Thursday, June 10, 2010

బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి స్టాలిన్ జోస్యం-భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు విప్లవ పాఠాలు : వనం జ్వాలా నరసింహారావు

(జూన్ నెల 12, 13, 14 తేదీలలో
సీపీఐ జాతీయ సమితి సమావేశాలు
హైదరాబాద్ లో జరుపుకున్న నేపధ్యంలో)

వనం జ్వాలా నరసింహారావు

భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టడానికి వీలు కావచ్చునని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్ ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్పష్టం చేశారు స్టాలిన్. చి యాంగ్‌కై-షేక్ తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్.

హైదరాబాద్ లో మూడు రోజులు జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి సమావేశాలలో సమకాలీన జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు, పార్టీ భవిష్యత్ లో అవలంబించాల్సిన వైఖరికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి. యూపీఏ వైఫల్యాలను ఎండగట్టడంలో వామ పక్షాలు విఫలమయ్యాయని, పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి వామ పక్షాలకు పెద్ద ఎదురుదెబ్బని-పరాజయంగా భావించాలని, బెంగాల్ అనుభవం దృష్ట్యా కమ్యూనిస్ట్ పార్టీ విధాన-రాజకీయ వైఖరులను సమీక్షించుకోవాల్సిన అవసరముందని సమావేశాలను ప్రారంభించిన జాతీయ కార్యదర్శి బర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా, మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి సుమారు అరవై ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగల దా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.

ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, పలు దేశాలను కలవర పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో కార్మికుల సమ్మెలు సుదీర్ఘంగా సాగాయి. ఆ కాలంలోనే, భారత దేశంలో కూడా కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. అదే రోజుల్లో, 1917 నాటి రష్యన్ విప్లవ తదనంతర రాజకీయ-సామాజిక పరిణామాలు ఎన్నో దేశాలపై ప్రభావం చూప సాగాయి. 1919 లో మాస్కోలో ఆవిర్భవించిన మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ-కోమిన్టార్న్, ప్రపంచవ్యాప్తంగా, బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా, అన్ని రకాల పోరాటాలు సలిపి, అంతర్జాతీయ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఎం ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920 న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. భారత దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, దేశంలోని వామ పక్ష భావాలున్న వారిపై కూడా కోమిన్టకర్న్ ప్రభావం పడే ప్రమాదం వుందని భావించి, పలువురి పై తప్పుడు కుట్ర కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నాలు చేసింది. "కోమిన్టిర్న్" సంస్థకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎం ఎన్ రాయ్, వామ పక్ష భావాలకు ఆకర్షితులైన డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త, షౌకత్ ఉస్మాని, సింగరవేలు చెట్టియార్, గులాం హుస్సేన్ లాంటి పలువురు కమ్యూనిస్ట్ భావాల నాయకులపై "కాన్పూర్ కుట్ర కేసు" పెట్టి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. మార్చ్ 17, 1924 న బనాయించిన చారిత్రాత్మక కాన్పూర్ కుట్ర కేసు, పరోక్షంగా, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దోహద పడిందనాలి.

వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, తమ పట్ల బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, డిసెంబర్ 1925 లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. ఇదిలా వుండగా, వారి పురోగతిని అడ్డుకునేందుకు, వారందరి పైనా "మీరట్ కుట్ర కేసు" పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. కాకపోతే, ప్రభుత్వం అంచనాలకు విరుద్ధంగా, ఆ కేసు విచారణ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కార్మికుల్లో అభిమానాన్ని పెంచ సాగింది. జనవరి 1933 లో, "బోల్షవిక్కులని" ప్రభుత్వం ముద్ర వేసిన కేసులోని నిందితులందరి కీ కఠిన శిక్షలు పడ్డాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన న్యాయస్థానం విచారణను, కమ్యూనిజం సందేశం ప్రజల్లోకి పంపే ఆయుధంగా ఉపయోగించుకున్నారు నిందితులు. కమ్యూనిజం ఉద్యమంగా బలపడ సాగింది.

స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో, మరి కొన్నాళ్లలో, స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జోషి మితవాద వైఖరిని, అతివాద భావాల రణదివే అనుచరులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 1948 లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, "స్వతంత్ర భారతదేశం" అంటే, "బ్రిటీష్ సామ్రాజ్య వాదుల పాక్షిక వలస ప్రాంతం" గా పేర్కొని, మితవాదిగా ముద్రవేసిన జోషిని తప్పించి, రణదివే ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది.

మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది అంటారు. ఆ జీవన్మరణ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి.

చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్ఘోనష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్ ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో. ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.

"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్కైు-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

అప్పటివరకు అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే, గోవిందన్ నాయర్, ముజఫర్ అహ్మద్ ల నాయకత్వం, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ఒకప్పుడు అదే జోషి నెహ్రూకు అనుకూలంగా మాట్లాడినప్పుడు ఆయనను తప్పుబట్టింది పార్టీ. డాంగే వర్గం లేవనెత్తిన "జాతీయ వాదన" కు అనుకోకుండా లోక్ సభలో పార్టీ ఉప నాయకుడు ఏ కే గోపాలన్ నుంచి మద్దతు లభించడం ఆశ్చర్యకరమైన విషయం. నెహ్రూ చర్యకు తమ పూర్తి మద్దతుంటుందని గోపాలన్ ప్రకటించారు. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపిఐ సెక్రెటేరియట్ లోని ఎనిమిది మంది సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే-గోపాలన్-ముజఫర్ అహ్మద్ లు నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తులు" గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్ (అంతకు ముందు లేని పదవి) గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్ గా నియమించింది.

అదే సమయంలో, భారత-చైనా యుద్ధం నేపధ్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన "చైనా అనుకూల వాదులు" గా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. డాంగే, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో, మధ్యే మార్గంలో, అతివాద-మితవాద వర్గాలకు సమాన దూరంలో వున్న నంబూద్రిపాద్ లాంటి వారు, అతివాదుల వైపు మొగ్గడానికి దారితీసింది. క్రమేపీ సంభవించిన కొన్ని పరిణామాలు పార్టీ చీలిక దిశగా తీసుకెళ్లాయి. చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964 లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో.

కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. మే నెల 1981 లో కారణాలేమైనప్పటికి, భారత కమ్యూనిస్ట్ పార్టీ పరోక్ష వ్యవస్థాపకుల్లో ఒకరైన డాంగేను, ప్రపంచ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న డాంగేను భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు. డాంగేను ఆయన కూతురు సారధ్యంలో ఆవిర్భవించిన "అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీకి" ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత. ఆ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల సాధ్య పడకపోవడంతో, మోహిత్ సేన్ నాయకత్వంలో పనిచేస్తున్న "ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ" తో కలిసిపోయి "యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ" తో విలీనమయింది. మరోవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పరిస్థితీ అంతే అనాలి. అఖిల భారత స్థాయిలో సోమనాథ్ ఛటర్జీ స్థాయి నాయకులనుంచి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్ట బడ్డ పలువురిని పార్టీ వదిలించుకుంది. మరోవైపు ఆ పార్టీ నుంచి నక్సల్బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన తీవ్రవాదులు, మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నారింకా.

ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి (ఉభయ) కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ రూపు రేఖలే మారిపోయాయి. చైనా పార్టీలోను మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీల వ్యూహం ఎలా వుంటుందో చూడాలి. (End)

Tuesday, June 8, 2010

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో మార్పు సంకేతాలు : వనం జ్వాలా నరసింహా రావు

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో
మార్పు సంకేతాలు
వనం జ్వాలా నరసింహా రావు
కాంగ్రెస్ పార్టీ యోధాన-యోధుడు, సిద్ధాంత కర్త, ఇందిరాగాంధికి అత్యంత సన్నిహితుడు అని పేరు తెచ్చుకున్న సిద్ధార్థ శంకర రే మార్చ్ 19, 1972 నుంచి, జూన్ 21, 1977 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సారధ్యం వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయిందనాలి. గత ముప్పై మూడేళ్ల గా, ఏ పనైతే తన అధికారాన్నంతా ఫణంగా పెట్టినా కాంగ్రెస్ సాధించలేకపోయిందో, దాన్ని, అచిర కాలంలోనే మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సాధించే రోజు దగ్గర పడుతుందని చెప్పడానికి ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన ఘన విజయమే నిదర్శనం.

ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితిని సడలించి 1977 లో సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పుడు, జనతా కూటమితో కలిసి పోటీ చేసిన సీపీఎం, ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో వామ పక్ష కూటమి విడిగా పోటీ చేసి, 243 స్థానాలను గెలుచుకుని, జ్యోతిబసు నాయకత్వంలో కాంగ్రేసేతర-లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా ఐదు పర్యాయాలు లెఫ్ట్ ఫ్రంట్ ను ఎన్నికల్లో గెలిపించి, 27 సంవత్సరాలు (జూన్ 21, 1977-నవంబర్ 6, 2000) ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు, స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుని, బుద్దదేబ్ భట్టాచార్యకు వారసత్వం అప్పగించారు. అప్పటినుంచి ముఖ్యమంత్రిగా బుద్దదేబ్ (నవంబర్ 6, 2000 నుంచి ఇప్పటి దాకా) పదవిలో కొనసాగుతూ, తృణమూల్ కాంగ్రెస్ కు శాసనసభలో గెలుపు దక్కకుండా కాపాడుతూ వస్తున్నాడు. ఇక ముందు అలా కాపాడగలగడం ఆయనకు కష్టమై పోతుందని చెప్పొచ్చు. మున్ముందు పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించే అవకాశాలు మెండుగా వున్నాయి.

వామ పక్ష రాజకీయ పార్టీలన్నీ ఐక్యమై, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించుకున్న నేపధ్యంలో, అనేక కష్ట-నష్టాలను అధిగమించుకుంటూ కొనసాగించిన సుదీర్ఘ ప్రజా పోరాటం ఫలితంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకత్వంలో, వామ పక్ష కూటమి, నాలుగు దశాబ్దాల క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ, నిలుపుకో గలిగింది మాత్రం ఆ తర్వాత ఏడేళ్ల నుంచి మాత్రమే. ఆ మాటకొస్తే, ప్రపంచం మొత్తంలోనే, మొట్టమొదటి సారి, బుల్లెట్ ద్వారా కాకుండా బాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా భారత దేశంలోని కేరళ రాష్ట్ర ఓటర్లకు దక్కింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించిన ఘనత కూడా భారత దేశానికే దక్కింది.

సామాన్య ప్రజానీకానికి మేలు చేయాలన్న లక్ష్యంతో వామపక్ష-కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, 1952 నుంచి, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక-నిరంకుశ విధానాలను ఎదుర్కొంటూ పశ్చిమ బెంగాల్ లో వామ పక్షాలు బలపడ సాగాయి. వామ పక్షాల ఐక్యతను-కూటమి అధికారాన్ని, సవాలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొన్ని సార్లు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మమత బెనర్జీ నాయకత్వంలో కొన్ని సార్లు, ఎన్నికల సమయంలో అవగాహనలు కుదుర్చుకున్నప్పటికీ, సుమారు నాలుగు దశాబ్దాలుగా "ఎర్రకోటకు బీటలు" పడకుండా అక్కడి ఓటర్లు జాగ్రత్త పడ్డారు.

చరిత్ర పుటలు తిరగేస్తే గాని పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్ర అర్థంకాదు. ఆ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు. ఉద్యమాలు ఈ నాటివి కూడా కాదు. స్వాతంత్ర్య పోరాట కాలంలో, గత శతాబ్దపు నలభయ్యో దశాబ్దంలోనే, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక-శ్రామిక శక్తులను ఐక్యం చేసిన ఘనత బెంగాల్ కుంది. స్వాతంత్ర్యం రాక ముందే కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ లో ఉద్యమాలకు నాయకత్వం వహించింది. స్వతంత్ర భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రంలో 1953 లో-1965 లో ట్రామ్ చార్జీలు పెంచినప్పుడు, 1954 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ బి. సి. రాయ్ వున్నప్పుడు సంభవించిన కరవుపై పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా పి. ఎల్. 480 పథకానికి వ్యతిరేకంగా 1960 నాటి విద్యార్థి పోరాటం, 1962 భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరపాలని చేసిన ఉద్యమం చరిత్ర ప్రసిద్ధికెక్కినవే. అలాంటి ఎన్నో ఉద్యమాల ఫలితంగానే అక్కడి ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అభిమానం పెరుగుతూ వచ్చింది.

ఆ నేపధ్యంలో 1967 లో పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా విడి-విడిగా, "యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో ఒక కూటమి, "పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో మరో కూటమి ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల అనంతరం రెండు కూటములు కలిసి "యునైటెడ్ ఫ్రంట్" గా కలిసి, మైనారిటీ కూటమికి చెందిన బంగ్లా కాంగ్రెస్ నాయకుడు అజోయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధిక సంఖ్యాక బలమున్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు జ్యోతి బాసు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారప్పుడు. అజోయ్ ముఖర్జీ 15 మార్చ్, 1967 నుండి 2 నవంబర్ 1967 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. మూడు నెలల పాటు (2 నవంబర్, 1967-20 ఫిబ్రవరి, 1968 వరకు) స్వాతంత్ర్యం వచ్చిన తొలినాటి రోజుల్లో ముఖ్యమంత్రిగా వున్న పి. సి. ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు. ఆయన పదవిలో వుంచడం కష్టం కావడంతో, అప్పటినుంచి ఏడాది కాలం రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం.

ఏడాది తర్వాత, 1969 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగి, మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ ఎక్కువ కాలం అధికారంలో వుండనీయలేదు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 25, 1969 నుంచి మార్చ్ 19, 1970 వరకు ముఖ్యమంత్రిగా వున్న అజోయ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని రద్దుచేసింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా "పశ్చిమ బెంగాల్ వ్యవహారాల" కొరకు కాబినెట్ మంత్రిగా నియమించబడిన సిద్ధార్థ శంకర్ రే చాణక్య నీతిలో భాగంగా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేవలం 13 నెలల కాలంలోనే రెండో పర్యాయం రద్దు చేసింది కేంద్రం. తిరిగి మరి కొంతకాలం (మార్చ్ 19, 1970-ఏప్రిల్ 2, 1971) రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం కేరళతో (నంబూద్రిపాద్ ను తొలగించడంతో) ప్రారంభమై, బెంగాల్ కు పాకింది. క్రమేపీ భారత దేశ రాజకీయాలలో అలా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం "సాంప్రదాయం" గా మారిపోయింది. ఆ పాపంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా ఏం తీసిపోలేదు. కమ్యూనిస్ట్ పార్టీల సారధ్యంలో వున్న ప్రభుత్వాలను రద్దుచేస్తున్న రోజుల్లో, ఆ పార్టీ తప్ప ఇతర కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, ఆ చర్య తప్పని గట్టిగా వ్యతిరేకించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టం.

ఏదేమైనా, 1971 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గతంలో మాదిరి "యునైటెడ్ ఫ్రంట్" గా కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు కలిసి పోటీకి దిగలేదు. సీపీఎం పార్టీ ఆలోచనా ధోరణికి అనుకూలమైన కొన్ని పార్టీలు సీపీఎం తో జతకట్టి పోటీ చేశాయి. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాకపోయినా, సీపీఎం అతి పెద్ద పార్టీగా-ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీగా అవతరించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అప్పటి గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడ్డారు. మరో పర్యాయం పి. సి.ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు (ఏప్రిల్ 2, 1971-జూన్ 28, 1971). సీపీఎం రాష్ట్ర వ్యాప్త ఆందోళనను చేపట్టింది. ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రజాస్వామ్య పోరాటమే మార్గమని భావించింది. ఘోష్ మనుగడ కష్టమై పోవడంతో మళ్లీ రాష్ట్రపతి పాలన (జూన్ 28, 1971 నుంచి మార్చ్ 19, 1972 వరకు) విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పకడ్బందీ వ్యూహంతో మరో మారు ఎన్నికల్లో దిగి, సీపీఎం ప్రాబల్యాన్ని ఎలాగైనా తగ్గించాలన్న ఆలోచన చేసింది ఇందిరా గాంధి ప్రభుత్వం. ఆమె కనుసన్నల్లో సిద్ధార్థ శంకర రే ఆ ప్రణాళికను అమలు పరిచాడు. అధిష్టానం ఆశీస్సులతో ఐదేళ్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.

1972 ఎన్నికలు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చే రీతిలో జరిగాయి. బూతుల ఆక్రమణ, దొంగ ఓట్ల స్వైర విహారం, ఓట్ల లెక్కింపులో అవకతవకలు భారీ ఎత్తున జరిగింది. ఎట్టి పరిస్థితిలలోను సీపీఎం పార్టీ అధికారంలోకి రాకుండా కట్టుదిట్టమైన అ నైతిక చర్యలన్నీ అవలంబించింది అలనాటి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ. సీపీఎం పార్టీ వామపక్ష కూటమికి సారధ్యం వహించి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఎన్నికలలో జరిగిన అక్రమాల కారణంగా, రిగ్గింగుకు వ్యతిరేకంగా దాదాపు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, ఆ పార్టీకి స్థానాలు తక్కువే వచ్చినా, ఓటింగ్ శాతం మాత్రం 28% వరకు వుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగు శాతానికి అనుగుణంగా సీట్లు వచ్చి వుంటే, ఆ సంఖ్య 80 (సీపీఎం స్థానాలు) వరకుండేది. బలమైన ప్రతిపక్షంగా వుండి వుండేది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి 216 స్థానాలు, సీపీఎం కు కేవలం 14 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంత జరిగింతర్వాత-ప్రజాస్వామ్యం అవహేళనకు గురైన తర్వాత, ఆ నేపధ్యంలో ఏర్పడిన శాసనసభలోకి ప్రవేశించరాదని తీర్మానించుకుంది సీపీఎం. శాసన సభ్యులుగా గెలిచిన ఆ పార్టీకి చెందిన వారెవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. నైతిక విలువలకు అనుగుణంగా ఐదేళ్లు జీతభత్యాల జోలికి పోలేదు.

ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ను సీపీఎం నుంచి విముక్తి చేయాలన్న దృఢ సంకల్పంతో 1997 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించింది కుమారి మమత బెనర్జీ. అచిర కాలంలోనే, సీపీఎం కు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమత బెనర్జీ, సీపీఎం ను గద్దె దింపడానికి అవకాశం వున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. ఎన్డీయే తో జతకట్టింది. పడకపోతే బయటకొచ్చింది. 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్ట్-లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించ లేకపోయింది. తన పార్టీ పక్షాన గెలిచిన ఏకైక లోక్ సభ సభ్యురాలిగా 2004 లో కేంద్ర మంత్రివర్గంలో చేరింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పారిశ్రామిక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత, ఆమె పార్టీ కార్యకర్తలు అక్టోబర్ 2005 లో ఆందోళన చేశారు. 2006 శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గతంలో గెలిచిన స్థానాలలో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. అయినా పోరాటం కొనసాగించింది. అదే సంవత్సరం ఆగస్టు నెలలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మమత నవంబర్ నెలలో టాటా మోటార్స్ కార్ల కర్మాగారం స్థాపన విషయంలో ఆందోళన చేసేందుకు సింగూరు వెళుతుంటే, మధ్యలో బలవంతంగా ఆపు చేసింది ప్రభుత్వం. శాసనసభ ప్రాంగణంలోకి వెళ్లి నిరసన తెలియచేసిందామె. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగి ఫర్నీచర్ ను, మైకులను ధ్వంసం చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా పోటీ చేసి, ఇరువురు కలిసి 26 స్థానాలను (మెజారిటీ) గెల్చుకుని రాబోయే రోజుల్లో సీపీఎం కు గడ్దు రోజులు రాబోతున్నాయన్న సంకేతాన్ని పంపారు. తృణమూల్ ఆందోళన ఫలితంగానే నంది గ్రామ్ లో రసాయన కేంద్రం స్థాపన ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విరమించుకోవాల్సి వచ్చింది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు మమత చేసిన కృషికి సింగూరు, నంది గ్రాం సంఘటనలు ఉదాహరణలుగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. వీటన్నిటి నేపధ్యంలో, జరిగిన మునిసిపల్ ఎన్నికలు, కలకత్తా కార్పొరేషన్ ఎన్నికలు, తృణమూల్ కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చాయి. ఇక శాసన సభ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధమౌతుంది మమత.

సీపీఎం పాలన పగ్గాలు జ్యోతిబసు చేతిలో వున్నంత కాలం మమత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ ఇరవయ్యే డు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో ప్రజలు స్వర్ణ యుగం చూసి వుండవచ్చు. దరిమిలా బుద్దదేబ్ పాలనలో తృణమూల్ ఎదుగుదలకు ఆస్కారం లభించింది. దీనికితోడు, దీర్ఘకాలం అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకత రావడం కూడా సహజం. నంది గ్రాం, సింగూరు ఘటనలు, మరికొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు సీపీఎం కు మునిసిపల్ ఎన్నికలలో పరాజయాన్ని చవి చూపాయి. సీపీఎం ఓటమి, తృణమూల్ గెలుపు తాత్కాలికమా, లేక, తాత్కాలికంగా శాశ్వతమా అన్నది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం. సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశాలకు బుద్దదేబ్ హాజరు కాకపోవడం వెనుక కారణాలు అన్వేషించాలి. పశ్చిమ బెంగాల్ లో పార్టీ పనితీరు పట్ల, పార్టీ ఓటమి పట్ల శాస్త్రీయంగా సమీక్ష జరిగిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయి. సీపీఎం భాగస్వామ్య పక్షమైన సీపీఐ మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ పనితీరును విమర్శించింది. సీపీఎం అవలంబిస్తున్న "అహంకార పూరిత-ఉద్యోగ స్వామ్య-పెత్తందారీతన విధానాన్ని" దుయ్యబట్టింది మరో లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ దృష్టిలో, రాబోయే శాసన సభ ఎన్నికలలో సీపీఎం విజయం క్లిష్టమైందనే భావం వ్యక్తమైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఆనందానికి హద్దుల్లేవనిపిస్తుంది. భవిష్యత్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు వుంటుందని, సీపీఎం సారధ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించి తీరుతామని ధీమాతో వున్నారాయన.

కేవలం 20% మంది ఓటర్ల తీర్పుతో ఘన విజయం సాధించిన మమత, మిగతా ఓటర్ల తీర్పులో కూడా విజయం సాధించుతారో, లేదో, తేలే రోజు తొందరలోనే రాబోతుంది. అంతవరకూ వేచి చూద్దాం.

Saturday, June 5, 2010

VIII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-8) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-8
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ఆగస్ట్ 14, 2007 న, (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్వహణ వ్యయం విషయం చర్చకొచ్చింది. సమావేశానికి చైర్మన్ రాజు, సీ.ఇ.ఓ వెంకట్ లతో నేను కూడా హాజరయ్యాను. రాజశేఖర రెడ్డి వారసులు రోశయ్య ఆర్థిక మంత్రి హోదాలో హాజరయ్యారు. వాస్తవానికి ఆ సమావేశానికి మేమెవరం హాజరవ్వాలన్న నిర్ణయం మొదలు లేదు. కేవలం, అవసరమైన వివరణలు ఇవ్వడానికి బయట వేచి వుండమనే అడిగారు మమ్మల్ని. అయితే, సమావేశం జరిగే సమయంలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు-అవసరమైతే వివరణ ఇచ్చేందుకు తాను కూడా సమావేశం మందిరం వెలుపల వేచి వుండడానికి అనుమతి కోరారు రాజు గారు. ముఖ్యమంత్రి ఆనాటి సమీక్షా సమావేశం జరగడానికి సరిగ్గా మరో ఐదారు గంటల వ్యవధి మాత్రమే వుందనగా, వెంకట్ గారి దగ్గర్నుంచి నాకు ఫోనొచ్చింది. చైర్మన్ రాజు కూడా మన లాగే సమావేశం జరిగే సమయంలో బయట వేచి వుండాలని అనుకుంటున్నారని, అందుకు అవసరమైన అనుమతులు పొందాలని నాకు చెప్పారు వెంకట్. అందుకు కారణం వుంది. పదిహేను రోజుల క్రితం, హెచ్.ఎం.ఆర్.ఐ కి సంబంధించి, ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కూడా వుండడం, ఆ సందర్భంలో హెచ్.ఎం.ఆర్.ఐ తో పాటు ఇ.ఎం.ఆర్.ఐ కి కూడా సరాసరి నిర్వహణ వ్యయంలో నూటికి 95% ప్రభుత్వం సమకూరుస్తుందని రాజశేఖర రెడ్డి అనడం జరిగింది. దానికి సాక్ష్యం రాజు గారు. నేనా విషయాన్ని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అగర్వాల్ దృష్టికి తెచ్చాను. ఆయనను బయట వేచి వుంచడం బదులు, సమావేశానికి రమ్మనడం, ఆయనతో పాటు మేమూ వెళ్లడం జరిగింది. అదీ అప్పట్లో అత్యవసర సహాయ సేవలన్నా-ఆ సంస్థకు చెందిన వారన్నా వుండే గౌరవం.

సమీక్షా సమావేశంలో, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. మరింత స్పష్టమైన "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" లో ఈ సేవలను విస్తరించాల్సిన సమయం ఆసన్నమయిందని, దానికి అనుగుణంగా లోగడ ఎంఓయు లో పేర్కొన్న కొన్ని అంశాలను, మార్చాల్సి వుంటుందని ఆయన అన్నారు. స్థూలంగా, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందని, యాజమాన్య పరమైన వ్యయాన్ని సంస్థ భరించాల్సి వుంటుందని అంటూనే, 2007-2008 ఆర్థిక సంవత్సరంలో మాత్రం, ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఆ వ్యయం కింద రు. 68, 700 ప్రభుత్వం భరిస్తుందని, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి 95% నిర్ణయం అమల్లోకి వస్తుందని, అప్పటికి 502 అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తాయని అన్నారు ముఖ్యమంత్రి. అత్యవసర సహాయ సేవలను "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం గొడుకు కిందకు తేవాలన్న నిర్ణయం కూడా ఆ రోజునే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. ఈ అంశాలను పొందు పరుస్తూ ఎంఓయు తయారు చేసేందుకు ఆదేశించారాయన.

మర్నాడు ఆగస్ట్ 15, 2007 హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన బ్రహ్మాండమైన సదస్సులో రాజీవ్ ఆరోగ్య శ్రీ "లోగో" ను మాజీ రాష్ట్రపతి-ఇ.ఎం.ఆర్.ఐ గౌరవ అధ్యక్షులు ఏ.పి.జె అబ్దుల్ కలాం విడుదల చేశారు. అలాగే అత్యవసర సహాయ సేవలను జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చైర్మన్ రాజు తో పాటు పలువురు ఉన్నతాధికారులు-అనధికారులు సమావేశానికి హాజరయ్యారు. ప్రతిపక్షానికి చెందిన సీ.పి.ఐ నాయకులైన కె. నారాయణ గారి లాంటి వారు కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో అతిధులను వేదిక పైకి ఆహ్వానించడంతో సహా, సభా కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను వెంకట్ గారు నాకు అప్పగించారు ఆఖరు క్షణంలో. ఏ తాజ్ కృష్ణాలో ఆ సమావేశం జరిగిందో, అదే హోటల్ యజమాని, అది జరిగిన రెండు సంవత్సరాల లోపునే, ఇ.ఎం.ఆర్.ఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆయనతో సహా బహుశా ఎవరూ ఊహించి వుండరు. అంత గొప్ప సమావేశం మళ్లీ జరుగుతుందా అన్నది సందేహమే !

ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న "విశ్వాసం-నమ్మకం" మరికొంత కాలం కొనసాగుతూనే వుందనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. డిసెంబర్ 18, 2007 న (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మరో సమీక్షా సమావేశంలో ఇ.ఎం.ఆర్.ఐ ఆధ్వర్యంలో అమలవుతున్న అత్యవసర సహాయ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం సూత్రప్రాయంగా మరో నిర్ణయం తీసుకుంది. అప్పటికి, అంబులెన్సులన్నీ కలిసి ప్రతి రోజు తిరుగుతున్న 2870 ట్రిప్పులను, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా 8000 ట్రిప్పుల సామర్థ్యానికి పెంచాలని, దానికి సంబంధించిన దశలవారీ ప్రతిపాదనలను ఇ.ఎం.ఆర్.ఐ తయారు చేసి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కు అందచేయాలని, అందుకు కావాల్సిన నిధులను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద, రాష్ట్ర బడ్జెట్ కింద సమకూర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ నిర్ణయానికి కట్టుబడ్డ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్, దరిమిలా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చారు. అయితే వీటిలో కనీసం 100 వరకు తిరగక పోవడం విచారకరం.

95% నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం ఎంత భరించాలన్న నిర్ణయం తీసుకోవడంలో నాటి ఆరోగ్య-వైద్య శాఖల ముఖ్య కార్యదర్శి పి. కె. అగర్వాల్ తీసుకున్న చొరవ ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న"విశ్వాసానికి-నమ్మకానికి" మరో నిదర్శనం. ఊహించని సమయాన్ని దీని కొరకు కేటాయించిన అగర్వాల్ గారు, స్వయంగా, మేమిచ్చిన ప్రతిపాదనలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, నిశితంగా మాతో గంటల తరబడి చర్చించి, ఆ మొత్తాన్ని ఒక్కో అంబులెన్సుకు రు. 1, 12, 499 గా నిర్ణయించి, ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు-తర్వాత 802 కు పెరిగినప్పుడు, తగ్గుతుందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. 2008-2009 ఆర్థిక సంవత్సరం అమలవ్వాల్సిన ఈ నిర్ణయం పూర్తిగా ఆర్థిక సంవత్సరం ముగియకుండానే, రాజు గారి నిష్క్రమణం జరగడంతో, ఊహించని కొన్ని విషయాలు బయటకు పొక్కి, పలు అనుమానాలకు దారి తీసింది. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో !

రెండో విడత అధికారం చేపట్టి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిపించిన మర్నాడు-మే నెల 26, 2009 న, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనకు బయల్దేరడానికి ముందర, ఆ ఉదయం మమ్మల్ని అత్యవసర సహాయ సేవల సంగతి తెలుసుకునేందుకు రమ్మన్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. అంతకు నాలుగైదు రోజుల క్రితం ముఖ్యమంత్రికి వెంకట్ గారు ఒక లేఖ రాశారు. మే నెల 5, 2008 న ఇ.ఎం.ఆర్.ఐ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తూనే, సంస్థ అప్పట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో, ప్రభుత్వ పరంగా సంస్థకు అదనపు నిధుల ఆవశ్యకతను వివరిస్తూ రాసిన లేఖ అది. ఆ రోజు వరకు అత్యవసర సహాయ సేవల ద్వారా 26 లక్షల మంది లబ్ది పొందారని, సుమారు 47 వేల ప్రాణాలు కాపాడ కలిగామని, ప్రభుత్వ సహాయంతో 752 అంబులెన్సులను నిర్వహిస్తూ ప్రతి రోజూ సుమారు సగటున 5420 ఎమర్జెన్సీలకు స్పందిస్తున్నామని-ఆసుపత్రులకు చేరుస్తున్నామని లేఖలో వివరించారు. రాజు గారు సంస్థ చైర్మన్ గా రాజీనామా చేసిన అనంతరం, జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశంలో, సరాసరి నిర్వహణ వ్యయంలో, అవసరమైతే 95% కు బదులు నూటికి 100% ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని లేఖలో గుర్తు చేశారు వెంకట్. అయితే అసలు-సిసలైన ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో విశ్వాసం వున్న ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం (రాజు గారు చైర్మన్ గా తొలిగానా) తమ వంతు వ్యయం చేయాల్సిన 5% నిర్వహణా పరమైన నిధులను-ఇతర యాజమాన్య పరమైన ఖర్చులను సమకూర్చే దాతల అన్వేషణ కొరకు నాలుగు నెలల వ్యవధి కోరిన విషయం కూడా లేఖలో గుర్తు చేశారు వెంకట్.

దురదృష్ట వశాత్తు తామెన్ని ప్రయత్నాలు చేసినా అంతవరకు అవి ఫలించలేదన్నారు. ఆ కారణాన తమ వంతు వాటాగా 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాల్సిన 5% (సుమారు రు. 5 కోట్ల నిర్వహణ ఖర్చులు) నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని విఙప్తి చేశారు. నిర్వహణ వ్యయం కింద అప్పటి వరకు 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఐన రు. 90 కోట్ల వ్యయంలో రు. 85 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని, మిగతా రు. 5 కోట్ల విడుదలకు ఆదేశాలివ్వాలని కోరారాయన. అదనంగా యాజమాన్య జీత-భత్యాల కొరకు మరో రు. 4 కోట్ల 8 లక్షలు ఖర్చయ్యాయని వివరించారు. ఆ వ్యయాన్ని తమ వంతు వాటాగా భావించాలని కూడా కోరారు. అప్పట్లో సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ఆ ఐదు కోట్లను-అదనంగా మూల వ్యయం కొరకు మరో మూడు కోట్లను, మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసి-విడుదల చేసేందుకు ఉత్తర్వులివ్వాల్సిందిగా వెంకట్ ముఖ్యమంత్రిని తన లేఖలో అభ్యర్థించారు. అందులోనే పిరమల్ ఫౌండేషన్ ప్రయివేట్ భాగస్వామిగా, ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి కనబరిచిన విషయం-త్వరలోనే అది సఫలం కానున్న విషయం కూడా వివరించారు వెంకట్. కాకపోతే ఆ లేఖ పంపిన మర్నాడే, పిరమల్ ఫౌండేషన్ నిరాసక్తిని వ్యక్తపరుస్తూ వెంకట్ కు సందేశం ఇవ్వడం, ఆయన నిరాశకు గురి కావడం, ముఖ్యమంత్రితో సమావేశం జరుగుతే మంచిదని భావించడం, ఆయన కోరుకున్న విధంగానే-ఆయన అడగకుండానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మే నెల 26, 2009 ఉదయం సమావేశం గురించి పిలుపు రావడం భగవదేఛ్చ అనుకోవాలి. లేదా వెంకట్ సంకల్ప బలం అనుకోవాలి !

ఆ ఉదయం సమావేశం జరిగిన తీరు "మరవలేని మరో అద్భుత సన్నివేశం". సమావేశం ఆరంభమవుతూనే వెంకట్ గారిని ఉద్దేశించి, తమ పార్టీ విజయానికి 108-అత్యవసర సహాయ సేవల అంబులెన్సుల పథకం ఎంతగానో తోడ్పడిందని అన్నారు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఇంతకు ముందే రాసినట్లు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు ప్రయివేట్ భాగస్వామ్య పరంగా నిధులను సమకూర్చే విషయంలో స్వయంగా జోక్యం చేసుకుని, అధికార బలాన్ని కాకుండా-వ్యక్తిగత ఆకర్షణ, పలుకుబడిని ఉపయోగించే పద్ధతిలో, జీ.వి.కె అధిపతి డాక్టర్. జీ. వి. కృష్ణారెడ్డి తో ఫోన్లో మాట్లాడి, బరువు-బాధ్యతలను ఆయన స్వీకరించేందుకు ఒప్పించారు రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ నిర్ణయం పూర్వ-ఉత్తర రంగాల్లో అత్యవసర సహాయ సేవల విషయంలో విలువైన సూచనలు చేశారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నయో-ఎన్ని నోచుకోలేదో అన్న విషయం తేల్చాల్సింది ప్రభుత్వం (ఏప్రియల్ 2010 లో) నియమించిన కమిటీనే. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఆ ప్రస్తావన లేకపోవడానికి కారణాలేంటో ?

రాజీవ్ ఆరోగ్య శ్రీ గొడుగు కింద పనిచేస్తున్న 108, 104, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించి నిరంతర ప్రభుత్వ మానిటరింగ్ జరగాలని, ఇవన్నీ ఒకే శాఖాధిపతి కింద వుండే వీలు గురించి పరిశీలన జరగాలని ఆ రోజున ముఖ్యమంత్రి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ, హెచ్.ఎం.ఆర్.ఐ, ఆరోగ్య శ్రీ లకు కలిపి ఒక ప్రత్యేకమైన "ట్రస్ట్" ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. అలా చేస్తే సేవలందించడంలో నైపుణ్యం, సామర్థ్యం, వృత్తి పరమైన దక్షత పెరిగే అవకాశం వుందన్నారు. వీటి సాధ్య-అసాధ్యాలకు సంబంధించి “మేధ మథనం” జరుగు తే మంచిదని కూడా సూచించారాయన. అయితే సంస్థల ప్రత్యేకత, ఆనవాలు-గుర్తింపు (ఐడెంటిటీ) కు భంగం కలగని విధంగా చర్యలు చేపట్టాలని, నియంత్రణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య-వైద్య శాఖలకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా చేయాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్థిక పరమైన యాజమాన్య వ్యవహారాలను, వ్యయ నియంత్రణలను, నిర్వహణ సమస్యలను, ప్రభుత్వంతో సమన్వయం-సంఘటితం విషయాలను, సంస్థాగత నిర్మాణాన్ని, అధికారాలను, విధులను, బాధ్యతలను, పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని, సంబంధిత ఇతర విషయాలను పర్యవేక్షించేందుకు ఎలాంటి కమిటీ వుంటే బాగుంటుందో పరిశీలించమని అధికారులను-ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ కమిటీ రూపు-రేఖలు ఎలా వుండాలో ఆలోచన చేయమని కోరారు ముఖ్యమంత్రి. ఒక వేళ "రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్" కు ఆ బాధ్యతలు అప్పగిస్తే, దరిమిలా ఆవిర్భవించనున్న "సంఘటిత (Integrated) పథకం" అమలు విషయంలో కుటుంబ సంక్షేమ శాఖ పాత్ర ఎలా వుండాలో నిర్ణయించాలని సూచించారాయన. ప్రభుత్వ పరంగా నిధులను సమకూర్చడంలో ఒక్కో ఏడాది గడిచినా కొద్దీ భారం పెరుగుతుంది కాబట్టి, అత్యవసర పరిస్థితి నుంచి ఆసుపత్రికి వైద్య సహాయం అందించే వరకు ప్రభుత్వ పరంగా-ఇ.ఎం.ఆర్.ఐ పరంగా సేవల ఉపయోగం విషయంలోను, మంచి-మంచి పద్ధతులను పంచుకోవడం విషయంలోను, మాన్యత (వాలిడేషన్) విషయంలోను, నిధుల సేకరణ విషయంలోను, కమ్యూనికేషన్ విషయంలోను, చేసిన తప్పులు సరి దిద్దుకునే విషయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఆయన ఆనాడు చెప్పిన "ఆణి ముత్యాల లాంటి సూచనలు, సలహాలు, ఆదేశాలు" ఆ తర్వాత రూపొందించిన సమావేశ వివరణ పత్రం (మినిట్స్) లో కొన్ని మాత్రమే చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు:

• మే నెల 5, 2008 న ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలి. ఎంఓయు అమలు కాలంలో సంభవించిన పరిణామాలను సవరణలు రూపొందించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి.

• నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలి. కాకపోతే, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెటుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలి. ఇలా పరిగణించేటప్పుడు కింది నిబంధనలను పాటించాలి:

• ఆంధ్ర ప్రదేశ్ ఆపరేషన్సుకు సంబంధించి ఇ.ఎం.ఆర్.ఐ చేస్తున్న ఖర్చును స్పష్టంగా నమోదు చేసి ప్రభుత్వానికి తెలియచేయాలి.

• ఇతర రాష్ట్రాలలో కూడా ఇ.ఎం.ఆర్.ఐ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన యాజమాన్య పరమైన వ్యయాన్ని, తగు నిష్పత్తిలో నమోదు చేయాలి.

• ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలి.

• అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుంది. 2009-2010 సంవత్సరానికి బడ్జెట్ తయారు చేసేటప్పుడు, ప్రభుత్వం తన బాధ్యతగా అంగీకరించిన నిధులను సమకూర్చే పద్ధతిలో, తగు ఏర్పాటు చేస్తుంది.

• పారదర్శకతను మరింత స్పష్టంగా పాటించడానికి ఇ.ఎం.ఆర్.ఐ చొరవ తీసుకోవాల్సిన అంశాలు:

• 108-అత్యవసర సహాయ సేవల లబ్దిదారులకు ముఖ్యమంత్రి సంతకంతో ఉత్తరాలు పంపాలి. ఆరోగ్య శ్రీ పథకం లబ్దిదారుల నుండి ఎలా "ఫీడ్ బాక్" తీసుకుంటున్నారో అలాంటి పద్ధతి ఇ.ఎం.ఆర్.ఐ కూడా అమలు పరచాలి.
• పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజలందరు చూడడానికి అనువుగా "వెబ్ సైట్" ను రూపొందించి, అందులో ప్రతి ట్రిప్పుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలి.
• జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 108-అత్యవసర సహాయ సేవలకు సమకూరుస్తున్న నిధులను తగ్గించే ప్రయత్నం చేయకుండా-లోగడ మాదిరిగానే బడ్జెట్ కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి సంతకంతో ప్రధాన మంత్రికి లేఖ వెళ్లాలి.

మినిట్స్ లో పొందుపరిచిన వాటిలోని అంశాలు, పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన సూచనలు, అమలుకు ఎంతవరకు నోచుకున్నాయో అన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ అంశాలపై ఎంతవరకు దృష్టి పెట్టిందో? ఈ అంశాలన్నీ అమలు జరిగుంటే ఒడిదుడుకులకు ఆస్కారం వుండకపోయేదేమో !

Saturday, May 29, 2010

VII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-7): వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-7
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

గతంలో ప్రభుత్వ పరంగా (దివంగత) ముఖ్యమంత్రి తో సహా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారుల వరకు, వారి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశాలకు, ఫిబ్రవరి 4, 2010 న ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి "ప్రభుత్వానికి ఇ.ఎం.ఆర్.ఐ పనితీరు పట్ల అవగాహనకు సంబంధించి" స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, అప్పటి-ఇప్పటి సమీక్షా సమావేశాల మధ్య "నమ్మకం-అపనమ్మకం", "విశ్వాసం-వంచన" కు మధ్య ఎంత తేడా వుంటుందో అంత తేడా వున్నదని చెప్పొచ్చునేమో ! ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఈ పరిస్థితిలో-ఆలోచనా ధోరణిలో మార్పురానంత కాలం అత్యవసర సహాయ సేవల అమలు గతంలో మాదిరి జరిగే అవకాశం లేదు. అటు ప్రభుత్వం, ఇటు ఇ.ఎం.ఆర్.ఐ అధికారులు ఆ దిశగా ప్రభుత్వం నియమించిన కమిటీతో తమ ఆంతరంగాన్ని అరమరికలు లేకుండా ఆవిష్కరించే ప్రయత్నం చేసితీరాలి. ఇరువురు భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం గాని కమిటీ సిఫార్సులు ముఖ్యంకానేకావు. అలాంటి (లోగడ వున్న మాదిరిగానే) విశ్వాసం-నమ్మకం ఇరువురు భాగస్వాముల మధ్య పునరుద్ధరించడానికి అవసరమైన తక్షణ చర్యలకు ప్రభుత్వం నియమించిన కమిటీ శ్రీకారం చుట్టడం ప్రధానం. అది జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడమే జరిగితే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం-పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో !

ఇ.ఎం.ఆర్.ఐ సంస్థతో మూడున్నర సంవత్సరాలు అనుబంధం వున్న వ్యక్తిగా, "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" ఆవిర్భావం నుంచి ఆరోహణ వరకు-ఉన్నత శిఖరాలకు చేరుకోవడం దాకా, నా వంతు (ప్రధాన?) భూమిక నిర్వహించిన వ్యక్తిగా, ఇ.ఎం.ఆర్.ఐ సమకూరుస్తున్న 108-అత్యవసర సహాయ సేవల విషయంలో ఆ సంస్థపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒకప్పుడున్న "నమ్మకానికి-విశ్వాసానికి" సంబంధించిన ఒకటి-రెండు అంశాలను పేర్కొంటానిక్కడ.

రామలింగ రాజు గారి సారధ్యంలో ఆగస్టు నెల 2005 లో 108-అత్యవసర సహాయ సేవలను ఆరంభించిన రోజుల్లోనే (ఆ పాటికే రాష్ట్ర ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ మధ్య మొదటి అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది), ఒక వైపు ఇ.ఎం.ఆర్.ఐ ని "రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా గుర్తించిన ప్రభుత్వం, మరో వైపునుంచి అదే తరహా సేవలకు, కుటుంబ సంక్షేమ శాఖ నేతృత్వంలో శ్రీకారం చుట్టింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద, కేంద్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్రంలోని ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో-ఐ.టీ.డి.ఏ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో 122 అంబులెన్సులను ప్రవేశపెట్టింది. ఇ.ఎం.ఆర్.ఐ అధికారులు ఆ పని తమకు అప్ప చెప్పమని అడిగినా నాటి కుటుంబ శాఖ కమీషనర్, ఐఎఎస్ అధికారి శ్రీ చిట్టా బాల సత్య వెంకట రమణ, అంగీకరించలేదు. అచిర కాలంలోనే ఇ.ఎం.ఆర్.ఐ హైదరాబాద్ తో ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాల్లోను-పట్టణాల్లోను (50 కి పైగా) సొంత ఖర్చుతో 70 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందించడం, ఆ సేవలకు జాతీయ-అంతర్జాతీయ గుర్తింపు రావడం జరిగింది. ఏ కమీషనరై తే (శ్రీ సీ.బి.ఎస్. వెంకట రమణ) "అనుభవం" లేదన్న కారణాన మొదటి దశ 122 అంబులెన్సులను ఇ.ఎం.ఆర్.ఐ కి అప్పగించడం కుదరదన్నా రో, అదే కమీషనర్, మిగిలిన 18 జిల్లాల్లో ప్రవేశ పెట్టదలిచిన 310 అంబులెన్సుల నిర్వహణ బాధ్యత అదే ఇ.ఎం.ఆర్.ఐ కి "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ గారి "నమ్మకం-విశ్వాసం" తో కూడుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది.

310 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను ఇ.ఎం.ఆర్.ఐ కి అప్పగించడంలో సీ.బి.ఎస్ వెంకటరమణ గారి చొరవ-వేగం తో సరిసమానంగా ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం కూడా చొరవ తీసుకున్నట్లయితే, కనీసం నెల రోజుల ముందే రెండో ఎంఓయు పై సంతకాలు చేయడం జరిగేది. ఆ నిర్వహణ బాధ్యతను స్వీకరించడానికి ప్రభుత్వం ఇ.ఎం.ఆర్.ఐ విషయంలో ప్రదర్శించిన "విశ్వాసం-నమ్మకం", అంతే మోతాదులో, మొదట్లో ఇ.ఎం.ఆర్.ఐ ప్రదర్శించలేదు. బహుశా చైర్మన్ రాజు గారు ఆ విషయంలో వెంకట్ గారి కంటే వేగంగా స్పందించారని నా అభిప్రాయం. సీ.బి.ఎస్ గారు అంచెలంచెలుగా ఎంఓయు దశకు తీసుకొచ్చిన విధానం ముందు-ముందు వివరంగా తెలుసుకుందాం.

సెప్టెంబర్ 19, 2006 న ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్పటి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పి. కె. అగర్వాల్ పేరుతో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (జీ.ఓ.ఆర్.టీ 1242) లో పేర్కొన్న అంశాలు "నమ్మకానికి-విశ్వాసానికి" మొదటి ఉదాహరణ. "మాతా శిశు సంరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలను, పసి పిల్లలను, అవసరమైనప్పుడు అత్యవసర వైద్య సహాయం కొరకు, సమీప ఆసుపత్రికి చేర్చేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరోపియన్ కమీషన్ సహకారంతో, గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవలను ఆరంభించింది. అదే పధకాన్ని మిగిలిన అన్ని జిల్లాలకు పొడిగించాలని కుటుంబ శాఖ కమీషనర్ ప్రతిపాదన పంపారు. అందువల్ల మరో 310 అంబులెన్సుల ద్వారా మిగిలిన 19 జిల్లాల్లో అత్యవసర ఆరోగ్య రవాణా సేవలను అందించేందుకు అలాంటి సేవలందించడంలో ’గుర్తింపు తెచ్చుకున్న’ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలని కమీషనర్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించి, కమీషనర్ ను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అనుమతించింది" అని ఆ ఉత్తర్వులో పేర్కొంది ప్రభుత్వం. ఆ తర్వాత రెండు రోజులకు (22-09-2006 న) అప్పటి ఆర్థిక-ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రోశయ్య గారి సమక్షంలో అవగాహనా ఒప్పందం (ఎంఓయు) పై కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వెంకట రమణ, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ సంతకాలు చేశారు. పూర్తిగా తన స్వయం పర్యవేక్షణ కింద (నా సమక్షంలో) తానే తయారుచేసిన అవగాహనా ఒప్పందం "అవతారిక"లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ గురించి రాసిన వాక్యాలు ఆ సంస్థమీద ప్రభుత్వానికి అప్పట్లో వున్న"నమ్మకానికి-విశ్వాసానికి" అసలు-సిసలైన మచ్చుతునకలు. "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, అంబులెన్స్ సేవలతో సహా అన్నిరకాల నాణ్యతా పరమైన అత్యవసర సహాయ సేవలందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయంగా ఆ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఏజెన్సీల తోడ్పాటుతో, సత్యం కంప్యూటర్ సంస్థ సాంకేతికపరమైన భాగస్వామ్యంతో ఆ సేవలను అమలుపరుస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థను రాష్ట్ర స్థాయి నోడల్ ఏజన్సీగా ప్రభుత్వం నియమిస్తున్నది" అని రాయడం-అదీ సంస్థ సేవలను అందించడం మొదలైన ఏడాది లోపునే అలా సంస్థను ప్రశంసించడం మామూలు విషయం కాదు. ఎంఓయు పూర్వ రంగంలో అలనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జంధ్యాల హరినారాయణ, అగర్వాల్ కు ముందున్న ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు, ఉప కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడానికి-అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయడానికి చేసిన కృషి-తీసుకున్న చొరవ కూడా "నమ్మకానికి- విశ్వాసానికి" ఉదాహరణలు. అదే అగర్వాల్ గారి "నమ్మకాన్ని-విశ్వాసాన్ని" నాలుగేళ్ల తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ కోల్పోవడానికి బలవత్తరమైన కారణాలుండి తీరాలి. అవి విశ్లేషించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ అధికారులకు వుంది.

ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న 108-అత్యవసర సహాయ సేవల పటిష్ఠ అమలుకు ప్రభుత్వం ప్రదర్శించిన "విశ్వాసానికి- నమ్మకానికి" మరో మచ్చుతునక, జులై 12, 2007 న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. హరినారాయణ, నాటి ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలనార్థం పంపిన వివరణ. ఆ వివరణ పూర్వ రంగంలో ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, అప్పటికి సరిగ్గా నాలుగు నెలల క్రితం (8-2-2007 న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన "ఇ.ఎం.ఆర్.ఐ సలహా సంఘం సమావేశం" జరిగింది. ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సహా పలువురు ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆద్యతన భవిష్యత్ లో, ప్రభుత్వ పరంగా, ఇ.ఎం.ఆర్.ఐ కి 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణ నిధులను దశలవారీగా పెంచడానికి నాంది జరిగిన చారిత్రాత్మక సలహా సంఘం సమావేశమది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నియమించిన "ఉప సంఘానికి", అత్యవసర సహాయ సేవల నిర్వహణకు అవుతున్న వ్యయానికి సంబంధించిన వివరాలను, ఉపసంఘం సమీక్షించి తగు విధమైన సిఫార్సులను ప్రభుత్వానికి చేసి, అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేసేందుకు ఒక సమగ్రమైన వివరణాత్మక నివేదికను ఇ.ఎం.ఆర్.ఐ రూపొందించింది. కమిటీకి సమర్పించిన నివేదికను అధ్యయనం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన వివరణలో పేర్కొన్న అంశాలు:

• ఎంఓయు ప్రకారం అత్యవసర సహాయ సేవల నిర్వహణ కయ్యే వ్యయంలో ప్రభుత్వం భరిస్తానన్న అంశాలు:

• అంబులెన్సులలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలు
• అంబులెన్సుల నిర్వహణ-మరమ్మతుల వ్యయం
• టెలిఫోన్, అద్దె, విద్యుత్ ఖర్చులు
• షెడ్యూల్డ్ కులాల, తెగల, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల, గర్భిణీ స్త్రీల, ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల రవాణా కొరకయ్యే ఇంధన వ్యయం
• శిక్షణా కార్యక్రమాల వ్యయం
• పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన వ్యయం, అవగాహనా ఒప్పందం ఆధారంగా, ఒక్కో అంబులెన్సుకు రు. 68, 700 అవుతుంది. అంటే, రోజుకు సగటున రు. 2123-లేదా సగటున ట్రిప్పుకు రు. 400 అవుతుంది.
• తొలుత 310 అంబులెన్సుల, ఆ తర్వాత మరో 122 అంబులెన్సుల (మొత్తం 432) నిర్వహణకు, ఒప్పందానికి అనుగుణంగా వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మొత్తం సుమారు రు. 33 కోట్లుంటుంది. వీటి ద్వారా మొత్తం రాష్ట్రమంతా సహాయ సేవలను అందించవచ్చు
• ప్రతి అంబులెన్సులో ఆరుగురు (ఇ.ఎం.టి, పైలట్లు కలిసి) ఉద్యోగులతో సహా, ప్రతి పది అంబులెన్సులకు ఒక సూపర్వైజర్ వుంటారు
• అంబులెన్సుల నిర్వహణ-మరమ్మతులంటే, ప్రతి అంబులెన్స్ 40, 000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత టైర్ల మార్పిడి కయ్యే ఖర్చు
• ప్రతి అంబులెన్సుకు రోజుకు 25-30 టెలిఫోన్ కాల్స్
• ప్రతి 7 కిలో మీటర్లకు లీటర్ డీజిల్ చొప్పున సగటున రోజుకు 300 కిలోమీటర్ల వరకు
• వాస్తవ అంచనాల ఆధారంగా, సుమారు 70% లబ్దిదారులు షెడ్యూల్డ్ కులాల, తెగల, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల, గర్భిణీ స్త్రీల, ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు చెందినవారు. వారి రవాణా కొరకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలి.
• ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ సొంతంగా కొనుగోలు చేసి నిర్వహణ వ్యయం భరిస్తున్న 70 అంబులెన్సులకు కూడా ప్రభుత్వ సహాయం అందించడం పరిశీలించాలి.
• జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పరిగణలోకి తీసుకుని, రాష్ట్రం సమకూర్చాల్సిన నిధుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి.

ఇంత కూలంకషంగా, ఒక పథకం విషయంలో, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పై "ఎంతో విశ్వాసం-నమ్మకం" వుండబట్టే అలా వ్యవహరించడం జరిగిందని భావించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయంతో 2007-2008 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి (నిర్ణయం తీసుకుంది జులై నెలలో అయినప్పటికీ అమలు ఏప్రియల్ నుంచే జరిగింది) అప్పటి కయ్యే ఖర్చులో 60% పైగా నిర్వహణ వ్యయం ప్రభుత్వ పరంగా లభించింది. పైగా రాజుగారిచ్చిన 70 అంబులెన్సులకు కూడా నిర్వహణ వ్యయం ప్రభుత్వమే భరించ సాగింది. వాస్తవానికి ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వం సమకూర్చిన రు. 68, 700 పైన ఇ.ఎం.ఆర్.ఐ కి అదనంగా ఎంత ఖర్చయిందో అనే విషయం "ఇదమిద్ధంగా ఇంత" అని ప్రభుత్వానికి సంస్థ విశ్లేషణాత్మకంగా ఎప్పుడో ఒకప్పుడు వివరణ ఇచ్చి వుంటే బాగుండేదేమో. నాకు తెలిసినంతవరకు ఏ నాడూ అలా చేసి వుండలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉత్తర్వులు వచ్చిన కొద్ది రోజుల్లోనే, అత్యవసర సహాయ సేవల అంశం క్రమేపీ ముఖ్యమంత్రి దృష్టికి మరింత చేరువగా పోవడంతో, అక్కడినుంచి నిర్ణయాలు ఆయన కనుసన్నల్లో జరగడం మొదలయింది. అలా జరగడం లాభానికి దారి తీసిందా-నష్ఠానికి దారి తీసిందా అంటే చెప్పటం కష్ఠమవుతుంది. జవాబు ఏదైనా, అత్యంత ఆదరణ పొందిన సేవలుగా ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా పాకడానికి మాత్రం కారకుడు (దివంగత) ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని, ఆ తర్వాత (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్కో అంబులెన్సుకు నెలకు రు. 68, 700 నిర్వహణ వ్యయం కింద ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న పక్షం రోజులకు, రామలింగ రాజు గారి అధ్యక్షతన పనిచేస్తున్న మరో సంస్థ హెచ్.ఎం.ఆర్.ఐ కి సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో సరిగ్గా ఏం జరిగిందో ఏమో గాని, హెచ్.ఎం.ఆర్.ఐ సంస్థతో పాటు, ఇ.ఎం.ఆర్.ఐ కి కూడా నిర్వహణ వ్యయంలో 95% వ్యయాన్ని ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందన్న అభిప్రాయానికి సీ.ఇ.ఓ వెంకట్ వచ్చారు. అదే విషయాన్ని ధృవీకరించుకునేందుకు, నేను తోడు రాగా వెంకట్ గారు, ఆగస్ట్ 13, 2007 న ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు వెళ్లాం. నెల రోజుల క్రితం ఎంతో "విశ్వాసంతో-నమ్మకంతో" ప్రభుత్వ పరంగా భరించాల్సిన నిర్వహణ వ్యయం విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న ప్రధాన కార్యదర్శి హరినారాయణ, కొంత అసహనానికి గురయ్యారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హెచ్.ఎం.ఆర్.ఐ సంస్థ విషయంలోనే గాని ఇ.ఎం.ఆర్.ఐ విషయంలో కాదని స్పష్టం చేశారు. నిర్వహణ వ్యయానికి సంబంధించి అధ్యయనం చేసి, స్వయంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఇ.ఎం.ఆర్.ఐ కట్టుబడకుండా, అంత తక్కువ వ్యవధిలో, పెంచమని కోరకుండా వుండాల్సింది వెంకట్. అయితే ఆర్థిక పరంగా అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ ఇబ్బందుల్లో వున్నదన్న సంగతి ఆయన ఎవరికి చెప్పుకోగలరు? యాజమాన్య పరంగా రాజు గారు ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడం జరగడం లేదన్న విషయం వెంకట్ ఎలా బయట పెట్టగలరు? ఏదేమైనా, ఎంత అసహనానికి గురైనా, ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తున్న అత్యవసర సహాయ సేవల విషయంలో అదే "విశ్వాసంతో-నమ్మకంతో", విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి అంగీకరించారాయన.

ఇ.ఎం.ఆర్.ఐ అంతర్గత ఆర్థిక పరమైన విషయాల వ్యవహారం అప్పట్లో నాకంతగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బాంక్ దగ్గర అప్పు చేసిన సంగతి కూడా తెలియదు. సంస్థ వ్యవహారమంతా క్షుణ్ణంగా తెలిసిన వెంకట్ ఎటువంటి ఇబ్బందులకు అత్యవసర సహాయ సేవలు లోను కాకుండా వుండేందుకు ఆది నుంచీ చేసిన "విశ్వ ప్రయత్నాలలో భాగంగా" నే ఆ నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని 95% నిర్వహణ వ్యయం గురించి పట్టుబట్టి వుండాలి. ఆ నాటి సమావేశంలో వెంకట్ గారు ప్రదర్శించిన ఓర్పు-నేర్పు, చివరకు హరినారాయణ గారిని ఆ విషయం మర్నాడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి పరోక్షంగా ఒప్పించిన విధానం ఆయన సామర్థ్యానికి చక్కటి నిదర్శనం. ఆ నాటి సంఘటన నాకింకా జ్ఞాపకం వుంది.

Thursday, May 27, 2010

"జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ఏర్పాటును సూచించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి : వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు
(దివంగత సీఎం చెన్నారెడ్డి పౌర సంబంధాల అధికారి)

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం, 1990 మే నెలలో ఆంధ్ర ప్రదేశ్ లో సంభవించిన భారీ తుఫాన్, దాని తీవ్రతను అంచనావేసి వేలాది ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ముందస్తు చర్యలు-తుఫాన్ వచ్చిన సమయంలో, ఆ తర్వాత చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, వాటిని పర్యవేక్షించిన అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున్ రావు-ఆయనకు పరిపూర్ణ అధికారాలను ఇచ్చి అడుగడుగునా మార్గదర్శకత్వం వహించిన అలనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పాలనా దక్షత పదే-పదే గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. చెన్నారెడ్డి గారి దగ్గర పౌర సంబంధాల అధికారిగా ఆ సమయంలో పనిచేసిన నాకు అవన్నీ చాలా దగ్గరగా గమనించే అవకాశం కలగడమే కాకుండా, ఎన్నటికి మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ జ్ఞాపకాలలో కనీసం కొన్నైనా, నేనే కాకుండా, వాటిని దగ్గరగా వీక్షించిన (నేటి ముఖ్యమంత్రి రోశయ్య , సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి-మాజీమంత్రి దివాకర రెడ్డి-సమరసింహా రెడ్డి ... ఇంకా మరికొందరు) పలువురి తో సహా, బహుశా పలువురు పాత్రికేయులకు-ఆ మాటకొస్తే వర్తమాన రాజకీయాలను గమనించే చాలామందికి గుర్తుండే వుంటాయని భావిస్తున్నాను.

అదే రోజుల్లో, ఆరోగ్యం బాగాలేనందున శస్త్ర చికిత్సకొరకు అమెరికా ప్రయాణానికి సిద్ధమై-కుటుంబ సభ్యులను విమానాశ్రయానికి పంపిన తర్వాత, మధ్యలో మంత్రివర్గ సమావేశానికి హాజరైయేందుకు వచ్చిన చెన్నారెడ్డి గారు తుఫాను తీవ్రతకు చలించిపోయి, ఆరోగ్యం విషయం పక్కనపెట్టి-ఏకంగా తన పర్యటననే వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికాకు వెళ్లి, అక్కడకూడా ఆరోగ్యం కంటే ముందు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు-ఇబ్బందులకు గురైన ప్రజలకు శాశ్వత పునరావాస చర్యలు చేపట్టేందుకు ప్రపంచ బాంక్ సహకారం కోరడానికి సంబంధిత అధికారులను కలుసుకోవడంలోనే వారం-పది రోజులు గడిపారు. తర్వాతే చికిత్సకు సిద్ధమయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన చెన్నారెడ్డి గారు, న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో, అలనాటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో చేసిన ప్రసంగంలో, మొట్ట మొదటిసారిగా "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" (National Calamities Corpus-Need of the Hour) ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గురించి ప్రస్తావన చేశారు. "జాతీయ విపత్తుల సహాయక నిధి" పేరుతో ఒకటి, "జాతీయ విపత్తుల ఆకస్మిక ఖర్చుల నిధి" పేరుతో మరొక టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ, చెన్నారెడ్డి సూచించిన దానికి-వీటికి చాలా తేడా వుంది. తుఫానుకు గురైన రాష్ట్రాలకు ఈ రెండు సంస్థలనుంచి నిధులను విడుదల చేసే విధానాన్ని, ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఫైనాన్స్ కమీషన్ ఆ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావడానికి ముందర, ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం జరగడం, దాని కొరకు అధిష్ఠానం ఆహ్వానం మేరకు పక్షం రోజుల ముందు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడం-వెళ్లినప్పుడు విమానాశ్రయంలో వీడ్కోలు ఇచ్చిన అతి కొద్దిమందిలో నేనూ వుండడం, పీసీసీ అధ్యక్షుడుగా-ఆ హోదాలో హైదరాబాద్ తిరిగొచ్చినప్పుడు వేలాది అభిమానులు ఆయనకు స్వాగతం చెప్పడం, ఢిల్లీ నుంచి వచ్చిన చెన్నారెడ్డి గారికి విమానాశ్రయంలో "ముఖ్యమంత్రి స్థాయిలో పోలీసు ఏర్పాట్లు" జరగడం, ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీని జరగబోయే ఎన్నికల్లో ఓడించగల సత్తావున్న నాయకుడు దొరికాడని కాంగ్రెస్ వారు భావించడం, చివరకు అలానే 1989 ఎన్నికల్లో జరగడం, అధిష్ఠానం ఆయన్ను మరో మారు ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం-దాని కొరకు పరిశీలకులు రావడం, నేను అతి దగ్గరగా గమనించాను.

దక్షిణ భారత దేశాన్ని 1977 దివి సీమ ఉప్పెన తర్వాత భీభత్సం చేసిన అతి భయంకరమైన తుఫానుగా 1990 మే నెల మొదటి వారంలో సంభవించిన తుఫానును పేర్కొన వచ్చు. మే 4, 1990 న "ఉష్ణ మండల గందరగోళం" గా ప్రారంభమై, తుఫానుగా మారి, వాయువ్య దిశగా కదిలింది. మర్నాటి కల్లా, తీవ్రమైన వాయుగుండంగా ఏర్పడి మే 8 కల్లా భయంకరమైన తుఫానుగా మారి, ఆంధ్ర ప్రదేశ్‌పై కనీ-వినీ ఎరుగని దుష్ప్రభావం చూపింది. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని పలు ప్రాంతాలపై కూడా దాని ప్రభావం పడింది. కనీసం పది జిల్లాలలోని కోటి మంది ప్రజలు తుఫానుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులకు లోనయ్యారు. విద్యుత్ సౌకర్యాలతో సహా అన్ని రకాల ప్రజావసరాల ఏర్పాట్లన్నీ అస్తవ్యస్థమైపోయి, జనజీవనం స్తంభించి పోయింది. లక్షలాది గుడిసె వాసులు నివాసాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ప్రభుత్వానికదో పెను సవాలుగా మారింది. "గుడ్డిలో మెల్ల" గా, తప్పిపోతుందనుకున్న తుఫాను రాష్ట్రాన్ని తాకనున్నదన్నసంకేతాలు ముందుగా అందడంతో, సరైన నివారక చర్యలు చేపట్టడంతో లక్షలాది ప్రాణాలు కాపాడబడ్డాయి. పట్టణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సి. అర్జున్ రావును, కారణాంతరాల వల్ల ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆగ్రహానికి గురైనందున, ప్రాధాన్యత లేదని పలువురు భావించే "సహాయ పునరావాస కమీషనర్" గా అంతకు రెండు నెలల క్రితమే నియమించింది ప్రభుత్వం. ఆయన ఆ పదవికే వన్నె తెచ్చే రీతిలో తీసుకున్న ముందస్తు నివారక చర్యల వివరాలు, ఆ శాఖ పదిలం చేసుకుని వుంటే, బహుశా చక్కటి "మార్గదర్శి" గా ఎల్లప్పుడూ పనికొస్తుండవచ్చు. తుఫాను ముగిసిన కొంత కాలానికి అర్జున్ రావు గారు, ఒక చిన్న కార్పొరేషన్ ఎండి గా వున్నప్పుడు, సహాయ పునరావాస కమీషనర్ గా ఆయన తీసుకున్న చర్యలపై "రీడర్స్ డైజెస్ట్" ఒక గొప్ప ఆర్టికల్ ప్రచురించింది.

అలనాటి ప్రకృతి భీభత్సానికి పది జిల్లాలు అతలాకుతలమై పోయాయి. ఆయా జిల్లాల పాలనా యంత్రాంగంతో పాటు, రాష్ట్ర స్థాయి పాలనా యంత్రాంగం చురుగ్గా కదిలి, ఇతర జిల్లాలకు చెందిన అధికారులను ఒక్కో జిల్లాకు వేయి మంది వంతున పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటుచేసింది ప్రభుత్వం అర్జున్ రావు గారి ఆధ్వర్యంలో-ముఖ్యమంత్రి నాయకత్వంలో. తుఫానుకు గురైన వారిని గుర్తించడానికి ఒక బృందం, సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి మరో బృందం, ఆహార పదార్ధాల సక్రమ సరఫరాకు ఇంకో బృందం, వసతి ఏర్పాటుకు మరో బృందం, వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టేందుకు ఇంకో బృందం.... ఇలా ఎన్నో బృందాలుగా ఏర్పడి శాస్త్రీయంగా సహాయ-పునరావాస కార్యక్రమాలను అమలు పరిచారు. సిరి ఫోర్టు ఆడిటోరియంలో ప్రసంగించిన చెన్నారెడ్డి గారు తన ఉపన్యాసంలో అవన్నీ వివరించినప్పుడు అధికారులను అభినందించిన తీరు ఆయన పాలనా దక్షతకు మచ్చుతునక. తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి, నాకు గుర్తున్నంతవరకు చేసిన ప్రయత్నాలు కనీసం రెండు రోజులు ఫలించలేదు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించ నందువల్ల, ఆయనతో సహా మేమందరం ఎక్కిన వైమానికదళ హెలికాప్టర్ మొదటి రెండు రోజులు "మొరాయించింది". ప్రధాన మంత్రి వీపీ సింగ్ వచ్చి ఎక్కిన తర్వాతే అది కదిలింది. అయినప్పటికీ, విజయవాడ విమానాశ్రయం దాటి ముందుకు కదలలేదు. "ప్రధాన మంత్రికన్నా ముందర ముఖ్యమంత్రి ఎలా వెళ్లుతారు? ఆయనకెందుకు మొదలు ఆ కీర్తి దక్కాలి" అని హెలికాప్టర్ మొరాయించే ఏర్పాటు జరిగిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమనే ది వారికే వదిలేద్దాం. ముఖ్యమంత్రితో సహా, ప్రతిపక్ష నాయకుడి హోదాలో స్వర్గీయ ఎన్ టీ రామారావు గారు కూడా రాజభవన్ లో ప్రధానిని కలిసి, సహాయం కొరకు అర్ధించారు. అంతగా రాజకీయాలకు తావులేని విధంగా వుందాయన అభ్యర్థన ఆ రోజుల్లో. వారూ-వీరూ అనే తేడా లేకుండా అంతా రాజకీయమే-అన్నీ విమర్శలే ఈ రోజుల్లో. తర్వాత మరో మారు కూడా ప్రధాని వచ్చి తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ నాయకుడి హోదాలో స్వర్గీయ రాజీవ్ గాంధి తుఫాను ప్రాంతాలలో రెండు రోజులు తిరిగారు అప్పట్లో. సహాయ-పునరావాస కార్యక్రమాల సమీక్షకు చెన్నారెడ్డి గారు అమెరికా నుండి తిరిగి రావడానికి ముందు మరో మారు పర్యటించారు. తుఫానులు తరచుగా వస్తున్నాయనో-లేక-మరేమైనా కారణముందో, ఈ రోజుల్లో ప్రధాని గాని, సోనియా గాని పర్యటనలకు ఎక్కువగా రావడం లేదు.

తుఫాను సంభవించిన వెంటనే, కేంద్ర ప్రభుత్వ తక్షణ సహాయం గురించిన వివరాలు టెలిప్రింటర్లో సందేశం వచ్చింది. (ఫాక్సులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవలేదు అప్పటికింకా). అందులో సహాయం మొత్తం ఇంత అని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినప్పుడు ఆ మొత్తం అంకె తప్పని వెంటనే స్పందించారు. మాకు అర్థం కాలేదు. ఇంతలో వచ్చిన మరో మెసేజ్ లో ముఖ్యమంత్రి చెప్పిన రు. 86 కోట్ల మొత్తం గురించి సవరణ వచ్చింది. అదీ ఆయన జ్ఞాపక శక్తి. ఆ సహాయం గురించి ఆయనే మాకు వివరించారు. రకరకాల అంశాలను అధ్యయనం చేసి ఆర్థిక కమీషన్ "ఇంత మొత్తం" ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన రాష్ట్రానికి తక్షణ సహాయం కింద ఇవ్వాలని నిర్ణయిస్తుందని, ఆ మొత్తం అప్పట్లో రు. 86 కోట్లుగా మాకు విశదీకరించారు. అందులో కూడా మూడొంతులు కేంద్రం, ఒక వంతు రాష్ట్రం భరిస్తుందని ఆయనే చెప్పారు. అలనాటి తుఫానును "జాతీయ విపత్తు" గా పరిగణించాలని చెన్నారెడ్డి గారు చేసిన ప్రతిపాదనకు స్పందించిన ప్రధాని వీపి. సింగ్ "ఇది జాతీయ విపత్తు కాకపోతే మరింకేదీ జాతీయ విపత్తుగా అనలేం" అని వ్యాఖ్యానించడమంటే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం అనుకోవాలి. అంతటితో ఆగకుండా, ఇక్కడ వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అనుకోకుండా, ఒక ప్రత్యేక అధ్యయన బృందాన్ని కూడా పంపించారు రాష్ట్రానికి వీపి. సింగ్.

అయినా చెన్నారెడ్డి గారు తృప్తిపడలేదు. అందిన సహాయం ఏ మూలకు సరిపోదని ఆయన భావన. ఆ ఆలోచనతో "ప్రపంచ బాంక్" ను కదిపారు. " ఈ ఆధునిక ప్రపంచంలో కొంత బియ్యాన్ని పంచడంతో నో, మరో రకమైన ధాన్యాన్ని-పప్పు దినుసులను సమకూర్చడంతో నో, గుడిసెల మరమ్మతుకు అంతో-కొంతో ధనం సహాయం చేయడంతో నో సరి పుచ్చుకోవడం మన సంస్కృతిని-సాంప్రదాయాన్ని-ప్రపంచం దృష్టిలో మన గౌరవ ప్రతిష్ఠలను ప్రతిబింబించవు. శాశ్వతమైన ఏర్పాట్లు చేసినప్పుడే ఫలితం వుంటుంది" అన్నారాయన. ఏం జరిగిందో-ఎలా జరిగిందో అని అర్థం చేసుకునే లోపల, ప్రపంచ బాంక్ బృందం, తుఫాను సంభవించిన అతి కొద్ది రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించింది. ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో అధికారులు వెంట రాగా రెండు రోజులు పర్యటించింది బృందం. మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన వారికిచ్చిన "తుఫాను ప్రాంత సంగ్రహ సమాచారం (Detailed Brief on what is to be done ?)" వివరించిన తీరు ఆయన మేథస్సుకు నిదర్శనం. బహుశా ఆయన తప్ప మరొకరు ఆ విధంగా చేయలేరని నా ఉద్దేశం. ఆయన ఆ రోజు ప్రపంచ బాంక్ బృందానికి చేసిన సూచన (తుఫాను ప్రాంత) భావి తరాల వారికి శాశ్వత పరిష్కారం. తర్వాత ప్రభుత్వాలు నిజంగా అందులో ఎన్ని అమలు చేసాయోగాని అమలు చేసే వుంటే తుఫాను తాకిడికి జరిగే నష్టం చాలా వరకు నివారించగలిగే వీలుండేది. ఆయన ఇచ్చిన వివరణలో ప్రధానమైంది "కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతంలో పురాతన కాలంలో నిర్మించి అస్తవ్యస్థమైపోయిన డ్రైనేజి ఏర్పాటు" గురించి.

"యావత్ భారత దేశంలో ఆంధ్ర ప్రాంతపు వ్యవసాయ దారులు, వ్యవసాయోత్పత్తిలో అగ్రగణ్యులని, 1924 లో, అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాయల్ అగ్రికల్చరల్ కమీషన్ పేర్కొంది. దానికి ప్రధాన కారణం అక్కడి డెల్టా ప్రాంతం-డ్రైనేజి వ్యవస్థ. అందుకే భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్ర ప్రదేశ్ కు పేరొచ్చింది. దురదృష్టవశాత్తు తుఫాను మూలంగా డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా నాశనమై పోయింది. అలా పాడై పోవడానికి, రాజకీయ నాయకుల-రకరకాల భూ ఆక్రమణదారుల ప్రోత్సాహంతో, డ్రైనేజి ప్రాంతంలో కాలువలకు చెందిన కొంత భాగాన్ని కబ్జా చేసుకోవడమే కారణం. కొందరు దురాశ పరుల మూలాన మొత్తం డ్రైనేజి వ్యవస్థ పగుళ్లకు దారితీసింది-పనికి రాకుండా పోయింది. ఆంధ్ర ప్రాంతంలోని సుమారు వేయి కిలోమీటర్లకు పైగా పొడవనున్న తీర ప్రాంతంలోని చాలా భాగం తుఫాను తాకిళ్లకు గురయ్యే ప్రమాదముంది. ఈ ప్రమాదం నుంచి శాశ్వతంగా అక్కడి ప్రజలను కాపాడాలి". అని ప్రపంచ బాంక్ బృందానికి వివరించి, "తుఫాను ఆవాసాలను" ఆ ప్రాంతాలలో పటిష్ఠంగా నిర్మించేందుకు ఆర్థిక సహాయం చేయమని అడిగారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విషయం గురించి ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడు మొయిన్ కురేషీతో చర్చించాలని చెన్నారెడ్డికి సూచించారు బృందంలోని సభ్యులు.

అప్పట్లో ప్రపంచ బాంక్ సహాయం పొందాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరి. ఇప్పుడూ అవసరమే కాని వారి దృష్టికి తీసుకెళ్తే చాలు. చెన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి డ్రైనేజి వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రపంచ బాంక్ సహాయం విషయం చెప్పి, వారిచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. మొదట్లో వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణాన్ని వారం-పది రోజుల అనంతరం కొనసాగించారు. అత్యవసరంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సినప్పటికీ, జూన్ 6, 1990 అర్థ రాత్రి ఆసుపత్రిలో చేరేంతవరకు, నిత్యం ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. డ్రైనేజి వ్యవస్థ పునరుద్ధరణ తన ప్రధమ కర్తవ్యంగా భావించానని అమెరికా నుంచి వచ్చిన చెన్నారెడ్డి సిరి ఫోర్టు ఆడిటోరియంలో చెప్పారు. చెన్నారెడ్డి గతంలో రాష్ట్ర ఆర్థిక-పారిశ్రామిక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన సందర్భంలో మొయిన్ కురేషీని కలిసిన సందర్భాలు ఇరువురూ గుర్తుచేసుకున్నారు. పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను తయారు చేయాలని, చేయించిన తదుపరి, తప్పక ఆర్థిక సహాయం చేస్తామని ఆయన దగ్గర హామీ తీసుకున్నారు చెన్నారెడ్డి. ఇరువురి కలయిక తర్వాత కేవలం పద్నాలుగు రోజుల్లో నిష్ణాతులైన పలువురు ప్రపంచ బాంక్ నిపుణుల బృందం రాష్ట్రానికి రావడం, వివరంగా అంచనాలను రూపొందించడం జరిగింది. భవిష్యత్ లో ప్రపంచ బాంక్ హామీ నెరవేరడం వల్లనే పాడై పోయిన డ్రైనేజి వ్యవస్థ బాగుపడింది ఆ తర్వాత.

ఆరోగ్యం కుదుట పడింతర్వాత రాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్టు ఆడిటోరియంలో మాట్లాడుతూ, తుఫాను భీభత్సాలను-ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి, అప్పట్లో అమల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిపోదని బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఫైనాన్స్ కమీషన్ సమీక్షల ఆధారంగా అయిదు సంవత్సరాల కాలపరిమితికి సరిపడా ప్రకృతి వైపరీత్యాల సహాయ విధానం అమలు సరిపోదన్నారు. ఒకటి-రెండు రాష్ట్రాల నుంచో, కేంద్ర నుంచో నిధులను సేకరించి "జాతీయ విపత్తుల సహాయక నిధి" ని ఏర్పాటు చేయడంతో సరిపోదని, అన్ని రాష్ట్రాలలోని పౌరులందరి విరాళాలతో-భాగస్వామ్యంతో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక " న్యూక్లియస్ నిధి" ని ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ-అంతర్జాతీయ విపత్తులలో-విషాదాల్లో, తమ వంతు పాత్ర నిర్వహించాలన్న భావన ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు చెన్నారెడ్డి. ప్రణాళికా సంఘం సరైన ఆలోచన చేసి, భారత దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని-ప్రతి పౌరుడిని "విధిగా" తోచినంత విరాళం ఇచ్చే విధంగా "శాశ్వత నిధిని" ఏర్పాటు చేసే, ఆ నిధులతో నడిచే "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ను నెలకొల్పాలని సూచించారు చెన్నారెడ్డి. అలా చేస్తే, ప్రకృతి వైపరీత్యాల్లో, తమ విరాళాలతో, తమ తోటి వారికి సహాయం అందిందన్న సంతృప్తి ప్రతి పౌరుడిలో కలుగుతుందని ఆయన భావించారు. అలా జరిగుంటే బాగుండేదేమో !