‘హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి’
స్వర్ణోత్సవ వేడుకలు
ఆత్మీయ సమావేశంలో లంచ్ వేదికగా ఈ మధ్యాహ్నం
వనం జ్వాలా నరసింహారావు (హ్యూస్టన్ ఆగస్ట్ 7, 2026)
పరాయి దేశంలో మాతృభాషను
బ్రతికించుకోవడం, భావితరాలకు మన సంస్కృతిని
పదిలంగా అందించడం అంత సులువు కాదు. కానీ, అమెరికా మట్టిపై
తెలుగు భాషా జెండాను ఎగురవేసి, ఐదు దశాబ్దాల పాటు
నిరంతరాయంగా సాంస్కృతిక చైతన్యాన్ని రగిలిస్తున్న అరుదైన సంస్థ ‘హ్యూస్టన్ తెలుగు
సాంస్కృతిక సమితి’ (TCA). కాలం చక్రంలో యాభై వసంతాలను పూర్తి
చేసుకుని, సువర్ణ అక్షరాలతో స్వర్ణోత్సవ సంబరాలను
జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక తరుణంలో, హ్యూస్టన్ నగరంలో
ప్రవాస తెలుగువారితో గడిపిన కొన్ని మధుర క్షణాల సమాహారమే ఈ ప్రత్యేక వ్యాసం
ఆగస్ట్ 7-8 (శని, ఆదివారాలు)
తేదీలలో అమెరికా, టెక్సాస్ రాష్ట్రంలోని షుగర్ లాండ్ వేదికగా
‘హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి’ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయాన నేను హ్యూస్టన్
(షుగర్ లాండ్, ఎనర్జీ కారిడార్) నగరంలో ఉండడం ఒక మధురమైన
యాదృచ్చికం. ఈ సువర్ణావకాశం వల్ల ఇక్కడి కొందరు అమెరికా స్నేహితులను, పరిచయస్తులను, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి
విచ్చేసిన పలువురు ప్రముఖులను కలుసుకునే వీలు చిక్కింది. వేడుకల మొదటి రోజు
మధ్యాహ్నం, స్థానిక 'శరవణ భవన్'
రెస్టారెంట్‌లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ లంచ్ సమావేశానికి,
సుధేష్ పిల్లుట్ల గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు నేను వెళ్లాను. అక్కడ
జరిగిన ఒక గంటకు పైగా అనధికారిక సాహితీ కాలక్షేపంలో శ్రోతగా పాలుపంచుకుని ఎంతో
ఆనందించాను.
ఈ ఆత్మీయ కలయికలో తెలుగు
నాట సుప్రసిద్ధులైన పలువురు సాహితీమూర్తులను కలుసుకునే మహద్భాగ్యం నాకు దక్కింది.
ప్రముఖ తెలుగు కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల
రామలింగేశ్వర రావు గారు; శతావధాని, ప్రవచనకర్త,
అద్భుత అవధాన ప్రతిభగల సాహిత్య పండితులు పాలపర్తి శ్యామలానంద
ప్రసాద్ గారు; ప్రముఖ నవలా రచయిత్రి, చలనచిత్ర
కథా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి గారు;
అలాగే సుప్రసిద్ధ జానపద గాయని, సంగీత
కళాకారిణి డాక్టర్ అరుణ సుబ్బారావు గారు ఈ సమావేశంలో సందడి చేశారు. వీరితో పాటు
అమెరికాలో తెలుగు భాషా వికాసానికి, సంస్కృతి పరిరక్షణకు,
ప్రవాస తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి దశాబ్దాలుగా విశేష
సేవలు అందిస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి వ్యవస్థాపక సహాధ్యక్షులు
వంగూరి చిట్టెన్ రాజు గారిని కూడా ఈ వేదికపై కలవడం విశేషం.
వీరితో పాటే, ప్రవాస అమెరికా తెలుగు సమాజంలో భాషా
సంస్కృతుల పరిరక్షణకు, సాహిత్య కార్యక్రమాల విజయవంతమైన
నిర్వహణకు నిరంతరం కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి క్రియాశీలక
సభ్యులు సుధేష్ పిల్లుట్ల గారిని; ప్రవాసాంధ్ర సాహితీవేత్త,
విమర్శకులు, అనువాదకులు, సాంస్కృతిక నిర్వాహకులు సాయి రాచకొండ గారిని కలుసుకున్నాను. అలాగే ప్రముఖ
ప్రవాసాంధ్ర కవయిత్రి, కథారచయిత్రి, సాంస్కృతిక
కార్యకర్త పాలపర్తి ఇంద్రాణి గారు; ఆధ్యాత్మిక, సంస్కృతిక, సాహిత్య నిర్వాహకులు పుచ్చా మల్లిక్ గారు;
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు దీప్తి పెండ్యాల గారు; ప్రముఖ
సాంస్కృతిక నిర్వాహకురాలు శాంత సుసర్ల గారు, ప్రభాకర్ సుసర్ల
గారు, సింగపూర్ శాస్త్రి గారు తదితర ప్రముఖులను కలుసుకోవడం
నా ఈ అమెరికా పర్యటన ఆదిలోనే చెప్పుకోవాల్సిన విశేషం.
ఎప్పుడో, ఏనాడో 1975-76 ప్రాంతంలో
కేవలం యాభై తెలుగు కుటుంబాలతో, ఒకరికొకరు ఆత్మీయులుగా
మసలుకునే రోజుల్లో ప్రారంభమైంది ఈ హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి. నేడు అది,
మహాకవి బమ్మెర పోతన భాగవతంలో వర్ణించిన ‘ఇంతై ఇంతింతై వటుడింతయై...’
అన్న చందాన, శ్రీమహావిష్ణువు త్రివిక్రమ రూపంలో విశ్వమంతా
విస్తరించినట్లుగా ఎదిగింది. ప్రస్తుతం పాతిక వేలకు పైగా తెలుగు కుటుంబాలు తమ
సాంస్కృతిక మూలాలను మరువకుండా, హ్యూస్టన్ నగరమంతటా
విస్తరించడం వెనుక ఎందరో మహానుభావుల శ్రమ దాగి ఉంది. బహుశా సమితి ఎదుగుదలలో
వీరందరూ పోషించిన అద్భుతమైన పాత్రను, ఆనాటి మధుర స్మృతులను
ఆగస్ట్ 8న జరిగే విస్తృత సభలో నిర్వాహకులు, సభ్యులు మనసారా మననం చేసుకునే వీలుంటుందేమో!
మా ఆత్మీయ సమావేశంలో
ముచ్చటించుకున్న వివరాల ప్రకారం, ఈ
స్వర్ణోత్సవ సభల సందర్భంగా ‘మధురవాణి స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక’ ఆవిష్కరణ
జరగబోతోంది. ఒకనాడు కేవలం వ్రాత పత్రికగా ప్రారంభమైన ‘మధురవాణి’, కాలానుగుణంగా సాంకేతిక మార్పులను పుణికిపుచ్చుకుంటూ సకల హంగులతో కూడిన
ఆధునిక సమాచార స్రవంతిగా మారిందని, నిరంతరం కొత్త రూపాన్ని
సంతరించుకుంటోందని నిర్వాహకులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ యాభై ఏళ్ల
సుదీర్ఘ ప్రస్థానంలో ఎందరో మహామహులైన కళాకారులు, సాహితీవేత్తలు,
పండితులు, అసాధారణ ప్రతిభావంతులు, అలాగే సినీ-రాజకీయ రంగాల ప్రముఖులు ఈ సమితి ఆతిథ్యాన్ని స్వీకరించి,
తమ కళలను, ఆలోచనలను ఇక్కడి తెలుగువారితో
పంచుకున్నారు. అలా సమితి వేదికను అలంకరించిన వారిలో భారత ప్రధానమంత్రి, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా
ఉండడం ఈ సంస్థ స్థాయికి, కీర్తికి నిదర్శనం.
ఆత్మీయ సమావేశంలో ఎవరి నోట
విన్నా, ఈ స్వర్ణోత్సవ సభల గురించిన
ముచ్చట్లే, ఆ సంబరాల విశేషాలే! కేవలం సంఖ్యాపరంగా యాభై ఏళ్ల
కాలం పూర్తి చేసుకున్నామనే భావన కంటే, గడిచిన ఈ ఐదు
దశాబ్దాలలో తెలుగు భాషా వికాసానికి కలిసికట్టుగా చేసిన కృషి వారిలో స్పష్టంగా
కనిపించింది. యాభై కుటుంబాల నాటి చిన్న మొక్క, నేడు పాతిక
వేల కుటుంబాల మహా వృక్షంగా ఎలా ఎదిగిందో, ఈ సంస్థను ఏ విధంగా
తీర్చిదిద్దారో చెప్పేటప్పుడు వారి కళ్లలో గర్వం ప్రస్ఫుటంగా అలుముకుంది. కేవలం
సాహితీ పరిమళాలకే పరిమితం కాకుండా, తెలుగువారి పండుగలను,
సాంస్కృతిక వైభవాన్ని, తరతరాలుగా వస్తున్న
కుటుంబ విలువలను, విశ్వానికి ఆదర్శంగా నిలిచిన తెలుగువారి
అపారమైన మానవీయ విలువలను హ్యూస్టన్ నివాసులకు నిరంతరం చేరువ చేయడంలో ఈ సంస్థది ఒక
ప్రత్యేక శైలి. సమకాలీన సాహితీ చరిత్రలో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA)
ప్రస్థానం నాటి నుండి నేటి దాకా అవిరామంగా కొనసాగుతున్న ఒక అపురూప
వారసత్వం, హ్యూస్టన్ తెలుగు సమాజం నిర్మించుకున్న
విశ్వాసానికి ఒక సజీవ ప్రతీక.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన
మాటల సందర్భంలో సంస్థకు సంబంధించిన మరికొన్ని చారిత్రక విశేషాలు కూడా నాకు
తెలిశాయి. యాభై సంవత్సరాల క్రితం ఈ సమితి స్థాపన వెనుక ఎందరో ఔత్సాహిక ప్రముఖుల
శ్రమ ఉంది. ముఖ్యంగా, టీసీఎ వ్యవస్థాపక సమన్వయకర్త
కోనేరు తాతయ్య గారు, సహ సమన్వయకర్త వంగూరి చిట్టెన్ రాజు
గారు పలువురు ప్రముఖులను కలుపుకొని ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. అయితే, హ్యూస్టన్ నగరంలో తెలుగువారి ఆరంభ చరిత్ర వాస్తవానికి 1957లోనే మొదలైందట! ఆ సంవత్సరంలో టెక్సాస్ విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్ర
అధ్యాపకుడిగా డాక్టర్ దువ్వూరి నారాయణరావు గారు హ్యూస్టన్‌కు రావడమే ఇక్కడి తెలుగు
ప్రస్థానానికి తొలి అడుగు. ఇక ప్రస్తుతం ప్రత్యేక స్వర్ణోత్సవ సంచికగా సకల హంగులతో
వెలువడుతున్న ‘మధురవాణి’ పత్రిక తొలి ఉగాది సంచిక 1978లోనే
అచ్చయిందన్న విషయం విశేషం. నాటి నుండి నేటి దాకా కార్యనిర్వాహక సభ్యుల అండదండలతో,
అంకితభావంతో, అపారమైన సామర్థ్యంతో టీసీఎ
అధ్యక్షులుగా వ్యవహరించిన ఎందరో మహనీయులు ఈ సమితిని సర్వతోముఖాభివృద్ధి పథంలో
నడిపించారని ఇక్కడి ముచ్చట్లలో వ్యక్తమైంది.
మా అబ్బాయి ఎనర్జీ కారిడార్‌లో, అమ్మాయి షుగర్ లాండ్ ఏరియాలో
నివసిస్తుండడంతో, వారి వద్ద కొన్ని నెలల పాటు గడుపుదామని
నేను శ్రీమతితో సహా, హ్యూస్టన్ నగరానికి వచ్చాను. ఇక్కడికి
వచ్చిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే, ఈ విధంగా హ్యూస్టన్
తెలుగు సాహితీవేత్తలను కలుసుకునే అపురూప అవకాశం లభించడం నా అదృష్టంగా
భావిస్తున్నాను. రేపు (ఆగస్ట్ 8, 2026) జరగబోయే స్వర్ణోత్సవ
వేడుకలు అత్యంత ఘనంగా, వైభవంగా జరగాలని మనసారా
కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే, మా అల్లుడు కొనికి
కిషన్ ఈ వేడుకలలో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ వేదిక
ద్వారా వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మరీ ముఖ్యంగా, నన్ను ఈ ఆత్మీయ సమావేశానికి ప్రత్యేకంగా
ఆహ్వానించడమే కాకుండా, నేను ఉంటున్న మా అబ్బాయి ఇంటికి స్వయంగా వచ్చి, నన్ను తన కారులో తీసుకువెళ్లి, అక్కడ 'శరవణ భవన్'లో చక్కటి దోశ తినిపించి, తిరిగి మళ్లీ ఇంటి వద్ద దించిన సుధేష్ పిల్లుట్ల గారికి నా ప్రత్యేక
ధన్యవాదాలు. నాకంటే వయసులో సుమారు పదిహేనేళ్లు చిన్నవారైనప్పటికీ, ప్రయాణంలో
వెళ్తున్నప్పుడూ, తిరిగి వస్తున్నప్పుడూ వారు చేసిన ఆధునిక,
సనాతన సాహిత్య అధ్యయనాన్ని, వారి రచనల
వివరాలను నాతో పంచుకున్నారు. ఆ మాటల ద్వారా నాకు ఎన్నో కొత్త విషయాలను
తెలియజేసినందుకు వారికి మరీ మరీ కృతజ్ఞతలు.
ఒక గంట పాటు జరిగిన ఆ
సాహితీ కాలక్షేపం నాకు కేవలం ఒక భోజన సమయపు పరిచయం మాత్రమే కాదు. సుదూర తీరాలలో
మాతృభాషను గుండెల్లో దాచుకున్న ఆత్మీయుల కలయిక. 1957 (1976) లో పడిన మొదటి బీజం నుండి నేటి పాతిక వేల కుటుంబాల
మహా వృక్షం దాకా సాగిన ఈ ప్రస్థానంలో ఎందరో అధ్యక్షులు, కార్యకర్తలు
చేసిన త్యాగాలు శ్లాఘనీయం. యాభై ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా చాటుకుంటూ, రాబోయే తరాలకు తెలుగుదనం యొక్క గొప్పతనాన్ని వారసత్వంగా అందిస్తున్న
‘హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి’ నిస్సందేహంగా ప్రవాసాంధ్ర లోకానికి ఒక
దిక్సూచి. ఈ స్వర్ణోత్సవ వేడుకలు అప్రతిహతంగా, అత్యంత
వైభవంగా దిగ్విజయం కావాలని, ఈ సంస్థ వందేళ్ల పండగను కూడా
ఇలాగే సగర్వంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.


No comments:
Post a Comment