మనసు నాస్వాధీనం....దాన్ని మీరేమీ చేయలేరు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (04-02-2018)
శ్రీరాముడిని తలచుకొని దుఃఖించిన సీత, రాక్షసస్త్రీల పైన తన కోపాన్నీ, అశక్తతనూ
చూపిస్తుంది. పరుషంగా మాట్లాడుతుంది. "మీ నోళ్లు పట్టెతంత చిన్న-చిన్న
ముక్కలుగా నాశరీరాన్ని కోసుకోండి. కత్తులతో నరకదల్చుకుంటే అలానే చేయండి. మంటల్లో
వేయదల్చుకుంటే వేసికాల్చండి. మీ ఇష్టం వచ్చినట్లు మీరుచేయండి. నేనైతే మీమాట వినను.
ఎందుకు మీకీమిడిసిపాటు? గర్వం? నాదేహం మీవశం. ఏమైనా చేసుకోండి. మనసు నాస్వాధీనం....దాన్ని మీరేమీ
చేయలేరుకద!" అని తెగేసి చెప్పి మళ్లీ రామధ్యానం లోకిపోయి ఈవిధంగా
అనుకుంటుంది.
"రామచంద్రమూర్తి నన్ను ఉపేక్షించడానికి కారణమేంటి? ఆయన దయాగుణం లేనివాడా? కాడే! నీ వాడినన్న ప్రతివాడిని, వాడిలో
ఎన్ని దోషాలున్నా పట్టించుకోకుండా మంచి గుణాలను స్వీకరించేవాడుకదా! ఇట్టివాడు నా
దోషాలను ఎందుకెంచుతాడు? ఇంతకాలం తనసేవ చేస్తున్న
నన్నుమరవడం ఎందుకు?
తనపైన విశ్వాసమున్న వారికెవరికైనా, ఏ దుఃఖం కలిగినా, అదితనకు కలిగినట్లే
భావించి బాధపడే రాముడు, తనకొరకై అడవుల పాలైనదాని విషయంలో
బాధపడకుండా వుండగలడా? ఇతరుల అభివృధ్ధి కోరి, ఇంకా ఎవరెవరిని బాగుపరచాలా అన్న ధ్యాసతో సర్వజనుల శాంతి, సౌఖ్యాలు కోరి, వారికి ముక్తినిచ్చేవాడు, నామేలుకూడా కోరడా?
పధ్నాలుగువేల రాక్షసులను
చంపి జనస్థానాన్ని హతస్థానాన్ని చేసాడు ఒక్కడే. సామర్ధ్యం కొరవై
వూరుకుంటాడా?
ఆయన దయ రాకపోవటానికి నాదురదృష్టమే కారణమై వుండాలి.( ఇలాంటి
భావన నిజమైన భక్తుడికే కలుగుతుంది. భగవత్ కటాక్షం తనకు కలగలేదని భగవంతుడిని తప్పు
పట్టడు. ఆ యోగ్యత తనకింకా కలగలేదనే అనుకుంటాడు. తనలోని లోపాలను సరిదిద్దుకొని, చేయాల్సిందంతా చేసి,
అన్ని ప్రయత్నాలూ చేస్తాడు. అయినా తాను పూర్ణభక్తి
సంపాదించుకున్నానని గానీ, భగవంతుడే కఠినుడై అనుగ్రహించలేదనిగానీ
అనుకోడు. ఎవడు పూర్ణ భక్తుడనని అనుకుంటాడో, వాడు నిజమైన భక్తుడు కాదు. నిజమైన భక్తుడు, ఇంకా, ఇంకా, భాగవత సేవ చేయలేకపోయానే!
అని విచారిస్తాడు. భగవత్ సేవ చేయలేక పోయానే అని అసంతృప్తి చెందుతాడు. భగవత్
కైంకర్యం చేస్తూనే వుంటాడు. ఇది భక్తుడి స్వభావం.)
రాముడిని ధ్యానం చేస్తూ పరిపరివిధాలుగా అనుకుంటుంది సీత.
రామచంద్రమూర్తి శక్తిచాలక తనను రక్షించడానికి రాలేకపోవడం నిజంకాదని, దానికి కారణాలను వెతుకుతుంది. "నన్నీ ప్రకారం బాధపెట్తున్న
ఒక అల్పుడు, బలహీనుడూ, అయిన రావణుడిని చంపడానికి ఎందుకు రావడంలేదు? నాకొరకేకదా ఖర-దూషణులను చంపాడు. ముఖా-ముఖి తలపడ్డారుకాబట్టే వాళ్ళందర్నీ
చంపగలిగాడా?
సముద్రమధ్యంలో వుండి కనపడడంలేదు కనుక, రావణుడిని చంపడంలేదా?
లంక సముద్రంలో వున్నా, ఇతరులకు
రావడం అసాధ్యమైనా,
ముల్లోకాల్లో తిరుగులేని రామబాణాలకు సముద్రం ఎట్లా
అడ్డమౌతుంది?
నామీద ప్రేమ వున్నవాడు, ఎన్నో
ఆపదలనుండి రక్షించినవాడు, నేడు దయ తప్పికానీ, శక్తిచాలక కానీ, వూరుకున్నాడని అనుకోలేము.
మరెందుకు వూరుకున్నాడు?
నేనెక్కడ వున్నానో ఆయనకు తెలిసుండక పోవచ్చు. అంతేకాని, తెలిస్తే పౌరుషమున్న ఆయన తన భార్యను ఇతరులు ఎత్తుకునిపోతే ఆ అవమానాన్ని ఎట్లా
సహిస్తాడు?
పోనీ అసలే తెలియదా అందామంటే, అదీనిజంకాదు. జటాయువు బ్రతికుంటే, నాజాడ చెప్పే
వుంటాడు" అనుకుంటుంది.
జటాయువును తలచుకోగానే ఆయన ధైర్యసాహసాలు గుర్తుకొచ్చాయి
సీతకు. "వీరుడైన జటాయువును రావణుడు చంపి వుండవచ్చుగాక! అతడు వృధ్ధుడై
వుండికూడా ఎంతో సాహసం చేసాడు. నిరాయుధుడైనా, ద్వంద యుద్ధంలో తన
పరాక్రమాన్నంతా చూపాడు. వీడిని విడిచిపెట్టలేదు. ఇంకా ఎంతో చేసేవాడు. నా దురదృష్టం
చేత వాడికి కాలం కలసిరాలేదు." అనుకుంటుంది సీత.
"నేను లంకలో వున్నానని మాటమాత్రంగా తెలిసినా శ్రీరాముడు అమిత కోపంతో
రాక్షసుడనేవాడు లంకలో లేకుండా చేయడా? ఈక్షణంలో సముద్రంలో
నీళ్లన్నీ ఇంకి పోయేటట్లు చేసి దుమ్ములేపేవాడే. వీడిమానం, ప్రాణం, లంక అనేవి లేకుండా రూపుమాపేవాడే. కాబట్టి, ఇంకా
ఇప్పటిదాకా,
రాముడికి నా జాడ తెలియలేదనే అనుకోవాలి. ఊరూ-పేరూ లేకుండా, ఎప్పుడీ రావణుడిని,
శ్రీరాముడు చంపుతాడో, అప్పుడు, ఈరాక్షసస్త్రీలు నేనేడుస్తున్నట్లే, లబో-దిబోమని
ఏడుస్తారుకదా! యావజ్జీవం విధవలై ఏడుస్తారుకదా!"
"రామచంద్రమూర్తికి జటాయువు నా వార్త చెప్పకముందే మరణించాడనుకుంటే, ఇంకే విధంగానైనా ఆయనకు నావార్త తెలవకుండా వుంటుందా? చచ్చిపోయిన జటాయువైనా ఆయనకు కనిపించి వుండాల్సిందే! నేనుపారేసిన ఆభరణాలన్నా
ఆయనకు కనిపించి వుండాల్సిందే! ఈగుర్తులతో నన్నెవడో రాక్షసుడు ఎత్తుకునిపోయాడని
ఊహించవచ్చునే! ఎవరీ రాక్షసుడని ఆరాతీసి వుండాల్సిందే! వానరుల ముందు సొమ్ములు వేసానుకదా, వారైనా చెప్పాల్సిందే! ఎట్లైనా నేనిక్కడ వున్నానని
తెలుస్తుంది. తెలవగనే ఇక్కడకు రావడం తధ్యం. రామలక్ష్మణులు ఇక్కడకురాగానే
రాక్షసులందరూ చెల్లాచెదరై, పారిపోవాల్సిందేకాని, క్షణం కూడా ప్రాణాలను కాపాడుకోలేరు. వీడి నగరమంతా వల్లకాడై పోతుంది."
ఇలా ధ్యానంలో మునిగి అనుకుంటున్న సీత తనకెదురుగా వున్న
రాక్షస స్త్రీలనుద్దేశించి: "నాకోరిక నెరవేరుతుంది. మీ చెడ్డ పనులవల్ల మీరే
చెడిపోతారు. ఇదినిశ్చయం. నేనిప్పుడు చెప్తున్నది నిజమయ్యే రోజు దగ్గరలోనే వుంది.
అప్పుడు తెలుస్తుంది నేను చెప్పినమాటల్లోని విలువ. లంకాపురం పాడైపోయే లక్షణాలెన్నో
కనపడుతున్నాయి. ఈవూరు కాంతిహీనమై పోవడం ఖాయం. ఇతరులు చొరబడలేని ఈపురం అనతికాలంలో, బాలవిధవలా, అందహీనమవుతుంది. ఎంతోకాలం బాగుండాల్సిన
ఈవూరు,
వ్యభిచారాలు ఎక్కువైన కారణాన, పతిహీనై పాడైపోతుంది. పతి ఐన రావణుడు చచ్చిపోవడంతో, లంకంతా,
పుణ్య-శుభ కార్యాలులేక, పండుగలు-పబ్బాలు చేసుకోక, పసుపు-కుంకుమ-గంధం-కాటుక-కమ్మలు-పాపిడిలాంటి శుభలక్షణాలు పోయి, విధవలాగా, విధవలకు నిలయమై పోబోతున్నది. రామబాణాగ్నిలో
కాలిపోయి, కాంతిహీనమై, చచ్చిన రాక్షసులతో నిస్సందేహంగా పాడైపోతుంది చూడండి."
No comments:
Post a Comment