Monday, July 18, 2022

పదహారవ రోజు యుద్ధం, కర్ణుడు సర్వసేనాధిపతిగా మొదటి రోజు పాండవులది పైచేయి .... ఆస్వాదన-80 : వనం జ్వాలా నరసింహారావు

 పదహారవ రోజు యుద్ధం, కర్ణుడు సర్వసేనాధిపతిగా మొదటి రోజు పాండవులది పైచేయి

ఆస్వాదన-80

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-07-2022)

ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో పడిపోయేసరికి అశ్వత్థామ తన శక్తిమేరకు యుద్ధం చేశాడు. ఎప్పుడైతే అతడి దివ్యాస్త్రాలు విఫలం కావడం మొదలైందో అప్పుడే నిస్పృహతో యుద్ధాన్ని విరమించి, సేనలను వెనక్కు మరలించి తిరిగి వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు కర్త్యవ్యాలోచన కొరకు సభ చేశాడు. ఆ సభలో వున్న అశ్వత్థామ మొదలైన వీరులను భవిష్యత్ కర్తవ్యం ఏమిటని ప్రశ్నించాడు. జవాబుగా అశ్వత్థామ, బలశౌర్యాలలో గొప్పవాడైన కర్ణుడిని సేనానాయకుడిగా చేసుకొని శత్రువులను తుద ముట్టిద్దామని, కర్ణుడి దగ్గర దివ్యాస్త్ర సంపద చాలా వున్నదని, అంటూ కర్ణుడిని చూపించాడు. ఆ మాటలకు దుర్యోధనుడికి సంతోషం వేసింది. కర్ణుడిని ఉద్దేశించి దుర్యోధనుడు, అతడు మేధావని, సమర్థుడని, బలవంతుడని, తన రక్షకుడని, అతడు సేనాపతైతే అవలీలగా గెలుస్తామని అన్నాడు. అది విని కర్ణుడికి చాలా సంతోషం కలిగింది.

తనను సర్వసైన్యాధిపత్యానికి అధికారిని చేయమన్నాడు కర్ణుడు. బంగారు కలశాలతో పవిత్ర జలాలను తెప్పించి, కర్ణుడిని సేనాపతిగా అభిషేకించారు. తనను అంగదేశానికి రాజును చేయడమే కాకుండా అఖిల సైన్యానికి అదినాథుడిని చేశాడు దుర్యోధనుడని, కాబట్టి తాను అర్జునుడిని సంహరించి సామ్రాజ్య సంపదను అతడికి ఇస్తానని చెప్పాడు కర్ణుడు. ఆ తరువాత కర్ణుడు ఆజ్ఞాపించగానే సేనాధిపతులంతా యుద్ధానికి బయల్దేరారు. కర్ణుడు కూడా సైన్యాలకు సంతోషం కలిగే విధంగా యుద్ధానికి వెళ్లాడు. శత్రువులకు దుర్బేధ్యమైన మకరవ్యూహం పన్నాడు. మొసలి నోటి స్థానంలో తానే నిలిచాడు. రెండు కన్నుల దగ్గర శకునిని, అతడి కుమారుడు ఉలూకుడిని; తలదగ్గర అశ్వత్థామను; మెడవద్ద దుర్యోధనుడి తమ్ములను; కడుపు దగ్గర దుర్యోధనుడిని; ముందరి ఎడమకాలిదగ్గర నారాయణ గోపాలురతో పాటు కృతవర్మను; కుడి ముందర పాదం దగ్గర త్రిగర్తులతో, దక్షిణ దేశాలవారితో సహా కృపాచార్యుడిని; వెనుక ఎడమకాలి సమీపంలో సకల దేశ సేనలతో సహా శల్యుడిని; కుడి వెనుక పాదం దగ్గర బహు రథ గజ తురగ సమేతంగా సుషేణుడిని; తోక వద్ద మహా సైన్యంతో చిత్రుడు, అతడి తమ్ముడైన చిత్రసేనుడిని నిలిపాడు.

ఇదిలా వుండగా ధర్మరాజు సైన్యంతో సహా యుద్ధానికి వచ్చాడు. తన బాణపరంపరతో, దుర్యోధనుడి పక్షంలో ఇంకా మిగిలి వున్న కొద్దిమంది వీరులలో  ఒకడైన కర్ణుడిని సంహరించమని అర్జునుడికి చెప్పాడు. దాగిన తగిన వ్యూహం పన్నమని సూచించగా, అర్జునుడు అర్ధచంద్ర వ్యూహం పన్నాడు. అందులో మధ్యభాగంలో తానే స్వయంగా వున్నాడు. ఎడమ చివర భీమసేనుడిని; కుడి చివర ధృష్టద్యుమ్నుడిని; వెనుక భాగంలో ధర్మజ, నకుల , సహదేవులను; యుధామన్యుడు, ఉత్తమౌజుడిని వారివారికి తగిన స్థానాలలో నిలిపాడు. ఇలా ఉభయ పక్షాల వారు వ్యూహాలు తీర్చి దిద్దారు. రెండు సైన్యాలలోను ఒకదానిని మించి మరొకటి ఆనందపడుతున్న విధంగా కనిపించింది. ఇరుసేనలు మహాప్రతాపంతో పోరాడడానికి సిద్ధం అయ్యారు.

కులూత దేశపు రాజు క్షేమధూర్తి భీమసేనుడితో యుద్ధానికి దిగి పోరాడినప్పటికీ చివరకు తన గదా ప్రహారంతో భీముడు అతడిని సంహరించాడు. ఇది చూసి భయపడ్డ కౌరవ సేనలు పారిపోతుంటే, కర్ణుడు పాండవ సేనను ఎదుర్కొన్నాడు. కర్ణుడి బాణాల దెబ్బకు పాండవ సైన్యం భీతిల్లింది. ఆ సమయంలో నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. భీముడికి అశ్వత్థామకు, సాత్యకి విందానువిందులకు, చిత్రసేనుడు శ్రుతకర్మకు, ధర్మరాజు దుర్యోధనుడికి, అర్జునుడు సంశప్తకులకు, ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుడికి, శిఖండి కృతవర్మకు, సహదేవుడు దుశ్శాసనుడికి, ఇతర పాండవ-కౌరవ వీరులకు యుద్ధం జరిగింది భీకరంగా. విందానువిందులు ఇద్దరినీ సాత్యకి సంహరించాడు. ప్రతివింద్యుడి చేతిలో చిత్రసేనుడు చచ్చిపోయాడు. అశ్వత్థామ భీముడిమీద రెచ్చిపోయి యుద్ధం చేశాడు. ఇద్దరూ మహా భయంకరంగా పోరాడారు. చివరకు ఇద్దరి సారథులు బాణాలకు తట్టుకోలేక వారిద్దరినీ యుద్ధం నుండి తప్పించి తమతమ రథాలను దూరంగా తీసుకుపోయారు.  

ద్రౌపదీదేవి-అర్జునుడి కుమారుడు శ్రుతకీర్తికి, శల్యుడికి భీకరమైన యుద్ధం చోటుచేసుకుంది. శల్యుడు సందు చూసుకుని వేగంగా ధర్మరాజు సైన్యంలోకి ప్రవేశించి దానిని సంక్షోభపెట్టాడు. బాగా విజృంభించి శత్రుసైన్య సంహారం చేశాడు. మరొకపక్క దుశ్శాసనుడు సహదేవుడితో యుద్ధం చేసి మూర్ఛిల్లాడు. వెంటనే సారథి రథాన్ని వేరేదిక్కుకు తోలుకుపోయాడు. నకులుడికి, కర్ణుడికి మరో వైపున ఘోరమైన యుద్ధం జరిగింది. ఇరువురూ ఒకరికి మరొకరు తీసిపోకుండా దివ్యాస్త్రాలతో పోరాడారు. చివరకు కర్ణుడిది పైచేయి కావడంతో నకులుడిని విరథుడిని చేసి అవమానించాడు కర్ణుడు. తన విల్లును కర్ణుడు నకులుడి కంఠానికి తగిలించి పట్టుకున్నాడు. కుర్రవాడివని సంభోదిస్తూ, నకులుడిని విడిచి (కుంతికి ఇచ్చిన మాట ప్రకారం) పెట్తున్నానన్నాడు కర్ణుడు. సిగ్గుతెచ్చుకొని యుద్ధానికి దూరంగా పొమ్మన్నాడు. అలా విడువబడ్డ నకులుడు సిగ్గుతో ధర్మరాజు రథం ఎక్కాడు. అప్పటినుండి కర్ణుడి విజృంభణ ఇంకా పెరిగిపోయింది. నిండుగా యుద్ధం చేయసాగాడు.

మరో పక్క యుయుత్సుడికి ఉలూకుడికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఉలూకుడిది గెలుపైంది. దాంతో ఉత్సాహం కలిగి ఉలూకుడు విజృంభించాడు. ఇంతలో శ్రుతకర్మ శతానీకుడిని (ద్రౌపదీ-నకులుల కుమారుడు), శ్రుతసోముడిని (ద్రౌపదీ-భీమసేనుల కుమారుడు) శకుని డీకొన్నారు. ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుడితో తలపడి ఓడిపోయాడు. కాళ్లూ, చేతులు అల్లాడిపోతుంటే, ఒళ్లు పట్టు సడలి పోతుంటే, ధృష్టద్యుమ్నుడిని అతడి సారథి భీమసేనుడి దగ్గరికి తీసుకుపోయాడతడిని. ఈ లోగా శిఖండి వచ్చి కృతవర్మను ఎదుర్కొని తీవ్రంగా బాధించాడు. చివరకు శిఖండి సేన కూడా పారిపోయింది.

సంశప్తకుల మీద యుద్ధం చేసున్న అర్జునుడు పరాక్రమంతో చేస్తున్న వీరవిహారాన్ని త్రిగర్తరాజు ఓర్చుకొని ప్రతిఘటిస్తున్నాడు. అతడికి సహాయంగా అనేక సేనలున్నాయి. వారంతా బాణాలతో అర్జునుడిని కప్పేశారు. అందులో సత్యసేనుడు అనేవాడు వేసిన ఈటె కృష్ణుడి భుజాన్ని చీల్చింది. దాంతో అర్జునుడు కోపించి తన బాణాలతో అతడి తల నరికాడు. ఆ తరువాత వరుసగా మిత్రవర్మను, మిత్రసేనరాజును చంపాడు. సంశప్తకుల మీద ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. దాంతో యుద్ధ ప్రదేశం మహా భయంకరంగా అయిపోయింది. అర్జునుడి బాణాల ధాటికి హతశేషులైన సంశప్తకులు క్షోభపడి అన్నివైపులకూ పారిపోయారు. ఇదిలా వుండగా దుర్యోధనుడు ధర్మరాజుతో యుద్ధం చేసి విరథుడయ్యాడు. ఆ తరువాత ఇంకాసేపు అలాగే పోరాడి మూర్ఛిల్లాడు. అప్పుడు కృతవర్మ వారిద్దరి మధ్య ప్రవేశించాడు. దాంతో భీమసేనుడు కృతవర్మను డీకొన్నాడు.

మూర్ఛనుండి తేరుకున్న దుర్యోధనుడు ఆర్జునుడిని ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే అర్జునుడి బాణం దుర్యోధనుడిని తాకబోయిందో దాన్ని మధ్యలోనే అశ్వత్థామ ముక్కలు చేశాడు. అర్జునుడు తక్షణమే అశ్వత్థామ ధనుస్సును, దాంతో పాటే కృపాచార్యుడి ధనుస్సును ఖండించాడు. ఆ తరువాత ఎదిరించడానికి వచ్చిన కృతవర్మ, దుశ్శాసనుల ధనుస్సులను కూడా తుంచాడు. గాండీవాన్ని సారించి, సాత్యకితో పోరాడుతున్న కర్ణుడి మీదికి పోయాడు. అర్జునుడితో పాటు సాత్యకి, యుధామన్యుడు, శిఖండి మొదలైన పాండవ వీరులు కర్ణుడిని ఎదిరించారు. వారు ప్రయోగించిన ఆయుధాలన్నిటినీ కర్ణుడు తిప్పికొట్టాడు. అది గమనించిన అర్జునుడు గర్వంతో విజృంభించి కర్ణుడు ప్రయోగించిన బాణాలను అదుపుచేశాడు. అర్జునుడి బాణాల తాకిడికి కౌరవ సేనలు పరుగులు పెట్టాయి.

ఇంతలో సూర్యాస్తమయం అయింది. కౌరవ సేనలు రాత్రి యుద్ధానికి వెనుదీశారు. దాంతో పాండవ సైనికులు వారిని తరిమి కొట్టారు. ఆ విధంగా కర్ణుడి మొదటి రోజు యుద్ధంలో విజయం పాండవ సైనికులదయింది. ఉభయ సైన్యాలు తమతమ విడిదులకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాయి.

ఆ రాత్రి దుర్యోధనుడు ఆలోచన చేస్తున్న సమయంలో కర్ణుడు తనకు అర్జునుడి మీద వున్న కోపాన్ని, కసిని వెళ్లగక్కాడు. శక్తియుక్తులు కలవాడని పేరు పొందిన రథికశ్రేష్టుడు అర్జునుడని, దానికి తోడు శ్రీకృష్ణుడు అవసరమైనప్పుడు అతడికి అన్ని విషయాలు స్పష్టంగా వివరిస్తూ వుంటాడని అంటూ, దేవేంద్రుడు తనకిచ్చిన శక్త్యాయుధాన్ని అర్జునుడి చంపడానికి దాచిపెట్టగా ఘటోత్కచుడి మీద వాడాల్సి వచ్చిందని, అయినప్పటికీ, అర్జునుడి పౌరుషాన్ని, నేర్పుని మర్నాటి యుద్ధంలో లేకుండా చేస్తానని కర్ణుడు దుర్యోధనుడుకి ధైర్యం చెప్పాడు. అలా కర్ణుడు చెప్పేసరికి దుర్యోధనుడు చాలా సంతోషించాడు. అంతా ఆరాత్రి సుఖంగా నిద్రపోయారు.           

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, కర్ణపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

   

                 

No comments:

Post a Comment