Monday, June 29, 2026

‘హైదరాబాద్ గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం’ >>>> రజతోత్సవ, సావనీర్ ఆవిష్కరణ వేడుకలలో కొద్దిసేపు : వనం జ్వాలా నరసింహారావు

 ‘హైదరాబాద్ గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం

రజతోత్సవ, సావనీర్ ఆవిష్కరణ వేడుకలలో కొద్దిసేపు

వనం జ్వాలా నరసింహారావు

చరిత్ర కేవలం కాలగర్భంలో కలిసిపోయే సంఘటనల సమాహారం కాదు అది సమాజ గమనాన్ని సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందించే ఒక సజీవ వంతెన. సమాజ వికాసంలో భాగస్వాములవుతూ తమదైన ముద్రను వేసుకుంటూ సాగిపోయే సంస్థల ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. అటువంటి ఒక విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగిన సంస్థ జరుపుకున్న రజతోత్సవ వేడుక సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంగా సాగిన తీరు అభినందనీయం.

హైదరాబాద్ గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం అత్యంత అద్భుతంగా జరుపుకున్న రజతోత్సవ వేడుకలకు అలాగే ఆ సందర్భంగా రజతోత్సవ దీపికగా వెలువడిన సావనీర్ ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఒక మరువలేని అనుభూతి. శ్రీచక్ర ప్రింటర్స్ సౌజన్యంతో తమ్మిరాజు శేషు శ్రీదేవి దంపతుల ఔదార్య నైపుణ్యాలతో అత్యంత ఆకర్షణీయంగా ప్రచురితమైన రజత దీప్తి జ్ఞాపకాల వెలుగులు సావనీర్ ఆవిష్కరణ సభలో నిర్వాహకులు నాకు ఊహించని గౌరవాన్ని కలిగించారు. దీనిని జూన్ నెల 28, 2026 నాడు నేను చేసుకున్న పుణ్యంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సావనీర్ పేజీలను తిరగేస్తూ కనీసం కొంతమేరకైనా చదివితే ఈ సంఘం ఆవిర్భావ నేపథ్యం దాని ఆరోహణ క్రమం అలాగే ఈ శాఖకు చెందిన కొందరు మహనీయుల విశేషాలు స్పష్టంగా అవగతమవుతాయి. అదంతా సమకాలీన నడుస్తున్న చరిత్ర అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు.

ఈ కారణంగా ప్రప్రథమంగా అభినందించాల్సిన వ్యక్తి సావనీర్ ను అత్యంత ఆకర్షణీయంగా, విలువకట్టలేని విజ్ఞాన జ్ఞాపికగా తీర్చిదిద్దిన ప్రధాన సంపాదకుడు పున్నమరాజు ఉమామహేశ్వరరావు, ఆయన నిబద్ధత గల బృందం. సంఘం అధ్యక్షుడు బచ్చు పట్టాభి రామప్రసాద్, కార్యదర్శి అవసరాల ఏఎస్ రామారావు, మునుగంటి వెంకటరావు, బచ్చు ఎస్వీ పార్థసారథి, అవసరాల వేంకటరావు, మునుగంటి బీవీ రామకృష్ణతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు రాసిన కవితలు మినహా దాదాపు సావనీర్ లోని వ్యాసాలన్నింటినీ ఒంటిచేత్తో రాసిన వ్యక్తి ప్రధాన సంపాదకుడు పున్నమరాజు. తన ‘మనసులో మాట’ అనే పరిచయ వాక్యంతో మొదలుపెట్టి సుమారు ఏడెనిమిది వ్యాసాలు ఆయనే స్వయంగా రాశారు. సంపాదక బాధ్యత అంటే అలా-ఇలా ఉండాలి అని ఆయన సోదాహరణంగా నిరూపించారు.

సావనీర్ లోని కొన్ని అంశాలు విజ్ఞానపరంగా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ప్రస్తావించుకోవాలి. ఆరువేల నియోగులు అనే నియోగి బ్రాహ్మణులలో గోల్కొండ వ్యాపారులు ఒక శాఖ అన్నది వాస్తవమని బ్రౌణ్య నిఘంటువులో బ్రౌన్ పేర్కొన్న అంశాన్ని గోల్కొండ వ్యాపారుల పుట్టుపూర్వోత్తరాలు అనే శీర్షికన రాసిన వ్యాసంలో బచ్చు ఎస్వీ పార్థసారథి పేర్కొన్నారు. మరిన్ని చారిత్రిక ఆధారాలను ఉటంకిస్తూ ఆరువేల నియోగులలో కొందరు పన్నెండవ శతాబ్దం తరువాత గోల్కొండ ప్రాంతానికి వలసవచ్చి స్థిరనివాసం ఏర్పరచుకుని ప్రభుత్వ లెక్కలు చూసేవారని ఆయన రాశారు. గోల్కొండ వ్యాపారులు కాలానుగుణంగా స్మార్త సంప్రదాయం నుండి వైష్ణవ సంప్రదాయానికి మారారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బచ్చు ఎస్వీ పార్థసారథి తన వ్యాసంలో ప్రస్తావించారు. బ్రాహ్మణులలో వివిధ శాఖలు వారి వృత్తిని బట్టి, వారు నివసించే స్థలాన్ని బట్టి ఏర్పడ్డాయని ఆయన వివరించారు. వేదాధ్యయనం చేసి వైదిక సంప్రదాయాన్ని తరతరాలుగా పాటించిన బ్రాహ్మణులు వైదీకులు కాగా కరణాలుగా మంత్రులుగా సేనాపతులుగా నియోగి బ్రాహ్మణులు మరియు గోల్కొండ వ్యాపారులు రాణించారని పేర్కొన్నారు. అలాగే తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని ద్రావిడ బ్రాహ్మణులు అంటారని మహారాష్ట్ర ఉత్తర ప్రదేశ్ కర్నాటక మూలాలు కలిగిన వారిని దేశస్థ బ్రాహ్మణులు అని అంటారని ఆయన తన వ్యాసంలో స్పష్టం చేశారు.

ప్రధాన సంపాదకుడు పున్నమరాజు సావనీర్ వ్యాసాల పరంపర గోల్కొండ రాజ్య వైభవ నిర్మాతలు అక్కన్న మాదన్నలు అనే వ్యాసంతో ఆరంభమైంది. కాలగర్భంలో ఎందరి పేర్లో మరుగున పడినప్పటికీ తమ కార్యదీక్షతో ప్రజాహిత సంకల్పంతో రాజ్యాభివృద్ధికి చేసిన అసాధారణ సేవలతో అక్కన్న మాదన్నలు చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించారని ఆయన అద్భుతంగా రాశారు. గోల్కొండ వైభవ గాథలో వారి పేరు ఒక అధ్యాయం కాదు ఒక యుగం అని కొనియాడారు. అలాగే దాసభక్తికి నిదర్శనం భక్త రామదాసు అని అంటూ తన అచంచల విశ్వాసంతో శ్రీరాముడి కరుణను సాక్షాత్కరించిన మహాభక్తుడు భద్రాచల రామదాసు మనందరికీ ప్రాతఃస్మరణీయుడు అని పేర్కొన్నారు. చిరస్మరణీయ మహనీయుడు తూము లక్ష్మీనరసింహదాసు అని కూడా ఆయన అభివర్ణించారు.

ఒంటిమిట్ట రామదాసు వాసుదాసు అన్న శీర్షికతో ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి గురించి ఆయన చక్కగా వివరించారు. వాసుదాసు గారు వాల్మీకి రామాయణాన్ని నూట ఎనిమిది సార్లు నియమనిష్ఠలతో పారాయణం చేశారని పేర్కొన్నారు. అలాగే మందరం పేరుతో ఇరవై నాలుగు వేల పద్యాలుగా ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యథావాల్మీకంగా తెలుగులోకి అనువదించిన విషయాన్ని గుర్తుచేశారు. టెంకాయ చిప్ప చేతపట్టుకుని భిక్షాటన చేసి ఆ ధనంతో ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించిన వైనాన్ని వివరించారు. ఆయన జీవితమంతా ఆధ్యాత్మిక మార్గంలోనే గడిపారని చెబుతూ తెనాలి సమీపంలోని అంగలకుదురు నడిగడ్డపాలెంలో ఆయన స్థాపించిన వాసుదాస ఆశ్రమం ఉన్న విషయంతో పాటు ఇలా ఎన్నో విశేషాలను ఆయన గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించారు.

సావనీర్ లోని ఇతర ఆలోచనాత్మక, పరిశోధనాత్మక, ఆసక్తికరమైన వ్యాసాల గురించి కూడా చెప్పుకోవాలి. అందులో ‘గానకళా కిరీటి మునుగంటి’ ‘ద్విగళ జ్యోతి సీత సత్యవతి’ ‘బహుముఖ కళాతృష్ణ భానుమతి రామకృష్ణ’ ‘ఆయన కలం వజ్రాయుధం’ అంటూ అవత్స సోమసుందర్ గురించి పున్నమరాజు రాసిన వ్యాసాలు ఉన్నాయి. వీటితో పాటు ‘రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య’ ‘అక్షరశిల్పి అవసరాల’ ‘వాయులీన స్వర విహారి అవసరాల కన్యాకుమారి’ ‘గానకోకిల పి సుశీల’ ‘సంగీత వారధి డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం’ ‘అద్వితీయ కళాకారుడు పున్నమరాజు,’ ‘గోల్కొండ వ్యాపారుల చరిత్ర అభివృద్ధి’ వంటి ఎన్నో వైవిధ్యభరితమైన వ్యాసాలు ఇందులో చోటు సంపాదించుకున్నాయి.

ఆహ్లాదభరితంగా, రసవత్తరంగా, ఆత్మీయ పలకరింపుల మధ్య ఆనందదాయకంగా, నిర్వాహకుల నిబద్ధతకు పర్యాయపదంగా, సుమారు రెండు గంటలపాటు జరిగిన సభా కార్యక్రమానికి పూర్వరంగంలో అద్భుతమైన కూచిపూడి నృత్యం మధురమైన సంగీతాలాపన, సంఘం ఆవిర్భావ వ్యక్తుల జ్ఞాపకాల పరంపరల చతురోక్తులు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అనేకానేక కార్యక్రమాలలో, అనేకానేక వేదికలపై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా లెక్కలేనన్ని సాంస్కృతిక సాహిత్య సంగీత వివాహ వేడుకలలో ప్రేక్షక మహాశయులను అలరిస్తూ ‘వ్యాఖ్యాన కళారత్న’ బిరుదును సొంతం చేసుకున్న పున్నమరాజు ఉమామహేశ్వరరావు సావనీర్ ప్రధాన సంపాదక బాధ్యతలే కాకుండా సభా నిర్వహణ కూడా చేస్తూ ద్విపాత్రాభినయం చేశారు.

వేదిక మీదకు సంఘం అధ్యక్షుడు బచ్చు పట్టాభి రామప్రసాద్ గారిని, కార్యదర్శి అవసరాల ఏఎస్ రామారావు గారిని, డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారిని, తదితర పెద్దలను, వారి సరసన నన్నూ ఆహ్వానిస్తూ ‘శ్రీ వనం రాసిన అక్షరాలు మాట్లాడతాయి. ఆయన మాటలతో మన ఆలోచనలు వికసిస్తాయి. ఆయన నడవడికలో సంస్కారం తొణికిసలాడుతుంది. ఆయన బోధనల్లో ప్రేరణ ప్రతిబింబిస్తుంది. వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో జ్ఞానదీపాలు వెలిగించి తన కర్తవ్యనిష్ఠతో అందరి మన్ననలు పొందిన ఆదర్శ గురువు ఆయన. రచయితగా, వ్యాసకర్తగా, తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన సాహితీ విరాణ్మూర్తి ఆయన’ అని ప్రశంసించారు.

ఇంకా ఇలా అన్నారు: ‘సార్వజనీనమైన సర్వకాలీనమైన రామాయణ భారత భాగవత గ్రంథ సారాంశాన్ని ఔపోసన పట్టి, సనాతన ధర్మ ధ్వజం చేతబట్టి, అనుభవాలే అధ్యాయాలుగా, అనుభూతులే అక్షరాలుగా, ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు, మందర మకరందం, అనుపమ గీతాలతో సహా, అనేక అమూల్య సాహితీ జ్వాలా తోరణాలు, వెలయించిన విద్యా వైతాళికులు, వినయ విభూషణులు, సంస్కార సింధువు, సాహితీ బంధువు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాన ప్రజా సంబంధాల అధికారి, మాన్యశ్రీ వనం జ్వాలా నరసింహారావు గారిని వినయపూర్వకంగా మన గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘ రజతోత్సవ స్మరణిక ఆవిష్కరణోత్సవ సభకు గౌరవ అతిథిగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం’ అని సభనుద్దేశించి పేర్కొన్నారు. (ఏమీ నా అదృష్టం!!!)

వేదిక మీద నేను కూర్చున్న తరువాత మళ్లీ పున్నమరాజు గారే ఇలా కొనసాగించారు: ‘ఈ రోజు మన గౌరవ అతిథిగా విచ్చేసిన మహానుభావులు శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారి గురించి ఒక్క మాట చెప్పాలి ప్రత్యేకంగా మనకు సంబంధించి మన సంఘ పూర్వీకుల్లో గొప్పవాడైన ఒక మహనీయుడి చరిత్రను భావితరాల కోసం నిక్షిప్తం చేశారు ఆయన. నేను తప్పక ఆ విషయం చెప్పాలి. మనం ఆయనకు ఎంతైనా రుణపడి ఉండాలి. భద్రాచలం రాముడి వైభవానికి కారణం ఎవరని అడిగితే తడుముకోకుండా భక్త రామదాసు అని చెప్పేస్తాం. కంచర్ల గోపన్న మన కుటుంబీకుడే అని చెప్తారు’ అని సభకు వివరిస్తూ మరిన్ని విషయాలు చెప్పారు.

‘కానీ ఒంటిమిట్ట రాముడికోసం, తన జీవిత సర్వస్వాన్ని అర్పించిన ఒక మహానుభావుడు మన గోల్కొండ వ్యాపారి కుటుంబీకుడు. చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు.  ఆయన్ని ఒంటిమిట్ట రామదాసు అంటారు. ఆయనే వావిలకొలను సుబ్బారావు ‘వాసుదాసు.’ ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని బిరుదు. ఎందుకంటే, వాల్మీకి మహర్షి వ్రాసిన 24000 శ్లోకాల రామాయణాన్ని, మందరం  వేరుతో 24000 తెలుగు పద్యాలుగా, ప్రతి పద్యానికి టీక, ప్రతిపదార్ధం, ఎంతో వివరంగా తాత్పర్యం   వ్రాసి   చరిత్రలో నిలిచిపోయినా మహానుభావుడు వాసుదాసు గారు. వాసుదాసు గారు వ్రాసిన 24000 పద్యాలకి మందర మకరందం  పేరుతో అధ్భుతమైన వ్యాఖ్యానాన్ని వ్రాసారు, ఈ నాటి మన గౌరవ అతిథి శ్రీ వనం జ్వాలా నరసింహా రావు గారు. వారు ఈ రోజు మన వెండి పండుగలో పాలు పంచుకోవడం  మనకి నిజంగా ఎంతో గర్వ కారణం.’ అన్నారు పున్నమరాజు.

వాసుదాసు గారితో సహాయ ఆయన లాంటి ఎంతో మంది గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు ఈ స్మరణీ (సావినీర్)క లో పొందుపరచె ప్రయత్నం చేశామని, అద్భుతంగా గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘ రజతోత్సవ స్మరణిక ఆవిష్కరణోత్సవ పూర్వాపరాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా సంచిక వెలువడడానికి కారణభూతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా ఇద్దరి, ముగ్గురు  వ్యక్తుల అవిశ్రాంత కృషిని ప్రశంసించారు. వారే: డాక్టర్ శ్రీ బచ్చు పార్ధసారధి, కార్యదర్శి అవసరాల రామారావు, వారి సతీమణి శ్రీమతి మాలతి, శ్రీచక్ర ప్రింటర్స్ అధినేతలు శ్రీ తమ్మిరాజు శేషు, శ్రీదేవి దంపతులు, డిజైనర్ నరేష్, పున్నమిరాజు శ్రీమతి రాధిక తదితరులు.

‘సాయంకాలం ఇళ్ళకి వెళ్లేటప్పుడు జ్ఞాపకాలతో పాటు ఈ పుస్తకాన్ని కూడా పట్టుకెళ్లి, వీలు చేసుకుని చదవండని, గోల్కొండ కుటుంబీకుల్లో తెలియని వారందరి గురించీ తెలుసుకోండని, ఆ సమాచారాన్ని భద్రపరచండని, భావి త రాలకు అందించండని, ఇది మన తరానికి చెందిన చరిత్రని, ఇది మన  వారసత్వ సంపదని,’ చక్కగా స్ఫూర్తినిస్తూ మాట్లాదారాయన.  

పున్నమరాజు చెప్పినట్లు, ‘గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం ఆధ్వర్యవంలో ప్రచురింపబడిన సావనీర్ కేవలం ఒక 68  పేజీల రంగుల పుస్తకం మాత్రమేకాదు. అది ఇరవై ఐదు సంవత్సరాల సంఘం ప్రయాణాన్ని తన గుండెల్లో దాచుకున్న చరిత్ర. అనుభవాలు, అనుబంధాలు, అంకితభావాలు, ఆత్మీయతలు, జీవిత చరిత్రల కు చిరునామా. ఒక చరిత్రగా నిలబెట్టగలిగే అక్షరాలతో నిండిన పుస్తకం. తరాల మధ్య వారధి. సావనీర్ క్షుణ్ణంగా చదువుతే: ఇందులో కేవలం గతం మాత్రమే కాదు, భవిష్యత్తుకు మార్గదర్శనం  ఉంది. ఇందులో కేవలం సంఘ చరిత్ర మాత్రమే కాదు, సంఘ సంస్కృతి ఉంది. ఇందులో కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు, ఎన్నో జీవిత పాఠాలు ఉన్నాయి. ఇందులో కేవలం నిశ్చల చిత్రాలు మాత్రమే కాదు, ఆ చిత్రాలు చెప్పే చిత్రవిచిత్రాలూ  ఉన్నాయి.’

గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు, ఇతర కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా అవసరాల రామారావుగారికి ధన్యవాదాలు. అన్నిటికన్నా ఆనందకరమైన విషయం: మామూలుగా సభలకు, సమావేశాలకూ రమ్మని పిలిచేవారు, సభ జరిగేరోజు వరకు మాత్రమే ఉత్సాహం కనబరిచే నేపధ్యంలో, దానికి భిన్నంగా అవసరాల రామారావు గారు, వారి సతీమణి మాలతి గారు, పున్నమరాజు గారు సభ జరిగిన మర్నాడు (అంటే ఈ రోజు ఉదయ౦) ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి మళ్లీ ధన్యవాదాలు చెప్పి పోవడం.  

హైదరాబాద్ గోల్కొండ వ్యాపారి సంక్షేమ సంఘం రజతోత్సవ వేడుక, పూర్వీకుల వైభవాన్ని భావితరాలకు అందించిన అద్భుత సాహిత్య సాంస్కృతిక వేదిక. రజత దీప్తి సావనీర్ ద్వారా తమ జాతి మూలాలను గ్రంథస్థం చేసిన నిర్వాహకుల శ్రమ, మహనీయుల చరిత్రను స్మరించుకునేలా చేసిన ఈ వేడుక నాకు కూడా మరువలేని మధురమైన జ్ఞాపకం.

No comments:

Post a Comment