Wednesday, January 22, 2025

కలిసి నిర్ణయం తీసుకున్నాక కప్పదాట్లు తగవు! ...... వనం జ్వాలా నరసింహారావు

 కలిసి నిర్ణయం తీసుకున్నాక కప్పదాట్లు తగవు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (23-01-2025)

{మంత్రిని మెప్పించడానికి సివిల్ సర్వెంట్లు చట్టపరమైన, విధివిధానాలకు భిన్నంగా అత్యుత్సాహం ప్రదర్శించి, మంత్రితో కలిసి నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఆ నిర్ణయం విషయంలో పదవి కోల్పోయిన మంత్రిని తప్పుబట్టడం సరైంది కాదు. ఒకసారి మంత్రితో కలిసి సివిల్ సర్వెంట్ నిర్ణయం తీసుకున్న తరువాత వారిద్దరూ తత్సంబంధమైన విషయంలో తప్పొప్పులకు పూర్తి బాధ్యత వహించాలి. తమ పాత్రను అంగీకరించాలి. అధికారి పూర్తిగా మంత్రిని తప్పు పట్టడం లేదా మంత్రి అధికారిని తప్పు పట్టడం సరైనది కాదు} – సంపాదకుడి వ్యాఖ్య  

‘ఫార్ములా-ఈ రేస్ కేసు’కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణ చేసిన  తెలంగాణ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ, ఈ అంశంలో మాజీ మంత్రి కేటీ రామారావు, సివిల్ సర్వెంట్ అర్వింద్ కుమార్‌ ల పై కేసు నమోదు చేసింది. సరైన విధివిధానాలను పాటించకుండా, రేసింగ్ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందనీ, ఆ వివరాలను ఏసీబీ దర్యాప్తులో అర్వింద్ కుమార్ బైటపెట్టారనీ, మీడియా వెల్లడించింది. అంతే కాకుండా, ‘మాజీ మంత్రి కేటీ రామారావు’ ప్రభుత్వ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా హెచ్‌ఎండీఏ నుంచి నిధులను విడుదల చేయమని తనను ఆదేశించినట్లు కూడా అర్వింద్ కుమార్ తెలిపారట. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక మంత్రి-సివిల్ సర్వెంట్ ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, ఆ నిర్ణయానికి తనవంతు బాధ్యతను సివిల్ సర్వెంట్ పూర్తిగా విస్మరించి, తనకు ఏమీ సంబంధం లేదని చెప్పడం అంటే  సివిల్ సర్వెంట్ తన ‘భుజాలపై వేసుకోవాల్సిన గురుతర బాధ్యతను’ విస్మరించాడనే అనుకోవాలి. ఇది సబబా, కాదా, అనే అంశం మీద కూలంకశంగా చర్చ జరగాల్సిన అవసరం వున్నది.

 ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన నిజానిజాల, వాస్తవాల, మంచి-చెడుల విషయానికి పోకుండా, ఇలాంటి సందర్భాలలో, సంబంధిత మంత్రి, ఉన్నత స్థాయి ప్రభుత్వ పదవిలో ఉన్న సివిల్ సర్వెంట్ (ఐఏస్ అధికారి) కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల నేపధ్యంలో, ఆ మంత్రులు కానీ, అఖిలభారత సర్వీసులకు చెందిన ఉన్నతాధికారులు (బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్లు) కానీ, లేదా ఇద్దరు ఉమ్మడిగాకానీ తీసుకునే పాలనాపరమైన ప్రతి ప్రభుత్వ నిర్ణయం, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సాక్ష్యాధారాలతో సహా ఇద్దరూ సమర్థించాలి, లేదా చేసిన తప్పు ఒప్పుకోవాలే కాని, ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా తమకు దాంతో సంబంధం లేదన్నట్లు బాధ్యాతారాహిత్యంగా మాట్లాడడం సరైనదికాదు. మంత్రి అధికారి మీదకానీ, అధికారి మంత్రి మీదకానీ బాధ్యత నెట్టివేయడం అనైతికం.  ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరమైనది కాదు. 

మంత్రులతో మాట్లాడే సందర్భంలో, ప్రతి చిన్న విషయంలో ‘అవును సార్’ అనే అలవాటు కొందరు ఐఏఎస్ అధికారులకు వుంటుంది. మంత్రితో అవసరం తీరిన తరువాత ఇలాంటివారు ‘బ్లేమ్ గేమ్’ ఆడడం మొదలుపెడతారు. తప్పంతా మంత్రిదేనని, తాము పరిశుభ్రంగా వున్నామని వాపోతారు. పాలనాపరమైన సద్బావనకు, బాధ్యత లేని దృక్పథానికి ఇది ఒక దుష్టసంకేతం. ఈ ప్రవర్తన సివిల్ సర్వీస్‌కు చెందిన ప్రాధమిక నీతిసూత్రాలకు దూరంకావడం, బాధ్యత విస్మరించడం, అవకాశవాదం అనే వాటిని ప్రతిబింబిస్తుంది. మంత్రి ఏదైనా నిర్ణయం తీసుకున్న సమయంలో, తామిస్తున్న సలహా చేదుమాత్రలాగా వున్నప్పటికీ, సరైన సలహా ఇవ్వడంలో సివిల్ సర్వెంట్ విఫలమై, ఆ తర్వాత మంత్రి తప్పు చేశారని నిందించడం తగనేతగదు. సమయ, సందర్భాలకు అనుగుణంగా ఉత్తమమైన, ఆచరణాత్మకమైన సలహాలు ఇవ్వడం కొందరు సివిల్ సర్వెంట్లకు చేతకాకపోవచ్చు. అయితే, అలా ఇవ్వడానికి ఏమాత్రం భయపడని పలువురు సివిల్ సర్వెంట్లు గతంలోనూ, ఇప్పటికీ ఉన్నారు. ఇక ముందూ వుంటారు. 

ఉదాహరణకు, పీవీ నరసింహారావు ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సమయంలో, అప్పుడు రాళ్లదాడులు జరుగుతున్న విజయవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, అక్కడ చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఆపర్యటనను విరమించుకోవాలని నాటి కలెక్టర్, ఎస్పీ సలహా ఇచ్చారు. కానీ, రాజకీయ పరిణామాల దృష్ట్యా పీవీ వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐసీఎస్ అధికారి, వల్లూరి కామేశ్వర (వీకే) రావు కూడా కలెక్టర్, ఎస్పీ సలహా వినడమే మంచిదని సూచించారు. కానీ పీవీ ‘మీరు నా క్రింద పనిచేసే ఉద్యోగి. దయచేసి నా ఆదేశాలను అమలుచేయండి. నేను వెళ్లడానికి ఏర్పాట్లు చేయండి’ అన్నారు. 

అలా అంటూనే ప్రయాణానికి సిద్ధమై వాహనం తయారుగా వుంచమని ఆదేశించారు. ఆశ్చర్యకరంగా, ప్రధాన కార్యదర్శి వీకే రావు డ్రైవర్ను కారు తీసుకురావద్దని ఆదేశించినట్లు పీవీకి తెలిసింది. అదేమని అడిగితే- ‘అవును సార్, నేను మీ కింద పనిచేసే ఉద్యోగినే. అలాగే,  డ్రైవర్ నా కింద పనిచేసే ఉద్యోగి. అతను నా ఆదేశాలను పాటిస్తాడు. అందుకే రాలేదు’ అని ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి సవినయంగా, నిశ్చయంగా తెలియచేశారు. పీవీ ఆ ప్రయాణాన్ని మానుకున్నారు. మరుసటి రోజు పీవీ వల్లూరిని ప్రశంసిస్తూ, ‘నేను నిన్న వెళ్ళి ఉంటే, ఉద్రిక్తతలు మరింత పెరిగేవి. మీరు నన్ను ఆపడం ద్వారా మంచి పని చేసారు’ అన్నారు. ఆదర్శప్రాయమైన సివిల్ సర్వెంట్ల నిబద్ధతకు, ముఖ్యమంత్రుల వినయానికి ఇది ప్రతీక అని ఈ విషయం నాతో చెప్పిన భండారు శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వీకే రావు 104 సంవత్సరాల వయసులో మరణించారు. 

అలాగే, నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, చిత్తూరు పర్యటనలో భాగంగా, అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఉండాలనుకున్న గదిని, ఇంచుమించు అదే సమయంలో రావాల్సిన మాజీ గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారికి కేటాయించడంతో, సంజీవరెడ్డిని వేరే గదిలో వుండమని  కలెక్టర్ బీకే రావు చెప్పారు. ఒకవేళ ఆ గదిలో వున్నప్పటికీ, రాజాజీ రాగానే, ప్రోటోకాల్ ప్రకారం, సీఎం ఖాళీ చేయాల్సి ఉంటుందని మర్యాదపూర్వకంగా చెప్పారు. ఆరోజు రాజాజీకి స్వాగతం చెప్పేందుకు కొంచెం ముందుగానే బీకే రావు ఎస్పీ గురునాథ రావుతో కలిసి అతిథి గృహానికి చేరుకున్నారు. పాత్రికేయుడు జీ కృష్ణ కథనం ప్రకారం - బీకే రావుతో ముఖ్యమంత్రి సంజీవరెడ్డి సరదాగా, ‘ఓహ్! నన్ను ఖాళీ చేయించడానికి మీరు పోలీసు అధికారితో వచ్చారా!’ అని అన్నారట. అందరూ నవ్వుకున్నారు. ముఖ్యమంత్రి తనకు కేటాయించిన గదికే మారిపోయారు. ఇది కలెక్టర్ సలహా ఇచ్చే విధానం, అది ముఖ్యమంత్రి దాన్ని స్వీకరించిన విధానం. బీకే రావు ఇటీవల 93 ఏళ్ల వయస్సులో మరణించారు.

ఎస్ఆర్ శంకరన్, భూ సంస్కరణలు, గిరిజన హక్కుల రక్షణను బలంగా సమర్థించడానికి, ఉద్దండ రాజకీయ నేతలతో, ప్రజాప్రతినిధులతో ఢీకొనాల్సి వచ్చింది. చివరకు ఆయన ఆలోచనలు విజయం సాధించి, రాష్ట్రంలోని గ్రామీణ అభివృద్ధికి పునాదిగా నిలిచాయి. టీఎన్ శేషన్, భారత ఎన్నికల ప్రక్రియను సంస్కరించడానికి రాజకీయ నాయకులను ధీటుగా ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో నిధుల దుర్వినియోగాలను తగ్గించడం, బల ప్రదర్శన, నల్లధన వినియోగాన్ని నిరోధించడం వంటి చర్యలతో ఆయన ఎన్నికల సంఘాన్ని బలపరిచారు, అయితే ఈ నిర్ణయాలు రాజకీయ నాయకుల వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. హర్యానాలో రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ మధ్య భూమి ఒప్పందాన్ని అశోక్ కేమ్కా ధైర్యంగా రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యమునా, హిండాన్ నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి దుర్గ శక్తి నాగపాల్, ధైర్యంగా, నిబద్ధతతో పనిచేశారు. ఆమె చర్యలు శక్తివంతమైన రాజకీయ సంబంధాలున్న తవ్వకాల మాఫియాను ప్రభావితం చేశాయి. కర్ణాటకలో భూముల కేటాయింపుల్లో, ఆక్రమణలలో అక్రమాలను రోహిణి సింధూరి బహిర్గతం చేశారు. ఆమె పట్టుదల ప్రజా భూముల పునరుద్ధరణకు, ప్రాజెక్ట్ సంస్కరణలకు దారి తీసింది. ఆమె పారదర్శకత ఆర్థిక బాధ్యతాత్మకతకు చిహ్నంగా నిలిచింది.

ఈ కొద్ది ఉదాహరణలు, కొందరు ఐఏస్ అధికారుల ధైర్యానికి, నిబద్ధతకు, పారదర్శకతకు, దూరదృష్టికి, నైతిక ప్రమాణాలను నిలబెట్టడానికి, ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనం. ‘దేశానికి ఉక్కు చట్రం’ అని వల్లభభాయ్ పటేల్ పేర్కొన్నట్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏస్), స్వతంత్ర్యానంతరం ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) స్థానంలోకి వచ్చింది. ఐఏస్ కి ఎంపిక కాబడ్డవారు వివిధ రంగాలలో, అద్భుతమైన ప్రతిభాశాలులుగా, సమాజంలోని ఇతరులకంటే అత్యంత విజ్ఞానవంతులుగా ఉంటారు. వీరి ఎంపిక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, వివిధ రకాల వడపోతల అనంతరం జరుగుతుంది. ఈ అధికారులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. సర్దార్ పటేల్ చెప్పినట్లు, ఐఏస్ అధికారులు తమ బాధ్యతలను నిర్వహించడంలో, కర్తవ్య నిర్వహణలో, అనుభవపూర్వకంగా సలహాలు, సూచనలు ఇవ్వడంలో, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దేశ భవిష్యత్తు వీరిపైనే ఆధారపడి ఉంటుంది. 

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత సివిల్ సర్వెంట్లపై వున్నది. ముఖ్యమంత్రి లేదా మంత్రి ఏపార్టీకి చెందిన వారైనప్పటికీ, వారి పట్ల వీరి పాలనాపరమైన దృక్పథం ఒకేరీతిలో వుండాలి. వారు తమ అనుభవానికి అనుగుణంగా, సాంప్రదాయ-చట్టబద్ధంగా ఏర్పాటైన విధి విధానాలకు కట్టుబడి సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి, లేదా ప్రధాన పంత్రికి, తగుసమయంలో విలువైన సూచనలు అందించాలి. సివిల్ సర్వెంట్ సరైన సందర్భంలో, సరైన సమాచారం అందించడంలో విఫలమైనా, లేదా తప్పు సలహా ఇచ్చినా, నిర్ణయ విధాన ప్రక్రియ తెలిసినా ఆ విషయం వివరించకపోయినా, మంత్రి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కలిగించినా, అది వారి బాధ్యతారాహిత్యాన్ని, పనితీరులో వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, సివిల్ సర్వెంట్ ఇచ్చిన సలహా ఆధారంగా (రాతపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి) మంత్రి తనదైన పద్ధతిలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, సివిల్ సర్వెంట్ దాన్ని అమలు చేయాలి. బాధ్యతను ఇరువురు సరిసమానంగా పంచుకోవాలి.  

మంత్రిని మెప్పించడానికి సివిల్ సర్వెంట్లు చట్టపరమైన, అనాదిగా వస్తున్న ఆచారాలకు, స్థాపిత విధివిధానాలకు భిన్నంగా, అత్యుత్సాహం ప్రదర్శించి, మంత్రితో కలిసి నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఆ నిర్ణయం విషయంలో పదవి కోల్పోయిన మంత్రిని తప్పుబట్టడం సరైంది కాదు. అలా చేస్తే, సివిల్ సర్వెంట్‌గా ఉండటం అర్ధరహితమవుతుంది. పాలనాపరమైన ప్రభుత్వ నిర్ణయాల విషయంలో, ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన విషయాలలో, ఒకసారి మంత్రితో కలిసి సివిల్ సర్వెంట్ నిర్ణయం తీసుకున్న తరువాత వారిద్దరూ తత్సంబంధమైన విషయంలో తప్పొప్పులకు పూర్తి బాధ్యత వహించాలి. తమ పాత్రను అంగీకరించాలి. అధికారి పూర్తిగా మంత్రిని తప్పు పట్టడం లేదా మంత్రి అధికారిని తప్పు పట్టడం సరైనది కాదు. తమతమ పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను నిబద్ధతతో అంగీకరించి, వాటిని తీసుకున్న నేపధ్యాన్ని సాక్ష్యాధారంగా సమర్థించే ధైర్యం అవసరం. ఆర్థిక లావాదేవీ చట్టబద్ధంగా జరిగినట్లయితే ఆ విధానాన్ని ఆత్మవిశ్వాసంతో తెలియజేయాలి. ఉమ్మడి బాధ్యత, పవిత్రమైనదిగా భావించాలి. సివిల్ సర్వెంట్లు బాధ్యతనుండి తప్పించుకోవడం నైతికతను దెబ్బతీస్తుంది. ‘ఉక్కు చట్రాన్ని’ బలహీనపరుస్తుంది.’

సివిల్ సర్వెంట్లు దేశ పాలనా వ్యవస్థకు మౌలిక స్థంభాలు. వారు నైతికత, నిబద్ధత, ప్రజా సేవకు అంకితమవుతేనే పాలనకు మంచి రూపం వస్తుంది. సివిల్ సర్వెంట్ల లక్ష్యం ప్రజల మేలు కోసం పనిచేయడం మాత్రమే కాక, పరిపాలనా వ్యవస్థలో పారదర్శకతను, విశ్వసనీయతను, సమర్థతను ప్రోత్సహించడంగా ఉండాలి. ప్రజాస్వామ్యానికి వీరి ఉక్కు చట్రం ఎంత బలంగా ఉంటే, ప్రజల విశ్వాసం అంత దృఢంగా నిలుస్తుంది. వీరి ప్రతి నిర్ణయం, ప్రతి చర్య, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి, వీరు తమ శక్తితో, నిబద్ధతతో, సత్యనిష్టతో పని చేస్తూ, సమాజాన్ని ముందుకు నడిపించే మార్గదర్శకులు కావాలి. నిజాయితీతో వీరు వేసే ప్రతి అడుగు ప్రజాస్వామ్యానికి శాశ్వతమైన బలం చేకూరుస్తుంది.

మంత్రిది తుది నిర్ణయం కావచ్చు, కానీ సివిల్ సర్వెంట్ మంత్రికి ఇచ్చిన తన సలహాను, మంత్రి స్పందనను, దరిమిలా ఇచ్చిన ఆదేశాలను, ఆ నిర్ణయం అమలుకు ముందు రికార్డు చేయాలి. ఇది సివిల్ సర్వెంట్ ప్రత్యేక బాధ్యత. సివిల్ సర్వెంట్లు తమ విధుల పరిధిలో నిజాయితీగా, వృత్తిపరంగా అభిప్రాయాలను వ్యక్తపరచాలి. సివిల్ సర్వెంట్లు ‘ఉమ్మడి బాధ్యతల విషయంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా సలహా’’ ఇచ్చి, తప్పును తప్పని, ఒప్పును ఒప్పని స్పష్టంగా సంబంధిత మంత్రికి తెలియచెప్పి, భారత ప్రజాస్వామ్యంలోని ఐఏస్ అనే ‘స్టీల్ ఫ్రేమ్‌’ (ఉక్కు చట్రం) సమర్ధవంతంగా పనిచేయడానికి తోడ్పడాలి. వారు విఫలమైతే, ప్రజలకు ‘ప్రభుత్వ పాలనపై నమ్మకం’ సన్నగిల్లుతుంది.

1 comment:

  1. Eriacta 50 Mg Tablet Tablet from Be Better Pharmacy exceeded my expectations! The product is high quality and the results are immediate. The delivery service was timely, and the whole process was easy and convenient. I highly recommend this pharmacy!

    ReplyDelete