జాతి నిర్మాణంలో శిఖర సమానుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీ
(28-06-2025)
ఆర్ధిక, రాజకీయ,
దౌత్య, సామాజిక, బహుభాషా విద్యావేత్త; దార్శనికుడు, కార్యదక్షుడు,
రాజనీతిజ్ఞుడు, తత్త్వశాస్త్రజ్ఞుడు, బహుముఖ
ప్రజ్ఞాశీలి, అపర చాణక్యుడు, ఆలోచనల్లో, అమల్లో, విజ్ఞాన సర్వస్వం, ఆర్థిక సంస్కరణల
రూపకర్తగా స్వపక్షం వారి నుంచి, ప్రతిపక్షాల నుంచి, ఖండ ఖండాంతర
ఆర్థిక నిపుణుల నుంచి, మన్ననలనందుకున్న వ్యక్తి, మాజీ ప్రధానమంత్రి,
ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు.
ఆయన విద్యా సామర్థ్యం, పరిపక్వతయుత సేవలకు గుర్తింపుగా, గత
సంవత్సరం, దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసింది
నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం.
బహుభాషల పట్ల పీవీగారికి
వున్న ప్రగాఢ ఆసక్తి, నైపుణ్యం, భారత సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా వున్న
ఆయన వ్యక్తిత్వం, అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను ఇనుమడింపచేసిన
ఆయన మేధావితత్వం, ఆయనలోని మరెన్నో ప్రత్యేకతలు, పీవీగారికి
భారతరత్న లభించడానికి కొన్ని కారణాలు మాత్రమే. పీవీగారికి లభించిన పురస్కారంపై
ప్రశంసలతోపాటు, ఆయన బహుముఖ సేవలకు తగ్గ గౌరవం ఆలస్యంగా ప్రకటించడంపై సహజంగానే
కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. భారతరత్న పురస్కారం పీవీగారికి మరణానంతరం ఇస్తున్న
విషయం, ఫిబ్రవరి 9, 2024 న ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వినమ్రంగా ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర
మోదీ ఇలా రాశారు: ‘మన మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావుకి భారతరత్న
పురస్కారం ఇస్తున్నట్లు తెలియజేయడానికి సంతోషంగా ఉంది. విశిష్ట పండితుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావుగారు భారతదేశానికి వివిధ హోదాల్లో
విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ సభ్యుడిగా ఆయన చేసిన కృషికి కూడా ఆయన
చిరస్మరణీయుడు. ఆయన దార్శనిక నాయకత్వం భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో
కీలక పాత్ర పోషించింది, దేశ శ్రేయస్సు మరియు వృద్ధికి దృఢమైన పునాది
వేసింది.’
‘నరసింహరావు
ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచి, ఆర్థికాభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిన
ముఖ్యమైన చర్యలు జరిగాయి. అంతేకాకుండా, భారతదేశ విదేశాంగ విధానం, భాష, విద్యా రంగాలకు ఆయన చేసిన కృషి,
భారతదేశాన్ని కీలకమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక, మేధో
వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా ఆయన బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఎన్నికల్లో పోటీ
చేయనని, లోక్ సభ టిక్కెట్టు కూడా వద్దని, మూటా ముళ్లా సర్దుకుని సొంత రాష్ట్రానికి
పయనమయిన వ్యక్తి, అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో, తప్పని పరిస్థితులలో క్రీయాశీలక రాజకీయాల్లో
కొనసాగి, భారత జాతీయ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు
చేపట్టారు. అనూహ్య రీతిలో ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి, 1991 నుంచి 1996 దాకా ఐదేళ్లూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలపడడం
భారత రాజకీయాలలో కీలక మలపు. నెహ్రూ-గాంధీ కుటుంబేతరుడుగా, తొలి
దాక్షిణాత్యుడిగా, తెలుగువాడిగా, ప్రధాని పీఠాన్ని అందుకుని, ఆ పదవిలో ఐదేళ్లు కొనసాగటం భారత దేశ
పార్లమెంటరీ పరజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి. అప్పటికి 70 సంవత్సరాల వయసున్న పీవీ
తన రాజకీయ ప్రస్థానంలో హిమాలయాలంత ఎత్తెదిగారు. ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన
తెలుగుబిడ్డ,
తెలంగాణ బిడ్డ పీవీ స్వాతంత్య్ర సమరయోధుడిగా, స్వామీ
రామానందతీర్థ శిష్యుడిగా నిజాం వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన వున్నారు.
సెప్టెంబర్ 28, 1971 విజయదశమి పర్వదినాన ఉమ్మడి
అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన పీవీ అహర్నిశలు
రాష్ట్రాభివృద్ధికి కృషి చేసారు. అభివృద్ధికర, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చారు. 1972 సంవత్సరంలో ఆయన నాయకత్వంలో సాధారణ
ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల ఎంపికలో, యువకులకు, బలహీన
వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అత్యధిక మెజార్టీ సీట్లను గెల్చుకుని మళ్ళీ రాష్ట్రానికి
ముఖ్యమంత్రి అయ్యారు.
చారిత్రాత్మక
భూసంస్కరణల బిల్లుకు ఆయన హయాంలోనే శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక అసమానతలు
తొలగించటానిక, ఉత్పత్తి పెరుగుదలకు ఉద్దేశించిన ఓ సామాజిక
సంస్కరణగా దానిని ఆయన అభివర్ణించారు. ఈ చర్య గిట్టని ఆయన సొంత పార్టీకి చెందిన
ప్రగతిశీల వ్యతిరేక ముఠా ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే స్థితికి
తీసుకొచ్చింది.
తాము రాష్ట్రంలో
వద్దనుకున్న పీవీ, దేశాన్ని నడిపించడానికి అంచెలంచలుగా నాయకత్వ నిచ్చెన ఎక్కుతాడని, ప్రధాన
మంత్రి అవుతాడని, భారతదేశ కీర్తిపతాకం ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తాడనీ వారు ఊహించి
వుండరు!! విప్లవాత్మక భూసంస్కరణల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి పదిహేను
రోజుల పూర్వం, భారతదేశ స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా
1972 ఆగస్టు 15, అర్థరాత్రి 12 గంటలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీవీగారు శాసనసభా భవనంలో తమ సందేశంగా ‘ఆ నిద్రాణ
నిశీధిని మానిసి మేల్కాంచినాడు’ అనే అద్భుత గీతాన్ని ఆలపించారు. పీవీగారి
భాషావేత్త కోణానికి ఇదొక నిదర్శనం మాత్రమే!
పీవీ
నరసింహారావు జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ మంత్రి
వర్గంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పదవినలంకరించారు. ఆ పదవిలో ఆయన జవహర్‌లాల్
నెహ్రూగారి విదేశాంగ విధానాన్ని, ఆ దౌత్యనీతిని, దశ దిశలా ప్రచారం చేశారు. ఐక్యరాజ్యసమితి
సర్వసభ్య సమావేశంలో ఆయనిచ్చిన ఉపన్యాసం పాత రోజులనాటి కృష్ణమీనన్ ఉపన్యాసాన్ని
మరిపించిందని అందరూ అనేవారు. కొంతకాలం హోమ్ శాఖను నిర్వహించారాయన. 1983
అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్
కాస్ట్రోను అబ్బురపరచాడు.
పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేయడం, ప్రముఖులను
కాశ్మీరు తీవ్రవాదులు అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ఆ ప్రముఖులను
విడిపించిన ఘనత కూడా పీవీదే. రాజీవ్‌గాంధీ
మంత్రివర్గంలో రక్షణశాఖను కొంతకాలం, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
నూతన విద్యావిధానాన్ని(ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్) రూపొందిచారు.
ఆయన హయాంలోనే జాతీయ శిక్షణ విధానాన్ని (నేషనల్ ట్రైనింగ్ పాలిసీ) కూడా
రూపొందించారు. అయిదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో, శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి
పలువురికి పంచి పెట్టిన మేధావి, కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు, ఎన్ని
ఒడుదుడుకులు ఎదురైనా చిరునవ్వు వీడని ధీశాలి. ఆలోచనల్లో, అమల్లో
విజ్ఞాన సర్వస్వం.
కష్టకాలంలో,
భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధ్యక్షపదవిని చేపట్టి హత్యానంతరం జరిగిన ఎన్నికలకు
సారధ్యం వహించి, ఆ పార్టీని ఏకైక పెద్ద పార్టీగా
గెలిపించుకున్నారు. పార్టీ ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడంతో
1991లో మైనార్టీ ప్రభుత్వ ప్రధానమంత్రిగా, తొలి దక్షిణాది వ్యక్తి ఆ పదవిని
అధిష్టించిన వాడిగా ఓ గుర్తింపు పొందారు. భారత దేశం, ఆమాటకొస్తే, యావత్
ప్రపంచం ఎదుర్కొంటున్న వర్తమాన వివిధ రకాల పరీక్షా కాలంలో, సామాన్య
మానవుడి మనుగడే ప్రశ్నార్ధకమవుతున్న సంక్షోభ సమయంలో, అనునిత్య
యుద్ధవాతావరణంలో, వ్యక్తిదీ, వ్యవస్థదీ
ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న నేపధ్యంలో, ప్రతి
ఒక్కరికీ స్ఫురణకు వచ్చేది అలనాటి పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞత, ఆర్ధిక
సంస్కరణాభిలాష.
జ్ఞానపీఠ
ఆవార్డు గ్రహీత, కవిసామ్రాట్ స్వర్గీయ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన ‘వేయిపడగలు’ తెలుగు పుస్తకాన్ని హిందీలోకి ‘సహస్రఫన్’
గా అనువదించడం. ఎడతెగని, క్షణమైనా తీరికలేని రాజకీయ కార్యకలాపాలు
ఉన్నప్పటికీ, అన్ని
భాషలలోని ప్రముఖ రచయితలతో పీవీ క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు. పివి 17
భాషలలో నిష్ణాతులు కావడంతో పాటు ఆర్థికశాస్త్రం, చట్టం, చరిత్ర, రాజకీయాలు, కళలలో
కూడా ప్రావీణ్యం ఉంది. తెలంగాణ
సాయుధపోరాటం ఇతివృత్తం ఆధారంగా పీవీ రాసిన గొల్ల రామవ్వ కథలో ఒక గొప్ప సాయుధపోరాట
వీరుడిని గొల్ల రామవ్వ ఏ విధంగా కాపాడిందో అద్భుతంగా వర్ణించారు పీవీ.
పదవి నుండి
దిగిపోయాక వరుసగా జరిగిన విచారణలు ఆయన్ని అనుక్షణం వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ
కోర్టుల్లో వీగి పోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు
వీగిపోయింది. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రిగా పీవీ చరిత్ర పుటల్లోకెక్కారు. అయితే ఢిల్లీ
హైకోర్టు ముడుపుల కేసును కొట్టివేసింది. సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, లఖుభాయి
పాఠక్ కేసుల్లోను పీవీ నిర్దోషిగా ఉన్నత న్యాయస్థానాలు తీర్పిచ్చాయి. ఈ మూడూ కాక
స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆరోపణలు కూడా నిరాధారాలని తేలింది. అయితే ఆయనకు జరగాల్సిన
అన్యాయం జరిగింది. మచ్చ మిగిలిందా, చెరిగి పోయిందా అనే విషయాన్ని భావితరాల వారికే
వదులుదాం.
స్థితప్రజ్ఞతకి, మూర్తీభవించిన
వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం పీవీ. రాజకీయ జీవితంలో పీవీ ఎల్లప్పుడూ
స్థిరత్వాన్ని కొనసాగించారు. జెఎంఎం లంచాల కుంభకోణంలో మేజిస్ట్రేట్ కోర్టు అతనికి
మూడు సంవత్సరాల శిక్ష విధించినప్పుడు, తీర్పు ఇస్తూ, మేజిస్ట్రేట్ అజిత్ భరిహోక్ పివిపై పలు
వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆయన్నొక నేరస్థుడిలాగా ముద్ర వేసినప్పుడు, అదే
విషయానికి మీడియాలో బహుళ ప్రచారం జరిగినప్పుడు,
పీవీ స్పందన పరిపూర్ణ నిశ్శబ్దం.
సాహసోపేతమైన
నిర్ణయాలకు శ్రీకారం చుట్టి, తన పార్టీలోని ప్రత్యర్థులను, ప్రతిపక్షాలలోని
ఉద్దండులను పల్టీలు కొట్టించి, సమకాలీన రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత వుందని
నిరూపించుకున్నారు పీవీ. ప్రపంచంలో అత్యంత పెద్దదైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య భారతదేశానికి
ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆర్థిక-సామాజిక-రాజకీయ సంస్కరణలకు శ్రీకారం
చుట్టి చివరకు ఆ పునాదుల శిధిలాల్లోనే వాటికి రాళ్లు మోసిన వారి చేతుల్తోనే
నెట్టబడ్డారు పీవీ నరసింహారావు.
పీవీ నిరంతర
సంస్కరణశీలి ఆయన. ఎక్కడ ఏ రంగంలో ఆయనను పెట్టినా, ఆ రంగంలో సంస్కరణలు తేవడమే ఆయన చేసిన
పని. అందుకే పీవీని స్మరించు కోవటం సదా మన కర్తవ్యం, మన నైతిక బాధ్యత, మన
కనీస ధర్మం. భారత రాజకీయ, ఆర్థిక,
సామాజిక వ్యవస్థ సుస్థిరతకు ఆయన
అందించిన విలువైన నాయకత్వం సదా స్మరనీయం. ఆర్ధిక సంస్కరణల రూపకర్త, తత్త్వవేత్త, భాషా
ప్రవీణుడు, ధీశాలి పీవీ నరసింహారావు భారత రాజకీయ చరిత్రలో
అజరామర నేత.
సామాన్యుడి
జీవితానికి అర్థం, భారత దేశానికి బంగారు బాట చూపిన మహా నాయకుడు పీవీ.
బహుభాషా పాండిత్యంతో, ఆలోచనల విశ్వవిద్యాలయంగా, విజ్ఞానసర్వస్వంగా, దౌత్యంలో
జవహర్లాలాల్ నెహ్రూ, రాజగోపాలచారి స్థాయిని మించిన మేధావిగా, సంక్షోభాల
శాంతిదూతగా నిలిచిన మహామనీషి.
నవభారత నిర్మాతల్లో మొట్టమొదటి ‘కంట్రీ ప్లానింగ్’కు
శ్రీకారం చుట్టి అమలుచేసిన వ్యక్తి పండిట్
జవహర్ లాల్ నెహ్రూ అయితే, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన
విజ్ఞానసర్వస్వం, బహుముఖ
ప్రజ్ఞాశీలి
పాములపర్తి వెంకట నరసింహారావు , ‘గ్లోబల్ ఇండియా’
సృష్టించిన వ్యక్తి. అంతర్జాతీయ
రాజకీయ, ఆర్థికవేత్తల, దౌత్య సంబంధాల మహోద్దండ నాయకుల సరసన,
పీవీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడడం ఖాయం. ఆ మహనీయుడికి నివాళి.
(నేడు జూన్ 28, 2025 న పీవీ నరసింహారావు జయంతి)

No comments:
Post a Comment