కేజీ
నుంచి పీజీ వరకు
ఉచిత
నిర్బంధ విద్య అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం
వనం
జ్వాలా నరసింహారావు
అందరికీ విద్య దిశగా అడుగులు
నమస్తే తెలంగాణ (03-09-2015)
నమస్తే తెలంగాణ (03-09-2015)
కుల మత భేదాలకు అతీతంగా, ధనిక-పేద అనే తేడా లేకుండా,
అందరూ ఒకే చోట వుండి చదువుకునే విధంగా, ఆంగ్ల
మాధ్యమంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, నిర్బంధ విద్యా
విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులేస్తోంది.
నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణాలో, ఎన్నికల
ప్రణాళికలో చేసిన వాగ్దానానికి అనుగుణంగా, కేజీ నుంచి పీజీ
దిశగా విద్యా నమూనాను రూపొందించే దిశగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చర్యలు
చేపట్టారు. విద్యావ్యవస్థలో సంస్కరణలపై దృష్టిసారించారు. బాల-బాలికలందరికీ
ఒకే తరహా పాఠశాలల్లో, ఒకే రకమైన పరిస్థితుల్లో, విద్యా బోధన జరిగేట్లు చూడడమే ఈ విద్యా విధానం ప్రధానోద్దేశం. దురదృష్ట
వశాత్తు, కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాభిలాషతో,
రాజకీయ-వ్యక్తిగత కారణాలతో, ఈ విధానాన్ని
విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే గొప్పవాళ్లం అవుతాం అనే ధోరణిలో
వుంది వీరి వ్యవహార శైలి. ముఖ్యమంత్రి ప్రతిపాదించి అమలు చేయదల్చుకున్న ఈ విద్యా
విధానం ఆరంభించి ముందుకు సాగాలంటే, ప్రధానంగా కావాల్సింది,
ఆంగ్ల భాషలో చక్కటి ప్రావీణ్యం వున్న ఉపాధ్యాయులు. ఒక విధంగా
విశ్లేషించి చూస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న సాంఘిక
సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలవుతున్న విద్యా విధానం కొంత మేరకు ఈ పథకానికి
చేరువలో వుందనొచ్చు.
రాష్ట్రంలో ఒక సరికొత్త విద్యావిధానం రూపుదిద్దుకోవలనేది ముఖ్యమంత్రి
ఆకాంక్ష. ఆయన మాటల్లో చెప్పాలంటే, మొత్తం విద్యా వ్యవస్థను
నాలుగు భాగాలు చేసి,
పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి
విద్యను ప్రాధమిక విద్యగా,
ఇతర
వాటిని, సాంకేతిక
విద్యగా, వైద్య విద్యగా, వ్యవసాయ విద్యగా
విభజించాలి.
వైద్య విద్య మినహా మిగిలినవన్నీ విద్యా శాఖ నోడల్ ఏజెన్సీగా, ఒకే గొడుగు కింద
పనిచేస్తే ఫలితాలు బాగుంటాయనేది ముఖ్యమంత్రి భావన. ఇదిలా వుండగా, ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, తదితర విభాగాలకు
రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలల ఆవశ్యకత వుందా
అనే విషయం ఆలోచించాలి. ఆ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థికి సరైన అభ్యాసం జరుగుతుందా
లేదా అనేది ముఖ్యం. అందరికీ ఒకే రకమైన విద్య, వసతి, సౌకర్యాలు కల్పించాలి. విద్యా శాఖ నిర్ణయించిన, ఒకే రకమైన సిలబస్ అన్ని
పాఠశాలల్లో అనుసరిస్తే మంచిది. ఇంకో విషయం...ఈ పాఠశాలలకు
రకరకాల పర్యవేక్షణ వ్యవస్థలు వుండాల్సిన అవసరం వుందా అనేది. ఉదాహరణకు, గిరిజన సంక్షేమ శాఖ
చేయాల్సిన పనులెన్నో వుండగా,
పలు
సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారించకుండా, దానికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించడం ఎంతవరకు సబబు? అన్ని రకాల
రెసిడెన్షియల్ పాఠశాలలను ఒకే ఏజెన్సీ పర్యవేక్షణలో, ఒకే గొడుగు కింద తేవడం మంచిదని ముఖ్యమంత్రి అభిప్రాయం.
కేజీ
టు పీజీ విద్యావిధానంలో భాగంగా,
బాల-బాలికలకు ఎనిమిది
సంవత్సరాల వయసు పూర్తైన తరువాతే,
అంటే, నాలుగో తరగతి పాసైన అనంతరం మాత్రమే, రెసిడెన్షియల్ పద్ధతి ద్వారా, హాస్టల్లో వుంటూ విద్యనభ్యసించాలి.
నాలుగో తరగతి వరకు తల్లిదండ్రుల సంరక్షణలోనే వుండి, దానికి
అనుగుణంగా, గ్రామ-లేదా వారుండే నివాస ప్రాంతం
స్థాయిలోనే విద్యా బోధన జరగడం శ్రేయస్కరం. ఆ తరువాతే ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన
విద్యనందించాలనేది సీఎం అభిప్రాయం. ప్రస్తుతం అమల్లో వున్న విద్యా విధానంలో, ఐదవ తరగతి నుంచి, ఒక్కో ఏడాది గడుస్తుంటే, ఒక్కో తరగతి ఉపసంహరించుకోవడం
జరుగుతుంది. అంటే,
నూతన విద్యా విధానంలో, ఐదవ తరగతిలో చేరిన విద్యార్థి, పదవ తరగతిలో ప్రవేశించడానికి, ఆరేళ్లు పడుతుంది. ఇలా కొన సాగుతుంటే, ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనుకూలంగా, ఏటేటా పదవీ విరమణ చేసే ఉపాధ్యాయుల
సంఖ్యను అంచనా వేసి,
వారి స్థానంలో ఆంగ్లంలో
ప్రావీణ్యం వున్న వారిని తీసుకుంటే మంచిది.
కేజీ
టు పీజీ విద్యా విధానం పటిష్ఠంగా అమలు కావడానికి హాస్టల్ల నిర్వహణ విధానంలో కూడా
గణనీయమైన మెరుగుదల కనిపించాలి. ఒక్కో మెట్టు ఎక్కి, పై
తరగతులకు వెళ్లే విద్యార్థులకు,
ఒక్కో గదిలో నలుగురు కంటే
మించకుండా ప్రత్యేక గదులను కేటాయించాలి. ఏ తరగతి నుంచి ప్రత్యేక గదులను కేటాయించడం
మంచిదో అధ్యయనం చేయాలి. ప్రస్తుతం వివిధ రకాల సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర
వ్యాప్తంగా సుమారు 3270 హాస్టల్లు వున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు వీటిల్లో వుండి
చదువుకుంటున్నారు. ఒక్కో హాస్టల్లో ఒక్కో మెనూ అవలంభించడమే కాకుండా, పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం లేదు.
గ్రాముల చొప్పున కాకుండా..
ప్రతి విద్యార్థికి కడుపు
నిండా, ఎవరు ఎంత తింటే అంత అన్నం పెట్టాలని, భోజనం వడ్డించడానికి బఫే పద్ధతి
అనుసరించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణాలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా
వున్నప్పటికీ, వారికి కేటాయించిన హాస్టల్లు మాత్రం
తక్కువే. ప్రతి జిల్లాలో మైనారిటీల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్లు ఏర్పాటు చేస్తే మంచిదని
ముఖ్యమంత్రి భావన. చాలా మంది మైనారిటీకి చెందిన బాలికలు కొంత వరకే చదివి మధ్యలో ఆపు
చేస్తున్నారు. ప్రత్యేక వసతి కలిగిస్తే వారు పై చదువులు కొనసాగించడం సాధ్య
పడుతుంది. అలానే ప్రతి నియోజక వర్గంలో దళిత బాలికలకు కూడా ప్రత్యేక హాస్టల్
ఏర్పాటు చేస్తే మంచిది.
కేంద్ర
ప్రభుత్వ నిధులతో ఆరంభించి,
దరిమిలా నిధుల కేటాయింపును
నిలుపుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహణ
బాధ్యతను అప్పగించిన ఆదర్శ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 668 వున్నాయి. వీటిల్లో
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరుగుతోంది. వీటితో పాటు అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు
కూడా రాష్ట్రంలో వున్నాయి. వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తేవాలనేది ముఖ్యమంత్రి
అభిప్రాయం. సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నంతలో మెరుగ్గా నడుస్తున్నాయని, స్వల్ప మార్పులు అవసరమైతే చేసుకుని, అదే నమూనాలో రాష్ట్రవ్యాప్తంగా
ఇప్పుడున్న 668 కి తోడు మరో 522 స్కూల్‌లను ప్రారంభించి, మొత్తం 1190 రెసిడెన్షియల్ స్కూల్లు ఏర్పాటు
చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ విధంగా, రాష్ట్రంలో
ఉన్న 119 నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి సగటున 10 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు అవుతాయి. ఈ
పాఠశాలలో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన
విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలనేది ముఖ్యమంత్రి ఆశయం. ప్రస్తుతం వున్న 668 మోడల్ స్కూల్‌లను, శాసన సభ నియోజక వర్గాల వారీగా, సమతుల్యం పాటించే విధంగా పంపిణీ
జరగాలి. అదే విధంగా,
12వ తరగతి తరువాత కూడా ఈ
విద్యార్థులు ఏయే కోర్సులు ఎంచుకుంటున్నారు? వారికి
ఎలాంటి విద్య, వసతి సౌకర్యాలు కల్పించాలి? అనే దానిపై ఓ సమగ్ర విధానం
రూపొందించాలి.
సమాజానికి
అవసరమయ్యే సేవలకు అనుగుణంగా,
సాంకేతిక విద్యా విధానంలో
కూడా మార్పులు రావాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పలు
ఇంజనీరింగ్ కళాశాలలకు తోడు,
ఐటిఐ లు, పాలీ టెక్నిక్ కాలేజీలు కూడా
వున్నాయి. వీటిల్లో చదువు పూర్తి చేసుకుని క్వాలిఫికేషన్ సంపాదించుకున్న వారిలో
ఎందరు సరైన ఉపాధి పొందుతున్నారనేది ప్రశ్నార్థకమే! వీటికి సంబంధించిన గణాంకాలు
సరిగ్గా లేవు. వాస్తవానికి,
ఐటిఐ లాంటి సంస్థలను కూడా, లేబర్ డిపార్ట్ మెంట్ పరిధిలోంచి
తీసేసి, సాంకేతిక విద్యా శాఖే నిర్వహించాలని
సీఎం చెప్పారు. తెలంగాణ సమాజంలో విద్యనభ్యసించడమంటే, చదువు పూర్తి చేసుకున్న ప్రతివారు
గౌరవ ప్రదమైన జీవనం గడపడమే. వాళ్లకు అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించగలగాలి.
ఇంజినీరింగ్ పూర్తిచేసి,
సరైన ఉద్యోగ అవకాశాలు లేక
చాలామంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు హోంగార్డులుగా, సెక్యూరిటీ
గార్డులుగా, ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తుండటం సిగ్గు
చేటైన విషయం. ఈ పరిస్థితి మారాలి. చాలామంది చాలీచాలని ఉద్యోగాలు చేస్తూనో, అసలు ఉద్యోగాలు లేకుండా వుంటేనో, ఇంకా ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షల
ఆవశ్యకత వుందా అని కూడా ఆలోచించాలి.
వైద్య
విద్యా విధానాన్ని కూడా విశ్లేషించి చూడాల్సిన అవసరం వుంది. చదువంటే కేవలం
మెడిసిన్, ఇంజినీరింగ్ మాత్రమే అనే భావన పోవాలని
ముఖ్యమంత్రి అన్నారు. సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని
ఎలా తయారు చేయాలి?
అనే విషయంపై విద్యా శాఖకు
అవగాహన ఉండాలి. ఏ వృత్తిలో ఎంతమంది అవసరం? అనే
విషయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కోర్సులు తీసుకురావాలి. సమాజానికి అవసరమైన
నర్సులు, ఉపాధ్యాయులు, మానవ వనరులను పెంపొందించే వారు, ప్రణాళికలు రూపొందించే వారు, కళాకారులు, మెకానిక్‌లు, రాజకీయ-రాజకీయేతర నాయకులు...ఇలా ఎన్నో
రకాల వ్యక్తులను తయారు చేయాల్సిన బాధ్యత కూడా విద్యా శాఖదే. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో వివిధ స్థాయిలలో
ఎన్నిక కావాల్సిన సుమారు 20,
000 మందికి పైగా భవిష్యత్ తరం
ప్రజాప్రతినిధులకు సరైన నాయకత్వ లక్షణాలు అలవరచుకునే రీతి విద్యా విధానం తయారు
కావాలి. ఏ తరగతి నుంచి ఇలాంటి విద్యా బోధన జరగాలనేది ఆలోచించాలి.
ప్రస్తుతం
ఉన్న డిగ్రీ కోర్సులు ఉద్యోగావకాశాలను పెంచేలా ఉండాలని సీఎం కేసీఆర్
అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎలాంటి
ఉద్యోగావకాశాలున్నాయో గుర్తించి,
వాటికి అనుగుణమైన కోర్సులను
డిగ్రీలో ప్రవేశపెట్టాలి. విద్యార్థులకు కూడా దీనిపై అవగాహన కలిగించాలి. పోటీ
పరీక్షలంటే కేవలం ఐ ఏ ఎస్,
ఐ పీ ఎస్ లాంటి పబ్లిక్
సర్వీస్ కమిషన్లద్వారా వచ్చే ఉద్యోగాలేనన్న భావన పట్టభద్రుల్లో నెలకొంది. ఇది
సరైంది కాదు. దేశవ్యాప్తంగా,
ప్రపంచ వ్యాప్తంగా ఇంకా అనేక
ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు గుర్తించేలా చేయాలి.
డిగ్రీ పూర్తయిన తరువాత చాలా మంది యువకులు ఖాళీగానే ఉంటున్నారు. అలా ఉండకుండా
డిగ్రీ చదువుతుండగానే తరువాత ఏం చేయాలనే విషయంపై వారికి స్పష్టత వచ్చేలా చేయాలి. రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల నిర్వహణను
మరింత సమర్థవంతంగా నిర్వహించాలి. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో తెలుగు, లేదా ఉర్దూ భాషను సెకండ్ లాంగ్వేజ్‌గా
ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండాలని కూడా ముఖ్య మంత్రి చెప్పారు. ఆంగ్ల మాధ్యమంలో చదివినప్పటికీ తమ
మాతృ భాష అయిన తెలుగు,
లేదా ఉర్దూ భాషపై పట్టు
కోల్పోకుండా ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది.
అంతిమంగా....విద్యా
విధానంలో ఈ మార్పులన్నీ చోటు చేసుకోవడం అంటే...ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా
ఆంగ్ల మాధ్యమంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యా విధానాన్ని అమలు పరచడమే. End
No comments:
Post a Comment