పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో
మార్పు సంకేతాలు
వనం జ్వాలా నరసింహా రావు
కాంగ్రెస్ పార్టీ యోధాన-యోధుడు, సిద్ధాంత కర్త, ఇందిరాగాంధికి అత్యంత సన్నిహితుడు అని పేరు తెచ్చుకున్న సిద్ధార్థ శంకర రే మార్చ్ 19, 1972 నుంచి, జూన్ 21, 1977 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సారధ్యం వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయిందనాలి. గత ముప్పై మూడేళ్ల గా, ఏ పనైతే తన అధికారాన్నంతా ఫణంగా పెట్టినా కాంగ్రెస్ సాధించలేకపోయిందో, దాన్ని, అచిర కాలంలోనే మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సాధించే రోజు దగ్గర పడుతుందని చెప్పడానికి ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన ఘన విజయమే నిదర్శనం.
ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితిని సడలించి 1977 లో సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పుడు, జనతా కూటమితో కలిసి పోటీ చేసిన సీపీఎం, ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో వామ పక్ష కూటమి విడిగా పోటీ చేసి, 243 స్థానాలను గెలుచుకుని, జ్యోతిబసు నాయకత్వంలో కాంగ్రేసేతర-లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా ఐదు పర్యాయాలు లెఫ్ట్ ఫ్రంట్ ను ఎన్నికల్లో గెలిపించి, 27 సంవత్సరాలు (జూన్ 21, 1977-నవంబర్ 6, 2000) ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు, స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుని, బుద్దదేబ్ భట్టాచార్యకు వారసత్వం అప్పగించారు. అప్పటినుంచి ముఖ్యమంత్రిగా బుద్దదేబ్ (నవంబర్ 6, 2000 నుంచి ఇప్పటి దాకా) పదవిలో కొనసాగుతూ, తృణమూల్ కాంగ్రెస్ కు శాసనసభలో గెలుపు దక్కకుండా కాపాడుతూ వస్తున్నాడు. ఇక ముందు అలా కాపాడగలగడం ఆయనకు కష్టమై పోతుందని చెప్పొచ్చు. మున్ముందు పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించే అవకాశాలు మెండుగా వున్నాయి.
వామ పక్ష రాజకీయ పార్టీలన్నీ ఐక్యమై, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించుకున్న నేపధ్యంలో, అనేక కష్ట-నష్టాలను అధిగమించుకుంటూ కొనసాగించిన సుదీర్ఘ ప్రజా పోరాటం ఫలితంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకత్వంలో, వామ పక్ష కూటమి, నాలుగు దశాబ్దాల క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ, నిలుపుకో గలిగింది మాత్రం ఆ తర్వాత ఏడేళ్ల నుంచి మాత్రమే. ఆ మాటకొస్తే, ప్రపంచం మొత్తంలోనే, మొట్టమొదటి సారి, బుల్లెట్ ద్వారా కాకుండా బాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా భారత దేశంలోని కేరళ రాష్ట్ర ఓటర్లకు దక్కింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించిన ఘనత కూడా భారత దేశానికే దక్కింది.
సామాన్య ప్రజానీకానికి మేలు చేయాలన్న లక్ష్యంతో వామపక్ష-కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, 1952 నుంచి, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక-నిరంకుశ విధానాలను ఎదుర్కొంటూ పశ్చిమ బెంగాల్ లో వామ పక్షాలు బలపడ సాగాయి. వామ పక్షాల ఐక్యతను-కూటమి అధికారాన్ని, సవాలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొన్ని సార్లు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మమత బెనర్జీ నాయకత్వంలో కొన్ని సార్లు, ఎన్నికల సమయంలో అవగాహనలు కుదుర్చుకున్నప్పటికీ, సుమారు నాలుగు దశాబ్దాలుగా "ఎర్రకోటకు బీటలు" పడకుండా అక్కడి ఓటర్లు జాగ్రత్త పడ్డారు.
చరిత్ర పుటలు తిరగేస్తే గాని పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్ర అర్థంకాదు. ఆ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు. ఉద్యమాలు ఈ నాటివి కూడా కాదు. స్వాతంత్ర్య పోరాట కాలంలో, గత శతాబ్దపు నలభయ్యో దశాబ్దంలోనే, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక-శ్రామిక శక్తులను ఐక్యం చేసిన ఘనత బెంగాల్ కుంది. స్వాతంత్ర్యం రాక ముందే కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ లో ఉద్యమాలకు నాయకత్వం వహించింది. స్వతంత్ర భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రంలో 1953 లో-1965 లో ట్రామ్ చార్జీలు పెంచినప్పుడు, 1954 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ బి. సి. రాయ్ వున్నప్పుడు సంభవించిన కరవుపై పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా పి. ఎల్. 480 పథకానికి వ్యతిరేకంగా 1960 నాటి విద్యార్థి పోరాటం, 1962 భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరపాలని చేసిన ఉద్యమం చరిత్ర ప్రసిద్ధికెక్కినవే. అలాంటి ఎన్నో ఉద్యమాల ఫలితంగానే అక్కడి ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అభిమానం పెరుగుతూ వచ్చింది.
ఆ నేపధ్యంలో 1967 లో పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా విడి-విడిగా, "యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో ఒక కూటమి, "పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో మరో కూటమి ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల అనంతరం రెండు కూటములు కలిసి "యునైటెడ్ ఫ్రంట్" గా కలిసి, మైనారిటీ కూటమికి చెందిన బంగ్లా కాంగ్రెస్ నాయకుడు అజోయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధిక సంఖ్యాక బలమున్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు జ్యోతి బాసు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారప్పుడు. అజోయ్ ముఖర్జీ 15 మార్చ్, 1967 నుండి 2 నవంబర్ 1967 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. మూడు నెలల పాటు (2 నవంబర్, 1967-20 ఫిబ్రవరి, 1968 వరకు) స్వాతంత్ర్యం వచ్చిన తొలినాటి రోజుల్లో ముఖ్యమంత్రిగా వున్న పి. సి. ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు. ఆయన పదవిలో వుంచడం కష్టం కావడంతో, అప్పటినుంచి ఏడాది కాలం రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం.
ఏడాది తర్వాత, 1969 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగి, మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ ఎక్కువ కాలం అధికారంలో వుండనీయలేదు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 25, 1969 నుంచి మార్చ్ 19, 1970 వరకు ముఖ్యమంత్రిగా వున్న అజోయ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని రద్దుచేసింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా "పశ్చిమ బెంగాల్ వ్యవహారాల" కొరకు కాబినెట్ మంత్రిగా నియమించబడిన సిద్ధార్థ శంకర్ రే చాణక్య నీతిలో భాగంగా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేవలం 13 నెలల కాలంలోనే రెండో పర్యాయం రద్దు చేసింది కేంద్రం. తిరిగి మరి కొంతకాలం (మార్చ్ 19, 1970-ఏప్రిల్ 2, 1971) రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం కేరళతో (నంబూద్రిపాద్ ను తొలగించడంతో) ప్రారంభమై, బెంగాల్ కు పాకింది. క్రమేపీ భారత దేశ రాజకీయాలలో అలా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం "సాంప్రదాయం" గా మారిపోయింది. ఆ పాపంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా ఏం తీసిపోలేదు. కమ్యూనిస్ట్ పార్టీల సారధ్యంలో వున్న ప్రభుత్వాలను రద్దుచేస్తున్న రోజుల్లో, ఆ పార్టీ తప్ప ఇతర కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, ఆ చర్య తప్పని గట్టిగా వ్యతిరేకించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టం.
ఏదేమైనా, 1971 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గతంలో మాదిరి "యునైటెడ్ ఫ్రంట్" గా కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు కలిసి పోటీకి దిగలేదు. సీపీఎం పార్టీ ఆలోచనా ధోరణికి అనుకూలమైన కొన్ని పార్టీలు సీపీఎం తో జతకట్టి పోటీ చేశాయి. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాకపోయినా, సీపీఎం అతి పెద్ద పార్టీగా-ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీగా అవతరించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అప్పటి గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడ్డారు. మరో పర్యాయం పి. సి.ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు (ఏప్రిల్ 2, 1971-జూన్ 28, 1971). సీపీఎం రాష్ట్ర వ్యాప్త ఆందోళనను చేపట్టింది. ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రజాస్వామ్య పోరాటమే మార్గమని భావించింది. ఘోష్ మనుగడ కష్టమై పోవడంతో మళ్లీ రాష్ట్రపతి పాలన (జూన్ 28, 1971 నుంచి మార్చ్ 19, 1972 వరకు) విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పకడ్బందీ వ్యూహంతో మరో మారు ఎన్నికల్లో దిగి, సీపీఎం ప్రాబల్యాన్ని ఎలాగైనా తగ్గించాలన్న ఆలోచన చేసింది ఇందిరా గాంధి ప్రభుత్వం. ఆమె కనుసన్నల్లో సిద్ధార్థ శంకర రే ఆ ప్రణాళికను అమలు పరిచాడు. అధిష్టానం ఆశీస్సులతో ఐదేళ్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.
1972 ఎన్నికలు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చే రీతిలో జరిగాయి. బూతుల ఆక్రమణ, దొంగ ఓట్ల స్వైర విహారం, ఓట్ల లెక్కింపులో అవకతవకలు భారీ ఎత్తున జరిగింది. ఎట్టి పరిస్థితిలలోను సీపీఎం పార్టీ అధికారంలోకి రాకుండా కట్టుదిట్టమైన అ నైతిక చర్యలన్నీ అవలంబించింది అలనాటి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ. సీపీఎం పార్టీ వామపక్ష కూటమికి సారధ్యం వహించి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఎన్నికలలో జరిగిన అక్రమాల కారణంగా, రిగ్గింగుకు వ్యతిరేకంగా దాదాపు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, ఆ పార్టీకి స్థానాలు తక్కువే వచ్చినా, ఓటింగ్ శాతం మాత్రం 28% వరకు వుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగు శాతానికి అనుగుణంగా సీట్లు వచ్చి వుంటే, ఆ సంఖ్య 80 (సీపీఎం స్థానాలు) వరకుండేది. బలమైన ప్రతిపక్షంగా వుండి వుండేది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి 216 స్థానాలు, సీపీఎం కు కేవలం 14 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంత జరిగింతర్వాత-ప్రజాస్వామ్యం అవహేళనకు గురైన తర్వాత, ఆ నేపధ్యంలో ఏర్పడిన శాసనసభలోకి ప్రవేశించరాదని తీర్మానించుకుంది సీపీఎం. శాసన సభ్యులుగా గెలిచిన ఆ పార్టీకి చెందిన వారెవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. నైతిక విలువలకు అనుగుణంగా ఐదేళ్లు జీతభత్యాల జోలికి పోలేదు.
ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ను సీపీఎం నుంచి విముక్తి చేయాలన్న దృఢ సంకల్పంతో 1997 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించింది కుమారి మమత బెనర్జీ. అచిర కాలంలోనే, సీపీఎం కు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమత బెనర్జీ, సీపీఎం ను గద్దె దింపడానికి అవకాశం వున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. ఎన్డీయే తో జతకట్టింది. పడకపోతే బయటకొచ్చింది. 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్ట్-లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించ లేకపోయింది. తన పార్టీ పక్షాన గెలిచిన ఏకైక లోక్ సభ సభ్యురాలిగా 2004 లో కేంద్ర మంత్రివర్గంలో చేరింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పారిశ్రామిక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత, ఆమె పార్టీ కార్యకర్తలు అక్టోబర్ 2005 లో ఆందోళన చేశారు. 2006 శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గతంలో గెలిచిన స్థానాలలో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. అయినా పోరాటం కొనసాగించింది. అదే సంవత్సరం ఆగస్టు నెలలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మమత నవంబర్ నెలలో టాటా మోటార్స్ కార్ల కర్మాగారం స్థాపన విషయంలో ఆందోళన చేసేందుకు సింగూరు వెళుతుంటే, మధ్యలో బలవంతంగా ఆపు చేసింది ప్రభుత్వం. శాసనసభ ప్రాంగణంలోకి వెళ్లి నిరసన తెలియచేసిందామె. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగి ఫర్నీచర్ ను, మైకులను ధ్వంసం చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా పోటీ చేసి, ఇరువురు కలిసి 26 స్థానాలను (మెజారిటీ) గెల్చుకుని రాబోయే రోజుల్లో సీపీఎం కు గడ్దు రోజులు రాబోతున్నాయన్న సంకేతాన్ని పంపారు. తృణమూల్ ఆందోళన ఫలితంగానే నంది గ్రామ్ లో రసాయన కేంద్రం స్థాపన ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విరమించుకోవాల్సి వచ్చింది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు మమత చేసిన కృషికి సింగూరు, నంది గ్రాం సంఘటనలు ఉదాహరణలుగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. వీటన్నిటి నేపధ్యంలో, జరిగిన మునిసిపల్ ఎన్నికలు, కలకత్తా కార్పొరేషన్ ఎన్నికలు, తృణమూల్ కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చాయి. ఇక శాసన సభ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధమౌతుంది మమత.
సీపీఎం పాలన పగ్గాలు జ్యోతిబసు చేతిలో వున్నంత కాలం మమత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ ఇరవయ్యే డు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో ప్రజలు స్వర్ణ యుగం చూసి వుండవచ్చు. దరిమిలా బుద్దదేబ్ పాలనలో తృణమూల్ ఎదుగుదలకు ఆస్కారం లభించింది. దీనికితోడు, దీర్ఘకాలం అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకత రావడం కూడా సహజం. నంది గ్రాం, సింగూరు ఘటనలు, మరికొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు సీపీఎం కు మునిసిపల్ ఎన్నికలలో పరాజయాన్ని చవి చూపాయి. సీపీఎం ఓటమి, తృణమూల్ గెలుపు తాత్కాలికమా, లేక, తాత్కాలికంగా శాశ్వతమా అన్నది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం. సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశాలకు బుద్దదేబ్ హాజరు కాకపోవడం వెనుక కారణాలు అన్వేషించాలి. పశ్చిమ బెంగాల్ లో పార్టీ పనితీరు పట్ల, పార్టీ ఓటమి పట్ల శాస్త్రీయంగా సమీక్ష జరిగిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయి. సీపీఎం భాగస్వామ్య పక్షమైన సీపీఐ మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ పనితీరును విమర్శించింది. సీపీఎం అవలంబిస్తున్న "అహంకార పూరిత-ఉద్యోగ స్వామ్య-పెత్తందారీతన విధానాన్ని" దుయ్యబట్టింది మరో లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ దృష్టిలో, రాబోయే శాసన సభ ఎన్నికలలో సీపీఎం విజయం క్లిష్టమైందనే భావం వ్యక్తమైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఆనందానికి హద్దుల్లేవనిపిస్తుంది. భవిష్యత్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు వుంటుందని, సీపీఎం సారధ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించి తీరుతామని ధీమాతో వున్నారాయన.
కేవలం 20% మంది ఓటర్ల తీర్పుతో ఘన విజయం సాధించిన మమత, మిగతా ఓటర్ల తీర్పులో కూడా విజయం సాధించుతారో, లేదో, తేలే రోజు తొందరలోనే రాబోతుంది. అంతవరకూ వేచి చూద్దాం.
No comments:
Post a Comment