సిద్ధాంతాలకతీతంగా విశ్వ లౌకిక మానవతావాదం:
‘విశ్వ మానవతావాద పురస్కారం’
ఉజ్జ్వల భవిత దిశగా సనాతన, ఆధునిక
తత్త్వ
నాగరికతల సమన్వయం
వనం జ్వాలా
నరసింహరావు
ప్రజాతంత్ర
దినపత్రిక (మార్చ్ 13, 2026)
ప్రపంచం మరోసారి యుద్ధ అంచులపై నిలిచింది. అమెరికా మద్దతుతో
ఉద్రిక్తతలు పెరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ మానవాళి భవిష్యత్తుకు సవాలుగా
పయనిస్తున్నది. అణు భయాలు, ప్రాంతీయ
అస్థిరత, మానవ నష్టాల
మధ్య, ప్రపంచ మతాల ఆధ్యాత్మిక నాయకుల నుండి గాని, శాంతి
సందేశాలకే ప్రతీకలుగా నిలిచిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల నుండి గాని, ఐక్యరాజ్యసమితి శాంతి పెఅవచ్నాల మహనీయులనుండి గాని
ఆశించిన స్థాయి స్పందన వినిపించకపోవడం ఒక విచిత్రమైన మౌనానికి సంకేతమైంది. ఈ
నేపథ్యంలో, సిద్ధాంత
విభేదాలకు అతీతంగా, మానవజాతి
భవిష్యత్తు మాత్రమే కాకుండా, భవిష్యత్తును
కూడా సమగ్రంగా ఆలోచించి, పరిష్కారాలు
సూచించగల ‘సమన్వయ దృక్పథ విశ్వ లౌకిక మానవతావాదం’ ఆవశ్యకత సుస్పష్టంగా కనిపిస్తోంది.
సంక్లిష్టతల మధ్య సమాజ సుసంపన్నాన్ని అన్వేషించే సజీవ చైతన్య
సమాహారంగా, ఆరోహణ-అవరోహణలను
అధిగమిస్తూ, నిత్య నిరంతర
అధిరోహణ ప్రస్తానంగా ‘మానవ చరిత్ర’కు
నిర్వచనం చెప్పుకోవచ్చు. యుగయుగాలుగా, తరతరాలుగా, వివిధ నాగరికతలలో, తత్త్వజ్ఞాన
పరంపరలతో, మానవజాతి ఆస్తిత్వాన్ని అజరామరంగా వివరించేందుకు, అవసరమైనప్పుడల్లా సమాజాన్ని సరైన రీతిలో
మార్గదర్శనం చేస్తూ, అవసరమైనప్పుడు
నియంత్రించేందుకు నైతిక
కార్యాచరణకు ప్రేరణ ఇస్తూ, వివిధ ఆలోచనా
వ్యవస్థల, సిద్ధాంతాల ఆవిర్భావానికి కాలానుగుణంగా అంకురార్పణ చేసినది మానవ చరిత్ర
అధ్యయనం ఒక్కటే.
ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక
కాలాలకు చెందిన మేధో ఉద్యమాలన్నీ, వాస్తవం,
న్యాయం, శక్తి, భక్తి, యుక్తి, వివేకం,
నిరంతర పురోగతిని పరిశీలించేందుకు ఒక ప్రత్యేక దృక్కోణాన్ని అందించినది కూడా ఆ
అధ్యయనమే. అలాగే, ఆధునిక
ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం
మార్క్సిజం-కమ్యూనిజం. దాని రూపశిల్పి, మహామనీషి, కొంచెం అటు-ఇటుగా మన మధ్యన
జీవించిన సమసమాజ తాత్త్వికవేత్త, కార్ల్
మార్క్స్ ‘మానవ చరిత్ర’ను ఉత్పత్తి సాధనాలపై నియంత్రణ వల్ల ఉద్భవించే వర్గపోరాటం
ద్వారా రూపుదిద్దుకున్నదిగా వ్యాఖ్యానించాడు. సామాజిక చైతన్యయుత మార్పును
వివరించేందుకు ఫ్రెడ్రిక్ ఎంగెల్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన ‘చారిత్రక
భౌతికవాదం’లోని ప్రధాన సిద్ధాంతమిదనాలి.
మానవజాతి ముందు నిలిచిన కీలకమైన ప్రశ్న: వివిధ రకాల తాత్త్విక వారసత్వాలు
నిర్మాణాత్మకంగా ఎలా ఏకమవగలవనే అంశం.
ఆధునిక
సమాజం విభజనకంటే సమన్వయం, సమగ్ర కల్పనాశక్తిలను కోరుకుంటోంది. భిన్నత్వాన్ని
తొలగించకుండా, అనేకత్వాన్ని
అంగీకరించగల ఒక దృఢమైన క్రియాశీలక రూపరేఖ అవసరం తప్పనిసరైంది. ‘విశ్వ మానవతావాదం’
అనేది సరిహద్దులను దాటి సమిష్టి ఆకాంక్షలకు మార్గనిర్దేశం చేయగల ‘సామూహిక మానవ
విలువలను’ స్పష్టంగా వ్యక్తపరచే, భవిష్యత్తు
దృష్టితో కూడిన నాగరికతా ప్రతిపాదనగా భావించవచ్చు. నాగరికత, జ్ఞానం, సౌహార్దం, ఉన్నత
లక్ష్యాన్వేషణ నిరంతరం కొనసాగింది. అయితే మారుతున్న కాలం కోరుకునే నిరంతర చైతన్యశీలత
అనుకున్న మోతాదులో కనిపించలేదనాలి.
అనాదిగా, శతాబ్దాలుగా, ఆలోచనాపరులు,
ఋషులు, తత్వవేత్తలు, సంస్కర్తలు, తమ కాలాన్ని దాటి
ముందుకు సాగి, తరువాతి తరాలకు
తామాచరించిన విలువల మార్గాలను ప్రకాశింపజేశారు. అలాగే, సామాజిక శాస్త్రీయ రంగాలకు చెందిన దూరదృష్టి గల పలువురు
వ్యక్తులు, కృత్రిమ మేధస్సు తరహా మహత్తర మార్పు తెచ్చిన సాంకేతికతలను
రూపుదిద్దినవారితో సహా, మానవ అభివృద్ధి గమనాన్ని ప్రభావితం చేశారు. వారి కృషి
క్షణిక మెరుపులు కాదు. సమిష్టి
అవగాహనను నిరంతరం మలిచే స్థిరమైన మార్గదర్శక వనరులు. భారతవర్షం అనే సస్యశ్యామల
మేధో భూమికలో వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఆదికావ్యం, జయ సంహిత, ప్రబంధ సాహిత్యం ద్వారా వర్తమాన, భావితరాలకు ఆచరణీయ విధానాలకు పునాదులు
వేయబడ్డాయి. ఇవి మానవుడు, విశ్వం మధ్య, అలాగే, ప్రశ్నించడం, అంతర్దృష్టి
మధ్య సజీవ సంభాషణలను జాగ్రత్తగా నిర్మించాయి.
చరిత్రలో ప్రసిద్ధులైనవారూ, లిఖిత చరిత్ర
సరిహద్దులకు అతీతంగా నిలిచినవారూ అయిన ఋషులు, భౌగోళిక పరిమితులను, కాలపరిమితులను అధిగమించిన ఆలోచనా రూపరేఖలను
నిర్మించారు. మానవజాతికి ధర్మం, ఆత్మసాక్షాత్కారం, కరుణ, అహింస, భిన్నత్వంలో ఏకత్వం వంటి విలువలను వారు ప్రసాదించారు.
ఈ పునాదిపై ఆదిశంకరాచార్యుల అద్వైతం, రామానుజాచార్యుల
విశిష్టాద్వైతం, మధ్వాచార్యుల
ద్వైతం వంటి తత్త్వప్రవాహాలు ఆవిర్భవించి, పయనించాయి.
వారి తాత్త్విక ఆలోచనా ధోరణి సత్యాన్వేషణకు పార్శ్వాలను ప్రతిబింబించింది. అలాగే, భారతదేశమంతటా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో
బుద్ధుడు మధ్యమ మార్గాన్ని, దుఃఖ
విముక్తిని బోధించాడు. మహావీరుడు అహింసను స్థిరంగా ఆచరించాడు. యేసుక్రీస్తు ప్రేమ, క్షమను ప్రధానంగా
ప్రతిపాదించాడు. ప్రవక్త మహ్మద్ ఏకేశ్వర భక్తిని న్యాయం, బాధ్యతతో కూడిన విధంగా
ప్రకటించాడు. ఈ విధంగా వారు, తమ తమ దృక్కోణంలో మానవత్వపు నైతిక దృష్టి పరిధిని
విస్తరించారు.
వైదిక ధర్మపు ఆత్మ నిరంతరం పరిణమిస్తూ, మార్పులకు
అనుగుణంగా రూపాంతరం చెందుతూ ‘తదుపరి, తదుపరి, మరింత తదుపరి’ అనే దిశగా సాగింది. ఆధునిక యుగంలో
మహాత్మా గాంధీ సత్యం, అహింసలను ప్రజా జీవితంలో నైతిక శక్తిగా మార్పు చేశాడు.
ఖండాలంతటా హేగేలియన్ మాండలిక సిద్దాంతం, మార్క్సిజం, లెనినిజం,
మావో
భావజాలం, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం, సిద్ధాంతాలు మారుతున్న చారిత్రక
పరిస్థితులకు ప్రతిస్పందనగా, సామాజిక అవసరలాకు అనుగుణంగా ఆవిర్భవించాయి. ఈ
వ్యవస్థలు మానవ ఆశయాలకు మాత్రమే కాదు, మానవ బాధలకు
కూడా స్పందనలుగా నిలిచాయ. అవి నిర్వచిత
తత్త్వపరిమాణాల పరిధిలో న్యాయం, అభివృద్ధి, సమానత్వం, సామాజిక పురోగతిని క్రమబద్ధంగా
నిర్మించేందుకు చేసిన చైతన్యపూర్వక ప్రయత్నాలు. ఈ విభిన్న సిద్ధాంత
వ్యవస్థలున్నప్పటికీ, సామర్థ్యానికి
సమానత్వాన్ని, స్వేచ్ఛకు
బాధ్యతను కలిపే ఒక సమగ్ర దిశ కోసం మానవజాతి ఇంకా అన్వేషణ కొనసాగిస్తోంది.
వేదాలు ఆధ్యాత్మిక అన్వేషణ, విశ్వక్రమం, నైతిక
జీవన విధానాన్ని వ్యవస్థీకృతంగా ప్రతిపాదించిన అతి ప్రాచీన ఆధారాలుగా నిలుస్తాయి. అవి జ్ఞానాన్ని ఒకవైపు ఆవిష్కరణగా, మరోవైపు క్రమశిక్షణతో కూడిన మననంగా
ప్రతిపాదించాయి. ఉపనిషత్తులు ఈ అన్వేషణను తత్త్వాత్మక అంతర్ముఖ చింతన వైపు మరింతగా
లోతుగా తీసుకెళ్లి, వ్యక్తి ఆత్మ
(ఆత్మన్), పరమ సత్యమైన బ్రహ్మం (బ్రహ్మన్) మధ్య ఐక్యతను కేంద్రీకరించాయి. అష్టాదశ
పురాణాలు, సూత్రాత్మకమైన ఆదిభౌతిక కథారూప దైవశాస్త్రం, నైతిక బోధ,
సృష్టిశాస్త్ర
దృక్కోణం, సాంస్కృతిక స్మృతిగా రూపాంతరం చేసి,
తత్త్వ
అవగాహనను విస్తృత సమాజానికి చేరువ చేశాయి.
సంస్కృత వాల్మీకి రామాయణంమైన ఆదికావ్యం, ధర్మాన్ని
మనుషుల జీవితాల్లో ఎదురయ్యే నిజమైన పరిస్థితుల ద్వారా చూపించింది. నైతిక
సందిగ్ధాలు, సద్గుణ
ప్రవర్తనలను ఇతిహాస కథారూపంలో వివరించింది. వేదవ్యాస మహాభారతానికి కేంద్ర భాగంగా
ఉన్న జయ సంహిత సంక్షోభ పరిస్థితుల్లో నైతిక సంఘర్షణ, పాలన, మానవ నిర్ణయాల క్లిష్టతను పరిశీలించింది. ప్రబంధ
సాహిత్యం తరువాతి కాలంలో శాస్త్రీయ ఆలోచనలకు ఒక కొత్త వికాసంగా నిలిచింది. ఇది
కవిత్వం, చరిత్ర, బోధాత్మక రచనలను సమన్వయం చేస్తూ, సౌందర్యాన్ని, నైతిక బోధను కలిపింది. ఈ విధంగా
ఆలోచన, సామాజిక జీవితం మధ్య నిరంతర సంబంధాన్ని కొనసాగించింది.
ఆది శంకరాచార్యుల అద్వైతం బ్రహ్మం ఒక్కటే పరమ సత్యమని ప్రకటిస్తుంది.
అనేకత్వం కనిపించినా, అసలు సత్యం
ఏకత్వమే అని చెప్పింది. జ్ఞానం ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకోవాలని మార్గదర్శనం
చేసింది. రామానుజాచార్యుల విశిష్టాద్వైతం ఏకత్వాన్ని అంగీకరిస్తూనే భిన్నత్వానికి
స్థానం ఇస్తుంది. వ్యక్తి ఆత్మ దైవంతో వేరుగా ఉన్నప్పటికీ, దానితో విడదీయరాని సంబంధంలోనే ఉందని చెబుతుంది.
మధ్వాచార్యుల ద్వైతం వ్యక్తి ఆత్మ, పరమాత్మ మధ్య శాశ్వత భేదాన్ని ఉద్ఘాటిస్తుంది.
భక్తి, నైతిక బాధ్యత, దైవ కృపలను ఆధ్యాత్మిక సాధనలో ప్రధానంగా
చూపిస్తుంది. మహాత్మా గాంధీ ప్రాచీన నైతిక సూత్రాలను ప్రజా జీవితంలో ఆచరణీయ
తత్త్వంగా మార్చాడు. ‘సత్యం అహింస’ లను ‘సత్యాగ్రహం’ ద్వారా ఒక బలీయమైన నైతిక
శక్తిగా రూపుదిద్దాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా పౌరహక్కుల ఉద్యమాలు, జాతీయ
స్వాతంత్ర్య పోరాటాలపై గాఢ ప్రభావం చూపింది.
హేగేలియన్ సిద్దాంతం చరిత్ర పురోగతిని ‘థీసిస్, యాంటీథీసిస్,
సింథసిస్’
అనే ప్రక్రియగా వివరించింది. ఆలోచనలు అభివృద్ధి చెందుతూ సమాజం, సంస్థలను
రూపుదిద్దుతాయని ఇది చెబుతుంది. ఈ విధానం తత్త్వ ఆదర్శవాదంపై ఆధారపడి ఉంది. వాస్తవం చివరకు ఆలోచనల అభివృద్ధి ద్వారా
రూపుదిద్దుకుంటుందని భావిస్తుంది. మార్క్స్ మానవ చరిత్రను గతితార్కిక భౌతికవాద
పునాదిపై మళ్లీ రూపుదిద్దాడు. చరిత్ర మార్పులో ఆర్థిక పరిస్థితులు, వర్గ సంబంధాలే
ప్రధాన పాత్ర వహిస్తాయని ఆయన స్పష్టం చేశాడు. మార్క్సిజం సామాజిక అభివృద్ధిని
భౌతిక ఉత్పత్తి, వర్గపోరాటం ద్వారా విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థలు రాజకీయ, సాంస్కృతిక నిర్మాణాలపై గాఢ ప్రభావం చూపుతాయని
ఇది స్పష్టం చేసింది. లెనినిజాన్ని ‘ఒక అడుగు
ముందుకు, రెండు అడుగులు
వెనుకకు’ వంటి రచనల ద్వారా, తన సిద్ధాంతాన్ని
క్రమబద్ధమైన విప్లవ నాయకత్వం, కట్టుదిట్టమైన రాజకీయ కార్యాచరణగా, ఆధునిక రాజ్య
వ్యవస్థలకు అనుగుణంగా విస్తరించాడు లెనిన్ మహాశయుడు,
మావో ‘మార్క్సిజం, లెనినిజం’ ప్రజల విస్తృత
చైతన్యాన్ని, సాంస్కృతిక
పునర్నిర్మాణాన్ని, సమాజంలో నిరంతర
మార్పును ప్రాముఖ్యంగా తెలియచేసింది. సాంస్కృతిక విప్లవం ద్వారా, ‘పాత ఆలోచనలు, సంస్కృతి, ఆచారాలు, పాత అలవాట్ల’కు
వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. మతం, సంప్రదాయ ఆచారాలను వ్యతిరేకించడం జరిగింది. ‘శత్రువు
ముందుకు వస్తే మనం వెనక్కి తగ్గాలి; శత్రువు శిబిరం
వేసుకుంటే మనం ఇబ్బంది పెట్టాలి; శత్రువు
అలసిపోతే మనం దాడి చేయాలి; శత్రువు
వెనక్కి తగ్గితే మనం వెంటాడాలి’ అన్నది మావో సూక్తి.
నోబెల్ బహుమతి, అకాడమీ
అవార్డులు, పులిట్జర్
బహుమతి, రామన్ మాగ్ససే
అవార్డు, బుకర్ బహుమతి, ఆర్డర్ ఆఫ్ లెనిన్, జవహర్‌లాల్
నెహ్రూ అంతర్జాతీయ అవగాహన పురస్కారం వంటి గౌరవాలు నిర్దిష్ట రంగాల్లో అత్యుత్తమ
ప్రతిభను సత్కరిస్తాయి. ఆ విషయంలో రెండు ఆలోచనలకు తావు లేదు. అయితే అంతకంటే లోతైన
ఒక ఆశయం ఇంకా ఉంది. అది జ్ఞాన సంప్రదాయాలు,
ఆధునిక
ఆలోచన, శాస్త్రీయ
అన్వేషణ, నైతిక మననం, ఆర్థిక వ్యవస్థ, మానవ
సహానుభూతి: ఇవన్నింటినీ ఒక సామూహిక విలువల ఒప్పందంగా, సమాహారంగా కలిపే ఒక రూపరేఖను
ఊహిస్తుంది. 80 ఏళ్ళ వయస్సులో
అణ్వస్త్రధారణ శాసన ధిక్కారం చేసి జైలుకు
వెళ్లిన బెర్ట్రాండ్ రస్సెల్ ను ఆదర్శంగా తీసుకోవాలి. ‘మానవుణ్ణి, మానవతను మరిచి పోవద్దు. అట్లా చేయగలిగితే
స్వర్గానికి నిచ్చెనలు, చేయని పక్షంలో విశ్వ సంహారం తప్ప ఏమీ మిగలదు’ అన్నాడాయన.
‘విశ్వ మానవతావాదాన్ని’ ఒక ‘నాగరికత మిషన్’గా భావించవచ్చు. ఫ్యూడలిజం, కాపిటలిజం,
సామ్యవాదం, చిరస్థాయి ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి వచ్చిన
కృషిని గుర్తిస్తూ, మానవ గౌరవం, జ్ఞానం, కరుణ, బాధ్యతలను సాధారణ ఆధార విలువలుగా నిలబెడుతూ, వ్యవస్థలను సమన్వయం చేయాలని కోరుకుంటుంది. ఆధ్యాత్మిక
అంతర్దృష్టి, నైతిక బాధ్యత, శాస్త్రీయ దృక్పథం, సామాజిక
న్యాయం: వీటన్నింటినీ ఒక సమగ్ర, భవిష్యత్
దృష్టితో కూడిన దిశలో కలపాలని ఆశిస్తుంది. భిన్నత్వాన్ని తొలగించకుండా సమన్వయం
సాధించగలమని, ఏకత్వం
సాధించడానికి వేర్వేరు స్వరాలను చెరిపేయాల్సిన అవసరం లేదని, పురోగతి దోపిడీ లేకుండానే సాధ్యమని నమ్మకం
కలిగిస్తుంది.
దీనికి, నాగరికతలు, శాస్త్రశాఖలు,
తరాలమధ్య
క్రమబద్ధమైన సంభాషణ సంస్కృతి అవసరం. సమాజం ‘తదుపరి, తదుపరి, మరింత తదుపరి’ దిశగా సాగుతున్నప్పుడు, లక్ష్యం పూర్వ జ్ఞానాన్ని తిరస్కరించడం కాదనీ, ప్రస్తుత వాస్తవాల వెలుగులో దాన్ని మెరుగుపరచి
విస్తరించడమనీ అవగాహనకు రావాలి. వేదఘోషల కాలం నుంచి గతం తత్త్వాలను ఇచ్చింది. వర్తమానం వేదికలను అందిస్తోంది. అలాగే భవిష్యత్తు సమన్వయాన్ని నిర్ధారించాలి. వేదం
వేదాంగ, వేదాంత ఉపనిషద్ , పౌరాణిక మహామహా పండితులు వర్తమాన ఆర్థిక శాస్త్రవేత్తలతో
సమన్వయ దృక్ఫదంతో, సాంకేతిక నిపుణులు నైతిక ఆలోచనాపరులతో, విధాన నిర్ణేతలు
తత్వవేత్తలతో సంభాషించాలి. యువత పెద్దలతో
అనుసంధానమవాలి. విశ్వవిద్యాలయాలు, పరిశోధన
సంస్థలు, అంతర్జాతీయ
సంస్థలు, ఆలోచనా వేదికలు, మతాంతర సంభాషణ వేదికలు, డిజిటల్ మాధ్యమాలు: ఇవన్నీ ఈ అంశాలను గెలుపుకోసం
చేసే వాదప్రతివాదాలుగా కాక, ఏకీకరణ కోసం
చేసే అన్వేషణగా చూడాలి.
ప్రపంచం ఎదుర్కొంటున్న విభేదాలు,
యుద్ధాలు, సిద్ధాంత ఘర్షణల మధ్య, మానవ సమగ్రతకు మార్గం
చూపగల ఆలోచనలు, వ్యక్తులు, ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించడం అత్యవసరం.
నాగరికతల మధ్య సంభాషణను బలపరుస్తూ, మానవ విలువల
కేంద్రంగా, సమన్వయ దిశగా కృషి చేసే వారిని గౌరవించేందుకు, ప్రస్తుత అంతర్జాతీయ పురస్కారాలకంటే విస్తృతమైన
దృక్పథంతో విభేదాలమధ్య సారధులు కట్టే ‘బెర్ట్రాండ్ రస్సెల్’ లాంటి మహామహులకు, ‘విశ్వ మానవతావాద పురస్కారం’ ఇవ్వాలన్న భావన
రూపుదిద్దుకుంటే, అది ఒక బహుమతిగానూ, భవిష్యత్ మానవ
నాగరికతకు మార్గదర్శక సంకేతంగానూ నిలవగలదు.


No comments:
Post a Comment