దిగ్విజయంగా
ముఖ్యమంత్రి
పది రోజుల చైనా పర్యటన
వనం
జ్వాలా నరసింహారావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి
అమలుపరుస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తద్వారా
సాధిస్తున్న బహుముఖ అభివృద్ధి, ముఖ్యంగా పారిశ్రామిక రంగ
పురోగతి, దేశ-విదేశీ వ్యక్తులను, సంస్థలను
ఆకర్షిస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఐనప్పటికీ, విధానాల
రూపకల్పనలో తనదంటూ ఒక ప్రత్యేక పంథాను అనుసరించడం వల్ల ప్రపంచం తెలంగాణా వైపు చూసే
పరిస్థితి వచ్చింది. పలు విదేశీ సంస్థలు తమ దేశాన్ని సందర్శించవలసిందిగా
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును
ఆహ్వానిస్తూ అభ్యర్థనలు వస్తున్నాయి. అలాంటి వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది,
ప్రపంచ ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి పరిచే ధ్యేయంతో ఏర్పాటైన
స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) పంపిన
ఆహ్వానం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9 నుండి 10 వరకు,
చైనా ప్రభుత్వ సహకారంతో, ఆ దేశంలోని దాలియాన్ నగరంలో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే
"న్యూ ఛాంపియన్స్-2015" వార్షిక సదస్సులో ప్రత్యేక అతిధిగా పాల్గొనాల్సిందిగా, ముఖ్యమంత్రికి
ఆ వేదిక మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్
జులై నెల చివరి వారంలో ఒక లేఖ రాసారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథంలో
దూసుకుపోతోందని ఆ లేఖలో ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రపంచ వ్యాప్తంగా వున్న బహుళ జాతి
సంస్థలు, ప్రభుత్వాధినేతల ప్రతినిధులు, మీడియా, అకాడమీ, పౌర సమాజాలకు చెందిన 90
దేశాల నుంచి వచ్చే సుమారు 1,500 మంది ప్రముఖులు హాజరయ్యే ఆ సదస్సులో నూతన ఆవిష్క్లరణలు, శాస్త్ర-సాంకేతిక అంశాలపై చర్చ జరుగుతుందని
ఆ లేఖలో రాసారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దే విధంగా వేగంగా పురోగమిస్తున్న భావితరాల
వారికి 2015 లో
అద్భుత ఫలితాలను సాధించిన ప్రగతి సాధకులు దిశా నిర్దేశం చేయడానికి ఉద్దేశించిన
సదస్సు అది. తదనుగుణంగా, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం
అద్వితీయంగా అభివృద్ధివైపు పరుగు లేస్తున్న కారణాలను సదస్సులో పాల్గొనేవారికి
తెలియచేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్
రోస్లర్ పేర్కొన్నారు. అదేవిధంగా మౌలిక
సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణ, తదితర
అంశాలపై ముఖ్యమంత్రి వెలిబుచ్చే అభిప్రాయాలు సదస్సులో పాల్గొనేవారికి ఉపయోగకరంగా
వుంటాయని కూడా లేఖలో వుంది. ముఖ్యమంత్రి తన వెంట ఉన్నత స్థాయి వ్యాపార బృందాన్ని
కూడా తీసుకురావాలని వారు కోరారు. ముఖ్యమంత్రి వారు పంపిన ఆహ్వానానికి అంగీకారం
తెలిపారు. సదస్సుకు హాజరవుతామని తెలియచేశారు. భారతదేశం నుంచి ఈ ఏడాది ఆహ్వానం
అందుకున్న ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్
రావు మాత్రమే. ఈ
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా, కేవలం ఓ ముఖ్యమంత్రిగానే
కాకుండా సంపూర్ణ భారతీయుడిగా కేసీఆర్ వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు
అందుకున్నది.
ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానాన్ని అంగీకరించిన ముఖ్యమంత్రి 16 మంది సభ్యులతో కూడిన
ప్రతినిధుల బృందంతో కలిసి సెప్టెంబర్ 7 న పది రోజుల చైనా, హాంగ్ కాంగ్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన
చైనా పర్యటన ప్రధాన లక్ష్యం సెప్టెంబర్ 9 న దాలియాన్ లో జరిగే న్యూ ఛాంపియన్స్ వార్షిక సదస్సుకు హాజరవడం. పర్యటనలో భాగంగా చైనా దేశంలోని దాలియాన్, షాంఘై, బీజింగ్, షెన్‍జెన్, హాంగ్
కాంగ్ నగరాలలో
అనేక పారిశ్రామిక సంబంధిత కార్యక్రమాలలో-సదస్సులలో పాల్గొనడానికి, ద్వైపాక్షిక సమావేశాలకు హాజరవడానికి, పర్యాటక ప్రాముఖ్యత వున్న ప్రాంతాలను
సందర్శించడానికి అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ముఖ్యమంత్రి
చైనా పర్యటనకు వస్తున్న విషయం,
ఆయన డాలియన్ తో సహా ఇతర ప్రదేశాలకు వెళ్తున్న
విషయం, అవన్నీ ప్రధానంగా పరిశ్రమలకు
పెట్టుబడులను ఆహ్వానించేందుకేనన్న విషయం తెలుసుకున్న కొందరు చైనా పారిశ్రామిక వేత్తలు, కొన్ని సంస్థలు, వారుండే ప్రాంతాలకు కూడా రావాల్సిందిగా
ముఖ్యమంత్రిని కోరారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది, చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇన్టర్‍నేషనల్
ట్రేడ్ (సీసీపీఐటి) కు చెందిన షెన్‍జెన్ కౌన్సిల్ అధ్యక్షుడు వైఇ జియండే నుంచి
వచ్చిన ఆహ్వానం. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన, భారతదేశంతో
సహా విదేశీ మార్కెట్ లలో పెట్టుబడులు పెట్టేందుకు షెన్‍జెన్ కు చెందిన అనేక
వ్యాపార సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. ఆ సంస్థల ప్రతినిధులతో
చర్చలు జరిపేందుకు,
అభిప్రాయాలను పంచుకునేందుకు, సెప్టెంబర్ 14 న సీఎం షెన్‍జెన్ పర్యటన
సందర్భంగా ఆయన తన ప్రతినిధుల బృందంతో కలిసి, కౌన్సిల్
కు రమ్మని కోరారు
జియండే. ఆయన ఆహ్వానాన్ని
ముఖ్యమంత్రి అంగీకరించి తన షెడ్యూల్‌లో దానిని చేర్చారు.
షెడ్యూల్ ప్రకారమే పది రోజుల పర్యటనలో భాగంగా
చైనాలోని దాలియాన్, షాంఘై, బీజింగ్, షెన్‍జెన్, హాంగ్ కాంగ్ నగరాల్లో పర్యటించారు. పలు పారిశ్రామిక వాడల్లో కలియతిరిగారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు
జరిపారు. ఆ దేశంలోని ప్రముఖ పర్యాటక
ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు.
చైనా చేరుకున్న మరుసటి రోజు, సెప్టెంబర్ న, చైనాలోని ప్రముఖ బహుళ జాతి సంస్థ లియో గ్రూప్ సంస్థ చైర్మన్ లియో వాంగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ తో డాలియన్ లో సమావేశమయ్యారు. తెలంగాణలో వెయ్యి
కోట్ల రూపాయలతో భారీ సైజు పైపుల తయారీ కేంద్రాలను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం
చేశారు. ఆ తరువాత లియోనింగ్ ప్రాంతంలోని 30 కంపెనీల ప్రధాన కార్య నిర్వాహక అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలు, తమ కంపెనీల పరిస్థితిని పరస్పరం చర్చించుకున్నారు. ఇరు బృందాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలానే, చైనాలో భారత రాయబారి
అశోక్ కె కాంతా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. చైనాలో పరిస్థితిని, చైనా కంపెనీల శక్తి, సామర్థ్యాలను, తెలంగాణలో పెట్టుబడులు పెట్టే స్థోమత వున్న కంపెనీల వివరాలను
ముఖ్యమంత్రికి తెలియచేశారు.
మూడవ రోజు పర్యటనలో భాగంగా, సెప్టెంబర్ 9 న, న్యూ ఛాంపియన్స్ వార్షిక సదస్సుకు హాజరవడానికి ముందుగా, ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యు.టి.ఎఫ్) వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు క్లాజ్ స్కావబ్ తో ముఖ్యమంత్రి ఉదయం పూట
సమావేశమయ్యారు. వారివురి సమావేశం అనంతరం కొద్దిసేపట్లో జరుగనున్న
వార్షిక సదస్సు ఆసియా ఖండంలోనే అతి పెద్ద సదస్సు గాను, "సమ్మర్ దావోస్" గాను పలువురు అభిప్రాయ
పడతారు. 30 నిమిషాల పాటు జరిగిన వారి సమావేశంలో, వరల్డ్ ఎకనమిక్ ఫోరం
లక్ష్యాలు, ఉద్దేశాలపై చర్చించారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులకుండే అవకాశాలను, సానుకూలతలను ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ నగరానికున్న
ప్రాముఖ్యతను వివరించారు సీఎం. వచ్చే ఏడాది ఫోరమ్ సదస్సు హైదరాబాద్ లో
నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్కావబ్ ను కోరారు. దీనికి ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చింది.
తెలంగాణాలో అమల్లో వున్న
సింగిల్ విండో పారిశ్రామిక విధి విధానాలను, అదెలా ఇతర పాలసీలకంటే అత్యున్నతమైంది
అనే విషయాన్ని, అది అమల్లోకి వచ్చిన తరువాత కేవలం మూడు నెలల వ్యవధిలో ఏ విధంగా కొత్తగా 56 పారిశ్రామిక సంస్థలు
సుమారు రు. 12,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయో అనే సంగతిని క్లాజ్
స్కావబ్ కు సీఎం వివరించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామిక
వేత్తలకు నిర్ణీత సమయంలో-15 రోజుల లోపే, అనుమతులు పొందే హక్కును కలిగిస్తుందని సీఎం ఆయనకు
చెప్పారు. భారత దేశంలో సాంఘిక-ఆర్థిక అధునాతన ఒరవడులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ
రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని స్కావబ్
అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ద్వారా స్కావబ్ చూపుతున్న చొరవకు, ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై
పడుతున్న పద్ధతికి తాను ముగ్దుడనైనానని సీఎం అన్నారు.
స్కావబ్ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి హిడ్లే
స్కావబ్ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా
సమాజానికి ఉపయోగపడే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు స్కావబ్
ఫౌండేషన్ తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సామాజిక స్పృహ కలిగిన పారిశ్రామిక వేత్తను ఏడాదికి ఒకరి చొప్పున ఫౌండేషన్
ఎంపిక చేసుకుని ప్రోత్సహిస్తున్నది. తెలంగాణలో సామాజిక
పారిశ్రామిక వేత్తలు, సంస్థలు చాలా పనిచేస్తున్నాయని, ఏడాదికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కోరారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సదస్సు
ఉదయం పూట సెషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. పట్టణాభివృద్ధి-సవాళ్లు అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి హైదరాబాద్
అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను, తన వ్యూహాలను
వెల్లడించారు. చైనాలోని ముఖ్య నగరాలైన గాంగ్జో, యువి తదితర నగరాల మేయర్లు ఈ చర్చలో పాల్గొన్నారు. తెలంగాణాలో నగరాల అభివృద్ధికి వారి అనుభవం, నైపుణ్యం తమకు
ఉపయోగపడేందుకు వారి సహాయం కావాలని సీఎం కోరారు.
సాయంత్రం
సెషన్ లో ‘ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్’ అనే అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సదస్సులో మాట్లాడారు. భారత దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లభించని ఇటువంటి అరుదైన
అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకోవడమే కాకుండా, ఒక రాజనీతిజ్ఞుడిగా, మహా
పాలనా దక్షుడిగా, సంపూర్ణ భారతీయుడిగా ఆయన వ్యవహరించిన తీరు
సర్వత్రా ప్రశంసలు అందుకున్నది. సంపన్న దేశాలుగా చలామణి అవుతున్న అభివృద్ధి చెందిన
చాలా దేశాలు ఇటీవలి కాలంలో ఆర్థిక ఒడి-దుడుకులు ఎదుర్కొంటున్న నేపధ్యంలో, అభివృద్ధి చెందుతున్న కొన్ని వర్థమాన ఆర్థిక వ్యవస్థలు దిక్కుతోచని
స్థితిలో ఉన్నాయి. ఏ మార్గాన్ని అనుసరించాలో అర్థంకాని పరిస్థితిలో
వున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా అదే మాదిరి అయోమయంలో
పడిపోవటంతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సు
నిర్వహించారు.
ముఖ్యమంత్రి సదస్సులో మాట్లాడుతూ, పర నింద, ఆత్మస్తుతి నిండుగా ఉండే రాజకీయ నాయకుల సహజ ప్రసంగాలకు పూర్తి భిన్నంగా
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చైనా సదస్సులో తన అభిప్రాయాలను
వెల్లడించారు. నిండైన భారతీయ పౌరుడిగా, ఆర్థిక వ్యవస్థలపై సంపూర్ణ అవగాహనతో, దేశాభివృద్ధి
ప్రణాళికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చక్కని ఆలోచనతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు వివరిస్తూనే
ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా
చెప్పారు. ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు అయోమయంలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం అలా లేదని, నిలకడైన ఆర్థికాభివృద్ధితో ముందుకు పోతున్నదని సగర్వంగా ప్రకటించారు. భారతదేశ ఫెడరల్ స్పూర్తిని కూడా వివరించారు. ఆయన మాటల్లో...ఆయన ప్రసంగం..ఇలా సాగింది.
‘‘భారత దేశంలో రాష్ట్రాలది చాలా కీలకమైన పాత్ర. ఈ విషయాన్ని
గమనించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చాలా విధులు, నిధులు, అధికారాలు, బాధ్యతలు అప్పగించింది. గతంలో ఉండే ప్రణాళిక సంఘం స్థానంలో రాష్ట్రాలకు ఎక్కువ భాగస్వామ్యం
కలిగిస్తూ నీతి అయోగ్ అనే వ్యవస్థ ఏర్పాటైంది. ప్రధాన మంత్రి
అధ్యక్షుడుగా ఉండే నీతి అయోగ్ లో ముఖ్యమంత్రులంతా సభ్యులు. దీన్ని మేము టీమ్ ఇండియాగా పిలుస్తున్నాము. మేమంతా కలిసి దేశ
స్థూలాభివృద్ధికి, అదే సందర్భంలో రాష్ట్రాల పురోగతికి కావాల్సిన
కార్యాచరణను రూపొందిస్తాం. సమాఖ్య తరహా వ్యవస్థ కలిగిన భారత దేశం లాంటి
దేశాల్లో రాష్ట్రాలది చాలా ముఖ్యమైన పాత్ర. మా రాష్ట్రం
విషయాన్నే తీసుకుంటే...భారతదేశ 29వ రాష్ట్రంగా
తెలంగాణ కొత్తగా ఇటీవలే ఏర్పడింది. మేము అద్భుతమైన
పారిశ్రామిక విధానం తీసుకొచ్చాం. దీనికోసం మా శాసనసభలో చట్టం చేశాం. రెండు వారాల్లోనే అనుమతులిచ్చే పద్ధతి తెచ్చాం. పెట్టుబడిదారులు పారిశ్రామిక అనుమతులు పొందడం మా రాష్ట్రంలో ఓ హక్కు. ఇప్పటికే ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల కాలంలోనే 56 కంపెనీలకు అనుమతులిచ్చాం. వీటి ద్వారా దాదాపు
2 బిలియన్ల డాలర్ల (రూ.12,000 కోట్లు) పెట్టుబడులు వస్తున్నాయి. ఇది దేశాభివృద్ధికి
దోహదపడే విషయం. రాష్ట్రాలు ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటే దేశం
ముందుకుపోతుంది. ఇది ప్రపంచానికి భారతదేశ వైఖరిని వెల్లడిస్తున్నది. భారతదేశం పెద్ద సంఖ్యలో వినియోగదారులున్న దేశం మాత్రమే కాదు, ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉన్న దేశమని నేను ఖచ్చితంగా చెప్పగలను. మా దేశం చాలా నిలకడగా పురోగమిస్తున్నది. ఈ పయనం ఖచ్చితంగా
ఇలాగే సాగుతుంది. ముఖ్యమంత్రిగా గుజరాత్ ను అభివృద్ధి పథంలో నడిపిన
సంస్కరణాభిలాషి అయిన ప్రధానమంత్రి మాకున్నారు’’.
ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడుతూ, 90 దేశాల నుంచి వచ్చిన
1500 మంది ప్రతినిధుల సమక్షంలో, అతి తక్కువ సమయంలో, చాలా సూటిగా భారత దేశ ప్రగతి పథాన్ని
ఆవిష్కరించారు. దేశంలోని ఓ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్న తీరును
వివరించారు. తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి
అయినప్పటికీ పొరుగు దేశం వెళ్లినప్పుడు భారతీయ పౌరుడిలాగానే మెలగాలని
నిర్ణయించుకుని, అందుకు తగ్గట్టుగా ప్రవర్తించారు. భారతదేశం, తెలంగాణ గురించే కాదు, చైనా నుంచి మొదలుకుని ప్రపంచ దేశాల ఆర్థిక గమనం గురించి కూడా ముఖ్యమంత్రి
అత్యంత కీలకమైన అభిప్రాయాలు వెల్లడించారు. ఆయన తన ప్రసంగాన్ని
కొనసాగిస్తూ...
‘‘దేనికైనా, ఎప్పుడైనా ఒడి-దుడుకులు సహజం. కాకపోతే వాటిని అధిగమించాలి. చైనా అలాగే చేసి, ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శంగా నిలిచింది. 30 సంవత్సరాల క్రితం
చైనా వేరు. ఇప్పుడు మనం చూస్తున్న చైనా ఎంతో అభివృద్ధి చెందిన
దేశం. ప్రపంచం యావత్తు చైనా వైపు చూస్తున్నది. ప్రతీ ఒక్కరూ చైనా నుంచి నేర్చుకోవాలి. అసలు చైనా నుంచి
నేర్చుకోకుండా వదిలిపెట్టే అంశమేమైనా ఉన్నదా? ప్రతీ విషయాన్నీ
చైనా నుంచి నేర్చుకోగలం. మేము కూడా మా దేశానికి తగ్గట్టుగా ఎదుగుతామనే నమ్మకం
మాకుంది. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం... అతి పెద్ద ఆయిల్
దిగుమతిదారులం అయిన భారత్ కు ఉపయోగపడే అంశం. ఈ అవకాశాన్ని మా దేశానికి లాభసాటిగా
ఉపయోగించుకుంటాం’’.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో భారతదేశ గొప్పతనాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను, పురోగతిని వివరించిన
ముఖ్యమంత్రి మంచి ఎక్కడున్నా స్వీకరించే గుణం తమకున్నదని చైనా నుంచి
నేర్చుకుంటామనే సంకేతం ద్వారా తెలిపారు. దేశంపైన, ప్రపంచంపైన తనకున్న అభిప్రాయాలు చెప్పే క్రమంలోనే కేసీఆర్ ఎక్కడా
తొట్రుపాటుకు కానీ, మొహమాటానికీ కానీ పోలేదు. ఉన్నదున్నట్లు కుండబద్ధలు కొట్టినట్లే చెప్పారు.
‘‘వేరే దేశాల ఆర్థిక
వ్యవస్థలు గందరగోళంలో ఉండవచ్చునేమో. కానీ మా భారతదేశం
మాత్రం దిక్కుతోచని (క్రాస్ రోడ్స్) స్థితిలో ఎంతమాత్రం లేదు. మా ప్రభుత్వం సంస్కరణల దిశగా పోతున్నది. చాలా వేగంగా
ముందుకుపోతున్నాం. ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల మాకు చాలా
డబ్బులు ఆదా అవుతాయి. వీటి ద్వారా పేద ప్రజలకు కావాల్సిన మౌలిక
సదుపాయాలు మెరుగుపర్చే అవకాశం చిక్కింది. సామాజికాభివృద్ధికి, దేశాభివృద్ధికి దోహదపడే అభివృద్దికే మా ప్రాధాన్యం ఉంటుంది. పేదలు పేదలుగానే మిగిలిపోయి, ధనవంతులు మరింత
ధనవంతులుగా మారే వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. సమాజంలో పేదల
గౌరవాన్ని కూడా కాపాడాలి’’.
"మా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు, ఆర్థికంగా
వెనుకబడిన వర్గాల వారికి ఉపయోగపడే డబుల్
బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రాష్ట్ర
వ్యాప్తంగా ఇంటింటికి నల్లాల ద్వారా నీరందించే కార్యక్రమం, హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన, అత్యుత్తమ పారిశ్రామిక విధానాలకు రూపకల్పన చేసి అమలుకు చాలా నిధులు ఖర్చు
చేస్తున్నాం. భారత దేశం పెట్టుబడులకు అనువైన దేశమని పారిశ్రామిక వేత్తలకు
విజ్ఞప్తి చేస్తున్నాను. భారత దేశంలో ఎక్క డికైనా, ముఖ్యంగా తెలంగాణా
రాష్ట్రానికి, పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరుతున్నాను.
పరిశ్రమల స్థాపనకు కావాల్సిన సరిపడ భూమి పెట్టుబడిదారులకు కేటాయించడానికి మా వద్ద
వుంది. మా రాష్ట్రంలో అమల్లో వున్న పారిశ్రామిక విధానం లాంటిది ప్రపంచంలో మరెక్కడా
లేదని చెప్పగలను. ప్రపంచంలో చాలా చోట్ల ఏక గవాక్ష-సింగిల్ విండో విధానాలు
వున్నప్పటికీ, మా రాష్ట్రంలో వాటన్నిటికీ భిన్నంగా వూచలు లేని (వితౌట్ గ్రిల్స్) ఏక గవాక్ష విధానం అమల్లో వుంది. పరిశ్రమల స్థాపనకు
కావాల్సిన అనుమతుల మంజూరులో జాప్యం జరిగితే సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి వుంటుంది.
వారిపై క్రమశిక్షణా చర్యలు కూడా వుంటాయి. అనుమతులు పొందడం పారిశ్రామిక వేత్తల
హక్కుగా విధానం రూపొందించాం. నిర్దేశిత గడువులోగా కారణం చెప్పకుండా అనుమతులు
ఇవ్వని పక్షంలో సంబంధిత పెట్టుబడిదారుడు అనుమతి లభించినట్లే భావించి ముందుకు
సాగవచ్చు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలను భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి రమ్మని, పెట్టుబడులు
పెట్టమని ఆహ్వానిస్తున్నాను. కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని విజ్ఞప్తి
చేస్తున్నాను".
దేశం అభివృద్ధి చెందడమంటే, ఆ దేశంలోని పేదల
స్థితిగతుల్లో మార్పులు రావడం అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఆయిల్ ధరల్లో తగ్గుదల వచ్చినందున ఆ అవకాశాన్ని పేదల కోసం
ఉపయోగించుకోవాలనే సందేశాన్ని కూడా కేసీఆర్ చైనా వేదిక నుంచి భారత ప్రభుత్వానికి
పంపినట్లయింది. పేదల ఆత్మగౌరవం కాపాడడమే అభివృద్ధి లక్ష్యంగా
మారాలని కూడా కేసీఆర్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నదని, ప్రపంచం కూడా అలాగే ఆలోచించాలని కేసీఆర్ చెప్పారక్కడ. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై ముఖ్యమంత్రి భారతీయతను చాటిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర పురోగతిని విడమర్చి చెప్పారు. చైనా సాధించని ప్రగతిని కీర్తించారు. ఈ సదస్సుతో కేసీఆర్
మహోన్నత వ్యక్తిత్వం కూడా బయటపడింది. తెలంగాణ ఉద్యమ
నాయకుడిగానే ప్రపంచానికి పరిచయమైన కేసీఆర్ గొప్ప దేశభక్తుడని, ఎక్కడికి పోయినా చాలా విశాల భావాలున్న దేశ పౌరుడిలా వ్యవహరిస్తారని
రుజువైంది. అంతేకాదు. రాష్ట్రం, దేశం గురించే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అవలంబించాల్సిన
విధానాలపై కూడా అవగాహన కలిగి చొరవ చూపించే ప్రపంచ పౌరుడిగా కేసీఆర్ కొత్తగా
పరిచయమయ్యారు.
దాలియాన్ నుంచి సెప్టెంబర్ 10 ఉదయాన్నే ముఖ్యమంత్రి, ఇతర బృంద సభ్యులు
షాంఘై చేరుకున్నారు. షాంఘై నగరం దేశంలోని పెద్ద నగరమే కాక, ఆ దేశ, ప్రపంచ స్థాయి ఆర్థిక లావాదేవీల కేంద్రం కూడా. నగరం నడిమధ్యన ఒక చక్కటి వాటర్ ఫ్రంట్ వాక్ వే (హైదరాబాద్ టాంక్ బండ్ తరహాలో) నగరానికి ప్రధాన
ఆకర్షణ. ఆ వాక్ వే పొడుగునా చైనా వలస రాజ్యంగా వున్న కాలం
నాటి పురాతన భవనాలు కనిపిస్తాయి. విమానాశ్రయం నుంచి షాంఘై సిటీ వరకు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే మెగ్లావ్ హైస్పీడ్ ట్రెయిన్
లో సీఎం ఆయన వెంట వున్న ప్రతినిధి బృందం ప్రయాణం చేశారు.
షాంఘైలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు అధ్యక్షుడు కెవి కామత్, ఉపాధ్యక్షుడు జియాన్ జు తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం తీసుకోవాల్సిన
చర్యలపై చర్చించారు. తెలంగాణలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే
విషయంలోనూ, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోనూ బ్యాంకు
సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు. సిఐఐ, తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ లో పెట్టుబడులకున్న అవకాశాల గురించి
సాయంత్రం సమావేశం జరిగింది. చైనాకు చెందిన 65 కంపెనీల
ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సింగిల్ విండో
పారిశ్రామిక విధానాన్ని, ఇబ్బందులకు తావులేని-అవినీతి రహిత పారిశ్రామిక
అనుమతులిచ్చే పద్దతిని, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వివరించారు. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సదస్సులో
పాల్గొన్న పలువురు చైనా పారిశ్రామిక వేత్తలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని
అభినందించారు. తెలంగాణలో 20 మిలియన్ డాలర్ల
వ్యయంతో ఎల్.ఇ.డి. యూనిట్ స్థాపించేందుకు సెల్కాన్, మెకెనో కంపెనీలు తెలంగాణ
ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎంఓయు కుదుర్చుకున్నాయి. 40 బిలియన్ డాలర్ల సంస్థ
షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ షావో ముఖ్యమంత్రిని కలిసి
తెలంగాణలో అత్యుత్తమ సామర్థ్యం కలిగిన పంపులు, ఎలక్ట్రిక్ పరికరాల
తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అంజు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ యోగేష్
వా కూడా ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణలో తమ కంపెనీ యూనిట్ స్థాపించేందుకు
ముందుకు వచ్చారు. వారిని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు.
న్యూ
డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్డీబి) అధ్యక్షుడు కెవి కామత్, ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య సమావేశం చాలా ఆసక్తికరంగా జరిగింది. షాంఘైలో
నూతనంగా స్థాపించబడిన ఎన్డీబి అవసరమైన వారికి నిధులు సమకూర్చే విధానాన్ని
రూపొందించుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు
నిధులు సమకూర్చడమే ఎన్డీబి ప్రధాన లక్ష్యం. ఎన్డీబి పని ప్రారంభించిన ఈ రెండు నెలల
కాలంలో బాంకు అధికారులతో సమావేశమైన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కామత్ అన్నారు. అభివృద్ధి
చెందుతున్న దేశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులను సమకూర్చుతామని కామత్
ముఖ్యమంత్రికి చెప్పారు. ఇతర ప్రపంచ ఆర్థిక సంస్థల-బాంకుల మాదిరి కాకుండా, తామిచ్చే నిధుల విషయంలో షరతులు విధించమని, నిధులు తమవద్ద నుండి
తీసుకునే దేశాలు వారికి అవసరమైన రీతిలో ప్రాజెక్టుల రూపకల్పన చేసుకోవచ్చని, ఈ విషయంలో తాము కలిగించుకోమని కామత్ అన్నారు. ఎన్డీబి సమకూర్చే అప్పు 15-20 సంవత్సరాల కాలపరిమితిలో
తీర్చవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటినుంచి తమ ప్రభుత్వం రూపొందించి
అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ-మౌలిక వసతుల కల్పన వివరాలను ముఖ్యమంత్రి కామత్ కు
తెలియచేశారు. ఐదేళ్ల కాలంలో 46,400 చెరువుల పునరుద్ధరణ విషయం, వాటిలో ఇంతవరకు పూర్తైన 6500 చెరువుల వివరాలు, దానికి కానున్న రు. 25000 కోట్ల వ్యయం అంచనా
గురించి కూడా సీఎం చెప్పారు.
విద్యుత్ రంగంలో సాధించిన పురోగతిని గురించీ సీఎం చెప్పారు
కామత్ తో. రాష్ట్రం ఏర్పాటైన ఆరు నెలల లోపునే విద్యుత్ లోటును అధిగమిఛడానికి
ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక గురించి తెలియచేశారు ముఖ్యమంత్రి. మూడు-నాలుగేళ్ల
లో తమ రాష్ట్రం ఎలా 20000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిపి మిగులు రాష్ట్రంగా కాబోతున్నదో
వివరించారు. ఆర్ ఈ సీ, పీ ఎఫ్ సీ సంస్థలు సమకూర్చిన రు. 40000 కోట్ల గురించీ చెప్పారు.
వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎన్డీబి అధ్యక్షుడికి జెన్‌కో సీఎండీ త్వరలోనే
తెలియచేస్తారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు-నగరాలకు రక్షిత
నల్లాల ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరాకు సంబంధించిన పథకానికి హడ్కో ద్వారా రు. 15000 కోట్ల రుణం లభిస్తున్నదని
సీఎం అన్నారు. అదే విధంగా విద్య, వైద్యం, ఇతర సంక్షేమ పథకాలకు తమ రాష్ట్రం ఆదర్శంగా ఎలా పథకాలను
రూపొందిస్తున్నదో సీఎం వివరించారు.
హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని ఐదు ప్రధాన
నగరాలకు పునరుద్ధరుణ-మౌలిక వసతుల కల్పన అత్యంత అవసరమని సీఎం కామత్ తో అన్నారు. రు.
21000 కోట్లతో హైదరాబాద్ నగరంలోని రహదారులకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన
మొదలైందనీ, ఐతే ఈ నిధులకు అదనంగా, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు, పారిశుధ్య పనులకు, మరిన్ని రహదారులకు
సంబంధించిన పనులకు, తాగు నీటి సరఫరాకు, అలాగే హైదరాబాద్ తో సహా మరి నాలుగు మునిసిపల్
కార్పొరేషన్ లలో ఇలాంటి పనులను చేపట్టడానికి, నిధుల అవసరం వుందని సీఎం
అన్నారు. వరంగల్ నగరంలో జౌళి పరిశ్రమ కేంద్రం ఏర్పాటు గురించి కూడా సీఎం చెప్పారు. వీటన్నిటికి సంబంధించిన సమగ్ర నివేదికను ఇవ్వమని కామత్ ముఖ్యమంత్రితో
అన్నారు.
సెప్టెంబర్ 11 న ముఖ్యమంత్రితో వెళ్లిన బృందంలోని సభ్యులు సుజో ఇండస్ట్రియల్ పార్కును
సందర్శించారు. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా - సింగపూర్ దేశాలు సంయుక్తంగా నెలకొల్పిన ఈ పార్కు దేశంలోని అతి ముఖ్యమైన
ఆర్థిక సహకార ప్రాజెక్టుగా పేరు పొందింది. భూలోకంలోని
స్వర్గంగా పిలవబడే సుజో నగరంలో ఉన్న ఈ పార్కు దేశ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా
ఒకటి. దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులు అక్కడ
పనిచేస్తున్నారు. తెలంగాణ బృంద సభ్యులు చైనా - సింగపూర్ ఇండస్ట్రియల్ పార్కు కమిటీ సభ్యుడు యు సే జెన్ తో సమావేశమయ్యారు. షాంఘై నుంచి చైనా రాజధాని బీజింగ్ చేరుకున్న ముఖ్యమంత్రి బృందం భారత
రాయబారి అశోక్ కె కాంత మర్యాద పూర్వకంగా ఇచ్చిన విందులో పాల్గొన్నారు. చైనా సందర్శించే భారత ప్రముఖులు సంతకాలు చేసే రిజిష్టర్లో ముఖ్యమంత్రి
సంతకం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న
తర్వాత చైనాకు చెందిన చాలా మంది పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి
ఆసక్తి చూపుతున్నారని అశోక్ కె కాంత ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిపారు.
సెప్టెంబర్
12 న రఫెల్స్ బీజింగ్ హోటల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ చైనాకు చెందిన చాలా
కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. చాంగ్ కింగ్
ఇంటర్నేషనల్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్, ఇన్ స్పుర్ గ్రూప్
ఆఫ్ కంపెనీస్, చైనా ఫార్య్చూన్ లాండ్ డెవలప్ మెంట్ కంపెనీ, చైనా రైల్వే కార్పొరేషన్, సానీ గ్రూపు
ప్రతినిధులు ముఖ్యమంత్రితో మాట్లాడారు. తెలంగాణలో
పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి వారికి
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించారు. సమావేశం సందర్భంగా
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వారికున్న ఆసక్తిని వెల్లడించారు.
చాంగ్ కింగ్ ఇంటర్నేషనల్
కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (సికొ) పక్షాన కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు-జనరల్ మానేజర్, దు జియాన్ ఝంగ్, డీజిఎం హె యుజున్, ఎక్జిక్యూటివులు హన్
యిన్లు, గౌ జుయెయువాన్, వెన్ యాన్ లు హాజరయ్యారు. నిర్మాణ రంగంలో, ప్రాజెక్ట్
కన్సల్టెన్సీలో, భవన నిర్మాణ డిజైన్ల తయారీలో, మెకానికల్-ఎలక్ట్రికల్ ఇన్ స్టలేషన్ లో, రకరకాల వస్తువుల
ఉత్పత్తిలో, ఈపీసీ ప్రాజెక్టుల నిర్వహణలో సికో పనిచేస్తుంది. భారత్ దేశంలోని బీహార్, ఢిల్లీ లలో ఆ సంస్థ రెండు
ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య విధానంలో
కార్పొరేషన్ పనిచేస్తుంది. ఇన్ స్పుర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పక్షాన ఉపాధ్యక్షుడు, భారత వ్యవహారాల సీఈవో
ఝాంగ్ దాంగ్ మరో ముగ్గురు హాజరయ్యారు. ఎలెక్ట్రానిక్, హార్డ్ వేర్ రంగాలలో భారత
దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్ స్పుర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంసిద్ధతను
వ్యక్తం చేసింది. జనవరి 2015 నుంచి ఆ సంస్థ భారత దేశంలో కూడా పని ప్రారంభించింది.
ఢిల్లీ సమీపంలోని గుర్ గావ్ లో ఒక బ్రాంచి ఆఫీస్ తెరిచింది. తెలంగాణలో కూడా తమ
కార్యకలాపాలను చేపట్టుతామని వారన్నారు. చైనా ఫార్య్చూన్ లాండ్ డెవలప్ మెంట్ కంపెనీ
(సీఎఫెల్డీసీ) పక్షాన ఉపాధ్యక్షుడు లియాంగ్ వెంటావో తో సహా మరో ముగ్గురు
హాజరయ్యారు. భారత దేశంలో పారిశ్రామిక నగరాన్ని ఏర్పాటు చేయాలని తమ ఆలోచనగా
చెప్పారు వారు ముఖ్యమంత్రికి. అలానే తెలంగాణలో పెట్టుబడుల అవకాశాన్ని చర్చించారు.
బీజింగ్ లోని చైనా దేశపు చారిత్రక రాజభవనమైన ఫార్బిడెన్ సిటీని
ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. మింగ్ రాజవంశం
నుంచి మొదలుకుని క్వింగ్ రాజవంశం వరకు చైనాను పాలించిన రాజులు ఈ భవనంలోనే ఉండేవారు. బీజింగ్ నడి మధ్యలో ఉండే ఈ రాజభవనాన్ని ప్రస్తుతం మ్యూజియంగా మార్చారు. ఈ నిర్మాణం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. బీజింగ్ లోని టియాన్మెన్ స్క్వేర్, గ్రేట్ వాల్ ఆఫ్
చైనా తదితర పర్యాటక ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. బీజింగ్ నుంచి సాయంత్రానికి షెన్‍జెన్ చేరుకున్నారు. బండ రాళ్లు, ఇటుకలు, కలప, మట్టి తదితర పదార్థాలతో నిర్మించిన వరుస కోటల సముదాయం గ్రేట్ వాల్ ఆఫ్
చైనా. చుట్టు పక్కల రాజ్యాల నుంచి, ముఖ్యంగా మంగోలియన్ల దాడులను
నివారించుకోడానికి చైనా రాజులు ఉత్తర సరిహద్దుల వెంట తూర్పు నుంచి పడమర దిశగా ఈ
కోటను నిర్మించారు. దాదాపు 8851 కిలోమీటర్ల పొడవుతో
ప్రపంచంలోనే అతి పొడవైన మానవ నిర్మిత కట్టడంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిలుస్తున్నది. క్రీస్తుపూర్వం 221లో మొదలు పెట్టి 15 సంవత్సరాల పాటు
గోడను కట్టారు. చక్రవర్తి పిహూయాంగ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణానికి రూపకర్త.
సెప్టెంబర్ 14 న షెన్‍జెన్ హై టెక్ ఇండస్ట్రియల్ పార్కును
ముఖ్యమంత్రి, ఆయన ప్రతినిధి బృందం సభ్యులు సందర్శించారు. పార్కులో అంతర్భాగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ జడ్.టి.ఇ. కార్పొరేషన్ లో
బృందం కలియతిరిగింది. వైర్ లెస్, ఎక్చేంజ్, ఆక్సెస్,ఆప్టికల్ ట్రాన్స్ మిషన్, డాటా టెలికమ్యూనికేషన్స్ గేర్, మొబైల్ ఫోన్స్, టెలికమ్యూనికేషన్స్ సాఫ్ట్ వేర్ తదితర రంగాల్లో జడ్.టి.ఇ. కార్పొరేషన్
పనితీరును పరిశీలించారు. ఇలాంటి కార్పొరేషన్ ను తెలంగాణలో కూడా నెలకొల్పే విషయంలో కంపెనీ ప్రతినిధులతో
ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. ఇండస్ట్రియల్
పార్కు సుమారు 11.5 కిలో మీటర్ల విస్తీర్ణంలో వుంది. పార్కులో ఐబీఎం, ఫిలిప్స్, కాంపాక్, ఒలింపస్, ఎప్ సన్, లూసెన్ట్, హారిస్. థాంసన్, జడ్.టి.ఇ, లెనోవ్, టీసీఎల్, స్కైవర్త్ లాంటి ఎన్నో అంతర్జాతీయ-జాతీయ
సంస్థలున్నాయి. పార్కు సందర్శించడానికి ముందు చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్
ఇంటర్నేషనల్ ట్రేడ్ (సీసీపీఐటి)
ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అంతర్జాతీయ
వ్యాపారం, ఆర్థిక పరిస్థితులపై పరస్పరం అభిప్రాయాలు
పంచుకున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని సీఎం వారికి
వివరించారు. సీసీపీఐటి చైనా ప్రభుత్వం పరమైన వాణిజ్య సంస్థ. దీనిని 1952 లో స్థాపించారు. ఆర్థిక
సంబంధమైన డేటాను రూపొందించటంతో పాటు దౌత్య పరమైన వాణిజ్య విషయాలలో మధ్యవర్తిత్వం
చేస్తుంటుంది. సాయంత్రం ముఖ్యమంత్రి షెన్‍జెన్ నుంచి హాంకాంగ్ చేరుకున్నారు. హాంగ్ కాంగ్ లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్ ముఖ్యమంత్రి
బృందానికి స్వాగతం పలికారు.
పర్యటన తొమ్మిదో రోజు సెప్టెంబర్ 15 న "బిజినెస్ అపార్చునిటీస్ ఫర్ హాంగ్ కాంగ్ కంపెనీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ" అనే అంశంపై హాంగ్
కాంగ్ లోని రినైసాన్స్ హార్బర్ వ్యూ హోటల్ లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్
పాల్గొన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, సింగిల్ విండో సిస్టమ్, టిఎస్ ఐపాస్ చట్టం, సిఎంఓలో చేజింగ్
సెల్ తదితర విషయాలపై ముఖ్యమంత్రి అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానంపై రూపొందించిన ఐదు నిమిషాల వీడియోను వారికి
చూపించారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడం వల్ల కలిగే
ప్రయోజనాలను పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ వివరించారు. సదస్సులో పాల్గొన్న పలువురు పారిశ్రామిక వేత్తలు అనేక అనుమానాలను
నివృత్తి చేసుకున్నారు. తొలుత హాంగ్ కాంగ్ లోని భారత కాన్సిల్ జనరల్ ప్రశాంత్
అగ్రవాల్ సదస్సులో పాల్గొన్నవారికి స్వాగతం పలికారు. కొద్ది సేపు ప్రశ్నోత్తరాల
కార్యక్రమం కూడా జరిగింది. హాంగ్ కాంగ్ లోని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్
అరుణాచలం ముగింపు సందేశం ఇచ్చారు. సమావేశం తరువాత కాన్సల్ జనరల్, సదస్సులో పాల్గొన్న సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి లంచ్ చేశారు.
లాంటా ద్వీపంలో నాంగ్ పింగ్ వద్ద నెలకొల్పిన టియాన్
టన్ బుద్ధ అని పిలువబడే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని ముఖ్యమంత్రి బృందం తిలకించింది. హాంగ్ కాంగ్ లోని లాంటా ద్వీపంలో నాంగ్ పింగ్
ప్రాంతంలో బుద్ధుడి అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. 1990లో ప్రారంభమయి 1993లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ
బుద్ధ విగ్రహం మనిషికి-ప్రకృతికి, ప్రజలకు - నమ్మకానికి
మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి గుర్తుగా నిలుస్తుంది. చైనా దేశపు ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఈ
ప్రాంతం బౌద్ధ సిద్ధాంతాలకు కేంద్రంగా కూడా భాసిల్లుతున్నది. 112 అడుగుల పొడవు, 250 మెట్రిక్ టన్నుల బరువు, 202 కాంస్యపు కడ్డీలు కలిగి ఉన్నదీ విగ్రహం. ఈ బుద్ధ విగ్రహాన్ని చేరుకోవడానికి సందర్శకులు 268 మెట్లు
ఎక్కాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తైన డిసెంబర్ 29, 1993 ను బుద్ధుడి
జ్ఞానోదయం ఐన రోజుగా చైనా దేశస్థులు భావిస్తారు.
సెప్టెంబర్ 16 న క్రితం రోజు
జరిగిన సెమినార్ లో పాల్గొన్న కొందరు సభ్యులతో కొద్ది సేపు ముచ్చటించారు
ముఖ్యమంత్రి. ఆ తరువాత ముఖ్యమంత్రి ప్రతినిధి బృందంతో కలిసి హాంగ్ కాంగ్ నుంచి
హైదరాబాద్ బయలు దేరింది. రాత్రికి ముఖ్యమంత్రి బృందంతో కలిసి హైదరాబాద్
చేరుకున్నారు.
ముఖ్యమంత్రి కె.
చంద్రశేఖర్ రావు వెంట వెళ్లిన ప్రతినిధి బృందంలో రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, శాసన మండలి అధ్యక్షుడు కె. స్వామి గౌడ్, శాసన సభ సభాపతి కె.
మధుసూధనాచారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీష్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గువ్వల
బాలరాజు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ
కార్యదర్శి అరవింద్ కుమార్, ఇన్టెలిజెన్స్ ఐజి శివధర్ రెడ్డి, భద్రతా ఐజి మహేశ్ మురళీధర్ భగవత్, ముఖ్యమంత్రి
ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, టీఎసెఐఐసీ ఎండీ
ఇవి నరసింహారెడ్డి, సీఎంఓకు చెందిన జె. సంతోష్ కుమార్, సుభాష్ రెడ్డి వున్నారు. END
Post Script:
న్యూ చాంపియన్స్ పేరిట నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు అభినందనలు అంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ఆర్థిక ఫోరం తరఫున మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్ లేఖ రాస్తూ.. ఫోరం సమావేశంలో చురుగ్గా పాల్గొన్నారంటూ అభినందించారు. ఈ సమావేశాల సందర్భంగా జరిగిన చర్చలు, ఆలోచనల వ్యక్తీకరణ, ముఖాముఖి సమావేశాలద్వారా అనేక వినూత్నమైన అంశాలను, సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త పోకడలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. అంతేగాక స్థిరమైన భవిష్యత్తువైపు అడుగులు వేసేందుకు అవసరమైన గొప్ప ఆవిష్కరణలు, కంపెనీలను కలుసుకున్నారనే భావిస్తున్నాం అని అందు లో పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని సరికొత్త పద్ధతిలో నిర్మిస్తున్న విధానాన్ని తాము తెలుసుకున్నామని, ఈ సందర్భంగా కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అందులో తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో భవిష్యత్తులో మరింత భారీ పెట్టుబడులను ఆకర్షించాలని కోరుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వంతో మరింత సాన్నిహిత్యంగా మెలుగుతామని, త్వరలోనే మరోసారి కలుసుకుంటామనే ఆశాభావాన్ని ఆ లేఖలో ఫిలిప్ రోస్లర్ వ్యక్తంచేశారు.
Post Script:
న్యూ చాంపియన్స్ పేరిట నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు అభినందనలు అంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ఆర్థిక ఫోరం తరఫున మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్ లేఖ రాస్తూ.. ఫోరం సమావేశంలో చురుగ్గా పాల్గొన్నారంటూ అభినందించారు. ఈ సమావేశాల సందర్భంగా జరిగిన చర్చలు, ఆలోచనల వ్యక్తీకరణ, ముఖాముఖి సమావేశాలద్వారా అనేక వినూత్నమైన అంశాలను, సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త పోకడలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. అంతేగాక స్థిరమైన భవిష్యత్తువైపు అడుగులు వేసేందుకు అవసరమైన గొప్ప ఆవిష్కరణలు, కంపెనీలను కలుసుకున్నారనే భావిస్తున్నాం అని అందు లో పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని సరికొత్త పద్ధతిలో నిర్మిస్తున్న విధానాన్ని తాము తెలుసుకున్నామని, ఈ సందర్భంగా కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అందులో తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో భవిష్యత్తులో మరింత భారీ పెట్టుబడులను ఆకర్షించాలని కోరుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వంతో మరింత సాన్నిహిత్యంగా మెలుగుతామని, త్వరలోనే మరోసారి కలుసుకుంటామనే ఆశాభావాన్ని ఆ లేఖలో ఫిలిప్ రోస్లర్ వ్యక్తంచేశారు.
No comments:
Post a Comment