Friday, February 8, 2019

అన్నా హజారే నిరాహార దీక్ష అవసరమా? : వనం జ్వాలా నరసింహారావు


అన్నా హజారే నిరాహార దీక్ష అవసరమా?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (08-02-2019)
లోక్ పాల్ నియామకం కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేశారు. లోక్‌పాల్‌, లోకాయుక్తల నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ, మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో దీక్షకు కూర్చున్నారు. మహాత్మా గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించి మరీ దీక్షకు దిగారు. అవినీతిపై పోరాటం కోసం కేంద్రం లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని, లోక్‌పాల్‌, లోకాయుక్తలను ఏర్పాటు చేసే వరకూ నిరాహార దీక్ష కొనసాగిస్తాననీ అన్నారు హజారే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హజారే రాసిన లేఖలో పేర్కొన్నట్లుగానే   జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతి, అమరవీరుల దినోత్సవం కావడంతో దీక్ష ప్రారంభించారు. కేంద్రం, ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ తిరిగి ఇచ్చేస్తానని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు హజారే.

కారణాలేవైనా దీక్ష ప్రారంభించిన ఐదు రోజులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫద్నవీస్, కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, సుభాష్ భామ్రే హజారేను కలిసి ఐదారి గంటలు చర్చలు జరిపారు. చర్చల అనంతరం తానూ దీక్ష విరమిస్తున్నట్లు హజారే ప్రకటించి అన్న ప్రకారం విరమించారు.

ఒక్క సారి గత చరిత్రలోకి తొంగి చూస్తే....లోక్ పాల్ బిల్లును లోక్ సభలో డిసెంబర్ 22, 2011 న ప్రవేశపెట్టగా, దాన్ని సభ డిసెంబర్ 22, 2011 న ఆమోదించింది. దరిమిలా రెండురోజుల తరువాత డిసెంబర్ 29, 2011న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సమయాభావం వల్ల సుదీర్ఘ చర్చ జరిగినప్పటికీ ఓటింగ్ జరగడం వీలుకాలేదు. మే నెల 21, 2012న బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది రాజ్యసభ. కొన్ని సవరణల అనంతరం బిల్లు డిసెంబర్ 17, 2013న రాజ్యసభ, మర్నాడు లోక్ సభ ఆమోదించడం జరిగింది. జనవరి 1, 2014 న నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో జనవరి 16, 2014 నుండి అమల్లోకి వచ్చింది. కాకపొతే, చట్టమై ఇన్నాళ్ళైనా ఇంతవరకూ లోక్ పాల్ నియామకం జరగలేదు. కారణాలేవైనా కావచ్చు.

ఈ నేపధ్యంలో మరోమారు హజారే దీక్షకు దిగారు. ఇంకేముంది...హజారే దీక్షకు మద్దతుదారులు పెరగడం గతంలోలాగానే మొదలైంది. ఏ రాజకీయ నాయకుడిని కదిలించినా, ఏ ప్రభుత్వేతర సంస్థ ప్రతినిధిని పలకరించినా, అంతో-ఇంతో పరిజ్ఞానం వున్న ఏ వ్యక్తిని మాట్లాడించినా, వారి నోట వచ్చే ఒకే ఒక వాక్యం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలన్నదే! అలా మాట్లాడుతున్నవారికి అవినీతి గత చరిత్ర వుండవచ్చు, వుండక పోవచ్చు...ఐనా పోరాటంలో ముందేనంటారు. అందరిది ఒకే నినాదం..."అవినీతి అంతమొందాలి, లోక్ పాల్ నియామకం జరగాలి" అని.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అన్న సాకుతో, పార్లమెంటుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు, న్యాయ స్థానాలకు, రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లాకు అతీతమైన ఒక సూపర్-డూపర్ నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయాలని పౌర సమాజం నాయకులు ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం ఎంతవరకు సబబు? దానికి కొందరు మహానుభావులు వంత పాడడం ఎంతవరకు న్యాయం? 70 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో, అరవై ఎనిమిది సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో, అంచలంచలుగా బలపడాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను, పటిష్టం చేయాల్సిన బాధ్యతను విస్మరించిన రాజకీయ నాయకులనేకమంది, అదే బాధ్యతను ఇన్నాళ్లు విస్మరించిన పౌర సమాజం నాయకులకు వత్తాసు పలకడంలోని ఔచిత్యం ఏమిటి? వాస్తవానికి మనకు రాజ్యాంగం ప్రసాదించిన అవినీతి వ్యతిరేక అస్త్ర-శస్త్రాలను, అదే రాజ్యాంగంలోని అనేకానేక ప్రకరణాలను, ఒకదానికి మరొకటి అనుసంధానం చేసి అవినీతి పరులపై ప్రయోగించడానికి, పౌర సమాజం ప్రతినిధులు ఆదినుంచి పూనుకున్నట్లయితే, సమస్య  ఇంత జటిలమయ్యేదా? అంతా జరిగినాక, ఇప్పుడు "సర్వోపతి" లాంటి ఒక దివ్యౌషధం కావాలని ప్రభుత్వంపై పౌర సమాజం ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం?

రెండు దశాబ్దాల క్రితం, స్వాతంత్ర్యం వచ్చి ఏబై వసంతాలు పూర్తి చేసుకోనున్న తరుణంలో, నవంబర్ 1996 లో నాటి ప్రధాని దేవె గౌడ, మే 1997 లో ఆయన వారసుడు ఐకె గుజ్రాల్, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల, ముఖ్య మంత్రుల సమావేశాలు నిర్వహించారు. కేంద్ర-రాష్ట్ర స్థాయిలలో బాధ్యతాయుతమైన, పారదర్శకతతో కూడిన పాలన ప్రజలకందించాల్సిన అంశంపై ఏకగ్రీవ తీర్మానాలను ఆ రెండు సభలు ఆమోదించాయి. ప్రభుత్వాలపై ప్రజలకు సడలుతున్న నమ్మకాన్ని ఏ విధంగానైనా నిలబెట్టుకోవాలన్న ఆందోళన వారిలో అప్పట్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ సభల దరిమిలా దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని, ప్రత్యక్షంగాను-పరోక్షంగాను, సేకరించే ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన ఆరు నెలల లోపు అ సభలో ఆమోదించిన "నవ సూత్ర కార్యాచరణ ప్రణాళిక" కు సంబంధించిన అంశాలను అమలు చేయాలని, అమలు ఎలా జరుగుతున్నదనే విషయాలను ప్రధాన మంత్రి స్వయంగా సమీక్షించాలని నిర్ణయం కూడా జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది ఆ ప్రణాళికలో ప్రధానమైన అంశం. అలనాటి నిర్ణయాలే అక్షరాలా అమలు జరిగివుంటే ఈనాడు హజారే ఆందోళన చేయాల్సిన అవసరమే లేదు.

అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నా హజారే ఆ నాడూ పౌర జీవితంలోనే వున్నారు. నవ సూత్ర కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి వైఫల్యాల విషయంలో మాట మాత్రంగా నన్నా, నిరసన తెలియ చేసినట్లయితే, బాగుండేదేమో! అప్పట్లో ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరైన అతిరథ-మహారథులెందరో నేటికీ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. వారిలో కొందరు అధికారంలో, కొందరు ప్రతిపక్షంలో వుంటూ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా వ్యక్తిగతంగనో-కలిసికట్టుగానో అలనాటి నవ సూత్ర ప్రణాళిక అమలుకు కృషి చేసి వుంటే అవినీతి కొంతలో కొంతన్నా కట్టడి అయివుండేదేమో? 

దీక్ష చేపట్టడం ఎంత ముఖ్యమో, సమయం వచ్చినప్పుడు దీక్ష విరమించడం కూడా అంతే ముఖ్యమని మహాత్మా గాంధీ నిరూపించారు. గాంధీ స్ఫూర్తితో దీక్ష చేస్తున్నానంటున్న హజారే పట్టుదలకు పోకుండా, చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన లోక్ పాల్ నియామకం జరిగేలా చూస్తే మంచిదే మో!


అత్యున్నత విలువల నుంచి హజారే స్ఫూర్తి పొంది ఉండవచ్చు గాక! ఆయన వెంట అశేష జన వాహిని నేడు నడుస్తుండవచ్చు కాక! ఆయన వేసిన ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ, పౌర సమాజానికి చెందిన అతిరథ-మహారథులు హజారే చెప్పే ప్రతి వాక్యాన్ని వేద వాక్కుగా పరిగణిస్తుండ వచ్చు గాక! అంత మాత్రాన ఆయన ఎంచుకున్నది మాత్రం చాలా అసలు సిసలైన నిఖార్సైన మార్గం అనే వీలు లేదు. అవినీతిని రూపుమాపాల్సిందే. కాకపోతే కాన్సర్ లాగా పాకిపోయిన అవినీతికి రాత్రికి రాత్రే అన్నిరకాల చికిత్స ఒకే ఒక చిట్కాతో చేసి, మర్నాటికల్లా నయం చేయడమంటే, చేయాలని ఎవరైనా అంటే, అది మూర్ఖత్వం తప్ప మరేమీకాదు.

గతంలో ఒకసారి లోక్ పాల్ బిల్లు ఆవశ్యకతను గుర్తుచేస్తూ, అన్నా హజారే నాయకత్వంలోని పౌర సమాజ బృందం ఆందోళనకు దిగింది. అప్పట్లో వారి డిమాండు ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును తెచ్చి చట్టం చేయాలని మాత్రమే! అదే అదనుగా తీసుకుని, స్వతంత్ర భారత దేశంలో అంతో-ఇంతో అవినీతి భాగోతం నడిపించిన వారితో సహా సింహభాగం అవినీతిలో భాగస్వాములైన ఎందరో మహానుభావులు హజారే సరసన చేరారు ఆనాడు. ఆయన వెంట వున్న పౌర సమాజం సభ్యులు నిజాయితీ పరులే, అందులో సందేహం లేదు. వచ్చిన చిక్కల్లా, వారూ-వీరూ అనే తేడా లేకుండా, తన దగ్గరకు వచ్చిన అందరినీ తన అక్కున చేర్చుకున్నారు అప్పట్లో గాంధేయ మార్గాన్ని అనుసరించే హజారే! అంతటితో ఆగలేదు..వీరికి తోడుగా, రాజకీయ పార్టీల నాయకులు ఇదే అదను అనుకుని, హజారే పక్షాన నిలిచారు.

ప్రజాస్వామ్య విధానంలో-అందునా పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో,రాజ్యాంగాన్ని తుచ తప్పకుండా పాటించాలంటే, భూతకాలంలో జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ కేవలం చట్ట సభలు మాత్రమే. ఏ రకమైన చట్టాన్ని, ఎప్పుడు-ఎలా-ఎందుకు రూప కల్పన చేయాలో-చేసిన దానిని రాజ్యాంగ ప్రకరణాలకు-పార్లమెంటరీ విధానాలకు అనుగుణంగా ఆమోదింపచేసుకోవాలో, చేయడం వల్ల తలెత్తే పర్యవసానం ఎలా అధిగమించాలన్న విషయాలను నిర్ణయించే అధికారం చట్ట సభలకే వుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలైన కార్య నిర్వాహక వ్యవస్థ-శాసన ప్రక్రియ వ్యవస్థ-న్యాయ వ్యవస్థలు, వాటి-వాటి పరిధుల్లో తిరుగులేని అధికారాలను కలిగి వుండడం వల్ల, ఒక దాని అధికారం మరో దాన్ని కబళించలేని విధంగా, అధిగమించలేని పద్ధతిలో “అదుపులు-అన్వయాలు” ఆ అధికారాలను పరిమితం చేస్తుంటాయి.

ఇదిలా వుంటే, హజారే దీక్షకు దిగినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టించుకోలేదని ఆయన అభిమానులు నిరసన తెలిపారు. పీఎంవో నుంచి కేవలం “మీ లేఖ అందుకున్నాం, ధన్యవాదాలు, బెస్ట్ విషెస్” అని మాత్రమే వుంది. మోడీ స్పందనకు ఆయన గ్రామస్తులు ఆగ్రహం వెలిబుచ్చారు. చట్టం ఎలాగూ వుంది. ఎటొచ్చీ నియామకమే ఆలస్యమైంది. హజారే దీక్ష చేసినండునో, లేక, మరే ఇతర కారణాల వల్లనో కాని, లోక్ పాల నియామకం విషయంలో కేంద్ర ఒక అడుగు ముందుకేసింది. చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. కథ సుఖాంతం అయింది.

అందుకే, హజారే కొంత ఓపిక పట్టినట్లయితే బాగుండేదేమో!

వాగ్గేయకారుడు రామదాసు జయంతి : వనం జ్వాలా నరసింహారావు


వాగ్గేయకారుడు రామదాసు జయంతి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (08-02-2019)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, భద్రాచల దేవాలయ నిర్మాణానికి కారకుడు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడు, ఒకనాటి కంచర్ల గోపన్న నామధేయుడు, భక్త రామదాసుగా ఆబాలగోపాలానికి చిరపరిచితుడైన మహనీయుడి జయంతిని ఆ గ్రామస్తులు సాదు రాధాకృష్ణ మూర్తిగారి ఆధ్వర్యంలో ఏటేటా జరుపుకుంటున్నట్లే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం అభినందించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, భద్రాచలం దేవస్థానం దీనికి ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్నది. ఖమ్మం కలెక్టర్ కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉత్సవాలను స్వీయ పర్యవేక్షణలో స్వయంగా దగ్గరుండి జరిపిస్తున్నారు.

భక్త రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న పుట్టిన నేలకొండపల్లి గ్రామం ఖమ్మం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం కోదాడ రహదారిపై ఉంటుంది. తండ్రి లింగన మంత్రి, తల్లి కామాంబ. ఆత్రేయస గోత్రీకులు.....ఆరువేల నియోగి బ్రాహ్మణులు. బార్య కమల, కుమారుడు రఘురాముడు. నేలకొండపల్లిలోని వేణుగోపాలస్వామి వారి వరప్రసాదంగా పుట్టారని భావించిన తల్లిదండ్రులు,  గోపన్నగా నామకరణం చేశారు. నేటికి ఆ వూళ్లో వేణుగోపాలస్వామి దేవాలయం వైభవంగా భక్తులను ఆకర్షిస్తూనే వుంది. రామదాసు జన్మతిధి గురించి కొన్ని భిన్నవాదనలు ప్రచారంలో ఉన్నవి. అనేక చారిత్రక పరిశోధకుల అధ్యయనాల ఆధారంగా రామదాసు  1620లో జన్మించి వుండవచ్చని కొందరంటుంటే, మరికొందరు 1633 లో జన్మించారని నమ్ముతారు. ఏదేమైనా ఆయన జన్మ తిథి మాఘశుద్ధ తదియ...జన్మనక్షత్రం పూర్వాభాధ్ర అని నిర్థారణ జరిగింది. ఈ ఏడాది ఇది ఫిబ్రవరి 8 వతేదీన వచ్చింది. ఇదే విధంగా ఆయన ఆరాధనోత్సవాలు వైశాఖ మాసం మొదట్లో, అంటే, సాధారణంగా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు.

జగమెరిగిన పాత్రికేయులు స్వర్గీయ జీ కృష్ణ రాసిన "ప్రముఖ వాగ్గేయకారులు" పుస్తకంలో భక్త రామదాసు గురించి అనేక విషయాలు తెలుస్తాయి. కంచర్ల గోపన్న కుత్బ్ షాహీల కాలంలో, తాసీల్దారుగా, భద్రాచలం సమీపంలోని పాల్వంచలో పనిచేసేవాడు. రామ భక్తుడైనందున వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. నేలకొండపల్లి సమీపంలో నాయకులగూడెం అనే వూళ్లో రఘునాధ భట్టరు అనే వైష్ణవ స్వామి గోపన్నను వైష్ణవ మతంలో చేర్చాడు. అన్నమయ్య కూడా ఇలానే స్వీకరించాడని అంటారు. వైష్ణవ మతం స్వీకరించిన నాటి నుంచి ఆయన పేరు రామదాసుగా మారింది. ప్రభుత్వంలో కొలువు చేస్తూనే, తరచూ భద్రాచలం వెళ్తుండేవాడు. ఆవేశం కొద్దీ కీర్తనలు తానే రాసి పాడేవాడు. ఆయన తదనంతరం కొందరు పండితుల పుణ్యామా అని ఆయన కీర్తనలు ఏర్చి-కూర్చి కొన్ని సంకలనం చేయడం జరిగింది. రామదాసు గోల్కొండ మంత్రులైన అక్కన్న-మాదన్నలకు మేనల్లుడు. రాముడి మీద వున్న భక్తితో ప్రభుత్వ ధనంతో గుడి కట్టించారనీ, దానికి కోపగించిన అబుల్ హసన్ తానీషా ఆయనను జైలులో పెట్టించారనీ, స్వయంగా శ్రీరాముడే వచ్చి తానీషాకు కనిపించి రామదాసును విడుదల చేయించాడనీ అంటారు. దానికి తగిని ఆధారాలు కూడా వున్నాయి కాబట్టి నమ్మాలి.

భక్త రామదాసుకు సంస్కృతం, తెలుగు...రెండింటిలోనూ పాండిత్యం వుంది. రెండు భాషల్లోనూ కవిత్వం రాశారు. వీటిని శతక ప్రక్రియకు చెందిన "దాశరధి శతకం", నిబంధ పద రచనకు చెందిన "తెలుగు సంస్కృత కీర్తనలు", వృత్త పదానికి చెందిన "పాహిరామ ప్రభో" అనే  దీర్ఘ వృత్తం, అనిబంధ కవిత్వానికి చెందిన ఒక "సంస్కృత చూర్ణిక" శీర్షికలతో నాలుగు భాగాలుగా విభజించవచ్చని దాశరథుల బాలయ్య గారు రాసిన ఎంఫిల్ సిద్ధాంత వ్యాసంలో పేర్కొనడం జరిగింది. బహుళ ప్రచారం పొందిన 103 పద్యాల దాశరధి శతకంలో మకుటం "దాశరధీ కరుణాపయోనిధీ". ఇక "పాహిరామ ప్రభో" వృత్త పదం "పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో...పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో!" అంటూ ప్రారంభమై, "పాహిశ్రీరామ నీ పాద పద్మాశ్రయుడ....పాలింపుమా భద్రశైల రామప్రభో!" అంటూ ముగుస్తుంది. కీర్తనలలో "అదిగో భద్రాద్రీ గౌతమి", అబ్బబ్బ దెబ్బలకు తాళ లేరా", "ఇక్ష్వాకు వంశ తిలక ఇకనైన పలుకవె", "ఏ తీరుగ నను దయ జూచెదవో", "తక్కువేమి మనకు", "నను బ్రోవమని చెప్పవే", "పలుకే బంగారమాయెనా", "రామాచంద్రులు నాపై చలము చేసినారు-సీతమ్మ! చెప్పవమ్మా" లాంటివి అందరూ పాడుకునే అపురూప కీర్తనలు.

ఇదంతా గతం....ఇక వర్తమానానికి వస్తే....భక్త రామదాసును మరువలేని ఆయన పుట్టిన గ్రామస్తులు సుమారు  60 సంవత్సరాల క్రితం (1955-1961) నేలకొండపల్లిలో, రామదాసు నివసించిన స్థలంలో ఆనాటి గ్రామ సర్పంచ్ స్వర్గీయ పెండ్యాల సత్యనారాయణ రావు నేతృత్వం లో భక్తరామదాసు ధ్యాన మందిరం నిర్మించారు. రామదాసు వాడిన బావికుడా నేటికి ఆ స్థలంలోనే వుంది. అయితే, కారణాలు ఏవైనా, ఆ మందిరం చాలా కాలం ఖాళీగా వుండిపోయి, సామాజిక అవసరాలకు ఊపయోగించారు. దరిమిలా, పెండ్యాల సత్యనారాయణ రావు మరికొందరు గ్రామస్తులు కలిసి రామదాసు స్మారక కమిటిని ఏర్పాటు చేసి, 1974 సంవత్సరం నుంచి  భక్తరామదాసు స్మారక ఉత్సవాలను జరిపించ సాగారు. నాల్గవ వార్షికోత్సవం లో, అంటే 1977 వ సంవత్సరంలో, శ్రీ సీతారామ చంద్ర లక్ష్మణ స్వామి వారి శిలా విగ్రహాలను,  రామదాసు శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ధూప-దీప నైవేద్యాది కైంకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్ల తరువాత 1986 లో స్వర్గీయ భీకంసింగ్, స్వర్గీయ రావులపాటి రంగారావు, స్వర్గీయ గండికోట శేషభూషణ రావు, స్వర్గీయ గండికోట రాజేశ్వరరావు, పెండ్యాల రాంమోహన్ రావు, మరికొందరు భక్తులు కలిసి "శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం" అనే సంస్థను స్థాపించి, ఆరాదనోత్స్తవాలను, చేయడం ప్రారంభించారు. అదే సంస్థ ఈ నాటికీ మాఘశుద్ధ తదియ రోజున రామదాసు జయంతిని, వైశాఖ మాసం ప్రారంభంలో ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఆద్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

2000 సంవత్సరంలో నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో, నాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎ గిరిదర్, పోలీసు సూపరిండెంట్ పి సీతారామాంజనేయులు చొరవతో ద్యాన మందిరం ఆధునీకరించబడి, ప్రఖ్యాత సంగీత విద్యాంసులు స్వర్గీయ బాలమురలీకృష్ణ చేతులమీదుగా పునః ప్రారంబించబడింది. 2007 సంవత్సరంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్తానం దీన్ని దత్తత తీసుకొని నిర్వహిస్తున్నారు. ఒక అర్చకుని నియమించి జీతం, పడితరాన్ని ఇస్తూ నిత్య పూజలు, దూప, దీప, నైవేద్యాది కైంకర్యాలు జరిగేటట్లు చూస్తున్నారు. శ్రీరామనవమి, దసరా, ధనుర్మాస ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ జరగాల్సిన మోతాదులో జరగడం లేదని గ్రామస్తులంటున్నారు. ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయని వారి అభిప్రాయంగా అర్థమవుతోంది.


చేయాల్సిన పనులెన్నో వున్నాయని, నేలకొండపల్లి లోని భక్త రామదాసు ద్యాన మందిరాన్ని ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని, భక్తులను, పర్యాటకులను అక్కడికి వచ్చేట్లుగా చేయాలని, మందిరాన్ని పూర్తి స్థాయి దేవాలయంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లోగడ ఒకసారి రామాలయ నిర్మాణానికి ప్రయత్నం కూడా జరిగింది. ఈ విషయాన్ని కూలంకుషంగా పరిశీలన జరిపి పెద్దలు, పండితులు సలహా మేరకు తగు నిర్ణయం తీసుకోవాలంటున్నారు. సంగీత, సాహిత్య, భక్తి కార్యక్రమాల నిర్వహణకు అనుగుణంగా ఉండే అధునాతన సౌకర్యాలతో కూడిన సమావేశమందిరాన్ని నిర్మించాలనీ, అతిధులు, భక్తులు, కళాకారుల సౌకర్యం కోసం కొన్ని విశ్రాంతి గదులను నిర్మించాలని, ఒక చక్కని పార్కుని అభివృద్ధి చేసి, దీనిలో రామాయణ కథలకు, రామదాసు జీవిత విశేషాలకు సంబందించిన విగ్రహాలను ఏర్పాటు చేయాలని, ప్రముఖ చిత్రకారులతో రామదాసు జీవిత విశేషాలను, కొన్ని కీర్తనలకు అనుగుణంగా వుండే చిత్రాలను వేయించి ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనీ గ్రామస్తుల అభిప్రాయం. రామదాసు కీర్తనలను, దాశరథి శతక పద్యాలనూ శిలఫలకాలపై చెక్కించి సమావేశ మందిరపు గోడలకు అతికింప చేస్తే బాగుంటుంది కూడా. వివిధ గ్రంథాలయాలలో నిక్షిప్తమై వున్న రామదాసు సాహిత్యాన్ని, గ్రంథాలను వ్యాసాలను సేకరించి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ గ్రంథాలయం పాఠకులకు పరిశోధకులకు ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం చేస్తున్నట్లే, ప్రతి సంవత్సరం మాఘశుద్ద తధియ రోజు నుండి మూడు రోజులు రామదాసు జయంతి ఉత్సవాలు, వైశాఖ మాస ప్రారంభంలో మూడు రోజుల రామదాసు ఆరాధనోత్సవాలు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా ఇప్పుడు నిర్వహిస్తున్నట్లే నిర్వహించాలి. తద్వారా రామదాసు గారికి తగిన నివాళి అర్పించినట్లు అవుతుంది.

రామదాసు కీర్తనలను భజన మండపంలో పాడేవారిని గుర్తించి వారిని ప్రోత్సహించాలి. సంగీత విద్వాంసులు, సంగీతాభిమానులతో కొన్ని బృందాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాలలో రామదాసు కీర్తనలను ప్రచారం చేయాలి. దేవాలయాల్లో, సాంప్రదాయ ఉత్సవాలలో రామదాసు కీర్తనలని అలపించేట్లుగా చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఏ విధంగానైతే అన్నమయ్యకు విశేష ప్రాధాన్యాన్ని కలిగిస్తున్నారో, ఏ విధంగా నైతే తమిళ ప్రజలు సంగీత విద్యాంసుడు త్యాగరాజుకు బ్రహ్మ రథం పడుతున్నారో, అలాగే తెలంగాణ ప్రజలు రామదాసుకు తగిన గుర్తింపు ఇస్తే గ్రామస్తులు ప్రధానంగా సంతోషిస్తారు. నేలకొండపల్లి లోని శ్రీ భక్త రామదాస ద్యాన మందిరాన్ని, బౌద్ధ స్థూపాన్ని కలిపి ఒక మంచి పర్యాటక స్థలంగా, ఆద్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతే మరీ మంచిది.

ధ్యాన మందిరాన్ని రెండు సంవత్సరాల క్రితం దర్శించి, గ్రామస్తుల ఆలోచనలను అర్థం చేసుకున్న మాజీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రతి సంవత్సరం రామదాసు జయంతి ఉత్సవాలను మూడు రోజులపాటు అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, భద్రాచలం దేవస్థానం, శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఖర్చుతో చేయించిన భక్త రామదాసు శిలా విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది రెండేళ్ళ క్రితం. రామదాసు నవరత్న కీర్తనల గోష్టి గానం, సంగీత విభావరి, భజనలు, కోలాటాలు, పేరిణి నృత్య రూపకం లాంటి పలు కార్యక్రమాలు జరుగుతాయి. అచిరకాలంలోనే గ్రామస్తులు కోరుకుంటున్న స్థాయిలో రామదాసు ధ్యాన మందిరం రూపుదిద్దుకుంటుందని ఆశించవచ్చు.

ముఖ్యమంత్రి ప్రత్యేక భివృద్ధి నిధి నుండి రామదాసు ధ్యాన మందిరాన్ని ఆధునీకరించడానికి, ఇతర కార్యక్రమాలు చేపట్టడానికి రు. 3 కోట్లు మంజూరు చేసారు సీఎం కేసీఆర్. నిధులు విడుదల కూడా అయ్యాయి. ఆధునీకరించడానికి అవసరమైన డిజైన్లను రూపొందించడం కూడా జరిగింది. ఆద్యతన భవిష్యత్ లొ నేలకొండపల్లి లోని రామదాసు ధ్యాన మందిరం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపు దిద్దుకోవడం చూడబోతున్నాం.

Tuesday, February 5, 2019

ఆర్ధిక సంఘం పనితీరు మారేనా? : వనం జ్వాలా నరసింహారావు


ఆర్ధిక సంఘం పనితీరు మారేనా?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (06-02-2019)
ఏప్రియల్ 1, 2020 నుండి మార్చ్ నెల 31, 2025 వరకు అమలుకానున్న సిఫార్సులను రూపొందించే 15 వ భారత ఆర్ధిక సంఘం (ఫైనాన్సు కమీషన్) ముఖ్యమంత్రితోను, ప్రభుత్వ ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతోనూ చర్చించేందుకు, దరిమిలా రాష్ట్రావసరాలకు అనుగుణంగా రాష్ట్ర వాటాకింద చెందాల్సిన నిధుల పంపిణీ నిర్ణయించేందుకు, రాష్ట్రానికి రానున్నది. 1971 లో మొట్టమొదటిసారిగా ఆర్ధిక సంఘం ఏర్పాటు అయినప్పటినుంచీ సంఘ సభ్యులు ఇలా రాష్ట్రాలకు రావడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో వారు జరిపిన చర్చల ఆధారంగా ఎంత మేరకు రాష్ట్రాల అవసరాలు తీరడానికి దోహద పడుతున్నాయో అనే అంశం జవాబులేని ప్రశ్నగానే మిగులుతుంది. భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఫైనాన్స్ కమీషన్ పాత్ర అత్యంత చాలా కీలకమైంది. 2020 ఆర్ధిక సంవత్సరం నుండి, రాబోయే ఐదేళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక ప్రణాళికలను గణనీయంగా ప్రభావితం చేయగలిగే శక్తి కమీషన్ చేసే సిఫార్సులకు ఉంటుంది.   

రాష్ట్రాల పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కానీ, ముఖ్యమంత్రితో కానీ చర్చలు ఏదో ఒక సాధారణ వ్యవహారంగా కాకుండా ఒక నిర్దుష్టమైన లక్ష్యం కొరకు, భారత ఆర్ధిక వ్యవస్థ పరపతిని దృష్టిలో వుంచుకుని చేసేవిధంగా ఆర్ధిక సంఘం శైలిలో పరివర్తన, సంస్కరణ రావాల్సిన ఆవసరం ఎంతైనా వుంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గత 70 సంవత్సరాలలో కేంద్ర-రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ, ఆర్ధిక సంఘం ఆలోచనాధోరణి-విధానంలో గుణాత్మక మార్పు ఆశించినంత స్థాయిలో కనిపించలేదు. ఈ విషయంలో ఆర్ధిక సంఘం తనను తాను పరిశీలించుకుని, ఆత్మశోధన చేసుకుంటే మంచిదేమో. కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వాల విధానాల వల్ల అసంతృప్తి చెందిన ప్రజలు ఆందోళన చెంది, ప్రత్యామ్నాయలకోరకు అన్వేషిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న రెండే-రెండు పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దేశాభివృద్ధిలో ఘోరంగా విఫలమయ్యాయి. జాతిని తిరోగమన దిశగా తీసుకెళ్లాయి. అందులో ఆర్ధిక సంఘం పాత్ర కూడా అంతో-ఇంతో ఉందనాలి.

భారత దేశ విస్తృత ఆర్ధిక విధానం మొత్తం కేంద్ర ప్రభుత్వంతో వుంటుంది.  ఏ నిధులనైతే, పన్నులనైతే కేంద్రం విధిగా రాష్ట్రాలకు పంపిణీ చేయాలో, చేయాల్సిన ఆగత్యం వుందో, ఆ పని చేయకుండా వాటిని కేంద్రీకరించి తమ గుప్పిట్లో పెట్టుకున్నది. నీతీ అయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల ఎదుగుదలను కేంద్రం అడ్డుకోకూడదు. రాష్ట్రాల అభివృద్ధితోనే, దేశాభివృద్ధి వుందని భావించాలి కేంద్రం. అభివృద్ధిచెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలికాని నిరుత్సాహపరచడం ఆరోగ్యకరమైన అభ్యాసం కాదు. పేద రాష్ట్రాలను ఒకవైపు ఆదుకుంటూనే, దేశానికి గరిష్ట ఆదాయం సమకూరుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధానం వుండడం మంచిది.

తలసరి ఆదాయం ఎక్కువున్న రాష్ట్రాలను ధనిక రాష్ట్రాల జాబితాలో వేసి  పన్నుల్లో వాటాను తగ్గిస్తున్నారు. ఆదాయం తక్కువున్న రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతున్నాయి. ఉదాహరణకు మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణకు 2.4375 శాతం మేర పన్నుల్లో వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం నిర్ణయించింది. లోటు బడ్జెట్ కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4.305 శాతం మేర వాటా లభిస్తున్నది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.18,560 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్ కు రూ.32,787 కోట్లు లభించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ వ్యత్యాసం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి రూ.20,583 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.36,360 కోట్లు రానున్నాయి. దేశానికి అత్యధిక ఆదాయం సమకూర్చే ఐదారు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో తగిన వాటా దక్కడం లేదు.


కొద్దిపాటి నిధుల విషయంలో కూడా కేంద్రం అనేకరకాల నిబంధనలు విధిస్తున్నది. ఇది మంచిపద్ధతి కాదు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్ధిక సంబంధాలు వుండాల్సిన రీతిలో, ఫెడరల స్ఫూర్తికి అనుగుణంగా లేవు. రాష్ట్రాల వాటాగా రావాల్సిన కేంద్ర నిధుల పంపిణీ, రాష్ట్రాలను అగౌరవ పరిచే విధంగా ఉన్నాయికాని వాళ్ల మాటకు విలువ ఇస్తున్నట్లు లేదు.

ముందస్తుగానే ఒక అవగాహనకొచ్చి, తమ ఆలోచనాధోరణికి అనుగుణంగా ఆర్ధిక సంఘం రాష్ట్రాల పర్యటనకు రావడమనే విధానంలో సహితం మార్పు రావాలి. ఈ విధానంలో సంస్కరణలు రావాలి. రాష్ట్రాలకు వచ్చి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తరువాత రూపొందించాల్సిన సూచనలకు సంబంధించి ముందుగానే ఒక నిర్ణయానికి రాకూడదు. కేవలం సిఫార్సులు చేయడాని మాత్రమే పరిమితం కాకుండా, విధాన నిర్ణయాత్మక వ్యవస్థగా ఆర్ధిక సంఘం రూపుదిద్దుకుంటే ఫలితం ఎక్కువగా వుంటుంది. రాష్ట్రాల వాటా కింద చెందాల్సిన నిధుల పంపిణీ విషయంలో రాష్ట్రాలకు పూర్తి హక్కు వుంది. రాష్ట్రాల అవసరాల విషయంలో గణనీయంగా వైవిధ్యం కొట్టవచ్చినట్లు కనపడుతుంది.

ఐదేళ్లకొకసారి నియమించబడే భారత ఆర్ధిక సంఘాన్ని రాజ్యాంగంలోని 280 ప్రకరణం కింద మొట్టమొదటిసారి నవంబర్ 22, 1951న భారత రాష్ట్రపతి ఏర్పాటుచేశారు. ఒక చైర్మన్, నలుగురు సభ్యులుండే కమీషన్ ప్రాధమిక బాధ్యత కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, రాష్ట్రాల-రాష్ట్రాల మధ్య కేటాయింపుల విషయంలో రాష్ట్రపతికి సిఫార్సులు చేయడమే. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఎలాంటి ఆర్ధిక సంబంధాలు, లావాదేవీలు ఉండాలో నిర్వచించే పరిధి కూడా ఆర్ధిక సంఘానిదే. ప్రణాలికేతర సంబంధమైన ఆర్ధిక వనరుల పంపిణీ, కేటాయింపులు కూడా ఆర్ధిక సంఘం బాధ్యతే. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సులను పార్లమెంట్ ఉభయ సభలకు రాష్ట్రపతి సమపర్పిస్తారు.

భారత దేశ ఏకీకృత నిధి నుండి రాష్ట్రాల రెవెన్యూ ఆదాయానికి కావాల్సిన నిధుల మంజూరు విధి-విధానాలను నిర్ణయించేది కూడా ఆర్ధిక సంఘమే. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆదాయపు పన్ను విభజన విధానం కూడా ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. రాష్ట్ర ఆర్ధిక సంఘాల సిఫార్సుల మేరకు సంబంధిత రాష్ట్రాల పంచాయితీలకు, మునిసిపాలిటీలకు అందుబాటులో వున్న ఆదాయవనరులను పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో కూడా ఫైనాన్స్ కమీషన్ రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తుంది.

కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆర్ధిక సంబంధ-బాంధవ్యాల మీదనే ఆర్ధిక సంఘం తన సంపూర్ణ దృష్టిని సారించాలి. తదనుగుణంగానే దాని సిఫార్సులుండాలి. ఆదాయపు పన్ను వసూళ్ల రాబడిలో రాష్ట్రాల వాటా ప్రగతిశీల పెరుగుదల దిశగా వుండేట్లు కమీషన్ సిఫార్సులుండాలి. రాష్ట్రాలకు కేంద్ర ఇచ్చే గ్రాంట్స్-ఇన్-ఎయిడ్స్ మొత్తాలు కూడా క్రమేపీ పెరుగుతుండే విధంగా కమీషన్ సిఫార్సు చేయాలి. అసలు-సిసలైన సహకార సమాఖ్య వర్ధిల్లదానికి, రాష్ట్రాల ఆర్ధిక స్వయంప్రతిపత్తి పటిష్టంగా వుండడానికి పైన పేర్కొన్న చర్యలన్నీ సజావుగా చేపట్టాలి. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆర్ధిక సంబంధాలు బలపడేరీతిలో, ఇరువురి మధ్య విత్తసంబంధమైన విభేదం లేకుండా, వనరుల పంపకానికి రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకరణలకు అదనంగా, ఆర్ధిక సంఘం ఒక సంస్థాగత కార్యాచరణతో పనిచేయాల్సిన అవసరం వుంది.

మొదటి ఆర్ధిక సంఘం ఏర్పాటైన తరువాత దాని పనితీరులో, ఆలోచనా విధానంలో, శైలిలో ఎన్నో మార్పులు-చేర్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికి 15 ఫైనాన్స్ కమీషన్లను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే నవంబర్ 2017 లో మాజీ ప్రణాలికా సంఘం సభ్యుడు, పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ఎన్ కే సింగ్ చైర్మన్ గా 15 వ ఆర్ధిక సంఘం ఏర్పాటైంది. పటిష్టమైన విట్ట నిర్వహణకు ఒక సరైన ఆర్ధిక స్థిరీకరణ రోడ్ మాప్; కేంద్ర-రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతుల మీద జీ ఎస్ టీ ప్రభావం; రాష్ట్రాల రెవెన్యూ లోటు పూడ్చడానికి నిధుల మంజూరు అవసరం విషయంలో సమీక్ష; 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు ఇస్తున్న పన్నుల వాటాలో పెంపుదల విషయంలో సమీక్ష; రాష్ట్రాలు చేసే అప్పులకు సంబంధించి వున్నా నిబంధనల సడలింపుపై సమీక్ష; రాష్ట్రాల పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలివ్వడం లాంటివి ఆర్ధిక సంఘం చేయాల్సిన సిఫార్సుల్లో వున్నాయి.

మొదటి ఆర్ధిక సంఘం ఏర్పాటైనప్పటి నుండి ఇటీవలి 15 వ ఆర్ధిక సంఘం వరకూ సంఘాల అధ్యక్షులుగా నియమించిన చైర్మన్లలో సగం మందికి పైగా కేంద్రంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీకి చెందినవారే కావడం విశేషం. వారిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కేసీ నియోగి, తమిళ నాడుకు చెందిన కె సంతానం, తమిళనాడుకు చెందిన (మాజీ జడ్జ్ అయినప్పటికీ) పీవీ రాజమన్నార్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, మహారాష్ట్రకు చెందిన వైబీ చవాన్, మహారాష్ట్రకు చెందిన ఎన్కేపీ సాల్వే, ఉత్తరాఖండ్ కు చెందిన కేసీ పంత్ వున్నారు. ఇటీవలి 15 వ ఆర్ధిక సంఘం చైర్మన్ గా నియమించబడ్డ ఎన్ కె సింగ్ మాజీ ఐఏఎస్ అధికారిగా కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయన కూడా బీజేపీకి చెందిన రాజకీయ వేత్తే.

అలాంటప్పుడు అలా నియమించబడ్డ రాజకీయ వేత్తలు అవునన్నా-కాదన్నా అధికార పార్టీకి అనుకూలంగానే సూచనలు, సిఫార్సులు చేసే అవకాశం మెండుగా వుంది. అలాంటి భావనకు తావు లేకుండా 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సులుంతె అంతకంటే కావాల్సింది లేదు. అందుకే, ఆర్ధిక సంఘం పనితీరులో పరివర్తన, సంస్కరణ రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ దిశగా 15 వ ఆర్ధిక సంఘం ఆలోచిస్తుందనీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరక్కుండా చూస్తుందనీ ఆశించూదాం.

Saturday, February 2, 2019

శ్రీరాముడితో తను పడ్డ కష్టాలు రావణుడికి చెప్పిన మారీచుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-46: వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడితో తను పడ్డ కష్టాలు రావణుడికి చెప్పిన మారీచుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-46
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (03-02-2019) 
         శ్రీరాముడి బలపరాక్రమాలను వివరంగా, విడమర్చి చెప్పిన మారీచుడు, అంతటితో ఆగకుండా, శ్రీరాముడితో తాను పడ్డ పాట్లు చెప్పాడు రావణుడితో ఈ విధంగా.

“దశగ్రీవా! విను. నేను వెయ్యేనుగుల విస్తారమైన బలంతో, పర్వతంలాంటి ఎత్తైన ఆకారంతో, మంచి దేహకాంతితో, అపరంజి బంగారు కుండలాలతో, గదచేతబట్టుకుంటే నన్ను చూసి భూతాలన్నీ భయంతో వ్యాకులపడేవి. అప్పుడు నేను మునుల మాంసం తింటూ భూప్రదేశమంతా తిరుగుతుంటే విశ్వామిత్రుడు భయపడి దశరథ మహారాజు దగ్గరకు పోయాడు. మారీచుడివల్ల తనకు భయం వుందనీ, తన యజ్ఞాన్ని కాపాడడం కోసం రామభద్రుడిని తన వెంట పంపమనీ అడిగాడు. రాముడు పసిబాలుడనీ, పన్నెండేళ్ల వాడనీ, అస్త్రవిద్యల్లో ఇంకా నేర్పరి కాదనీ, కాబట్టి సైన్యంతో వచ్చి ఆ రాక్షసులను తానే చంపి విశ్వామిత్రుడికి సంతోషం కలిగిస్తాననీ దశరథుడు మునికి చెప్పాడు. దశరథుడి మాటలకు జవాబుగా, ఆ రాక్షసుడిని ఎదిరించగలవాడు రాముడు తప్ప మరెవరూ లేరని, శ్రీరాముడిని తీసుకుపోతాననీ విశ్వామిత్రుడు చెప్పాడు. శ్రీరాముడు పిల్లవాడైనా రాక్షసులను చంపడానికి సమర్ధుడనీ, అధికమైన తేజస్సు కలవాడనీ, రామచంద్రుడిని తన వెంట పంపితే దశరథుడికి మేలు జరుగుతుందనీ అంటాడు ముని. ఇలా చెప్పి రామచంద్రమూర్తిని తన వెంట తీసుకుని సంతోషంగా దండక లోని తన ఆశ్రమానికి పోయి, అక్కడ యజ్ఞం చేయసాగాడు”.

“శ్రీరాముడు అప్పుడు బ్రహ్మచారి. ఒంటి వస్త్రం మొలకు చుట్టుకుని, ఉదయం వేళ తామరకొలనులో స్నానమాడి, విశాలమైన రేకుల్లాంటి కళ్ళతో, పులిగోళ్ళ బంగారుతీగ మెడలో వేలాడుతుంటే, మీసకట్టు కూడా లేకుండా, విల్లు మోగిస్తుంటే, అడవి మొత్తం తన దేహకాంతితో శ్యామారుణంగా, సౌమ్యంగా, ఉదయించే బాల చంద్రుడిలాగా ప్రకాశిస్తూ తిరుగుతున్నప్పుడు విసవిసా నేనక్కడికి వచ్చాను. వస్తున్న నన్ను చూసి, కొంచెమైనా తత్తరపాటు లేక విల్లెక్కిపెట్టి నిలిచి వున్నప్పుడు, పసిబాలుడు...వీడితో ఏంపని అని అలక్ష్య భావంతో, విశ్వామిత్రుడు హోమం చేసే వేది దగ్గరకు పోయాను. రాముడు నన్ను ఒకే ఒక్క తీవ్రమైన బాణంతో నూరామడ దూరంలో వున్న సముద్రంలో పడేట్లు చిమ్మాడు. చంపకుండా నన్ను ప్రాణాలతో వదిలిన కారణాన మూర్ఛపోయి, సముద్రంలో పది ఎంతో సేపతికి స్మృతి వస్తే, గర్వం పోయి, లంకకు పోయాను. పసివాడు, అస్త్ర విద్య తెలియనివాడు, ముగ్దుడైన వాడే నన్నిలా బాధించాడు. సైన్యమంతా ధ్వంసం చేసాడు. ఇప్పుడాయన మంచి వయసులో వున్నాడు. నువ్వు కనుక యుద్ధానికి దండెత్తితే కలగబోయే ఫలితం నేను చెప్పాలా? అనుభవించి నువ్వే తెలసుకుంటావు”.
“ఈ కారణం వల్ల రామచంద్రుడిని నువ్వు యుద్ధంలో ఎదిరించడం తగిన పనికాదని భావించి నీ ప్రయత్నానికి అడ్డు తగులుతున్నాను. రామచంద్రుడితో విరోధిస్తే అది వూరికే పోదు. రాక్షస సమూహానికి నువ్వే గొప్ప విపత్తు కలిగించిన వాడివి అవుతావు. నిజం...రావణా! నా మాట నమ్ము. నీ రాక్షసులకు నువ్వే ముప్పు కలిగించవద్దు. బంగారు హర్మ్యాలు, సుందరమైన రాజగృహాలు కల లంకను సీతాదేవికొరకు పాడైపోయే ఆలోచన చేస్తున్నావు. సత్పురుషుడు తానేపాపం చేయకుండా శుద్ధవర్తనుడై వున్నా, పాపులతో సహవాసం చేస్తే, వారి పాపాలకు తానుకూడా చెడిపోతాడు. ఎలా అంటావా? పాములున్న మడుగులో చేపలు ఎవరికీ ఏ ఆపదా కలిగించకుండా ఉన్నప్పటికీ, వాటితో వున్నా కారణాన, వాటిని చంపడానికి వచ్చిన వాళ్ల చేతిలోనో, లేక, గరుత్మంతుడి చేతిలోనో అవీ చస్తాయి. ఆ విధంగా నువ్వు పాపం చేసి, నువ్వు చెడడం కాకుండా, హాయిగా నిర్విచారంగా ఎ దోషం లేకుండా సుఖం అనుభవించే వారిని కూడా నాశనం చేయాలనుకుంటున్నావు”.

“యుద్ధ ముఖంలో రామచంద్రుడి చేతిలో చావగా మిగిలిన రాక్షసులు తమ భార్యలను తమ వెంట తీసుకునో, లేక, వదిలిపెట్టో, దిక్కుల వెంట రక్షించేవాడు లేక పరుగెడుతుంటే లంకలోని ఇళ్లన్నీ బాణ సమూహాలనే అగ్ని జ్వాలలలో కాలి బూడిదైపోవడం నువ్వే కళ్లారా చూస్తావు. ఇతరుల భార్యలను మోహించడం కంటే గొప్ప పాపం వేరేదైనా వుందా? నువ్వు భార్య లేనివాడివి కాదు. పదివేల మంది వయసులో వున్న వారు నీకు భార్యలుగా వున్నారు. వాళ్లతో నీ ఇష్టం వచ్చినట్లు సుఖపడవచ్చుకదా? ఆపదతో కూడిన సీతా సాంగత్యం ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వే ఆలోచించు. ఈ పని వల్ల నువ్వు ఉభయ లోకాల్లో చెడిపోతావు. నీ భార్యలతో నువ్వు యధేచ్చగా అనుభవించు. నీ వంశాన్ని రక్షించుకో. అందగత్తెలైన నీ భార్యలతో, ప్రేమించే స్నేహితులతో ఇంకా దీర్ఘకాలం సుఖపడాలనే కోరిక వుంటే, రామచంద్రుడికి కీడు తలపెట్టవద్దు. స్పష్టంగా చెప్తున్నా. ఇది రహస్యం కాదు. రావణా! సీతాదేవిని నువ్వు అపహరించవద్దు. నేను ఈ మాట నీ మీద ప్రేమతో, నీ క్షేమం కోరి, చెప్తున్నాను. నా ఆమాట వినకుండా బలాత్కారంగా సీతను అపహరించావా....బంధువులతో, స్నేహితులతో, యుద్ధంలో రాముడి చేతిలో చస్తావు”.

Friday, February 1, 2019

సహస్ర మహా చండీయాగం...మానవ సృష్టే యజ్ఞసహితం : వనం జ్వాలా నరసింహారావు



సహస్ర మహా చండీయాగం...మానవ సృష్టే యజ్ఞసహితం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య, నమస్తే తెలంగాణ దినపత్రికలు (01-02-2019)
లోక కళ్యాణానికి, విశ్వ శ్రేయస్సుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఐదురోజులపాటు (జనవరి 21 నుండి జనవరి 25 వరకు) మహావైభవోపేతంగా మహారుద్ర సహిత సహస్ర మహా చండీయాగం ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఈ యాగంతో రాష్ర్టానికి, లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. సీఎం చంద్రశేఖర్‌రావు చేసిన రీతిలో, ఇంతవరకూ హిందూ వాదులమని చెప్పుకున్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ యాగం చేయలేదు. యజ్ఞ యాగాదులు, క్రతువులు చేస్తే మంచి జరుగుతుందనే భావనతోనే సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు అందరూ సుఖంగా ఉండాలనేదే ఈ క్రతువు ముఖ్య ఉద్దేశం.

జగన్మాత చండికా పరమేశ్వరి ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా అలరారుతుంది. దుర్భిక్షం, దుఃఖం అనేవి అ దరిదాపులకు కూడా రావు. అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవు. “కలౌ చండీ వినాయకౌ” అనేది ఆర్ష వాక్యం. అంటే చండీ వినాయకుల ఉపాసన కలియుగంలో విశేష ఫలప్రదం అని అర్థం. చండీమాత సకల దేవతా స్వరూపిణి. ఆమె అమ్మలగన్నయమ్మ. సృష్టి చక్రానికి కారణమయ్యే బ్రాహ్మిగా, సుఖ సంపదలతో చల్లగా కాపాడే వైష్ణవిగా, సకల సౌభాగ్య మంగళాలను ప్రసాదించే శాంకరిగా ఆ జగజ్జనని వేదాది వాజ్ఞయంలో స్తుతింపబడింది. ఆ చల్లని తల్లిని ప్రసన్నం చేసుకుని, సకల జనపదాలకు, పట్టణాలకూ, జిల్లాలకూ, రాష్టానికీ, దేశానికీ, ప్రపంచానికీ, సుఖ శాంతులు, ఆయురారోగ్య భాగ్యాలనూ ఆకాంక్షిస్తూ తలపెట్టిన పవిత్ర కార్యమే సహస్ర మహా చండీయాగం. ఈ అమోఘ మహాయాగానికి అనాదిగా విశేష ప్రాచుర్యం ఉంది. సమస్త ప్రాణులు సుఖ సంతోషాలతో శాంతియుత జీవనం సాగించాలనే సత్సంకల్పంతో ఈ మహాయాగాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జయప్రదంగా నిర్వహించారు.

మార్కండేయ పురాణంలోని సప్తశతీ అనే స్తవాన్ని పఠించడం ద్వారా సకల సౌఖ్యాలూ కలుగుతాయి. ఈ మహాయాగం శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి వార్ల పవిత్ర మార్గదర్శనంలో వేయి పర్యాయాలు చండీ సప్తశతీ పారాయణము, కొనసాగి అపూర్వ ఫలాలను అందిస్తుందని సకల శాస్తాల ఉపదేశం. సకల జనుల సౌభాగ్యాన్నీ, సుఖ శాంతులనూ, అభ్యుదయ పరంపరలను, సువృష్టినీ, సస్య సమృద్ధినీ, జనహితాన్నీ కాంక్షిస్తూ చేసిన ఈ మహాపుణ్య యాగానికి పలువురు ప్రముఖులు హాగారయ్యారు.

చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత చండీ యాగం, లక్ష చండీ యాగం అని వేర్వేరు విధాలైన యాగాలున్నాయి. ఇవన్నీ కూడా మహా కాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి, అమ్మవార్లందరికీ కలిపి నిర్వహించేవి.

సహస్ర చండీ యాగం ఐదు రోజులు చేసే యాగం. వందమంది రుత్విక్కులుంటారు. మొదటి రోజు 100 సప్తశతి పారాయణాలు, రెండవ రోజు 200 సప్తశతి పారాయణాలు, మూడవ రోజు 300 సప్తశతి పారాయణాలు, నాలుగవ రోజు 400 సప్తశతి పారాయణాలు చేస్తారు. అంటే మొత్తం వెయ్యి పారాయణాలు చేస్తారు. ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజూ నవావరణ పూజ, చతష్షష్టీ యోగినీ దేవతల పూజ, దీప సహిత బలి, కల్పోక్త పూజతో పాటు కుంకుమార్చన కూడా చేస్తారు. ఇవికాక అవధారలు చేస్తారు. ఐదవ రోజు అగ్ని ప్రతిష్ట చేసి అమ్మ వారికి పరమాన్న ద్రవ్యంతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు జరిపి అవభృతం చేస్తారు. తరువాత యాగ సమాప్తి చేస్తారు. ప్రతి రోజు ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అధర్వణ వేదము, శుక్ల యజుర్వేదము పారాయణాలు హవనాదులు, సుందరాకాండ, విరాటపర్వ, మహా సౌర పారాయణాలు జరుగుతాయి.

శ్రీ సహస్ర మహా చండీయాగం జనవరి 21, సోమవారం ఉదయం వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం, ఋత్విక్ వర్ణం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షిణ, గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ నిర్వహించి రాజశ్యామల యాగం ప్రారంభించారు. సుమారు 300 మంది ఋత్విజులు  దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1000 మోదాకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు. ఇలా ఇది ఐదురోజులూ కొనసాగింది.

చివరి రోజు (ఐదవ రోజు) అప్పటివరకు చేసిన పారాయణాలు, జపాలకు తద్దశాంశ హోమ తర్పణాలను నిర్వహించారు. అమ్మవారికి షోడశోపచార పూజ, చతుషష్టి యోగినీ బలి, మంగళ నీరాజన సేవ నిర్వహించారు. అగ్నిమథనం ద్వారా అగ్నిప్రతిష్ఠ చేసి పది కుండాల వద్ద ఇదే అగ్నితో హోమం ఆరంభించారు. పది యజ్ఞ కుండాలలో ఒక్కో యజ్ఞకుండం వద్ద ఆచార్య బ్రహ్మతో కలిపి పదకొండు మంది వేద పండితులు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని ఆహుతులిస్తూ హోమాన్ని నిర్వహించారు. అష్టదిక్పాలక బలి, ప్రాయశ్చిత్త హోమాలను నిర్వహించారు. 700 సప్తశతి (చండీ) శ్లోకాల స్వాహాకారాలకు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని యజ్ఞభగవానుడికి హవిస్సుగా సమర్పించారు. మహాపూర్ణాహుతిలో భాగంగా చండీయాగ మంటపంలోని అన్ని యజ్ఞకుండాల అగ్నిని ప్రధాన యజ్ఞ కుండంలోకి తీసుకువచ్చి మహాపూర్ణాహుతిని ఆరంభించారు.

యజ్ఞ ఆచార్యుడు మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, ఖర్జూర, వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జీడిపప్పు, పటికబెల్లం, బాదం, పచ్చకర్పూరం, గంధకచూరాలు, పూలు, పండ్లు, తమలపాకులు, పట్టుచీర, మారేడుకాయలు తదితరాలను పూర్ణాహుతిలో భాగంగా యజ్ఞభగవానుడికి సమర్పించారు. తరువాత వసోర్ధార, అంటే నెయ్యిని ధారగా పూర్ణాహుతి అనంతరం యజ్ఞభగవానుడికి సమర్పించే పక్రియ సాగింది. ఇదేవిధంగా మహారుద్ర, రాజశ్యామల, బగళాముఖి, చతుర్వేద, నవగ్రహ యాగ మంటపాల్లో కూడా షోడశోపచార పూజలు చేసి, హోమాల అనంతరం పూర్ణాహుతిని నిర్వహించారు. మహామంగళహారతి, సువాసిని పూజ, మహదాశీర్వచనం, ఋత్విక్‌ సన్మానం నిర్వహించారు.

అనాదిగా, సృష్టి ఆరంభం నుంచీ, మనిషి అనే వాడు, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, రకరకాల ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, నమ్మకాలను అనుసరిస్తూ రావడం జగమెరిగిన సత్యం. శ్రీరాముడే దేవుడని నమ్మేవాళ్లున్నారు, కాదు శ్రీకృష్ణుడే అనేవాళ్లున్నారు. వారిద్దరూ కాదు పరమశివుడని మరికొందరంటారు. క్రమేపీ అనేక మతాలు, విధానాలు ఆచరణలోకి రావడంతో మనిషి కూడా మార్పులకు చేర్పులకు లోనవుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాలను, ఆచారవ్యవహారాలను పాటించే వారు కొందరైతే, ఆస్తికత్వం నుంచి నాస్తికత్వం వరకూ మారిన వారు మరికొందరున్నారు.

ఇంతకీ ఎవరి నమ్మకం వాళ్లది. తమ నమ్మకమే గొప్పదనీ, ఇతరుల నమ్మకాలు తప్పనీ వాదించే ప్రయత్నం మంచిది కాదు. నమ్మకం విషయానికొస్తే యాగాలు-యజ్ఞాలు చేయడం కొందరికి అదో నమ్మకం. వాటివల్ల లోక శాంతి, ప్రజా ప్రయోజనం వుంటుందని భావించడం కూడా ఒక నమ్మకమే. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. భారతదేశంలోను, అనేక ప్రపంచ దేశాలలోను, అనేక మతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఆచరణలో వున్నాయి. చైనా లాంటి  కమ్యూనిస్ట్ దేశాలలో కూడా ఇప్పటికీ మావోకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం బుద్ధుడికీ ఇస్తున్నారు. కంబోడియాలో ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన అంగ్కార్ వాట్ దేవాలయం వుంది. బాంకాక్ లో రహదారుల పేర్లన్నీ రామ అక్షరంతో మొదలవుతాయి. ఎవరి నమ్మకం వాళ్లది.

యజ్ఞయాగాదులనేవి ఈనాటివి కావు. మన భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలతో పెనవేసుకునిపోయాయవి. విదేశాలలో కూడా ప్రాచుర్యం పొందిన మన వేదాలలో యజ్ఞాలు ప్రతిపాదించబడ్డాయి. యజ్ఞయాగాదుల విధి-విధానాల గురించి వివరంగా చెప్పడం కూడా జరిగింది. మానవాళిని అహర్నిశలూ రక్షించేవి కూడా యజ్ఞ ఫలాలే. మానవ జాతి జీవన విధానం ఆరంభానికి కారణం కూడా యజ్ఞ యాగాలే. మానవ జాతి సృష్టే యజ్ఞ సహితంగా జరిగిందంటారు. యజ్ఞం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. జగత్ కళ్యాణానికి కారణం కూడా యజ్ఞయాగాదులే. దేవతార్చనతోనే హిందూ జీవన విధానం ముడిపడి వుంది. మానవ జీవితాన్ని ఫలవంతం చేసుకునేందుకు, తనను తాను సంస్కరించుకుని, ఆత్మోన్నతిని పొంది విశ్వ శ్రేయస్సుకు పాటుపడేందుకు యజ్ఞయాగాదులు చేయాలని పూర్వకాలం నాటి మహాఋషులు చెప్పారు. జీవుడు తల్లి గర్భంలో చేరినది మొదలుకుని, భూమిమీద అడుగుపెట్టినప్పటినుంచి, వివిధ సంస్కారాలతో సంస్కరించబడాలని వైదిక సాంప్రదాయాలు ఘోషిస్తున్నాయి. అలా సంస్కరించబడడానికి అమూల్యమైన ప్రక్రియ యాగాలు, యజ్ఞాలు చేయడం, చేయించడం. యజ్ఞాలు మహత్వ పూర్ణాలు, అవశ్యం ఆచరణీయాలు. పూర్వకాలంలో మాదిరిగానే ఈ నాటికీ సాధన, సంపద, నిబద్ధత, సంస్కారం, పూర్వ జన్మ పుణ్యం, నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన కలవారు, యజ్ఞ యాగాలు చేస్తూనే వున్నారు. అలాంటివాటిలో రుద్ర యాగాలు, సూర్య యాగాలు, గణేశ యాగాలు, చండీ యాగాలు, శాంతి యాగాలు లాంటివి బహుళ ప్రచారంలో వున్నాయి.

రాచరికం పోయి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ, పాలకులు, ప్రజలు అనే పద్ధతి మాత్రం ఇంకా ఎదో ఒకరూపంలో కొనసాగుతూనే వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వారు ప్రజల సంక్షేమ, అభివృద్ధికి బాటలు వేస్తూనే, అనేక రకాలుగా వారి ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత కూడా వుంది. ఉదాహరణకు వర్షాలు కురవకపోతే కృత్రిమంగా వర్షాలు కురిపించడం ఒక పద్ధతైతే, ఆధ్యాత్మిక పద్ధతిలో యజ్ఞ యాగాలు కూడా చేయొచ్చు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే రాలొచ్చు, రాలక పోవచ్చు. కాని, ప్రజల నమ్మకాలకు అనుగుణంగా నడచుకుంటే తప్పు లేదు కదా! ఆ బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారిదే.

యాగాలు చేయడం వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపించిన మహత్తర నేపధ్యంలో, లోక కళ్యాణం కొరకు, విశ్వ శాంతి కొరకు, యాగాలన్నింటిలో శ్రేష్ఠమైన సహస్ర మహా చండీ యాగం చేయడానికి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పించు కోవడం, దానిని నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయడం అభినందించాల్సిన విషయం. గతంలో మూడేళ్ళ క్రితం ఆయన అయుత మహా చండీయాగం కూడా చేశారు.

యాగాల మహాత్మ్యం గురించి ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవాలి. 1979 లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. అప్పటి ఈవో స్వర్గీయ పీవీఆర్‍కె ప్రసాద్ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం కనుక్కోవాలని స్వర్గీయ ఉప్పులూరి గణపతి శాస్త్రిని సంప్రదించారు. త్రికరణ శుద్ధిగా యజ్ఞం ఆచరిస్తే ఫలితం తప్పకుండా వుంటుందనీ ఆయన సలహా ఇచ్చారు. వరుణ జపం నిర్వహించి, వరుణ దేవుడి కరుణ పొందాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా వరుణ జపం, ఋత్విక్కుల వేద మంత్రోఛ్ఛారణల మధ్య మూడు రోజులు జరిగింది. యజ్ఞం ముగుస్తూనే క్షణాల్లో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వర్షం కురిసింది. రిజర్వాయర్లన్నీ పొంగి పొర్లుతున్నాయని సమాచారం వచ్చింది. విచిత్రం ఏంటంటే, ఒక్క తిరుమలలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా వర్షం ఛాయలు కూడా కాన రాలేదు.  ఇదంతా కాకతాళీయమా? వేద మంత్రాల శక్తి ప్రభావమా? భక్తులు నమ్ముకున్న దేవ దేవుడి అనుగ్రహమా? ఈ విషయాలను స్వయంగా పీవీఆర్‍కె ప్రసాద్ గారు తన పుస్తకం (నాహం కర్తా, హరిః కర్తా) లో వివరంగా రాశారు.

యజ్ఞ-యాగాలకు సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచిన అమెరికా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇండాలజిస్ట్ స్వర్గీయ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా  ఒకరి నుంచి మరొకరికి, గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!". అందుకే, ఇందుకే యజ్ఞ యాగాలు చేయడం అవశ్యం.