కానీగ
(ఖాన్గీ) బడినుంచి కళాశాల వరకు..
ఒక నాటి విద్యాభ్యాసం
వనం
జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక
(02-09-2015)
ఓ ఐదారు దశాబ్దాల
క్రితం ఇప్పటి కేజీ చదువులాగానే, గ్రామాలలో నివసించే కుటుంబాలకు చెందిన చిన్న
పిల్లలకు మూడేళ్ల వయసులో అక్షరాభ్యాసం, చదువు
ప్రారంభమయ్యేది. ప్రతి గ్రామంలో ఇప్పటి ప్రీ-స్కూల్, కెజి స్కూళ్ల లాగా గ్రామాలలో కానీగ (ఖాన్గీ) బడులుండేవి. గ్రామంలో వుంటున్న
వారిలో కాస్తో-కూస్తో చదువచ్చిన వారు కానీక బడులను నిర్వహించేవారు. ఒక విధంగా వారికదో
సంపాదన కూడా. ఉదయాన్నే పిల్లలను బడికి పంపేవారు. అందరికంటే బడికి
ముందు వచ్చిన విద్యార్థికి చేతి మీద పంతులు గారు "శ్రీ" అని రాసేవారు. తరువాత వచ్చిన వారి చేయిపైన "ఒక చుక్క" పెట్టేవారు. ఇలా ఒకరి తరువాత
మరొకరు వస్తుంటే వాళ్ల చేతులపైన పెట్టే చుక్కల సంఖ్య పెరిగేది. "శ్రీ" పెట్టించు కోవడం
కోసం పరుగెత్తుకుంటూ ముందుగా బడికి చేరుకునే వారు పిల్లలు. అదో రకమైన క్రమశిక్షణ అనవచ్చు.
ఆ బడిలోనే "ఓనమాలు", "వంట్లు", "ఎక్కాలు", "కూడికలు-తీసివేతలు", "తెలుగు వారాలు", "తెలుగు మాసాలు" (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం...),
"తెలుగు సంవత్సరాలు" (ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి....రక్తాక్షి, క్రోధన, అక్షయ) లాంటివి నేర్పేవారు. నక్షత్రాలు, రాశులు, రుతువులు కూడా నేర్పేవారు. చాలావరకు కంఠస్థం చేయించేవారు. "పెద్ద బాల శిక్ష" లోని వివిధాంశాలను విశదీకరించి చెప్పేవారు. కఠిన పదాలను ఎలా పలకాలో నేర్చేవారు. అలా.... ఓ రెండేళ్లు గడిచేది. ఆ తరువాత ఆ గ్రామంలో కాని
లేదా సమీపంలో వున్న ఇతర గ్రామంలో కాని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో మొదటి తరగతిలో
పిల్లల్ని చేర్పించే వారు. సాధారణంగా ఐదేళ్ల వయస్సు
నిండిన తరువాతే మొదటి తరగతిలో చేర్పించాలి. అప్పట్లో
గ్రామాలలో పాఠశాలలు ఒక పూరి పాకలో వుండేవి. అప్పట్లో రాయడానికి పెన్నులు ఉపయోగించక
పోయేది. మొదట్లో పలకా-బలపం, తరువాత
పెన్సిల్-రబ్బర్, మరో
రెండేళ్లు గడిచిన తరువాత సిరా బుడ్డి-అందులో
ముంచి రాసేందుకు ఒక పొడగాటి కలం ఉపయోగించే వారు. సాధారణంగా ఐదో తరగతి వరకు అలాంటి
పాఠశాలలోనే చదువుకుని,
తరువాత పై తరగతులకు తాలూకా
కేంద్రానికో, లేదా జిల్లా కేంద్రానికో పంపేవారు
పిల్లల్ని. లేదా చదువు మాన్పించే వారు. నా
వరకు నేను ఖమ్మం టౌన్ లోని రికాబ్-బజార్
పాఠశాలలో ఆరో తరగతిలో చేరి, హెచ్.ఎస్.సీ
వరకు ఆరు సంవత్సరాల పాటు చదువుకున్నాను.
సినిమా
రీళ్లలాగా మా స్కూల్ విషయాలు కొన్ని గుర్తుకు వచ్చాయి. మాకు చరిత్ర-భూగోళం సబ్జెక్ట్ బోధించే పంతులు గారు
చాలా స్ట్రిక్ట్. ఈనాడు చెప్పిన పాఠాన్ని మర్నాడు అప్ప
చెప్పమనేవాడు. చెప్పని విద్యార్థులను తీవ్రంగా
దండించేవాడు. చేయిపై "పేను బెత్తం" తో కొట్టడంతో సహా, ఒక్కోసారి "కోదండం" కూడా వేయించేవాడు.
తెలుగు బోధించే మాస్టారు
నాటకాలు కూడా వేయించే వారు.
కొందరు
అన్ని సబ్జెక్ట్ లు బోధించే వారు.
ఒక మాస్టారు లెక్కలు
బోధిస్తుంటే అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుండేది. ఇక సైన్స్ మాస్టారు విషయాన్ని
విశదీకరించే పద్ధతి అమోఘం. ఆంగ్లాన్ని మాతృభాషంత సులభంగా బోధించే మాస్టారు ఒకాయన
వుండేవారు. "కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్" బ్రహ్మాండంగా చెప్పేవాడు. బహుశా ఇవ్వాళ ఇంగ్లీష్ లో అంతో-ఇంతో మంచిగా రాయగలగడానికి కారణం ఆయన
పుణ్యమే! చాలా మంది టీచర్లు లాల్చీ, ధోవతి కాని, అంగీ, ధోవతి
కాని ధరించేవారు.
అప్పట్లో
అతి కొద్ది మంది ఫస్ట్ క్లాస్ లో పాసయ్యేవారు. పరీక్షలు కఠినంగానే వుండేవి...పేపర్లు
దిద్దడం కూడా కఠినమే. హెచ్.ఎస్.సీ
పాసైన వారు ఎం.పీ.సీ
(లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు కాని, బి. పీ. సీ (జీవ, భౌతిక, రసాయన
శాస్త్రాలు) గ్రూప్ కాని,
హెచ్. జి. ఎస్ (చరిత్ర, భూగోళం, సాంఘికం) గ్రూప్ కాని, ఇ. సి. ఎ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్) గ్రూప్ కాని, తీసుకుని ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో
చేరేవారు. ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్
స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం. జీవ శాస్త్రం, చరిత్ర, ఆర్థిక
శాస్త్రం, కామర్స్ సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా
వాటిని తప్పనిసరి అనేవారు.
హెచ్.ఎస్.సీ
వరకు తెలుగు మీడియంలో (కొందరు ఉర్దూ మీడియంలో) విద్యాభ్యాసం చేసి మొట్ట
మొదటిసారిగా పి.యు.సి
లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే
మొదట్లో కొంత ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది. భౌతిక, రసాయన
శాస్త్రాలకు థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్స్ కూడా వుండేవి.
నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన
హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క
హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. వరంగల్ జిల్లాలో
వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా
ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఖమ్మానికి
చెందిన కొందరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వర్గీయ
శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు ఇచ్చిన లక్ష రూపాయలు మూలధనంతో ఖమ్మం పట్టణంలో ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ ప్రయివేట్ కళాశాల రూపుదిద్దుకోవడం
జరిగింది.
కాలేజీ
విద్యార్థిగా పి.యు.సి
లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగేది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్
స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై
పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన
శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన
శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ
గ్రూపుకు మాత్రమే వుండేది.
ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి. ఇంగ్లీష్ పాఠాలలో "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా
ఆకట్టుకునేది. తెలుగు పాఠాలలో మనుచరిత్ర, లాంటి పాఠ్యాంశాలుండేవి. ఇక జనరల్
స్టడీస్ సబ్జెక్ట్ లో వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి సిలబస్
రూపొందించే వారు. అలానే ఇతర సబ్జెక్టులు కూడా.
ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వారు.
పి.యు.సి
పాసైన వారిలో గ్రూపులో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి, ఇంజనీరింగులోనో, మెడిసిన్ లోనో సీటు లభించేది. రాని వారు బి. ఎస్సీ, బి. ఏ, బి.
కామ్ డిగ్రీ లలో చేరేవారు. అప్పట్లో ఎంట్రన్స్
పరీక్షలు లేవు. గ్రూప్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లు
ఇచ్చే వారు. నేను ఎం.పీ.సీ
గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను. డిగ్రీ మొదటి సంవత్సరం ఖమ్మంలో చదివి, ఆ
తరువాత హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో రెండో సంవత్సరంలో చేరి పూర్తి చేశాను. ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే
వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే ఫలానా డిగ్రీ, ఫలానా
ఇయర్ అని సమాధానం ఇవ్వక పోయే వాళ్లు. "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో
పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే.
చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి
ప్రమోట్ అయ్యే వాళ్లు.
సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం
ఆరు పేపర్లుండేవి.
థర్డ్ ఇయర్లో ఆప్షనల్
సబ్జెక్టులలో పరీక్షలుండేవి.
భౌతిక శాస్త్రంలో మాడరన్
ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు
మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య
మధ్య శెలవులో వుండక పోయేది.
సోమవారం పరీక్ష మొదలవుతే
మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది
గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది.
అదే విధంగా లాంగ్వేజెస్
పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.
లెక్చరర్ల
విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల
అధ్యాపకులు, ఇప్పట్లో వుండరంటే అతిశయోక్తి కాదేమో! మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర
మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు" వుండేవి. ఆంధ్ర మహాభారతోపన్యాసాలు లో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు
పద్య రూపంలో అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. ఇంగ్లీష్ పాఠ్య పుస్తకం-వాచకంగా ఇ.ఎఫ్. డాడ్ సంపాదకీయంలోని
వ్యాసాల సంకలనం వుండేది. ఎ. జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. ఇ. ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా" నాన్-డిటేల్ గా వుండేది. ఫార్ స్టర్ ఆ పుస్తకాన్ని 1924 లో భారత దేశంలో ఆంగ్లేయుల
పాలన-1920 నాటి స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో రాశారు. ప్రపంచంలోని వంద అత్యుత్తమైన ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలలో ఒకటిగా పాసేజ్
టు ఇండియాను "మాడరన్ లైబ్రరీ" ఎంపిక చేసింది. జార్జ్ హెర్బర్ట్ రాసిన "Virtue" (సద్గుణం, సత్ ప్రవర్తన) లో చక్కటి నీతి వుంది. ప్రపంచం మొత్తం కాల గర్భంలో కలిసి పోయినా మనిషి
సత్ ప్రవర్తన, సద్గుణం అజరామరంగా వుంటుందని దాని భావన. "జాన్ మిల్టన్" రాసిన "పారడైజ్ లాస్ట్", ఆయనే రాసిన మరో
పోయెం "ఆన్ హిజ్ బ్లయిండ్ నెస్", ఇంకో పోయెం కూడా గుర్తుంది. అది "విలియం వర్డ్ స్ వర్త్" రాసిన "సాలిటరీ రీపర్". జనరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ చాలా ఇంటరెస్టింగ్ గా
వుండేది.
ఆప్షనల్
సబ్జెక్టులైన లెక్కలు, భౌతిక, రసాయన శాస్త్రాలు
చెప్పే లెక్చరర్లు ఆయా విషయాలను అత్యంత ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో మేం ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మూడు పేపర్లు రాయాలి. ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". రేఖా గణితం పుస్తకం
"మాణిక్య వాచికం పిళ్లే" రాసిన దాన్ని ఉపయోగించే వాళ్లం. భౌతిక శాస్త్రంలో "మాడరన్ ఫిజిక్స్" అనే నాలుగో పేపర్
కూడా వుండేది. ప్రాక్టికల్స్ లో భాగంగా "వెలాసిటీ ఆఫ్ సౌండ్", "వర్నియర్
కాలి పర్స్", "స్క్రూ గేజ్"", ఫిజికల్
బాలెన్స్" లతో చేసిన ప్రయోగాలింకా గుర్తున్నాయి. అదే విధంగా రసాయన శాస్త్రం ప్రయోగాలలో "వాల్యూ మెట్రిక్
అనాలసిస్", "పిప్పెట్, బ్యూరెట్ట్" ఉపయోగించడం తో పాటు "కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు" తయారు చేయించడం చేసే వాళ్లం. రసాయన శాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. "ఆర్గానిక్", "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ మూడింటిని
ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. ఇప్పటికీ "బెంజిన్ రింగ్" కళ్లలో మెదులుతుంది. End