ఈ కల్యాణం సీతారాములకేనా?
అయ్యో..
రామచంద్రా..! గోత్రాలు, ప్రవర
మార్చేశారు!
(ఏదీ భద్రాచల
శ్రీరామ నవమికి వాల్మీకి ప్రతీక, చరిత్ర, ఆధ్యాత్మికత)?
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక నవ్యపేజీ
(అంధ్రప్రదేశ్,
తెలంగాణ ఎడిషన్లు: మార్చ్ 20, 2026)
ఆధ్యాత్మికవేత్తలను, శాస్త్రవ్యాఖ్యాతలను, పండిత
ప్రవచనకర్తలను ఆశ్రయించి, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల
వివాహాలు, వేదాలలో పేర్కొన్న సంప్రదాయ ప్రక్రియ ప్రకారమే జరిగాయా, వారి పిల్లలు
గర్భస్థ సంతానమేనా అన్న విషయంలో స్పష్టత కోరాను. వేదసంస్కారాలలో ప్రధానమైన వివాహం గురించి అశ్వలాయన, పరాస్కర, బోధాయన గృహ్యసూత్రాలు, ఋగ్వేదంలోని వివాహ సూక్తాలకు అనుగుణంగా వివాహాలు
జరిగాయా అన్నదే సందేహం. వరాగమనం (వరుడి ఆగమనం), కన్యాదానం, పాణిగ్రహణం (వధువు చేయి పట్టుకోవడం), సప్తపది (ఏడు అడుగులు), హోమం (పవిత్ర అగ్ని సాక్షిగా
క్రతువు), మంగళసూత్ర
మంత్రాలు మొదలైన ప్రధాన కర్మలు సూచించబడ్డాయి. ఈ విధమైన సంపూర్ణ వేదోక్త వివాహ
విధానం త్రిమూర్తుల వివాహాలలో ఆచరించబడినట్లు శాస్త్రాల్లో లేదేమోనన్న భావన నా
మనసులో ప్రశ్నగా మిగిగిలింది.
ఈ ఆలోచన కలగడానికి
ప్రధాన కారణం, ఈ పరాభవనామ సంవత్సరం
పవిత్ర శ్రీరామనవమినాడు భద్రాచలంలో జరగబోయేది త్రిమూర్తులలో ఒకరైన రామనారాయణ
(విష్ణుమూర్తి) లక్ష్మీదేవిల వివాహమా? లేక, ఆబాలగోపాలం ఎదురుచూస్తున్న విష్ణుమూర్తి
అవతారమైన శ్రీరామచంద్రమూర్తికి, అయోనిజ సీతాదేవితో కళ్యాణమా? గత విశ్వావసునామ సంవత్సర చైత్ర శుక్ల పక్ష నవమి-దశమిన,
(ఏప్రియల్
6-7, 2025) దక్షిణ
అయోధ్య భద్రాచలంలో, ఉద్దండ పండితుల, వేదవేదాంగ పారంగతుల, ఘనాపాఠీల
ఆధ్వర్యంలో అంగరంగ వైభోఘంగా జరిగిన శ్రీ సీతారామ (రామనారాయణ?) కల్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలలో ఆసాంతం అర్చక
మహాశయుల దృష్టంతా ఎన్నిసార్లు, ఏవిధంగా రాముడిని రామనారాయణుడుగా, సీతాదేవిని మహాలక్ష్మిగా ఆహుతులకు
పరిచయం చేయాలన్న తపనే తప్ప ఆధ్యాత్మిక వైభోగమే కనపడలేదు. వాల్మీకి సంస్కృత రామాయణంలో, ఆంధ్రవాల్మీకి వాసుదాసు
రామాయణం మందరంలోని కనీసం కొన్ని ఆసక్తికరమైన విషయాలనైనా, పండిత-పామరులకు అర్థమయ్యే
భాషలో విశదీకరించే ప్రయత్నం జరగలేదు.
వేదాంతి, దార్శనికుడు, తపస్వి, సామాజిక సంస్కర్త,
మహర్షి వాల్మీకి కూర్చిన బీజాక్షరాల సమాహారమే 24 వేల శ్లోకాల ‘ధ్వని కావ్యమైన’ సంస్కృత రామాయణం. అష్టాక్షరీ మంత్రంలోని ‘రా’ శబ్దం,
పంచాక్షరీ మంత్రంలోని ‘మ’ శబ్దం కలిపి వశిష్ఠ మహర్షి ఏ
పుణ్య ముహూర్తంలో ‘రామ’ నామాన్ని నిర్ణయించారో కాని,
యుగయుగాలకు, అది తారక
మంత్రమై, అజరామరమైంది. వాల్మీకి మహర్షి ఆదికావ్యం రామాయణంలో వేదార్థం, వేదం
స్వరూపం విస్తరించి చెప్పడం జరిగింది. కావ్యంలో అనృతం కొంచెమైనా వుండదని బ్రహ్మ
వరం. ఇలాంటి యోగ్యత, మహాత్మ్యం, గాయత్రీ ప్రణవ మంత్రాది సంపుటీకరణ ఇతర
గ్రంథాలలో లేవు.
'మానిషాద
ప్రతిష్టాం త్వ...' శ్లోకం
నుంచి ప్రారంభించిన వాల్మీకి రామాయణం అవశ్య పఠనీయం. సంస్కృతం రానివారికోసం, ఆంధ్రవాల్మీకిగా,
వాసుదాసుగా ప్రసిద్ధికెక్కిన శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు
(1863-1939) నూట ఏబై సంవత్సరాలకు పూర్వం, యథావాల్మీకంగా,
పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కలిపి 24 వేల శ్లోకాలకు 24 వేల
పద్యాలతో, సులభమైన వ్యాఖ్యానంతో, ‘తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
...’ పద్యంతో ప్రారంభించి, మందరం అనే
పేరుతో అద్భుతంగా, రసరమ్యంగా తెనిగించారు. అలాంటి వాల్మీకి
రామాయణం అత్యద్భుతమైన ఘట్టాలలో ‘శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం’
ప్రధానమైనవి.
వాల్మీకి, ఆంధ్ర వాల్మీకుల
వ్యాఖ్యానం ప్రకారం: వైవస్వత మన్వంతరం, త్రేతాయుగం, విలంబినామ సంవత్సరం, చైత్ర
మాసం శుక్ల పక్ష నవమి తిథి నాడు, పునర్వసువు నక్షత్రంలో
బుధవారం నాడు శ్రీరామజననం. జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు.
జన్మ లగ్నం కర్కాటకం. మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు
వున్నారు. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం, పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట శ్రీరాముడికి
ఉపనయనం జరిగింది.
శ్రీరామలక్ష్మణులను
విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకుని వెళ్లాడు. జనక మహారాజుకు పరిచయం చేసి,
శివ ధనుస్సును చూపించమన్నాడు. జనకుడు దాన్ని చూపించే ముందు సీత జన్మ
వృత్తాంతం చెప్పాడు. సీత వీర్యశుల్కనీ, ఇంతవరకు ఎవరు
కూడా ఎక్కుపెట్టని శివ ధనుస్సును ఎక్కుపెట్టగల వాడికే అయోనిజైన సీతను ఇచ్చి వివాహం
చేస్తానని అన్నాడు. ధనుస్సును చూపించగానే,
రాముడు పెట్టె దగ్గరికిపోయి,
దాని మూత తెరిచి, విశ్వామిత్రుడి అనుమతితో అవలీలగా వింటిని అరచేత్తో
పట్టుకొని, బయటకు తీసి, అల్లెతాటిని
బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా
విరిగిపోయింది.
రామచంద్రమూర్తి
భుజబలం చూసానని, సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడు అన్నాడు. దరిమిలా దశరథ మహారాజు
మిథిలా నగరానికి రావడం జరిగింది. కన్యను ఇచ్చి, పుచ్చుకొనేటప్పుడు,
అధమపక్షం మూడుతరాల వంశజ్ఞానం తెలుసుకోవాలి. అలాకాకుండా కన్యను ఇవ్వకూడదని
ఒక నమ్మకం, తీసుకొననూ కూడదు అనేది సనాతన ఆచారం. వివాహంలో వధూవరుల వంశవృక్షం,
నేపధ్యం, ప్రవర అవశ్యంగా తెలియాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ,
వివాహ విషయంలో ఇది ప్రధానమని శాస్త్రం చెపుతున్నది.
తదనుగుణంగా,
ఇక్ష్వాకువంశానికి కులగురువైన వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరిస్తూ,
చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించడం నుండి మొదలుపెట్టి,
కశ్యపుడు, వివస్వంతుడు, మనువు, ఇక్ష్వాకుడుతో సహా సగరుడు, భగీరథుడు, రఘుడు,
అజుడు, దశరథుడు దాకా చెప్పాడు. జనక మహారాజు తనవంశక్రమాన్ని నిమి నుండి తన తండ్రి హ్రస్వరోముడు
దాకా వివరించాడు. శ్రీరాముడికి పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో, సౌమ్యనామ
సంవత్సరం ఫాల్గున శుద్ధ శుక్ల త్రయోదశి ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో, సీతారాముల కల్యాణం జరిగింది. అంతేకాని, చైత్ర శుక్ల పక్ష
నవమి నాడు కాదు. అది వేరే సంగతి.
తరువాత
సీతా కళ్యాణ ఘట్టం మొదలవుతుంది. దానిని వాల్మీకి
సంస్కృత రామాయణంలో ఇలా వర్ణించడం జరిగింది. ‘తతస్సీతాం
సమానీయ సర్వాభరణభూషితామ్; సమక్షమగ్నే
స్సంస్థాప్య రాఘవాభిముఖే తదా; అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానన్దవర్ధనమ్৷’. ఆంధ్రవాల్మీకి
రామాయణం మందరంలో వాసుదాసుగారు ఇలా తెనిగించారు. ‘సీతను సర్వాభరణో,
పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌసల్యా తనయున కభిముఖముగ,
క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్.’ అలంకారాలతో
ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా,
శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి,
జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నాడు.
‘ఇయం
సీతా మమ సుతా సహధర్మచరీ తవ; ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా’ (వాల్మీకి సంస్కృత రామాయణం)....’ఈ సీత
నాదుకూతురు, నీ
సహధర్మచరి దీని నిం గై కొనుమా కౌసల్యాసుత, నీకును
భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్’ (ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం). దీనర్థం: ‘కౌసల్యా
కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు
జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె
చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత,
మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా
ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’. అని అంటూ, మంత్రోచ్ఛారణతో
పవిత్ర జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు.
వివాహం
శాస్త్ర ప్రకారం వైభవంగా జరిగింది. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని ‘కౌసల్యా
సుత’ అని సంబోధించడం ఆసక్తికరమైన విషయం. అలాగే, ‘ఈ
సీత’ (ఇయం సీతా) అంటాడు జనకుడు రాముడితో. సిగ్గుతో సీత తన చేయి
పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. అందుకే జనకుడు సాక్షాత్తు లక్ష్మీదేవైన
సీతను రాముడికి ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా 'ఈ
సీత' అన్నాడు.
సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా,
'నాదుకూతురు' (మమ
సుతా) అని చెప్పాడు. నీ ‘సహధర్మచరి’
(సహధర్మచరీ తవ) అనడమంటే, రాముడేది ధర్మమని భావిస్తాడో,
దానిలోనే ఆమె ఆయనకు తోడుగా ఆ కార్యాన్ని నిర్వహిస్తుందని అర్థం. రామ పట్టాభిషేకం ధాత నామ సంవత్సరం,
చైత్ర శుద్ధ సప్తమి గురువారం పుష్యమి నక్షత్రంలో జరిగింది.
ఈ నేపధ్యంలో, భద్రాచలంలో గత
ఏడాదితో సహా ఇటీవల కాలంలో జరుగుతున్న రామనారాయణ, లక్ష్మీదేవిల కల్యాణం సందర్భంగా, ఎదురుకోలు, కల్యాణం, పట్టాభిషేకం
ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం
ఆధ్వర్యంలో,
మిథిలా
కళ్యాణ మండపంమీద జరిపిన వివాహ తంతు ద్వారా, విజ్ఞానవంతులైన
అర్చక పండిత మహాశయులు, ఆహుతులను గందరగోళానికి (ఇటీవలి కాలంలో) గురిచేయడం బహుశా భావ్యం
కాదేమో. ‘అచ్యుత గోత్రోద్భావయా’ అని రామనారాయణ స్వామిని
శ్రీరామచంద్రుడి స్థానంలోకి తెచ్చారు. క్షత్రియుడైన శ్రీరాముడు ‘అచ్యుత
గోత్రం’ తో బ్రాహ్మణుడిగా క్షణంలో మార్చివేశారు. సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మిని
తెచ్చి,
ప్రవర
మార్చారు. సౌభాగ్య గోత్రం ఇచ్చేశారు. శ్రీరాముడి వశిష్ట, సీతాదేవి గౌతమి
గోత్రాలు ఎలా, ఎందుకు, ఎక్కడికి మాయమైపోయా తెలియదు.
వైష్ణవ
సంప్రదాయాల ప్రకారం మహావిష్ణువు శాస్త్రోక్త ఆవిర్భావం ‘ఆది మధ్యాంత
రహితుడైన నిత్యస్వరూపం’గా పేర్కొనడం జరిగింది. శ్రీమహావిష్ణువు కారణజలధిపై
యోగనిద్రలో విరాజిల్లుతూ ఉంటారని భాగవత పురాణం వివరిస్తుంది. విష్ణువు
సాధారణార్థంలో జన్మించినవాడిగా కాక, సర్వసృష్టికి మూలకారకుడిగా అవతరించిన
పరతత్త్వస్వరూపుడిగా, మహామహానుభావుడిగా భావించబడతాడు. అలాంటప్పుడు ఆయన అచ్యుత
గోత్రోద్భవుడు ఎలా అవుతాడు? త్రిమూర్తుల వివాహాలు సహితం సాధారణ వేదోక్త
వివాహక్రియల రూపంలో జరిగినవి కాకుండా, ఒక తాత్విక-ఆధ్యాత్మిక సంఘటన (Theological
Union)
భావించాలి.
విష్ణు పురాణం, భాగవత పురాణం, మహాభారతం మొదలైన
గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనం (సముద్ర మథనం) సమయంలో లక్ష్మీదేవి
ఆవిర్భవించింది. ఆ సమయంలో ఆమె స్వయంగా మహావిష్ణువును తన నిత్య సహచరుడిగా (భర్తగా)
ఎంచుకుంది. అప్పటి నుండి ఆమె వైకుంఠంలో విష్ణువుతో నిత్యసహవాసం, నిత్యనివాసం
చేస్తూ ఉన్నదని వైష్ణవ సంప్రదాయం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వివరిస్తుంది.
అలాంటప్పుడు ఆమె సౌభాగ్య గోత్రోద్భవి ఎలా అయింది? లక్ష్మీదేవి
ఆవిర్భావం,
స్వయంగా
విష్ణువును వరించటం, మాల్యధారణ చేయటం, అనంతరం ఆయనతో
నిత్యసంబంధంగా ఉండటం లాంటి విషయాలకతీతంగా, వారి వివాహం
వేదవిధాన ప్రకారం జరిగిందని చెప్పే స్పష్టమైన దాఖలాలు (నా పరిమిత జ్ఞానం మేరకు)
శాస్త్రాలలో కనిపించదు. అంతేకాక, వారిద్దరి వర్ణం, ప్రవర, గోత్రం మొదలైన
వివరాల గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లభించదు. అలాంటప్పుడు ‘అచ్యుత,
సౌభాగ్య’ గోత్రాల సాధికారత ఏమిటి? అంతా అగమ్య గోచరం!!!
విశేషమేమిటంటే, ఎదుర్కోలులో
సీతాదేవి, శ్రీరాముడి
పక్షం వహించిన ‘ఇరువురు విశిష్ట వశిష్టుల స్థాయి ఆచార్యవర్యులు’ మాటల ద్వందయుద్ధం
చేశారేమో అనిపించింది. సీతారాముల గుణగణాల, గొప్పదనాల వర్ణన
చేసేటప్పుడు,
వాస్తవానికి
దగ్గరగా వుండాలి. వారి-వారి వివాహాత్పూర్వ విషయాలనే
చెప్పాలికాని భవిష్యత్తులో జరగబోయేవెలా చెప్తారు? రామాయణాన్ని
తమదైన శైలిలో అన్వయించుకుంటూ, వివాహానంతర కాండలలో వున్న విషయాలను
ప్రస్తావించడం భావ్యమా? పట్టాభిషేకం వీక్షిస్తున్నప్పుడు, వాల్మీకి
రామాయణంలో వర్ణించిన ఘట్టాన్ని అన్వయించలేదేమో (క్షమించాలి) అన్న సందేహం కలిగేలా
కొనసాగింది.
భద్రాచలంలో (అంగరంగ
వైభోగంగా) నిర్వహించిన ఎదురుకోలు, కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాలు
వీక్షించిన నాకు, చైనా తత్త్వవేత్త లిన్ యుటాంగ్ గుర్తుకొచ్చాడు. ప్రాక్పశ్చిమ తత్త్వాలు, జ్ఞానం, వివేకం, అభ్యాసం వంటి
అంశాలపై ఆయన రచనలు చేశారు. ‘ది విజ్డమ్ ఆఫ్ చైనా అండ్ ఇండియా’ అనే బృహత్గ్రంథంలో, ప్రాచీన
గ్రీకు గణిత శాస్త్రవేత్త యూక్లిడ్ ప్రవచించిన
‘జ్ఞానార్జనకు రాజమార్గం లేదు’ అని రాశారు. అంటే, జ్ఞానాన్ని, లేదా
నిర్దిష్ట విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, శ్రమ తప్పదని చెప్పడమే.
ఎలాంటి విద్య అయినా కష్టపడకుండా సాధ్యం కాదని కూడా భావన. భద్రాచలంలో నిర్వహించిన మహోత్సవాలకు ఈ తత్త్వం
సరిపోతుందేమో. వేదవేదాంగాలు చదివిన మహామహా పండిత శ్రేష్టులైనా మరింత, నిరంతర
అధ్యయనం చేయక తప్పదేమో!!!
కనీసం ఈ
పరాభవనామ సంవత్సరంలోనైనా మార్చ్ 27, 2026 పవిత్ర శుక్రవారంనాడు, అత్యంత పవిత్రమైన, దక్షిణ
అయోధ్య భద్రాచల క్షేత్రంలో జరగనున్న్న శ్రీరామనవమి ఉత్సవం, భక్త రామదాసు భావాలకు, వాల్మీకి
మహర్షి సంస్కృత రామాయణ రచనకు, ఆంధ్ర వాల్మీకి యధాతథ తెలుగు అనువాదానికి అనుగుణంగా 'రామనారాయణ, మహాలక్ష్మీల
కల్యాణం' గా కాకుండా, 'శ్రీసీతారాముల
కల్యాణం' గా జరిపించాలి. సీతారాముల
కల్యాణానికి వచ్చే ఆహుతులకు, టీవీ వీక్షకులకు అర్ధమయ్యేలా, తప్పుదారిన
మళ్లించకుండా, సరలమైన తెలుగు
భాషలో చెప్పాలి. ఎదుర్కోలు, పట్టాభిషేకం గురించిన వివరాలు కూడా అలాగే
చెప్పాలి. అలంకారాల, అహంకారాల కన్నా వినమ్రతను, బాహ్య ప్రదర్శన కన్నా అంతర్లీనమైన
పవిత్రతను,
శుద్ధతను
కాపాడాలి. స్వకపోలకల్పిత స్వేచ్ఛలను దేవుడు మన్నించినా, మానవమాత్రులు జీర్ణించుకోలేరు.
(బహుశా
స్థలాభావం వల్ల ఆంధ్రజ్యోతి ప్రచిరించలేకపోయిన అంశాలతో సహా నా పూర్తివ్యాసం ఇది)






No comments:
Post a Comment