫెయిరీస్"
అనే పుస్తకంలో ప్రచురించబడింది. బ్రిటీష్ వలస
వాద రాజకీయ నాయకుడు లియాండర్ స్టార్ జేమ్సన్ కు నివాళి గాను, తన కుమారుడు జాన్ కు తండ్రిగా ఒక సందేశం ఇచ్చే విధంగాను కిప్లింగ్ "ఇఫ్" ను రాశాడు. మన
దేశానికి చెందిన చారిత్రక కారుడు, రచయిత కుష్వంత్ సింగ్
మాటల్లో చెప్పుకోవాలంటే, ఆ గేయ కవిత, "ఆంగ్లంలో భగవద్గీత సందేశ సారం".
బోయర్ యుద్ధంలో లియాండర్ స్టార్ జేమ్సన్ విఫలం కావడంతో ఉత్తేజితుడైన
కిప్లింగ్ ఆ సందేశాత్మక కవిత రాశాడు. "ఇఫ్ యు కెన్ కీప్
యువర్ హెడ్ వెన్ ఆల్ ఎబౌట్ యు ఆర్ లూజింగ్ దెయిర్స్ అండ్ బ్లేమింగ్ ఇట్ ఆన్ యు......యువర్స్ ఈజ్ ద అర్త్ అండ్ ఎవ్రీ థింగ్ దట్ ఈజ్ ఇన్ ఇట్, అండ్-విచ్ ఈజ్ మోర్-యు విల్ బి
మాన్, మై సన్" అని ఆంగ్లంలో వున్న
ఆ కవితకు "సంపూర్ణ మానవుడు" అన్న శీర్షికతో, ప్రేమ
మాలిని తెలుగు అనువాదం ఇలా సాగుతుంది.
"తమదంతా కోల్పోతూ -
దానికి నిను నిందిస్తూ,
ఆరోపణలు వేస్తున్నా -
తలెత్తుకుని తిరుగు!
ఎవరికెన్ని అనుమానాలు
వచ్చినా, ఆ అనుమానాలకు తావిస్తూ
కుంగి పోకుండా అలసట
లేని నిరీక్షణకు అలవాటు పడుతూ
అసత్య వ్యవహారాలకు
అపరిచితుడిగా వుంటూ
ద్వేషించబడుతున్నా
ద్వేషానికి దూరంగా మెదులుతూ
మరీ సౌజన్యంగా, మరీ సచ్చీలంగా,
మరీ వివేకంగా మెలగక
ఆత్మ విశ్వాసమే నీ
ఊపిరిగా ముందుకు సాగిపో!
కలలెన్ని కంటున్నా, ఆ
కలల్లోనే విహరించకు
ఆలోచించగలిగినా, ఆ
ఆలోచనలనే నీ అంతిమ లక్ష్యం కానీకు
జయాపజయాలను సమతుల్యంగా
పరిగణించి
నీవు పలికిన సత్యాన్ని
వంచకులు అసత్యం చేసినా విని భరించు
నీ కొరకు నీవు
సమకూర్చుకున్నవి తునాతునకలైనా ఓర్పు వహించు
కళా విహీనమైన
జీవితాన్ని తిరిగి అందంగా మలచడానికి ప్రయత్నించు
ఓటమి ఎదుర్కొన్నా
తిరిగి ఆదినుండి ఆరంభిస్తూ విజయానికి బాటలు త్రొక్కు
నీ మనసుకి ఎనలేని
ధైర్యాన్నిస్తూ ఒక్కసారైనా ఓటమి ఊసెత్తకు
సామ్రాట్టులతో తిరిగినా
సామాన్యులను మరవకు
ఎందరిని కలిసినా
ఎందరితో మాట్లాడినా నీ గౌరవాన్ని కాపాడుకో
మనుషులందరినీ
విశ్వసించినా అధికంగా ఎవరినీ నమ్మకు
జారవిడిచిన అమూల్యమైన
నిమిషాన్ని తిరిగి సంపూర్ణంగా సిద్ధించుకో
అప్పుడే అవుతుంది ఈ
విశ్వం సర్వం నీ సర్వస్వం
అందులోని ప్రతి అంశం నీ
సొంతం
అన్నిటికన్నా అపూర్వం
సంపూర్ణ మానవునిగా నీ పునర్జన్మం!"
జనవరి 18, 1936 న రడ్
యార్డ్ కిప్లింగ్ మరణించారు. ఆయన రచించిన "ఇఫ్" పోయం అప్పటికీ -
ఇప్పటికీ పదిమంది బధ్రంగా పదిలపరచుకునే ఒక చక్కటి సందేశాత్మక గేయ కవిత అనాలి.
No comments:
Post a Comment