Sunday, January 26, 2025

యోగీశ్వరుడైన భరతుడి తత్త్వజ్ఞానోపదేశం ..... శ్రీ మహాభాగవత కథ-20 : వనం జ్వాలా నరసింహారావు

 యోగీశ్వరుడైన భరతుడి తత్త్వజ్ఞానోపదేశం 

శ్రీ మహాభాగవత కథ-20

వనం జ్వాలా నరసింహారావు 

సూర్యదినపత్రిక (27-01-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

ఋషభుడి అనంతరం ఆయన పెద్ద కుమారుడైన భరతుడు ఈ భూమండలానికి రాజయ్యాడు. విశ్వరూపుడి కుమార్తె పంచజని అనే కన్యను వివాహమాడాడు. వారికి సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే ఐదుగురు, అహంకారం నుండి పంచతన్మాత్రలు జన్మించిన విధంగా పుట్టారు. గతంలో అజనాభం అని పిలవబడే ఈ భూభాగం భరతుడు పాలించడం మొదలైన తరువాత ’భరత వర్షం’ అన్న పేరు సార్థకమైంది. భరతుడి పాలనను దేవతలు సహితం మెచ్చుకున్నారు. ఆయన ఎన్నో యజ్ఞాలను, పూజలను ఆచరించాడు. యజ్ఞకర్మలను ఆచరిస్తూనే రాజ్యపాలనలో గొప్ప ఖ్యాతి గడించాడు భరతుడు. పవిత్రమైన అంతఃకరణతో, పవిత్ర చిత్తంతో, ఆ రాకుమారుడు ధర్మనిష్టతో ఈ భూమిని పరిపాలించాడు. ఇలా ఏభైలక్షల వేల సంవత్సరాలపాటు భరతుడు రాజ్యాన్ని పాలించాడు. తండ్రి-తాతల ఆస్తైన రాజ్యాన్ని అర్హతకు తగ్గ విధంగా కొడుకులకు పంచాడు. తరువాత పులహాశ్రమ సమీపంలో గందకీ నది దగ్గర, ఇంద్రియ నిగ్రహంతో, భరతుడు విష్ణువును సేవించేవాడు. పూర్తిగా భక్తిలో మునిగి పరమేశ్వరుడిని హిరణ్మయమూర్తిగా తలుస్తూ స్తుతించేవాడు అనేక విధాలుగా.   

ఒకనాడు భరతుడు ఆ మహానదీతీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు, గర్భిణైన ఒక లేడి నీరుతాగుతుండగా ఒక సింహం దాన్ని చూసి గర్జించింది. భయంతో లేడి గర్భం విచ్చిన్నమై, కడుపులో వున్న పిల్ల జారి నీళ్లలో పడిపోయింది. తల్లి చనిపోయింది. నీళ్లలో జారి, ప్రవాహంలో తేలుతున్న లేడిపిల్లను భరతుడు చూశాడు. దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. దాన్ని పెంచుతూ, దానిమీద మమకారాన్ని కూడా పెంచుకున్నాడు. చివరకు పరమేశ్వరుడిని కూడా మర్చిపోయాడు. ఆత్మలో యోగనిష్టకు బదులు లేడిపిల్లమీద ప్రేమ స్థిరపడిపోయింది. దానితో ఆటపాటలతోనే జీవితం గడిచిపోయేది. ఒకనాడు ఆ లేడిపిల్ల ఎటో పారిపోయింది. రాజర్షయిన భరతుడు మనస్సులో దానికోసం ఆరాటపడ్డాడు. దాని కారణంగా బహువిధాల కోరికలతో సతమతమయ్యాడు. భగవత్ ధ్యాస మానేశాడు. అతడికి దానిమీద మోహం మరింత తీవ్రమైంది. 

ఇలా వుండగా, భరతుడికి అవసానదశ వచ్చింది. లేడిపిల్లనే ఆత్మలో నిలుపుకుని దేహాన్ని విడిచి పెట్టాడు. ఆ కారణాన, గతస్మృతితో, ఒక లేడి గర్భంలో పడి లేడిపిల్లగా జన్మించాడు. తానెందుకు లేడిపిల్లగా పుట్టాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నాడు. శ్రీహరినే అనునిత్యం ధ్యానం చేస్తూ, పులహాశ్రమానికి వచ్చి, చక్రనదీ తీర్థంలో స్నానం చేస్తూ, అవసాన సమయం కోసం ఎదురు చూస్తూ, చివరకు లేడి శరీరాన్ని విడిచి పెట్టాడు. ఆ తరువాత అంగిరసుడి వంశంలోని  ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మించాడు. ఎల్లప్పుడూ శ్రీహరి పాదాలనే ధ్యానం చేసుకునేవాడు. 

అంగిరసుడికి ఇద్దరు భార్యలు. ఆయనది పరిశుద్ధ స్వభావమే. స్వాధ్యాయ అధ్యయనపరుడు. మొదటి భార్యకు తొమ్మిదిమంది కొడుకులున్నారు. చిన్నభార్యకు ఇతడు కాక ఇంకొక ఆడపిల్ల పుట్టారు. భరతుడికి పూర్వజన్మ జ్ఞాపకం వుండేది. భరతుడు తండ్రి చెప్పడం వల్ల గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. వేదాలను అధ్యయనం చేశాడు. అంగిరసుడు చనిపోయిన తరువాత తల్లి ఆయనతో సహగమనం చెసింది. సవతి తల్లి కొడుకులు ఇతడిని వేదాద్యయనం చెయ్యనీయకుండా ఇంటి పనులకు నియమించారు. వారు చెప్పిన పనులు చేస్తూ, వాళ్ల బరువులు మోస్తూ, కూలిపని చేస్తూ, బిచ్చమెత్తుకునేవాడు. మాసిన గుడ్దలు కట్టుకునేవాడు. అతడి యజ్ఞోపవీతాన్ని చూసి ఇతడెవరో పిచ్చివాడనుకునే వారు. అలా కాలం గడిపేవాడు.     

ఒకనాడు ఒక శూద్రజాతి నాయకుడు తనకు సంతానం కలగడానికి కాళికాదేవికి బలి ఇవ్వడానికి ఒకడిని పట్టుకుని తీసుకుపోతున్నారు. వాడు వీళ్లనుండి తప్పించుకుని పారిపోగా, అతడిని వెతుకుతుంటే, భరతుడు దొరికాడు. పారిపోయినవాడి స్థానంలో ఇతడిని బలి ఇవ్వడానికి నిశ్చయించుకుని దానికి అవసరమైన సంస్కారాలు చేసారు భరతుడికి. కాళికాదేవి ఎదుటికి తెచ్చి కూచోబెట్టారు. ఆ సమయంలో ఈ బ్రాహ్మణ బాలుడి తేజస్సు సాక్షాత్తు కాళికాదేవినే ఆశ్చరపరిచింది, భయం కొలిపింది. హుంకారం చేసి బలివ్వాలనుకున్న శూద్రనాయకుడిని బలి తీసుకుంది. భరతుడు ఇదేమీ పట్టనట్లు వాసుదేవుడిని హృదయంలో స్మరిస్తూ నిర్వికారంగా వున్నాడు. తరువాత భరతుడు ఆలయం నుండి బయటకొచ్చి ఎప్పటిలాగే చేనుకు కాపలా కాయసాగాడు.   

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇదిలా వుండగా, సింధు దేశాన్ని పాలిస్తున్న రహుగణుడనే రాజు కపిల మహర్షి దగ్గర నుండి తత్త్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న కోరికతో ఒకనాడు రాచఠీవితో పల్లకి ఎక్కి బయల్దేరాడు. పల్లకి బోయీలలో ఒకడు సరిగ్గా నడవలేకపోవడంతో వాడి స్థానంలో దారిలో కనిపించిన భరతుడికి ఆపని ఆప్పగించారు. ఏమాత్రం చింతపడకుండా పల్లకిని మోయసాగాడు భరతుడు. అలవాటు లేనందున అతడు మోస్తుంటే పల్లకి కుదుపులకు లోనైంది. రహుగణుడికి భరతుడి మీద కోపం వచ్చింది. నిష్టూరంగా అతడిని మందలిస్తూ వేళాకోళంగా మాట్లాడాడు. భరతుడు మాత్రం జవాబివ్వకుందా పల్లకి మోయసాగాడు. అతడికి అహంకార మమకారాలు లేవు తన శరీరం మీద. సాక్షాత్తు పరబ్రహ్మం మీదే చూపు కలిగి అప్పగించిన పని చేస్తున్నాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. తన ఆజ్ఞ పాటించకుండా తప్పుగా నడుస్తున్న వాడిని సరిగ్గా నడిపిస్తానని రాజు గర్వంతో, హద్దూ-అదుపూ లేకుండా మాట్లాడ సాగాడు. 

బ్రాహ్మణుడీ (భరతుడు) మాటలను విన్నాడు. జవాబుగా: "రాజా! బరువు ఈ శరీరానికి కాని నాకు కలగదు. ఆకలిదప్పులు, మనోవ్యాధులు, మమకారం, అహంకారం, రోగాలు, రోషం....ఇత్యాదులు శరీరంతో పుట్టేవేకాని నాకు ఏర్పడేవి కావు. అందరూ జీవన్మృతులే. బంధాలన్నీ శరీరానికి వుంటాయి కానీ జీవుడికి వుండవు. జడునిలా వుంటూ బ్రహ్మాత్మస్వభావంతో వున్న నామీద నువ్వు విధించే శిక్షవల్ల ఏం లాభం చేకూరుతుంది? నేను శరీరభావం లేని స్తబ్దుడిని, మత్తుడిని. అలాంటి నాకు నువ్వు విధించే శిక్ష వ్యర్థం", అని, ఇలా ఏవేవో ప్రాపంచిక విషయాలు చెప్పసాగాడు. రహుగణుడు ఈ మాటలను విన్నాడు. కపిలముని దగ్గరికి తత్త్వ జ్ఞానం కోసం పోతున్న అతడికి భరతుడి మాటలు హృదయగ్రంథిని విడదీశాయి. వెంటనే రాజు పల్లకి లోనుండి దిగాడు. భరతుడికి సాష్టాంగదండ ప్రమాణం చేశాడు. గర్వాన్ని విడిచి, చేతులు జోడించి ఆయనెవరని అడిగాడు. ఆయనే కపిల మునీంద్రుడా అని ప్రశ్నించాడు. జవాబుగా భరతుడనే ఆ బ్రాహ్మణుడు, ఈ సంసారం ఒక ఘటం లాంటిదనీ, దానికి శిక్షణను, రక్షణను కలిగించేవాడు రాజనీ, అతడు చెడు కర్మలను మాని వాసుదేవుడిని సేవిస్తే మళ్లీ జన్మ ఎత్తకుండా, సంసారంలో చిక్కకుండా వుంటాడనీ అన్నాడు. 

భరతుడి మాటలు విన్నాక రహుగణుడిలో మార్పు వచ్చింది. అతడిని వినయంతో ప్రస్తుతించాడు. తను రాజుననే దురభిమానంతో గుడ్డిగా ప్రవర్తించాననీ క్షమించమనీ అన్నాడు. తనకు తెలిస్న తత్త్వాన్ని మరికొంత బోధించాడు భరతుడు. అతడు కారణజన్ముడని, నిత్యమూ పరమాత్మానుభవంలోనే వున్నవాడని,  అనుభవ విహారి అని, సాటిలేని పరమ శాంతిని పొంది వున్నాడని, మహాజ్ఞానియైన ఆయనకు మళ్లీ-మళ్లీ నమస్కరిస్తున్నానని అన్నాడు రాజు రహుగణుడు. తన సంశయాలన్నింటినీ భరతుడిని అడిగి నివృత్తి చేసుకోవలనుకుంటున్నానని, ఆధ్యాత్మయోగాన్ని తనకు యోగ్యమైన పద్ధతిలో చెప్పమని అడిగాడు. జవాబుగా పరమార్థమై జ్ఞానరూపమైనట్టి పరబ్రహ్మమొక్కటే సత్యమైనదని, జగత్తు అసత్యమైనదని, పరమ భాగవతుల పాదసేవ చేయడం వల్ల బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందని, మహాభాగవతులను సేవిస్తే మోక్షసాధనకు పద్మాక్షుడైన శ్రీహరి మీదే మనస్సు నిలిచి వుంటుందని చెప్పాడు భరతుడు. తన పూర్వజన్మల గురించి, అలా ఎత్తడానికి కారణం గురించీ చెప్పాడు. రాజుకు సంసారమనే అడవి తీరు ఎలా వుంటుందో వివరించాడు. రాజు అనే భావాన్ని విడిచి, సకల చరాచర ప్రపంచంతో స్నేహితుడిగా వుండమనీ, ఇంద్రియాలను జయించమనీ, జ్ఞానం అనే ఖడ్గంతో మాయా పాశాన్ని తెగనరికి జీవిత గమ్యస్థానాన్ని చేరుకోమనీ బోధించాడు. అలా యోగీశ్వరుడైన భరతుడు రాజుమీద కరుణతో తత్త్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆయన బోధనలు విన్న రాజు ఆయనకు తనివితీరా నమస్కరించాడు. రాజు నమస్కారాన్ని అందుకుని భరతుడు దయ కలిగిన మనస్సుతో భూమ్మీద సంచరించాడు.          

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 

No comments:

Post a Comment