Friday, June 20, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-1 ..... వనం జ్వాలా నరసింహారావు

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-1

వనం జ్వాలా నరసింహారావు (20-06-2025)

ఈ ఏడాది (2025) ఆగస్టు నెల 8 వ తేదీతో 78వ సంవత్సరంలో అడుగిడుతున్న నేను, బాల్యం నుండి ఇప్పటిదాకా విద్యాభ్యాసంలోను, ఉద్యోగాలలోనూ, ఇతర వ్యాపకాలలోనూ, వృత్తి-ప్రవృత్తి పరంగానూ, చాలామంది వ్యక్తులతో కలిసిమెలిసి తిరిగే అవకాశం లభించింది. వీరిలో సామాన్యులు, మాన్యులు, అసామాన్యులు, వ్యవసాయదారులు, రైతుకూలీలు, ఎందరో రాజకీయ ప్రముఖులు, పాత్రికేయ దిగ్గజాలు, కవులు, రచయితులు, విజ్ఞాన ఖనులు, రాజ్యాంగపరమైన పదవుల్లో పనిచేసినవారు, అఖిలభారత సర్వీసులకు చెందిన ఐఏస్, ఐపీఎస్ లాంటి ఉన్నత అధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, అధ్యాపక ఆచార్యులు, వాగ్గేయకారులు, తదితర వివిధ రంగాల ప్రముఖులు వున్నారు.

          బాల్యంలో ఖాన్గీ బడి, తరువాత మా గ్రామం, ఖమ్మంలో ప్రాధమిక, ఉన్నత విద్యాభ్యాసం; ఖమ్మం, హైదరాబాద్ లో కళాశాల విద్య; వ్యవసాయం చేసుకుంటూ, గ్రామ స్థాయి రాజకీయాలలో-ప్రత్యేకించి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధిత రాజకీయాలలో అవగాహన కలిగించుకుంటూ మా వూరి గ్రామీణ వాతావరణంలో జీవనం; నాగ్ పూర్ విశ్వ విద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యువేషన్ చదువుకునే రోజుల్లో పరిచయాలు మధురాతిమధురమైన జ్ఞాపకాలు.

అలాగే, ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లైబ్రేరియన్ గా రు 230 లకు మొదటి ఉద్యోగం; మూడు నెలల తరువాత ఖమ్మం ప్రభుత్వ జూనియర కాలేజీకి ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడ అదే ఉద్యోగం; అలా చేరిన మూడో ఏట ఉస్మానియా విశ్వ విద్యాలయంలో లైబ్రరీ సైన్స్ డిగ్రీ చదువు; పరీక్షలు రాయక పూర్వమే బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాశాలలో ఉద్యోగం రావడం, సుమారు 12 సంవత్సరాలు లైబ్రేరియన్ గా అక్కడే ఉద్యోగం చేయడం మరో గొప్ప జ్ఞాపకం.

తదనంతరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కుముద్ బెన్ జోషి అధ్యక్షతన వున్న చేతన స్వచ్చంద సంస్థలో అడ్మినిస్ట్రేటివ్, ప్రాజెక్ట్ అధికారిగా (అనధికారికంగా పౌర సంబంధాలతో సహా) రాజ్ భవన్ లో సుమారు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం; ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి పౌర సంబదాల అధికారిగా ఒక సంవత్సరంపాటు ఉద్యోగం; ఉమ్మడిరాష్ట్ర లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థలో పౌరసంబంధాలతో సహా రకరకాల విభాగాలకు సీనియర్ మేనేజర్ గా 10 సంవత్సరాలు సేవల సందర్భంగా పరిచయాలు ఎప్పటికీ మరచిపోలేని అనుభవాలు.  

దరిమిలా, మొదలు హస్తకళల అభివృద్ధి సంస్థ నుండి డిప్యుటేషన్ మీద, ఆ తరువాత కాంట్రాక్టు పద్ధతిన సుమారు 9 సంవత్సరాలు సీనియర్ ఫాకల్టీ, అదనపు డైరెక్టర్ గా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగం; 56 ఏళ్ల వయసుకే రాజకీయకారణాల నేపధ్యంలో పదవీ విరమణ చేయాల్సి రావడంతో జీవనోపాధికోసం చిన్నా-చితకా అవకాశాలను వినియోగించుకోవడం; అందులో భాగంగా ఒక గౌరవ మంత్రికి ‘ఘోస్ట్ రచయితగా అనేక వ్యాసాలూ రాయడం; తరువాత కొన్నాళ్లకు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, హైదరాబాద్ రీజనల్ కార్యాలయంలో డైరెక్టర్ గా ఉద్యోగం; ఆ తరువాత అత్యవసర సహాయ సేవలను అందించే ఇఎంఆర్ఐ 108 అంబులెన్స్ సంస్థలో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య విభాగానికి లీడ్ పార్టనర్, కన్సల్టెంట్, సలహాదారుడిగా సుమారు నాలుగేళ్లు ఉద్యోగం; తరువాత 104 హెచ్ఎంఆర్ఐ సంస్థలో కన్సల్టెంట్ గా మరో నాలుగేళ్లు ఉద్యోగం నాటి విషయాలను, వ్యక్తులతో పరిచయాలను ఎప్పటికీ మరచిపోలేను.

చివరగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారి దగ్గర ఆయన ప్రధాన పౌర సంబంధాల అధికారిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు కలిసిమెలిసి పనిచేసిన అపారమైన అనుభం ఆదినుంచి, చివరిదాకా అక్షరబద్ధం చేయడం ఒక గొప్ప అనుభూతి.

ఎప్పుడో, అప్పుడు తప్ప, దాదాపు నేను చదివిన, పనిచేసిన ప్రతి చోటా పరిచయాలు, వ్యక్తులతో అనుబంధాలు సంతృప్తికరంగానే వున్నాయని చెప్పడానికి ఏ విధమైన సంకోచం లేదు. నా స్నేహితుల విషయంలో నేను ఎలా ప్రవర్తించాలి అని వారనుకుంటారో, అలాగే నేను వుండడం వల్ల కావచ్చు, బహుశా, నా స్నేహితులు కూడా నా పట్ల అలానే ప్రవర్తించారు. అన్నిటికీ అతీతమైన కొందరు వ్యక్తులు ఎలాగూ వుంటారు కదా!!! సమాజంలో ఇలాంటివారికి ఇతరుల పట్ల ఈర్ష్యాసూయలు వుండడం సహజం. అది బలహీనత కావచ్చు, వారి నైజం కావచ్చు, చేతకానితనం కావచ్చు. అలాగే కొందరు సహోద్యోగ వ్యక్తులకు ఇతరుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా లేకపోవచ్చు. మున్ముందు ఈ వివరాలు ఎలా నా చేయి తిరిగితే అలా విశ్లేషించాలనే తాపత్రయం దేనికి దారి తీస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం.

నా మూడో ఏట చదువు మా గ్రామం వనంవారి కృష్ణాపురంలో ప్రారంభమైంది. ఇప్పటి ప్రీ-స్కూల్, కెజి స్కూళ్ల లాగా మా చిన్నతనంలో (75 సంవత్సరాల క్రితం) గ్రామాలలో ఖాన్గీ బడులుండేవి. ఖాన్గీ బడి రోజులు అంతగా జ్ఞాపకం లేకపోవడానికి కారణం అప్పటి నా వయసు మరీ తక్కువ కావడమే. కాకపోతే అక్కడ నేర్చుకున్న, కంటస్థం చేసిన అనేకానేక పెద్ద బాలశిక్ష విషయాలు ఇప్పటికీ మరచిపోలేదు. తరువాత గ్రామంలో కొఠాయి (రచ్చబండ) దగ్గర ఒక పూరి పాకలో వున్న ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించారు నాన్న గారు. ప్రభుత్వ పాఠశాలలో చేరినప్పుడు, అది ఏకోపాధ్యాయ పాఠశాల. ఒకే ఉపాధ్యాయుడు పని చేసేవారు. కొద్ది కాలానికి మరో ఉపాధ్యాయుడిని పోస్ట్ చేశారు. ఒకరిని ‘పాత పంతులు గారు’ అని, మరొకరిని ‘కొత్త పంతులు గారు’ అని గ్రామంలో చిన్నా-పెద్దా అందరూ వారిని అత్యంత గౌరవంగా సంబోధించే వారు.

నా అసలు పుట్టిన తేదీని (ఆగస్ట్ 8, 1948) మార్పించి, పాఠశాల రికార్డులలో జులై 1, 1947 గా రాయించారు. ఐనప్పటికీ, నేను 1962 లో హెచ్ ఎస్ సీ (పదకొండవ తరగతి) పబ్లిక్ పరీక్షలు రాయడానికి ఒక ఏడాది వయస్సు తక్కువైతే, ‘ఏజ్ అండ్ హెల్త్ మెడికల్ సర్టిఫికేట్’ తీసుకోవాల్సి వచ్చింది. 1966 మార్చ్ లో నేను డిగ్రీ పరీక్షలు రాసేటప్పటికి నా వాస్తవ వయస్సు కేవలం 17 సంవత్సరాల 7 నెలలు మాత్రమే. ఖాన్గ్గీ బడి, పూరిపాక బడి చదువు, ఆ చిన్నతనం పరిచయాలు అదోరకమైన సంతృప్తి మిగిల్చాయి.  

వూరి బయట ‘పైలు పెంట’ అనే స్థలంలో పాశాలకు నూతన భవనం నిర్మించిన తరువాత, ఐదవ తరగతి వరకు ప్రాధమిక విద్య అక్కడ చదివిన రోజుల్లో గ్రామాల స్నేహితులు సహా ఉపాధ్యాయులు, తదితరులతో గడపడడం హాయిగా, అనుభూతితో కూడినదిగా వుండేది. ఆర్థికంగా అంతస్తులో అప్పట్లో నేను కొంచెం ఎక్కువ అయినప్పటికీ, నేను నా స్నేహితులతో కలిసి మెలిసి ఉండడం, వారు నాతో అరమరికరలు లేకుండా ఆప్యాయంగా వుండడం, ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా మరువలేని మధురమైన జ్ఞాపకం. ఇప్పటికీ మావూరికి పోతే వీలుచూసుకుని గ్రామంలోని బాల్య స్నేహితుల్లో కొందరినైనా కలవడం నాకు సరదా. కేవలం సరదానే కాకుండా, అరమరికలేని ఆ పరిచయాలు అదోరకమైన సంతృప్తి మిగిల్చాయి.  

          అప్పట్లో, మా గ్రామం పాశాలలో ఆరవతరగతి లేనందువల్ల, జిల్లా కేంద్రమైన ఖమ్మం మామిళ్ళగూడెంలోని మా ఇంటి సమీపంలో వున్న ‘రికాబ్ బజార్ ఉన్నత పాశాలలో చేరాను. ఆరవతరగతి నుండి హెచ్ ఎస్ సీ (11 వతరగతి) ఆరు సంవత్సరాలు అక్కడే చదువుకున్న నాకు ఆ మధురమైన రోజులు జ్ఞప్తికిరాని రోజంటూ లేదు. ఆ ఆరేళ్ల కాలంలో కొందరు సహాద్యాయులు మొదటినుండి క్లాస్మేట్స్ కాగా, కొందరు ఆ తరువాత చేరడమో, మధ్యలో మానేయడమో జరిగేది. ప్రతి తరగతిలో మూడు సెక్షన్లు (ఏ, బి, హెచ్) వుండేవి. అప్పట్లో ఉర్దూ సెక్షన్ వున్న పాశాలలలో నేను చదువుకున్నది ఒకటి.

హెచ్ ఎస్ సీ చేరుకొని పబ్లిక్ పరీక్షలు రాసేనాటికి మూడు సెక్షన్లు కలుపుకుని కరెక్టుగా నూరుమంది విద్యార్థులం వుండేవాళ్లం. మా పాశాల నుండి పబ్లిక్ పరీక్షలకు వెళ్లిన బ్యాచుల్లో మాది రెండవది. మాముందు బ్యాచ్ నుండి పరీక్షలు రాసినవారిలో చాలామంది ఉత్తీర్ణులు కావడమే కాకుండా, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివి జీవితాలలో బాగా స్థిరపడ్డారు. ఇక మాభ్యాచ్ విషయానికొస్తే, పరీక్ష రాసిన వందమందిలో కేవలం 4 గురు సెకండ్ క్లాస్ లో, 5 గురు థర్డ్ క్లాస్ లో మాత్రమే పాసయ్యారు. నాతో సహా (నేను హయ్యర్ సెకండ్ క్లాస్) పాసైన తొమ్మిది మందిలో ఒక్కరు కూడా ఇంజనీరింగ్ కాని, మెడిసిన్ కానీ చదవలేకపోయారు. కాకపోతే, మాతో సహా దరిమిలా పాసైన ఇతరులతో సహా కొందరికి మంచి ఉద్యోగాలు దొరకడం, జీవితంలో స్థిరపడడం, కొందరు స్వర్గస్తులు కావడం జరిగింది. 

క్లాస్మేట్స్ లలో బాగా గుర్తున్న, మేమంతా కలిసిమెలిసి ఆనందంగా, ఆప్యాయంగా. అలుపు అనేది ఎరుగకుండా బాల్యం గడిపిన వారి పేర్లు చాలా వరకు జ్ఞప్తికి వస్తున్నాయి. ఆ ఆరేళ్ల రికాబ్ బజార్ పాశాల విద్యాభ్యాస అనుభవం చెరిపేసినా చెరగని అపూర్వ జ్ఞాపకం. ఇప్పటికీ వీరిలో చాలామందిమి తరచూ కలవలేకపోయినా, ఏదో విధంగా పలకరించుకోవడం మాత్రం జరుగుతూనే వుంది. వీలుచిక్కినప్పుడల్లా, ఖమ్మం పోయినప్పుడల్లా, కొందరిని కలవడం నాకు సరదా.

పాశాల ఉపాధ్యాయుల విషయానికొస్తే వారు మా పట్ల చూపిన అభిమానం మాటల్లో వ్యక్తీకరించడం సాధ్యపడదు. ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా చనువుగా వుండే ఒంటి కన్ను చప్రాసి ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తున్న సన్నిహితస్నేహితులే, మహానుభావులే. ‘బాపూజి బాల సమాజ్’, ‘లిల్లీపుట్ పార్టీ పేరుమీద పాశాల ఎన్నికల్లో పోటీ-ఓటమి, ఇలా అరమరికలు, భేషజాలు లేని ఆరోజులు కళాశాలలో చేరక మునుపు మదిలో మెదిలే మదురమైన జ్ఞాపకాలు. ఆ పరిచయాలు అదోరకమైన సంతృప్తి మిగిల్చాయి. కళాశాల చదువు రాజకీయ ప్రాధమిక పాఠాలను నేర్పిందికాని, పూర్తిస్థాయి రాజకీయవాసన తగలలేదు. వాసనలన్నీ సుగంధంగానే ఉండవు, దుర్గంధమూ ఉంటుంది. అదే జీవిత సత్యం. ఆ వివరాలు కొన్ని  మున్ముందు.  

No comments:

Post a Comment