అన్నా హజారే
నిరాహార దీక్ష అవసరమా?
వనం జ్వాలా
నరసింహారావు
సూర్యదినపత్రిక
(08-02-2019)
లోక్ పాల్
నియామకం కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేశారు. లోక్‌పాల్, లోకాయుక్తల నియామకాల్లో
జాప్యాన్ని నిరసిస్తూ, మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో దీక్షకు
కూర్చున్నారు. మహాత్మా గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించి మరీ దీక్షకు దిగారు.
అవినీతిపై పోరాటం కోసం కేంద్రం లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని, లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేసే వరకూ
నిరాహార దీక్ష కొనసాగిస్తాననీ అన్నారు హజారే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర
ఫడ్నవీస్‌కు హజారే రాసిన లేఖలో పేర్కొన్నట్లుగానే
జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతి, అమరవీరుల దినోత్సవం కావడంతో
దీక్ష ప్రారంభించారు. కేంద్రం, ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే
ప్రతిష్టాత్మక పద్మభూషణ్ తిరిగి ఇచ్చేస్తానని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు
హజారే.
కారణాలేవైనా
దీక్ష ప్రారంభించిన ఐదు రోజులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫద్నవీస్, కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, సుభాష్ భామ్రే
హజారేను కలిసి ఐదారి గంటలు చర్చలు జరిపారు. చర్చల అనంతరం తానూ దీక్ష
విరమిస్తున్నట్లు హజారే ప్రకటించి అన్న ప్రకారం విరమించారు.
ఒక్క సారి గత
చరిత్రలోకి తొంగి చూస్తే....లోక్ పాల్ బిల్లును లోక్ సభలో డిసెంబర్ 22, 2011 న ప్రవేశపెట్టగా, దాన్ని సభ డిసెంబర్ 22, 2011
న ఆమోదించింది. దరిమిలా రెండురోజుల తరువాత డిసెంబర్ 29,
2011న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సమయాభావం వల్ల సుదీర్ఘ చర్చ జరిగినప్పటికీ ఓటింగ్
జరగడం వీలుకాలేదు. మే నెల 21, 2012న బిల్లును సెలెక్ట్
కమిటీకి పంపింది రాజ్యసభ. కొన్ని సవరణల అనంతరం బిల్లు డిసెంబర్ 17, 2013న రాజ్యసభ, మర్నాడు లోక్ సభ ఆమోదించడం
జరిగింది. జనవరి 1, 2014 న నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర
వేయడంతో జనవరి 16, 2014 నుండి అమల్లోకి వచ్చింది. కాకపొతే, చట్టమై ఇన్నాళ్ళైనా ఇంతవరకూ లోక్ పాల్ నియామకం జరగలేదు. కారణాలేవైనా
కావచ్చు.
ఈ నేపధ్యంలో
మరోమారు హజారే దీక్షకు దిగారు. ఇంకేముంది...హజారే దీక్షకు మద్దతుదారులు పెరగడం
గతంలోలాగానే మొదలైంది. ఏ రాజకీయ నాయకుడిని కదిలించినా, ఏ ప్రభుత్వేతర సంస్థ ప్రతినిధిని పలకరించినా, అంతో-ఇంతో
పరిజ్ఞానం వున్న ఏ వ్యక్తిని మాట్లాడించినా, వారి నోట
వచ్చే ఒకే ఒక వాక్యం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలన్నదే! అలా
మాట్లాడుతున్నవారికి అవినీతి గత చరిత్ర వుండవచ్చు, వుండక పోవచ్చు...ఐనా పోరాటంలో
ముందేనంటారు. అందరిది ఒకే నినాదం..."అవినీతి అంతమొందాలి, లోక్ పాల్ నియామకం జరగాలి" అని.
అవినీతికి
వ్యతిరేకంగా పోరాడాలి అన్న సాకుతో, పార్లమెంటుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు, న్యాయ స్థానాలకు, రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లాకు అతీతమైన ఒక
సూపర్-డూపర్ నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయాలని పౌర సమాజం నాయకులు ప్రభుత్వాన్ని
ఆజ్ఞాపించడం ఎంతవరకు సబబు? దానికి కొందరు మహానుభావులు
వంత పాడడం ఎంతవరకు న్యాయం? 70 సంవత్సరాల స్వతంత్ర భారత
దేశంలో, అరవై ఎనిమిది సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో, అంచలంచలుగా బలపడాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను, పటిష్టం
చేయాల్సిన బాధ్యతను విస్మరించిన రాజకీయ నాయకులనేకమంది, అదే
బాధ్యతను ఇన్నాళ్లు విస్మరించిన పౌర సమాజం నాయకులకు వత్తాసు పలకడంలోని ఔచిత్యం
ఏమిటి? వాస్తవానికి మనకు రాజ్యాంగం ప్రసాదించిన అవినీతి
వ్యతిరేక అస్త్ర-శస్త్రాలను, అదే రాజ్యాంగంలోని
అనేకానేక ప్రకరణాలను, ఒకదానికి మరొకటి అనుసంధానం చేసి
అవినీతి పరులపై ప్రయోగించడానికి, పౌర సమాజం ప్రతినిధులు
ఆదినుంచి పూనుకున్నట్లయితే, సమస్య ఇంత జటిలమయ్యేదా? అంతా
జరిగినాక, ఇప్పుడు "సర్వోపతి"
లాంటి ఒక దివ్యౌషధం కావాలని ప్రభుత్వంపై పౌర సమాజం ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం?
రెండు
దశాబ్దాల క్రితం, స్వాతంత్ర్యం వచ్చి ఏబై వసంతాలు
పూర్తి చేసుకోనున్న తరుణంలో, నవంబర్ 1996 లో నాటి ప్రధాని దేవె గౌడ, మే 1997 లో ఆయన
వారసుడు ఐకె గుజ్రాల్, అన్ని రాష్ట్రాల ప్రధాన
కార్యదర్శుల, ముఖ్య మంత్రుల సమావేశాలు నిర్వహించారు.
కేంద్ర-రాష్ట్ర స్థాయిలలో బాధ్యతాయుతమైన, పారదర్శకతతో
కూడిన పాలన ప్రజలకందించాల్సిన అంశంపై ఏకగ్రీవ తీర్మానాలను ఆ రెండు సభలు ఆమోదించాయి.
ప్రభుత్వాలపై ప్రజలకు సడలుతున్న నమ్మకాన్ని ఏ విధంగానైనా నిలబెట్టుకోవాలన్న ఆందోళన
వారిలో అప్పట్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ సభల దరిమిలా దేశవ్యాప్తంగా
ప్రజాభిప్రాయాన్ని, ప్రత్యక్షంగాను-పరోక్షంగాను, సేకరించే ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన ఆరు
నెలల లోపు అ సభలో ఆమోదించిన "నవ సూత్ర కార్యాచరణ
ప్రణాళిక" కు సంబంధించిన అంశాలను అమలు చేయాలని, అమలు ఎలా జరుగుతున్నదనే విషయాలను ప్రధాన మంత్రి స్వయంగా సమీక్షించాలని
నిర్ణయం కూడా జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది ఆ ప్రణాళికలో
ప్రధానమైన అంశం. అలనాటి నిర్ణయాలే అక్షరాలా అమలు జరిగివుంటే ఈనాడు హజారే ఆందోళన
చేయాల్సిన అవసరమే లేదు.
అవినీతికి
వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నా హజారే ఆ నాడూ పౌర జీవితంలోనే వున్నారు. నవ
సూత్ర కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి వైఫల్యాల విషయంలో మాట మాత్రంగా నన్నా, నిరసన తెలియ చేసినట్లయితే, బాగుండేదేమో!
అప్పట్లో ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరైన అతిరథ-మహారథులెందరో నేటికీ రాజకీయాలలో
చురుగ్గా పాల్గొంటున్నారు. వారిలో కొందరు అధికారంలో, కొందరు
ప్రతిపక్షంలో వుంటూ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా వ్యక్తిగతంగనో-కలిసికట్టుగానో
అలనాటి నవ సూత్ర ప్రణాళిక అమలుకు కృషి చేసి వుంటే అవినీతి కొంతలో కొంతన్నా కట్టడి
అయివుండేదేమో?
దీక్ష
చేపట్టడం ఎంత ముఖ్యమో, సమయం వచ్చినప్పుడు దీక్ష విరమించడం
కూడా అంతే ముఖ్యమని మహాత్మా గాంధీ నిరూపించారు. గాంధీ స్ఫూర్తితో దీక్ష
చేస్తున్నానంటున్న హజారే పట్టుదలకు పోకుండా, చర్చల
ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన లోక్ పాల్ నియామకం జరిగేలా చూస్తే మంచిదే మో!
అత్యున్నత విలువల నుంచి హజారే స్ఫూర్తి పొంది ఉండవచ్చు గాక! ఆయన వెంట అశేష జన వాహిని నేడు నడుస్తుండవచ్చు కాక! ఆయన వేసిన ప్రతి
అడుగులో అడుగు వేసుకుంటూ, పౌర సమాజానికి చెందిన
అతిరథ-మహారథులు హజారే చెప్పే ప్రతి వాక్యాన్ని వేద వాక్కుగా పరిగణిస్తుండ వచ్చు
గాక! అంత మాత్రాన ఆయన ఎంచుకున్నది మాత్రం చాలా అసలు సిసలైన నిఖార్సైన మార్గం అనే వీలు
లేదు. అవినీతిని రూపుమాపాల్సిందే. కాకపోతే కాన్సర్ లాగా పాకిపోయిన అవినీతికి
రాత్రికి రాత్రే అన్నిరకాల చికిత్స ఒకే ఒక చిట్కాతో చేసి, మర్నాటికల్లా నయం చేయడమంటే, చేయాలని ఎవరైనా అంటే, అది మూర్ఖత్వం తప్ప మరేమీకాదు.
గతంలో ఒకసారి
లోక్ పాల్ బిల్లు ఆవశ్యకతను గుర్తుచేస్తూ, అన్నా
హజారే నాయకత్వంలోని పౌర సమాజ బృందం ఆందోళనకు దిగింది. అప్పట్లో వారి డిమాండు
ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును తెచ్చి చట్టం చేయాలని మాత్రమే! అదే అదనుగా తీసుకుని, స్వతంత్ర భారత దేశంలో అంతో-ఇంతో అవినీతి భాగోతం
నడిపించిన వారితో సహా సింహభాగం అవినీతిలో భాగస్వాములైన ఎందరో మహానుభావులు హజారే
సరసన చేరారు ఆనాడు. ఆయన వెంట వున్న పౌర సమాజం సభ్యులు నిజాయితీ పరులే, అందులో
సందేహం లేదు. వచ్చిన చిక్కల్లా, వారూ-వీరూ అనే తేడా
లేకుండా, తన దగ్గరకు వచ్చిన అందరినీ తన అక్కున
చేర్చుకున్నారు అప్పట్లో గాంధేయ మార్గాన్ని అనుసరించే హజారే! అంతటితో
ఆగలేదు..వీరికి తోడుగా, రాజకీయ పార్టీల నాయకులు ఇదే
అదను అనుకుని, హజారే పక్షాన నిలిచారు.
ప్రజాస్వామ్య
విధానంలో-అందునా పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో,రాజ్యాంగాన్ని తుచ తప్పకుండా పాటించాలంటే, భూతకాలంలో
జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ కేవలం చట్ట సభలు మాత్రమే. ఏ రకమైన చట్టాన్ని, ఎప్పుడు-ఎలా-ఎందుకు రూప కల్పన చేయాలో-చేసిన
దానిని రాజ్యాంగ ప్రకరణాలకు-పార్లమెంటరీ విధానాలకు అనుగుణంగా
ఆమోదింపచేసుకోవాలో, చేయడం వల్ల తలెత్తే పర్యవసానం ఎలా
అధిగమించాలన్న విషయాలను నిర్ణయించే అధికారం చట్ట సభలకే వుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలైన కార్య నిర్వాహక వ్యవస్థ-శాసన ప్రక్రియ వ్యవస్థ-న్యాయ వ్యవస్థలు, వాటి-వాటి పరిధుల్లో తిరుగులేని అధికారాలను కలిగి
వుండడం వల్ల, ఒక దాని అధికారం మరో దాన్ని కబళించలేని
విధంగా, అధిగమించలేని పద్ధతిలో “అదుపులు-అన్వయాలు” ఆ అధికారాలను పరిమితం
చేస్తుంటాయి.
ఇదిలా వుంటే, హజారే దీక్షకు దిగినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టించుకోలేదని
ఆయన అభిమానులు నిరసన తెలిపారు. పీఎంవో నుంచి కేవలం “మీ లేఖ అందుకున్నాం, ధన్యవాదాలు, బెస్ట్ విషెస్” అని మాత్రమే వుంది.
మోడీ స్పందనకు ఆయన గ్రామస్తులు ఆగ్రహం వెలిబుచ్చారు. చట్టం ఎలాగూ వుంది. ఎటొచ్చీ
నియామకమే ఆలస్యమైంది. హజారే దీక్ష చేసినండునో, లేక, మరే ఇతర కారణాల వల్లనో కాని, లోక్ పాల నియామకం
విషయంలో కేంద్ర ఒక అడుగు ముందుకేసింది. చైర్మన్, సభ్యుల
నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. కథ సుఖాంతం అయింది.
అందుకే, హజారే కొంత ఓపిక పట్టినట్లయితే బాగుండేదేమో!
హజారే ఓపికపట్టి ఉండవలసిందన్న మీ ముక్తాయింపు నప్పటంలేదు. కేంద్రం ఇప్పుడొక అడుగు ముందుకు వేసిందనీ అందుకు హజరే దీక్ష కారణం కావచ్చునని ఒప్పుకుంటూనే మీరు దీక్షను ఆక్షేపిస్తూ ముక్తాయింపు ఇవ్వలేరు కదా.
ReplyDelete