ప్రజల భాగస్వామ్యంతో గ్రామజ్యోతి
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-08-2015)
వనం
జ్వాలా నరసింహారావు
భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తుందని జాతిపిత మహాత్మాగాంధీ అంటుండేవారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడిన
నాడే, స్వాతంత్య్రానికి గుర్తింపు వుంటుంది. ఇది సాదించాలంటే, ప్రభుత్వ
పథకాలతో పాటు అట్టడుగు స్థాయిలో అమలు చేయడానికి ప్రజల భాగస్వామ్యం, మద్ధతు ఎంతైనా అవసరం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక స్వపరిపాలనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రజాస్వామ్య ప్రయోజనాలు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు స్థానిక ప్రభుత్వాలు తోడ్పడాలి.
గ్రామీణ సమాఖ్యలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, పాలన పరమైన విషయాలలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టాల్సిన
అవసరం వుంది. భారత రాజ్యాంగం గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పునాదులు వేసింది. స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని నూతన రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో పొందుపరిచారు. 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగానే వున్నాయి కాని
ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలు సాదించలేదు.
ఈ నేపధ్యంలో, మిషన్ కాకతీయ, నల్లాల ద్వారా
ఇంటింటికి నీరు, హరిత హారం, విద్యుత్ ప్రాజెక్టులు, ఏక గవాక్ష పారిశ్రామిక విధానం, పేదలకు గృహవసతి, దళితులకు భూ పంపిణీ, స్వచ్చ హైదరాబాద్, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో ప్రజోపయోగ-సంక్షేమ-అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి, అమలుకు శ్రీకారం చుట్టి, గణనీయమైన పురోగతిని సాధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు, సమగ్ర గ్రామీణాభివృద్ధి దిశగా "గ్రామ జ్యోతి" అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తాండాలతో సహా సుమారు
పదివేల గ్రామాల సామాజిక అభివృద్ధి ధ్యేయంగా రూపకల్పన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రాధమిక దశలో, గ్రామానికి చెందిన
ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా వుంచేందుకు కృషి జరుగుతుంది. దీని కొరకు ఒక్కో గ్రామానికి ఒక కోటి రూపాయల నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు
నిధులు అందుబాటులో వుంటాయి. జనాభా ప్రాతిపదికన,
ఆ నిష్పత్తిలో ఒక్కో గ్రామానికి నిధుల కేటాయింపులుంటాయి.
ఆగస్టు 15, 2015 న ప్రకటన, ఆగస్టు 17 న లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి రాబోయే నాలుగు సంవత్సరాలలో
సుమారు రు. 25, 000 కోట్లు వ్యయం చేయాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఆగస్టు 24 వరకు వారం రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు
తమ తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో, గ్రామీణాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలకు రూపకల్పన చేస్తారు. భవిష్యత్‍లో జరుగనున్న
సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఈ ప్రణాళికలు పునాదులవుతాయి. గ్రామ జ్యోతి
కార్యక్రమం తరహాలోనే పట్టణాభివృద్ధికి రాబోయే రోజుల్లో "పట్టణ జ్యోతి"
కార్యక్రమం కూడా చేపట్తామని ముఖ్యమంత్రి అన్నారు.
"గ్రామ ప్రణాళిక-గ్రామ పారిశుధ్యం" అమలు దిశగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లందరూ, తమ తమ నియోజకవర్గం
పరిధిలోని గ్రామాలలో ఏదైనా ఒక దానిని దత్తత తీసుకుని, దానిని ఆదర్శ గ్రామంగా
తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి ఆశయం. దీనికి అదనంగా, ఆ గ్రామంతో సహా జిల్లాలలో వున్న అన్ని గ్రామాల ప్రజలను, జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, ఎమ్మార్వో, ఎమ్డీవో, తదితర జిల్లా
స్థాయి-మండల స్థాయి అధికారులు, చేంజ్ ఏజెంట్లుగా వ్యవహరించి
గ్రామీణాభివృద్ధి ప్రణాళికలో ముందుండి నడిపించాలి. గ్రామీణ స్థాయి అభివృద్ధి
కమిటీల ఏర్పాటులో వాళ్లు దోహదపడాలి. గ్రామ పారిశుధ్యమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకోవడానికి
సమావేశమయ్యే గ్రామ సభతో సర్పంచ్ మమేకమై, గ్రామాభివృద్ధి లక్ష్యంగా యావత్ ప్రజల భాగస్వామ్యంతో మొత్తం గ్రామాన్ని
ముందుకు తీసుకెళ్లాలి.
గ్రామ జ్యోతి కార్యక్రమం వివరాలను అధికారులకు తెలియచేసే క్రమంలో భాగంగా
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో, పండిట్ జవహర్
లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా, ఎస్ కే డే సహకార-పంచాయతీరాజ్ శాఖల కేంద్ర మంత్రిగా వున్నప్పటి విషయాలను ప్రస్తావించారు.
ప్రజాస్వామ్యం అంటే, అట్టడుగు స్థాయి
ప్రజాస్వామ్యమేనని పదే-పదే చెప్పిన ఎస్ కే డే కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు
చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు. భారత దేశంలో
పంచాయతీరాజ్ వ్యవస్థ, సహకార వ్యవస్థ ఉద్యమ స్ఫూర్తితో
ఆవిర్భవించాయి. కాలక్రమేణా ఈ రెండూ రాజకీయ సుడిగుండంలో ఇరుక్కుపోయి భ్రష్టు
పట్టాయి. 73 వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు, విధుల విషయంలో పునరుత్తేజం కొంత మేరకు
కలిగించినప్పటికీ, చాలా రాష్ట్రాలలో అనుకున్న సత్ఫలితాలను సాధించలేక
పోయాయనే అనాలి. ఈ వుద్యమాలకు మళ్లీ జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎస్ కే డే,
జవహర్ లాల్ నెహ్రూల కలయిక గురించి ఆసక్తికరమైన విషయం వెల్లడించారు
ముఖ్యమంత్రి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో నెహ్రూ అమెరికా పర్యటనకు
వెళ్లినప్పుడు, ఐసన్ హోవర్ సలహా మేరకు, అప్పట్లో గ్రామీణ అమెరికా విభాగంలో పనిచేస్తున్న ఎస్ కే డే ను మధ్యాహ్న
భోజనానికి ఆహ్వానించిన నెహ్రూ, గ్రామాల అభివృద్ధికి
సంబంధించిన అనేక విషయాలను ఆయన నుంచి తెలుసుకున్నారు. స్వదేశానికి వచ్చి
జాతీయాభివృద్ధిలో భాగస్వామి కమ్మని కోరారు నెహ్రూ.
అప్పట్లో ప్రధమ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన జరగడం, అందులో పారిశ్రామికాభివృద్ధికి అత్యంత
ప్రాధాన్యత ఇవ్వడం గురించి ప్రస్తావించిన ఎస్ కే డే, భవిష్యత్
ప్రణాళికలలో పేదలకు భూమి పంపిణీ, విద్య, అక్షరాస్యత, అంటరానితనం నిర్మూలనకు అధిక ప్రాధాన్యత
ఇవ్వాలని నెహ్రూకు సూచించారు. భారత దేశానికి తిరిగి వచ్చిన
వెంటనే మంత్రి మండలిలో, కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో,
అఖిలభారత కాంగ్రెస్ కమిటీలో చర్చించి, దరిమిలా
తదనంతరం రూపొందించిన ప్రణాళికలలో ఎస్ కే డే సూచనలను పొందుపరిచారు. ఆ విధంగా ఆనాడు
నీటి పారుదల ప్రాజెక్టులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూపకల్పన
జరగడం, వాటిని నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా పేర్కొనడం
జరిగింది. ఈ విషయాలను తెలుసుకున్న ఎస్ కే డే
స్వదేశానికి తిరిగి రావడం, ఆయనను నెహ్రూ రాజ్యసభ సభ్యుడు గాను, తరువాత కేంద్ర సహకార-పంచాయితీరాజ్ మంత్రి గాను చేయడం జరిగింది.
గ్రామీణాభివృద్ధిని నెహ్రూ పూర్తిగా డే చేతుల్లో పెట్టారు. డే కు ప్రియాతి
ప్రియమైన కార్యక్రమం కమ్యూనిటీ డెవలప్‌మెంట్. కేంద్ర మంత్రిగా, హైదరాబాద్ లోని జాతీయ
గ్రామీణాభివృద్ధి సంస్థలో, కొంతకాలం వున్న ఎస్ కే డే, పంచాయితీరాజ్ సంస్థల విస్తరణకు కృషి చేశారు. పంచాయితీరాజ్ ఉద్యమానికి శ్రీకారం
చుట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా, షాద్ నగర్ లో మొట్టమొదటి సారిగా పంచాయితీరాజ్ కు అక్టోబర్ 14, 1959, విజయదశమి పర్వ దినాన
అంకురార్పణ జరిగింది.
ఈ నేపధ్యంలో, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్
బలపడాల్సింది పోయి, రాజకీయాలకు ఆలవాలమై పోయాయి. గ్రామం కేంద్రంగా అభివృద్ధి జరగడానికి వున్న
మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. దురదృష్టవశాత్తు, గ్రామాభివృద్ధిలో కీలక
పాత్ర పోషించాల్సిన గ్రామ సర్పంచులు తమ స్వగ్రామంలో నివసించడం కూడా మరిచిపోయారు.
మండలమంతా తిరిగి అభివృద్ధిని పర్యవేక్షించాల్సిన మండలాధ్యక్షుడు మండల కేంద్రానికి
కూడా వెళ్లే పరిస్థితుల్లో లేడు. మండలానికి, జిల్లా పరిషత్‌కు వారధిలాగా వ్యవహరించాల్సిన జడ్ పీ టీ సీ సభ్యుడు ఆ పనిని
సక్రమంగా నెరవేర్చడం లేదు. క్షేత్ర స్థాయిలో అవసరాలకు అనుగుణంగా ప్రజలను
భాగస్వామ్యం చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ జరగడం లేదనాలి. వరంగల్ జిల్లా గంగిదేవిపల్లి, నిజామాబాద్ జిల్లా
అంకాపూర్ లాంటి గ్రామాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు, కరీంనగర్ జిల్లా ముల్కనూరు సహకార వ్యవస్థకు మంచి ఉదాహరణలుగా, ఆదర్శ గ్రామాలుగా
నిలుస్తాయి. వీటిని చూసి ఇతరులు ఎందుకు నేర్చుకోకూడదు? ఇక్కడ అభివృద్ధి
సాధ్యమైనప్పుడు ఇతర గ్రామాలలో ఎందుకు సాధ్యపడదు? మనం నివసించే గ్రామాలను మనమే ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు? గ్రామాలలో శాశ్వత
ఆస్తులను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఏ గ్రామానికి వెళ్లినా కనిపించేది, ఎవరికీ పట్టని ఒక వాతావరణం. దీని నుంచి బయట పడాలి. ప్రజలు తమ సంఘటిత శక్తిలోని
బలమేంటో గుర్తించాలి. ఏ గ్రామం ఎలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలో నేర్పించాలి.
పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రజలే సారధులుగా వుండాలి. ఇక వ్యక్తిగా
ఫలితాలను సాధించగల చాలామంది, కలిమిడిగా విఫలం కాకుండా సంఘటితంగా పని చేయాలి. గ్రామాల ప్రణాళికలను తయారు చేయడంలో, బడ్జెట్
రూపొందించుకోవడంలో, నిధులను ఖర్చు చేసే విషయంలో జిల్లా కలెక్టర్లు గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీ టీసీలకు, మండలాధ్యక్షులకు సరైన
అవగాహన కలిగించాలి. పాలనాపరంగా, ఆర్థికంగా-నిధుల రూపేణా, ప్రభుత్వం సహాయం అందించినప్పటికీ, ప్రజల భాగస్వామ్యంతోనే అనుకున్న ఫలితాలు సాధ్యమనే విషయం వారికి తెలియాలి. అదే గ్రామ జ్యోతి
లక్ష్యం.
73 వ రాజ్యాంగ
సవరణ గ్రామ సభ ఏర్పాటు గురించి దానికున్న అధికారాలను గురించి తెలియచేస్తుంది.
చట్టం ప్రకారం, రాష్ట్ర స్థాయిలో చట్ట సభలు ఎలాంటి అధికారాలను కలిగి వుంటాయో, అలాంటి అధికారాలనే
గ్రామ సభ కూడ కలిగి వుంటుంది. అలాంటి గ్రామ సభ ప్రాముఖ్యతను గ్రామ జ్యోతి
గుర్తించింది. గ్రామంలోని ప్రతి వ్యక్తి గ్రామ సభలో పాల్గొనాలని ముఖ్యమంత్రి
కోరుకుంటున్నారు. గ్రామస్థులతో పాటు, ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులందరూ, జిల్లా మంత్రితో సహా, జడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లందరూ విధిగా గ్రామ సభల్లో పాల్గొనాలి. రాబోయే ఐదేళ్లకు ప్రణాళికలు
రూపొందించాలి. వీటితో పాటు గ్రామ పారిశుధ్యం, చెత్త తొలగించడం, పురాతన బావులను పూడ్చటం లాంటి కార్యక్రమాలను కూడా గ్రామ సభలో చర్చించాలి.
స్థానిక సంస్థల ద్వారా వివిధ పధకాలకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా అభివృద్ధి
కనిపించకపోవడం దురదృష్టం. గ్రామ జ్యోతి అంటే కేవలం గ్రామాలకు నిధులు కేటాయించడం
మాత్రమే కాదు. ప్రతి పౌరుడు చైతన్యమై గ్రామాల అభివృద్ధిలో భాగస్వామి కావాలి. గ్రామం
అంటే ఎవరికీ సంబంధం లేదనే భావన తొలగాలి. ఎవరింటి కోసం వాళ్లు ప్రణాళికలు
వేసుకున్నట్లే, ఎవరి గ్రామానికి వాళ్లే ప్రణాళికలు వేసుకోవాలి. గ్రామాలకు అవసరమైన మౌలిక
సదుపాయాలను కలిగించే బాధ్యత ప్రభుత్వానిదైనప్పటికీ, ఏ సదుపాయం అవసరమో ప్రజలే నిర్ణయించాలి.
గ్రామ జ్యోతి
అందరిది. గ్రామం మొత్తం కదిలితే సాధించనిదేదీ లేదు. సంఘటిత శక్తితో, ముఖ్యమంత్రి ఆశయం
మేరకు ముందుకు సాగాలి. End
No comments:
Post a Comment