Saturday, June 19, 2010

IX-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-9) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-9
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2009 న మీడియా అభివర్ణించిన "సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణం" వ్యవహారంలో, చైర్మన్ రామ లింగరాజు తాను "దోషి" నని, "తప్పుచేసానని" బహిర్గతం చేయడానికి అర గంట ముందు, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ కు ఫోన్ చేసి, మరి కాసేపట్లో తానొక "సంచలనాత్మక" ప్రకటన చేయబోతున్నానని, ఆ ప్రకటన ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని చెప్పారు. అయినప్పటికీ, తనకు అత్యంత గౌరవ ప్రదమైన-ప్రీతిపాత్రమైన-హృదయానికి చేరువైన 108-అత్యవసర సహాయ సేవలను "ఎన్ని కష్ట నష్టాలెదురైనా" నిరాటంకంగా కొనసాగించాలని కోరారు (అభ్యర్థించారు?). సుమారు రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి, బాలాజి-వారణాసి-రంగారావు లాంటి వారి తోడ్పాటుతో లాభాపేక్ష లేని ఇ.ఎం.ఆర్.ఐ సంస్థగా నెలకొల్పి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టి, (దివంగత) ముఖ్యమంత్రి సమక్షంలో దానికి అనుగుణమైన అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయించి, అపారమైన అనుభవజ్ఞుడు వెంకట్ ను సీ.ఇ.ఓ గా నియమించి, లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆగస్టు 15, 2005 న ప్రారంభించడానికి రామ లింగరాజు చేసిన కృషిని ఏనాడో-ఒకనాడు ఆయన మాటల్లోనే తెలుసుకోవాలి గాని, ఇతరులకు వర్ణించడం సాధ్య పడదు.

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న వారు చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ఇలాంటి వాటికి సమాధానం రాజు గారే ఏనాడో ఒకనాడు ఇవ్వాలి తప్ప ఇతరులకు జవాబు వెతకడం సాధ్య పడేది కాదు. కాకపోతే, ఊహాజనిత సమాధానాలు అన్వేషించి 108-అత్యవసర సహాయ సేవల "ఒడిదుడుకులకు" వాస్తవ కారణాలను అంచనా వేయొచ్చు. ఆ ప్రయత్నమే ఇది.

ఈ నేపధ్యంలో రాజు గారి ఆందోళనను అర్థం చేసుకోవాలి. సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు గారు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజు గారిపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన "భవిష్యత్ దర్శనం-విజన్" కు అనుగుణంగా సేవలు వ్యాపించడంతో ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. దాన్ని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

కొత్తగా సహాయ సేవలను కోరుకునే ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. తాత్కాలిక అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసింది. నాకు గుర్తున్నంతవరకు అప్పట్లో, అంత భారీ మొత్తంలో ఒకే దఫాగా బయట నుంచి నిధులు రావడం, అదే మొదటిసారి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతవరకు, అంత మొత్తానికి, ఒకే చెక్కును ఇవ్వడం జరగలేదు. ఇతర రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పై అంత విశ్వాసంతో-నమ్మకంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన నాడే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. గుజరాత్ రాష్ట్రాన్ని పొందడానికి మేం ఆ ప్రభుత్వం వెంట పడితే, ఇతర రాష్ట్రాలు మా ద్వారా అత్యవసర సహాయ సేవలు పొందడానికి మా వెంట పడసాగాయి ఆ తర్వాత. తిరిగి కొంతకాలానికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది అనేక కారణాలవల్ల. ఎంఓయు నిబంధనల ప్రకారం ఆ నిధులను, ఆ రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు ప్రధానంగా ఉపయోగించాలి. క్రమేపీ నెలకొంటున్న సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. ఒక రాష్ట్రంతో-కొద్ది మొత్తంతో ఆరంభమయిన ఆ సాంప్రదాయం "ఇంతై-ఇంతింతై- వటుడింతై" అన్న చందాన రాజుగారు నిష్క్రమించేనాటికి రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. ఇప్పుడా రుణ భారం మోసేదెవరన్నది "మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా" మిగిలిపోయింది. జవాబు దొరికేలోపుల రాజు గారి స్థానంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జీ.వీ.కె. రెడ్డి తన జీ. వి. కె సంస్థ నుంచి (మీడియాలో సీ.ఇ.ఓ వెంకట్ చెప్పిన లెక్కల ప్రకారం) రు. 50 కోట్లకు పైగా సమకూర్చినట్లు తెలుస్తోంది.

ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి కారకులైన వారు, కనీసం ఒక్క విషయంలో నన్నా తక్షణ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని-అంతగా అత్యవసరం లేని-ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. అలా చేసిన ఖర్చు "ఆస్తుల సంపాదన" కిందకు వస్తుంది. ఇ.ఎం.ఆర్.ఐ ఎదుర్కుంటున్న "ఆర్థిక పరమైన ఒడిదుడుకులను" విశ్లేషించడానికి కేవలం దానికున్న రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని-సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని-అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని)ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది. "ఆలస్యం అమృతం విషం" అన్నారు పెద్దలు.

ఇంతకూ ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న నిధులను ఇ.ఎం.ఆర్.ఐ ఆయా రాష్ట్రాల అవసరాలకు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ అవసరాలకు వాడి వుండే ఆస్కారం వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టమేమీ కాదు. బాంక్ దగ్గర్నుంచి తెచ్చిన రుణం-ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం ఖర్చయ్యాక, ప్రతి రాష్ట్ర సహాయ సేవల నిర్వహణ వ్యయంలో భరించాల్సిన 5% వాటా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు కావాల్సిన అదనపు మూలధనం ఖర్చు, పాలనా పరమైన వ్యయం, శిక్షణా సంబంధమైన వ్యయం (మౌలిక సదుపాయాలతో కలిపి), సీనియర్ ఉద్యోగుల జీత భత్యాలు, సాంకేతిక సంబంధమైన మూల ధన వ్యయం లాంటివన్నీ ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడాల్సిన అవసరం కలిగింది. తెలిసో-తెలియకో, సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతికి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. ఇలాంటి అనుమానాలను మీడియా అప్పట్లో వ్యక్తం చేసింది కూడా. అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ఎవరిదో వారు వివరించాల్సిందే.

కష్టాలన్నీ ఒక్క సారే వస్తాయన్నది ఇ.ఎం.ఆర్.ఐ విషయంలోనూ జరిగింది. రాజు గారి నిష్క్రమణం కన్నా ముందే "అంబులెన్స్ యాక్సెస్ ఫౌండేషన్", "ట్రాన్స్ పరెన్సీ ఇన్ కాంట్రాక్ట్స్" అనే రెండు సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇ.ఎం.ఆర్.ఐ తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల పూర్వ రంగంలో అవకతవకలు జరిగాయని-ఇ.ఎం.ఆర్.ఐ ని నోడల్ ఏజన్సీగా గుర్తించే విషయంలో పోటీ పద్ధతిని పాటించలేదని ఆరోపిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాయి. అవి తమ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను, కౌంటర్ అఫిడవిట్లలో వివిధ రాష్ట్రాలు వాటికిచ్చిన సమాధానాలను, సుప్రీం కోర్ట్ నోటీసుకు సంబంధించిన అంశాలను మరో సందర్భంలో వివరంగా తెలుసుకుందాం. ఇ.ఎం.ఆర్.ఐ ని ఉపయోగించుకుని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నారన్న ఆరోపణతో ఒక "చోరీ కేసును" కూడా రామ లింగరాజు పై పెట్టడం జరిగింది అదే రోజుల్లో. ఈ ఆరోపణలను ఖండిస్తూ కూడా సమాధానం ఇచ్చింది సంస్థ. అదే రోజుల్లో న్యూ ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న "నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి)", ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పక్షాన, ఏప్రిల్ 2009 లో నిర్వహించిన అధ్యయనంలో, అధిక శాతం ఇ.ఎం.ఆర్.ఐ సేవలను కొనియాడుతూనే సంస్థా పరమైన లోటుపాటులను కూడా ఎత్తి చూపింది. ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి చెప్పిన మంచిని మరిచిపోయిన మీడియా ఎత్తి చూపిన లోటుపాటులను మాత్రం భూతద్దంలో ప్రదర్శించి మరీ కథనాలు ప్రచురించింది. అధ్యయన కమిటీ చెప్పిన విషయాలను వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాం.

వీటి వల్ల లాభం-నష్టం ఎంతవరకు జరిగిందో-జరగబోతుందో ఏమో కాని, మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ వార్తలొచ్చాయి. ఫలితంగా సీ.ఇ.ఓ వెంకట్ జనవరి 18, 2009 న పాత్రికేయులను ఆహ్వానించి సమగ్రమైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన వివరణతో సమస్య చాలావరకు తాత్కాలికంగా సమసి పోయినా అనుమానాలు పూర్తిగా వీడలేదు. కష్టాలన్నీ ఒక్క సారే వచ్చినా వెంకట్ గారు ధైర్యాన్ని-స్థైర్యాన్ని కోల్పోలేదు. జనవరి 8, 2009 నుంచి, మే 26, 2009 వరకు ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకున్న పటిష్టమైన కార్యాచరణ పథకం ప్రకారమే ఆయన ముందుకు సాగారు. తనతో పనిచేస్తున్న సీనియర్ ఇ.ఎం.ఆర్.ఐ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితులుండడంతో, భవిష్యత్ పై వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు నిరంతరం పాటుపడేవారాయన. అందులో భాగంగా మార్చ్ నెల 25, 2009 న, ప్రొఫెసర్ రంజన్ దాస్ తో చక్కటి శిక్షణా సంబంధమైన ఉపన్యాసాన్ని సీనియర్లకు ఇప్పించారు వెంకట్. ఆయనా పాల్గొన్నారందులో. భవిష్యత్ లో ఇ.ఎం.ఆర్.ఐ లో పనిచేస్తున్న ప్రతి "లీడర్" ఎలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి, ఎలా సంస్థకు నిధుల సమీకరణలో తోడ్పడాలి, ఒక లక్ష్యంతో-ధ్యేయంతో ముందుకెలా సాగాలి అన్న సందేశం ఆ శిక్షణా కార్యక్రమానికి హాజరైన మా అందరిలో బలీయంగా నాటుకు పోయింది. "వ్యూహం అంటే ఏమిటి-వ్యూహ రచన ఎలా వుండాలి-పోటీని ఎలా ఎదుర్కోవాలి" లాంటి అంశాలపై రంజన్ దాస్ విశ్లేషణను మరో సందర్బంలో తెలుసుకుందాం.

వెంకట్ ఎదుర్కొన్న కష్టాల్లో అతి కీలకమైంది, "ప్రయివేట్ భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన వ్యక్తుల-సంస్థల అన్వేషణ". అదంత తేలికయిన విషయం కాదు. ఒక వైపు మాజీ చైర్మన్ పై పలు ఆరోపణలు, ఇంకో వైపు సుప్రీం కోర్టులో కేసు, మరో వైపు మీడియా వ్యతిరేక ప్రచారం, మధ్యలో అకౌంట్ స్థంబింప చేసిన యాక్సెస్ బాంక్, ఒక్కోసారి కింది స్థాయి ఉద్యోగులకు కూడా విశ్వ ప్రయత్నం చేసినా సరైన సమయంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పుల వాళ్ల బాధలు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత... వెరసి అన్నీ కష్టాలే. ప్రయివేట్ భాగస్వామిని పొందే ప్రయత్నంలో భాగంగా కనీసం పదికి పైగా సంస్థలను తడిమి చూశారు వెంకట్. అందులో చాలామంది, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో సరైన పారదర్శకత లేదని, కార్పొరేట్ గవర్నెన్సుకు ప్రాధాన్యత లేదని... ఇలా అసందిగ్ధమైన ఆరోపణలు చేసి తప్పుకున్నారు. మరికొందరిని "ఇంటి వాసాలు లెక్క పెట్టే తరహా మనుషులు" పనిగట్టుకుని మరీ తప్పు దోవ పట్టించారు. వెంకట్ గారు తలుపు తట్టిన సంస్థల్లో బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్, వారెన్ బఫర్ ఫౌండేషన్ లాంటివి కూడా వున్నాయి. బహుశా ఆయన "ఎక్కని-దిగని గడప లేదే మో !". పిరమల్, జీ.వి.కె సంస్థలు మాత్రమే చివరి దాకా ఆసక్తి కనబరిచాయి. ఇ.ఎం.ఆర్.ఐ ని దక్కించుకోలేక పోవడం పిరమల్ సంస్థ దురదృష్టమా, లేక, దక్కించుకోవడం జీ.వి.కె అదృష్టమా భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.

ఇక్కడొక విషయం చెప్పాలి. జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడి వుండవచ్చు గాని తన వారసులెవరైతే బాగుంటుందన్న విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. నాకు అర్థమయినంతవరకు-అర్థం చేసుకున్నంతవరకు, రాజు గారి కుటుంబ సభ్యులకు పిరమల్-జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వున్నట్లు లేదు మొదట్లో. కాకపోతే, ఎంత కాదనుకున్నా వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు వెంకట్ గారు. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డి గారిపై మనసు మళ్లి వుండవచ్చు. ఆ విషయం సూచన ప్రాయంగా వెంకట్ కు చేరి వుండాలి. జనవరి 21, 2009 న తాజ్ కృష్ణా హోటల్ లో వెంకట్ గారితో నేను కూడా వెళ్ళి డాక్టర్. జీ.వి.కె. రెడ్డి గారిని కలిశాం. పరిస్థితి వివరించి సంస్థను గట్టెక్కించమని కోరాం. నేను డాక్టర్. మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పౌర సంబంధాల అధికారిగా పనిచేశానని, ఆ సమయంలో చాలా సందర్భాల్లో డాక్టర్. జీ.వి.కె. రెడ్డి గారిని కలిశానని ఆయనకు గుర్తుచేశాను. ఆయన జ్ఞాపక శక్తికి నిజంగా జోహార్లు. అప్పటి సంగతులు ఆయన చాలా గుర్తుకు చేసుకోవడమే కాకుండా, చెన్నారెడ్డి గారిని బాగా పొగిడారు. జీ.వీ.కె మా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. జనవరి 24, 2009 న ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు కూడా.

ఇంతలో, మళ్ళీ ఏమైందో గాని, రాజుగారి కుటుంబం దృష్టి మరో మారు పిరమల్ వైపు మళ్లింది. స్వయంగా వారి కుటుంబ ప్రతినిధి పిరమల్ ను కలుసుకొని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రప్పించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారుగాని, ఆయన హైదరాబాద్ లో లేనందున కుదర లేదు. ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య గారిని ఉదయమే వెళ్లి కలిశాం. పిరమల్, ఆయన కుమారుడు, వెంకట్, నేను కలిసి వెళ్లాం. సుమారు అర్థ గంట పైగా సమావేశం జరిగింది. సంస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు రోశయ్య గారు. వారి ఆసక్తిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు. అంతా సవ్యంగా వుందనుకుంటుండగానే, సరిగ్గా మే 23, 2009 న వెంకట్ కు ఫోన్ చేసి, "పారదర్శకత-కార్పొరేట్ గవర్నెన్సుకు సంబంధించిన అస్పష్ట అంశాలను" పేర్కొని, ఆ నెపం మీద తమ నిరాసక్తతను వ్యక్త పరిచారు పిరమల్ అధినేత. ఇక ఆ తర్వాత మే 26, 2009 న ముఖ్యమంత్రి చొరవతో జీ.వీ.కె. రెడ్డి గారు ఇ.ఎం.ఆర్.ఐ బరువు బాధ్యతలు స్వీకరించారు.

పిరమల్ అధినేత, ఆయన కుమారుడు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య గారిని కలిసినప్పుడు, (బహుశా) ఫోన్లో డాక్టర్ జీ.వీ.కె. రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో (ఆయన జరిపిన చివరి సమీక్షా సమావేశంలో) మాట్లాడినప్పుడు లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి. ఈ కీలకమైన అంశం గురించి వివరంగా ముందు-ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Sunday, June 13, 2010

గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల (మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?:వనం జ్వాలా నరసింహా రావు

గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల
(మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?
వనం జ్వాలా నరసింహా రావు

ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు తాను నియమించి-శాఖలను కేటాయించిన నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, పరిణితి చెందిన 86 గ్రామాల సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వం చేసే ప్రతి పని గవర్నర్ పేరు మీదే జరగడం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఆ ప్రకరణను కొంచెం విస్తరించి, బహుశా రాష్ట్ర గవర్నర్, ఇక నుంచి కేవలం నామ మాత్రంగా తన పేరుమీద కాకుండా, తానే-తన పర్యవేక్షణలోనే, ప్రజా సంక్షేమం గురించి స్వయంగా పర్యటనలు చేయబోతున్నారన్న అర్థం ఆయన మాటల్లో గోచరిస్తున్న ది. గవర్నర్ పేరుపై సాగే దే రాష్ట్రంలోని పాలనని, నెలకు మూడు రోజులు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తానని, సర్పంచులు పంచాయితీలను దత్తత తీసుకోవాలనీ, నిర్మల్ పురస్కార గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దాలనీ అనడమే కాకుండా, ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒక ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ కూడా చేశారు నరసింహన్. ఆయన ఉద్దేశం సమాంతర ప్రభుత్వం నడపడమో, లేక, "తన ప్రభుత్వం" నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు "అనుబంధంగా-అభినందనగా" (సప్లిమెంటరి-కాంప్లిమెంటరి) మరో మార్గంలో ప్రజల క్షేమం పట్టించుకోవడమో అయ్యుండాలి. రెండు పద్ధతులూ, రాజ్యాంగ పరిమితులకు-సాంప్రదాయాలకు లోబడి వున్నంతవరకు, అభిలషణీయమే.

కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍ గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. ఆ కాలంలో నాలుగు సంవత్సరాల పాటు చేతనకు నేను అడ్మినిస్ట్ర్రేటివ్ అధికారిగా-ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసాను. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

గత సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు ముఖ్యమంత్రి రోశయ్యా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి రోశయ్యను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? రోశయ్యకు సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం. రాజ్యాంగం రీత్యా ముఖ్యమంత్రిని-ఆయన మంత్రివర్గ సహచరులను నియమించిన గవర్నర్ కు, పాలనా సంబంధమైన కొన్ని లోపాలు కలవర పడే విధంగా వుండి ఉండాలి ! అలాంటప్పుడు, పరిపాలనా వ్యవహారాలలో ఎదురవుతున్న అనేకానేక ఇబ్బందుల జోలికి పోకుండా, కేవలం, ముఖ్యమంత్రి అధికారాలేంటి ? గవర్నర్ అధికారాలకు పరిమితులేంటి? గవర్నర్ పాత్ర ఏంటి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ విమర్శించ తగునా? అన్న విషయాలనే పదే-పదే ప్రస్తావించి, కొందరు రాజకీయ నాయకులు వారి పరిమిత దృష్టిని ప్రదర్శిస్తున్నారు ఇటీవల. కొంతకాలం క్రితం గవర్నర్ కేంద్రానికి రహస్యంగా నివేదిక పంపించారని (ధృవీకరించుకోకుండానే) ఆయన మీద నిప్పులు చెరిగారు. అలా పంపించడం ఆనవాయితీగా జరిగేదేనని, అందులో వింతేమీ లేదని తెలిసిన మేధావులు కూడా గవర్నర్ నరసింహన్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ నాయకులై తే మరీ రెచ్చిపోయారు. ప్రతి పక్షాల వారే మో, ఆయన రహస్య నివేదికను బహిర్గతం చేయాల్సిందేనని డిమాండు చేశారు. చివరకు కొన్నాళ్లకు సమస్య సమసిపోయింది.

పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! కాకపోతే, 1995 లో అలాంటిదే జరిగినప్పుడు, ఆ పనిచేసిన నాటి గవర్నర్ కృష్ణకాంత్ కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు సహకరించారు. గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.

కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు నెల కొన్న ప్రత్యేక పరిస్థితులు, తనను ప్రజల వద్దకు తరచుగా పోయేందుకు ప్రేరేపిస్తున్నాయని గవర్నర్ భావిస్తుండవచ్చు. ఆలానే, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని కూడా గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో రాష్ట్రంలో పర్యటిస్తే తప్పేంటి?

గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. (గవర్నర్) ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు సంబంధించిన వివరాలు, గవర్నర్ కు తెలిసి వుండాల్సిన అవసరం వుంది. దాని మూలాన, ఆయనకు రాష్ట్రంతో పరిచయం పెంచుకోవడం తేలికవుతుంది. రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు తన చేతనైన సహాయం చేసే వీలుకూడా కలుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో, రాజకీయ అస్థిరత్వం ఏర్పడి (ఇప్పుడు ఏర్పడనున్నదని ఉద్దేశం కాదు !), రాష్ట్రపతి పాలన విధించి, గవర్నర్ పాలనా యంత్రాంగాన్ని నడపాల్సి వస్తే ఆ పరిచయం తోడ్పడుతుంది. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. అమలవుతుందో, లేదో, వేచి చూడాలి. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.

రాజ్యాంగం సంక్రమింప చేసిన అధికారాలను-బాధ్యతలను, అనేక సందర్భాల్లో, కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అనిపిస్తోంది. "ఆర్థిక అత్యయిక పరిస్థితిని" కొన్ని రాష్ట్రాలలో అమలు చేయాల్సిన సందర్భంలో కూడా మౌనం వహించింది ప్రభుత్వం. అలా చేయడం వల్ల, కొన్ని రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్ ?) యధేఛ్చగా, ఆర్థిక దోషాలకు పాలపడుతున్నాయి. వాస్తవానికి కొన్ని రాష్ట్రాలలో ఆర్థిక ప్రగతికి అవరోధం కూడా ఏర్పడుతుందనాలి. గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నెల రోజుల క్రితం "రహస్య నివేదిక" పంపడం వాస్తవమైతే, ఆ చర్యను విమర్శించకుండా, ఆయనను రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడానికి వీలు కలిగేలా చేయాలి. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు. కాకపోతే, "నేను మంచి గవర్నర్ ను కాను.. చెడ్డ గవర్నర్ ను" అని అనకుండా వుండాల్సింది గవర్నర్ నరసింహన్. మంచి-చెడులు ప్రజలే నిర్ణయిస్తారు.(End)

Thursday, June 10, 2010

బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి స్టాలిన్ జోస్యం-భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు విప్లవ పాఠాలు : వనం జ్వాలా నరసింహారావు

(జూన్ నెల 12, 13, 14 తేదీలలో
సీపీఐ జాతీయ సమితి సమావేశాలు
హైదరాబాద్ లో జరుపుకున్న నేపధ్యంలో)

వనం జ్వాలా నరసింహారావు

భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టడానికి వీలు కావచ్చునని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్ ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్పష్టం చేశారు స్టాలిన్. చి యాంగ్‌కై-షేక్ తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్.

హైదరాబాద్ లో మూడు రోజులు జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి సమావేశాలలో సమకాలీన జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు, పార్టీ భవిష్యత్ లో అవలంబించాల్సిన వైఖరికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి. యూపీఏ వైఫల్యాలను ఎండగట్టడంలో వామ పక్షాలు విఫలమయ్యాయని, పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి వామ పక్షాలకు పెద్ద ఎదురుదెబ్బని-పరాజయంగా భావించాలని, బెంగాల్ అనుభవం దృష్ట్యా కమ్యూనిస్ట్ పార్టీ విధాన-రాజకీయ వైఖరులను సమీక్షించుకోవాల్సిన అవసరముందని సమావేశాలను ప్రారంభించిన జాతీయ కార్యదర్శి బర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా, మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి సుమారు అరవై ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగల దా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.

ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, పలు దేశాలను కలవర పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో కార్మికుల సమ్మెలు సుదీర్ఘంగా సాగాయి. ఆ కాలంలోనే, భారత దేశంలో కూడా కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. అదే రోజుల్లో, 1917 నాటి రష్యన్ విప్లవ తదనంతర రాజకీయ-సామాజిక పరిణామాలు ఎన్నో దేశాలపై ప్రభావం చూప సాగాయి. 1919 లో మాస్కోలో ఆవిర్భవించిన మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ-కోమిన్టార్న్, ప్రపంచవ్యాప్తంగా, బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా, అన్ని రకాల పోరాటాలు సలిపి, అంతర్జాతీయ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఎం ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920 న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. భారత దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, దేశంలోని వామ పక్ష భావాలున్న వారిపై కూడా కోమిన్టకర్న్ ప్రభావం పడే ప్రమాదం వుందని భావించి, పలువురి పై తప్పుడు కుట్ర కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నాలు చేసింది. "కోమిన్టిర్న్" సంస్థకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎం ఎన్ రాయ్, వామ పక్ష భావాలకు ఆకర్షితులైన డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త, షౌకత్ ఉస్మాని, సింగరవేలు చెట్టియార్, గులాం హుస్సేన్ లాంటి పలువురు కమ్యూనిస్ట్ భావాల నాయకులపై "కాన్పూర్ కుట్ర కేసు" పెట్టి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. మార్చ్ 17, 1924 న బనాయించిన చారిత్రాత్మక కాన్పూర్ కుట్ర కేసు, పరోక్షంగా, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దోహద పడిందనాలి.

వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, తమ పట్ల బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, డిసెంబర్ 1925 లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. ఇదిలా వుండగా, వారి పురోగతిని అడ్డుకునేందుకు, వారందరి పైనా "మీరట్ కుట్ర కేసు" పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. కాకపోతే, ప్రభుత్వం అంచనాలకు విరుద్ధంగా, ఆ కేసు విచారణ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కార్మికుల్లో అభిమానాన్ని పెంచ సాగింది. జనవరి 1933 లో, "బోల్షవిక్కులని" ప్రభుత్వం ముద్ర వేసిన కేసులోని నిందితులందరి కీ కఠిన శిక్షలు పడ్డాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన న్యాయస్థానం విచారణను, కమ్యూనిజం సందేశం ప్రజల్లోకి పంపే ఆయుధంగా ఉపయోగించుకున్నారు నిందితులు. కమ్యూనిజం ఉద్యమంగా బలపడ సాగింది.

స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో, మరి కొన్నాళ్లలో, స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జోషి మితవాద వైఖరిని, అతివాద భావాల రణదివే అనుచరులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 1948 లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, "స్వతంత్ర భారతదేశం" అంటే, "బ్రిటీష్ సామ్రాజ్య వాదుల పాక్షిక వలస ప్రాంతం" గా పేర్కొని, మితవాదిగా ముద్రవేసిన జోషిని తప్పించి, రణదివే ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది.

మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది అంటారు. ఆ జీవన్మరణ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి.

చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్ఘోనష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్ ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో. ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.

"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్కైు-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

అప్పటివరకు అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే, గోవిందన్ నాయర్, ముజఫర్ అహ్మద్ ల నాయకత్వం, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ఒకప్పుడు అదే జోషి నెహ్రూకు అనుకూలంగా మాట్లాడినప్పుడు ఆయనను తప్పుబట్టింది పార్టీ. డాంగే వర్గం లేవనెత్తిన "జాతీయ వాదన" కు అనుకోకుండా లోక్ సభలో పార్టీ ఉప నాయకుడు ఏ కే గోపాలన్ నుంచి మద్దతు లభించడం ఆశ్చర్యకరమైన విషయం. నెహ్రూ చర్యకు తమ పూర్తి మద్దతుంటుందని గోపాలన్ ప్రకటించారు. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపిఐ సెక్రెటేరియట్ లోని ఎనిమిది మంది సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే-గోపాలన్-ముజఫర్ అహ్మద్ లు నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తులు" గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్ (అంతకు ముందు లేని పదవి) గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్ గా నియమించింది.

అదే సమయంలో, భారత-చైనా యుద్ధం నేపధ్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన "చైనా అనుకూల వాదులు" గా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. డాంగే, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో, మధ్యే మార్గంలో, అతివాద-మితవాద వర్గాలకు సమాన దూరంలో వున్న నంబూద్రిపాద్ లాంటి వారు, అతివాదుల వైపు మొగ్గడానికి దారితీసింది. క్రమేపీ సంభవించిన కొన్ని పరిణామాలు పార్టీ చీలిక దిశగా తీసుకెళ్లాయి. చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964 లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో.

కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. మే నెల 1981 లో కారణాలేమైనప్పటికి, భారత కమ్యూనిస్ట్ పార్టీ పరోక్ష వ్యవస్థాపకుల్లో ఒకరైన డాంగేను, ప్రపంచ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న డాంగేను భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు. డాంగేను ఆయన కూతురు సారధ్యంలో ఆవిర్భవించిన "అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీకి" ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత. ఆ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల సాధ్య పడకపోవడంతో, మోహిత్ సేన్ నాయకత్వంలో పనిచేస్తున్న "ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ" తో కలిసిపోయి "యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ" తో విలీనమయింది. మరోవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పరిస్థితీ అంతే అనాలి. అఖిల భారత స్థాయిలో సోమనాథ్ ఛటర్జీ స్థాయి నాయకులనుంచి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్ట బడ్డ పలువురిని పార్టీ వదిలించుకుంది. మరోవైపు ఆ పార్టీ నుంచి నక్సల్బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన తీవ్రవాదులు, మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నారింకా.

ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి (ఉభయ) కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ రూపు రేఖలే మారిపోయాయి. చైనా పార్టీలోను మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీల వ్యూహం ఎలా వుంటుందో చూడాలి. (End)

Tuesday, June 8, 2010

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో మార్పు సంకేతాలు : వనం జ్వాలా నరసింహా రావు

పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో
మార్పు సంకేతాలు
వనం జ్వాలా నరసింహా రావు
కాంగ్రెస్ పార్టీ యోధాన-యోధుడు, సిద్ధాంత కర్త, ఇందిరాగాంధికి అత్యంత సన్నిహితుడు అని పేరు తెచ్చుకున్న సిద్ధార్థ శంకర రే మార్చ్ 19, 1972 నుంచి, జూన్ 21, 1977 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సారధ్యం వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయిందనాలి. గత ముప్పై మూడేళ్ల గా, ఏ పనైతే తన అధికారాన్నంతా ఫణంగా పెట్టినా కాంగ్రెస్ సాధించలేకపోయిందో, దాన్ని, అచిర కాలంలోనే మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సాధించే రోజు దగ్గర పడుతుందని చెప్పడానికి ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన ఘన విజయమే నిదర్శనం.

ఇందిరా గాంధి అత్యవసర పరిస్థితిని సడలించి 1977 లో సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పుడు, జనతా కూటమితో కలిసి పోటీ చేసిన సీపీఎం, ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో వామ పక్ష కూటమి విడిగా పోటీ చేసి, 243 స్థానాలను గెలుచుకుని, జ్యోతిబసు నాయకత్వంలో కాంగ్రేసేతర-లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా ఐదు పర్యాయాలు లెఫ్ట్ ఫ్రంట్ ను ఎన్నికల్లో గెలిపించి, 27 సంవత్సరాలు (జూన్ 21, 1977-నవంబర్ 6, 2000) ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు, స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుని, బుద్దదేబ్ భట్టాచార్యకు వారసత్వం అప్పగించారు. అప్పటినుంచి ముఖ్యమంత్రిగా బుద్దదేబ్ (నవంబర్ 6, 2000 నుంచి ఇప్పటి దాకా) పదవిలో కొనసాగుతూ, తృణమూల్ కాంగ్రెస్ కు శాసనసభలో గెలుపు దక్కకుండా కాపాడుతూ వస్తున్నాడు. ఇక ముందు అలా కాపాడగలగడం ఆయనకు కష్టమై పోతుందని చెప్పొచ్చు. మున్ముందు పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించే అవకాశాలు మెండుగా వున్నాయి.

వామ పక్ష రాజకీయ పార్టీలన్నీ ఐక్యమై, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులపై ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించుకున్న నేపధ్యంలో, అనేక కష్ట-నష్టాలను అధిగమించుకుంటూ కొనసాగించిన సుదీర్ఘ ప్రజా పోరాటం ఫలితంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకత్వంలో, వామ పక్ష కూటమి, నాలుగు దశాబ్దాల క్రితం అధికారంలోకి వచ్చినప్పటికీ, నిలుపుకో గలిగింది మాత్రం ఆ తర్వాత ఏడేళ్ల నుంచి మాత్రమే. ఆ మాటకొస్తే, ప్రపంచం మొత్తంలోనే, మొట్టమొదటి సారి, బుల్లెట్ ద్వారా కాకుండా బాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా భారత దేశంలోని కేరళ రాష్ట్ర ఓటర్లకు దక్కింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించిన ఘనత కూడా భారత దేశానికే దక్కింది.

సామాన్య ప్రజానీకానికి మేలు చేయాలన్న లక్ష్యంతో వామపక్ష-కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, 1952 నుంచి, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక-నిరంకుశ విధానాలను ఎదుర్కొంటూ పశ్చిమ బెంగాల్ లో వామ పక్షాలు బలపడ సాగాయి. వామ పక్షాల ఐక్యతను-కూటమి అధికారాన్ని, సవాలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొన్ని సార్లు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మమత బెనర్జీ నాయకత్వంలో కొన్ని సార్లు, ఎన్నికల సమయంలో అవగాహనలు కుదుర్చుకున్నప్పటికీ, సుమారు నాలుగు దశాబ్దాలుగా "ఎర్రకోటకు బీటలు" పడకుండా అక్కడి ఓటర్లు జాగ్రత్త పడ్డారు.

చరిత్ర పుటలు తిరగేస్తే గాని పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్ర అర్థంకాదు. ఆ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు. ఉద్యమాలు ఈ నాటివి కూడా కాదు. స్వాతంత్ర్య పోరాట కాలంలో, గత శతాబ్దపు నలభయ్యో దశాబ్దంలోనే, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక-శ్రామిక శక్తులను ఐక్యం చేసిన ఘనత బెంగాల్ కుంది. స్వాతంత్ర్యం రాక ముందే కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్ లో ఉద్యమాలకు నాయకత్వం వహించింది. స్వతంత్ర భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రంలో 1953 లో-1965 లో ట్రామ్ చార్జీలు పెంచినప్పుడు, 1954 లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ బి. సి. రాయ్ వున్నప్పుడు సంభవించిన కరవుపై పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా పి. ఎల్. 480 పథకానికి వ్యతిరేకంగా 1960 నాటి విద్యార్థి పోరాటం, 1962 భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరపాలని చేసిన ఉద్యమం చరిత్ర ప్రసిద్ధికెక్కినవే. అలాంటి ఎన్నో ఉద్యమాల ఫలితంగానే అక్కడి ప్రజల్లో కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అభిమానం పెరుగుతూ వచ్చింది.

ఆ నేపధ్యంలో 1967 లో పశ్చిమ బెంగాల్ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా విడి-విడిగా, "యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో ఒక కూటమి, "పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్" పేరుతో మరో కూటమి ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల అనంతరం రెండు కూటములు కలిసి "యునైటెడ్ ఫ్రంట్" గా కలిసి, మైనారిటీ కూటమికి చెందిన బంగ్లా కాంగ్రెస్ నాయకుడు అజోయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధిక సంఖ్యాక బలమున్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు జ్యోతి బాసు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారప్పుడు. అజోయ్ ముఖర్జీ 15 మార్చ్, 1967 నుండి 2 నవంబర్ 1967 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. మూడు నెలల పాటు (2 నవంబర్, 1967-20 ఫిబ్రవరి, 1968 వరకు) స్వాతంత్ర్యం వచ్చిన తొలినాటి రోజుల్లో ముఖ్యమంత్రిగా వున్న పి. సి. ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు. ఆయన పదవిలో వుంచడం కష్టం కావడంతో, అప్పటినుంచి ఏడాది కాలం రాష్ట్రపతి పాలన విధించింది కేంద్ర ప్రభుత్వం.

ఏడాది తర్వాత, 1969 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగి, మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ ఎక్కువ కాలం అధికారంలో వుండనీయలేదు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 25, 1969 నుంచి మార్చ్ 19, 1970 వరకు ముఖ్యమంత్రిగా వున్న అజోయ్ ముఖర్జీ ప్రభుత్వాన్ని రద్దుచేసింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా "పశ్చిమ బెంగాల్ వ్యవహారాల" కొరకు కాబినెట్ మంత్రిగా నియమించబడిన సిద్ధార్థ శంకర్ రే చాణక్య నీతిలో భాగంగా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కేవలం 13 నెలల కాలంలోనే రెండో పర్యాయం రద్దు చేసింది కేంద్రం. తిరిగి మరి కొంతకాలం (మార్చ్ 19, 1970-ఏప్రిల్ 2, 1971) రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం కేరళతో (నంబూద్రిపాద్ ను తొలగించడంతో) ప్రారంభమై, బెంగాల్ కు పాకింది. క్రమేపీ భారత దేశ రాజకీయాలలో అలా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం "సాంప్రదాయం" గా మారిపోయింది. ఆ పాపంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా ఏం తీసిపోలేదు. కమ్యూనిస్ట్ పార్టీల సారధ్యంలో వున్న ప్రభుత్వాలను రద్దుచేస్తున్న రోజుల్లో, ఆ పార్టీ తప్ప ఇతర కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు, ఆ చర్య తప్పని గట్టిగా వ్యతిరేకించే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టం.

ఏదేమైనా, 1971 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గతంలో మాదిరి "యునైటెడ్ ఫ్రంట్" గా కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు కలిసి పోటీకి దిగలేదు. సీపీఎం పార్టీ ఆలోచనా ధోరణికి అనుకూలమైన కొన్ని పార్టీలు సీపీఎం తో జతకట్టి పోటీ చేశాయి. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాకపోయినా, సీపీఎం అతి పెద్ద పార్టీగా-ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీగా అవతరించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, అప్పటి గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడ్డారు. మరో పర్యాయం పి. సి.ఘోష్ ను ముఖ్యమంత్రి పీఠం పై కూచోబెట్టారు (ఏప్రిల్ 2, 1971-జూన్ 28, 1971). సీపీఎం రాష్ట్ర వ్యాప్త ఆందోళనను చేపట్టింది. ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రజాస్వామ్య పోరాటమే మార్గమని భావించింది. ఘోష్ మనుగడ కష్టమై పోవడంతో మళ్లీ రాష్ట్రపతి పాలన (జూన్ 28, 1971 నుంచి మార్చ్ 19, 1972 వరకు) విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పకడ్బందీ వ్యూహంతో మరో మారు ఎన్నికల్లో దిగి, సీపీఎం ప్రాబల్యాన్ని ఎలాగైనా తగ్గించాలన్న ఆలోచన చేసింది ఇందిరా గాంధి ప్రభుత్వం. ఆమె కనుసన్నల్లో సిద్ధార్థ శంకర రే ఆ ప్రణాళికను అమలు పరిచాడు. అధిష్టానం ఆశీస్సులతో ఐదేళ్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.

1972 ఎన్నికలు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చే రీతిలో జరిగాయి. బూతుల ఆక్రమణ, దొంగ ఓట్ల స్వైర విహారం, ఓట్ల లెక్కింపులో అవకతవకలు భారీ ఎత్తున జరిగింది. ఎట్టి పరిస్థితిలలోను సీపీఎం పార్టీ అధికారంలోకి రాకుండా కట్టుదిట్టమైన అ నైతిక చర్యలన్నీ అవలంబించింది అలనాటి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ. సీపీఎం పార్టీ వామపక్ష కూటమికి సారధ్యం వహించి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఎన్నికలలో జరిగిన అక్రమాల కారణంగా, రిగ్గింగుకు వ్యతిరేకంగా దాదాపు ఎన్నికలను బహిష్కరించినప్పటికీ, ఆ పార్టీకి స్థానాలు తక్కువే వచ్చినా, ఓటింగ్ శాతం మాత్రం 28% వరకు వుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగు శాతానికి అనుగుణంగా సీట్లు వచ్చి వుంటే, ఆ సంఖ్య 80 (సీపీఎం స్థానాలు) వరకుండేది. బలమైన ప్రతిపక్షంగా వుండి వుండేది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి 216 స్థానాలు, సీపీఎం కు కేవలం 14 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంత జరిగింతర్వాత-ప్రజాస్వామ్యం అవహేళనకు గురైన తర్వాత, ఆ నేపధ్యంలో ఏర్పడిన శాసనసభలోకి ప్రవేశించరాదని తీర్మానించుకుంది సీపీఎం. శాసన సభ్యులుగా గెలిచిన ఆ పార్టీకి చెందిన వారెవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. నైతిక విలువలకు అనుగుణంగా ఐదేళ్లు జీతభత్యాల జోలికి పోలేదు.

ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ను సీపీఎం నుంచి విముక్తి చేయాలన్న దృఢ సంకల్పంతో 1997 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించింది కుమారి మమత బెనర్జీ. అచిర కాలంలోనే, సీపీఎం కు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమత బెనర్జీ, సీపీఎం ను గద్దె దింపడానికి అవకాశం వున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. ఎన్డీయే తో జతకట్టింది. పడకపోతే బయటకొచ్చింది. 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్ట్-లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించ లేకపోయింది. తన పార్టీ పక్షాన గెలిచిన ఏకైక లోక్ సభ సభ్యురాలిగా 2004 లో కేంద్ర మంత్రివర్గంలో చేరింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పారిశ్రామిక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత, ఆమె పార్టీ కార్యకర్తలు అక్టోబర్ 2005 లో ఆందోళన చేశారు. 2006 శాసన సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గతంలో గెలిచిన స్థానాలలో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. అయినా పోరాటం కొనసాగించింది. అదే సంవత్సరం ఆగస్టు నెలలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మమత నవంబర్ నెలలో టాటా మోటార్స్ కార్ల కర్మాగారం స్థాపన విషయంలో ఆందోళన చేసేందుకు సింగూరు వెళుతుంటే, మధ్యలో బలవంతంగా ఆపు చేసింది ప్రభుత్వం. శాసనసభ ప్రాంగణంలోకి వెళ్లి నిరసన తెలియచేసిందామె. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగి ఫర్నీచర్ ను, మైకులను ధ్వంసం చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా పోటీ చేసి, ఇరువురు కలిసి 26 స్థానాలను (మెజారిటీ) గెల్చుకుని రాబోయే రోజుల్లో సీపీఎం కు గడ్దు రోజులు రాబోతున్నాయన్న సంకేతాన్ని పంపారు. తృణమూల్ ఆందోళన ఫలితంగానే నంది గ్రామ్ లో రసాయన కేంద్రం స్థాపన ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విరమించుకోవాల్సి వచ్చింది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు మమత చేసిన కృషికి సింగూరు, నంది గ్రాం సంఘటనలు ఉదాహరణలుగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. వీటన్నిటి నేపధ్యంలో, జరిగిన మునిసిపల్ ఎన్నికలు, కలకత్తా కార్పొరేషన్ ఎన్నికలు, తృణమూల్ కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చాయి. ఇక శాసన సభ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధమౌతుంది మమత.

సీపీఎం పాలన పగ్గాలు జ్యోతిబసు చేతిలో వున్నంత కాలం మమత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ ఇరవయ్యే డు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో ప్రజలు స్వర్ణ యుగం చూసి వుండవచ్చు. దరిమిలా బుద్దదేబ్ పాలనలో తృణమూల్ ఎదుగుదలకు ఆస్కారం లభించింది. దీనికితోడు, దీర్ఘకాలం అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకత రావడం కూడా సహజం. నంది గ్రాం, సింగూరు ఘటనలు, మరికొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు సీపీఎం కు మునిసిపల్ ఎన్నికలలో పరాజయాన్ని చవి చూపాయి. సీపీఎం ఓటమి, తృణమూల్ గెలుపు తాత్కాలికమా, లేక, తాత్కాలికంగా శాశ్వతమా అన్నది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం. సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశాలకు బుద్దదేబ్ హాజరు కాకపోవడం వెనుక కారణాలు అన్వేషించాలి. పశ్చిమ బెంగాల్ లో పార్టీ పనితీరు పట్ల, పార్టీ ఓటమి పట్ల శాస్త్రీయంగా సమీక్ష జరిగిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయి. సీపీఎం భాగస్వామ్య పక్షమైన సీపీఐ మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ పనితీరును విమర్శించింది. సీపీఎం అవలంబిస్తున్న "అహంకార పూరిత-ఉద్యోగ స్వామ్య-పెత్తందారీతన విధానాన్ని" దుయ్యబట్టింది మరో లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ దృష్టిలో, రాబోయే శాసన సభ ఎన్నికలలో సీపీఎం విజయం క్లిష్టమైందనే భావం వ్యక్తమైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఆనందానికి హద్దుల్లేవనిపిస్తుంది. భవిష్యత్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు వుంటుందని, సీపీఎం సారధ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ను ఓడించి తీరుతామని ధీమాతో వున్నారాయన.

కేవలం 20% మంది ఓటర్ల తీర్పుతో ఘన విజయం సాధించిన మమత, మిగతా ఓటర్ల తీర్పులో కూడా విజయం సాధించుతారో, లేదో, తేలే రోజు తొందరలోనే రాబోతుంది. అంతవరకూ వేచి చూద్దాం.

Saturday, June 5, 2010

VIII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-8) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-8
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ఆగస్ట్ 14, 2007 న, (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్వహణ వ్యయం విషయం చర్చకొచ్చింది. సమావేశానికి చైర్మన్ రాజు, సీ.ఇ.ఓ వెంకట్ లతో నేను కూడా హాజరయ్యాను. రాజశేఖర రెడ్డి వారసులు రోశయ్య ఆర్థిక మంత్రి హోదాలో హాజరయ్యారు. వాస్తవానికి ఆ సమావేశానికి మేమెవరం హాజరవ్వాలన్న నిర్ణయం మొదలు లేదు. కేవలం, అవసరమైన వివరణలు ఇవ్వడానికి బయట వేచి వుండమనే అడిగారు మమ్మల్ని. అయితే, సమావేశం జరిగే సమయంలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు-అవసరమైతే వివరణ ఇచ్చేందుకు తాను కూడా సమావేశం మందిరం వెలుపల వేచి వుండడానికి అనుమతి కోరారు రాజు గారు. ముఖ్యమంత్రి ఆనాటి సమీక్షా సమావేశం జరగడానికి సరిగ్గా మరో ఐదారు గంటల వ్యవధి మాత్రమే వుందనగా, వెంకట్ గారి దగ్గర్నుంచి నాకు ఫోనొచ్చింది. చైర్మన్ రాజు కూడా మన లాగే సమావేశం జరిగే సమయంలో బయట వేచి వుండాలని అనుకుంటున్నారని, అందుకు అవసరమైన అనుమతులు పొందాలని నాకు చెప్పారు వెంకట్. అందుకు కారణం వుంది. పదిహేను రోజుల క్రితం, హెచ్.ఎం.ఆర్.ఐ కి సంబంధించి, ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కూడా వుండడం, ఆ సందర్భంలో హెచ్.ఎం.ఆర్.ఐ తో పాటు ఇ.ఎం.ఆర్.ఐ కి కూడా సరాసరి నిర్వహణ వ్యయంలో నూటికి 95% ప్రభుత్వం సమకూరుస్తుందని రాజశేఖర రెడ్డి అనడం జరిగింది. దానికి సాక్ష్యం రాజు గారు. నేనా విషయాన్ని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అగర్వాల్ దృష్టికి తెచ్చాను. ఆయనను బయట వేచి వుంచడం బదులు, సమావేశానికి రమ్మనడం, ఆయనతో పాటు మేమూ వెళ్లడం జరిగింది. అదీ అప్పట్లో అత్యవసర సహాయ సేవలన్నా-ఆ సంస్థకు చెందిన వారన్నా వుండే గౌరవం.

సమీక్షా సమావేశంలో, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. మరింత స్పష్టమైన "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" లో ఈ సేవలను విస్తరించాల్సిన సమయం ఆసన్నమయిందని, దానికి అనుగుణంగా లోగడ ఎంఓయు లో పేర్కొన్న కొన్ని అంశాలను, మార్చాల్సి వుంటుందని ఆయన అన్నారు. స్థూలంగా, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందని, యాజమాన్య పరమైన వ్యయాన్ని సంస్థ భరించాల్సి వుంటుందని అంటూనే, 2007-2008 ఆర్థిక సంవత్సరంలో మాత్రం, ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఆ వ్యయం కింద రు. 68, 700 ప్రభుత్వం భరిస్తుందని, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి 95% నిర్ణయం అమల్లోకి వస్తుందని, అప్పటికి 502 అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తాయని అన్నారు ముఖ్యమంత్రి. అత్యవసర సహాయ సేవలను "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం గొడుకు కిందకు తేవాలన్న నిర్ణయం కూడా ఆ రోజునే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. ఈ అంశాలను పొందు పరుస్తూ ఎంఓయు తయారు చేసేందుకు ఆదేశించారాయన.

మర్నాడు ఆగస్ట్ 15, 2007 హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన బ్రహ్మాండమైన సదస్సులో రాజీవ్ ఆరోగ్య శ్రీ "లోగో" ను మాజీ రాష్ట్రపతి-ఇ.ఎం.ఆర్.ఐ గౌరవ అధ్యక్షులు ఏ.పి.జె అబ్దుల్ కలాం విడుదల చేశారు. అలాగే అత్యవసర సహాయ సేవలను జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చైర్మన్ రాజు తో పాటు పలువురు ఉన్నతాధికారులు-అనధికారులు సమావేశానికి హాజరయ్యారు. ప్రతిపక్షానికి చెందిన సీ.పి.ఐ నాయకులైన కె. నారాయణ గారి లాంటి వారు కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో అతిధులను వేదిక పైకి ఆహ్వానించడంతో సహా, సభా కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను వెంకట్ గారు నాకు అప్పగించారు ఆఖరు క్షణంలో. ఏ తాజ్ కృష్ణాలో ఆ సమావేశం జరిగిందో, అదే హోటల్ యజమాని, అది జరిగిన రెండు సంవత్సరాల లోపునే, ఇ.ఎం.ఆర్.ఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆయనతో సహా బహుశా ఎవరూ ఊహించి వుండరు. అంత గొప్ప సమావేశం మళ్లీ జరుగుతుందా అన్నది సందేహమే !

ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న "విశ్వాసం-నమ్మకం" మరికొంత కాలం కొనసాగుతూనే వుందనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. డిసెంబర్ 18, 2007 న (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మరో సమీక్షా సమావేశంలో ఇ.ఎం.ఆర్.ఐ ఆధ్వర్యంలో అమలవుతున్న అత్యవసర సహాయ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం సూత్రప్రాయంగా మరో నిర్ణయం తీసుకుంది. అప్పటికి, అంబులెన్సులన్నీ కలిసి ప్రతి రోజు తిరుగుతున్న 2870 ట్రిప్పులను, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా 8000 ట్రిప్పుల సామర్థ్యానికి పెంచాలని, దానికి సంబంధించిన దశలవారీ ప్రతిపాదనలను ఇ.ఎం.ఆర్.ఐ తయారు చేసి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కు అందచేయాలని, అందుకు కావాల్సిన నిధులను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద, రాష్ట్ర బడ్జెట్ కింద సమకూర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ నిర్ణయానికి కట్టుబడ్డ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్, దరిమిలా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చారు. అయితే వీటిలో కనీసం 100 వరకు తిరగక పోవడం విచారకరం.

95% నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం ఎంత భరించాలన్న నిర్ణయం తీసుకోవడంలో నాటి ఆరోగ్య-వైద్య శాఖల ముఖ్య కార్యదర్శి పి. కె. అగర్వాల్ తీసుకున్న చొరవ ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న"విశ్వాసానికి-నమ్మకానికి" మరో నిదర్శనం. ఊహించని సమయాన్ని దీని కొరకు కేటాయించిన అగర్వాల్ గారు, స్వయంగా, మేమిచ్చిన ప్రతిపాదనలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, నిశితంగా మాతో గంటల తరబడి చర్చించి, ఆ మొత్తాన్ని ఒక్కో అంబులెన్సుకు రు. 1, 12, 499 గా నిర్ణయించి, ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు-తర్వాత 802 కు పెరిగినప్పుడు, తగ్గుతుందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. 2008-2009 ఆర్థిక సంవత్సరం అమలవ్వాల్సిన ఈ నిర్ణయం పూర్తిగా ఆర్థిక సంవత్సరం ముగియకుండానే, రాజు గారి నిష్క్రమణం జరగడంతో, ఊహించని కొన్ని విషయాలు బయటకు పొక్కి, పలు అనుమానాలకు దారి తీసింది. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో !

రెండో విడత అధికారం చేపట్టి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిపించిన మర్నాడు-మే నెల 26, 2009 న, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనకు బయల్దేరడానికి ముందర, ఆ ఉదయం మమ్మల్ని అత్యవసర సహాయ సేవల సంగతి తెలుసుకునేందుకు రమ్మన్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. అంతకు నాలుగైదు రోజుల క్రితం ముఖ్యమంత్రికి వెంకట్ గారు ఒక లేఖ రాశారు. మే నెల 5, 2008 న ఇ.ఎం.ఆర్.ఐ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తూనే, సంస్థ అప్పట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో, ప్రభుత్వ పరంగా సంస్థకు అదనపు నిధుల ఆవశ్యకతను వివరిస్తూ రాసిన లేఖ అది. ఆ రోజు వరకు అత్యవసర సహాయ సేవల ద్వారా 26 లక్షల మంది లబ్ది పొందారని, సుమారు 47 వేల ప్రాణాలు కాపాడ కలిగామని, ప్రభుత్వ సహాయంతో 752 అంబులెన్సులను నిర్వహిస్తూ ప్రతి రోజూ సుమారు సగటున 5420 ఎమర్జెన్సీలకు స్పందిస్తున్నామని-ఆసుపత్రులకు చేరుస్తున్నామని లేఖలో వివరించారు. రాజు గారు సంస్థ చైర్మన్ గా రాజీనామా చేసిన అనంతరం, జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశంలో, సరాసరి నిర్వహణ వ్యయంలో, అవసరమైతే 95% కు బదులు నూటికి 100% ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని లేఖలో గుర్తు చేశారు వెంకట్. అయితే అసలు-సిసలైన ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో విశ్వాసం వున్న ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం (రాజు గారు చైర్మన్ గా తొలిగానా) తమ వంతు వ్యయం చేయాల్సిన 5% నిర్వహణా పరమైన నిధులను-ఇతర యాజమాన్య పరమైన ఖర్చులను సమకూర్చే దాతల అన్వేషణ కొరకు నాలుగు నెలల వ్యవధి కోరిన విషయం కూడా లేఖలో గుర్తు చేశారు వెంకట్.

దురదృష్ట వశాత్తు తామెన్ని ప్రయత్నాలు చేసినా అంతవరకు అవి ఫలించలేదన్నారు. ఆ కారణాన తమ వంతు వాటాగా 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాల్సిన 5% (సుమారు రు. 5 కోట్ల నిర్వహణ ఖర్చులు) నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని విఙప్తి చేశారు. నిర్వహణ వ్యయం కింద అప్పటి వరకు 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఐన రు. 90 కోట్ల వ్యయంలో రు. 85 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని, మిగతా రు. 5 కోట్ల విడుదలకు ఆదేశాలివ్వాలని కోరారాయన. అదనంగా యాజమాన్య జీత-భత్యాల కొరకు మరో రు. 4 కోట్ల 8 లక్షలు ఖర్చయ్యాయని వివరించారు. ఆ వ్యయాన్ని తమ వంతు వాటాగా భావించాలని కూడా కోరారు. అప్పట్లో సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ఆ ఐదు కోట్లను-అదనంగా మూల వ్యయం కొరకు మరో మూడు కోట్లను, మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసి-విడుదల చేసేందుకు ఉత్తర్వులివ్వాల్సిందిగా వెంకట్ ముఖ్యమంత్రిని తన లేఖలో అభ్యర్థించారు. అందులోనే పిరమల్ ఫౌండేషన్ ప్రయివేట్ భాగస్వామిగా, ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి కనబరిచిన విషయం-త్వరలోనే అది సఫలం కానున్న విషయం కూడా వివరించారు వెంకట్. కాకపోతే ఆ లేఖ పంపిన మర్నాడే, పిరమల్ ఫౌండేషన్ నిరాసక్తిని వ్యక్తపరుస్తూ వెంకట్ కు సందేశం ఇవ్వడం, ఆయన నిరాశకు గురి కావడం, ముఖ్యమంత్రితో సమావేశం జరుగుతే మంచిదని భావించడం, ఆయన కోరుకున్న విధంగానే-ఆయన అడగకుండానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మే నెల 26, 2009 ఉదయం సమావేశం గురించి పిలుపు రావడం భగవదేఛ్చ అనుకోవాలి. లేదా వెంకట్ సంకల్ప బలం అనుకోవాలి !

ఆ ఉదయం సమావేశం జరిగిన తీరు "మరవలేని మరో అద్భుత సన్నివేశం". సమావేశం ఆరంభమవుతూనే వెంకట్ గారిని ఉద్దేశించి, తమ పార్టీ విజయానికి 108-అత్యవసర సహాయ సేవల అంబులెన్సుల పథకం ఎంతగానో తోడ్పడిందని అన్నారు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఇంతకు ముందే రాసినట్లు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు ప్రయివేట్ భాగస్వామ్య పరంగా నిధులను సమకూర్చే విషయంలో స్వయంగా జోక్యం చేసుకుని, అధికార బలాన్ని కాకుండా-వ్యక్తిగత ఆకర్షణ, పలుకుబడిని ఉపయోగించే పద్ధతిలో, జీ.వి.కె అధిపతి డాక్టర్. జీ. వి. కృష్ణారెడ్డి తో ఫోన్లో మాట్లాడి, బరువు-బాధ్యతలను ఆయన స్వీకరించేందుకు ఒప్పించారు రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ నిర్ణయం పూర్వ-ఉత్తర రంగాల్లో అత్యవసర సహాయ సేవల విషయంలో విలువైన సూచనలు చేశారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నయో-ఎన్ని నోచుకోలేదో అన్న విషయం తేల్చాల్సింది ప్రభుత్వం (ఏప్రియల్ 2010 లో) నియమించిన కమిటీనే. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఆ ప్రస్తావన లేకపోవడానికి కారణాలేంటో ?

రాజీవ్ ఆరోగ్య శ్రీ గొడుగు కింద పనిచేస్తున్న 108, 104, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించి నిరంతర ప్రభుత్వ మానిటరింగ్ జరగాలని, ఇవన్నీ ఒకే శాఖాధిపతి కింద వుండే వీలు గురించి పరిశీలన జరగాలని ఆ రోజున ముఖ్యమంత్రి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ, హెచ్.ఎం.ఆర్.ఐ, ఆరోగ్య శ్రీ లకు కలిపి ఒక ప్రత్యేకమైన "ట్రస్ట్" ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. అలా చేస్తే సేవలందించడంలో నైపుణ్యం, సామర్థ్యం, వృత్తి పరమైన దక్షత పెరిగే అవకాశం వుందన్నారు. వీటి సాధ్య-అసాధ్యాలకు సంబంధించి “మేధ మథనం” జరుగు తే మంచిదని కూడా సూచించారాయన. అయితే సంస్థల ప్రత్యేకత, ఆనవాలు-గుర్తింపు (ఐడెంటిటీ) కు భంగం కలగని విధంగా చర్యలు చేపట్టాలని, నియంత్రణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య-వైద్య శాఖలకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా చేయాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్థిక పరమైన యాజమాన్య వ్యవహారాలను, వ్యయ నియంత్రణలను, నిర్వహణ సమస్యలను, ప్రభుత్వంతో సమన్వయం-సంఘటితం విషయాలను, సంస్థాగత నిర్మాణాన్ని, అధికారాలను, విధులను, బాధ్యతలను, పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని, సంబంధిత ఇతర విషయాలను పర్యవేక్షించేందుకు ఎలాంటి కమిటీ వుంటే బాగుంటుందో పరిశీలించమని అధికారులను-ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ కమిటీ రూపు-రేఖలు ఎలా వుండాలో ఆలోచన చేయమని కోరారు ముఖ్యమంత్రి. ఒక వేళ "రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్" కు ఆ బాధ్యతలు అప్పగిస్తే, దరిమిలా ఆవిర్భవించనున్న "సంఘటిత (Integrated) పథకం" అమలు విషయంలో కుటుంబ సంక్షేమ శాఖ పాత్ర ఎలా వుండాలో నిర్ణయించాలని సూచించారాయన. ప్రభుత్వ పరంగా నిధులను సమకూర్చడంలో ఒక్కో ఏడాది గడిచినా కొద్దీ భారం పెరుగుతుంది కాబట్టి, అత్యవసర పరిస్థితి నుంచి ఆసుపత్రికి వైద్య సహాయం అందించే వరకు ప్రభుత్వ పరంగా-ఇ.ఎం.ఆర్.ఐ పరంగా సేవల ఉపయోగం విషయంలోను, మంచి-మంచి పద్ధతులను పంచుకోవడం విషయంలోను, మాన్యత (వాలిడేషన్) విషయంలోను, నిధుల సేకరణ విషయంలోను, కమ్యూనికేషన్ విషయంలోను, చేసిన తప్పులు సరి దిద్దుకునే విషయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఆయన ఆనాడు చెప్పిన "ఆణి ముత్యాల లాంటి సూచనలు, సలహాలు, ఆదేశాలు" ఆ తర్వాత రూపొందించిన సమావేశ వివరణ పత్రం (మినిట్స్) లో కొన్ని మాత్రమే చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు:

• మే నెల 5, 2008 న ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలి. ఎంఓయు అమలు కాలంలో సంభవించిన పరిణామాలను సవరణలు రూపొందించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి.

• నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలి. కాకపోతే, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెటుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలి. ఇలా పరిగణించేటప్పుడు కింది నిబంధనలను పాటించాలి:

• ఆంధ్ర ప్రదేశ్ ఆపరేషన్సుకు సంబంధించి ఇ.ఎం.ఆర్.ఐ చేస్తున్న ఖర్చును స్పష్టంగా నమోదు చేసి ప్రభుత్వానికి తెలియచేయాలి.

• ఇతర రాష్ట్రాలలో కూడా ఇ.ఎం.ఆర్.ఐ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన యాజమాన్య పరమైన వ్యయాన్ని, తగు నిష్పత్తిలో నమోదు చేయాలి.

• ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలి.

• అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుంది. 2009-2010 సంవత్సరానికి బడ్జెట్ తయారు చేసేటప్పుడు, ప్రభుత్వం తన బాధ్యతగా అంగీకరించిన నిధులను సమకూర్చే పద్ధతిలో, తగు ఏర్పాటు చేస్తుంది.

• పారదర్శకతను మరింత స్పష్టంగా పాటించడానికి ఇ.ఎం.ఆర్.ఐ చొరవ తీసుకోవాల్సిన అంశాలు:

• 108-అత్యవసర సహాయ సేవల లబ్దిదారులకు ముఖ్యమంత్రి సంతకంతో ఉత్తరాలు పంపాలి. ఆరోగ్య శ్రీ పథకం లబ్దిదారుల నుండి ఎలా "ఫీడ్ బాక్" తీసుకుంటున్నారో అలాంటి పద్ధతి ఇ.ఎం.ఆర్.ఐ కూడా అమలు పరచాలి.
• పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజలందరు చూడడానికి అనువుగా "వెబ్ సైట్" ను రూపొందించి, అందులో ప్రతి ట్రిప్పుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలి.
• జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 108-అత్యవసర సహాయ సేవలకు సమకూరుస్తున్న నిధులను తగ్గించే ప్రయత్నం చేయకుండా-లోగడ మాదిరిగానే బడ్జెట్ కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి సంతకంతో ప్రధాన మంత్రికి లేఖ వెళ్లాలి.

మినిట్స్ లో పొందుపరిచిన వాటిలోని అంశాలు, పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన సూచనలు, అమలుకు ఎంతవరకు నోచుకున్నాయో అన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ అంశాలపై ఎంతవరకు దృష్టి పెట్టిందో? ఈ అంశాలన్నీ అమలు జరిగుంటే ఒడిదుడుకులకు ఆస్కారం వుండకపోయేదేమో !