నివాసాలు దూరమైనా
అప్పటికీ, ఇప్పటికీ అదే స్నేహం, ఆప్యాయత
వనం జ్వాలా నరసింహారావు
(జూన్ నెల 15, 2026)
ఉద్యోగరీత్యా హైదరాబాద్ నగరంలోనే స్థిరపడిన మాకు, (నా 78
సంవత్సరాల, మా శ్రీమతి 73 సంవత్సరాల వయసులో) ఐదారు
దశాబ్దాల క్రితంనాటి మధురాతి మధురమైన రోజులు మళ్లీ రావని అనిపిస్తుంది. అప్పటి ‘బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు’ తలచుకుని, వర్తమాన
పరిస్థితులతో పోల్చుకుంటే, మార్పు సహజమే అయినా, కించిత్
ఆవేదన అంతరాంతరాలను కలచివేస్తుంటుంది. ఈ
నేపధ్యంలో, మా శ్రీమతి అక్కగారి కూతురు చినపాప (సత్యవతి) నిన్నటి రోజున మా
ఇంటికి వచ్చిన సందర్భంగా,
భోజనాల బల్ల దగ్గర వారిరువురి మధ్య మొదలైన మాటలు, నలభై, యాభై సంవత్సరాలు వెనక్కి
తీసుకెళ్లాయి. వారి మాటల్లో కేవలం ఇద్దరు సమీప బంధువుల పలకరింపు మాత్రమే లేదు. ఒక తరం జీవించిన అపురూపమైన జీవనశైలి
ఉంది. ఒక అపూర్వమైన స్నేహగాథ ఉంది. ఈనాటి
తరానికి దాదాపు ఊహకే అందని మానవ సంబంధాల గోరువెచ్చదనం ఉంది. కేవలం వారి సంభాషణ
అక్షరీకరణే ఈ రాత. వడబోత,
స్వంత కవిత్వం లేనేలేని రాత.
ఉద్యోగరీత్యా 1974 ప్రాంతంలో నేను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మేము చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్ ప్రాంతాలలో ఉండేవాళ్లం. అలాగే, అశోక్‌నగర్ పరిసర ప్రాంతాల్లో మా బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరిగా వచ్చి స్థిరపడుతున్న సందర్భం కూడా అది. భండారు శ్రీనివాసరావు -నిర్మల దంపతులు, గీత-వనం రంగారావు కుటుంబం, తరువాత మా ఆవిడ అక్క కూతురు చినపాప (సత్యవతి) - ప్రసాద్ దంపతులు, భండారు రామచంద్రరావు కుటుంబం (భార్య విమలాదేవి), డాక్టర్ అయితరాజు మనోహర్ రావు (భార్య ఉష), మరి కొన్నాళ్లకు ఆయన అన్నగారు డాక్టర్ అయితరాజు రంగారావు (భార్య కరుణ) కుటుంబాలు కూడా హైదరాబాద్ వచ్చి అదే పరిసరాలలో అద్దె ఇళ్లల్లో వుండేవారు. మరికొంత మంది ఆత్మీయులు కూడా అదే పరిసరాల్లో నివసించడం వల్ల మా కుటుంబాల మధ్య అనుబంధం మరింత బలపడింది.
మేమంతా ముందు వెనుకల హైదరాబాద్ వచ్చిన మొదట్లో చాలా సంవత్సరాల దాకా, మా సమీప బంధువులు, ఒక్కోసారి ఉన్నతాధికారులైన వారి స్నేహితులు, మా ఇళ్లల్లో (చిన్న రెండు-మూడు గదులే) ఎలాంటి సౌకర్యం లేకపోయినా వుండి, మాతోపాటే తిని, పనైన తరువాత వెళ్లిపోయేవారు. అదొక తరహా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి బందు వ్యవస్థ.
నాది
భెల్ (BHEL) హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్‌గా చిన్న ఉద్యోగం. నా చిన్ననాటి సహాధ్యాయి, తరువాత కాలంలో నా భార్యకు చిన్న మేనమామగా పరిచయమైన భండారు శ్రీనివాసరావు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తా విభాగంలో విలేఖరిగా ఉద్యోగం. వనం రంగారావు నాకు కళాశాల సహాధ్యాయి, సమీప బంధువు, క్రికెట్ సహా ఆటగాడు, SBH ఉద్యోగి. ఎస్ హెచ్ ప్రసాద్ సెంట్రల్ బాంకులో సీనియర్ అధికారి. భండారు రామచంద్ర రావుగారు SBI లో ఉన్నతాధికారి. ప్రొబేషన్ అధికారిగా చేరి, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి.
శ్రీనివాసరావు దంపతులది ఎన్ని విధాలో, అరమరికలు లేకుండా అందరికీ సహాయపడే మనస్తత్వం. అప్పట్లో ఏచిన్న సమస్య వచ్చినా పరిష్కారం దొరికేది
శ్రీనివాసరావు చేయి వేయడంతోనే. భార్య నిర్మల కూడా అంతే. రెండాకులు ఎక్కువే అనాలి. గీత పుట్టి పెరిగినది హైదరాబాద్ కావడాన తెలివితేటల పరంగా అభినందించాల్సిన వ్యక్తి. విమలాదేవి ఆడవారందరిలో పెద్ద. వయసులో అందరికంటే చిన్నదైన చినపాపకు,
కిరాణా సామాన్ల దగ్గర నుండి, స్టీల్ సామాన్ షాపు వరకు ఏ దుకాణంలోనైనా అప్పు
ఇప్పించే సామర్థ్యం వుండేది. తన దగ్గర డబ్బులు వున్నా, లేకపోయినా ఎవరడిగినా
కాదనకుండా సర్దే సంస్కారం మెండుగా వున్న పెద్దమనసు. చిన్నా- పెద్దా, అందరికీ అన్ని
రుగ్మతలకూ వైద్యుడు డాక్టర్ అయితరాజు మనోహర్ రావు. ఆయన అన్నగారు డాక్టర్ అయితరాజు రంగారావు, చివరగా హైదరాబాద్ కు
వచ్చినప్పటికీ,
ప్రతివారికీ
సహాయం చేయడానికి అందరికంటే ముందు వరసలో వుండేవాడు. ఇలా..ఇలా.. మా కుటుంబాలన్నీ ముందు వెనుకల హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయినాము.
అయితే మా కుటుంబాలన్నింటినీ ఒకే దారంతో కట్టిపడేసిన అసలైన (మహిళా) శక్తి మా ఇంటి ఆడవాళ్లే. మా ఆవిడ, చినపాప, దుర్గత్తయ్య (అమ్మఒడి), గీత, విమలత్తయ్య: ఈ ఐదుగురి స్నేహం గురించి ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. వీరి మధ్య బంధుత్వం ఎంత ఉందో, స్నేహం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేది. పిల్లలు స్కూలుకు, భర్తలు ఆఫీసులకు వెళ్లిపోయాక, అరగంటలో చినపాప మా ఇంటి గుమ్మం దగ్గర ప్రత్యక్షమవడం దాదాపు నిత్యకృత్యం. సమయపాలన అంటే ఏమిటో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. ఉదయం పది గంటలకల్లా వచ్చేసేది. మా ఆవిడ చినపాపతో కబుర్లు చెపుతూనే, ఇంటి పనులు ముగించుకుని, ఇద్దరూ కడుపునిండా భోజనం చేసి బయలుదేరేవారు. కొద్దిసేపట్లో దుర్గత్తయ్య ఇంటికి చేరేవారు. అక్కడ ఆమె ఎంత బిజీగా వున్నా, అదంతా వీరిద్దరూ వచ్చేవరకే. పనుల అప్పగింతలు
పూర్తి చేసి బజారు షికారుకు సిద్ధంగా వుండేది.
అక్కడి నుంచి పక్క ఇంట్లో వుండే గీత కూడా జతకలిసేది. అలా నలుగురి ‘చిక్కడపల్లి బజారు జైత్ర యాత్ర’ విజయవంతంగా మొదలయ్యేది. వాళ్లకు ముందుగా నిర్ణయించిన ఎజెండాలు ఉండేవి కావు. ఎలాంటి రూట్ మ్యాప్ లేదు. ఏం కొనాలి, ఎంత కొనాలి, ఎందుకు కొనాలి అనే లెక్కలు కూడా ఉండేవి కావు. ఏ దుకాణం ముందుగా కనిపిస్తే అది మొదటి గమ్యం. చెప్పులు కుట్టించే దుకాణం కనిపిస్తే అక్కడ ఆగేవారు. పిల్లల యూనిఫారం షూస్ (కొత్తవి కొనడం కుదిరేదాకా)
బాగు చేయించేవారు. కిరాణా షాపు కనిపిస్తే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేవారు. లక్ష్మీ షోరూం కనిపిస్తే చీరెలు చూసేవారు. స్టీల్ సామాను దుకాణం కనిపిస్తే అటు మళ్లేవారు. బాంగిల్స్ షాప్ కనిపిస్తే ఇక ఆటే కాసేపు. కొనుగోలు వెనుక పెద్ద అవసరం ఉండకపోవచ్చు. కానీ కలిసి తిరగడంలో, చూసి ఆనందించడంలో లభించే సంతృప్తి మాత్రం అమూల్యం.
ఈనాటి మాల్స్, ఆన్‌లైన్ షాపింగ్‌లు, డిజిటల్ చెల్లింపుల యుగంలో పెరిగిన వారికి ఇది విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఆ రోజుల్లో జేబుల్లో డబ్బులు ఎక్కువగా లేకపోయినా, మనసుల్లో ఉదారత మాత్రం అపారంగా ఉండేది. ఒకరి దగ్గర డబ్బులు తక్కువైతే ఇంకొకరు చెల్లించేవారు. ఎవరు ఎంత ఇచ్చారనే లెక్కలు ఎవరూ పెట్టుకునేవారు కాదు. రిక్షా ఎక్కాల్సి వస్తే నలుగురూ (ఐదుగురూ?) ఒకే రిక్షాలో ఇరుక్కుని కూర్చుని నవ్వుకుంటూ వెళ్లేవారు. బాడుగ ఎవరు కట్టారన్నది మరుసటి రోజుకే మర్చిపోయేవారు. మధ్యలో ఆకలి వేస్తే సుధా హోటల్‌లో ఒక ప్లేట్ ఇడ్లీ, అర ప్లేట్ పూరీ, ఒక దోశ,
ఏదో ఒకటి పంచుకుని తినేవారు. ఆ పంచుకోవడంలోనే రుచి ఉండేది. ఇప్పటిలాగా ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఆర్డర్, బిల్లు, జీవితం అప్పట్లో లేదు. సంతోషం కూడా ఉమ్మడిగానే ఉండేది.
అలా తిరుగుతూ తిరుగుతూ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విమలత్తయ్య ఇంటికి చేరేవారు. ఆమె అందరికీ అత్తయ్యే. దుర్గ కూడా అందరికీ అత్తయ్యే. తలుపు తట్టేలోపే లోపల నుంచి స్వాగతం సిద్ధంగా ఉండేది. వేడివేడిగా ఫిల్టర్ కాఫీ చేతికి అందేది. తరువాత మొదలయ్యేవి ముచ్చట్లు. ఈనాటి భాషలో చెప్పాలంటే ‘గాసిప్’ అనొచ్చు. అప్పట్లో అది లోకాభిరామాయణం. కానీ వాటిలో ఎప్పుడూ పరనింద ఉండేది కాదు. ఆత్మస్తుతికి ఆస్కారం అసలే వుండకపోయేది. ఎవరి ఇంట్లో ఏం జరిగింది, ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చింది, ఎవరికి ఏ సంతోషం దక్కింది: అన్నీ ఇలాంటి విషయాలే.
మా ఆవిడ (ఇతరులు కూడా బహుశా) మాత్రం మధ్యాహ్నం మూడు గంటల సమయం అవుతూనే, ఆరు నూరైనా, నూరు ఆరైనా ఇంటికి చేరుకోడం తప్పనిసరి. కాసేపట్లో స్కూలుకు పోయిన పిల్లలు ఇంటికి చేరుకునే సమయం కాబట్టి అప్పటికల్లా అవసరాన్ని బట్టి బస్సు దగ్గరికి పోవడమో, ఇంటికి వారు రాగానే వారికి కావాల్సినవి ఇవ్వడమో జరిగేది. ఇది రోటీన్. ఒక్కొక్క రోజున చినపాప సరాసరి విమలత్తయ్య ఇంటికి పోయేదట. వారిద్దరూ దుర్గత్తయ్య ఇంటికి చేరుకునే సమయానికి మా ఆవిడ, గీతా రంగారావు కూడా అక్కడికే చేరుకునేవారు. మళ్లీ ఆరోజు ప్రస్తానం మొదలయ్యేది. షరా మామూలే. ఒక్కోరోజున కూరగాయలు కూడా కలిసే కొనేవారు.
శనివారం మా అబ్బాయి బేగంపేట పబ్లిక్ స్కూల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటన్నరకే బస్సులో అశోక్ నగర్ చేరుకునేవాడు. వీరి స్నేహం ఎలాంటిది అంటే, నలుగురూ, లేదా ఒక్కోనాడు ఐదుగురూ, అంతా కలిసి మా అబ్బాయి బస్సు వచ్చే సమయానికి బస్ స్టాప్ దగ్గర వుండేవారు రిసీవ్ చేసుకోవడానికి. ఆ సందర్భాన్ని కూడా వృధా చేయకుండా ‘ముచ్చట్లలో’ కాలక్షేపం చేసేవారు. బహుశా అప్పటి వారి సంభాషణలను ఎవరైనా అప్పట్లో అక్షరీకరణ చేనట్లయితే బ్రహ్మాండమైన బృహత్ హాస్యరసభరితమైన పుస్తకం అయ్యేదేమో.
ఒకరి ఆనందాన్ని నలుగురూ ఆనందించేవారు. ఒకరి కష్టాన్ని నలుగురూ పంచుకునేవారు. ఆర్ధిక ఇబ్బందుల గురించి కూడా చెప్పుకోవాలి. ఆరోజుల్లో ఎవరికి ఏచిన్న ఆర్థికపరమైన సమస్య వచ్చినా బంధుమిత్రులు తమకు ఆదుకునే తాహతు అంతగా లేకపోయినా, వున్నదాంట్లోనే సర్దుబాటు చేసేవారు. అడిగేవారు కూడా మొహమాట పడకపోయేవారు. అవసరమైతే ఐదు రూపాయలు, పది రూపాయలు కూడా ఒకరికొకరు ఇచ్చి ఆదుకునేవారు. పాలసీసాలకు, ఆడపిల్లల పెళ్లిళ్లకు, ఆసుపత్రుల ఖర్చులకు, గాస్ సిలిండర్ కు, బంధువులు, స్నేహితులు డబ్బులు సర్దిన రోజులున్నాయి. అప్పట్లో ఆ చిన్న మొత్తాలకూ విలువ ఉండేది. కానీ వాటికంటే విలువైనది ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. అందరి జీతాలు అంతంత మాత్రమేకాని ఆప్యాయతలకు, అనురాగానికి కొదవలేదు. వారి స్నేహానికి ప్రతీకగా నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు మా ఆవిడ, చినపాప
సంభాషణ జ్ఞాపకాలలో చెక్కుచెదరకుండా ఉన్నాయి.
ఇదంతా ఒక ఎత్తైతే, మా కుటుంబాలకు పెద్దవారైన మా మామగారు, అత్తగారు, కలిసికాని, విడివిడిగా కానీ హైదరాబాద్ లొ కొన్నిరోజులు ఉండడానికి వచ్చిన సందర్భాలలో విశేషాలకు మరొ రకమైన ప్రాధాన్యత వుండేది. ఈ ఐదుగురు స్నేహితులకు కూడా వారిద్దరూ పెద్దవారు, సమీప బంధువులే. ఒకసారి మా ఆవిడ, మా అత్తగారు, చినపాప కలిసి బజారుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇంటి దగ్గర ఆటో ఆగగానే పనిమనిషి పరుగెత్తుకుంటూ వచ్చి, బయట ఆరేసిన చీరెలన్నీ దొంగ ఎత్తుకెళ్లాడని చెప్పింది. సహజంగా ఎవరైనా దిగ్భ్రాంతికి గురవుతారు. కానీ మా అత్తగారు మాత్రం ఎంతో ప్రశాంతంగా, ‘పోయిన చీరెలు తిరిగి రావు కదా! వాటికోసం ఎందుకు బాధపడాలి?’ అని చెప్పి ఆటోను ముందుకు సాగమన్నారు. ఆ ఒక్క మాటలో జీవితం మొత్తాన్ని తేలికగా తీసుకునే ఒక గొప్ప తత్వం దాగి ఉంది. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా నెమరేసుకున్నారు
ఇద్దరు. సరే, మధ్యలో నవ్వులు కూడా.
మరోసారి గాంధీనగర్ దగ్గర ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్లడానికి మా ఆవిడ, దుర్గత్తయ్య, చినపాప సిద్ధమయ్యారు. వారితో పాటు మా అత్తగారు కూడా వస్తానన్నారు. ఇటీవలే ఆమెకు శస్త్రచికిత్స జరిగినప్పటికీ, ఇంట్లో కూర్చోవడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. మార్గమధ్యంలో డాక్టర్ మనోహర్‌రావు కనిపించి, ‘ఇప్పుడే ఆపరేషన్ అయ్యింది. అమ్మను తీసుకెళ్లకుండా ఉండాల్సింది’ అని సరదాగా మందలించారు. ఆ మాట విన్నాక అందరూ నవ్వుకున్నారు. ప్రేమతో చెప్పిన మందలింపులకూ ఆ రోజుల్లో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉండేది.
చినపాపతో మా ఆవిడకు జరిగిన సంభాషణలో మరో సరదా జ్ఞాపకం కూడా వెలుగులోకి వచ్చింది. ఒకసారి మా మామగారు రాంరావుగారు వారి ఇంటికి వెళ్లారు. భోజనం చేయమని చినపాప ఆహ్వానించింది. సాధారణంగా ‘NO’ అనే అలవాటు లేని ఆయన సరే అన్నాడు. ఆమె ఎంతో శ్రద్ధగా చేసిన బెండకాయ కూరను వడ్డించింది. కానీ కూరలో ఉప్పూ, కారమూ సరిగా లేకపోవడంతో మామగారు తనదైన శైలిలో చినపాప ‘నలభీమ పాకాన్ని’ సందర్భోచితంగా, సరదాగా వ్యాఖ్యానించారు. ఆ మాటను చినపాప మనసుకు పెట్టుకోలేదు. నవ్వుకుంటూ స్వీకరించింది. బహుశా ఆ సంఘటన వల్లేనేమో, తరువాత ఆమె చేసే బెండకాయ కూరకు కుటుంబమంతా అభిమానులయ్యారు. (వాస్తవానికి రాంరావుగారు అన్నమాటలు: నోరు లేని మొగుడు-ప్రసాద్- కాబట్టే నువ్వు కూర ఎలా చేసినా అదే రుచిగా తినిపోయాడు పాపం’)
ఈ ఐదుగురి స్నేహం కేవలం షాపింగ్‌లు, కాఫీలు, ముచ్చట్ల వరకే పరిమితం కాలేదు. ఎవరి ఇంట్లో పండుగ జరిగినా మిగతావాళ్లు ముందుండేవారు. సత్యనారాయణ వ్రతం అయినా, చిన్న శుభకార్యం అయినా, పిల్లల పుట్టినరోజు అయినా, కొత్త ఇంటి గృహప్రవేశం అయినా, తమ స్థోమతకు తగ్గట్టు బట్టలు, బహుమతులు తీసుకెళ్లడం వారి సంప్రదాయం. ఎవరి ఇంట్లో అనారోగ్యం వచ్చినా మిగతా నలుగురూ అక్కడే ఉండేవారు. ఎవరైనా ఆసుపత్రిలో చేరినట్లు తెలిస్తే బంధువులు కానీ, స్నేహితులు కానీ, తక్షణం హాజరవ్వాల్సిన పనులను పక్కన పెట్టి, వెళ్లి పరామర్శించి వచ్చేవారు. ఆపరేషన్ లాంటిది జరుగుతే ఆద్యంతం థియేటర్ ముందే వుండిపోయి పేషంట్ భర్తకో, భార్యకో, తల్లిడంద్రులకో ధైర్యం చెప్తూ, అవసరమైతే రాత్రుళ్లు తోడుగా వుండేవారు. భౌతికంగా, మానసికంగా, చేతనైన విధంగా సహాయం చేసేవారు. ‘నీ సమస్య - నా సమస్య’ అనే భావన సహజంగా ఉండేది.
అలా సంవత్సరాలు గడిచాయి. దశాబ్దాలు మారాయి. పిల్లలు పెద్దయ్యారు. ఉద్యోగాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోయారు. ఇళ్లు దూరమయ్యాయి. వయసులు పెరిగాయి. అవసరాలు మారాయి. కాలం తన పని చేసింది. కానీ కాలం చేయలేకపోయిన ఒక పని ఉంది: అదే, వారి స్నేహాన్ని మార్చడం. ఈరోజు ప్రతిరోజూ కలుసుకునే అవకాశం లేకపోవచ్చు. గంటల తరబడి నడుచుకుంటూ బజార్లు తిరిగే శక్తి లేకపోవచ్చు. ఒకే రిక్షాలో ఇరుక్కుని ప్రయాణించే పరిస్థితులు లేకపోవచ్చు. కానీ వారి మాటల్లో ఇప్పటికీ అదే ఆప్యాయత వినిపిస్తుంది. ఒకరి పేరు ప్రస్తావనకు రాగానే మరొకరి కళ్లలో వెలుగు కనిపిస్తుంది. శరీరాలు దూరంగా ఉన్నా, మనసులు మాత్రం ఇప్పటికీ అశోక్‌నగర్ వీధుల్లోనే కలిసి నడుస్తున్నట్టుంటాయి.
చినపాపతో మా ఆవిడ మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నది ఇద్దరి సంభాషణ మాత్రమే కాదు. ఒక కాలం ప్రతిధ్వనిని విన్నాను. లెక్కలు లేని అనుబంధాలను చూశాను. అవసరానికి తోడు నిలిచే స్నేహం ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేసుకున్నాను. నిజానికి కాలం మారింది. ప్రపంచం మారింది. మన జీవనశైలి మారింది. కానీ ఇలాంటి స్నేహాలు మాత్రం కాలాన్ని జయిస్తాయి. అందుకే నేటికీ వారి గురించి ఆలోచించినప్పుడల్లా నా మనసులో ఒకే భావన మెదులుతుంది: దూరాలు పెరిగాయి, వయసులు పెరిగాయి, పరిస్థితులు మారాయి. కానీ వారి మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకటే. చినపాప, బుజ్జి, దుర్గత్తయ్య, గీత, విమలత్తయ్యల స్నేహం ద్వారా ఒక తరం జీవన విధానం, ఆర్థిక సరళత, పరస్పర ఆదరణ, బంధాల విలువ ఎంతో సహజంగా ప్రతిబింబించాయి. వీరి అపూర్వ స్నేహానికి అభినందనలు.


No comments:
Post a Comment