Sunday, July 24, 2022

పదిహేడవ రోజు యుద్ధం (1), కర్ణుడికి ‘శల్య సారథ్యం’, ధర్మరాజును అవమానించిన కర్ణుడు .... ఆస్వాదన-81 : వనం జ్వాలా నరసింహారావు

 పదిహేడవ రోజు యుద్ధం (1), కర్ణుడికి శల్య సారథ్యం, ధర్మరాజును అవమానించిన కర్ణుడు

ఆస్వాదన-81

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (24-07-2022)

పదిహేడవ రోజు యుద్ధం చేయడానికి పాండవ పక్షంలో సైన్యాలు బలం అతిశయించినట్లు కనిపించగా, ధర్మరాజు అభిప్రాయానికి అనుగుణంగా ధృష్టద్యుమ్నుడు దుర్జయ వ్యూహం మొహరింప చేశాడు. కౌరవ పక్షం నుండి దుర్యోధనుడు ఆడంబరంగా తన తమ్ముళ్లతో, కర్ణుడితో కలిసి యుద్ధానికి బయల్దేరాడు. ఆ సమయంలో కర్ణుడు దుర్యోధనుడి సమీపానికి వచ్చి, ఆ రోజున తాను అర్జునుడితో డీకొని ఇరువురి సామర్థ్యం, పట్టుదల ఉపయోగించి పోరాడుతామని, ఒకరినొకరు చంపడానికి ప్రయత్నం చేస్తామని అన్నాడు. అర్జునుడి దగ్గర దివ్యాస్త్రాలున్నప్పటికీ గట్టిదనంలోను, చురుకుదనంలోను తనకంటే అతడు తక్కువని, నేర్పులో తనతో పోలికే లేదని, ధైర్యంలోను, బాహుబలంలోను కూడా ఎంతో తక్కువని అన్నాడు కర్ణుడు. విశ్వకర్మ దేవేంద్రుడి కోసం తయారు చేసిన పెద్ద విల్లు ఆయన ద్వారా పరశురాముడికి, పరశురాముడి ద్వారా తనకు చేరిందని, ఆ రోజున ఆ మహాధనుస్సుతో అత్జునుడిని సంహరించి యుద్ధం విడిచి పెట్తానని చెప్పాడు. భూలోక సామ్రాజ్యమంతా దుర్యోధనుడికి సమర్పిస్తానని అన్నాడు.

అర్జునుడి రథం నడుపుతున్న శ్రీకృష్ణుడి నేర్పరితనంతో, కార్యసాధనతో సమానమైన శల్యుడిని తన రథ సారథి అయ్యేట్లు చూడమని దుర్యోధనుడిని కోరాడు కర్ణుడు. శల్యుడు సారథి అయిన పక్షంలో తాను దేవతలనైనా జయించగలనని, పాండవులు ఒక లెక్క కాదని అన్నాడు. ఆ తరువాత దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి పోయి కర్ణుడికి సారథ్యం చేయమని ప్రార్థించాడు. భీష్మద్రోణులు ఇద్దరూ వెళ్లిపోయిన తరువాత తాను శల్యుడి, కర్ణుడి బలపరాక్రమాల మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నానని, కాబట్టి కర్ణుడికి సారథిగా వుండి విజయం చేకూర్చమని వేడుకున్నాడు. ఆ మాటలకు శల్యుడికి కోపం వచ్చింది. కర్ణుడికి సారథ్యం వహించమని అడగడానికి కారణం చెప్పాడు దుర్యోధనుడు. రథికుడికి వుండాల్సిన లక్షణాలలో అర్జునుడికంటే కర్ణుడు గొప్పవాడని, సారథ్యం చేయడంలో శ్రీకృష్ణుడికంటే గొప్పవాడు శల్యుడని, కృష్ణుడి ఎత్తులకు పైఎత్తులు వెయ్యాలంటే సమర్థుడు ఒక్క శల్యుడే అని అన్నాడు. అప్పుడు శల్యుడు సంతోషించి కర్ణుడి రథం నడుపుతానన్నాడు. కాకపోతే యుద్ధంలో తాను తనకిష్టమైన రీతిలో మాట్లాడుతానని, ఉచితమైన సలహాలు ఇస్తుంటానని, దానికి తనను తప్పుపట్టరాదని నిబంధన విధించాడు.

శల్యుడి మనస్సు బాధపడుకుండా వుండాలని దుర్యోధనుడు ఆయనకు త్రిపురాసురుల వృత్తాంతం చెప్పాడు. దేవతలతో యుద్ధంలో మరణించిన రాక్షసరాజు తారకాసురుడి కుమారులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు బ్రహ్మ దేవుడి కొరకు తపస్సు చేసి, ఎవరివల్లా నాశనం కాని మూడు నగరాలను పొందారు. అలాంటి త్రిపురాలను మయుడు వారికి నిర్మించి ఇచ్చాడు. వారంటే దేవతలు భయపడసాగారు. బ్రహ్మను కలిసి వారిని సంహరించడానికి ఉపాయం చెప్పమన్నారు. ఆయన వారిని శివుడిని ప్రార్థించమని సలహా ఇచ్చాడు. త్రిపుర సంహారం కొరకు దేవతలు బ్రహ్మదేవుడితో సహా వెళ్లి శివుడిని వేడుకున్నారు. శివుడి దానికి అంగీకరించాడు. అయితే తనకొరకు ఒక రథం, సారథి, అశ్వాలు, ధనుస్సు, బాణం నిర్మించి ఇవ్వమని అన్నాడు. ఆ మహాదేవుడిని త్రిపుర సంహారానికి అభిషిక్తుడిని చేశారు. ఆయన అడిగిన వాటిని నిర్మించమని త్వష్టను కోరారు.

వారు కోరినట్లే త్వష్ట రథాన్ని, మిగతావాటిని సిద్ధం చేశాడు. సారథి ఎవరని శివుడు అడిగాడు. ఆయనకు నచ్చినవాడిని ఎన్నుకోమని శివుడికి చెప్పారు దేవతలు. తనకంటే గొప్పవాడెవరో ఆలోచించి సారథిగా నియమించమని చెప్పాడాయన. దేవతలంతా వెళ్లి బ్రహ్మను సారథిగా వుండమని ప్రార్థించారు. రథికుడికంటే అధికమైన నేర్పు, బలం బ్రహ్మకున్నాయని చెప్పి దేవతలు బ్రహ్మదేవుడితో శంకరుడి రథం నడిపించారు. బ్రహ్మ రథం తోలుతుంటే ఆయన నేర్పును శివుడు ప్రశంసించాడు. రుద్రుడు త్రిపురాలను సంహరించి బూడిద చేశాడు. త్రిపురహరుడయ్యాడు. బ్రహ్మ అంతటి వాడు లోకం మేలు కొరకు శివుడి రథం నడిపాడని, కాబట్టి కౌరవ రక్షణ కొరకు కర్ణుడి రథం శల్యుడు నడపాలని దుర్యోధనుడు చెప్పి, అలా చేసి తనను రక్షించమన్నాడు. రుద్రుడి శిష్యుడైన భార్గవరాముడికి ప్రియశిష్యుడైన కర్ణుడిని రథికుడిగా స్వీకరించి అతడికి సారథికృత్యం చేసిపెట్టమని, అన్ని విషయాలలో సారథి రథికుడికంటే గొప్పవాడై వుండాలని యుద్ధనీతి చెప్తున్నదని దుర్యోధనుడు అన్నాడు. కర్ణుడికి సారథ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు.

యుద్ధ భూమికి చేరుకున్న కర్ణుడు రథాన్ని ముందుకు నడిపించమని శల్యుడిని కోరాడు. ఆ రోజున తాను ప్రదర్శించబోయే ధైర్యానికి పాండవులు తట్టుకోలేరని కర్ణుడు అనగా, స్పందనగా, కర్ణుడిని నిరుత్సాహ పరిచే మాటలు పలికాడు శల్యుడు. ఆ మాటలు విననట్లుగా నటిస్తూ కర్ణుడు తన చేతి బలాన్ని వెంటనే చూపడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇంతలో కౌరవ వినాశ సూచకాలైన అపశకునాలు గోచరించాయి. అప్పుడు కర్ణుడు శల్యుడితో, తాను రథమెక్కి విల్లు చేతబట్టి రణరంగంలో విజృంభించితే దేవేంద్రుడిని కూడా తృణీకరిస్తానని, తన భుజ పరాక్రమాన్ని చూడమని, అర్జునుడిని ఎదిరించి సంహరిస్తానని, దుర్యోధనుడి ఋణం తీర్చుకుంటానని అన్నాడు. దానికి జవాబుగా శల్యుడు, కర్ణుడి పరాక్రమాన్ని తగ్గించి నిర్లక్ష్యంగా మాట్లాడాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడ వద్దని, అర్జునుడి బలపరాక్రమం కర్ణుడికి తెలియదా అని, పౌరుష హీనుడైన కర్ణుడు అర్జునుడికి సాటికాడని అంటూ ఉదాహరణులుగా ఘోషయాత్ర, ఖాండవ దహనం, వరాహం కోసం శివుడితో అర్జునుడి పోరు, ఉత్తర గోగ్రహణం నాటి సంఘటనలు పేర్కొన్నాడు. ఆ విధంగా నిరంతరాయంగా శల్యుడు కర్ణుడిని నిందాపూర్వకంగా మాట్లాడడం, అర్జునుడిని పొగడడం కొనసాగించాడు.

ఆ మాటలకు కోపం తెచ్చుకున్న కర్ణుడు, శల్యుడిని క్షత్రియాధముడని, సద్భుద్ది లేనివాడని, శత్రు పక్షం మేలు కోరేవాడని అంటూ ఎవరూ తన యుద్దోత్సాహాన్ని ఆపలేరని చెప్పి, తన గదతో అతడి తల బద్దలు కాకముందే మారుమాట్లాడకుండా రథాన్ని ముందుకు తోలమని ఆదేశించాడు. కర్ణుడికి కోపం వచ్చినప్పటికీ తాను తన ధర్మంగా అతడికి హితం చెప్తానని స్పష్టం చేశాడు శల్యుడు. కృష్ణార్జునులను ఒంటరిగా తలపడడానికి ఆ పరమ శివుడికైనా శక్తి చాలదు కాబట్టి వేరేవారితో యుద్ధం చేయమని సలహా ఇచ్చాడు కర్ణుడికి. శల్యుడు ఎన్ని విధాలుగా నిరుత్సాహ పరచినప్పటికీ తాను వారిని ఎదుర్కోకుండా మాననని, యుద్ధంలో వారో, తానో మిగలాలని, అతడి వ్యర్థమైన మాటలు ఆపుచేయమని గట్టిగా చెప్పాడు కర్ణుడు. పరశురాముడి కోపం (అవసరమైనప్పుడు బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం గుర్తుకు రావని ఇచ్చిన శాపం), బ్రాహ్మణ శాపం (యుద్ధం చేస్తున్నప్పుడు రథచక్రం నేలలో దిగబడడం, శత్రువు చేతిలో చావు) తన మనసుకు సంతాపాన్ని కలిగిస్తున్నాయని, లేకుంటే తాను కృష్ణార్జునులను లెక్కపెట్టనని అన్నాడు. ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అంతా వచ్చి తాకినా తనకు భయం లేదన్నాడు.


దుర్యోధనుడు కర్ణశల్యుల మధ్య జరుగుతున్న వాదులాట విని, వారికి చేరువగా వచ్చి, స్నేహభావం ఎలా ఉండాలో తెలియచేసి, కర్ణుడు రాజత్వ గౌరవాన్ని కొనియాడి, శల్యుడు తన అధిక ప్రసంగాన్ని పొడిగించకుండా ఆపుచేశాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ రథాన్ని పోనీయమని శల్యుడిని త్వరపెట్టాడు. శల్యుడు రథాన్ని నడుపుతూ, చిరునవ్వు నవ్వుతూ మళ్లీ అర్జునుడిని ప్రశంసించడం కొనసాగించాడు. అప్పుడు గోచరిస్తున్న అపశకునాల గురించి కూడా చెప్పాడు.

ఇంతలో కౌరవ పాండవ సైన్యం ఒకరినొకరు తలపడ్డారు. దుర్యోధనుడు ఆ సమయంలో కర్ణ శల్యులను, ఇతర రాజులను చూసి, వారిని విజృంభించి యుద్ధం చేయమని, వారి భుజబల పరాక్రమం చూపమని, ప్రశంసలు పొందమని అన్నాడు. ద్రోణాచార్యుడి మరణానికి కారణమైన ధృష్టద్యుమ్నుడిని కాపాడడానికి భీమార్జునులు వచ్చినా తన బాణాల ధాటికి అతడు తట్టుకోలేడని అశ్వత్థామ అంటూ కౌరవ సేనను పురికొల్పాడు. యుద్ధం ఘోరంగా సాగింది. అప్పుడు దుర్యోధనుడు విజృంభించి భీముడిని ఎదుర్కొన్నాడు. తరువాత కర్ణుడు ధర్మరాజు మీద విజృంభించాడు. అర్జునుడు వచ్చి అడ్డుకున్నాడు.

కర్ణుడి వ్యూహానికి కుడివైపున కృపాచార్యుడు, కృతవర్మ, మగధ వీరులు; వారి పక్కన శకుని, ఉలూకుడు; ఎడమ వైపు త్రిగర్త వీరులు; వారి పక్కన కాంభోజ శక యవనులతో కూడిన కౌరవులు; వెనుకవైపు దుశ్శాసనుడు; అతడి వెనుక సోదర సమేతుడైన దుర్యోధనుడు నిలిచి వుండగా, కర్ణుడు తన పక్కన అశ్వత్థామ మొదలైన వీరులతో సహా అగ్రభాగంలో నిలిచాడు. అర్జునుడు దానికి ధీటైన దుర్జయ వ్యూహంతో కౌరవ సేనను ఎదుర్కొన్నాడు. మరోవైపున త్రిగర్తాది సంశప్తకుల సైన్యాన్ని అర్జునుడు విజృంభించిన పరాక్రమంతో ఎదుర్కొని ఆ సేనలను సంహరించసాగాడు. కర్ణుడు పాంచాల సైన్యంమీద విజృంభించాడు. ఆ తరువాత ధర్మరాజు వున్న దిక్కుగా వెళ్లాడు మరోమారు. అది చూసిన ధృష్టద్యుమ్నుడు కర్ణుడిని అడ్డుకున్నాడు. కర్ణుడు ఏడుగురు ప్రభద్రకులను, ఐదుగురు పాంచాలురను వధించాడు.

ఆ విధంగా కర్ణుడు పాండవ సేనను కలవర పెట్టసాగాడు. అప్పుడు భీమాదులు వచ్చి కర్ణుడి మీద అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. అది చూసి దుర్యోధనాదులు భీముడిని ఎదుర్కొన్నారు. కృపాచార్యుడు మొదలైనవారు ధృష్టద్యుమ్నాది యోధులను ఎదుర్కొన్నారు. కర్ణుడి కుమారులు సుషేణుడు, సత్యసేనుడు భీముడి మీదికి యుద్ధానికి పోయారు. భీముడు సత్యసేనుడిని చంపి, కృపాచార్య, కృతవర్మ ప్రభృతుల ధనుస్సులు విరిచి వారిమీద బాణాలు గుప్పించాడు. మరోపక్క నకుల సహదేవులకు సుషేణుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. సుషేణుడి సోదరుడైన వృషసేనుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. వృషసేనుడు ఆ పోరులో మూర్ఛిల్లడంతో రణరంగం నుండి తప్పించాడు దుశ్శాసనుడు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న కర్ణుడు యుద్ధరంగంలో ప్రకాశించాడు. సాత్యకి ప్రభృతులు కర్ణుడిమీద బాణవర్షం కురిపించారు. కాని, కర్ణుడి ధాటికి అక్కడున్న వీరులంతా వెనుదిరిగారు. అతడప్పుడు ధర్మరాజు మీద అధికంగా బాణాలు వేయసాగాడు. ధర్మరాజు శరీరాన్ని గాయపర్చాడు.

కర్ణుడు ధర్మరాజును నొప్పించగా అతడి విజృంభణకు తట్టుకోలేక ధర్మరాజు సారథి లేని తన రథాన్ని తానే తోలుకొని తొలగివెళ్లాడు. అయినా కర్ణుడు అతడిని వెంబడించి, అడ్డగించి పరిహాసం చేస్తూ, క్షత్రియ కులంలో జన్మించినవాడు అలా పారిపోవచ్చా అని అంటూ, అలా చేయడం అధర్మం అని చెప్పాడు. అన్నీ తెలిసినవాడు ఆ మహాయుద్ధంలో ప్రాణాలు కాపాడుకోవడానికి శత్రువుల నుండి పారిపోవడం తగునా అని ప్రశ్నించాడు. ధర్మరాజు బుద్ధి బయటపడిందని, అతడికి రాజధర్మం తెలియదని, బ్రాహ్మణాచారాలు తెలిసిన అతడు యాగాలతో, వేదాధ్యయనంతో కాలం గడపమని, అతడికి యుద్ధం తగదని, మానుకొమ్మని ఎత్తిపొడిచాడు. తన లాంటి వారితో యుద్ధానికి పూనుకుంటే ఇంతకంటే ఆపద కలుగుతుందని, కాబట్టి వెంటనే ఇంటికి పొమ్మని, లేదా కృష్ణార్జునులు వున్న చోటుకైనా పొమ్మని, అతడి ప్రాణాలు తీయడానికి తాను తెగించనని అన్నాడు కర్ణుడు. కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ధర్మరాజును వధించకుండా విడిచి, అతడి సైన్యం మీద వివిధాస్త్రాలను ప్రయోగించాడు కర్ణుడు. ధర్మరాజు సిగ్గుతో అక్కడ నిలవలేక వెనుదిరిగి వెళ్లాడు.

అగ్రజుడైన ధర్మరాజుకు జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుంటూ, ఆగ్రహించిన భీమసేనుడు, విజృంభించి పోరాడుతున్న కర్ణుడి మీదికి యుద్ధానికి దిగాడు. తన రథాన్ని అటువైపు పోనిచ్చాడు. కర్ణుడి కోరిక మీద రథాన్ని భీముడి వైపు పోనిచ్చాడు శల్యుడు. ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. భీముడు కోపంతో ఒక బల్లెం తీసుకుని కర్ణుడిమీద విసరగా అది అతడి వక్షాన్ని భేదించగా, కర్ణుడు రథం మీద చలనం లేకుండా మూర్ఛిల్లి, చచ్చినట్లు పడిపోయాడు. భీముడు తన రథాన్ని కర్ణుడి రథానికి దగ్గరగా తెచ్చి, అతడి నాలుక కోసేందుకు సిద్ధపడ్డాడు. అప్పుడు శల్యుడు, అలా చేస్తే కర్ణుడు చస్తాడని, అతడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ పని అర్జునుడికే వదలమని సలహా ఇచ్చాడు. మామ శల్యుడి ఆజ్ఞ వుల్లంఘించనని అంటూ భీముడు తన ప్రయత్నం మానుకున్నాడు.   

ఆ తరువాత భీముడు కర్ణుడికి సాయంగా వచ్చిన శ్రుతవర్మాది కురుకుమారులను ఆరుగురిని చంపాడు. ఇంతలో కర్ణుడు తెప్పరిల్లుకొని భీముడి మీద బాణాలు వేశాడు. ఇరువురి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు భీముడు రథం దిగి పరుగెత్తి కర్ణుడి మీద విజృంభించగా దుర్యోధనుడు ఏనుగులను అతడి మీదికి పురికొల్పాడు. భీముడు వాటన్నిటినీ చంపేశాడు. ఇంతలో కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొని అతడి సారథిని చంపి అతడిని వెంటాడాడు. అది చూసిన భీముడు కర్ణుడిని అడ్డుకున్నాడు. అప్పుడు కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామల తోడ్పాటుతో కర్ణుడి విజృంభించి పోరాడడంతో యుద్ధం భీకరమైంది.

మరోపక్క అర్జునుడు తన మీద ఒక్క పెట్టున యుద్ధానికి వచ్చిన సంశప్తకులను దీటుగా ఎదుర్కొన్నాడు. పెక్కుమందిని పరిమార్చాడు. అర్జునుడు సర్పాస్త్రాన్ని ప్రయోగించగా అది వైరుల పాదాలను బంధించింది. అతడి నాగాస్త్రబంధంలో చిక్కుకున్న సంశప్తకులను త్రిగర్త రాజు సుశర్మ గరుడాస్త్రం ప్రయోగించి విడిపించాడు. ఆ తరువాత సుశర్మ వేసిన అస్త్రం తాకిడికి అర్జునుడు రథం మీద మూర్ఛపోయాడు. కాకపోతే ఆ మూర్ఛ క్షణకాలం మాత్రమే. అర్జునుడు చావగా మిగిలిన పద్నాలుగు వేలమంది సంశప్తకవీరుల మీద భయంకరమైన యుద్ధం చేశాడు.

మరోవైపున తక్కిన పాండవులతో యుద్ధం చేస్తున్న కౌరవ సేన భీతిల్లి పారిపోయింది. కృతవర్మ ప్రభృతులు కౌరవ సైన్యం దైన్యం తొలగేట్లు విజృంభించారు. అప్పుడు కృపాచార్యుడికి, శిఖండికి భీకరంగా యుద్ధం జరిగింది. మధ్యలో వచ్చిన సుకేతుడిని కృపాచార్యుడు సంహరించాడు. మరో వైపు కృతవర్మ సారథి తలను ఖండించాడు ధృష్టద్యుమ్నుడు. ధర్మరాజు అశ్వత్థామతో యుద్ధం చేస్తుంటే సాత్యకి సాయంగా వచ్చాడు. అశ్వత్థామ సాత్యకి సారథిని చంపాడు. ఇంతలోనే ధర్మారాజు అశ్వత్థామను తరుముతూ వాడి బాణాలతో నొప్పించాడు. అయితే అశ్వత్థామ కురిపించిన బాణ వర్షానికి తట్టుకోలేక ధర్మరాజు తప్పుకొన్నాడు. ధృష్టద్యుమ్నుడు మరో పక్కన దుర్యోధనుడిని తాకి విరథుడిని చేశాడు. అతడి కవచాన్ని కూడా ఖండించాడు. అతడిని యుద్ధ భూమి నుండి తీసుకెళ్లారు. అప్పుడు భీముడు తలపడగా కౌరవ సేనలోని రథ, గజ, తురగ, పదాతులు అలసి రణభూమి నుండి ఒక్కసారిగా తొలగి పోయాయి.

ఈ నేపధ్యంలో అర్జునుడు త్రిగర్త యోధులను అనేకమందిని సంహరించి, మిగిలినవారిని చెల్లాచెదురు చేసి, కర్ణుడి వైపుగా రథాన్ని పోనిమ్మని కృష్ణుడికి కోరాడు. శ్రీకృష్ణుడు రథాన్ని కౌరవ సేన వైపు మళ్లించగా ఆ సైన్యం చెల్లాచెదరైంది. అప్పుడు దుర్యోధనుడు త్రిగర్త వీరులను పురికోల్పగా యుద్ధానికి వచ్చిన వారందరినీ చెల్లాచెదురు చేశాడు అర్జునుడు. సుదక్షిణుడి సోదరుడిని చంపాడు. యవన శక సైన్యాలను, సంశప్తకులను సంహరించాడు. అప్పుడు యుద్ధానికి ఆహ్వానించిన అశ్వత్థామతో తలపడ్డాడు అర్జునుడు. అశ్వత్థామ గర్వాన్ని తన బాణాలతో అణచివేశాడు అర్జునుడు. అశ్వత్థామ ఉత్సాహహీనుడై కర్ణుడి వైపు వెళ్లాడు. ఆ తరువాత తనను ఎదుర్కొన్న దండధారుడు అనే రాజును సంహరించాడు అర్జునుడు. (పదిహేడవ రోజు యుద్ధం సశేషం)

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, కర్ణపర్వం, ప్రథమ-ద్వితీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment