వాల్మీకి
రామాయణం భారతీయ సంస్కృతికి ప్రతిరూపం
వనం జ్వాలా నరసింహారావు
నవ తెలంగాణ (వేదిక పేజీ) దినపత్రిక
28-09-2015
డాక్టర్
కదిరె కృష్ణ "రామాయణం మా పాలిట రాచపుండే అయ్యింది" అన్న
శీర్షికన "వేదిక” లో వ్యాసం రాస్తూ నన్ను హేళన చేయడం జరిగింది. ప్రతిస్పందనగా
ఈ వ్యాసం రాస్తూ, వారిని
రామాయణాన్ని అర్థం చేసుకోమని మరో మారు ప్రార్థిస్తున్నాను. వాల్మీకి సంస్కృతంలో రచించిన
శ్రీమద్రామాయణంలో నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు
మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట
రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. శ్రీమద్రామాయణం బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై
అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెప్పడం
జరిగింది.
రామాయణ
రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడికి సాష్టాంగ నమస్కారం చేసి: "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం
మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని
స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో
దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని
పదహారు ప్రశ్నలు వేస్తాడు. పదహారు తపస్సంఖ్యాకం. పదహారు కళలతో కూడినవాడు పూర్ణ చంద్రుడు. అలానే పదహారు ప్రశ్నలకు జవాబుగా
శ్రీరామచంద్రుడిని తప్ప ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే శ్రీరాముడిది పూర్ణావతారం.
బాల్యంలోనే శ్రీరాముడు గుహుడిలాంటి వారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి
"వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరక పోవడం-జనకాజ్ఞ జవదాటక
పోవడం-పరశురాముడిని చంపక పోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని
తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే
విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా
అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను-సర్వ భూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో
హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీషణ
శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక
పోవడం, చేజిక్కిన రావణుడిని
విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని
తెలుపుతుంది. విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా.
వాల్మీకి
అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు, జవాబిచ్చేవాడూ
వేదాంతజ్ఞులే. ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. అయితే, వాల్మీకి
వేసిన ప్రశ్న భగవంతుడి గురించే అయితే, ఆ భగవంతుడు సగుణుడా, నిర్గుణుడా, సాకారుడా, నిరాకారుడా, ద్రవ్యమా, అద్రవ్యమా, ఏకతత్వమా, అనేకతత్వమా
అని అడక్క గుణాల గురించే ఎందుకడిగాడు? అనుష్ఠానం ప్రధానం గాని, వాదం
కాదు. మామిడిపండు తింటేనే తీపో-పులుపో తెలుస్తుంది. అనుష్ఠాన
రూపకమైన భక్తి మార్గమే శ్రేష్ఠం. నారదుడు భక్తుడు. తత్వవిచారంకంటే
గుణ విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకీ ఆ కోవకి చెందినవాడే. అందుకే
భగవత్ గుణ వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు. శ్రీమద్రామాయణం గూఢార్థగుంభితం. రామాయణార్థం సరిగ్గా గ్రహించాలంటే
అనేక శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి యదార్థ జ్ఞానం కలగదు. నారదుడంటే
జ్ఞాన దాత. జ్ఞాన దాత చేయాల్సింది జ్ఞానముపదేశించడమో, మోక్ష
విషయం చెప్పడమో అయ్యుండాలి. నారదుడు ఉపదేశంతో వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. వాల్మీకి
ప్రశ్నించింది అవతార మూర్తి గురించే-నారదుడు జవాబిచ్చిందీ అవతార మూర్తిని
గురించే.
బాల
కాండలోని సంక్షిప్త రామాయణంలో నారదుడు
అయోధ్యకాండ అర్థాన్ని సంగ్రహంగా చెప్పి, పితృవాక్య పాలన అనే సామాన్య ధర్మాన్ని, స్వామైన భగవంతుడి విషయంలో దాసుడు చేయాల్సిన కైంకర్య వృత్తిని, ప్రపన్నుడు భగవత్ పరతంత్రుడిగానే వుండాలన్న విషయాన్ని, ప్రపత్తికి భంగం కలిగే పనులు ఎవరు చెప్పినా చేయకూడదనే విశేష
ధర్మాన్ని తెలియ పరుస్తాడు. సీతను రక్షించ బోయి రావణుడి వల్ల చనిపోయిన జటాయువుకు దహన
సంస్కారాలు చేసి రాముడు శోకించాడని సంక్షిప్త రామాయణంలో నారదుడు చెప్పాడు. రామచంద్రమూర్తికి శోకం కలిగింది తన కొచ్చిన కష్టానికి కాదు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానని మాత్రమే
రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందని రామచంద్రమూర్తి
దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు.
రాముడు
వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడితో
స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం చెప్పడం జరిగింది. శబరితో
స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడైన
సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం జరిగింది. దాన్నిబట్టి
తెలిసేదేమిటంటే, భక్తికి అందరూ అధికారులేనన్న విషయం. జ్ఞానంతో
రామచంద్రమూర్తిని ఆశ్రయించేవారు కొందరే. భక్తితో ఆశ్రయించేవారు కోటానుకోట్లు. ఫలితం
ఇరువురికీ సమానమే. ఒకే
ఒక్క బాణంతో రాముడు వాలిని నేలగూల్చుతాడు అని చెప్పడంలో చాలా అర్థముంది. తమ్ముడి
భార్యతో సంగమించిన వాడికి శిక్ష వధ అని శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్ర బద్ధుడైన రాముడు అట్లే చేశాడు. నేలబడేటట్లు కొట్టాడే కాని, ప్రాణంపోయేటట్లు కొట్టలేదు. ఎందుకంటే వాడి దోషం గురించి వాడికి చెప్పి ఇది ప్రాయశ్చిత్తం
అని తెలియచేసేందుకే. దీన్ని
బట్టి రాముడి ధర్మ బుద్ధి, సత్య
పరాక్రమం స్పష్టమవుతుంది.
రావణ
సంహారం జరిగిన తర్వాత, విభీషణుడిని
లంకా రాజ్యానికి ప్రభువుగా చేసి, వీరుడై, కృతకృత్యుడై, మనో దుఃఖం లేనివాడయ్యాడు శ్రీరాముడు అని చెప్పబడింది. అంటే, రావణ వధ, సీతా ప్రాప్తి, ప్రధానం కాదని, విభీషణ పట్టాభిషేకమే ప్రధానమని సూచించబడిందిక్కడ. ప్రధాన ఫలం ప్రాప్తించినప్పుడే ఎవరైనా కృతకృత్యుడయ్యేది - మనో దుఃఖం లేనివాడయ్యేది. సీతా ప్రాప్తి స్వకార్యం. దొంగలెత్తుకొని పోయిన తన సొమ్ము తాను తిరిగి
రాబట్టుకోవడంలాంటిది. చోరదండనమే
రావణ వధ. తనపని
తాను చేయడంలో గొప్పేముంది? విభీషణ
పట్టాభిషేకం ఆశ్రిత రక్షాధర్మకార్యం. ఆ అశ్రిత రక్షాభిలాషే రావణ వధకు ముఖ్య కారణం. సీతా ప్రాప్తి స్వంత కార్యం. అందుకే సీతను నిరాకరించగలిగాడుగాని, విభీషణుడి పట్టాభిషేకానికై ఉత్కంఠ వహించాడు శ్రీరాముడు.
గ్రంథాన్ని
చదవాలనుకునేవారు మూడు విషయాలు అవశ్యంగా తెలుసుకోవాలి. గ్రంథం
చెప్పిందెవరు? అతడి నడవడి ఎలాంటిది? లోకులకతడు ఆప్తుడా? అని
విచారించాలి. దీన్నే వక్తృ విశేషం అంటారు. మేలుకోరి మంచే చెప్తాడన్న
విశ్వాసానికి పాత్రుడైన వాడే ఆప్తుడు. వీడి వాక్యమే ఆప్త వాక్యం. ఆప్త
వాక్యం తోసివేయలేనటువంటిది. మొదటి ఆప్తుడు భగవంతుడు. వేదం ఆప్త వాక్యం. ఫ్రజల
మేలుకోరి, వేదార్థాలను, పురాణ-ఇతిహాస శాస్త్రాలను,
లోకానికి తెలిపినవారు ఆప్తులు. వారి రచనలు ఆప్త వాక్యాలు. యధార్థాన్ని
తను తెలుసుకుని, కామ-క్రోధ-లోభాలకు లోనుకాకుండా, తనెరిగిన
ఆ యధార్థ విషయాన్నే, ఇతరుల మేలుకోరి చెప్పడమే ఆప్త లక్షణం. అలాంటిదే
వాల్మీకికి బ్రహ్మానుగ్రహంవల్ల కలిగింది. కాబట్టి ఆయన పరమాప్తుడు.
నారదుడు
చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించాడు. నారదుడు
పోయింతర్వాత, వాల్మీకి, శిష్యుడితో తమసాతీరంలో తిరుగుతూ, ఒక
క్రౌంచమిధునాన్ని చూశాడు. ఆయన చూస్తుండగానే, బోయవాడొకడు, జంటలోని
మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడ పక్షి ఏడుపు విన్న వాల్మీకి, ఎంతో
జాలిపడి, బోయవాడిని శపించాడు. ఇలా ఆదికవి నోటినుండి వెలువడిన
వాక్యాలు సమాక్షరాలైన నాలుగు పాదాల శ్లోకమయింది. బ్రహ్మదేవుడు వచ్చి, రామాయణం
రాయమని ఉపదేశించి, సర్వం ఆయనకు తెలిసేట్లు వరమిచ్చి పోయాడు. రామ
చరిత్రను, వాల్మీకి వివరంగా చెప్పాలనుకున్నాడు.
వాల్మీకి
రామాయణం యధా తధంగా తెనిగించిన వాసు దాసు గారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని
సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా,
శ్రీరాముడా" అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది.
"ప్రతిష్ఠ
నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే
అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది.
"శాశ్వతహాయనముల"
అనే పదంలో రాముడు దండకారణ్యంలో
ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే
అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ
కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ
దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది.
ఇలా రకరకాలుగా రామాయణార్థం
సూచించబడిందీ పద్యంలో. ఏదేమైనా,
వాల్మీకి రామాయణంలో చెప్పిన దానికి
అర్థం వెతికేటప్పుడు, వాల్మీకి
రామాయణమే ప్రమాణం కాని, ఇతర
గ్రంథాలు ప్రమాణం కావు. లోక పిత రాముడైతే, లోకమాత సీత. తన
చరిత్రకంటే సీతాదేవి చరిత్రే శ్రేష్ఠమైందని రామచంద్రమూర్తే స్వయంగా అంటాడొకసారి. అందువల్లనే
రామాయణాన్ని సీతా మహాచరిత్రమంటాడు వాల్మీకి మహర్షి.
బాల కాండతో రామాయణ కథ ప్రారంభమవుతుంది. అయోధ్యా పుర వర్ణనతో
మొదలవుతుంది. భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది. అయోధ్యా పుర జనులను గురించి రాస్తూ, అక్కడి బ్రాహ్మణులను గురించి చెప్పబడింది. వారు ఆరంగాల వేదాధ్యయనం (శిక్ష–వ్యాకరణం–ఛందస్సు–నిరుక్తం–జ్యోతిష్యం-కల్పం) చేసినవారు. బ్రాహ్మణులను ద్విజాతులని- వేదషడంగ పారగోత్తములని–అహితాగ్నులని–సహస్రదులని–మహామతులని–సత్యవచస్కులని-హిమకర మిత్ర తేజులని–ఋషులని-హృష్ఠ మానసులని-శాస్త్ర చింతన పరాయణులని–స్వస్వతుష్టులని– త్యాగశీలురని-భూరి సంచయులని పోలుస్తూ వర్ణించబడింది. అదేవిధంగా పూర్వ కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు
అర్హులనే విషయం అయోధ్య నగర వాసుల గురించి వర్ణించినప్పుడు చెప్పబడింది.
ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే వారికి విద్యార్హతలుండవని వాదనుండేది. అయితే అది తప్పుడు వాదనేనని స్పష్టంగా చెప్పబడింది.
దశరథుడి
పుత్రకామేష్టి యాగానికి వచ్చిన విష్ణుమూర్తి, శరణాగతులైన బ్రహ్మాది దేవతలందరికీ అభయహస్తమిచ్చి, తాను మనుష్యుడిగా ఎవరికి
జన్మించాలనీ-ఆ యోగ్యత ఎవరికున్నదనీ ఆలోచించాడు. తనకు తండ్రి కాగల అర్హుడు అయోధ్యాపురాధిపతైన
దశరథుడేనని తలచాడు. దీనికి కారణముంది. స్వాయంభువ మనువు, పూర్వం గోమతీ తీరాన వున్న నైమిశారణ్యంలో, వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, మూడు జన్మల్లో నారాయణుడు తనకు పుత్రుడుగా వుండాలని అడుగుతాడు. అంగీకరించిన భగవంతుడు, ఆయన దశరథుడిగా పుట్టినప్పుడు "శ్రీరాముడు" గా పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా మనువు పుట్టినప్పుడు "శ్రీకృష్ణుడు"
గా ఆయనకు పుత్రుడయ్యాడు. మూడోజన్మలో "శంబళ గ్రామం" లో-కలియుగంలో-నాలుగోపాదంలో, హరివ్రతుడనే బ్రాహ్మణుడికి "కల్కి"
గా పుట్టగలడు. మనువు భార్య సుశీల, కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవ ప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా వుండి, మూడు జన్మల్లో విష్ణుమూర్తికి తల్లి అవుతుంది. శంబళ-సంబళ-శంభళ-సంభల అనే రూపాంతరాలు కూడా శంబళ గ్రామానికున్నాయి.
దేవతల క్షేమం కోరి శ్రీమహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు
సంకల్పించాడు కనుక, ఆయనకు సహాయపడేందుకు, బలవంతులను-కామ రూపులను-గోళ్ళు,కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశించాడు బ్రహ్మ. వాలి-సుగ్రీవులిరువురూ రామకార్యార్థమే పుట్టారు. ఇదొక రకమైన ఏర్పాటు. దీనినే "సమయ"
మని పేరు. వాలి రావణ వధకొరకు శ్రీరాముడికి సహాయపడేందుకు బదులు, రావణుడితో స్నేహం చేసాడు. భవిష్యత్ లో రామ కార్యానికి ఉపయోగ పడబోయే
సుగ్రీవుడికి హానిచేసి, అతడిని చంపే ప్రయత్నం చేసి, రామ కార్యాన్ని భంగపరచ తలపెట్టాడు. ఈ కారణాన వాలి రాముడి చేతిలో వధించబడ్డాడు. దశరథుడి వద్దకు విశ్వామిత్రుడు యాగ రక్షణకై రాముడిని పంపమని
అడగాడానికొచ్చేంతవరకు, భగవదవతారాన్ని గురించే చెప్పబడింది. ఇక ఇక్కడినుంచి, చివరివరకూ, భగవదవతార ప్రయోజనం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ ప్రయోజనాల్లో, శిష్ట రక్షణ - దుష్ట శిక్షణ - ధర్మ సంస్థాపన ముఖ్యమయినవి. ఈ ప్రయోజనాల్లో సేద్యం చేసేవారికి, ధాన్యంలాగా లభించే ప్రధాన ఫలం, శిశ్ఠపరిపాలనే. పైరు బాగుపడేందుకు ఏ విధంగానైతే కలుపు మొక్కలను
పీకేస్తామో, అదేవిధంగా, శిష్ఠరక్షణార్థమై నడమంత్రపు సిరైన దుష్ట శిక్షణ తప్పనిసరిగా
జరగాల్సిందే.
శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం
అవుతుంది. స్త్రీ వధ పాపం అని రామాయణమే చెపుతుంది. భరత వాక్యం - హనుమంతుడి వాక్యం అదే విషయం తెలియచేస్తుంది. అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీ వధ చేశాడు? భగవద్గీత పుట్టింది ఇలాంటి సంశయ నివృత్తికే. అర్జునుడు, శ్రీరాముడు - ఇరువురు క్షత్రియులే. స్వధర్మమని, బంధువులను చంపితే పాపం వస్తుందని, భయపడ్డాడు అర్జునుడు. స్వధర్మమని, స్త్రీ ని చంపవచ్చానని, శంకించాడు రాముడు. కృష్ణుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడో - విశ్వామిత్రుడు అదే చేశాడు రాముడికి. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి
ఆసక్తి లేకపోయినా చేశాడు. అందుకే శ్రీరాముడు తాటకను చంపడం దోషం కాదు.
ప్రపంచ సృష్టి విషయంలో పరిణామ వాదం అని, వివర్త వాదం అని రెండు రకాలున్నాయి. మట్టి ముద్దే కుండయినట్లు, సూక్ష్మాలైన చిదచిత్తులలో వుండే భగవంతుడే, స్థూల చిదచిద్విష్టుడై, ప్రపంచాకారంగా పరిణమించాడని - సూక్ష్మానికి, స్థూలానికి అణుత్వ బృహత్త్వ భేదం తప్ప, మరే భేదం లేదని - రెండూ సత్యమని చెప్పేదే "పరిణామ వాదం". ప్రపంచం మిధ్య - బ్రహ్మమే సత్యం, అనడం "వివర్త వాదం".
బాలుడు
యౌవనవంతుడైనట్లు, సూక్ష్మంగా వున్న వామనుడే ముల్లోకాలను ఆక్రమించి, త్రివిక్రముడై నందువల్ల, ఇరువురికీ భేదం లేదని - రెండూ సత్యమని, తేలడంతో, వామనావతారం పరిణామవాదాన్ని స్థిర పరుస్తున్నది. దీనికే "వామన త్రివిక్రమ న్యాయం"
అని పేరుంది. వామనుడు యాచించింది తన భార్య సొమ్ములకొరకు కాదు - తను బ్రతక లేక కాదు. యాచనా దోషం అందులోలేదు. గుర్వర్థమై - దేవతార్థమై - లోకోపకారార్థమై చేసే యాచన, యాచన కాదు.
క్షీరసాగర మధనం గురించి చెప్పినప్పుడు అనేక రహస్యాలు బాలకాండలో
వివరించబడ్డాయి. పాల సముద్రంలో అమృతం పుట్టడం యోగశాస్త్రాన్ననుసరించే వుంది.
మూలాధారమందుండే త్రికోణం మందరం. దాన్ని చుట్టి వున్న వాసుకి కుండలి. దాన్ని
మథించిన సురాసురులు ఇడాపింగళనాడులందుండే ప్రాణశక్తి వాయువులు. దీనంతటికి ఆధార
భూతుడు విష్ణువు. కుండలి మొదలు మేల్కొన్నప్పుడు, దేహంలో శక్తి ప్రసారమైన కారణాన, వికారాలు పుట్తాయి. అప్పుడు, ఆ యోగవిద్య తెలిసిన గురువు, దాన్నుండి అపాయం కలగకుండా చేయాలి. ఆ గురువే, వాసుకి భూషణుడైన శివుడు. శివుడు వాసుకి కంకణుడు కాబట్టి, విషం ఆయనను భాదించదు. భగవంతుడైన విష్ణుమూర్తే, గురువైన శివుడిని, అపాయాన్నుండి కాపాడమని
ప్రేరేపించాడు. ఆ తర్వాత, తానే ఆధారంగా నిలుచుండి, యోగి అభీష్ఠాన్ని నెరవేర్చాడు. అమృతం పుట్టినప్పటికీ, ఆ దశలో, హరి భక్తిలేని సాధకులు, అందగత్తెలను చూసి చెడిపోతారు. భగవంతుడిని ఆశ్రయించి వున్నవారు చెడరు.
అందువల్ల ఆయనే విఘ్నాలను అణచివేసి, అమృతాన్ని దేవతలకిచ్చాడు.
అహల్య శిలగా మారిందని కొన్ని గ్రంథాలలో చెప్పబడిన విషయం వాస్తవం
కాదని వాల్మీకి రామాయణం స్పష్టం చేసింది. వాల్మీకి మతమే వేరు. దుఃఖానుభవం లేకుండా, రాయిగా పడి వుంటే, పాప ఫలం అనుభవించినట్లెలా
అవుతుంది? అహల్య స్త్రీగా వుంటూనే, ఆహారం లేకుండా తాపంలో మాడుతుంటుంది. రామచంద్రమూర్తి ఆశ్రమ ప్రవేశం
చేయగానే ఆ తాపం తొలగి లోకానికి కనిపిస్తుంది. అంటే, జారత్వ దోషం పోవాలంటే, అనేక సంవత్సరాలు తపించి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి. అలా కాకపోతే వంశ నాశనం అవుతుంది.
గౌతముడు అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. జారత్వమే అభ్యాసంగా వుంటే, ఆ స్త్రీని పతితగా భావించి స్వీకరించ కూడదు-పరిత్యజించాలి.
గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకి రామాయణంలో, ప్రతి అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని
ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. వశిష్ట విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు. ఆత్మ విద్యకు, అనాత్మవిద్యకు మధ్య
జరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మవిద్య నేర్చుకున్నప్పటికీ, వాడు, ఆత్మవంతుడిని గెలవలేడు.
విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం
కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్టుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు కాని, తన ఉప్పు తిని-కృతఘ్నుడై-దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు
పూనుకున్నవాడిని, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి
తనను చంపే ప్రయత్నం చేసినవాడిని, దెబ్బకు-దెబ్బ అనికూడా
కీడు తలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు ఇతరులవల్ల నష్టపడినా
గాని, పరులకు హాని తలపెట్టడు. వశిష్టుడు
ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు.
విశ్వామిత్రుడి తపస్సువలన, సర్వం అనర్థకమైన కోపాన్ని జయించినవాడికే తపస్సిద్ధి కలుగుతుందనీ, బ్రాహ్మణ్యానికి కామ-క్రోధాలను జయించడం ఆవశ్యమని అర్థమవుతున్నది. కామ
క్రోధాలు రెండూ, రజోగుణం వల్ల కలుగుతాయి.
వీటికెంత ఆహారమైనా సరిపోదు. ఇవి మహా పాపాలు-శత్రువులు. తపస్సిద్ధికి
జితేంద్రియత్వం అవశ్యం. ఏం తిన్నా, తాకినా, చూసినా, విన్నా సంతోషంగాని-అసంతుష్టిగాని పడడో వాడే జితేంద్రియుడు. కామ
క్రోధాలను విశ్వామిత్రుడు జయిస్తే దశరథుడిపై కోపం ఎందుకొచ్చిందని సందేహం కలగొచ్చు.
ఆయన మునుపటి విశ్వామిత్రుడయివుంటే వాస్తవానికి శపించాలి. అలా చేయలేదు. ఆ కోపం ఆయన కార్య
సాధనకు తెచ్చుకున్న కోపం కాని, ఇంతకుముందు లాగా మనస్సులో
కాపురముంటున్న కోపం కాదు.
వాల్మీకి రామాయణం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, కీర్తి
శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారి శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం మందరాలు చదివి తీరాలి. ఆ
మాటకొస్తే వాల్మీకి రామాయణాన్ని యథా వాల్మీకంగా, పూర్వ
కాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి ఆయన ఒక్కరే. ఆ
మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగునేల
నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి. ఎనిమిదేళ్లలో
రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, ఒంటిమిట్ట కోదండ
రామస్వామికి అంకితం చేసారు. ఆ తరువాత "మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం
రాసారు. తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక
పద్యం వంతున రాసారు వాసు దాసుగారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను
విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీ రామాయణ
వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది.
వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుందనే విషయం ఆయన మందరంలో స్పష్టంగా
కనిపిస్తుంది. వాస్తవానికి ప్రతి కాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. శ్రద్ధగా
చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల
శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ప్రతి కాండ ఒక ధర్మశాస్త్రం, ఒక రాజనీతి శాస్త్రం, ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ
శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక,
సామాన్య, నీతి, సంఖ్యా,
సాముద్రిక, కామ, రతి,
స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా
దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ
వుంటే, మందరం ఏ ఒక్క కాండ మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో
పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి.
ఇక్కడొక విషయం చెప్పాలి. మనమేమో వాల్మీకినీ,
శ్రీ
రామాయణాన్నీ, రామాయణం మంచిదన్న ప్రతివారిని
కించపరిచే విధంగా వ్యాసాలు రాస్తుంటాం. విదేశీయులేమో దానిని ఒక మహత్తర గ్రంథంలాగా
భావించి తమ గ్రంథాలయాలలో జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. వాసు దాసు గారి
"నిర్వచన రామాయణం" లోని నాలుగు (బాల, అయోధ్య,
అరణ్య,
కిష్కింధ)
కాండలు 1909 వ సంవత్సరంలో నాటి చెన్నపురి (నేటి చెన్నై) లోని "శ్రీ వైజయంతీ
ముద్రా శాల" లో ముద్రించబడి, ఒక
అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు
చెందిన "బర్క్ లీ" గ్రంథాలయం చేరుకుని, అక్కడ
భద్రపరచబడింది. "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నేను
కాలిఫోర్నియాలో వుండగా నా దృష్టికి వచ్చింది. అపురూపమైన అలనాటి గ్రంథకర్త
అభిప్రాయాలు అక్షర లక్షలు చేసే ఆణిముత్యాలు. తెర మరుగవుతున్న వందేళ్లనాటి
అపురూపమైన తెలుగు సాహిత్యంలోని అత్యంత ఆదరణీయమైన వాసు దాసుగారి అభిప్రాయాలు అందులో
వున్నాయి.
అందుకే-ఇందుకే వాల్మీకి రామాయణం చదవాలి. చదివినకొద్దీ-ఆస్వాదించినకొద్దీ, అనేక ప్రశ్నలు-సరైన సమాధానాలు పుట్టుకొస్తాయి. చదవాలని
మొదలుపెట్టి-పూర్తిగా చదివిన వారికి, ఇంతకాలం ఎందుకు చదవలేదానన్న వెలితి క్షణంలో
పోతుంది. End
వనం జ్వాలా నరసింహ రావు గారు , నమస్కారం!!
ReplyDeleteమీ వ్యాసాలూ అనన్య సామాన్యంగా మరియు అద్భుతంగా ఉంటాయండి!!
ముఖ్యంగా ఈ వ్యాసం చాల చాల ఆద్భుతమైన విశ్లేషణ!!
ఇలాంటి చక్కటి విషయాలని రాస్తున్నందుకు మరోమారు ధన్యవాదాలు !!
** మీకభంతరం లేకపోతె నేను ఈ వ్యాసాన్ని ఫేస్బుక్ ద్వారా పంచుకుంతానండి!! మీ లింక్ ఇచ్చి మరీ !! **
- శశి కుమార్
Please do so if you want to...
DeleteThanku for giving such a great article.and find latest Telangan news
ReplyDeleteJwala Ji.. With your permission.. I submitted this post (as yours only) in one my facebook groups..
ReplyDeleteThank you
Kishan
No copy right for me. You can use any of my articles as you want to use. You may share any item. Regards, Jwala
Delete