Thursday, May 27, 2010

"జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ఏర్పాటును సూచించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి : వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు
(దివంగత సీఎం చెన్నారెడ్డి పౌర సంబంధాల అధికారి)

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం, 1990 మే నెలలో ఆంధ్ర ప్రదేశ్ లో సంభవించిన భారీ తుఫాన్, దాని తీవ్రతను అంచనావేసి వేలాది ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ముందస్తు చర్యలు-తుఫాన్ వచ్చిన సమయంలో, ఆ తర్వాత చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, వాటిని పర్యవేక్షించిన అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున్ రావు-ఆయనకు పరిపూర్ణ అధికారాలను ఇచ్చి అడుగడుగునా మార్గదర్శకత్వం వహించిన అలనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పాలనా దక్షత పదే-పదే గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. చెన్నారెడ్డి గారి దగ్గర పౌర సంబంధాల అధికారిగా ఆ సమయంలో పనిచేసిన నాకు అవన్నీ చాలా దగ్గరగా గమనించే అవకాశం కలగడమే కాకుండా, ఎన్నటికి మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ జ్ఞాపకాలలో కనీసం కొన్నైనా, నేనే కాకుండా, వాటిని దగ్గరగా వీక్షించిన (నేటి ముఖ్యమంత్రి రోశయ్య , సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి-మాజీమంత్రి దివాకర రెడ్డి-సమరసింహా రెడ్డి ... ఇంకా మరికొందరు) పలువురి తో సహా, బహుశా పలువురు పాత్రికేయులకు-ఆ మాటకొస్తే వర్తమాన రాజకీయాలను గమనించే చాలామందికి గుర్తుండే వుంటాయని భావిస్తున్నాను.

అదే రోజుల్లో, ఆరోగ్యం బాగాలేనందున శస్త్ర చికిత్సకొరకు అమెరికా ప్రయాణానికి సిద్ధమై-కుటుంబ సభ్యులను విమానాశ్రయానికి పంపిన తర్వాత, మధ్యలో మంత్రివర్గ సమావేశానికి హాజరైయేందుకు వచ్చిన చెన్నారెడ్డి గారు తుఫాను తీవ్రతకు చలించిపోయి, ఆరోగ్యం విషయం పక్కనపెట్టి-ఏకంగా తన పర్యటననే వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికాకు వెళ్లి, అక్కడకూడా ఆరోగ్యం కంటే ముందు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు-ఇబ్బందులకు గురైన ప్రజలకు శాశ్వత పునరావాస చర్యలు చేపట్టేందుకు ప్రపంచ బాంక్ సహకారం కోరడానికి సంబంధిత అధికారులను కలుసుకోవడంలోనే వారం-పది రోజులు గడిపారు. తర్వాతే చికిత్సకు సిద్ధమయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన చెన్నారెడ్డి గారు, న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో, అలనాటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో చేసిన ప్రసంగంలో, మొట్ట మొదటిసారిగా "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" (National Calamities Corpus-Need of the Hour) ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గురించి ప్రస్తావన చేశారు. "జాతీయ విపత్తుల సహాయక నిధి" పేరుతో ఒకటి, "జాతీయ విపత్తుల ఆకస్మిక ఖర్చుల నిధి" పేరుతో మరొక టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ, చెన్నారెడ్డి సూచించిన దానికి-వీటికి చాలా తేడా వుంది. తుఫానుకు గురైన రాష్ట్రాలకు ఈ రెండు సంస్థలనుంచి నిధులను విడుదల చేసే విధానాన్ని, ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఫైనాన్స్ కమీషన్ ఆ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావడానికి ముందర, ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం జరగడం, దాని కొరకు అధిష్ఠానం ఆహ్వానం మేరకు పక్షం రోజుల ముందు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడం-వెళ్లినప్పుడు విమానాశ్రయంలో వీడ్కోలు ఇచ్చిన అతి కొద్దిమందిలో నేనూ వుండడం, పీసీసీ అధ్యక్షుడుగా-ఆ హోదాలో హైదరాబాద్ తిరిగొచ్చినప్పుడు వేలాది అభిమానులు ఆయనకు స్వాగతం చెప్పడం, ఢిల్లీ నుంచి వచ్చిన చెన్నారెడ్డి గారికి విమానాశ్రయంలో "ముఖ్యమంత్రి స్థాయిలో పోలీసు ఏర్పాట్లు" జరగడం, ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీని జరగబోయే ఎన్నికల్లో ఓడించగల సత్తావున్న నాయకుడు దొరికాడని కాంగ్రెస్ వారు భావించడం, చివరకు అలానే 1989 ఎన్నికల్లో జరగడం, అధిష్ఠానం ఆయన్ను మరో మారు ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం-దాని కొరకు పరిశీలకులు రావడం, నేను అతి దగ్గరగా గమనించాను.

దక్షిణ భారత దేశాన్ని 1977 దివి సీమ ఉప్పెన తర్వాత భీభత్సం చేసిన అతి భయంకరమైన తుఫానుగా 1990 మే నెల మొదటి వారంలో సంభవించిన తుఫానును పేర్కొన వచ్చు. మే 4, 1990 న "ఉష్ణ మండల గందరగోళం" గా ప్రారంభమై, తుఫానుగా మారి, వాయువ్య దిశగా కదిలింది. మర్నాటి కల్లా, తీవ్రమైన వాయుగుండంగా ఏర్పడి మే 8 కల్లా భయంకరమైన తుఫానుగా మారి, ఆంధ్ర ప్రదేశ్‌పై కనీ-వినీ ఎరుగని దుష్ప్రభావం చూపింది. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని పలు ప్రాంతాలపై కూడా దాని ప్రభావం పడింది. కనీసం పది జిల్లాలలోని కోటి మంది ప్రజలు తుఫానుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులకు లోనయ్యారు. విద్యుత్ సౌకర్యాలతో సహా అన్ని రకాల ప్రజావసరాల ఏర్పాట్లన్నీ అస్తవ్యస్థమైపోయి, జనజీవనం స్తంభించి పోయింది. లక్షలాది గుడిసె వాసులు నివాసాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ప్రభుత్వానికదో పెను సవాలుగా మారింది. "గుడ్డిలో మెల్ల" గా, తప్పిపోతుందనుకున్న తుఫాను రాష్ట్రాన్ని తాకనున్నదన్నసంకేతాలు ముందుగా అందడంతో, సరైన నివారక చర్యలు చేపట్టడంతో లక్షలాది ప్రాణాలు కాపాడబడ్డాయి. పట్టణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సి. అర్జున్ రావును, కారణాంతరాల వల్ల ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆగ్రహానికి గురైనందున, ప్రాధాన్యత లేదని పలువురు భావించే "సహాయ పునరావాస కమీషనర్" గా అంతకు రెండు నెలల క్రితమే నియమించింది ప్రభుత్వం. ఆయన ఆ పదవికే వన్నె తెచ్చే రీతిలో తీసుకున్న ముందస్తు నివారక చర్యల వివరాలు, ఆ శాఖ పదిలం చేసుకుని వుంటే, బహుశా చక్కటి "మార్గదర్శి" గా ఎల్లప్పుడూ పనికొస్తుండవచ్చు. తుఫాను ముగిసిన కొంత కాలానికి అర్జున్ రావు గారు, ఒక చిన్న కార్పొరేషన్ ఎండి గా వున్నప్పుడు, సహాయ పునరావాస కమీషనర్ గా ఆయన తీసుకున్న చర్యలపై "రీడర్స్ డైజెస్ట్" ఒక గొప్ప ఆర్టికల్ ప్రచురించింది.

అలనాటి ప్రకృతి భీభత్సానికి పది జిల్లాలు అతలాకుతలమై పోయాయి. ఆయా జిల్లాల పాలనా యంత్రాంగంతో పాటు, రాష్ట్ర స్థాయి పాలనా యంత్రాంగం చురుగ్గా కదిలి, ఇతర జిల్లాలకు చెందిన అధికారులను ఒక్కో జిల్లాకు వేయి మంది వంతున పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటుచేసింది ప్రభుత్వం అర్జున్ రావు గారి ఆధ్వర్యంలో-ముఖ్యమంత్రి నాయకత్వంలో. తుఫానుకు గురైన వారిని గుర్తించడానికి ఒక బృందం, సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి మరో బృందం, ఆహార పదార్ధాల సక్రమ సరఫరాకు ఇంకో బృందం, వసతి ఏర్పాటుకు మరో బృందం, వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టేందుకు ఇంకో బృందం.... ఇలా ఎన్నో బృందాలుగా ఏర్పడి శాస్త్రీయంగా సహాయ-పునరావాస కార్యక్రమాలను అమలు పరిచారు. సిరి ఫోర్టు ఆడిటోరియంలో ప్రసంగించిన చెన్నారెడ్డి గారు తన ఉపన్యాసంలో అవన్నీ వివరించినప్పుడు అధికారులను అభినందించిన తీరు ఆయన పాలనా దక్షతకు మచ్చుతునక. తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి, నాకు గుర్తున్నంతవరకు చేసిన ప్రయత్నాలు కనీసం రెండు రోజులు ఫలించలేదు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించ నందువల్ల, ఆయనతో సహా మేమందరం ఎక్కిన వైమానికదళ హెలికాప్టర్ మొదటి రెండు రోజులు "మొరాయించింది". ప్రధాన మంత్రి వీపీ సింగ్ వచ్చి ఎక్కిన తర్వాతే అది కదిలింది. అయినప్పటికీ, విజయవాడ విమానాశ్రయం దాటి ముందుకు కదలలేదు. "ప్రధాన మంత్రికన్నా ముందర ముఖ్యమంత్రి ఎలా వెళ్లుతారు? ఆయనకెందుకు మొదలు ఆ కీర్తి దక్కాలి" అని హెలికాప్టర్ మొరాయించే ఏర్పాటు జరిగిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమనే ది వారికే వదిలేద్దాం. ముఖ్యమంత్రితో సహా, ప్రతిపక్ష నాయకుడి హోదాలో స్వర్గీయ ఎన్ టీ రామారావు గారు కూడా రాజభవన్ లో ప్రధానిని కలిసి, సహాయం కొరకు అర్ధించారు. అంతగా రాజకీయాలకు తావులేని విధంగా వుందాయన అభ్యర్థన ఆ రోజుల్లో. వారూ-వీరూ అనే తేడా లేకుండా అంతా రాజకీయమే-అన్నీ విమర్శలే ఈ రోజుల్లో. తర్వాత మరో మారు కూడా ప్రధాని వచ్చి తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ నాయకుడి హోదాలో స్వర్గీయ రాజీవ్ గాంధి తుఫాను ప్రాంతాలలో రెండు రోజులు తిరిగారు అప్పట్లో. సహాయ-పునరావాస కార్యక్రమాల సమీక్షకు చెన్నారెడ్డి గారు అమెరికా నుండి తిరిగి రావడానికి ముందు మరో మారు పర్యటించారు. తుఫానులు తరచుగా వస్తున్నాయనో-లేక-మరేమైనా కారణముందో, ఈ రోజుల్లో ప్రధాని గాని, సోనియా గాని పర్యటనలకు ఎక్కువగా రావడం లేదు.

తుఫాను సంభవించిన వెంటనే, కేంద్ర ప్రభుత్వ తక్షణ సహాయం గురించిన వివరాలు టెలిప్రింటర్లో సందేశం వచ్చింది. (ఫాక్సులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవలేదు అప్పటికింకా). అందులో సహాయం మొత్తం ఇంత అని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినప్పుడు ఆ మొత్తం అంకె తప్పని వెంటనే స్పందించారు. మాకు అర్థం కాలేదు. ఇంతలో వచ్చిన మరో మెసేజ్ లో ముఖ్యమంత్రి చెప్పిన రు. 86 కోట్ల మొత్తం గురించి సవరణ వచ్చింది. అదీ ఆయన జ్ఞాపక శక్తి. ఆ సహాయం గురించి ఆయనే మాకు వివరించారు. రకరకాల అంశాలను అధ్యయనం చేసి ఆర్థిక కమీషన్ "ఇంత మొత్తం" ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన రాష్ట్రానికి తక్షణ సహాయం కింద ఇవ్వాలని నిర్ణయిస్తుందని, ఆ మొత్తం అప్పట్లో రు. 86 కోట్లుగా మాకు విశదీకరించారు. అందులో కూడా మూడొంతులు కేంద్రం, ఒక వంతు రాష్ట్రం భరిస్తుందని ఆయనే చెప్పారు. అలనాటి తుఫానును "జాతీయ విపత్తు" గా పరిగణించాలని చెన్నారెడ్డి గారు చేసిన ప్రతిపాదనకు స్పందించిన ప్రధాని వీపి. సింగ్ "ఇది జాతీయ విపత్తు కాకపోతే మరింకేదీ జాతీయ విపత్తుగా అనలేం" అని వ్యాఖ్యానించడమంటే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం అనుకోవాలి. అంతటితో ఆగకుండా, ఇక్కడ వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అనుకోకుండా, ఒక ప్రత్యేక అధ్యయన బృందాన్ని కూడా పంపించారు రాష్ట్రానికి వీపి. సింగ్.

అయినా చెన్నారెడ్డి గారు తృప్తిపడలేదు. అందిన సహాయం ఏ మూలకు సరిపోదని ఆయన భావన. ఆ ఆలోచనతో "ప్రపంచ బాంక్" ను కదిపారు. " ఈ ఆధునిక ప్రపంచంలో కొంత బియ్యాన్ని పంచడంతో నో, మరో రకమైన ధాన్యాన్ని-పప్పు దినుసులను సమకూర్చడంతో నో, గుడిసెల మరమ్మతుకు అంతో-కొంతో ధనం సహాయం చేయడంతో నో సరి పుచ్చుకోవడం మన సంస్కృతిని-సాంప్రదాయాన్ని-ప్రపంచం దృష్టిలో మన గౌరవ ప్రతిష్ఠలను ప్రతిబింబించవు. శాశ్వతమైన ఏర్పాట్లు చేసినప్పుడే ఫలితం వుంటుంది" అన్నారాయన. ఏం జరిగిందో-ఎలా జరిగిందో అని అర్థం చేసుకునే లోపల, ప్రపంచ బాంక్ బృందం, తుఫాను సంభవించిన అతి కొద్ది రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించింది. ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో అధికారులు వెంట రాగా రెండు రోజులు పర్యటించింది బృందం. మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన వారికిచ్చిన "తుఫాను ప్రాంత సంగ్రహ సమాచారం (Detailed Brief on what is to be done ?)" వివరించిన తీరు ఆయన మేథస్సుకు నిదర్శనం. బహుశా ఆయన తప్ప మరొకరు ఆ విధంగా చేయలేరని నా ఉద్దేశం. ఆయన ఆ రోజు ప్రపంచ బాంక్ బృందానికి చేసిన సూచన (తుఫాను ప్రాంత) భావి తరాల వారికి శాశ్వత పరిష్కారం. తర్వాత ప్రభుత్వాలు నిజంగా అందులో ఎన్ని అమలు చేసాయోగాని అమలు చేసే వుంటే తుఫాను తాకిడికి జరిగే నష్టం చాలా వరకు నివారించగలిగే వీలుండేది. ఆయన ఇచ్చిన వివరణలో ప్రధానమైంది "కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతంలో పురాతన కాలంలో నిర్మించి అస్తవ్యస్థమైపోయిన డ్రైనేజి ఏర్పాటు" గురించి.

"యావత్ భారత దేశంలో ఆంధ్ర ప్రాంతపు వ్యవసాయ దారులు, వ్యవసాయోత్పత్తిలో అగ్రగణ్యులని, 1924 లో, అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాయల్ అగ్రికల్చరల్ కమీషన్ పేర్కొంది. దానికి ప్రధాన కారణం అక్కడి డెల్టా ప్రాంతం-డ్రైనేజి వ్యవస్థ. అందుకే భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్ర ప్రదేశ్ కు పేరొచ్చింది. దురదృష్టవశాత్తు తుఫాను మూలంగా డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా నాశనమై పోయింది. అలా పాడై పోవడానికి, రాజకీయ నాయకుల-రకరకాల భూ ఆక్రమణదారుల ప్రోత్సాహంతో, డ్రైనేజి ప్రాంతంలో కాలువలకు చెందిన కొంత భాగాన్ని కబ్జా చేసుకోవడమే కారణం. కొందరు దురాశ పరుల మూలాన మొత్తం డ్రైనేజి వ్యవస్థ పగుళ్లకు దారితీసింది-పనికి రాకుండా పోయింది. ఆంధ్ర ప్రాంతంలోని సుమారు వేయి కిలోమీటర్లకు పైగా పొడవనున్న తీర ప్రాంతంలోని చాలా భాగం తుఫాను తాకిళ్లకు గురయ్యే ప్రమాదముంది. ఈ ప్రమాదం నుంచి శాశ్వతంగా అక్కడి ప్రజలను కాపాడాలి". అని ప్రపంచ బాంక్ బృందానికి వివరించి, "తుఫాను ఆవాసాలను" ఆ ప్రాంతాలలో పటిష్ఠంగా నిర్మించేందుకు ఆర్థిక సహాయం చేయమని అడిగారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విషయం గురించి ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడు మొయిన్ కురేషీతో చర్చించాలని చెన్నారెడ్డికి సూచించారు బృందంలోని సభ్యులు.

అప్పట్లో ప్రపంచ బాంక్ సహాయం పొందాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరి. ఇప్పుడూ అవసరమే కాని వారి దృష్టికి తీసుకెళ్తే చాలు. చెన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి డ్రైనేజి వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రపంచ బాంక్ సహాయం విషయం చెప్పి, వారిచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. మొదట్లో వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణాన్ని వారం-పది రోజుల అనంతరం కొనసాగించారు. అత్యవసరంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సినప్పటికీ, జూన్ 6, 1990 అర్థ రాత్రి ఆసుపత్రిలో చేరేంతవరకు, నిత్యం ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. డ్రైనేజి వ్యవస్థ పునరుద్ధరణ తన ప్రధమ కర్తవ్యంగా భావించానని అమెరికా నుంచి వచ్చిన చెన్నారెడ్డి సిరి ఫోర్టు ఆడిటోరియంలో చెప్పారు. చెన్నారెడ్డి గతంలో రాష్ట్ర ఆర్థిక-పారిశ్రామిక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన సందర్భంలో మొయిన్ కురేషీని కలిసిన సందర్భాలు ఇరువురూ గుర్తుచేసుకున్నారు. పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను తయారు చేయాలని, చేయించిన తదుపరి, తప్పక ఆర్థిక సహాయం చేస్తామని ఆయన దగ్గర హామీ తీసుకున్నారు చెన్నారెడ్డి. ఇరువురి కలయిక తర్వాత కేవలం పద్నాలుగు రోజుల్లో నిష్ణాతులైన పలువురు ప్రపంచ బాంక్ నిపుణుల బృందం రాష్ట్రానికి రావడం, వివరంగా అంచనాలను రూపొందించడం జరిగింది. భవిష్యత్ లో ప్రపంచ బాంక్ హామీ నెరవేరడం వల్లనే పాడై పోయిన డ్రైనేజి వ్యవస్థ బాగుపడింది ఆ తర్వాత.

ఆరోగ్యం కుదుట పడింతర్వాత రాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్టు ఆడిటోరియంలో మాట్లాడుతూ, తుఫాను భీభత్సాలను-ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి, అప్పట్లో అమల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిపోదని బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఫైనాన్స్ కమీషన్ సమీక్షల ఆధారంగా అయిదు సంవత్సరాల కాలపరిమితికి సరిపడా ప్రకృతి వైపరీత్యాల సహాయ విధానం అమలు సరిపోదన్నారు. ఒకటి-రెండు రాష్ట్రాల నుంచో, కేంద్ర నుంచో నిధులను సేకరించి "జాతీయ విపత్తుల సహాయక నిధి" ని ఏర్పాటు చేయడంతో సరిపోదని, అన్ని రాష్ట్రాలలోని పౌరులందరి విరాళాలతో-భాగస్వామ్యంతో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక " న్యూక్లియస్ నిధి" ని ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ-అంతర్జాతీయ విపత్తులలో-విషాదాల్లో, తమ వంతు పాత్ర నిర్వహించాలన్న భావన ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు చెన్నారెడ్డి. ప్రణాళికా సంఘం సరైన ఆలోచన చేసి, భారత దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని-ప్రతి పౌరుడిని "విధిగా" తోచినంత విరాళం ఇచ్చే విధంగా "శాశ్వత నిధిని" ఏర్పాటు చేసే, ఆ నిధులతో నడిచే "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ను నెలకొల్పాలని సూచించారు చెన్నారెడ్డి. అలా చేస్తే, ప్రకృతి వైపరీత్యాల్లో, తమ విరాళాలతో, తమ తోటి వారికి సహాయం అందిందన్న సంతృప్తి ప్రతి పౌరుడిలో కలుగుతుందని ఆయన భావించారు. అలా జరిగుంటే బాగుండేదేమో !

2 comments:

  1. చాల బాగుంది. చెన్నారెడ్డి గారి తుఫాను నిధి సూచన చాల మంచిది. అర్జునరావు గారు అంథకు ముందు విశాఖ జిల్లా కలక్టరు గా పని చేశారు

    ReplyDelete