రాక్షసస్త్రీలకు పరుషంగా జవాబిచ్చిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (12-04-2018)
దుఃఖంతో పరితపిస్తున్న సీత రాక్షస స్త్రీలతో ఇంకా ఇలా
అంటుంది:
"నీచుడైన రావణుడు నాకు ఏడాది గడువిచ్చాడు. అదివాడి చావు గడువు. అదిదగ్గర
పడ్తున్నది. ఆ గండం తప్పించుకోవడం, మీ రాక్షసులకు తెలవదు.
ఉత్పాతం ఇప్పుడే పుట్తున్నది... చూస్తుండండి. ధర్మ మార్గంలో అపాయం తప్పించుకోవడం
తెలియని మూఢరాక్షసులు,
ఈ కీడుమూడింది నావల్లనేనని, రావణాసురుడి భోజనానికి నన్ను హింసించి పంపుతారేమో! ఆమాత్రం కీడుతప్పదు. రాముడు
తమను చంపుతుంటే, వాళ్లు నన్ను చంపుతారు. నా
ప్రాణేశ్వరుడు దయాశీలి, తామర రేకుల్లాంటి కళ్లున్న రామచంద్రమూర్తినే విడిచి ఏడుస్తున్న నన్ను
మీరేంచేసినా, నేనేంచేయగలను?"
"ఈ లంకలో నేనింకా బ్రతికే వున్నాననీ, తనకై
విలపిస్తున్నాననీ,
రామచంద్రమూర్తికి తెలియదేమో! లక్ష్మణుడైనా చెప్పేవాడే!
భూమండలమంతా గాలించక ఎట్లావూరుకుంటాడు? ఒకవేళ నాపై శోకంతో అడవిలో
మరణించాడేమో! ఇక నేనేం చేయాలి? రామా! రామా! అని నేనిక్కడ
అంగలారుస్తున్నానుకదా! రాముడితో సాంగత్యం నాకుమంచిదా, ఆయనకు మంచిదా? శ్రీరాముడు పరమాత్ముడు, జీవాత్ములందరికంటే గొప్పవాడు. ఆయన స్వరూప-స్వభావాలు, జీవాత్ములకంటే వుత్తమమైనవి. ఆయన సర్వజ్ఞుడు. తానెవరెవరి విషయంలో
ఎట్లాప్రవర్తిస్తే బాగుపడతారో, అలానే చేస్తాడు.
జీవకోటిని వుధ్ధరించడంలో సర్వదా ఆసక్తి వున్నవాడు. రాజులందు ఋషిలాంటివాడు.
జీవకోటులను పాలించే వాడు. ఇట్టిసదాచార సంపత్తిగల రాముడి ఆజ్ఞకు లోబడిపనిచేసే
దాన్ని నేను. ఆయన విషయంలో పొరపాటుచేసి దారితప్పనూ వచ్చు. ఇలాంటి నావలన ఆయనకేం లాభం? నామేలుకోరి నేనే ఆయన్ను సేవించాలి. నేనుసేవించకున్నా ఆయనకొచ్చే
లోపంలేదు."
"రామచంద్రమూర్తి రాజు కాబట్టి ఎదురుగా వున్నవారిని ఎక్కువగా ప్రేమించడం, చాటునున్న వారిని మర్చిపోవడం జరగవచ్చు. అందువల్ల ఎదురుగా
వున్నప్పుడు నన్నెంత ప్రేమించినా, కనుమరుగైన నన్ను
మర్చిపోయాడేమో! అందుకే వెతికే ప్రయత్నంకానీ,
ఇక్కడకొచ్చే ఆలోచనకానీ చేయడం లేదేమో! రామచంద్రమూర్తి కృతఘ్నుడుకాడే
మర్చిపోవడానికి! ఒక్క ఉపకారంచేసినా ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాడే! అట్టివాడు నన్ను
మర్చిపోతాడా! చాటుగా వున్నప్పుడు, ఎదురుగా వున్నప్పుడు, వేరేలాగా నేను వుండవచ్చునుకాని రాముడలాంటివాడుకాదే!"
"అంత ప్రేమ నీపైనున్న భర్త ఇంకారాలేదని అంటున్నావా రాక్షసీ! అది ఆయన లోపంకాదు.
నన్ను ఆయన అనుగ్రహించేటంత మంచిగుణాలు నాలో లేవేమో! ఉన్నా ప్రారబ్ధవశాన్న పుణ్యఫలం
చెడిపోయిందేమో! ఆకారణంతో నాభర్తనుండి నేను వేరైనానుకాని ఆయనకు నాపై దయలేకకాదు. ఆయన
నన్ను మరువనూలేదు. దోషమెవరిదైనా ఎందుకు రాలేదంటే,
ఏంచేస్తావిప్పుడంటే,
ఒకటే సమాధానం. అటువంటి శూరుడు, ధైర్యసాహసాలు కలవాడు, శత్రుసంహారకుడు, కళ్యాణగుణధనం కలవాడు, గొప్పస్వభావం, గొప్ప మనసున్నవాడు, మిగుల గంభీరుడు,
త్యాగైన శ్రీరామచంద్రమూర్తిని విడిచి బ్రతకడంకంటే చావడమే మేలు."
"రామచంద్రమూర్తి ఎందుకురాలేదంటే దానికి రెండు కారణాలున్నాయి. బహుశా కందమూలాలు
తిని, శస్త్రాస్త్రాలు వదిలి,
నా ఎడబాటువల్ల కలిగిన దుఃఖంతో, అవమానంతో, శోకతప్తులైన
అన్నతమ్ములిద్దరూ మరణించైనానా వుండాలి. వంచకుడైన రావణుడు నీతిమంతులైన
రామలక్ష్మణులను మోసగించి చంపించైనా వుండాలి. వారు మరణించి వుండి రాలేకపోయారేకాని, జీవించి వుంటే వచ్చేవారే! ఇంత దుర్దశలకు పాల్పడి ఇంత కష్టమనుభవిస్తున్న ఈనీచురాలికి
చావే సుఖం. అయినా యముడికి నామీద దయలేదు. ఏం చేయాలి?"
మనస్సును, ఇంద్రియాలను జయించి, శీతోష్ణాలు, సుఖ-దు:ఖాలు,
లాభనష్టాలు,
అనే విషయాలను త్యజించి, ప్రియమైనా, అప్రియమైనా, మనస్సు దగ్గరకు రానీయక, సుఖంకలిగితే సంతోషించక, దుఃఖం కలిగితే బాధపడక, ఎటువంటీ దిగులులేని మునీశ్వరులెంత పుణ్యాత్ములోకదా! దేహాభిమానం వుంటే సంతోషం, భయం రెండూ కలుగుతాయి. శుభకరాలైన గుణాలున్న మునులకు
మ్రొక్కాలి. ఆత్మ జ్ఞానముండి నాకు
ప్రియుడైన, సద్గుణవంతుడిని,
రామచంద్రమూర్తిని,
విడిచి, ఆత్మజ్ఞానంలేక, నాప్రీతిపాత్రుడుకాక, దుర్గుణాలున్న
పాపపు రావణుడికి స్వాధీనపడి బ్రతకడంకన్న చావనైనా చస్తాను" అని
రాక్షసస్త్రీలకు పరుషంగా జవాబిస్తుంది సీతాదేవి." ఆత్మహత్య మహాపాపం అంటారు.
అలా బలవన్మరణం చేసినవారికి మైల, మృతాశౌచం పట్టకూడదంటారు.
అలాగే అగ్నిసంస్కారం కూడా చేయకూడదట. నీళ్లు విడవకూడదట.
(లంకానగర పతనం గురించి, రాక్షసనాశనం గురిన్చి, సీతాదేవి తనకు భూమ్యాకాశాలలో కనిపించిన శకునాలను బట్టి చెప్పింది.
ఉత్పాతచిహ్నాలు అరిష్ట సూచకాలు. రామదర్శన భాగ్యం కలిగిన జనులు ధన్యులని చెప్పాలి.
సంసారమందున్న భక్తులు ఎట్తిరూపంలో భగవంతుడిని చూడదల్చుకున్నారో, పరమపదంలో కూడా అట్టిరూపంలోనే చూడగల్గుతారు. సీతారాములను
సేవిస్తూ ముక్తులయ్యేవారికి, పరమపదంలో భక్తులకు, భగవంతుడు సీతారామమూర్తిగానే కనపడతాడు. "జీవాత్మ"లు భగవంతుడిని
సేవించడం తమ మేలుకొరకే గాని, ఆయన్ను వుధ్ధరించడానికి
కాదు. "జీవాత్మ"లు సేవించనంత మాత్రాన ఆయనకు వచ్చిన లోటేం లేదు. జీవాత్మలు
భగవంతుడి విషయంలో ఎన్ని అపచారాలు చేసినా, భగవంతుడట్లా చేయడు.
దూరంగా వున్నంత మాత్రాన బిడ్డలను తల్లితండ్రులు మర్చిపోతారా? అట్లానే భగవంతుడు.)
No comments:
Post a Comment