Friday, July 13, 2018

తుపాను నష్టానికి తల్లడిల్లిన నేత ..... మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-4:వనం జ్వాలా నరసింహారావు


తుపాను నష్టానికి తల్లడిల్లిన నేత
మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-4
మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (14-07-2018)
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)
వివరాల్లోకి పొతే, సీఎం ఫోన్ చేసిన మర్నాడు స్వర్గీయ కృష్ణకాంత్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసే రోజు. ఆ ఉదయమే అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ మల్లు అనంత రాములు రాజ్ భవన్లో వుంటున్న మా ఇంటికి అల్పాహార విందుకు వచ్చాడు. మా జిల్లా వాసే అయిన మల్లు అనంత రాములు ఎంతోకాలంగా నాకు పరిచయం. మరి కొద్ది సేపట్లో రాజీనామా సమర్పించమని నేను అడగాల్సిన స్వర్గీయ కోనేరు రంగారావుకు అనంతరాములు సమీప బంధువు. సరే...ఎలాగైతేం....గవర్నర్ ప్రమాణ స్వీకారం అనంతరం నేను చేయాల్సిన పని చేశాను. ఆ తరువాత కాసేపటికి మంత్రి రాజీనామా సమర్పించారు. దురదృష్ట వశాత్తు అది జరిగిన కొన్ని గంటల్లోనే, అనంత రాములు గుండె పోటుతో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న నేను తార్నాకా వెళ్లి ఆ సంగతి సీఎంకు చెప్పగానే వెంటనే సంతాప సందేశం ఇవ్వమన్నారు. అదే సమయంలో రాజీవ్ గాంధీ సందేశం వచ్చింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అనంత రాములు కీలకం అని ఆయన సందేశంలో వుండడం చెన్నారెడ్డి గారికి అంతగా రుచించలేదని నాకు అనిపించింది. ఆ తరువాత ఆయన సంతాప సందేశం విడుదల చేశాం. మల్లును అందులో ఆకాశానికి ఎత్తేసారు.

మే నెల 1990 లో ఆంధ్ర ప్రదేశ్ లో భీకరమైన తుఫాను వచ్చిందిఅదే రోజుల్లో వైద్య చికిత్స కొరకు అమెరికా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నారు చెన్నారెడ్డిఅనుకున్న రోజున కుటుంబ సభ్యులు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లడంబోర్డింగ్ పాసులు తీసుకునే వరకు రావడం జరిగిందిమంత్రి వర్గ సభ్యులకు చెప్పి పోవడానికి సచివాలయానికి వచ్చారు ముఖ్య మంత్రి చెన్నారెడ్డి. అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున రావుముఖ్య మంత్రి కార్యదర్శి పరమహంసమరికొందరుచెన్నారెడ్డి అమెరికా పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారుఒక్క నిమిషం కూడా ఆలోచించకుండాఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండాఆఖరు క్షణంలో ప్రయాణం మానుకున్నారుఅంతా సర్దు బాటు అయింతర్వాతరెండు-మూడు వారాల అనంతరం వెళ్లారువెళ్లిన తర్వాత కూడాఆసుపత్రిలో చేరేంతవరకుప్రపంచ బాంక్ అధికారులతో చర్చలు జరుపుతూనే వున్నారుబహుశా చెన్నారెడ్డి ఆ రోజుల్లో ప్రపంచ బాంకు ప్రతినిధులతో పెంచుకున్న అనుబంధమేనేటి ప్రభుత్వాల వరకూకొన సాగుతుందనడంలో అతిశయోక్తి లేదే మో!


వివరాల్లోకి పోతే.... మె నెల 13, 1990 న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సంభవించిన భారీ తుఫాన్, దాని తీవ్రతను అంచనావేసి వేలాది ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ముందస్తు చర్యలు, తుఫాన్ వచ్చిన సమయంలో, ఆ తర్వాత చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, వాటిని పర్యవేక్షించిన అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున్ రావు, ఆయనకు పరిపూర్ణ అధికారాలను ఇచ్చి అడుగడుగునా మార్గదర్శకత్వం వహించిన అలనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పాలనా దక్షత పదే-పదే గుర్తుచేసుకోవాల్సిందే. పట్టణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సి. అర్జున్ రావును, కారణాంతరాల వల్ల ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆగ్రహానికి గురైనందున, ప్రాధాన్యత లేదని పలువురు భావించే "సహాయ పునరావాస కమీషనర్" గా అంతకు రెండు నెలల క్రితమే నియమించింది ప్రభుత్వం. ఆయన ఆ పదవికే వన్నె తెచ్చే రీతిలో తీసుకున్న ముందస్తు నివారక చర్యల వివరాలు, ఆ శాఖ పదిలం చేసుకుని వుంటే, బహుశా చక్కటి "మార్గదర్శి" గా ఎల్లప్పుడూ పనికొస్తుండవచ్చు. తుఫాను ముగిసిన కొంత కాలానికి అర్జున్ రావు గారు, ఒక చిన్న కార్పొరేషన్ ఎండి గా వున్నప్పుడు, సహాయ పునరావాస కమీషనర్ గా ఆయన తీసుకున్న చర్యలపై "రీడర్స్ డైజెస్ట్" ఒక గొప్ప ఆర్టికల్ కూడా ప్రచురించింది.

దక్షిణ భారత దేశాన్ని 1977 దివి సీమ ఉప్పెన తర్వాత భీభత్సం చేసిన అతి భయంకరమైన తుఫానుగా 1990 మే నెల మొదటి వారంలో సంభవించిన తుఫానును పేర్కొన వచ్చు. మే 4, 1990 న "ఉష్ణ మండల గందరగోళం" గా ప్రారంభమై, తుఫానుగా మారి, వాయువ్య దిశగా కదిలింది. మర్నాటి కల్లా, తీవ్రమైన వాయుగుండంగా ఏర్పడి మే 8 కల్లా భయంకరమైన తుఫానుగా మారి, ఆంధ్ర ప్రదేశ్‌పై కనీ-వినీ ఎరుగని దుష్ప్రభావం చూపింది. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని పలు ప్రాంతాలపై కూడా దాని ప్రభావం పడింది. కనీసం పది జిల్లాలలోని కోటి మంది ప్రజలు తుఫానుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులకు లోనయ్యారు. విద్యుత్ సౌకర్యాలతో సహా అన్ని రకాల ప్రజావసరాల ఏర్పాట్లన్నీ అస్తవ్యస్థమైపోయి, జనజీవనం స్తంభించి పోయింది. లక్షలాది గుడిసె వాసులు నివాసాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ప్రభుత్వానికదో పెను సవాలుగా మారింది. "గుడ్డిలో మెల్ల" గా, తప్పిపోతుందనుకున్న తుఫాను రాష్ట్రాన్ని తాకనున్నదన్నసంకేతాలు ముందుగా అందడంతో, సరైన నివారక చర్యలు చేపట్టడంతో లక్షలాది ప్రాణాలు కాపాడబడ్డాయి.

తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి, నాకు గుర్తున్నంతవరకు చేసిన ప్రయత్నాలు కనీసం రెండు రోజులు ఫలించలేదు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించ నందువల్ల, ఆయనతో సహా మేమందరం ఎక్కిన వైమానికదళ హెలికాప్టర్ మొదటి రెండు రోజులు "మొరాయించింది". ప్రధాన మంత్రి వీపీ సింగ్ వచ్చి ఎక్కిన తర్వాతే అది కదిలింది. అయినప్పటికీ, విజయవాడ విమానాశ్రయం దాటి ముందుకు కదలలేదు. "ప్రధాన మంత్రికన్నా ముందర ముఖ్యమంత్రి ఎలా వెళ్లుతారు? ఆయనకెందుకు మొదలు ఆ కీర్తి దక్కాలి" అని హెలికాప్టర్ మొరాయించే ఏర్పాటు జరిగిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమనే ది వారికే వదిలేద్దాం. మరో మారు కూడా ప్రధాని వచ్చి తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ నాయకుడి హోదాలో స్వర్గీయ రాజీవ్ గాంధి తుఫాను ప్రాంతాలలో రెండు రోజులు తిరిగారు అప్పట్లో. సహాయ-పునరావాస కార్యక్రమాల సమీక్షకు చెన్నారెడ్డి గారు అమెరికా నుండి తిరిగి రావడానికి ముందు మరో మారు పర్యటించారు.
(సశేషం) 

Thursday, July 12, 2018

ఆ ఉపన్యాసాలు...అమూల్యం ..... మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-3:వనం జ్వాలా నరసింహారావు


ఆ ఉపన్యాసాలు...అమూల్యం
మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-3
మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (13-07-2018)
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)
చెన్నారెడ్డికి ఒకరు రాసిచ్చిన ఉపన్యాసం చదివే అలవాటు ఏనాడూ లేదుఏ సభలోనైనాకనీసం గంటకు తక్కువ లేకుండాఆశువుగామూడు భాషల్లో-ఇంగ్లీష్ఉర్దూతెలుగు-ల్లోఅనర్గళంగా మాట్లాడే వారుప్రతి ఉపన్యాసంలోని అంశాలు పదిలంగా పది కాలాల పాటు దాచుకోతగినంత విలువైనవిఆయన ప్రసంగాలను ఆడియో రికార్డు చేయించి (అప్పట్లో ఇంకా వీడియోలు ఇంకా ప్రాచుర్యం పొందలేదుతర్జుమా చేయించి టైప్ చేయించడం జరిగిందివిలువైన ఆయన ఉపన్యాసాలన్నీ సమాచార పౌర సంబంధాల శాఖలో బహుశా వుండొచ్చుకొన్నింటి కాపీలు నేను కూడా బధ్ర పరచుకున్నాను ఇప్పటికీఆయన అనుభవాల-జ్ఞాపకాల సారాంశం రంగరించి తన ఉపన్యాసాల్లోవర్తమాన పరిస్థితులకు అన్వయించి చెప్పేవారు చెన్నారెడ్డితాను డాక్టర్ అయినా మంత్రిగా ఆరోగ్య శాఖ కోరుకోక పోవడానికి కారణంతనకు చదువు చెప్పిన అధ్యాపకులు ఇంకా పనిచేస్తుండగానేవారికి మంత్రిగా వుండడం సమంజసం కాదనే వారుబాబూ రాజేంద్ర ప్రసాద్ పేరు మీదవ్యవసాయ విశ్వ విద్యాలయం వున్న హిమాయత్ సాగర్ ప్రాంతాన్ని "రాజేంద్ర నగర్గా తనే మార్చిన విషయం ఓ సందర్భంలో చెప్పారు.  ప్రముఖ తెలంగాణా వాదిమాజీ ఎమ్మెల్యేసీనియర్ అడ్వొకేట్86 సంవత్సరాల బొగ్గారపు సీతారామయ్య గారు "యాన్ ఎజెండా ఫర్ ద డెవలప్ మెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్" పేరుతో ఆ ఉపన్యాసాలను పుస్తకంగా ప్రచురించారు.

లౌక్యంలో కూడా చెన్నారెడ్డిది అరుదైన శైలి. 1990 మే నెల బ్లిట్జ్ ఆంగ్ల వార పత్రికలో ఆయనతో పత్రిక ప్రతినిధి సాయినాథ్ చేసిన ఇంటర్వ్యూ వచ్చిందిఆ నెల మొదటి తేదీన నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో ఆ ప్రతినిధి చెన్నారెడ్డిని  ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను కూడా పక్కనే వున్నానుమారుమూల గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని నక్సలైట్ ప్రాబల్యమున్న ఆ గ్రామంలో ప్రారంభించడానికి అక్కడకు వెళ్లిన ముఖ్య మంత్రితో జరిపిన ఇంటర్వ్యూ అదిఢిల్లీలోని "రాజకీయేతర కాంగ్రెస్ ముఠా నాయకులకుచెన్నారెడ్డి  హెచ్చరిక చేసినట్లుజాతీయ స్థాయిలో అలాంటి నాయకుల వైఫల్యం మూలాన్నే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని ఆయన అన్నట్లుకొన్ని వివాదాస్పదమైన అంశాలున్నాయందులోఅలాగే మరో చోటచెన్నారెడ్డిశరద్ పవార్వీరేంద్ర పాటిల్ తెలుగు గంగ పేరుతో తిరుపతిలో సమావేశమైరాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వచ్చిందిఆయన చెప్పని ఆ విషయాలు బ్లిట్జ్ లో రావడంలోకంగారు పడుతూ ఆయన దృష్టికి తెచ్చినప్పుడు, "అలా ఎవరైనా అనుకుంటే పర్వాలేదుఅనడం నన్ను ఆశ్చర్య పరిచిందిబుద్ధుడి విగ్రహం టాంక్ బండ్ నీళ్లలో పడి పోయినప్పుడుఅంతవరకు దాని కొరకు జరిగిన వ్యయంనీళ్లలోంచి తీస్తే కాబోయే అదనపు వ్యయంపదే-పదే చెప్పే వారే కానితీయడానికి ఏం చెయ్యబోతున్నారో ఎప్పుడూ చెప్పలేదు.

చెన్నారెడ్డి గారి దగ్గర నేను “పీఆర్వో టు సీఎం” గా చేరిన మొదటిరోజుల్లోనే ఒక ఇబ్బందికి గురయ్యాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నాకు అంతకు ముందు ఎక్కడా పీఆర్వోగా పనిచేసిన అనుభవం కూడా లేదు. పోనీ జర్నలిస్టుగా పనిచేసానా అంటే, అది కూడా లేనట్లే. ఏదో అడపాదడపా “లెటర్స్ టు ద ఎడిటర్” రాయడమో, లేదా, ఆకాశవాణి, దూరదర్శన్ లలో తాత్కాలిక ప్రాతిపదికపైన వార్తా విభాగంలో పనిచేయడమో తప్ప పెద్దగా అనుభవం లేనివాడిని. ప్రభుత్వ పనితీరు కూడా అర్థం చేసుకోవడం అంతంత మాత్రమే. ఈ నేపధ్యంలో, ఒకనాడు డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. చెన్నారెడ్డి సీఎం హోదాలో హాజరయ్యారు. నాకు గుర్తున్నంతవరకు సుశీల్ కుమార్ మాథుర్ అప్పట్లో డీజీపీ. సమావేశం బాగానే జరిగింది కాని, ఎందుకో సీఎం కు కోపమొచ్చింది. ఇంటికి వస్తూనే, సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో, ఎదురుగా కనిపించిన నాతో తక్షణమే డీజీపీని వివరణ కోరాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని అన్నారు. నేను యధాలాపంగా “సరే” అన్నాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఈ విషయం సీఎం కార్యదర్శి ఐఏఎస్ అధికారి పరమహంస గారికి చెప్పాను. ఆయన తాను చూసుకుంటానని, నన్ను మరచిపోమ్మని అన్నాడు.

మరచిపోయే అవకాశం లేకుండానే, ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు “జ్వాలా, ఏమైంది? డీజీపీ విషయం ఏం చేసావు?” అని అడిగారు చెన్నారెడ్డి. పక్కనే వున్న పరమహంసను చూపిస్తూ, “సార్, పరమహంస గారికి చెప్పాను. ఆయన చూసుకుంటానన్నాడు” అనగానే సీఎం కు కోపమొచ్చింది. “ఏమయ్యా! నువ్వు నాకా, పరమహంసకా పీఆర్వో వి?” అని అడిగాడు. అందరిలాగా నేను ప్రభుత్వోద్యోగిని కాదనీ, వాళ్లలాగా వుండకూడదనీ, ఒకసారి తానొక్క మాట చెప్తే అది వేదవాక్యంలాగా ఒక జీవోలాగా, అమలు కావాలనీ, భయపడ వద్దనీ హితవు పలికాడు. బహుశా అప్పటినుండి నేనక్కడ పనిచేసినంత కాలం నా దృక్ఫదంలో ఒక మార్పు వచ్చింది. ధైర్యంగా పనిచేయగాలిగాను.


ఒకసారి, ఆయన ప్రవేశపెట్టిన ఒక పథకం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాను. కారులో ఆయన వెంట పోతూ అడిగాను ఆ విషయమే. జవాబు చెప్పలేదు. ఆ సాయింత్రం జరిగిన ఒక సభలో ఇతర విషయాలతో పాటు, ఆ పథకం గురించి చాలా వివరంగా అందరికీ అర్థం అయ్యేలా మాట్లాడాడు. నేను కూడా అక్కడే వున్నాను. అంతా విన్నాను. తిరుగు ప్రయాణంలో ఆ విషయం ప్రస్తావించి, అర్థమయిందా? అని ప్రశ్నించాడు. అదీ ఆయన పనితీరు. తన దగ్గర పనిచేసేవారికే తన ఆలోచనా ధోరణి అర్థం కాకపొతే, ఇతరులకు ఎలా అర్థమవుతుంది అని అలా సభాముఖంగా వివరించానన్నాడు.

చెన్నారెడ్డి మంత్రి వర్గంలో పనిచేస్తున్న ఒక సీనియర్ మంత్రి (స్వర్గీయ కోనేరు రంగారావు) పై అవినీతి ఆరోపణలొచ్చాయిచెన్నారెడ్డి ముఖ్య మంత్రి అయిన రెండు నెలలకే అది జరిగిందిఆరోపణలు చేసిన వారు బలమైన సాక్ష్యాధారాలున్నట్లు చెప్పడం జరిగిందితనకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలనుకున్న చెన్నారెడ్డి ఏం చేయాలన్న సందిగ్ధంలో పడ్డారుబహుశా తాను అడగ తల్చుకున్న వారందరినీ సలహా అడిగి వుండొచ్చుఆయన దగ్గర పనిచేస్తున్న మా వంతు కూడా వచ్చిందిఫిబ్రవరి 6,1990 రాత్రి పదకొండు గంటల సమయంలో సీఎం గారి ఫోన్ వచ్చిందిఆ మంత్రి విషయంలో ఏం చేస్తే బాగుంటుందని ఆయన ప్రశ్న వేశారుఆయన ఎలా చేస్తే బాగుంటుదనుకుంటే అలానే చేయమని బుద్ధిగా సమాధానం ఇచ్చానుఅన్నీ తాను అనుకున్నట్లే చేయడానికి ఎందుకంత మంది వ్యక్తిగత సిబ్బంది అని మరో ప్రశ్నఆయన మనసులో మాట అర్థం చేసుకుని చెప్పాల్సింది చెప్పడంఅదెలా అమలు పర్చాలని ఆయన అడగడంఆ బాధ్యత నెత్తిన వేసుకోవడంఆ మంత్రి మర్నాడు రాజీనామా చేయడం జరిగిందిఅదీ ఆయన లౌక్యం. (సశేషం) 

Wednesday, July 11, 2018

కాంగ్రెస్ మేనిఫెస్టోకు కళ తెచ్చిన “చెన్నా” .... మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-2:వనం జ్వాలా నరసింహారావు


కాంగ్రెస్ మేనిఫెస్టోకు కళ తెచ్చిన “చెన్నా”
మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-2
మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (12-07-2018)
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)
పీసీసీ అధ్యక్షుడి హోదాలో హైదరాబాద్ వచ్చిన నాడు, బేగంపేట విమానాశ్రయంలో అశేష జనవాహిని, సుమారు లక్షమందికి పైగా, ఆయనకు స్వాగతం పలికారు. నాటి పోలీసు అధికారులు కూడా ఆయనను దాదాపు కాబోయే ముఖ్యమంత్రిగా పరిగణించి, విమానం దాకా ఆయన్ను తెచ్చే వాహనాన్ని అనుమతించారు. బ్రహ్మాండమైన ఊరేగింపుతో బేగంపేట నుండి, తార్నాకా ఇంటికి వెళ్లారాయన. ఆయన ఆధ్యక్షతన ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. అఖండ విజయం సాధించింది.

అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకిపార్టీ అధినేత-ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకిపీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే సవాళ్ళు విసరడం ఆరంభించారు చెన్నారెడ్డిజూన్ 3, 1989  "నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్నిర్వహించిన "జవహర్ రోజ్ గార్-పంచాయితీ రాజ్సదస్సులో ఎన్ టీ రామారావు సబ్సిడీ బియ్యం పథకం అంశం ప్రస్తావిస్తూ... ప్రతి వ్యక్తీ తమ కాళ్లపై తామే నిలబడేలాస్వయం కృషితో జీవనాధారం పొందగలిగే స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందించాలి కానిశాశ్వతంగా వారిని ఒకరిపై ఆధారపడేలా చేయకూడదని అన్నారు చెన్నారెడ్డిపంచాయితీరాజ్ సంస్థల ద్వారాస్థానిక స్వపరిపాలన ద్వారా మాత్రమే అది సాధ్య పడుతుందనికాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోఈ రెండింటి లో ఏది ముఖ్యమో అన్న అంశంపైనే పోటీకి దిగి గెలుస్తుందని సవాలు విసిరారుఆ నాటి సెమినార్ లో పాల్గొని ప్రసంగించిన ప్రముఖుల్లో పద్మభూషణ్ స్వర్గీయ సీ నరసింహన్ ఐసీఎస్ప్రముఖ అఖిల భారత కమ్యూనిస్ట్ నాయకుడు స్వర్గీయ మొహిత్ సేన్ కూడా వున్నారు.

నవంబర్-డిసెంబర్ 1989 లో జరిగిన ఎన్నికల్లో చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ఓడిపోడనుకున్న ఎన్ టీ రామారావును ఒక నియోజక వర్గంలోనుపార్టీని రాష్ట్రంలోను ఓడించిందిఆయన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు చేసిన వివిధ ప్రసంగాల్లో విసిరిన సవాళ్లనే ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. "అర్హులైన పేదలకే సబ్సిడీ బియ్యం పథకంపరోక్షంగా ప్రస్తావిస్తూపటిష్ఠమైన పౌర పంపిణీ వ్యవస్థ విధాన ప్రకటన మేనిఫెస్టోలో మొదటి అంశంగా చేర్చింది కాంగ్రెస్ పార్టీఅలానే స్వయం ఉపాధి పధకాల ప్రస్తావన కూడా దానికి జత పరిచింది పార్టీఎన్నికల ప్రణాళికను తయారుచేయడానికి నియమించిన కమిటీ ఆ పనిని పూర్తి చేయడానికి పదిహేను రోజులు తీసుకుందిముసాయిదాను అధ్యక్షుడి ఆమోదం కొరకు చూపించినప్పుడు నేను కూడా అక్కడే వున్నానుకేవలం పావు గంటలోనే ఆసాంతం  చదివితప్పులు సరిదిద్దిన చెన్నారెడ్డిఅదనంగా మరో ఇరవై మూడు పేరాలు , కాగితంపై పెట్టిన కలాన్ని ఎత్తకుండా రాశారుఆయన స్వదస్తూరీతో ఆ నాడు రాసిన మేనిఫెస్టో కాగితాలనుఈ నాటికీఆయన జ్ఞాపకంగా నా వద్దనే భద్రపరుచుకున్నాను

ఒక సందర్భంలో, ఎన్నికల ముందు ఒక స్నేహితుడితో కలిసి చెన్నారెడ్డితో మాట్లాడుతూ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చో అంచనా వేస్తున్నాం. అప్పటికే ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి సుమారు 200 స్థానాల దాకా రావచ్చని సమాచారం వచ్చింది చెన్నారెడ్డికి. అదే విషయం ఆయనతో ప్రస్తావించాను. ఆయనకు అధికారంలోకి రావాలని వున్నా, అన్ని సీట్లు వస్తాయన్న నమ్మకం అంతగా లేదు. నేనేప్పుడైతే 200 సీట్లు రాబోతున్నాయని అన్నానో, అలా వస్తే, నన్నే తన పీఆర్వో చేస్తానని అన్నాడు. అన్న మాట ప్రకారం చేశారు. వాస్తవానికి ఆయన సీఎం కాగానే, 1978 లో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎవరెవరైతే ఆయనకు పర్సనల్ స్టాఫ్ గా పనిచేశారో వారందరినీ మళ్లీ నియమించుకున్నారు. ఉదాహరణకు ఐఏఎస్ అధికారి కేఆర్ పరమహంసను తన కార్యదర్శిగా నియమించారు. ఒక్క పీఆర్వో విషయంలోనే అప్పుడున్న స్వర్గీయ పర్వతాలరావు స్థానంలో నన్ను నియమించారు. అది ఆయనలో వున్న గొప్పతనం. ఎన్నికల ముందు అన్న మాట ప్రకారం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకసారి ప్రధాని, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజీవ్ గాంధీ వచ్చారు. వెంట మణిశంకర్ అయ్యర్ వున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం మధ్యలో కల్వకుర్తిలో ఆగడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్ని సీట్లు వస్తాయని రాజీవ్ గాంధి చెన్నారెడ్డిని అడిగారు. 40 పార్లమెంటు సీట్లు, 194 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని చెన్నారెడ్డి జవాబిచ్చారు. ఆశ్చర్యపోయిన రాజీవ్ గాంధి, అన్ని సీట్లు వస్తే చెన్నారెడ్డే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. చెన్నారెడ్డి అన్నట్లుగానే కరెక్టుగా 194 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అన్న మాట ప్రకారం, గెలిచిన శాసన సభ సభ్యుల్లో చెన్నారెడ్డికి ఎంతమంది మద్దతున్నదనే అంశాన్ని పక్కన పెట్టి, ఆయన్నే సీఎం చేసింది అధిష్టానం.


పీసీసీ అధ్యక్షుడుగా చెన్నారెడ్డి చేపట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన "కోటి సంతకాల సేకరణకార్యక్రమం, "జైల్ భరోఉద్యమం ప్రజల స్పందనకు ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలినిజాం కళాశాల మైదానంలో డిసెంబర్ 3, 1989 న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన చేసిన తొలి ప్రసంగంలోప్రజలకు అయిష్టం కలిగించేదిఇబ్బందులకు గురిచేసేదిఆమోదయోగ్యం కానిది ప్రభుత్వం చేయడం తగదని అన్నప్పుడు, "హెల్మెట్లువిధిగా ధరించడం మాకిష్టం లేదంటూ ప్రేక్షకుల నుంచి కేకలు వినిపించాయితక్షణమే స్పందించిన చెన్నారెడ్డిధరించమని బలవంతంగా ఎవరిపైనా రుద్దమని అన్నారుఅలా అంటూనేబధ్రత దృష్ట్యా వాటిని ధరించితేనే మంచిదంటూ సూచన కూడా చేశారుఅదీ ఆయన స్పందించే శైలిఎన్టీ రామారావు ప్రభుత్వం వున్నప్పుడుహెల్మెట్లు ధరించే విషయంలో ఒకసారి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన సీనియర్ పాత్రికేయుడు భండారు శ్రీనివాసరావు (అప్పుడు ఆయన మాస్కో రేడియోలో పని చేస్తున్నాడు) కుముఖ్యమంత్రి హోదాలో మర్రి చెన్నారెడ్డి తన నిర్ణయం గురించి ఉత్తరం కూడా రాశారు!

ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి వెళ్లే ప్రతి సందేశంలోపత్రికా ప్రకటనలో ఆయన దైన శైలివ్యక్తిత్వం కొట్టొచ్చినట్లు కనబడేలా సంబంధిత వ్యక్తిగత సిబ్బందికి ఆయన ఆలోచనా ధోరణి తెలియ చేసేవారు చెన్నారెడ్డిముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టగానేఆయనను అభినందిస్తూ వచ్చిన వేలాదిమంది అభిమానులకుచెన్నారెడ్డి నుంచి ఆయన సంతకంతో వెళ్ళిన "కృతజ్ఞతల ప్రత్యుత్తరంకేవలం ధన్యవాదాలకే పరిమితం చేయలేదుఅద్వితీయమైన శైలిలో ఆయన తన అభిమానులకు చేరవేయాలనుకున్న సందేశాన్ని మాతో రాయించారుఅధికారం మారడంతో తనకు తెలుగుదేశం నుంచి వారసత్వంగా సంక్రమించిన "ఛిన్నాభిన్నమైన పాలనా వ్యవస్థనుఆర్థిక వ్యవస్థను", అత్యవసరంగా ప్రక్షాళన చేయడానికి వారి సహకారం అందించమంటూతన జవాబులో కోరారు చెన్నారెడ్డి

బ్లిట్జ్  సంపాదకుడు ఆర్ కే కరంజియా చెన్నారెడ్డిని అభినందిస్తూ రాసిన వుత్తరం గురించి ఆయన చాలా మందితో ప్రస్తావించారుఅప్పట్లో పంజాబ్ రాష్ట్రంలో నెల కొన్న శాంతి బధ్రతల సమస్యను-హింసాత్మక సంఘటనలను తన వుత్తరంలో పేర్కొన్న కరంజియాచెన్నారెడ్డి కనుక మరికొంత కాలం ఆ రాష్ట్ర గవర్నర్ గా కొనసాగి వున్నట్టయితేబహుశాపరిస్థితులు మరోలాగా-శాంతియుతంగా వుండేవని చెప్పారుతన పట్ల ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం ఒక అసాధారణమైన గౌరవంగా భావించిన చెన్నారెడ్డి కరంజియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసుకున్నారుపంజాబ్ మాజీ ముఖ్య మంత్రి దర్బారా సింగ్ చనిపోయిన వార్త ఆ రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత తెలిసిందిఅప్పటికే ఇంటికొచ్చిన నేనుఆ విషయాన్ని చెన్నారెడ్డి దృష్టికి తెచ్చిసంతాప సందేశం ఆయన మాటల్లో చెప్పమని కోరానుఅప్పటికే అర్థరాత్రి కావచ్చిందిఆయన గవర్నర్ గా పని చేసినప్పుడుదర్బారా సింగ్ పంజాబ్ ముఖ్య మంత్రిగా వుండేవారు. "పర్సనల్ టచ్తో సందేశం చెప్పారు.
(మిగతాది రేపు

మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-1 ..... వనం జ్వాలా నరసింహారావు


మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు-1
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)
ఆంధ్రభూమి దినపత్రిక (11-07-2018)
స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండవ విడత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి కొద్దికాలం ముందునుండీ నాకున్న పరిచయం వల్ల, ఆ తరువాత ఆయన దగ్గర సీఎం పీఆర్వోగా పనిచేయడం వల్ల, ఆయనతొ నాకున్న అనుబంధానికి సంబంధించిన కొన్ని అనుభవాల జ్ఞాపకాలు అప్పుడప్పుడూ మదిలో మెదలుతుంటాయి. పాలనాపరమైన, మేధోపరమైన వాటిలో కొన్ని పదిమందితో పంచుకుంటే మంచిదనే ఆలోచనే ఈ వ్యాసానికి నాంది. సీఎం గా డిసెంబర్ 3, 1989న చెన్నారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజుల్లో నేను రాజ్ భవన్లో, నాటి గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర, ఆమె ఆధ్యక్షతన పనిచేస్తున్న “చేతన” అనే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు చేసే స్వచ్చంద సంస్థ అడ్మినిస్ట్రేటివ్-ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నాను. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, ఆయన ఏపీసీసీ అధ్యక్షుడిగా వున్నప్పుడు, శాసనసభ-లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ఆకాశవాణి వార్తా విభాగంలో నలబై రోజుల కాంట్రాక్టు మీద నేను తాత్కాలిక విలేఖరిగా పనిచేసే అవకాశం లభించింది. చెన్నారెడ్డి పాల్గొన్న అనేక కార్యక్రమాలను కవర్ చేసే వీలు అలా కలిగింది. అది నన్ను అంతకుముందే వున్న పరిచయానికి అదనంగా ఆయనకు మరింత చేరువ చేసింది.

సీఎం గా ఆయన బాధ్యతలు చేపట్టిన రెండు-మూడు రోజుల్లో చెన్నారెడ్డి దగ్గరనుండి నాకు ఫోన్ వచ్చింది. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. అధునాతన పరికరాల ఫోన్లు కూడా లేవు. నన్ను వచ్చి కలవమని ఆయన దగ్గరనుండి పిలుపు. ఆయన కోరినట్లే తార్నాక లోని ఆయన ఇంటికి వెళ్లాను. వెళ్ళిన కొద్ది సేపటికి ఆయన్ను కలవడం, నాకు ఆయన ఒక పని అప్పచెప్పడం వెంట-వెంట జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్షిక ఉత్సవాలకు సీఎం సందేశం రాయమని నన్ను ఆయన ఆదేశించారు. నేనేదో చెప్పబోతుంటే, తనకంతా తెలుసనీ, నన్ను సీఎం పీఆర్వోగా నియమిస్తున్నాననీ చెన్నారెడ్డి అన్నారు. నాకు ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. సరే...నేను నాకు అప్పగించిన పని పూర్తి చేశాను....సందేశం రాశాను. తన సహజ శైలిలో ...”ఇన్సిపియెంట్” (Incipient, meaning developing into a specified type or role) అనే ఒక చిన్న కామెంట్ చేసి సందేశం మీద సంతకం చేశారు. ఆ కామెంటును నేను ఒక సూచనలాగా తీసుకుని, ఆయన ఆలోచనకనుగుణంగా ఆ తరువాత సందేశాలు రాసేవాడిని. ఏనాడూ, ఏ చిన్న సవరణ కూడా చేయకుండా నేను ఆయన ముందుంచిన ప్రతి సందేశం మీద సంతకాలు పెట్టేవాడాయన.

తన దగ్గర పనిచేసిన అధికారులపై ఆయనకున్న విశ్వాసం తిరుగులేనిది...బహుశా ఇది అరుదైన శైలేమో! ఆయన మా పట్ల ఎలాంటి నమ్మకంతో వ్యవహరించేవారోఅలానేమేమూ వుండేవాళ్లంముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన కేఆర్పరమహంససంయుక్త కార్యదర్శులు జికిషన్ రావుఆర్ ఎం గోనెలఆంతరంగిక కార్యదర్శి శ్రీనివాస రెడ్డిముఖ్య బధ్రతాధికారి రామచంద్ర రాజుల విషయంలోనూ ఆయనకు అదే నమ్మకం వుండేదితన దగ్గర పని చేసిన మమ్మల్ని చాలా విషయాల్లో సంప్రదించడంసలహాలు-సూచనలు కోరడం జరుగుతుండేదిఅవి ఒక్కొక్కప్పుడు చాలా చిన్న విషయాలే కావచ్చుమరో సారి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాలే కావచ్చుమా సలహా ఆయన అంగీకరించనూ వచ్చులేదాతిరస్కరించనూ వచ్చు. ఆయన దగ్గర పనిచేస్తున్న "మా మాటఅంటేఅది "ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మాటగానే చలామణి కావాలని ఎన్నో పర్యాయాలు బహిరంగంగానే అంటుండేవారుఅలా అనధికారిక ఆదేశాలు కూడా ఇచ్చారు!


నన్నుచెన్నారెడ్డి గారికి పరిచయం చేసింది పాత్రికేయ మిత్రుడు, నాకు దూరపు బంధువు, పర్సా వెంకట్. 1989 సంవత్సరం పూర్వార్థంలో, మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనగా, నాటి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎన్టీ రామారావును ఓడించగల సమర్థుడైన వ్యక్తికి ఏపీసీసీ అధ్యక్షత బాధ్యతలు అప్పచెప్పాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధిష్టానం ఆలోచన చేస్తున్న రోజులవి. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన రెడ్డి వ్యవహరిస్తున్నారు. జలగం వెంగళ్ రావు కేంద్రంలో పరిశ్రమల మంత్రిగా వున్నారు. రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా, అధిష్టానంలో కీలక వ్యక్తిగా స్వర్గీయ హెచ్కేఎల్ భగత్ పేరు ప్రచారంలో వుండేది. రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణకు అధిష్టానం దగ్గర బాగా పలుకుబడి వుందని చెప్పుకునేవారు. వీరందరికంటే ఎక్కువగా, స్వతహాగా కాంగ్రెస్ అభిమానైన నాటి గవర్నర్ కుముద్ బెన్ జోషికి రాజీవ్ గాంధీతో సాన్నిహిత్యం, ఆయన దగ్గర పలుకుబడి బాగా వుండేది. వీరందరికీ ఇష్టమైన వారే పీసీసీ అధ్యక్షుడిగా అయ్యే అవకాశాలు వుండేవప్పుడు. సరిగ్గా ఈ నేపధ్యంలో నాకు చెన్నారెడ్డి గారితో పరిచయం అయింది. ఆ పరిచయం పెరిగింది.

నా పరిచయాన్ని కొనసాగించుకుంటూనే, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా కావడానికి ఎవరెవరి సహాయం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన నేను కూడా నా వంతుగా చేసినప్పుడు మదిలో ఆదిరాజు మెదిలాడు. అప్పుడు ఢిల్లీలో పాత్రికేయుడిగా మంచి పలుకుబడి సంపాదించుకున్న ఆదిరాజుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన్ను చెన్నారెడ్డి దగ్గరకు ఒక సాయింత్రం తీసుకెళ్ళాను. అయితే అంతకు ముందు దాదాపు పది-పన్నెండేళ్లగా వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. 1978-80 మధ్యకాలంలో మొదటి సారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఆయన మీద కాంగ్రెస్ అసంతృప్తి నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పుడు, ఆ వివరాలను ముందుగానే మీడియా ద్వారా బహిర్గతం చేసి, అగ్నికి ఆజ్యం పోసి, చెన్నారెడ్డికి కోపం కలిగించాడు ఆదిరాజు. ఇద్దరి మధ్యా తీవ్ర వివాదానికి దారితీయడం, ఒకరితో మరొకరు మాట్లాడుకొని పరిస్థితులకు దారితీయడం జరిగింది. ఆ నేపధ్యంలో ఒకరిని మరొకరు ఆహ్వానించారని (వాస్తవానికి ఎవరు-ఎవరినీ ఆహ్వానించలేదు) ఇద్దరికీ చెప్పి ఇద్దరినీ కలిపాను నేను.

ఆదిరాజును తన గదిలో చూడగానే చెన్నారెడ్డి “ ఏం ఆదిరాజూ....ఏం పని మీద వచ్చావు?” అని తన సహజ ధోరణిలో ప్రశ్నించాడు. “నాకు మీతో ఏం పని లేదు...మీరు రమ్మని అడిగితే వచ్చాను” అని కోపంగా జవాబిచ్చి, “డాక్టర్ సాబ్... ఐ యాం గోయింగ్...ఇఫ్ యు ఇన్వైట్ మీ అగైన్ అండ్ వాంట్ మీ టు కం, ఐ విల్ సీ” అంటూ కుర్చీ లోంచి దూకుడుగా లేచాడు. ఇద్దరికీ సర్ది చెప్పడం మా వంతైంది. చివరకు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. పదేళ్ళ క్రితంనాటి కోపాలు ఇద్దరూ మర్చిపోయి మాట్లాడుకున్నారు. చెన్నారెడ్డికి తన వంతు సహాయం చేస్తానని మాటిచ్చాడు. అన్నట్లుగానే ఢిల్లీలో అప్పట్లో అధిష్టాన వర్గానికి అత్యంత కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న హెచ్ కె ఎల్ భగత్ ను, నాటి కేంద్ర పరిశ్రమల మంత్రి జలగం వెంగళ్ రావును, పార్లమెంటు సభ్యుడు ద్రోణంరాజు సత్యనారాయణను సంప్రదించాడు ఆదిరాజు. ఎవరి ప్రయత్నం ఫలించిందో చెప్పలేం కాని, 1989 ఉత్తరార్థంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి స్థానంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం.

చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షిడిగా నియామకం జరగడానికి పూర్వరంగంలో, ఆ విషయానికి సంబంధించి, అధిష్టానంతో మాట్లాడడానికి, వాళ్ళను ఒప్పించడానికి, తన వంతు లాబీయింగ్ చేసుకోవడానికి, ఆయన డిల్లీ వెళ్లిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు వీడ్కోలు పలకడానికి వెళ్ళింది కేవలం నలుగురైదుగురం మాత్రమే. నాకు గుర్తున్నంతవరకు చెన్నారెడ్డి డిల్లీలో పదిహేను రోజులు మకాం వేశారు. ప్రతిరోజూ కాకపోయినా అడపా-దడపా నాతో మాట్లాడేవారు. అవుననో, కాదనో అనిపించుకునేవరకు డిల్లీలోనే వుంటే మంచిదనే అభిప్రాయం నేను వెల్లడించే వాడిని. మొత్తం మీద నియామకం ఖాయం చేసుకునే మరీ వచ్చారు.
(సశేషం) 

Sunday, July 8, 2018

హనుమ మరలి పోయేందుకు శలవిచ్చిన సీతాదేవి ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమ మరలి పోయేందుకు శలవిచ్చిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (09-07-2018)
సీత మాటలువిన్న హనుమంతుడు, రామచంద్రమూర్తి తప్పక ఆమె కష్టాలు తొలగిస్తాడనీ, ఆయన నిజంగా దుఃఖిస్తున్నాడనీ, ఆయన స్థితి చూసి లక్ష్మణుడు కూడా శుష్కిస్తున్నాడనీ, తాను ఇవ్వన్నీ ప్రమాణం చేసి చెప్తున్నాననీ, తనమాటలు నమ్మమనీ అంటాడు. తానెంతో కష్టపడి సీతాదేవిని ఇక్కడ చూడగలిగాననీ, ఇక ఎంతమాత్రం బాధపడవద్దనీ, ఆమెను చూసేందుకు రాబోతున్న రాజకుమారులు లంకను నాశనం చేసి, రావణుడిని చంపడం ఆమే త్వరలోనే కళ్లారా చూస్తుందని కూడా అంటాడు. ఇది జరిగిన తర్వాత సీత తనమగడితో, తన వూరికి పోవడం ఖాయమని కూడా చెప్తాడు హనుమంతుడు.

రామచంద్రమూర్తి గుర్తించే మరో జ్ఞాపిక ఇవ్వమని మళ్లీ అడుగుతాడు. తానిచ్చిన చూడామణిని మించిన గుర్తేమీలేదని, దానిని చూడగానే హనుమంతుడు తన దగ్గరకు వచ్చినట్లు నమ్ముతాడనీ సీత చెప్పడంతో, తనింక వెళ్లడానికి అనుమతినివ్వమంటాడు హనుమంతుడు. ఇలా అంటూనే, తనకు తలవంచి నమస్కరించి నిల్చిన హనుమంతుడు దేహాన్ని పెంచడం, సముద్రాన్ని దాటే ఉత్సాహాన్ని కనపర్చడం కళ్లారా చూసి, ఆ పుణ్యాత్ముడితో మాట్లాడాలని మళ్లీ అనుకుంటుంది.

(హనుమంతుడు సీతను మొదలు చూసినప్పుడు నమస్కరించలేదు. ఇప్పుడు నమస్కరిస్తున్నాడు. ఎందుకిలా చేసాడు? వయస్సులో వృధ్ధ స్త్రీలు, పతిని దేవుడిలాగా కొలిచే పతివ్రతలు నమస్కరించడానికి అర్హులు. పాదాలుపట్టి మ్రొక్కడాన్ని "అభివాదం" అంటారు. చేతులు జోడించి నమస్కరిస్తే, మ్రొక్కితే, దాన్ని నమస్కారమంటారు. మొదలు సీతాదేవిని చూసినప్పుడు, ఆమె సీత అవునో-కాదో, తెలియదు. పతివ్రతో, కాదో తెలియదు. వృధ్ధస్త్రీ కూడా కాదు)

"ఆంజనేయా! రామచంద్రమూర్తిని, ఆయన తమ్ముడిని, మంత్రులతో సహా సుగ్రీవుడినీ, ఆక్కడున్న మిగతావారందరినీ, కుశలమడిగానని చెప్పమని" అంటుంది సీతాదేవి. తాను ఈ ఆపత్సముద్రంలో మునగకుండా, ఎట్లా చెప్పితే రాముడు తన్ను రక్షిస్తాడో, అట్లానే చెప్పమంటుంది. తనుపడ్డ నానాకష్టాలనూ మగడికి చెప్పమని అంటుంది. వెళ్లిరమ్మనీ, శుభం కలుగుగాక అని అంటూ సెలవిస్తుంది.

కార్యశేషమాలోచించిన హనుమంతుడు
తనకు శుభమగుగాక, విఘ్నాలు కలగకుండా వుండుగాక! అని సీతాదేవి అనడంతో, ఆమె దయకు పాత్రుడనైనాననుకుంటాడు హనుమంతుడు. ఇంక తనకేమీ భయం లేదని, ఉత్తర దిక్కుగా ప్రయాణమై పోవాలనుకుని, చెట్టుచాటు చేసుకుంటూనే కొంచెం దూరం వెళ్లాడు. ఇంకా చేయాల్సిందేమన్నా వుందా అని అప్పుడాలోచించడం మొదలెట్టాడు. చేయాల్సినపని కొంచెం మిగిలుంది అనిపించిందాయనకు. సుగ్రీవుడు సీతను వెతకమనీ, లంకను చూడమనీ, తనకు రెండు పనులప్పగించాడు. ముఖ్యమైనది సీతను వెతకడం అయిపోయింది. లంకను చూడడం మిగిలి వుంది ఇంకా! రాత్రివేళలో సరీగ్గా చూడలేదు. లంకను చూడటమంటే, మిద్దెలు, మేడలు బాగున్నాయని చెప్పడం కాదుకదా! రాక్షసుల బలాబలాలు బేరీజు వేయడం, రావణుడి అభిప్రాయం తెలుసుకోవడం ఇంకా జరగలేదు. రావణుడి విషయంలో, అతడి బలగం విషయంలో, ఇదిచేయాలంటే, సామ-దాన-భేదాలు పనికిరావు. దండోపాయమొక్కటే సరైన మార్గమనుకుంటాడు.


రాక్షసుల్లో తమోగుణం పాలెక్కువ. వాళ్లు మంచిమాటలకు, ధర్మ వాక్యాలకు సాధువులకు మాదిరి లోబడేవారు కారు. దానగుణంతో చేద్దామంటే వారి దగ్గరే బోలెడు ధనమున్నది. పరాక్రమవంతులైన వీరిలో భేదోపాయం సాధ్యం కాదు. మిగిలిన దండోపాయమే ఇప్పటికి తగిన పనిగా తోస్తున్నదని తలుస్తాడు ఆంజనేయుడు. జయాపజయాలు దైవాధీనమైనందున, ఓడిపోతే కార్యభంగమౌతుందా? ముందు రాముడు, వెనుక సీతాకటాక్షముంటే తనకు పరాజయమెందుకు కలుగుతుంది? తను చేయబోయేది అధర్మకార్యం కాదు. ధర్మమెందుకు చెడుతుంది? దైవబలామ్, దేహబలామ్, ధర్మబలమున్న తనకు ప్రస్తుతం యుధ్ధమే శరణ్యమనుకుంటాడు హనుమంతుడు. రావణ, రాక్షసుల బలాబలాలను గురించి రామసుగ్రీవులు, తాను మరలిపోగానే, తప్పకుండా అడుగుతారు. దానికి సరైన ప్రత్యుత్తరమీయాలంటే, రాక్షసుల బలమెంతో, వారెంత బలవంతులో తెల్సుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే యుద్ధం చెయాల్సిందే. యుధ్ధానికి ప్రయత్నం చేస్తే ఇంకో మేలుగూడా జరుగుతుంది. రామలక్ష్మణులు సహాయం లేనివారు, ఏమీ చేయలేరని దురభిప్రాయంతో వున్న రాక్షసుల అపోహ తొలగించాలంటే, సుగ్రీవుడి సహాయముందని ప్రకటించి, యుద్ధం చేసి, కొందరినన్నా చంపాలని అనుకుంటాడు. ఇలా జరుగుతే తక్కినవారు ద్వేషం వదిలి మెత్తబడటమో, వారిలో వారికి విభేదాలు రావటమో జరుగుతుందనుకుంటాడు.

తాను యుద్ధంచేసి కొందరిని చంపి వేస్తే రామచంద్రమూర్తి పని సులభం కావచ్చు. కాకపోతే ఆయన సీతాదేవిని చూసి రమ్మన్నాడేకాని, నీతిమాలిన వారితో నీచకలహానికి దిగమని చెప్పలేదే! అలాగైతే, సీతాదేవి ఏం చెప్పింది? రాముడే రావాలి, రావణాదులను చంపాలి, తనను తీసుకునిపోవాలనికదా! ఈ సంగతి చెప్పటమంటే రాక్షసుల బలాబలాల విచారణ జరగాలనే! అంటే ఈ పని నన్ను చేయమని చెప్పలేదనకూడదు. ఎట్లాగైనా కార్యం సాధించుకుని రావడం ఉత్తమదూత లక్షణం. చెప్పినపనికి తోడు, అనుబంధమైన పనులన్నీ దూతకృత్యాలే! కాకపోతే అప్పచెప్పిన కార్యానికి అవరోధం కాకూడదు. ఏ పనైనా ధైర్యం చెడకుండా ఆలోచనతో చేయొచ్చు.

ఎంత చిన్నపనైనా చక్కగా చేయాలని పూనుకుంటే, అది నెరవేరటానికి, ఎన్ని ఉపాయాలు అవసరమో, అన్నీ వెతికి చేయాలి. రామకార్యంకూడా పలువిధాలుగా చేయటమే మేలనిభావిస్తాడు హనుమంతుడు. బలంలో తనకు, రాక్షసులకు వున్న భేదాన్ని తెలుసుకొని, రామచంద్రుడి దగ్గరకు పోతే, స్వామి ఆజ్ఞ నెరవేర్చిన బంటని పేరొస్తుందని అనుకుంటాడు. రావణుడు తనంత బలవంతుడు లేడన్న మదంతో వున్నాడు. ఆ మదమణుగుతేనేగాని వాడు లొంగడు. కొందరు రాక్షసులను యుధ్ధానికి ఈడ్చి సులభంగా చావకొడ్తే, రావణుడు యుధ్ధానికొస్తాడు. అప్పుడు వాడిబలమెంతో తేల్చుకుని పోతేమంచిది. వూరికే తిరిగెళ్లిపోతే, తనసంగతి వాడికెట్లా తెలుస్తుందని భావిస్తాడు.

కాబట్టి ఏదోవిధంగా, రావణుడిని, వాడి మంత్రులను, సైన్యాన్ని, యుధ్ధానికీడ్చి, దాంతో శత్రువుల బలాబలాలను తెల్సుకుని, వాడి ఆలోచనేమిటో అర్థం చేసుకోవటమే మంచిదనుకుంటాడు. ఆ తర్వాత అనాయాసంగా, బాధలేకుండా మరలిపోతే, రామకార్యం చేసినవాడినవుతాననుకుంటాడు. కన్నుల పండుగగా, మనస్సుకు ఇంపుగా, ఇంద్రుడి నందన వనంగా, గొప్పగొప్ప వృక్షాలతో, అందమైన తీగలతో వున్న ఈ ఉద్యానవనం సొగసుగా వున్నదనీ, దీన్ని ధ్వంసం చేస్తే రావణుడికి కోపం వస్తుందనీ అనుకుంటాడు. ఈ అశోకవనం కార్చిచ్చుతో కాలినట్లు పాడైపోతే, మండిపడ్డ రావణుడు, ఏనుగులతో సహా తనసైన్యాన్ని యుద్ధం చేయమని తనమీదకు పంపుతాడు. ఆ శూరులు త్రిశూలాలతోనూ, విల్లంబులతోనూ వస్తే వాళ్లను తునాతునకలు చేసి సంతోషంగా కిష్కింధకు పోదామని నిర్ణయించుకుంటాడు.

అశోకవనాన్ని పాడుచేసిన హనుమంతుడు
          ఇలా ఆలోచించిన హనుమంతుడు విజృంభించాడు. మహావాయువులాంటి తనతొడలవేగంతో, చెట్లన్నీ కూకటివ్రేళ్లతోసహా పీకి నేలమీద పడేయడం ఆరంభించాడు. నానారకాల చెట్లతీగలతో, మదించిన పక్షుల ధ్వనులతో నిండిన ప్రమదావనాన్ని పాడుచేసాడు. క్రీడాపర్వతాలను నేలమట్టం చేసాడు. క్రీడాసరస్సులను విరగ గొట్టాడు. తెగిన తీగలతో, విరిగిన చెట్లతో, పాడైన సరస్సులతో, ఆ వనం కార్చిచ్చు తగిలి కాలిపోయినట్లయింది. తీగలు అల్లుకునేందుకు ఆధారంగా వుండి, భూమిలోదాకా పాతుకుపోయిన తల్లివ్రేళ్లున్న చెట్లు కూడా పడిపోవడంతో, వాటికొనలందున్న తీగలు దిక్కులేని ఆడవారిలా, భయంతో వణుకుతూ కనిపించాయి. చెట్లు పడడంతో వాటిసందున వున్న పాములుకూడా నలిగి చచ్చాయి. చెట్టు తొర్రలు నేలగూలాయి. పొదరిళ్ళు పాడైపోయాయి. రాతి ఇళ్లు నేలపై తూలిపడ్డాయి. ఇదంతా చూడటానికి ఘోరంగా కనిపించింది. రావణాసురుడి భార్యలకు ప్రమదావనమైన ఉద్యానవనాన్ని మూలమట్టంగా నాశనంచేసి, సంతోషంతో కయ్యానికి కాలుదువ్వి, యుధ్ధానికెదురు చూస్తూ ఆ వనం తలవాకిటిమీద కూర్చున్నాడు హనుమంతుడు.