Sunday, February 18, 2018

తన స్వప్నవృత్తాంతాన్ని తోటి రాక్షసులకు చెప్పిన త్రిజట ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


తన స్వప్నవృత్తాంతాన్ని తోటి రాక్షసులకు చెప్పిన త్రిజట
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (19-02-2018)

సీతాదేవి చెప్పిన ఈమాటలు విన్న రాక్షసస్త్రీలు కోపంతో వూగిపోయారు. కొందరేమో రావణాసురుడికి ఫిర్యాదు చేసారు. కొందరేమో, మామాట వినడంలేదు, మరణించే ప్రయత్నం చేస్తుందన్నారు. మరి కొందరామెను తిరిగి బెదిరించారు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడే నిద్రిస్తున్న "త్రిజట" అనే వృధ్ధ రాక్షస స్త్రీ, వీళ్లమాటలకు మేల్కొని, పడుకొనే వీళ్లందరినీ మందలించింది. ఇంతవరకూ చేసింది చాలు, ఇకమాట్లాడడం ఆపుచేయండని వాళ్లను హెచ్చరించింది. సీతాదేవిని, రాముడి భార్యను, జనకరాజు పుత్రికను, దశరథుడి కోడలిని, భుజించే శక్తి వాళ్లెవరికీ లేదని, దూరంగా పొమ్మని అందరినీ గద్దిస్తుంది. ఆమెను బాధించవద్దనీ, తినదల్చుకుంటే ఆమె బదులుగా తనను తినమని అంటుంది. ఈ రాక్షస సమూహమంతా మూలమట్టంగా నాశనమౌతుందని, సీతాదేవి భర్తకు విజయం తధ్యమని కలగన్నాననీ, ఆ కలను తల్చుకుంటే దేహమంతా వణుకుతున్నదనీ, తనకల విషయం వివివరంగా వినమనీ అనగానే రాక్షస స్త్రీలందరూ భయంతో ఆమె చుట్టూ చేరారు. తాను కలలో చూసిన సన్నివేశం  వివరాలను ఇలా చెప్పసాగింది త్రిజట:

"తెల్లటి ఏనుగు దంతంతో తయారై, ఆకాశంలో పయనించగలిగిన పల్లకీని, వేయి హంసలు లాగుతుంటే, తెల్లటి వస్త్రాలు కట్టుకుని, రామచంద్రమూర్తి, లక్ష్మణుడితో కూడి వస్తాడు. సీత అందమైన తెల్లటి చీరె కట్టుకుని, పాలసముద్రంలో, తెల్లటి పర్వతం మీద సూర్యుడితో కూడిన ప్రభలాగా, రాముడితో వుండగా చూసాను. నాలుగు దంతాల కొండలాగున్న ఏనుగుపై లక్ష్మణుడితో రాముడు పోతుండగా చూసాను. (కలలో ఎడ్లను, ఏనుగులను, మేడలను, కొండ శిఖరాలను, కాచే, పూచే చెట్లను ఎక్కడం, మలం పూసుకోవడం, ఏడ్వడం, చావడం, పొందరాని దానితో పొందడం చూస్తే శుభ సూచకమంటారు)

         "తెల్లటి వలువలు, పూదండలు ధరించి, ధీరుల్లో శ్రేశ్ఠులైన రామలక్ష్మణులు, చిగుళ్ల లాంటి పాదాలున్న సీత పక్కన సంతోషంతో వుండగా చూసాను. అదిచూడగానే నా గుండెలు పగిలాయి. ఆపర్వత శిఖరం మీద ఆకాశాన్ని తాకుతున్న ఏనుగుపై, రాముడి తొడమీద సీతాదేవి కూర్చొని వుంది. సూర్యచంద్రులను తాకుతున్నదా అనిపించింది. (కలలో సూర్య మండలం కానీ, చంద్ర మండలం కానీ చేతుల్తో పట్టుకున్నట్లు కనిపిస్తే, వాడికి గొప్పరాజ్యం లభిస్తుంది). రాజకుమారులైన రామలక్ష్మణులు, చంద్రుడిలాంటి ముఖమున్న సీతాదేవి, స్పష్టంగా భద్రజాతి ఏనుగుపై కూర్చొని లంకమీద ఆకాశాన వున్నట్లు కలగన్నాను. ఎనిమిది మేలుజాతి ఎడ్లను కట్టిన రధమెక్కి రామచంద్రుడు ఈ సీతాదేవితో రావడం చూసాను."

"సూర్యకాంతిగల పుష్పక విమానం ఎక్కి రామలక్ష్మణులు, ఉత్తరదిశగా సీతతో పోతుంటే చూసాను. విష్ణుపరాక్రముడు, మహాబుధ్ధిశాలి, శ్రీరామచంద్రమూర్తి, సీతతో, తమ్ముడితో వుండగా చూసాను. ఇది నిజమవుతుందనిపిస్తున్నది". (స్వప్నక్రమం: రామలక్ష్మణులు పల్లకీలో సీతను వెతుకుతూ లంకకు వస్తారు. లంక దగ్గర పాలసముద్రంలో ఒక తెల్లటి కొండ దగ్గరకు రాముడు వచ్చి చేరుతాడు. సీతకూడా ఆ కొండ దగ్గరే వుంది. రామలక్ష్మణులు పల్లకి దిగి ఏనుగునెక్కి సీత దగ్గరకొచ్చారు. సీతకూడా ఏనుగునెక్కి పెనిమిటి తొడపై కూర్చున్నప్పుడు సూర్యచంద్రులను తాకుతున్నట్లుగా వుంది. ఈవిధన్గా వాళ్లు లంకకు ఆకాశమార్గాన వచ్చి, ఏనుగు దిగి, ఎనిమిది ఎడ్లు కట్టిన రధంపై కూర్చుని, లంకకొచ్చి, పుష్పకవిమానం ఎక్కి ఉత్తరదిశగా పోయారు)


"పాపాత్ములు స్వర్గం దగ్గరకు ఎట్లా పోలేరో, అట్లే దేవరాక్షస సమూహాలు యుధ్ధరంగంలో, శ్రీరాముడిని సమీపించలేవు. రావణుడు ఒంటికి నూనె పూసుకుని, నూనె త్రాగుతూ, గన్నేరు పూల దండలు మెళ్లో వేసుకుని, ఎర్రబట్టలు కట్టుకుని, బోడితలతో, నల్లబట్టలు ధరించి, పుష్పక విమానం నుండి ఒక ఆడది ఈడుస్తుంటే, నేలపైబడి బాధపడ్తుంటే చూసాను. గాడిదలు కట్టిన రధం మీద, ఎర్ర పూదండలు వేసుకుని, ఎర్రగంధం పూసుకుని, పిచ్చివాడిలాగా నూనె త్రాగుతూ, గంతులేస్తూ, గాడిదమీద దక్షిణ దిక్కుగా పోతుంటే చూసాను. గాడిదమీద పోతున్న వాడల్లా తలకిందులుగా పడిపోతాడు. పడి, భయంతో దిగ్గునలేచి, తెల్లబోయి, మత్తుతో వికలుడై, భయపీడితుడై, వాగుతూ, బట్టలిప్పేసి, దిక్కుతోచక, భయంకరమైన, అసహ్యమైన బురదలో పడిపోవడం చూసాను. కాళి అనే ఓ స్త్రీ ఎర్రగుడ్డేసుకుని, బురద పూసుకుని, వాడిమెడను కౌగలించుకుని, రాక్షసరాజును దక్షిణదిక్కుగా ఈడ్చుకుంటూ పోతుంది."

"కుంభకర్ణుడి పైకూడా ఇలాంటికలే కన్నాను. రావణుడి కొడుకులు నూనెలో మునగడం చూసాను. పందిపై రావణుడు, మొసలిపై ఇంద్రజిత్త్తు, ఒంటెపై కుంభకర్ణుడు దక్షిణదిక్కుగా ప్రయాణం చేయడం చూసాను. ఒక్క విభీషణుడు మాత్రం తెల్ల గొడుగు, తెల్ల బట్టలు, తెల్లగంధం పూతతో, ఆటపాటలమధ్య, మేఘధ్వనిగల ఒక పెద్ద ఏనుగునెక్కి నలుగురు మంత్రులతో ఆకాశ మార్గంలో పోతుంటే చూసాను. ఎర్రగుడ్డలు, ఎర్రమూల్యాలు ధరించి మేళతాళాలతో వుండగా చూసాను. విరిగిన గోపురాలతో వున్న రావణరక్షణలోని లంక సముద్రంలో పడుతుంటే చూసాను. రాముడికి భృత్యుడైన ఓ కోతివచ్చి లంకను కాల్చి బూడిదచేయగా చూసాను. ఏడుస్తున్న ఆడవాళ్లు నూనె త్రాగి లంకలో వేడి బూడిదలో పడిపోవడం, కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు పౌరుషం పోయి, పేడమడుగులో పడుతుంటే చూసాను."

No comments:

Post a Comment