Thursday, June 25, 2026

‘జీవితం ఒక సింధువు, నేను స్పృశించినది ఒక బిందువు’: ‘స్ఫూర్తిప్రదాత (వెంకయ్యనాయుడు) జీవిత చరిత్ర’ రచయిత మాశర్మ >>>>> వనం జ్వాలా నరసింహారావు

 అపురూపమైన ‘స్ఫూర్తిప్రదాత (వెంకయ్యనాయుడు) జీవిత చరిత్ర

‘జీవితం ఒక సింధువు, నేను స్పృశించినది ఒక బిందువు’

రచయిత మాశర్మ

By వనం జ్వాలా నరసింహారావు

         జూన్ 24వ తేదీ దినపత్రికలలో సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ రచించిన వెంకయ్య ‘నాయకుడు’: ఉదయగిరి నుండి ఉపరాష్ట్రపతి వరకు పుస్తకావిష్కరణ విశేషాలు చదివాను. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారితో నాకు అంతగా వ్యక్తిగత పరిచయం లేకపోవడంతో, అభినందనలు తెలియచేయడానికి, నేరుగా ఆయనకు ఫోన్ చేసే సాహసం చేయలేకపోయాను. అయితే, పుస్తక రచయిత మాశర్మ నా ఆప్తమిత్రుడు కావడం వల్ల, తక్షణమే ఆయనకు ఫోన్ చేసి మనసారా అభినందించాను. ఆహ్వానం లేనందున ఆవిష్కరణ మహోత్సవానికి రాలేకపోయానని వివరించాను.

         మేమిద్దరం కాసేపు సమకాలీన అంశాలను, పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నాం. ఆ తర్వాత దైనందిన పనుల హడావిడిలో పడి ఆ విషయాన్ని కాస్త మర్చిపోయాను. ఆ రోజంతా ఎన్నో పనులతో అత్యంత బిజీగా గడిచింది. సాయంత్రం జూబిలీహిల్స్‌లోని హోటల్‌లో కూర్చుని ఉన్న సమయంలో మా ఇంటి నుంచి ఒక ఫోన్ వచ్చింది. వెంకయ్యనాయుడు ఇంటి (కార్యాలయం) నుండి ఒక వ్యక్తి రాపిడో సర్వీస్ ద్వారా ఒక పుస్తకాన్ని పంపారని, దానిని గేటు వద్ద డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి అందించి వెళ్లారని సమాచారం. అనుకోకుండా అందిన ఈ సర్ప్రైజ్ బహుమతి నాకెంతో సంతోషాన్ని కలిగించింది.

         వెంటనే నేను చేసిన మొదటి పని మిత్రుడు మాశర్మకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలపడం. పుస్తకం నా దాకా వచ్చేలా చేయడం ఖచ్చితంగా ఆయన పనేనని అర్థమైంది. రాత్రి ఇంటికి చేరుకోగానే గేటు దగ్గరే ఆగి, సెక్యూరిటీ నుంచి ఆ పుస్తకాన్ని ఆత్రుతగా చేతిలోకి తీసుకున్నాను. లోపలికి వెళ్లే ఓపిక కూడా లేక, అక్కడే నిలబడి పేజీలు తిప్పడం ప్రారంభించాను. సాధారణంగా ఏ పుస్తకం చదివినా కొన్ని ఆసక్తికరమైన అంశాల దగ్గర నా దృష్టి నిలిచిపోతుంది. ఈ పుస్తకం విషయంలోనూ అదే జరిగింది. అయితే, ఇక్కడ నేను సుదీర్ఘమైన సమీక్ష కాకుండా కొన్ని ముఖ్యమైన మాటలు మాత్రమే పంచుకోవాలని అనుకుంటున్నాను.

ముందుగా ఈ గ్రంథానికి అందిన 'ముందుమాటల' గురించి ప్రస్తావించడం ఎంతో అవసరం. ఎందుకంటే, ఆ ముందుమాటలను చదివితేనే రచయిత మాశర్మ అద్భుతమైన రచనా నైపుణ్యం అర్థమవుతుంది. అదే సమయంలో, పుస్తక కథానాయకుడైన వెంకయ్యనాయుడు బహుముఖ ప్రజ్ఞ, అసాధారణ చతురత, రాజకీయ రాజనీతిజ్ఞత, దార్శనికత స్పష్టంగా అవగతమవుతాయి. ఆయనకు ఉన్న బంధుమిత్ర ప్రీతి, పట్టువిడుపుల స్వభావం, అన్నిటినీ మించి ఆయనలోని తిరుగులేని నాయకత్వ పటిమ ఎలాంటిదో ఆ పీఠికల ద్వారానే పాఠకుడికి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.

జీవిత చరిత్రలు అనేవి కేవలం ఒక వ్యక్తి జీవిత ఘట్టాల సమాహారం మాత్రమే కావు. అవి ఒక యుగానికి అద్దం పట్టే సజీవ సామాజిక పత్రాలు. ఒక వ్యక్తి సమాజంలో ఎంతటి ఉన్నత శిఖరాలకు ఎదిగాడనే దానికంటే, ఆ ఎదుగుదల వెనుక ఉన్న మానవీయ విలువలు, క్రమశిక్షణ, నిరంతర త్యాగం, ప్రజాసేవా తపన, దేశభక్తి వంటి విశిష్ట గుణాలను భావితరాలకు అందించే అద్భుతమైన స్ఫూర్తి గ్రంథాలు. నిజానికి, అలాంటి మహోన్నత జీవిత చరిత్రలు చాలా అరుదుగా మాత్రమే వెలువడుతుంటాయి. ఈ కోవకు చెందిన పుస్తకాలలో చదివే ప్రతి పుట ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి అధ్యాయం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అందులో ప్రస్తావించిన ప్రతి సంఘటన చదువరుల జీవితానికి ఒక చక్కని మార్గదర్శకంగా నిలుస్తుంది.

గ్రామీణ నేలలో పుట్టి పెరిగి, విద్యార్థి ఉద్యమాల ద్వారా తనలోని నాయకత్వ లక్షణాలకు పదును పెట్టుకున్న అరుదైన ప్రస్థానం ముప్పవరపు వెంకయ్యనాయుడుది. ప్రాంతీయ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల శిఖరాగ్రాల వరకు అంచెలంచెలుగా ఎదిగి, దేశ రెండో అత్యున్నత పదవైన భారత ఉపరాష్ట్రపతి స్థాయికి ఆయన చేరుకున్నారు. ఆయన జీవిత ప్రయాణం కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయగాథ మాత్రమే కాదు. అది అచంచలమైన పట్టుదల, నిరంతర కృషి, నమ్మిన విలువలు, నిస్వార్థ ప్రజాసేవల కలయికతో రూపుదిద్దుకున్న ఒక సజీవ చరిత్ర.

అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సీనియర్ పాత్రికేయుడు మాశర్మ అద్భుతంగా పుస్తక రూపంలోకి తెచ్చారు. ఆయన తన దశాబ్దాల అనుభవజ్ఞానంతో, లోతైన పరిశోధనా దృష్టితో, చక్కని సాహిత్య సౌందర్యాన్ని జోడించి అక్షరీకరించిన అద్భుత గ్రంథమే “వెంకయ్య నాయకుడు’: ఉదయగిరి నుండి ఉపరాష్ట్రపతి వరకు”. ఈ పుస్తకాన్ని తిరగేస్తున్నప్పుడు కేవలం ఒక సాధారణ నాయకుడి రాజకీయ ప్రస్థానం మాత్రమే మనకు కనిపించదు. ఒక సామాన్య వ్యక్తి విలువలనే ఇంధనంగా మార్చుకుని, ఎలా ఒక మహోన్నత ప్రజానాయకుడిగా రూపుదిద్దుకుంటాడో తెలిపే అద్భుత జీవన యాత్ర కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.

రచయిత మాశర్మ భవిష్యత్తులో వెంకయ్యనాయుడిపై ఇలాంటి పుస్తకం ఒకటి రాయబోతున్నారని నరేంద్ర మోదీ బహుశా ముందే ఊహించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే, రెండు సంవత్సరాల క్రితమే వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల మనిషి, వెంకయ్య’ అంటూ ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. ఈ పుస్తకానికి అన్ని విధాలా ఒక పరిపూర్ణమైన ముందుమాటలా సరిపోయే ఆ వ్యాసాన్ని చూస్తే, ‘కోయిల ముందే కూసింది’ అనే సామెత అక్షరాలా నిజమనిపిస్తుంది.

ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యాసం ఆరంభంలోనే వెంకయ్యనాయుడునిరాజనీతిజ్ఞుడు’ అని సంబోధించడం విశేషం. ప్రజాసేవ పట్ల ఆయనకున్న తిరుగులేని కార్యదక్షత, సభలలో ప్రదర్శించే హుందాతనం, విద్యార్థి దశ నుంచే చాటుకున్న అపూర్వమైన ప్రతిభ, అద్భుత వాక్చాతుర్యం, అంకితభావాలను ప్రధాని ప్రశంసించారు. ఆరెస్సెస్, ఏబీవీపీ, జనసంఘ్, బీజేపీ వంటి సంస్థల మౌలిక సిద్ధాంతాల పట్ల నిబద్ధతకు, సమర్థతకు వెంకయ్యనాయుడు ఒక పర్యాయపదమని మోదీ కొనియాడారు.

మరీ ముఖ్యంగా, వెంకయ్యనాయుడు వ్యక్తిత్వంలోని కొన్ని ప్రత్యేక కోణాలను ప్రధాని తన మాటల్లో ఇలా వివరించారు: ‘రాజకీయాలను పక్కనబెట్టి చూస్తే, వెంకయ్యనాయుడు విపరీతమైన పఠనాభిలాషి, మంచి రచయిత కూడా. ఉజ్జ్వలమైన తెలుగు సంస్కృతిని దేశ రాజధానికి పరిచయం చేసిన నేతగా న్యూఢిల్లీ ప్రజలలో ఆయనకు విశేషమైన గుర్తింపు ఉంది. ప్రతి ఏటా ఆయన నివాసంలో సంక్రాంతి, ఉగాది పర్వదినాల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు న్యూఢిల్లీ వాసులకు ఎప్పటికీ మరువలేని మధురమైన జ్ఞాపకాలు.’ (ఒకసారి నేను కూడా సంక్రాంతికి హాజరయ్యే అవకాశం కలిగింది)

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన ముందుమాట ఆరంభంలోనే రచయితను ఎంతగానో అభినందించారు. ఈ పుస్తకాన్ని తాను ఆమూలాగ్రంగా చదివానని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు అద్భుత ప్రస్థానం గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ గ్రంథం ఎంతో తోడ్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ... ‘ఈ పుస్తకం కొండను అద్దంలో చూపించడం లాంటిదే. ప్రజాక్షేత్రంలో సుదీర్ఘమైన ఆయన చరిత్రను, రాజకీయ ప్రయాణాన్ని వివరించడానికి ఎన్ని పుటలైనా సరిపోవు. అయితే, నాయుడుగారి సమగ్ర వ్యక్తిత్వాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు మాశర్మ ఈ పుస్తక రచన ద్వారా చక్కని వీలు కల్పించారు,’ అంటూ జస్టిస్ రమణ రచయిత చిత్తశుద్ధిని, ప్రతిభను మనసారా కొనియాడారు.

మాశర్మ రచించిన 300 పేజీల పుస్తకం ‘కొండ అద్దమందు’ ముందుమాటలో వెంకయ్యనాయుడి జీవిత ప్రస్థానాన్ని క్లుప్తంగా, సుందరంగా ఆవిష్కరించినట్లు ఒక సమగ్ర సమీక్షగా రాయడం విశేషం. ఒక సమగ్ర విజ్ఞాన సర్వస్వాన్ని అలా సులభంగా మలచగలిగే రచయిత నైపుణ్యం, వినయశీలత ఈ ముందుమాట ద్వారా స్పష్టమవుతాయి. అలాగే మాశర్మ చెప్పిన మలివాక్యాలు - ‘వెంకయ్యనాయుడి జీవిత ప్రస్థానం చాలా పెద్దది. ఈ చిన్న పుస్తకంలో నాయుడిగారి జీవితాన్ని ప్రతిబింబించే చిరు ప్రయత్నం చేశాను’ అన్న వాక్యాలు చదివినవారికి, మాశర్మ వినయం మరింతగా స్పష్టమవుతుంది. అందుకే ముందుగా, ఆయనకు అభినందనలు. జీవిత చరిత్ర రాయడమంటే పరకాయ ప్రవేశం చేయడమే. మాశర్మ ముందుమాట చదివితే, మందర పర్వతాన్ని మధించిన తరువాత ఉద్భవించిన అమృతం, మాశర్మ రచించిన పుస్తకం చదవక ముందే దర్శనమిస్తుంది. ఆస్వాదించే తీరిక, ఓపిక రెండూ వుంటే చాలు.

మాశర్మ తన ముందుమాటలో రాసిన అద్భుతమైన వాక్యాలు నిజానికి నాయకత్వ లక్షణాలకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ... ‘నలుగురినీ సరైన మార్గంలో నడిపించేవాడు, సమర్థవంతంగా నాయకత్వం వహించేవాడే అసలైన నాయకుడు. “నాయుడు, నాయకుడు” అనే పదాల మూలాలు ఒక్కటే. వెంకయ్యనాయుడు తన జీవితంలో ఎందరినో నడిపించారని, ఎన్నో ఉద్యమాలకు, వ్యవస్థలకు నాయకత్వం వహించారని జగత్తు మొత్తానికి తెలుసు. ప్రజాక్షేత్రంలో ఒక గొప్ప నాయకుడిగా సుదీర్ఘ ప్రస్థానం సాగించి, విశేష ఖ్యాతి గడించినవారాయన. అందుకే ఈ పుస్తకానికి ‘వెంకయ్య నాయకుడు’ అనే సార్థకమైన పేరును ఎంచుకున్నాను. ఆయన జీవితం నుండి, ఆ జీవనశైలి నుండి నేటి తరం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి’ అని మాశర్మ పేర్కొన్నారు.

ఒక రకంగా చెప్పాలంటే, మాశర్మ రాసిన ముందుమాట పుస్తకానికి ఒక అద్భుతమైన ‘ఎగ్జిక్యూటివ్ సమ్మరీ’ (సారసంగ్రహం) లాంటిది. దీనిని చదివిన పాఠకుడు ఇక చాలు అని అక్కడితో ఆపేయడమో, లేదా లోపల ఇంకా ఏముందో తెలుసుకోవాలనే కుతూహలంతో పుస్తకాన్ని ఆసాంతం చదవకుండా ఉండలేకపోవడమో ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా, ఆయన తన ముందుమాటలో రాసిన ఒక అద్భుతమైన వాక్యం: ‘ఆయన (వెంకయ్యనాయుడు) జీవితం ఒక సింధువు ... నేను స్పృశించినది ఒక బిందువు,’ రచయిత వినయాన్ని, ఆ వ్యక్తిత్వం యొక్క అనంతత్వాన్ని ఎంతో గొప్పగా చాటిచెబుతోంది.

మొత్తం 22 ఆకర్షణీయమైన శీర్షికలతో సాగే మాశర్మ ‘వెంకయ్య ‘నాయకుడు’: ఉదయగిరి నుండి ఉపరాష్ట్రపతి వరకు’ పుస్తకంలో, మొదటి అధ్యాయమైనపల్లె బంధాలు-ముప్పవరపు మూలాలు’ పాఠకుడిని నేరుగా కథానాయకుడి జీవిత మూలాల్లోకి తీసుకెళ్తుంది. కళ్లముందు అపురూపమైన పల్లెటూరి జీవన సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. వెంకయ్యనాయుడు తన బాల్యంలో అడుగులు వేసి, కలియతిరిగిన పల్లె వాతావరణాన్ని మాశర్మ ఎంతో ఆసక్తికరంగా ఈ అధ్యాయంలో వివరించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వరప్రసాదంగా వెంకయ్యనాయుడు జన్మించిన వృత్తాంతాన్ని, ఒక ఆదర్శవంతమైన రైతు కుటుంబంగా సమాజంలో వారికున్న సత్కీర్తిని రచయిత అద్భుతంగా అక్షరీకరించారు. ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెంతో నాయుడుగారికి ఉన్న పచ్చని బాల్యస్మృతులను, దాని చుట్టుపక్కల గ్రామాలైన చవటపాలెం, శ్రీరాంపురం వంటి ప్రాంతాలు ఆయన పల్లెటూరి జీవన ప్రస్థానంలో ఎలాంటి చెరగని మైలురాళ్లుగా నిలిచాయో ఈ శీర్షికలో ఎంతో ఆనందంగా చదువుకోవచ్చు.

తర్వాతి శీర్షికలో, వెంకయ్యనాయుడు ప్రాథమిక పాఠశాల విద్య ముగిసిన తర్వాత ఉన్నత పాఠశాల, కళాశాల చదువుల కోసం ‘సింహపురి’గా పిలవబడే నెల్లూరుకు చేరుకున్న వృత్తాంతాన్ని రచయిత ప్రస్తావించారు. అక్కడ ఆయన జీవనయానంలో ‘నాయకత్వ బీజాలు’ ఎలా నాటుకున్నాయో, ఉత్తమ అధ్యాపకుల పర్యవేక్షణలో ఆయన చదువు ఎలా సాగిందో, ఒక మేటి విద్యార్థిగా, తిరుగులేని విద్యార్థి నాయకుడిగా ఆయన ఎలా గుర్తింపు తెచ్చుకున్నారో మాశర్మ ఎంతో చక్కగా వివరించారు.

ముఖ్యంగా, ఆ రోజుల్లో ఒక సందర్భంలో, విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఉన్నత జిల్లా పోలీస్ అధికారి (ఐపీఎస్ శరణ్యన్) మందలిస్తూనే ఇచ్చిన అమూల్యమైన సలహాలు, సూచనలు నాయుడుగారి మనసుపై ఎలాంటి చెరగని ముద్ర వేశాయో ఈ అధ్యాయంలో చదువుకోవచ్చు. ఆ మాటలు ఆయన ఆలోచనా సరళిని సరికొత్తగా ప్రభావితం చేశాయి. తర్వాతి కాలంలో ఆయన ఒక గొప్ప రాజకీయ నేతగా ఎదుగుతున్నప్పుడు, ప్రజాజీవితంలో పౌరస్పృహతో, బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రవర్తించడానికి ఆనాటి సూచనలే ఏ విధంగా దిక్సూచిగా నిలిచాయో రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు.

ఆరెస్సెస్ తో అనుబంధం-జనసంఘ్ తో బంధం’ అనే శీర్షికలో వెంకయ్యనాయుడు ఆయా జాతీయ సంస్థలలో చురుగ్గా ఎదగడానికి కారణమైన ముఖ్యాంశాలను రచయిత ప్రస్తావించారు. ఆయనను ప్రభావితం చేసిన మొదటి గురువు భోగాది దుర్గాప్రసాద్, మలి గురువు సోమేపల్లి సోమయ్యల వివరాలను, వారిరువురి మార్గదర్శకత్వంలో వెంకయ్యనాయుడు ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్న నేపధ్యాన్ని ఇక్కడ అద్భుతంగా వివరించారు. ఈ ఇద్దరు మహానుభావుల ప్రభావం ఆయన జీవన దృక్పథాన్ని ఎలా మార్చిందో ఈ శీర్షిక ద్వారా తెలుస్తుంది.

రచయిత మాశర్మ మాటల్లోనే చెప్పాలంటే.. ‘వీరిద్దరి శిష్యరికం వెంకయ్యనాయుడి జీవితగతిని పూర్తిగా మలుపు తిప్పింది. ఆయన ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక వ్యక్తిత్వ వికాసానికి, నిర్మాణానికి ఇక్కడే పునాదులు పడ్డాయి. జాతీయ భావాలు ఆయన నరనరాల్లో, కణకణాల్లో ప్రసరించడం ప్రారంభమైంది. సామాజిక, రాజకీయ, చారిత్రిక అంశాలు, ప్రభుత్వ విధానాలు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మౌలిక ఆలోచనలపై ఆయనకు ఒక పరిపూర్ణమైన అవగాహన ఏర్పడింది.’ నిశ్చయంగా, ఆనాటి నెల్లూరు జీవితమే వెంకయ్యనాయుడు ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశానికి ఒక రాజమార్గంగా నిలిచింది.

జై ఆంధ్ర ఉద్యమం - తెన్నేటి శిష్యరికం’ అనే శీర్షికకు సంబంధించిన విశేషాలను రచయిత ఈ అధ్యాయంలో ఎంతో ఆసక్తికరంగా మలిచారు. జై ఆంధ్ర ఉద్యమ కాలంలో వెంకయ్యనాయుడుకు, తెన్నేటి విశ్వనాథం రూపంలో మరొక మహోన్నత గురువు లభించారని మాశర్మ పేర్కొన్నారు. ‘విశ్వామిత్ర మహర్షి వెంట నడిచిన శ్రీరామచంద్రుడిలాగా, తెన్నేటి విశ్వనాథం గారు వెంకయ్యనాయుడిని తన వెంటబెట్టుకుని రాష్ట్రమంతా పర్యటించారు’ అని రచయిత వర్ణించిన తీరు అద్భుతంగా ఉంది.

జై ఆంధ్ర ఉద్యమ ఉద్ధృతి సమయంలోనే నాయుడుగారు ఆంధ్రా విశ్వవిద్యాలయం (AU) విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత ఆయన న్యాయశాస్త్రంలో (లా) పట్టా పుచ్చుకున్నాక, కెరీర్ పరంగా కొంత సందిగ్ధతను ఎదుర్కొన్నారు. లాయర్‌గా స్థిరపడాలా? లేక ప్రజాసేవలో భాగంగా రాజకీయాల్లోకి ప్రవేశించాలా? అన్న మీమాంస ఆయనలో నెలకొంది. అయితే, ఆ సమయంలో దేశంలో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ఆయన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఆ ప్రజాస్వామ్య వ్యతిరేక పరిణామాలే ఆయన్ను సంపూర్ణంగా రాజకీయాల వైపు అడుగులు వేసేలా ప్రేరేపించాయని మాశర్మ అత్యంత ప్రాధాన్యతతో వివరించారు.

ఇలా ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో సాగిన మాశర్మ వెంకయ్య ‘నాయకుడు’: ఉదయగిరి నుండి ఉపరాష్ట్రపతి వరకు” గ్రంథంలో ప్రతి అధ్యాయమూ ఎంతో ప్రాముఖ్యత కలిగినదే. వాటిలో కొన్ని అత్యంత కీలకమైన, పాఠకులను విశేషంగా ఆకట్టుకునే శీర్షికలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. అవి:ఎమర్జెన్సీ కాలం-జైలు జీవిత పాఠం’, ‘ఎన్నికల బరిలో తొలిసారిగా’, ‘ఉదయగిరిలో ఉషోదయం’, మరియుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అద్భుతమైన అడుగులు’. వీటితో పాటు జాతీయ స్థాయిలో ఆయన పోషించిన పాత్రను వివరించేజాతీయ రాజకీయ యవనిక-కీలక భూమిక, నరేంద్ర మోదీకి వెన్నెముక’, ‘బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి’, ‘ప్రతిపక్షనేతగా పదునైన స్వరం-ప్రబలమైన ప్రాతినిధ్యం’ వంటి అధ్యాయాలు ఆయన రాజకీయ చతురతను చాటుతాయి.

అలాగే, తెలుగు ప్రజల సమకాలీన చరిత్రలో కీలకమైనఆంధ్రప్రదేశ్ విభజన అంశం-వెంకయ్య మార్గదర్శనం’, పరిపాలనా దక్షతను తెలిపేకేంద్రమంత్రిగా అద్వితీయం’, ఆయన ప్రస్థానంలో శిఖరాగ్ర ఘట్టాలైనఉపరాష్ట్రపతిగా ఉన్నత పీఠం’, ‘పెద్దలసభ పెద్దగా’, మరియు ఆయన సుదీర్ఘ ప్రజాసేవకు దక్కిన అత్యున్నత గౌరవంపద్మవిభూషణం’ వంటి శీర్షికలు ఈ గ్రంథాన్ని ఒక పరిపూర్ణమైన చారిత్రక పత్రంగా తీర్చిదిద్దాయి. నిజానికి వెంకయ్యనాయుడి వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజా జీవితానికి అంకితమైన మహోన్నత నాయకుడి జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదు.

అయితే, ‘జీవితం ఒక సింధువు... నేను స్పృశించినది ఒక బిందువు’ అన్న మాశర్మ వినయపూర్వక వ్యాఖ్య వెనుక, ఆ మహా సింధువు యొక్క అనంత వైశాల్యాన్ని పాఠకుడికి సాక్షాత్కరింపజేయాలన్న ఆయన చిత్తశుద్ధి, రచనా నిబద్ధత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అపురూప పుస్తకం కేవలం వెంకయ్యనాయుడు రాజకీయ విజయాలను మాత్రమే నమోదు చేయలేదు. ఒక సాదాసీదా గ్రామీణ బాలుడు దేశ జాతీయ రాజకీయాల్లో ఎలా అత్యున్నత స్థాయికి ఎదిగాడో, విలువలతో కూడిన ప్రజాజీవితం ఎంత గొప్పదో, ప్రజల మధ్య నుంచే నిజమైన నాయకత్వం ఎలా ఆవిర్భవిస్తుందో ఈ పుస్తకం కళ్లకు కట్టినట్లు ప్రతిబింబించింది. అందుకే ఇది కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్ర మాత్రమే కాదు. కాబోయే నాయకులకు ఒక అద్భుత పాఠ్యగ్రంథం, నిస్వార్థ ప్రజాసేవకు నిలువెత్తు సందేశం, దేశ యువతకు నిరంతరం స్ఫూర్తిని ప్రసాదించే ఒక దివ్య మార్గదర్శి.

పదవులు వస్తాయి, పోతాయి కానీ వ్యక్తిత్వం, నమ్మిన విలువలు, ప్రజల హృదయాలలో సంపాదించుకున్న స్థానం మాత్రమే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రజాక్షేత్రంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న అత్యంత అరుదైన, మహోన్నతమైన నాయకుడు. అలాంటి గొప్పవ్యక్తి జీవితాన్ని ఎంతో శ్రద్ధతో అక్షరబద్ధం చేసిన రచయిత మాశర్మ నిజంగా అభినందనీయులు. అలాగే, ఈ స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను చదివి, అందులోని విలువలను ఒంటబట్టించుకునే ప్రతి పాఠకుడూ నిశ్చయంగా అదృష్టవంతుడే.

ఈ గ్రంథం చదవడం ముగిసిన తర్వాత కూడా, వెంకయ్యనాయుడు అద్భుత జీవన ప్రస్థానం మన ఆలోచనల్లో నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో స్వయంగా చెప్పినట్లు:నేను పదవీ విరమణ చేశాను గానీ ... పెదవీ విరమణ చేయలేదు’ అని. ప్రజాపక్షాన నిలిచే ఆ నిఖార్సైన గళం, సమాజ హితాన్ని కోరే ఆ సందేశం, దేశభక్తితో నిండిన ఆ స్ఫూర్తి భావితరాలను ఇంకా ఎన్నో దశాబ్దాల పాటు ప్రభావితం చేస్తూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పుస్తకాన్ని పూర్తిగా చదివి, అందరూ స్వయంగా ఆకళింపు చేసుకోవాలన్న ఆశయంతోనే ఇందులోని అన్ని శీర్షికల వివరాలను నేను ఇక్కడ పూర్తిగా ప్రస్తావించడం లేదు.

ఈ గ్రంథానికి సంబంధించినంతవరకు ఆకర్షణీయమైన ముందు కవర్ పేజీ ఒక ఎత్తైతే, వెనుక కవర్ పేజీ అత్యద్భుతం అని చెప్పాలి. అక్కడ వెంకయ్యనాయుడు ఫోటో వేసి, దాని కింద ఆయన పదేపదే చెప్పే సజీవ పాఠం: పదవీ విరమణ చేశాను కానీ... పెదవీ విరమణ చేయలేదు’, అనే అద్వితీయమైన వాక్యాన్ని ముద్రించారు. దానికి అనుగుణంగా, ఆ కిందనే మరొక చక్కటి భాష్యాన్ని కూడా జోడించారు. పుస్తకాన్ని లోపల చదివినా, చదవలేకపోయినా.. కేవలం చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూసేవారు సైతం ఆ వెనుక పేజీలోని మాటలను చదవకుండా ఉండలేరు.

కనీసం ఆ ఒక్క వాక్యాన్నైనా వారు ఖచ్చితంగా చదివితీరుతారు! ఆ వెనుక కవర్ పేజీపై ఉన్న అద్భుతమైన వాక్యాలు ఇవే: ‘అలుపెరుగని ఆ గళానికి విరామం లేదు! అనంతమైన ఆ ప్రయాణానికి విశ్రాంతి లేదు!! నవత కోసం, యువత కోసం, సర్వశక్తి సంపన్నమైన నవభారతం కోసం... ఆ గళం స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.’ ఈ మాటలు నిజంగా ఎంతో అద్భుతంగా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి.

ఈ పుస్తకాన్ని ఇంతటి సృజనాత్మక ఆలోచనతో, అత్యంత ఉన్నతంగా మలచిన రచయిత మిత్రులు మాశర్మకు నా హృదయపూర్వక అభినందనలు. సీనియర్ జర్నలిస్ట్‌గా, ప్రసిద్ధ కాలమిస్ట్‌గా, టీవీ హోస్ట్‌గా, కొప్పరపు కవుల కళాపీఠం స్థాపకులుగా, అవధాన, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు విశేష సేవలను అందిస్తూ అందరికీ చిరపరిచితుడైన శ్రీ మాశర్మ (మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మ) ఈ అపురూప గ్రంథ రచన చేసినందుకు మరోమారు మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.

1 comment:

  1. వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి పదవి ఇవ్వడం ఎంతో సముచితంగా ఉంటుంది. ఉప రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అవకాశం బీజేపీ నాయకత్వం ఇవ్వకపోవడం బాధ కలిగించింది.

    ReplyDelete