కల విషయం చెప్పి రాక్ష స్త్రీలను మందలించిన త్రిజట
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (26-02-2018)
తనకొచ్చిన కల విషయం చెప్పడంతోపాటు, రాక్షసస్త్రీలను
మందలిస్తుంది కూడా త్రిజట ఇలా:
"రాక్షసస్త్రీలారా లేచి చాటుగా పొండి. సీతాదేవిని
తీసుకెళ్లటానికి ఇక్కడకు వచ్చిన రాముడు, భయంకరంగా రాక్షసులందర్నీ చంపుతున్నప్పుడు, తనభార్యను
బాధించిన మిమ్ములనందరినీ కూడా చంపకుండా వూరుకోడు. తనమీద ప్రేమున్నదనీ, తన్నేనమ్మిందనీ, తనతో సంతోషంగా అడవులకు
వచ్చిందీమె అనీ, భావించే రాముడు, సీతకొరకై రాక్షసులందర్నీ చంపుతాడు. అందువల్ల మీమాటలు చాలించండి. బెదిరింపు
మాటలు మానండి. ఇంకా బెదిరిస్తే మన ప్రాణాలకు అపాయం వస్తుంది. ప్రాయశ్చిత్తంతో
క్షమించమని సీతను వేడుకుందాం. నా కల నిజమైన కల. సీత తప్పక తనభర్తను చేరుతుంది.
సీతాదేవిని మనంబెదిరించాం, అరిచం, నిర్బంధించాం
కాబట్టి మనమీద ఆమెకు ఎందుకు దయవుంటుందని అనుకోవద్దు. రావణుడు చస్తే మనలను, అయ్యోపాపం అని, అపాయం నుండి
రక్షించే వారెవరున్నారు? సీత “ప్రణతి ప్రసన్న” అంటే,
నమస్కార
ప్రియురాలు. మనమెన్ని తప్పులు చేసినా నిష్కల్మషమైన బుధ్ధితో క్షమించమని
వేడుకుంటే, శాంతించి మనలను తప్పక కాపాడుతుంది. మనకు రానున్న ఉపద్రవం నుండి ఈమె తప్ప వేరు
ఎవరూ రక్షించలేరు. కల సంగతటుంచి,
ఈమెకు శాశ్వతంగా పతి వియోగముందని తెలిపే గుర్తులు ఈమె
శరీరంపైన ఎక్కడాలేవు. భర్త ఈమెకు తప్పక దర్శనమిస్తాడు."
"సీత దు:ఖాన్ని అనుభవించడానికి అర్హురాలుకాదు. ఈమె
దివ్యసుఖాలను అనుభవిస్తుంది. ఈమెను బాధిస్తే మనకొచ్చిన లాభమేంటి? నేనుచెప్తున్న
మాటలు అసత్యంకాదంటానికి ఆమెను ఓ మారు జాగ్రత్తగా చూడండి. పొడగైన తామరరేకుల్లాంటి
ఆమె ఎడమకన్ను ఎట్లదురుతుందో చూడండి. అది ఆమెకు మేలుచేస్తుంది. ఈమె అనుకున్నట్లే
భర్తను కలుస్తుంది. రావణుడు నాశనం అవుతాడు. రామచంద్రమూర్తి గెలుపు ఖాయం"
అంటుంది.
(ఇదిచెప్తుంటే ఉన్నట్లుండి సీతాదేవి ఎడమచేయి పులకించి
అదిరింది. ఎడమతొడా అదిరింది. అంటే రాముడు సమీపంలోనే వున్నాడని మంగళసూచిక. మొదట
సీతమ్మ ఎడమకన్ను అదిరింది. వెంటనే ఎడమ భుజం అదిరింది. తరువాత ఎడమ తొడ అదిరింది. ఇవన్నీ
త్రిజట చెప్పినప్పుడు ఆ రాక్షస స్త్రీలంతా చూసారు. నిజమేనని నమ్మక తప్పింది కాదు.
పురుషులకు కుడివైపు భాగాలు శుభప్రదాలు. స్త్రీలకు ఎడమవైపు భాగాలు మంగళప్రదాలు.
అదరడం అంటే ప్రొద్దస్తమానం అదరడమని కాదు. క్షణకాలం పాటుకలిగే స్పందన అది. సీతమ్మకు
ఎడమవైపు శరీర భాగాలు అదరడం శుభసూచకం. దాన్ని బలపరుస్తూ చెట్టుపైనున్న పక్షి కూయడం
విశేషం).
కొమ్మలమీదున్న పక్షులు అమితమైన సంతోషంతో, ఓదార్పు మాటలు పల్కుతూ, శుభసూచకం
ప్రేరేపిస్తూ సీతకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయనీ,
దీన్నిబట్టి సీతకు త్వరలోనే శుభం కలుగనున్నదనీ, కాబట్టి
రాక్షసులు ఆమెను బాధించవద్దనీ అంటుందిత్రిజట. దూరంగా పొమ్మనీ, ఆమెను నిర్భయంగా వుండనీయమనీ అనగానే, రాక్షసస్త్రీలంతా, త్రిజట చెప్పినట్లే సీతాదేవి శరణుజొచ్చారు. రక్షిస్తానని
సీత వారికి అభయమిస్తుంది.
(త్రిజట విభీషణుడి కూతురని కొందరు, కాదని మరి కొందరు అంటారు. ఆమె సీతాపక్షపాతి, అభిమానం వున్నామె. కలంతా కల్పితమనుకున్నా, కోతివచ్చే విషయమ, లంక కాల్చే విషయం వూహించని విషయమేకదా! అంటే స్వప్నమంతా
కల్పితం కాకపోవచ్చు. శూన్యవాదులు, మాయావాదులు, నాస్తికులు, స్వప్నాలు అసత్యమంటారు. రామాయణంలో మూడు
స్వప్నాలున్నాయి. దశరధ స్వప్నం, భరత స్వప్నం, త్రిజట స్వప్నం. మూడూ నిజమయ్యాయి. ఆరోగ్యవంతులై నిర్మలమైన మనస్సున్న వారు
కన్న కలలు నిజమవుతాయి. అనుభవంలో నేటికీ ఎన్నో స్వప్నాలు నిజమైన దాఖలాలున్నాయి.
పురుషుడికి(జీవాత్మకు) రెండు స్థానాలే వున్నాయి. ఇహలోకం, పరలోకం. మూడోది స్వప్నమనే తృతీయ స్థానం. అది ఇహ-పరలోకాల సంధిస్థానం.
ఆ సంధి స్థానం నుండి ఇహ-పరలోకాలను రెండింటినీ చూస్తున్నాడు. పొలిమేర నుండి
రెండువైపులా వున్న గ్రామాలను చూసినట్లే ఇదికూడా. భగవంతుడే నిద్రపుచ్చుతూ, మేల్కొన్నప్పుడున్న ఇంద్రియాలను తానే గ్రహించి,
బాహ్యేంద్రియాలను విస్తరించి, స్వప్నాలను వాడి, వాడి అదృష్టం
ప్రకారం సృష్టించి, కొంతసేపు వాడనుభవించేటట్లు చేస్తాడు.
స్వప్నంలో కనిపించేవన్నీ సృష్టించబడినవే. అక్కడ రథాలు లేవు,
గుర్రాలు లేవు, రథం పోయే దారీ లేదు,
గుంటలూలేవు, పుష్కరిణులూ లేవు, నదులూ
లేవు. ఏమీలేవు. అన్నీ సృష్టించబడినవే. ఆ సృష్టికర్త భగవంతుడే.
జీవుడు చేసిన పుణ్య-పాపాలను అనుభవించేందుకై, భగవంతుడే దానికి
కావాల్సిన విషయాలను అప్పటికప్పుడే సృష్టిస్తాడు. కాబట్టి స్వప్నాల్లో చూసినవన్నీ
అసత్యం కాదు. రెండుగ్రామాలు సత్యమైతే, నడుమనున్న పొలిమేర ఎట్లా అబధ్ధమవుతుంది? కలల్లో సాధారణంగా
అప్రియాలు కనబడవంటారు. ఎవడూ అప్రియాలను కోరుకోడుకదా! స్వప్న సృష్టికర్త భగవంతుడే.
మొదటిజాములో వచ్చిన కల సంవత్సరానికి ఫలిస్తుందనీ,
రెండోజామున వస్తే ఎనిమిదినెలలకనీ, మూడోజామున వస్తే
మూడునెలలకనీ, నాలుగోజామున వస్తే నెలకేననీ, అరుణోదయ వేళవస్తే పది దినాలకనీ, సూర్యోదయాన వస్తే
మూడురోజుల్లోనే ఫలిస్తుందనీ అంటారు. ఆవులు పితికే వేళ వస్తే వెంటనే ఫలిస్తుందట. ఏ
కల ఏ జాములో వస్తే ఎన్నాళ్లకు ఫలిస్తుంది అన్న విషయాన్ని అటుంచితే, స్వప్నాలు
యదార్థమొతాయనడం శాస్త్ర సమ్మతం. అయోధ్యలో దశరధుడి స్వప్నం, మాతామహుల ఇంట్లో వుండగా భరతుడికి వచ్చిన స్వప్నం, లంకలో త్రిజటకు వచ్చిన స్వప్నం, వెరసి మూడూ ఫలించాయి కద! వాల్మీకి అద్భుత రచనా వైచిత్రి
ఇక్కడ గమనార్హం. త్రిజట తన స్వప్నాన్ని వివరించిన విధం రాక్షస స్త్రీలకు
హడలెత్తించగా, శింశుపా వృక్షంపై చక్కగా కూర్చొని ఇదంతా వింటున్న హనుమంతుడికి ఇక చేయవలసిన పని
ఏదో అందంగా సూచించినట్లయింది.)