ఆర్ధిక సంఘం పనితీరు మారేనా?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (06-02-2019)
ఏప్రియల్ 1, 2020 నుండి మార్చ్ నెల 31, 2025 వరకు అమలుకానున్న
సిఫార్సులను రూపొందించే 15 వ భారత ఆర్ధిక సంఘం (ఫైనాన్సు కమీషన్) ముఖ్యమంత్రితోను, ప్రభుత్వ ఆర్ధిక శాఖ
ఉన్నతాధికారులతోనూ చర్చించేందుకు, దరిమిలా రాష్ట్రావసరాలకు అనుగుణంగా రాష్ట్ర
వాటాకింద చెందాల్సిన నిధుల పంపిణీ నిర్ణయించేందుకు, రాష్ట్రానికి రానున్నది. 1971
లో మొట్టమొదటిసారిగా ఆర్ధిక సంఘం ఏర్పాటు అయినప్పటినుంచీ సంఘ సభ్యులు ఇలా
రాష్ట్రాలకు రావడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో వారు జరిపిన
చర్చల ఆధారంగా ఎంత మేరకు రాష్ట్రాల అవసరాలు తీరడానికి దోహద పడుతున్నాయో అనే అంశం
జవాబులేని ప్రశ్నగానే మిగులుతుంది. భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఫైనాన్స్ కమీషన్
పాత్ర అత్యంత చాలా కీలకమైంది. 2020 ఆర్ధిక సంవత్సరం నుండి, రాబోయే
ఐదేళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక ప్రణాళికలను గణనీయంగా ప్రభావితం
చేయగలిగే శక్తి కమీషన్ చేసే సిఫార్సులకు
ఉంటుంది.
రాష్ట్రాల పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ
అధికారులతో కానీ, ముఖ్యమంత్రితో కానీ చర్చలు ఏదో ఒక సాధారణ వ్యవహారంగా కాకుండా ఒక నిర్దుష్టమైన
లక్ష్యం కొరకు, భారత ఆర్ధిక వ్యవస్థ పరపతిని దృష్టిలో వుంచుకుని చేసేవిధంగా ఆర్ధిక
సంఘం శైలిలో పరివర్తన, సంస్కరణ రావాల్సిన ఆవసరం ఎంతైనా వుంది. స్వాతంత్ర్యం వచ్చిన
తరువాత గత 70 సంవత్సరాలలో కేంద్ర-రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రభుత్వాలు అధికారంలో
ఉన్నప్పటికీ, ఆర్ధిక సంఘం ఆలోచనాధోరణి-విధానంలో గుణాత్మక మార్పు ఆశించినంత స్థాయిలో
కనిపించలేదు. ఈ విషయంలో ఆర్ధిక సంఘం తనను తాను పరిశీలించుకుని, ఆత్మశోధన చేసుకుంటే
మంచిదేమో. కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వాల విధానాల వల్ల అసంతృప్తి చెందిన
ప్రజలు ఆందోళన చెంది, ప్రత్యామ్నాయలకోరకు అన్వేషిస్తున్నారు. కేంద్రంలో
అధికారంలో వున్న రెండే-రెండు పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దేశాభివృద్ధిలో
ఘోరంగా విఫలమయ్యాయి. జాతిని తిరోగమన దిశగా తీసుకెళ్లాయి. అందులో ఆర్ధిక సంఘం పాత్ర
కూడా అంతో-ఇంతో ఉందనాలి.
భారత దేశ విస్తృత ఆర్ధిక విధానం మొత్తం కేంద్ర
ప్రభుత్వంతో వుంటుంది. ఏ నిధులనైతే,
పన్నులనైతే కేంద్రం విధిగా రాష్ట్రాలకు పంపిణీ చేయాలో, చేయాల్సిన ఆగత్యం వుందో, ఆ పని చేయకుండా వాటిని
కేంద్రీకరించి తమ గుప్పిట్లో పెట్టుకున్నది. నీతీ అయోగ్ సమావేశంలో తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు, అభివృద్ధి చెందుతున్న
రాష్ట్రాల ఎదుగుదలను కేంద్రం అడ్డుకోకూడదు. రాష్ట్రాల అభివృద్ధితోనే, దేశాభివృద్ధి
వుందని భావించాలి కేంద్రం. అభివృద్ధిచెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలికాని
నిరుత్సాహపరచడం ఆరోగ్యకరమైన అభ్యాసం కాదు. పేద రాష్ట్రాలను ఒకవైపు ఆదుకుంటూనే, దేశానికి
గరిష్ట ఆదాయం సమకూరుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధానం వుండడం మంచిది.
తలసరి ఆదాయం
ఎక్కువున్న రాష్ట్రాలను ధనిక రాష్ట్రాల జాబితాలో వేసి పన్నుల్లో వాటాను తగ్గిస్తున్నారు. ఆదాయం
తక్కువున్న రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతున్నాయి. ఉదాహరణకు మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణకు 2.4375 శాతం
మేర పన్నుల్లో వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం నిర్ణయించింది. లోటు బడ్జెట్ కలిగిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4.305 శాతం మేర వాటా లభిస్తున్నది. దీని ప్రకారం
తెలంగాణ రాష్ట్రానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.18,560 కోట్లు రాగా,
ఆంధ్రప్రదేశ్ కు రూ.32,787 కోట్లు లభించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ
వ్యత్యాసం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి రూ.20,583 కోట్లు, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి రూ.36,360 కోట్లు రానున్నాయి. దేశానికి అత్యధిక ఆదాయం సమకూర్చే ఐదారు
రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో తగిన వాటా దక్కడం లేదు.
కొద్దిపాటి నిధుల విషయంలో కూడా కేంద్రం
అనేకరకాల నిబంధనలు విధిస్తున్నది. ఇది మంచిపద్ధతి కాదు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల
మధ్య ఆర్ధిక సంబంధాలు వుండాల్సిన రీతిలో, ఫెడరల స్ఫూర్తికి అనుగుణంగా లేవు.
రాష్ట్రాల వాటాగా రావాల్సిన కేంద్ర నిధుల పంపిణీ, రాష్ట్రాలను అగౌరవ పరిచే విధంగా
ఉన్నాయికాని వాళ్ల మాటకు విలువ ఇస్తున్నట్లు లేదు.
ముందస్తుగానే ఒక అవగాహనకొచ్చి, తమ
ఆలోచనాధోరణికి అనుగుణంగా ఆర్ధిక సంఘం రాష్ట్రాల పర్యటనకు రావడమనే విధానంలో సహితం
మార్పు రావాలి. ఈ విధానంలో సంస్కరణలు రావాలి. రాష్ట్రాలకు వచ్చి, రాష్ట్ర ప్రభుత్వంతో
చర్చలు జరిపిన తరువాత రూపొందించాల్సిన సూచనలకు సంబంధించి ముందుగానే ఒక నిర్ణయానికి
రాకూడదు. కేవలం సిఫార్సులు చేయడాని మాత్రమే పరిమితం కాకుండా, విధాన నిర్ణయాత్మక
వ్యవస్థగా ఆర్ధిక సంఘం రూపుదిద్దుకుంటే ఫలితం ఎక్కువగా వుంటుంది. రాష్ట్రాల వాటా
కింద చెందాల్సిన నిధుల పంపిణీ విషయంలో రాష్ట్రాలకు పూర్తి హక్కు వుంది. రాష్ట్రాల
అవసరాల విషయంలో గణనీయంగా వైవిధ్యం కొట్టవచ్చినట్లు కనపడుతుంది.
ఐదేళ్లకొకసారి నియమించబడే భారత ఆర్ధిక సంఘాన్ని
రాజ్యాంగంలోని 280 ప్రకరణం కింద మొట్టమొదటిసారి నవంబర్ 22, 1951న భారత రాష్ట్రపతి
ఏర్పాటుచేశారు. ఒక చైర్మన్, నలుగురు సభ్యులుండే కమీషన్ ప్రాధమిక బాధ్యత
కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, రాష్ట్రాల-రాష్ట్రాల మధ్య కేటాయింపుల
విషయంలో రాష్ట్రపతికి సిఫార్సులు చేయడమే. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఎలాంటి ఆర్ధిక
సంబంధాలు, లావాదేవీలు ఉండాలో నిర్వచించే పరిధి కూడా ఆర్ధిక సంఘానిదే. ప్రణాలికేతర
సంబంధమైన ఆర్ధిక వనరుల పంపిణీ, కేటాయింపులు కూడా ఆర్ధిక సంఘం బాధ్యతే. ఫైనాన్స్
కమీషన్ సిఫార్సులను పార్లమెంట్ ఉభయ సభలకు రాష్ట్రపతి సమపర్పిస్తారు.
భారత దేశ ఏకీకృత నిధి నుండి రాష్ట్రాల రెవెన్యూ
ఆదాయానికి కావాల్సిన నిధుల మంజూరు విధి-విధానాలను నిర్ణయించేది కూడా ఆర్ధిక సంఘమే.
కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆదాయపు పన్ను విభజన విధానం కూడా ఆర్థిక సంఘం
నిర్ణయిస్తుంది. రాష్ట్ర ఆర్ధిక సంఘాల సిఫార్సుల మేరకు సంబంధిత రాష్ట్రాల
పంచాయితీలకు, మునిసిపాలిటీలకు అందుబాటులో వున్న ఆదాయవనరులను పెంపొందించుకోవడానికి
తీసుకోవాల్సిన చర్యల విషయంలో కూడా ఫైనాన్స్ కమీషన్ రాష్ట్రపతికి సిఫార్సులు
చేస్తుంది.
కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆర్ధిక సంబంధ-బాంధవ్యాల
మీదనే ఆర్ధిక సంఘం తన సంపూర్ణ దృష్టిని సారించాలి. తదనుగుణంగానే దాని
సిఫార్సులుండాలి. ఆదాయపు పన్ను వసూళ్ల రాబడిలో రాష్ట్రాల వాటా ప్రగతిశీల పెరుగుదల
దిశగా వుండేట్లు కమీషన్ సిఫార్సులుండాలి. రాష్ట్రాలకు కేంద్ర ఇచ్చే
గ్రాంట్స్-ఇన్-ఎయిడ్స్ మొత్తాలు కూడా క్రమేపీ పెరుగుతుండే విధంగా కమీషన్ సిఫార్సు
చేయాలి. అసలు-సిసలైన సహకార సమాఖ్య వర్ధిల్లదానికి, రాష్ట్రాల ఆర్ధిక
స్వయంప్రతిపత్తి పటిష్టంగా వుండడానికి పైన పేర్కొన్న చర్యలన్నీ సజావుగా చేపట్టాలి.
కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆర్ధిక సంబంధాలు బలపడేరీతిలో, ఇరువురి మధ్య విత్తసంబంధమైన
విభేదం లేకుండా, వనరుల పంపకానికి రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకరణలకు అదనంగా,
ఆర్ధిక సంఘం ఒక సంస్థాగత కార్యాచరణతో పనిచేయాల్సిన అవసరం వుంది.
మొదటి ఆర్ధిక సంఘం ఏర్పాటైన తరువాత దాని
పనితీరులో, ఆలోచనా విధానంలో, శైలిలో ఎన్నో మార్పులు-చేర్పులు చోటుచేసుకున్నాయి.
ఇప్పటికి 15 ఫైనాన్స్ కమీషన్లను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే నవంబర్
2017 లో మాజీ ప్రణాలికా సంఘం సభ్యుడు, పదవీ విరమణ చేసిన ఐఏఎస్
అధికారి ఎన్ కే సింగ్ చైర్మన్ గా 15 వ ఆర్ధిక సంఘం ఏర్పాటైంది. పటిష్టమైన విట్ట
నిర్వహణకు ఒక సరైన ఆర్ధిక స్థిరీకరణ రోడ్ మాప్; కేంద్ర-రాష్ట్రాల ఆర్ధిక
స్థితిగతుల మీద జీ ఎస్ టీ ప్రభావం; రాష్ట్రాల రెవెన్యూ లోటు
పూడ్చడానికి నిధుల మంజూరు అవసరం విషయంలో సమీక్ష; 14 వ ఆర్ధిక సంఘం
సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు ఇస్తున్న పన్నుల వాటాలో పెంపుదల విషయంలో సమీక్ష; రాష్ట్రాలు చేసే
అప్పులకు సంబంధించి వున్నా నిబంధనల సడలింపుపై సమీక్ష; రాష్ట్రాల పనితీరు
ఆధారంగా ప్రోత్సాహకాలివ్వడం లాంటివి ఆర్ధిక సంఘం చేయాల్సిన సిఫార్సుల్లో వున్నాయి.
మొదటి ఆర్ధిక సంఘం ఏర్పాటైనప్పటి నుండి ఇటీవలి
15 వ ఆర్ధిక సంఘం వరకూ సంఘాల అధ్యక్షులుగా నియమించిన చైర్మన్లలో సగం మందికి పైగా
కేంద్రంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీకి చెందినవారే కావడం విశేషం. వారిలో
పశ్చిమ బెంగాల్ కు చెందిన కేసీ నియోగి, తమిళ నాడుకు చెందిన కె
సంతానం, తమిళనాడుకు చెందిన (మాజీ జడ్జ్ అయినప్పటికీ) పీవీ రాజమన్నార్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు
చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, మహారాష్ట్రకు చెందిన వైబీ చవాన్, మహారాష్ట్రకు చెందిన
ఎన్కేపీ సాల్వే, ఉత్తరాఖండ్ కు చెందిన కేసీ పంత్ వున్నారు. ఇటీవలి 15 వ ఆర్ధిక సంఘం చైర్మన్
గా నియమించబడ్డ ఎన్ కె సింగ్ మాజీ ఐఏఎస్ అధికారిగా కేంద్రంలో వివిధ హోదాల్లో
పనిచేసినప్పటికీ ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయన కూడా బీజేపీకి చెందిన రాజకీయ వేత్తే.
అలాంటప్పుడు అలా నియమించబడ్డ రాజకీయ వేత్తలు
అవునన్నా-కాదన్నా అధికార పార్టీకి అనుకూలంగానే సూచనలు, సిఫార్సులు చేసే అవకాశం
మెండుగా వుంది. అలాంటి భావనకు తావు లేకుండా 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సులుంతె
అంతకంటే కావాల్సింది లేదు. అందుకే, ఆర్ధిక సంఘం పనితీరులో
పరివర్తన, సంస్కరణ రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ దిశగా 15 వ ఆర్ధిక సంఘం
ఆలోచిస్తుందనీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరక్కుండా చూస్తుందనీ
ఆశించూదాం.
ఆదాయం తక్కవగా ఉన్న రాష్ట్రాలకు తక్కువగా నిధులను ఇవ్వాలంటారా? అలా చేయటం ద్వారా అవి అభివృధ్ధి చెందకుండా అడ్డుకోవాలంటారా? అవును, ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి అంటే తెలంగాణకు అన్యాయం అని మీ భయం కదా, బాధ కదా!
ReplyDelete