Friday, March 27, 2026

అంగరంగ వైభోగంగా, భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణం >>>>> విశిష్ట వశిష్ట అర్చక మహాశయులకు అభినందనలు : వనం జ్వాలా నరసింహారావు

 అంగరంగ వైభోగంగా, భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణం

విశిష్ట వశిష్ట అర్చక మహాశయులకు అభినందనలు

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులు, పలువురు మంత్రుల సమక్షంలో, అంగరంగ వైభోగంగా, ఆబాలగోపాలం అపరిమితమైన భక్తిభావనతో వీక్షిస్తుండగా, భద్రాచలం శ్రీసీతారామ కల్యాణాన్ని శుక్రవారం, మార్చ్ 27,2026 న కన్నులపండుగగా, ఎప్పటిమాదిరిగానే నిర్వహించిన శ్రీసీతారామచంద్ర దేవస్థాన అధికారులను, విశిష్ట వశిష్ట అర్చక మహాశయులను మనస్ఫూర్తిగా, మనసారా అభినందించాలి. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడిని, శ్రీమహాలక్ష్మీదేవిని, శ్రీరామనవమి పర్వదినాన, సీతారాముల కళ్యాణ సందర్భంగా, బుల్లితెరమీద చూసే  భాగ్యం కలిగించిన నిర్వాహకులకు, వివాహ తంతు జరిపించిన అర్చక మహాశయులకు ధన్యవాదాలు.

శ్రీరామనారాయణస్వామి, శ్రీమహాలక్ష్మీ పేర్లతో, గోత్ర ప్రవరలతో, జీలకర్ర బెల్లం పెట్టేశారు. వందల సంవత్సరాల నుండీ శ్రీలక్ష్మీనారాయణుల కళ్యాణమే భద్రాచలంలో జరుపడం ఆనవాయితీ అంటూ స్పష్టంగా ప్రకటిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలానే జరుపుతామని నొక్కి వక్కాణిస్తూ ప్రకటన కూడా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక, వారి ముందు శ్రీరామచంద్రస్వామినే వరాయ అని చెబుతూ, శ్రీలక్ష్మీనారాయణుల గోత్ర ప్రవరలైన అచ్యుత, సౌభాగ్య గోత్రాలు చెప్పి, శ్రీసీతారామచంద్రుల నామాలతో, శ్రీరామచంద్రస్వామినే వరాయ అంటూ కళ్యాణ తంతు ముగించారు. చాలా ఆనందం కలిగిందని చెప్పాలి. వినరో భాగ్యము...విష్ణు కథా...

ప్రముఖ  కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గుర్తుకు వచ్చారు. వారి 'కృష్ణపక్షం' లోని స్వేచ్ఛాగానం, ఆసక్తికరమైన, అహరహం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన పంక్తి ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ... నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు’ కూడా పదే పదే గుర్తుకువచ్చింది. లోకం ఏమనుకున్నా, ఇతరులు నవ్వినా సరే, తన ఆశయానికి, అభిరుచికి కట్టుబడి, దేనికీ భయపడకుండా తనదైన బాటలో సాగిపోవాలనే దేవులపల్లివారి నిశ్చయాత్మక భావనను ఈ వాక్యం తెలుపుతుంది. ఇతరుల విమర్శలు, హాస్యాన్ని పట్టించుకోకుండా తన ఇష్టానుసారం జీవించడమే దీని వాస్తవిక భావం. దేవులపల్లిగారి వ్యక్తిగత స్వేచ్ఛను, నిర్భయత్వాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛాగానం. విశేషమేమిటంటే, ఈ వాక్యాన్ని సామాజిక, రాజకీయ సందర్భాల్లో విమర్శలను లెక్కచేయని ధోరణిని తెలపడానికి ఉపయోగించడం తరచు జరుగుతుంది. అన్వయించుకునేవారిని బట్టి అర్థాలుంతాయి!!!

ఇంకో విషయం కూడా గుర్తుకొచ్చింది. అది, రాముడికి, భరతుడికి మధ్య చిత్రకూటంలో జరిగిన సంభాషణను రామాయణం అయోధ్యకాండలో పేర్కొన్న విధానం. ‘కార్య నిర్వహణలో పురుషుడే స్వతంత్ర కర్త అన్న అభిప్రాయం సరైంది కాదని, పురుషుడు తన ఇష్టానుసారం లోకంలో సంచరించే స్వాతంత్ర్యం కలవాడుకాదని, దైవం పురుషుడిని ఈ పక్కకు, ఆ పక్కకు లాగి బాధిస్తుందని, పురుషుడే స్వతంత్రుడైతే, ఎప్పుడూ తన శ్రేయస్సునే కోరుకుంటూ, ఏహాని రాకుండా చేసుకోవచ్చని, ఏపనికైనా, ఏదితలపెట్టినా పురుష ప్రయత్నం చాలక కాదని, అన్నిటికీ దైవమే కారణమీ, అలా అని ప్రయత్నం చేయడం ఆపకూడదని, ‘ప్రయత్నించు, ప్రయత్నించు, లక్ష్యం సాధించినదాకా ప్రయత్నించు’ అనేది అచంచలమైన పట్టుదలకు, నిరంతర కృషికి చిహ్నమని భావించాలని’ ఆ సందర్భంలో రాముడు భరతుడికి చెప్పినదాని సారాంశం. దీన్ని కూడా ఎలాగైనా అన్వయించుకోవచ్చు. అర్థమూ చేసుకోవచ్చు.

అలాగే నాస్తికుడని భావించిన జాబాలికి మంచిమాటలు చెప్పాడు రాముడు. ‘ప్రజలకు సత్యమే ఆత్మ. సత్యాన్ని విడిచిపెడితే జీవుడు విడిచిన శరీరం అవుతుంది. సర్వ జగాలకు సత్యమే ఆధారం. సత్యమే శ్రేష్ఠం. మోక్షాన్ని కోరేవాడు సత్యాన్నే పలకాలి. సత్యమే లక్ష్మీవాసస్థానం. ప్రపంచానికంతా సత్యమే నియంత. సత్యానికి లోబడి ప్రపంచం నడుస్తున్నది. సత్యమే ప్రపంచం నిలబడడానికి మూలాధారం. మోక్షప్రాప్తికి సాధనం. సత్యాన్ని మించింది ఏదీ లేదు. దానం, హోమం, వేదం, ధ్యానం, తాపం, నిష్ఠ, యాగం, ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించి వుంటాయి. సత్యం విడిచిన వారికి ఇవేవీ పనిచేయవు. కాబట్టి ప్రతివారూ సత్యమే ప్రధానంగా కలవాడు కావాలి.’

అసలు విషయం: సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, ఇవన్నీ ఉద్యోగాలే. మనుష్యులలో ఎవరే సంకల్పంతో ఏ కర్మ చేస్తాడో, ఆచరిస్తాడో, ఆ కర్మఫలంగా వాడే ఉద్యోగ పదవికి అర్హుడో వారికా పదవి ఇవ్వడం జరుగుతుంది. వీరంతా కొంతకాలం ఆ పదవుల్లో వుండి వేరేవారికి స్థానం కలిగిస్తారు. బ్రహ్మ రుద్రేంద్రాది పదవులన్నీ కర్మఫలాలే. ఫలదాత భగవంతుడైన విష్ణువే. భగవంతుడైన విష్ణువు తానే సృష్టికర్తగా సృజించుకుంటున్నాడు. పాలించేవాడై రక్షించుకుంటున్నాడు. సంహరించేవాడై సంహరింప బడుతున్నాడు. మనమెంత, మన పాండిత్యమెంత? మన అవగాహన ఎంత? ఏది, ఏపదవి శాశ్వతం.

         జాబాలి తాను నాస్తికుడిని కాదని, నాస్తికోక్తులను చెప్పనని, నాస్తి అనేది లోకంలో లేదని, సర్వం అస్తియే అని, రాముడికి చెప్పాడు. నాస్తికవాదం చేయడానికి కారణం, ధర్మానికి అపాయం సంభవించినప్పుడు, న్యాయంగానో, అన్యాయంగానో, ధర్మం చెడిపోకుండా కాపాడడం ఆపద్ధర్మమని స్పష్టం చేశాడు. తానే నాస్తికుడి నైతే దశరథుడు, వసిష్ఠాదులు ఎలా చేరదీసేవారని, నాస్తికవాదం చేసే వారిని తానే ఖండిస్తానని, ధర్మానికి హాని కలిగినప్పుడు ఎలాగైనా ధర్మ స్థాపన చేయాల్సి వస్తే, అప్పుడు నాస్తికవాదన తప్పక చేస్తానని గట్టిగా చెప్పాడు. ఒక పని నెరవేరాలంటే ఎన్ని విధాల ప్రయత్నించినా తప్పులేదన్నాడు. ఇక్కడ సందర్భం నాస్తిక వాదనైనా, రాముడులాంటివాడికే జాబాలి ధర్మం గురించి చెప్పదలచుకున్నాడంటే, ఎవరైనా తప్పుచేశారని మనం భావిస్తే ‘సరిదిద్దుకో అనడం పొరాపాటుకాదు. అలాగే రాముడంతటి వాడే జాబాలిని తప్పుగా భావించాడు.

          అప్పుడు వసిష్ఠుడు, తప్పొప్పులు తెలుసుకోవడమనే అంశాన్ని విజ్ఞానపరమైన కోణంలో అద్భుతంగా వివరించాడు.  ‘ఈ ప్రపంచం పుట్టుక ఆశ్చర్యకరం. బ్రహ్మాండమంతా జలంతో నిండి ఒక సముద్రంగా వున్నప్పుడు భూమి సృష్టించబడింది. పరబ్రహ్మం వల్ల దేవతలు, బ్రహ్మ కలిగారు. భూమి నీట్లో మునుగుతున్నప్పుడు విష్ణువు ఆదివరాహమై తన కొమ్ముతో దాన్ని పైకెత్తాడు. అప్పుడు అవ్యయుడు, నిత్యుడు, పరబ్రహ్మం వల్ల కలిగిన బ్రహ్మ తన కొడుకులైన మరీచ్యాదులతో ప్రపంచమంతా వ్యాపించాడు. ఆకాశమే పరబ్రహ్మం. ఆకాశమంటే సర్వత్రా ప్రకాశించేది. ఈ ప్రపంచం ప్రళయకాలంలో చీకట్లో మునిగి వుండేది. ఆ కాలంలో మహదాది అయిన ప్రకృతి సూక్ష్మ ప్రకృతైన తమస్సులో లీనమై తమస్సు భగవంతుడితో ఏకీభావంగా వుండేది. ఈ కారణం వల్ల అది ప్రత్యక్ష ప్రమాణానికి అగమ్యంగా, చీకట్లో వస్తువులు కళ్లకు కనబడని విధంగా, ఇది ప్రపంచమని గుర్తించగల చిహ్నాలు లేకుండా, శబ్దం వల్ల కూడా తెలియకుండా అంతా నిద్రావస్తలో వున్నట్లుండేది.’

         ‘భగవంతుడు అవ్యాకృతాత్ముడై రూపం, నామం, క్రియ లేనివాడై కొంతకాలం వుండి, మళ్లీ సృష్టిని సంకల్పిస్తాడు. ఆ సంకల్ప శక్తివల్ల ప్రకృతి క్షోభిల్లుతుంది. అప్పుడు మళ్లీ ఒకదానిలో నుండి ఇంకొకటి పుట్తాయి. ఈ విధంగా తమస్సు, ప్రకృతి, మహత్తు, అహంకారం, ఆకాశతన్మాత్రం, అగ్ని, జలతన్మాత్రం, జాలం, పృథివీ, పృథివినుండి ఔషదులు, వరుసగా ఉద్భవిస్తాయి. ఇది పరిణామం. Evolution అంటారు. మొదలు జరిగేది విపరిణామం. Involution. విపరిణామం చాప చుట్టడం లాంటిది కాగా, పరిణామం చాప విప్పి పరచడం లాంటిది. ఇవన్నీ వాటంతట అవే కావు. ప్రకృతి జడం కాబట్టి దానంతట అది పరిణామం చెందలేదు. జీవుడు కర్మబద్దుడైనందున, ఆకాలంలో ప్రకృతిలో కలసి వున్నందున అతడికి ఆ శక్తిలేదు. కాబట్టి ఇవన్నీ చేసేవాడు భగవంతుడే!’ ఈ విధంగా సర్వం భగవంతుడే అని అర్థం అవుతున్నది. అంతా నేనే, మేమే అనుకునేవారు నిమిత్తమాత్రులే.

          వసిష్ఠుడు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు: ‘బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి భాస్కరుడు, భాస్కరుడికి మనువు, మనువుకు ఇక్ష్వాకుడు పుట్టారు. అయోధ్యను మనువు ఇక్ష్వాకుడికి ఇచ్చాడు కాబట్టి శ్రీరాముడి వంశానికి ఇక్ష్వాకుడే మూలపురుషుడు. అతడికి కుక్షి, ఆ కుక్షికి వికుక్షి, అతడికి బాణుడు. బాణుడికి జన్మించిన సత్యధర్మ నిష్ఠుడు అరణ్యుడే రావణుడితో యుద్ధం చేసి శపించాడు. అరణ్యుడికి బృథువు కలిగాడు. అతడి కుమారుడే (సత్యవ్రతుడు) త్రిశంకుడు. త్రిశంకుడికి ధుంధుమారుడు లేదా యువనాశ్వుడు, అతడికి మాంధాత పుట్టారు. మాంధాత కొడుకు సుడంది. అతడి కొడుకులు ధ్రువసంధి, ప్రసేనజతుడు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతడి కొడుకు అసితుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. వారిలో ఒకామె (కాళింది) గర్భవతిగా వున్నప్పుడు సవతి విషం పెట్టింది. ఆమెకు చ్యవనుడనే ముని వంశాన్ని ఉద్ధరించే సజ్జన స్తోత్రుడైన కొడుకు పుడుతాడని దీవించాడు.’

         ‘కాళిందికి బ్రహ్మతో సమానుడైన సగరుడు పుట్టాడు. సముద్రాన్ని తవ్వించాడు. ఆయన కొడుకు అసమంజుడుకి అంశుమంతుడు పుట్టాడు. అతడికి దిలీపుడు, అతడికి భగీరథుడు, ఆయనకు కకుథ్సుడు, ఆతడికి రఘువు, అతడికి కల్మాషపాదుడు పుట్టారు. కకుథ్సుడు పేరుమీదే శ్రీరాముడి వంశంవారిని కాకుథ్సులు అని పిలుస్తారు. కల్మాషపాదుడి కొడుకు శoఖనుడు, అతడి కొడుకు సుదర్శనుడు. సుదర్శనుడికి నహుషుడు, నహుషుడికి, నాభాగుడు, అతడికి అజుడు, సువ్రతుడు పుట్టారు. అజుడి కుమారుడు దశరథుడు. ఆయన కొడుకుల్లో శ్రీరాముడు పెద్దవాడు.’ ఇదీ వశిష్టుడు చెప్పిన శ్రీరామచంద్రుడి వంశక్రమం. ఇవన్నీ అప్పుడు, ఆయన చెప్పడానికి కారణం, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారిలో వంశపరంపరంగా పెద్దవాడే రాజవుతున్నాడు కాబట్టి, వంశధర్మాన్ని అనుసరించి, రాముడిని రాజ్యాభిషేకానికి అంగీకరించి ప్రజలను పాలించమని చెప్పడానికే.

అయోధ్యకాండలో ఇవన్నీ చదువుతుంటే, రామ జన్మభూమి అయోధ్య చారిత్రక వివాదంపై అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010 న ఇచ్చిన ‘చరిత్రాత్మక సెక్యులర్ తీర్పు’ కూడా గుర్తుకు వచ్చింది. అప్పటి త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ యూ ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్ వేర్వేరుగా తీర్పులు ఇచ్చినప్పటికీ, అనేక అంశాలపై ఏకీభవించారు. వారి తీర్పులో న్యాయమూర్తులు అనేక ఆధారాలను చూపిస్తూ, కొన్ని  ఉదాహరణలను హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత భాషల్లో ఉటంకించారు. వేదాలు, పురాణాల ఉదాహరణలు తీర్పులో చోటుచేసుకున్నాయి. మాకే ఎంతో తెలుసు అనుకునే మేథావులు ఆ తీర్పు చదవాలి.

కార్ల్ మార్క్స్ లాంటి మహనీయుల ప్రస్తావన కూడా వుంటుంది అక్కడక్కడ. వారు చదివిన తీర్పు ముందు, వెనుక పేర్కొన్న దాంట్లో ఆసక్తికరమైన, పరిశోధనలకు కావాల్సిన అనేకానేక విషయాలున్నాయి. ఎనిమిదివేల పేజీల పైనున్న ఆ తీర్పు పాఠం ‘ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం’ అనవచ్చేమో. యావత్ ప్రపంచానికి అందులోని ప్రధానాంశాలను కూర్చి పంచాలి. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, ఫ్రెంచ్, టర్కీ భాషలలోని చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పురా తత్వ శాస్త్రం, ప్రాచీన శిల్ప శాస్త్రం, మతపరమైన విషయాలకు సంబంధించిన అనేక గ్రంధాలను, అసంఖ్యాకమైన ప్రాచీన హస్త కళా కృతులను పరిశీలించామన్నారు న్యాయమూర్తులు.

వాగ్మూలంలోని ఒక ప్రధాన అంశాన్ని ప్రస్తావించారు న్యాయమూర్తులు: ‘భగవదవతారమైన శ్రీరాముడు త్రేతాయుగాంతంలో, ద్వాపర యుగారంభంలో అవతరించారని, శిష్ట రక్షణ కొరకు మానవాకారంలో అవతరించిన భగవంతుడాయనని, ఆయన గుణగణాలను, సమకాలీనుడైన వాల్మీకి మహర్షి రామాయణంలోను, తర్వాత వ్యాస మహాభారతంలోని రామోపాఖ్యాన పర్వంలోను, పురాణాల లోను, ఇతిహాసాల లోను, కౌటిల్యుడి అర్థశాస్త్రం లోను, కాళిదాసు రఘువంశం లోను, భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లోను ప్రస్తావించారని, గోస్వామి తులసీదాస్ రచించిన "రామ చరిత్ర మానస్" లోను ప్రస్తావించడం జరిగింది.’ ఎంత పరిశోధన జరిగిందో?

అలాగే, స్వామి వివేకానంద రచనలు, ఆనంద రామాయణం, వాల్మీకి రామాయణం, రామ చరిత్ర మానస, భగవద్గీత, కాళిదాసు రఘువంశం, అధర్వ వేద సంహిత, రుగ్వేదం, రుగ్వేద సంహిత, సామవేదం, శుక్ల యజుర్వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు, బృహస్పతి స్మృతి, మను స్మృతి, ధర్మశాస్త్రాలు, మత్స్య పురాణం, మేఘ దూత, నారదీయ ధర్మ శాస్త్రం, నారద స్మృతి, పురుష సూక్తం, శాకుంతలం, శుక్రనీతి, స్కంద పురాణం, యాజ్ఞవల్క్య స్మృతి లాంటివి వున్నాయి. ఇదీ, అదీ అనిలేదు. విజ్ఞాసర్వస్వాలన్నీ చదివారనాలి.

జస్టిస్ సుధీర్ అగర్వాల్ ఇదో ‘జైగాంటిక్, హెర్క్యూలియన్ టాస్క్’ అని వర్ణించారు. తన తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు. ‘ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!’ అని మొదలవుతుందా శ్లోకం. చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు వున్నారో, లేరో తెలియనందున రాత్రి, పగలు తేడా లేదని అంటూ, ఆ సమయంలో ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు.

‘సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు (తెలుసును అనుకున్న పండితులకు కూడా!), మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?’ అని అన్నారాయన.

జస్టిస్ ఎస్ యు ఖాన్ తీర్పు ఆరంభం చేసిన విధానం అది చదివినవారికే తెలుస్తుంది. అవతారిక, ముందుమాటలతో ఆరంభించారాయన. తీర్పు పాఠం మధ్యలో కార్ల్ మార్క్స్ ప్రస్తావన తెచ్చారు. చరిత్ర గమనానికి భాష్యం చెప్పిన మార్క్స్ వాదనను కేవలం ఆర్థిక స్థితిగతులకు మాత్రమే అనుసంధానం చేయడం సబబు కాదంటారు. ఆయన ప్రవచించిన విధానంలో పాక్షికంగానైనా వాస్తవం లేదని వాదించడం అపాయ కరం (పెరిలియస్) అంటారు. రాముడంటే త్యాగానికి మారు పేరని, ఆయన గుణగణాల్లో త్యాగానికే ప్రాధాన్యత అధికమని అంటారు జస్టిస్ ఖాన్. అందుకే, ఇందుకే, శ్రీరామచంద్రమూర్తికి, సీతాదేవికి, శ్రీరామనవమినాడు భద్రాచలంలో కల్యాణమంటే ఆబాలగోపాలానికి ఆధ్యాత్మికతతో కూడిన ఆసక్తి. ప్రవరలు, గోత్రాలు పట్టించుకునే ఆలోచన కూడా రాదు. ఇంకా చెప్పాలంటే, ఆలోచన కలగకుండా చేశారు అర్చక మహాశయులు. ధన్యవాదాలు.

No comments:

Post a Comment