Friday, January 31, 2025

 పథకాల కొనసాగింపులో ఏదీ హేతుబద్ధత? 

పథకాల సమీక్ష, సవరణ, స్వస్తిలో మృగ్యమవుతున్న హేతుబద్ధత 

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ దినపత్రిక (01-02-2025)

రెండు పర్యాయాల తన పదవీకాలంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేసి, అమలుపరచిన కొన్ని విధానపరమైన (అసంబద్ధ) నిర్ణయాలు, స్వస్తి పలికిన ఆయనకు ముందున్న యూపీఏ ప్రభుత్వం అమలుచేసిన కొన్ని పథకాలు, కార్యక్రమాలు, ఆచరణలో సారూప్యతలు, అభద్రతా భావాన్ని కలిగించిన కేంద్రప్రభుత్వ వ్యవస్థల తీరుతెన్నులు, పాలనాపరమైన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన మరికొన్ని అంశాలు, ఎనిమిది నెలల క్రితం జరిగిన 18వ లోక్ సభ ఎన్నికలలో, బహుశా బీజేపీకి, ఎన్డీఏకి సంఖ్యాపరంగా సభ్యులు తగ్గడానికి కారణమని కొందరు రాజకీయ, సామాజిక విశ్లేషకుల భావన.

ఉదాహరణకు, ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణయం, ‘జీఎస్టీ’ గందరగోళం, ‘అగ్నిపథ్’ పథకం, జమిలి ఎన్నికల నినాదం (‘వన్ నేషన్ వన్ పోల్స్’), ఇవన్నీ దీర్ఘకాలిక లాభాలను కలిగిస్తాయని మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది. ప్రజా సంక్షేమానికి, దేశీయ సమస్యలకు’ ప్రాధాన్యత తగ్గించి, అంతర్జాతీయ వ్యవహారాల మీద అమితమైన దృష్టి పెట్టడం, సాంప్రదాయేతర హిందూత్వ రాజకీయ భావజాలం’ లాంటివి కూడా ప్రతికూలతాంశాలుగా విశ్లేషకులు భావించారు. సాక్షాత్తూ అయోధ్యలో ఓటమి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సగానికి సగం స్థానాలు ఓడిపోవడం, మోదీకి వారణాసి నియోజక వర్గంలోనే మెజారిటీ బాగా తగ్గడం, హిందుత్వ సిద్దాంతం పూర్తిగా పనిచేయలేదని స్పష్టంగా చెప్పడానికి కారణాలు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాల్సిన స్థానాలమీద ప్రతికూల ప్రభావం చూపింది. 

సంఖ్యాపరంగా ప్రధాని మోదీకి, బీజేపీకి, ఎన్డీఏకి ఓటర్లు ‘విద్యుత్ షాక్’ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్థానాలు ఇండియా (యూపీఏ) కూటమి స్థానాలు పెరిగాయి. మోదీ మూడవ పర్యాయం పదవీకాలంలో తీసుకునే విధాన నిర్ణయాలు, పథకాల, కార్యక్రమాల రూపకల్పనలో సరిదిద్దు చర్యలు ప్రారంభించమని ఓటర్లు సున్నితంగా హెచ్చరించారు. నరేంద్ర మోదీజీ అజేయుడు అనడానికి అంగీకరించకుండా, ఆయన నాయకత్వం మరికొంత కాలం తప్పనిసరిగా అవసరమే’ అని ఓటర్లు తెలివిగా, స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తరువాత వినయ విధేయతలతో ప్రసంగించిన మోదీ, ఓటర్ల నిర్ణయాన్ని స్వీకరిస్తున్నాని, శిరసా వహిస్తున్నానని, స్వీయ-ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం తమ పార్టీకి వుందని చెప్పిన మాటలలో, ఓటర్ల పరోక్ష, నిర్మాణాత్మక, సున్నితమైన హెచ్చరిక సారాంశసారం స్పష్టంగా ప్రతిబింబించింది. కాకపోతే అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో మార్పు ఏమేరకు వచ్చిందో అనే విషయంలో స్పష్టత ఇంకా రాలేదు. 

ఇదిలా వుంటే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పది సంవత్సరాల పరిపాలనలో అమలుపరచిన విధానాలను, పథకాలను, కార్యక్రమాలను, పాక్షికంగానో, పూర్తిగానో రద్దు చేసే దిశగానో, లేదా పేర్లను మార్చే దిశగానో, ఏడాదికి పైగా అధికారంలో వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఆలోచనలో వున్నదని బీఆర్‌ఎస్ నేతల అనుమానం, ఆందోళన. ‘కాంగ్రెస్ పార్టీ మార్క్’ను, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లను, పార్టీ చిహ్నాన్ని ప్రతిబింబించేలా, పథకాల పేర్లలో మార్పులు జరుగున్నాయని వారి ప్రధానమైన ఆరోపణ. అలాగే అటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన పథకాలను చంద్రబాబునాయుడు మారుస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యంలో, నిత్యం మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా, రాజకీయ పార్టీలు, ఎన్నికల సమయంలో, అప్పటికే అమల్లో వున్న విధానాలను, పథకాలను, కార్యక్రమాలను మారుస్తామనో, పునర్వ్యవస్థీకరణ చేస్తామనో, అదనపు ఆర్ధిక ప్రయోజనాలను చేకూర్చే విధంగా సరికొత్త (ఉచిత) పథకాలకు శ్రీకారం చుట్తామనో వాగ్దానాలు చేయడం సర్వ సాధారణం. అందులో తప్పేమీ లేదు. తప్పల్లా గత ప్రభుత్వం చేసిన ప్రతిదాన్నీ హేతుబద్ధత లేకుండా విమర్శించడమే!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, వ్యూహాత్మకంగా, తెలివిగా, బహుళ ప్రచారం చేసి, తమ పథకాలకు ఓటర్ల విశ్వశనీయత పొందింది. మెజారిటీ అత్యంత స్వల్పమే అయినప్పటికీ, పదేళ్లపాటు సుపరిపాలన చేసిన బీఆర్ఎస్ ను ఓడించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది  కాంగ్రెస్ పార్టీ. అలాగే చంద్రబాబునాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ పథకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి, ఓటర్ల విశ్వసనీయత పొంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ఓడించి, రాష్ట్రం విడిపోయిన తరువాత రెండవ పర్యాయం అధికారంలోకి రావడం జరిగింది.   

ప్రపంచవ్యాప్తంగా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, అధికారంలోకి రాగానే, తమకు పూర్వం అధికారంలో వున్న ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను, అభివృద్ధి-సంక్షేమ పథకాలను, ఇతర కార్యక్రమాలను, కొనసాగించే, లేదా, తాత్కాలికంగానో, శాస్వతంగానో స్వస్తి పలికే పద్ధతులు విభిన్నంగా ఉంటాయి. ఇవన్నీ, అధికారంలోకి వచ్చిన పార్టీ, దాని నాయకుడి  వ్యక్తిగత ప్రాధాన్యతల వల్ల స్పష్టంగా ప్రభావితమవుతాయి. ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం, పథకాల అమల్లో స్థిరత్వం, సంక్షేమ ఫలాలు అందుతాయన్న ప్రజల విశ్వాసం కొరకు, విధానాల, పథకాల కొనసాగింపు అభిలషణీయం. దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల, సామాజిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాల విషయంలో, చౌకబారు రాజకీయ ప్రాధాన్యతలకన్నా, శాస్త్రీయ పద్ధతిలో ‘విధాన సమీక్ష’ జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోవడం సముచితం. ప్రజాస్వామ్యాల్లో ప్రభుత్వం మారినప్పుడు, ఎన్నికల హామీలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి, దాని నాయకుడికి తప్పనిసరి. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల నుండి వీటికి సంబంధించిన ఉదాహరణలు మార్గదర్శకంగా వుంటాయి. 

‘ఉక్కు మహిళ’ గా పిలువబడ్డ కన్సర్వేటివ్ పార్టీ మార్గరెట్ థాచర్, బ్రిటన్ ప్రధానిగా తన 11 సంవత్సరాల పదవీకాలంలో, అమలుపరచిన (థాచరిజం) పిలువబడిన ఆర్థికసంస్కరణలను, ప్రపంచవ్యాప్తంగా ఆమోద యోగ్యమైన ప్రభుత్వరంగ సంస్కరణలను, ఆమె వారసుడు, లేబర్ పార్టీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, స్వల్ప మార్పులతో (థర్డ్ వే అప్రోచ్) కొనసాగించారు. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన మరో ప్రధాని డేవిడ్ కామెరాన్ శ్రీకారం చుట్టిన, యూరోపియన్ యూనియన్ నుండి యునైటెడ్ కింగ్‌డమ్ ఉపసంహరణకు సంబంధించిన ‘బ్రెగ్జిట్ రెఫరెండం,’ నాయకత్వాలు మారినప్పటికీ, ప్రధానులు థెరిసా మే, బోరిస్ జాన్సన్ లు కొనసాగించారు. 

అమెరికాలో, ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం, ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించబడి, బహుళ ప్రాచుర్యం పొందిన ‘ఫుడ్ కూపన్ కార్యక్రమం’ (ఇప్పటి ‘సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ కార్యక్రమం’) అనేకానేక విమర్శలను అధిగమించి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, మారుతున్న ఆర్థిక పరిస్థితుల, విధాన ప్రాధాన్యతలకు అనుగుణంగా కొనసాగుతూ, అమెరికన్ సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక మూలస్తంభంగా నిలిచి పోయింది. ‘ఒబామా సరసమైన ఆరోగ్య సంరక్షణ విధానం‘తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నప్పటికీ, ట్రంప్ పరిపాలనలో తగు సవరణలతో కొనసాగించడం జరిగింది. 

ఒకనాటి కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్‌లో, బోల్షవిక్ విప్లవ నాయకుడు, సోవియట్ యూనియన్‌ ఆవిర్భావానికి కారకుడు, లెనిన్‌ మహాశయుడిని, స్టాలిన్ విమర్శించడమే కాకుండా, సోవియట్ ఆర్థిక వ్యూహంలో గణనీయమైన సంస్కరణగా, భావజాలంగా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన, ఆయన ‘నూతన ఆర్ధిక విధానాన్ని’ వ్యతిరేకించాడు. కేంద్రికృత, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, శీఘ్ర పారిశ్రామికీకరణ, సమూహీకరణ పాలనకు స్టాలిన్ ప్రాధాన్యమిచ్చాడు. ‘డీస్టాలినైజేషన్’ లో భాగంగా, స్టాలిన్ అనుసరించిన వ్యక్తి పూజను ఖండించి, సోవియట్ విధానాలలో సరళీకృతకు ప్రాధాన్యం ఇచ్చాడు స్టాలిన వారసుడు కృశ్చేవ్.

భారతదేశం ప్రథమ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామికీకరణ, ప్రభుత్వ రంగసంస్థల ఆవిర్భావం, అలీనోద్యమాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. లాల్ బహదూర్ శాస్త్రి వాటిని కొనసాగిస్తూ, ‘హరిత విప్లవం’ నినాదంతో ఆహార ఉత్పత్తి పెరుగుదలకు బాటలు వేశారు. అవి కొనసాగిస్తూ, ఇందిరా గాంధీ, బాంకులను జాతీయం చేసింది. జనతాపార్టీ ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయి, ఇందిరాగాంధీ ‘ప్రాథమిక ఆర్థిక వ్యవస్థను’ కొనసాగించారు. ఐటి, టెలికాం విప్లవ విధానాలకు ఆద్యుడు రాజీవ్ గాంధీ, విపి సింగ్ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేశారు. పీవీ నరసింహారావు తన నవీన ‘ఆర్థిక సంస్కరణల’ ద్వారా, ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ దిశగా దేశాన్ని అభ్యుదయంలో నడపడం, నూతన పారిశ్రామిక విధానం ద్వారా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం భారీ విధాన మార్పు అనాలి.  అటల్ బిహారీ వాజ్ పేయి సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగించి, మౌలిక సదుపాయాలు, టెలికాం, బీమారంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగిస్తూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం తెచ్చారు. నరేంద్ర మోదీ సరళీకృత ఆర్ధిక విధానాలను, నరేగా పథకాన్ని కొనసాగించి, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ లను తీసుకు వచ్చారు.

విడిపోక ముందు, ఆ తరువాత కూడా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో, ఎన్ని మౌలిక విభేదాలున్నా, అత్యంత ప్రజాదరణ పొందిన 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ పథకం లాంటివి కొనసాగాయి. ‘వ్యూహాత్మక రాజకీయ నాయకులుగా, టీం వర్క్ కు ప్రాధాన్యం ఇస్తున్నవారిగా’ భావించే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఏపి సిఎం చంద్రబాబునాయుడు కూడా, ఇటు కేంద్రంలోనూ, అటు బ్రిటన్, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలలోనూ, పాటిస్తూ వస్తున్న ‘సత్సంప్రదాయాలకు’ అనుగుణంగా, ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించే గత ప్రభుత్వాల ‘పథకాల, విధానాల సమీక్ష, సవరణ, స్వస్తి’ అంశాలలో హేతుబద్ధత మృగ్యమవ్వడం సమంజసమా?! 

1 comment:

  1. Showing agnipath as an example for confusing schemes is unfortunate, sorry I didn’t expect this much short sighted view from experienced person like you

    ReplyDelete