Saturday, July 2, 2022

పదిహేనవ రోజు భారత యుద్ధం, ఘటోత్కచుడి మరణానికి నృత్యం చేసిన శ్రీకృష్ణుడు యోగాన్ని ఆశ్రయించి, శరీర త్యాగంచేసి బ్రహ్మలోకానికి పోయిన ద్రోణాచార్యుడు .... ఆస్వాదన-78 : వనం జ్వాలా నరసింహారావు

 పదిహేనవ రోజు భారత యుద్ధం, ఘటోత్కచుడి మరణానికి నృత్యం చేసిన శ్రీకృష్ణుడు

యోగాన్ని ఆశ్రయించి, శరీర త్యాగంచేసి బ్రహ్మలోకానికి పోయిన ద్రోణాచార్యుడు

ఆస్వాదన-78

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (03-07-2022)

సైంధవుడు అర్జునుడి చేత సంహరించబడిన తరువాత, కృపాచార్యుడు, అశ్వత్థామ అర్జునుడి మీద బాణవర్షం కురిపించారు. ఆ బాణాలను ఖండించిన అర్జునుడు కొద్ది మోతాదు బాణాలను వేయగానే, కృపాచార్యుడు మూర్ఛపోయాడు. అర్జునుడు కూడా వెనుదిరిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి పరాక్రమాన్ని ప్రశంసించాడు. జవాబుగా అర్జునుడు, తాను ప్రతిజ్ఞ నెరవేర్చానంటే అదంతా శ్రీకృష్ణుడి దయే అన్నాడు. ఇంతలో సూర్యాస్తమయం సమీపించడంతో ధర్మరాజును చూడడానికి ఇద్దరూ కలిసి వెళ్లి, ఆయనకు ప్రణామం చేశారు. ధర్మరాజు వారిద్దరినీ గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు ప్రేమతో. శత్రువు మీద విజయంతో ధర్మరాజు సైన్యంలో ఆనందోత్సవాలు పెరగగా, దుర్యోధనుడు దుఃఖానికి, ఆశ్చర్యానికి తీవ్రంగా లోనయ్యాడు. ద్రోణుడిని కలిసి తన అసంతృప్తిని వెల్లడి చేశాడు మరోమారు. తనను నిందించడాన్ని అభ్యంతర పెట్టాడు ద్రోణుడు. అలా అంటూనే, సైన్యాన్ని సమీకరించి యుద్ధానికి పురికొల్పాడు.

కర్ణుడి దగ్గరికి వెళ్లి దుర్యోధనుడు ద్రోణుడిని తప్పుబట్టాడు. ద్రోణుడిని ఆశ్రయించి ఇంకా యుద్ధం చేయడం కౌరవులకు ప్రయోజనమేనా అని అడిగాడు కర్ణుడిని. ద్రోణుడిని దూషించడం సరైనది కాదని, దైవం తలిస్తే తప్ప పాండవులను గెలవడం సాధ్యం కాదని అన్నాడు కర్ణుడు. పోరు సాగించాలన్నదే దైవాజ్ఞ అని, చివరకు ఏమౌతుందో చూద్దామని చెప్పాడు. కర్ణుడు అలా అంటున్న సమయంలోనే పాండవుల సైన్యాలు యుద్ధానికి సిద్ధమై కౌరవుల సైన్యాన్ని ఎదుర్కోవడానికి కదలగా ఇరు సైన్యాలు ఢీకొన్నాయి. పోరుభీకరంగా సాగింది. సైంధవ వధ వల్ల కలిగిన దుఃఖం కారణాన దుర్యోధనుడు ప్రాణాలకు తెగించి యుద్ధానికి పూనుకున్నాడు. పాండవ సైన్యంలో ప్రవేశించి ఘోరంగా యుద్ధం చేశాడు. పాండవ వీరులంతా కలిసి ఆయన్ను ఎదిరించినప్పటికీ, విజయ సూచకంగా సింహనాదం చేశాడాయన. దుర్యోధనుడి విజృంభణ చూసి ధర్మరాజు అతడితో తలపడి అతడిని మార్ఛపోయేట్లు చేశాడు.

తెలివి తెచ్చుకున్న దుర్యోధనుడు భయంకరంగా యుద్ధం చేశాడు. మరో పక్క ద్రోణాచార్యుడు విజృంభించాడు. కేకయ వీరులను, ధృష్టద్యుమ్నుడి కొడుకులను హతమార్చాడు. శిబి అనే వీరుడిని కూడా చంపాడు. ఇదిలా వుండగా కర్ణుడు, కళింగరాజ కుమారుడి సోదరులు ధ్రువ, జయరాతులు భీముడితో తలపడ్డారు. ఇద్దరినీ చంపాడు భీముడు. ఆ తరువాత తనను ఎదిరించిన దుర్మద, దుష్కర్ణుడిని కూడా చంపాడు. సాత్యకి మీదకు వస్తున్న అశ్వత్థామను మార్గమధ్యంలో ఘటోత్కచుడు ఎదుర్కొన్నాడు. దుర్యోధనాదులు ఘటోత్కచుడితో యుద్ధం చేయడానికి భయపడి తప్పుకున్నారు. ఘటోత్కచుడిని ఎదిరించడానికి అశ్వత్థామ సిద్ధమవుతుంటే, అతడి కొడుకు అంజనపర్వుడు అతడిని ఎదుర్కొన్నాడు కాని, అశ్వత్థామ అతడి తల నరికాడు. ఆ తరువాత ఘటోత్కచుడికి, అశ్వత్థామకు భీకర యుద్ధం జరిగింది.

ఘటోత్కచుడు దుర్యోధనుడి చతురంగ బలాలను ఒకేసారి దగ్ధం చేశాడు. ఇంతలో భీముడు, ధృష్టద్యుమ్నుడు ఘతోత్కచుడికి సాయంగా వచ్చారు. వీరవిహారం చేస్తున్న అశ్వత్థామ ఒక అక్షౌహిణి పాండవ సైన్యాన్ని సంహరించాడు. ద్రుపదుడి ఏడుగురు కుమారులను, కుంతిభోజుడి పదమూడు మంది కుమారులను సంహరించాడు. చివరకు ఘతోత్కచుడిని మూర్ఛపోగొట్టాడు కాని అతడు వెంటనే తేరుకున్నాడు. అప్పుడు సంధ్యాసమయంలోని చీకటిలో సరిగ్గా చూపు ఆనకుండా పోయింది. భీముడు సోమదత్తుడి తండ్రి బాహ్లికుడిని వధించాడు. ఆ తరువాత దుర్యోధనుడి తమ్ములను పదిమందిని, కర్ణుడి తమ్ముడు వృకరథుడిని, శకుని తమ్ములు పన్నెండు మందిని భీముడు సంహరించాడు.

ఇంతలో దుర్యోధనుడి కోరిక పరకారం ద్రోణాచార్యుడు ధర్మరాజును దివ్యాస్త్రాలతో ఎదుర్కొన్నాడు. ఇరువురూ బ్రహ్మాస్త్రాలను ప్రయోగించుకున్నారు. పాండవ సైన్యం కౌరవ సైన్యాన్ని తరుముతుంటే సైన్యాన్ని కాపాడమని దుర్యోధనుడు కర్ణుడిని వేడుకున్నాడు. అప్పుడు కర్ణుడు పౌరుష వాక్యాలు పలుకుతుంటే కృపాచార్యుడు అధిక్షేపించాదు కర్ణుడిని. ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం నాటి సంఘటనలను గుర్తుచేశాడు. అతడి మాటల్లో కర్ణుడికి పాండవులను గెలిచే సామర్థ్యం లేదన్న భావన, అభిప్రాయం స్పష్టంగా వున్నది. అతిగా మాట్లాడితే కృపాచార్యుడి నాలుక కోసేస్తానని కర్ణుడు అనగానే అశ్వత్థామ కోపంతో కర్ణుడి మీదికి దూకగా దుర్యోధనుడు వారించాడు. మనలో మనం కలహించుకుని యుద్ధంలో సంక్షోభం సృష్టించడం తగదని దుర్యోధనుడన్నాడు. కర్ణుడిని క్షమించమని అడిగాడు. కర్ణాశ్వత్థామలు శాంతించారు.

యుద్ధానికి వచ్చిన కర్ణుడిని అర్జునుడు ఎదుర్కొన్నాడు. కర్ణుడి శరీరాన్ని బాణాలతో నింపేశాడు. అతడు పరాభూతుడై పారిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడి మీదికి యుద్ధానికి దిగాడు. అయితే, అశ్వత్థామ అడ్డుపడి, దుర్యోధనుడిని దాటవేసి యుద్ధానికి వెళ్లాడు. అలా వస్తున్న అశ్వత్థామను ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొన్నాడు. ఇరువురూ వాడి బాణాలతో యుద్ధం చేశారు. ఒక సందర్భంలో కౌరవులది పైచేయి అయింది. ఇంతలోనే పాండవ సైన్యాలు విజృంభించాయి. అర్జునుడి ధాటికి కౌరవ సైన్యాలు చెల్లాచెదరైపోయాయి. ఆ సమయంలో సోమదత్తుడు సాత్యకితో యుద్ధం చేసి ప్రాణాలను కోల్పోయాడు. అలా భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు ముగ్గురూ ఎదుర్కుంటుంటే కృపుడు, కర్ణుడు, ద్రోణుడు వారితో యుద్ధానికి తలపడ్డారు. వాస్తవానికి ఆరోజున చీకటి పడ్డా దివిటీల వెలుగులో యుద్ధం కొనసాగింది. అదే పదిహేనవ రోజు యుద్ధంగా కొనసాగింది.  

ఆ దివిటీల వెలుగులో పాండవ కౌరవ వీరుల ద్వంద్వ యుద్ధం జరిగింది. ఆ సందర్భంలో ఎందరో ఎందరితోనో యుద్ధానికి తలపడ్డారు. ద్రోణుడు సోమకసైన్యంతో పారాడుతూ దాన్ని హతమార్చాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలోనే కృతవర్మ ధాటికి ఆగలేక ధర్మరాజు యుద్ధభూమినుండి తొలగిపోయాడు. భూరి, సాత్యకి సమానంగా యుద్ధం చేశారు కాని సాత్యకి చేతిలో భూరి మరణించాడు. మరో పక్క ఘటోత్కచుడి దెబ్బకు అశ్వత్థామకు మూర్ఛవచ్చినట్లై, కాసేపట్లోనే తేరుకుని ఎదురు దెబ్బ తీశాడు. భీమ దుర్యోధనులు ఒకరిమీద మరొకరు పోరాడారు సరిసమానంగా. కాసేపటికి దుర్యోధనుడు విపరీతమైన భయంతో యుద్ధం మాని అక్కడి నుండి వెళ్లిపోయాడు.

కర్ణ సహదేవుల యుద్ధంలో పైచేయి అయిన కర్ణుడు సహదేవుడిని నిరాయుధుడుగా చేయగా అతడి ధాటికి ఆగలేక సహదేవుడు నిష్క్రమిస్తూ వుండగా కర్ణుడు అతడిని వెంబడించాడు. కుంతికిచ్చిన మాట ప్రకారం సహదేవుడిని చంపడానికి మనస్సు రాక, వింటి కొసతో అతడి ఉదర భాగాన్ని పొడుస్తూ అవమానించాడు. మరో పక్క శల్యుడు విరాటుడి అశ్వాలను, సారథిని, తమ్ముడు శతానీకుడిని చంపాడు. ఆ సమయంలో పాండవుల సైన్యాలు విఫలం కావడంతో అర్జునుడు వాటిని ఆదుకుని నిలువరించాడు. అప్పుడు అలంబసుడనే రాక్షసుడు అర్జునుడిని బాణాలతో కొట్టాడు. మరో పక్క ద్రుపదరాజు, కర్ణుడి కుమారుడు వృషసేనుడు యుద్దానికి తలపడగా దాంట్లో వృషసేనుడిది పైచేయి అయింది. అలాగే నకుల శకునిల మధ్య జరిగిన యుద్ధం శకుని పరాజయంతో ముగిసింది. ఇంతలో ధృష్టద్యుమ్నుడు విజృంభించి ద్రోణాచార్యుడి మీద బాణాలు వేయడంతో, ఒకేసారి ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, శల్యుడు అతడిని ఎదుర్కొన్నారు. కర్ణుడు ద్రుమసేనుడిని చంపడంతో ధృష్టద్యుమ్నుడు కర్ణుడి విల్లును తునకలు చేశాడు.


అప్పుడు సాత్యకి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడికి తోడుగా అతడి కొడుకు వృషసేనుడు వచ్చాడు. ఆ సమయంలో కర్ణ, దుర్యోధనులు దురాలోచన చేసి గొప్ప సైన్యంతో సాత్యకిని ముట్టడి చేశారు. అయితే సాత్యకి అద్భుత పరాక్రమానికి కౌరవ సైన్యం తట్టుకోలేక పోయింది. మరో దిక్కున అర్జునుడి చేతిలో శకుని ఓటమి పాలయ్యాడు. పారిపోయాడు. మరోవైపున ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని ఎదుర్కొన్నాడు. ఆ విధంగా సాత్యకి, అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు, ముగ్గురూ యుద్ధం చేస్తుంటే కౌరవ సైన్యం కలతచెంది పారిపోయింది. ఆ సమయంలో కర్ణుడు విజృంభించి పాండవ సైన్యాన్ని ‘ఒకేసారి సంహరిస్తాడా?’ అన్న రీతిలో యుద్ధం చేయసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడి ఆదేశాల మేరకు, అది రాత్రి సమయం యుద్ధం కాబట్టి, కర్ణుడిని ఓడించడానికి సరైనవాడు ఘటోత్కచుడే అని భావించి, అతడిని యుద్ధంలో దింపారు. అప్పుడు ఘటోత్కచుడు కర్ణుడు వున్న దిక్కుగా వెళ్ళాడు. ఇది గమనించిన పాండవ వైరి, అలంబసుడనే రాక్షసుడు ఘతోత్కచుడిని ఎదుర్కొన్నాడు. యుద్ధం భయంకరమైంది. అలంబసుడిని సంహరించి అతడి తలను దుర్యోధనుడి మీద వేశాడు ఘటోత్కచుడు.

ఆ తరువాత ఘటోత్కచుడు కర్ణుడి మీదికి యుద్ధానికి పోయాడు. ఇద్దరూ సమానమైన స్థాయిలో పోరాడారు. ఇద్దరూ దివ్యాస్త్రాలు ప్రయోగించుకున్నారు. యుద్ధంలో కౌరవ సైన్యం మాత్రం ఘటోత్కచుడి ధాటికి తట్టుకోలేక పారిపోయింది. ఘటోత్కచుడు మాయా యుద్ధం చేయసాగాడు. కర్ణుడు వేసిన బాణాలను భగ్నం చేయసాగాడు. కర్ణుడి కంటే అధికుడై విక్రమించాడు. ఆ సమయంలో కౌరవ పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన అలాయుధుడనే రాక్షసుడిని సంహరించాడు ఘటోత్కచుడు. అతడి తలను కూడా దుర్యోధనుడి ముందర పడవేశాడు. ఘటోత్కచుడు చేస్తున్న మారణ హోమాన్ని, ఘోర కర్మను కర్ణుడు ఆపలేక పోయాడు. కౌరవ సైనికులు ఆత్మరక్షణకోసం పరుగులు తీశారు.

సైనిక వీరులంతా కర్ణుడి దగ్గరికి పోయి, ఇంద్రుడు ఆయన దగ్గర కవచ కుండలాలను తీసుకున్నప్పుడు అతడికిచ్చిన మహాశక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించమని వేడుకున్నారు. అంతకంటే వేరే మార్గం కనిపించనందువల్ల కర్ణుడు ఆ దివ్యాయుధాన్ని ఘటోత్కచుడి మీద దేవతా సమూహాల హర్షధ్వానాల మధ్య ప్రయోగించాడు. ఆ బాణ ప్రయోగానికి ఘటోత్కచుడు వికృతమైన ముఖంతో మరణించాడు. దుర్యోధనుడు ఆనందించి కర్ణుడిని కౌగలించుకొని ఉల్లాసాన్ని పొందాడు. పాండవులు మిక్కిలి దైన్యంతో కన్నీరు-మున్నీరుగా దుఃఖించారు. ఘటోత్కచుడి మరణానికి శ్రీకృష్ణుడు మాత్రం సంతోషంతో సింహనాదం చేసి, పాంచజన్యాన్ని పూరించి, నృత్యం చేస్తూ ఆర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు. పాండవులంతా దుఃఖంలో కూరుకొనిపోతూ వుంటే  ఆయనెందుకు సంతోషంగా గంతులు వేస్తున్నాడని ప్రశ్నించాడు అర్జునుడు.

జవాబుగా శ్రీకృష్ణుడు, శక్తి అనే ఆయుధం కర్ణుడి దగ్గర ఉన్నంత కాలం అర్జునుడిని బతికించుకోవడం అసాధ్యం అని భావించేవాడినని, ఈ రోజుతో అది కర్ణుడికి లేకుండా పోయేసరికి తనకు చాలా సంతోషంగా వున్నదని అన్నాడు. కర్ణుడు అంటే సామాన్యుడు కాడని, ఆ శక్తి ఆయన దగ్గర వుంటే తమనిద్దరినీ అతడు జయిస్తాడని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడి గెలుపు సులభమైందన్నాడు. అర్జునుడి కొరకే తాను ఏకలవ్యుడిని, శిశుపాలుడిని, జరాసంధుడిని, ఇతరులను ఒక్కొక్కరినే హతమార్చుకుంటూ వస్తున్నానని, ఒకవేళ వారంతా ఇప్పుడు జీవించి వున్నట్లయితే అందరూ దుర్యోధనుడికి సాయంగా వచ్చేవారని, అప్పుడు పాండవుల గెలుపు అసాధ్యమయ్యేదని అన్నాడు. ఘటోత్కచుడు కూడా రాక్షసుడే అని, ఎప్పుడో ఒకప్పుడు అతడి ప్రవర్తన తనకు సమ్మతం కాకపోవచ్చని, అప్పుడు స్వయంగా తానే సంహరించాల్సి వుంటుందని, అందువల్ల తనకిది సంతోష సమయమని చెప్పాడు.

మరొక విషయం కూడా అర్జునుడికి చెప్పాడు శ్రీకృష్ణుడు. కర్ణుడు ఆ శక్త్యాయుధంతో ఆర్జునుడిని చంపాలని ప్రతిరోజూ అనుకునేవాడని, కాని అర్జునుడి క్షేమం కోరి తానే ఆ విషయం అర్జునుడు మరచిపోయేట్లు చేసేవాడినని అన్నాడు. ఆరోజు తాను అర్జునుడిని రక్షించుకొన్నానని, ఇక సుఖంగా నిద్రిస్తానని సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, ఇతరులతో అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు ఘటోత్కచుడి మరణానికి దుఃఖిస్తుంటే ఓదార్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వ్యాసమహర్షి కూడా ధర్మరాజును ఓదార్చాడు.

ఇదిలా వుండగా నకుల, సహదేవ, విరాట, ద్రుపదాదులు అంతా వారివారి సైన్యాలతో కలిసి కౌరవ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ద్రోణుడు కూడా యుద్ధానికి పూనుకున్నాడు కౌరవ పక్షాన. దుర్యోధనుడు కూడా సమర సన్నాహాన్ని చేశాడు. అయితే అప్పటికే నిరంతరాయంగా యుద్ధం చేస్తున్న ఇరు పక్షాల సైనికులకు మూడు జాముల రాత్రి భయంకరంగా అనిపించింది. అర్జునుడి సూచనకు అంగీకరించిన కర్ణ దుశ్శాసనులు ఇరుపక్షాలు విశ్రమించడానికి నిర్ణయించారు.

కాసేపట్లో చంద్రోదయం అయింది. పాంచాల వీరుల సైన్యాల వైపు ద్రోణాచార్యుడు యుద్ధం చేయడానికి వెళ్లగా, దుర్యోధనుడు పాండవులున్న దిక్కుకు యుద్ధానికి పోయాడు. ఇలా తెల్లవారుజామున యుద్ధం కొనసాగుతూ వున్నది. క్రమక్రమంగా తూర్పు ఎర్రబారింది. యుద్ధానికి వస్తున్న అర్జునుడిని దుష్టచతుష్టయం ఎదుర్కొని బాణాలు వేశారు. అర్జునుడు తన పరాక్రమన్నంతా చూపుతూ యుద్ధం చేయసాగాడు.

మరోవైపు ద్రోణాచార్యుడు ఉత్తర భాగానికి వెళ్లి యుద్ధం చేస్తుంటే, విరాట ద్రుపద రాజులు, ద్రుపదుడి మనుమలు, కేకయ రాజులు ద్రోణుడిని చుట్టుముట్టారు. క్రోధావేశంతో ద్రోణుడు ద్రుపదుడి ముగ్గురు మనుమలను, కేకయరాజులను, విరాట, ద్రుపదులను సంహరించాడు. ఇది చూసి ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిమీదికి యుద్ధానికి వెళ్లాడు. దుర్యోధనాదులు అడ్డగించారు అతడిని. భీమసేనుడు ధృష్టద్యుమ్నుడికి సాయంగా వచ్చాడు.

ఆ తరువాత దుర్యోధనుడు నకులుడిని, దుశ్శాసనుడు సహదేవుడిని, కర్ణుడు భీముడిని, ద్రోణాచార్యుడు ఆర్జునుడిని ఎదిరించి పోరాడారు. వీరందరి యుద్ధం భయంకరంగా సాగింది. ద్రోణార్జునుల యుద్ధం ఉభయ సైన్యాలు ఆశ్చర్యపడే విధంగా సాగింది. ఆచార్యుడు ప్రయోగించిన బాణాలను ఆయన శిష్యుడు అర్జునుడు ఖండించాడు. అర్జునుడు ప్రయోగించిన బాణాలను ద్రోణుడు ఖండించాడు. ఇరువురూ దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా, అర్జునుడు దాన్ని నివారించడానికి ప్రత్యస్త్రంగా బ్రహ్మాస్త్రాన్నే విలాసంగా ప్రయోగించాడు. ఇంతలో చెలరేగిన సంకుల యుద్ధం కారణంగా వారిరువురూ యుద్ధం మానేసి, ద్రోణుడు పాంచాల సైన్యం వైపుకు, అర్జునుడు కౌరవ సైన్యం వైపుకు యుద్ధానికి దిగారు.

ద్రోణుడు విజృంభించి పాంచాల సైన్యం మీద యుద్ధం చేసి హాహాకారం పుట్టిస్తుంటే అతడిని జయించడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక ఉపాయం చెప్పాడు. తన కుమారుడు అశ్వత్థామ చనిపోయాడన్న వార్త వింటే ఆయుధాన్ని విడిచి యుద్ధం మానేస్తాడని, ఆ సమయంలో ద్రోణుడిని సంహరించవచ్చని అన్నాడు. ఇది తప్ప ఇంకే మార్గం లేదన్నాడు.

అదే సమయంలో భీముడి చేతిలో అశ్వత్థామ అనే ఏనుగు మృతి చెందింది. ఆ నెపంతో భీముడు అతి వేగంగా వెళ్లి ద్రోణాచార్యుడితో ‘అశ్వత్థామ మృతుడైనాడు అని చెప్పాడు. అతడు చెప్పింది నిజమో, కాదో, అని అనుకున్న ద్రోణుడు, ధర్మరాజును అడిగాడు వాస్తవమేమిటని. ప్రాణాలు కాపాడుకునే సమయంలో అసత్యం ఆడుతే తప్పేమీ లేదంటూ శ్రీకృష్ణుడు, ‘అశ్వత్థామ హతుడైనాడు అని ద్రోణుడికి చెప్పమని ధర్మరాజుతో అన్నాడు. ఆ విధంగా అబద్ధం ఆడడానికి ప్రేరేపించాడు ధర్మరాజును. అప్పుడు ధర్మరాజు ద్రోణాచార్యుడితో, ‘అశ్వత్థామ చచ్చెను అని అంటూ, ఆయనకు వినబడకుండా ‘ఏనుగు అని మెల్లగా అన్నాడు. అది విని తన కుమారుడే మరణించాడని భావించాడు ద్రోణాచార్యుడు. వెంటనే ద్రోణుడు కుంగిపోయాడు.

ద్రోణాచార్యుడి అవస్థను గమనించిన ధృష్టద్యుమ్నుడు అతడి మీదికి విజృంభించి బాణాలు వేయగా, యుద్ధం చేయడానికి మనస్కరించని అతడికి దివ్యాస్త్రాలు స్ఫురణకు రాలేదు. అయినా భీకరంగా పోరాడాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి సారథి శరీరాన్ని బాధించగా అతడు ధృష్టద్యుమ్నుడి ఖడ్గాన్ని, డాలును ఖండించాడు. ఇంతలో సాత్యకి, భీముడు ధృష్టద్యుమ్నుడికి సాయంగా వచ్చాడు. ధృష్టద్యుమ్నుడిని ద్రోణుడి బారి నుండి తప్పించారు. అప్పుడు ద్రోణుడు తన మనస్సు పూర్వస్థితికి రాగా ప్రశాంతతను పొందాడు. అప్పటికి ఆయన నాలుగు రోజులు, ఒక రాత్రి, ఐదవ రోజు ఇరవై ఘడియలు యుద్ధం చేసి అలసి పోయాడు. తాను చేతనైనంత యుద్ధం చేశానని, ఇక దనుర్బాణాలు తనకు అక్కరలేదని, నిశ్చింతగా ప్రాణాలు త్యజించి పుణ్యలోకాలకు వెళ్లాలని భావించి వాటిని వదిలేస్తున్నానని, ఇక కౌరవులు బుద్ధిగా వుండమని బిగ్గరగా కర్ణాదులను ఉద్దేశించి అన్నాడు ద్రోణాచార్యుడు.

ఇలా అంటూనే దనుర్బాణాలను రథం మీద జారవిడిచాడు. రథం మీద కూచుండి యోగ సమాధిలో మునిగిపోయాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు కాలినడకన ద్రోణాచార్యుడిని సమీపించాడు. అంతలోనే ద్రోణాచార్యుడు యోగాన్ని ఆశ్రయించి శరీర త్యాగం చేసి జ్యోతిస్స్వరూపంతో ఆకాశానికి ఎగిరి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. రథాన్ని సమీపించిన ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి కళేబరం తల వెంట్రుకలను చేతిలో పట్టుకొని, తల నరికి వేయడానికి కత్తి ఎత్తగా, అర్జునుడు ఆపమని అన్నాడు. ఆపని చేయవద్దని హెచ్చరించాడు. ధర్మరాజు కూడా అది తప్పని అంటుండగానే ధృష్టద్యుమ్నుడు వినకుండా ద్రోణుడి తల తెగనరికి వేశాడు. ఆ తల, మొండెం రెంటినీ భూమ్మీదకు విసిరి వేశాడు. కౌరవ సైన్యాలు దిక్కుతోచక పరుగెత్తాయి.

కృపాచార్యుడి ద్వారా సమస్త విషయాన్ని తెలుసుకున్న అశ్వత్థామ, తన బాహుబల పరాక్రమాలతో, దివ్యాస్త్ర ప్రయోగంతో విజృంభించి పాండవులు రణరంగంలో తట్టుకోలేక తొలగిపోయేట్లు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసి నారాయణాస్త్రాన్ని స్మరించి శత్రు సైన్యం మీద ప్రయోగించాడు. అది పాండవుల చతురంగబలాలను నశింపచేసింది. అప్పుడు కృష్ణుడు బిగ్గరగా అరుస్తూ, సైనికులందరినీ వాహనాలు దిగి నేలమీద ఆయుధాలు లేకుండా నిలబడమని చెప్పాడు. ఇదే నారాయణాస్త్రానికి విరుగుడు అని అన్నాడు. ఒక్క భీముడు మాత్రం కృష్ణుడి మాట వినలేదు. అప్పుడు ఆ దివ్యాస్త్రం ఎవ్వరినే బాధించకుందా భీముడి వైపు వెళ్తుంటే అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి దాని ప్రభావాన్ని తగ్గించాడు. అర్జునుడు భీముడిని రథం మీదినుండి కిందికి తోశాడు. ఎప్పుడైతే పాండవ సైన్యం దీనత్వం పొందిందో అప్పుడే నారాయణాస్త్రం శాంతించింది.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

No comments:

Post a Comment