గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల
(మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?
వనం జ్వాలా నరసింహా రావు
ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు తాను నియమించి-శాఖలను కేటాయించిన నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, పరిణితి చెందిన 86 గ్రామాల సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వం చేసే ప్రతి పని గవర్నర్ పేరు మీదే జరగడం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఆ ప్రకరణను కొంచెం విస్తరించి, బహుశా రాష్ట్ర గవర్నర్, ఇక నుంచి కేవలం నామ మాత్రంగా తన పేరుమీద కాకుండా, తానే-తన పర్యవేక్షణలోనే, ప్రజా సంక్షేమం గురించి స్వయంగా పర్యటనలు చేయబోతున్నారన్న అర్థం ఆయన మాటల్లో గోచరిస్తున్న ది. గవర్నర్ పేరుపై సాగే దే రాష్ట్రంలోని పాలనని, నెలకు మూడు రోజులు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తానని, సర్పంచులు పంచాయితీలను దత్తత తీసుకోవాలనీ, నిర్మల్ పురస్కార గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దాలనీ అనడమే కాకుండా, ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒక ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ కూడా చేశారు నరసింహన్. ఆయన ఉద్దేశం సమాంతర ప్రభుత్వం నడపడమో, లేక, "తన ప్రభుత్వం" నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు "అనుబంధంగా-అభినందనగా" (సప్లిమెంటరి-కాంప్లిమెంటరి) మరో మార్గంలో ప్రజల క్షేమం పట్టించుకోవడమో అయ్యుండాలి. రెండు పద్ధతులూ, రాజ్యాంగ పరిమితులకు-సాంప్రదాయాలకు లోబడి వున్నంతవరకు, అభిలషణీయమే.
కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్ గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. ఆ కాలంలో నాలుగు సంవత్సరాల పాటు చేతనకు నేను అడ్మినిస్ట్ర్రేటివ్ అధికారిగా-ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసాను. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.
గత సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు ముఖ్యమంత్రి రోశయ్యా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి రోశయ్యను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? రోశయ్యకు సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం. రాజ్యాంగం రీత్యా ముఖ్యమంత్రిని-ఆయన మంత్రివర్గ సహచరులను నియమించిన గవర్నర్ కు, పాలనా సంబంధమైన కొన్ని లోపాలు కలవర పడే విధంగా వుండి ఉండాలి ! అలాంటప్పుడు, పరిపాలనా వ్యవహారాలలో ఎదురవుతున్న అనేకానేక ఇబ్బందుల జోలికి పోకుండా, కేవలం, ముఖ్యమంత్రి అధికారాలేంటి ? గవర్నర్ అధికారాలకు పరిమితులేంటి? గవర్నర్ పాత్ర ఏంటి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ విమర్శించ తగునా? అన్న విషయాలనే పదే-పదే ప్రస్తావించి, కొందరు రాజకీయ నాయకులు వారి పరిమిత దృష్టిని ప్రదర్శిస్తున్నారు ఇటీవల. కొంతకాలం క్రితం గవర్నర్ కేంద్రానికి రహస్యంగా నివేదిక పంపించారని (ధృవీకరించుకోకుండానే) ఆయన మీద నిప్పులు చెరిగారు. అలా పంపించడం ఆనవాయితీగా జరిగేదేనని, అందులో వింతేమీ లేదని తెలిసిన మేధావులు కూడా గవర్నర్ నరసింహన్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ నాయకులై తే మరీ రెచ్చిపోయారు. ప్రతి పక్షాల వారే మో, ఆయన రహస్య నివేదికను బహిర్గతం చేయాల్సిందేనని డిమాండు చేశారు. చివరకు కొన్నాళ్లకు సమస్య సమసిపోయింది.
పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! కాకపోతే, 1995 లో అలాంటిదే జరిగినప్పుడు, ఆ పనిచేసిన నాటి గవర్నర్ కృష్ణకాంత్ కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు సహకరించారు. గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.
కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు నెల కొన్న ప్రత్యేక పరిస్థితులు, తనను ప్రజల వద్దకు తరచుగా పోయేందుకు ప్రేరేపిస్తున్నాయని గవర్నర్ భావిస్తుండవచ్చు. ఆలానే, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని కూడా గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో రాష్ట్రంలో పర్యటిస్తే తప్పేంటి?
గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. (గవర్నర్) ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు సంబంధించిన వివరాలు, గవర్నర్ కు తెలిసి వుండాల్సిన అవసరం వుంది. దాని మూలాన, ఆయనకు రాష్ట్రంతో పరిచయం పెంచుకోవడం తేలికవుతుంది. రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు తన చేతనైన సహాయం చేసే వీలుకూడా కలుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో, రాజకీయ అస్థిరత్వం ఏర్పడి (ఇప్పుడు ఏర్పడనున్నదని ఉద్దేశం కాదు !), రాష్ట్రపతి పాలన విధించి, గవర్నర్ పాలనా యంత్రాంగాన్ని నడపాల్సి వస్తే ఆ పరిచయం తోడ్పడుతుంది. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.
రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. అమలవుతుందో, లేదో, వేచి చూడాలి. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.
రాజ్యాంగం సంక్రమింప చేసిన అధికారాలను-బాధ్యతలను, అనేక సందర్భాల్లో, కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అనిపిస్తోంది. "ఆర్థిక అత్యయిక పరిస్థితిని" కొన్ని రాష్ట్రాలలో అమలు చేయాల్సిన సందర్భంలో కూడా మౌనం వహించింది ప్రభుత్వం. అలా చేయడం వల్ల, కొన్ని రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్ ?) యధేఛ్చగా, ఆర్థిక దోషాలకు పాలపడుతున్నాయి. వాస్తవానికి కొన్ని రాష్ట్రాలలో ఆర్థిక ప్రగతికి అవరోధం కూడా ఏర్పడుతుందనాలి. గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నెల రోజుల క్రితం "రహస్య నివేదిక" పంపడం వాస్తవమైతే, ఆ చర్యను విమర్శించకుండా, ఆయనను రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడానికి వీలు కలిగేలా చేయాలి. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు. కాకపోతే, "నేను మంచి గవర్నర్ ను కాను.. చెడ్డ గవర్నర్ ను" అని అనకుండా వుండాల్సింది గవర్నర్ నరసింహన్. మంచి-చెడులు ప్రజలే నిర్ణయిస్తారు.(End)
No comments:
Post a Comment