Friday, February 1, 2019

సహస్ర మహా చండీయాగం...మానవ సృష్టే యజ్ఞసహితం : వనం జ్వాలా నరసింహారావు



సహస్ర మహా చండీయాగం...మానవ సృష్టే యజ్ఞసహితం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య, నమస్తే తెలంగాణ దినపత్రికలు (01-02-2019)
లోక కళ్యాణానికి, విశ్వ శ్రేయస్సుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఐదురోజులపాటు (జనవరి 21 నుండి జనవరి 25 వరకు) మహావైభవోపేతంగా మహారుద్ర సహిత సహస్ర మహా చండీయాగం ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఈ యాగంతో రాష్ర్టానికి, లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. సీఎం చంద్రశేఖర్‌రావు చేసిన రీతిలో, ఇంతవరకూ హిందూ వాదులమని చెప్పుకున్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ యాగం చేయలేదు. యజ్ఞ యాగాదులు, క్రతువులు చేస్తే మంచి జరుగుతుందనే భావనతోనే సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు అందరూ సుఖంగా ఉండాలనేదే ఈ క్రతువు ముఖ్య ఉద్దేశం.

జగన్మాత చండికా పరమేశ్వరి ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా అలరారుతుంది. దుర్భిక్షం, దుఃఖం అనేవి అ దరిదాపులకు కూడా రావు. అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోవు. “కలౌ చండీ వినాయకౌ” అనేది ఆర్ష వాక్యం. అంటే చండీ వినాయకుల ఉపాసన కలియుగంలో విశేష ఫలప్రదం అని అర్థం. చండీమాత సకల దేవతా స్వరూపిణి. ఆమె అమ్మలగన్నయమ్మ. సృష్టి చక్రానికి కారణమయ్యే బ్రాహ్మిగా, సుఖ సంపదలతో చల్లగా కాపాడే వైష్ణవిగా, సకల సౌభాగ్య మంగళాలను ప్రసాదించే శాంకరిగా ఆ జగజ్జనని వేదాది వాజ్ఞయంలో స్తుతింపబడింది. ఆ చల్లని తల్లిని ప్రసన్నం చేసుకుని, సకల జనపదాలకు, పట్టణాలకూ, జిల్లాలకూ, రాష్టానికీ, దేశానికీ, ప్రపంచానికీ, సుఖ శాంతులు, ఆయురారోగ్య భాగ్యాలనూ ఆకాంక్షిస్తూ తలపెట్టిన పవిత్ర కార్యమే సహస్ర మహా చండీయాగం. ఈ అమోఘ మహాయాగానికి అనాదిగా విశేష ప్రాచుర్యం ఉంది. సమస్త ప్రాణులు సుఖ సంతోషాలతో శాంతియుత జీవనం సాగించాలనే సత్సంకల్పంతో ఈ మహాయాగాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జయప్రదంగా నిర్వహించారు.

మార్కండేయ పురాణంలోని సప్తశతీ అనే స్తవాన్ని పఠించడం ద్వారా సకల సౌఖ్యాలూ కలుగుతాయి. ఈ మహాయాగం శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి వార్ల పవిత్ర మార్గదర్శనంలో వేయి పర్యాయాలు చండీ సప్తశతీ పారాయణము, కొనసాగి అపూర్వ ఫలాలను అందిస్తుందని సకల శాస్తాల ఉపదేశం. సకల జనుల సౌభాగ్యాన్నీ, సుఖ శాంతులనూ, అభ్యుదయ పరంపరలను, సువృష్టినీ, సస్య సమృద్ధినీ, జనహితాన్నీ కాంక్షిస్తూ చేసిన ఈ మహాపుణ్య యాగానికి పలువురు ప్రముఖులు హాగారయ్యారు.

చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత చండీ యాగం, లక్ష చండీ యాగం అని వేర్వేరు విధాలైన యాగాలున్నాయి. ఇవన్నీ కూడా మహా కాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి, అమ్మవార్లందరికీ కలిపి నిర్వహించేవి.

సహస్ర చండీ యాగం ఐదు రోజులు చేసే యాగం. వందమంది రుత్విక్కులుంటారు. మొదటి రోజు 100 సప్తశతి పారాయణాలు, రెండవ రోజు 200 సప్తశతి పారాయణాలు, మూడవ రోజు 300 సప్తశతి పారాయణాలు, నాలుగవ రోజు 400 సప్తశతి పారాయణాలు చేస్తారు. అంటే మొత్తం వెయ్యి పారాయణాలు చేస్తారు. ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజూ నవావరణ పూజ, చతష్షష్టీ యోగినీ దేవతల పూజ, దీప సహిత బలి, కల్పోక్త పూజతో పాటు కుంకుమార్చన కూడా చేస్తారు. ఇవికాక అవధారలు చేస్తారు. ఐదవ రోజు అగ్ని ప్రతిష్ట చేసి అమ్మ వారికి పరమాన్న ద్రవ్యంతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు జరిపి అవభృతం చేస్తారు. తరువాత యాగ సమాప్తి చేస్తారు. ప్రతి రోజు ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అధర్వణ వేదము, శుక్ల యజుర్వేదము పారాయణాలు హవనాదులు, సుందరాకాండ, విరాటపర్వ, మహా సౌర పారాయణాలు జరుగుతాయి.

శ్రీ సహస్ర మహా చండీయాగం జనవరి 21, సోమవారం ఉదయం వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం, ఋత్విక్ వర్ణం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షిణ, గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ నిర్వహించి రాజశ్యామల యాగం ప్రారంభించారు. సుమారు 300 మంది ఋత్విజులు  దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1000 మోదాకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు. ఇలా ఇది ఐదురోజులూ కొనసాగింది.

చివరి రోజు (ఐదవ రోజు) అప్పటివరకు చేసిన పారాయణాలు, జపాలకు తద్దశాంశ హోమ తర్పణాలను నిర్వహించారు. అమ్మవారికి షోడశోపచార పూజ, చతుషష్టి యోగినీ బలి, మంగళ నీరాజన సేవ నిర్వహించారు. అగ్నిమథనం ద్వారా అగ్నిప్రతిష్ఠ చేసి పది కుండాల వద్ద ఇదే అగ్నితో హోమం ఆరంభించారు. పది యజ్ఞ కుండాలలో ఒక్కో యజ్ఞకుండం వద్ద ఆచార్య బ్రహ్మతో కలిపి పదకొండు మంది వేద పండితులు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని ఆహుతులిస్తూ హోమాన్ని నిర్వహించారు. అష్టదిక్పాలక బలి, ప్రాయశ్చిత్త హోమాలను నిర్వహించారు. 700 సప్తశతి (చండీ) శ్లోకాల స్వాహాకారాలకు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని యజ్ఞభగవానుడికి హవిస్సుగా సమర్పించారు. మహాపూర్ణాహుతిలో భాగంగా చండీయాగ మంటపంలోని అన్ని యజ్ఞకుండాల అగ్నిని ప్రధాన యజ్ఞ కుండంలోకి తీసుకువచ్చి మహాపూర్ణాహుతిని ఆరంభించారు.

యజ్ఞ ఆచార్యుడు మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, ఖర్జూర, వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జీడిపప్పు, పటికబెల్లం, బాదం, పచ్చకర్పూరం, గంధకచూరాలు, పూలు, పండ్లు, తమలపాకులు, పట్టుచీర, మారేడుకాయలు తదితరాలను పూర్ణాహుతిలో భాగంగా యజ్ఞభగవానుడికి సమర్పించారు. తరువాత వసోర్ధార, అంటే నెయ్యిని ధారగా పూర్ణాహుతి అనంతరం యజ్ఞభగవానుడికి సమర్పించే పక్రియ సాగింది. ఇదేవిధంగా మహారుద్ర, రాజశ్యామల, బగళాముఖి, చతుర్వేద, నవగ్రహ యాగ మంటపాల్లో కూడా షోడశోపచార పూజలు చేసి, హోమాల అనంతరం పూర్ణాహుతిని నిర్వహించారు. మహామంగళహారతి, సువాసిని పూజ, మహదాశీర్వచనం, ఋత్విక్‌ సన్మానం నిర్వహించారు.

అనాదిగా, సృష్టి ఆరంభం నుంచీ, మనిషి అనే వాడు, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, రకరకాల ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, నమ్మకాలను అనుసరిస్తూ రావడం జగమెరిగిన సత్యం. శ్రీరాముడే దేవుడని నమ్మేవాళ్లున్నారు, కాదు శ్రీకృష్ణుడే అనేవాళ్లున్నారు. వారిద్దరూ కాదు పరమశివుడని మరికొందరంటారు. క్రమేపీ అనేక మతాలు, విధానాలు ఆచరణలోకి రావడంతో మనిషి కూడా మార్పులకు చేర్పులకు లోనవుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాలను, ఆచారవ్యవహారాలను పాటించే వారు కొందరైతే, ఆస్తికత్వం నుంచి నాస్తికత్వం వరకూ మారిన వారు మరికొందరున్నారు.

ఇంతకీ ఎవరి నమ్మకం వాళ్లది. తమ నమ్మకమే గొప్పదనీ, ఇతరుల నమ్మకాలు తప్పనీ వాదించే ప్రయత్నం మంచిది కాదు. నమ్మకం విషయానికొస్తే యాగాలు-యజ్ఞాలు చేయడం కొందరికి అదో నమ్మకం. వాటివల్ల లోక శాంతి, ప్రజా ప్రయోజనం వుంటుందని భావించడం కూడా ఒక నమ్మకమే. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. భారతదేశంలోను, అనేక ప్రపంచ దేశాలలోను, అనేక మతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఆచరణలో వున్నాయి. చైనా లాంటి  కమ్యూనిస్ట్ దేశాలలో కూడా ఇప్పటికీ మావోకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం బుద్ధుడికీ ఇస్తున్నారు. కంబోడియాలో ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన అంగ్కార్ వాట్ దేవాలయం వుంది. బాంకాక్ లో రహదారుల పేర్లన్నీ రామ అక్షరంతో మొదలవుతాయి. ఎవరి నమ్మకం వాళ్లది.

యజ్ఞయాగాదులనేవి ఈనాటివి కావు. మన భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలతో పెనవేసుకునిపోయాయవి. విదేశాలలో కూడా ప్రాచుర్యం పొందిన మన వేదాలలో యజ్ఞాలు ప్రతిపాదించబడ్డాయి. యజ్ఞయాగాదుల విధి-విధానాల గురించి వివరంగా చెప్పడం కూడా జరిగింది. మానవాళిని అహర్నిశలూ రక్షించేవి కూడా యజ్ఞ ఫలాలే. మానవ జాతి జీవన విధానం ఆరంభానికి కారణం కూడా యజ్ఞ యాగాలే. మానవ జాతి సృష్టే యజ్ఞ సహితంగా జరిగిందంటారు. యజ్ఞం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. జగత్ కళ్యాణానికి కారణం కూడా యజ్ఞయాగాదులే. దేవతార్చనతోనే హిందూ జీవన విధానం ముడిపడి వుంది. మానవ జీవితాన్ని ఫలవంతం చేసుకునేందుకు, తనను తాను సంస్కరించుకుని, ఆత్మోన్నతిని పొంది విశ్వ శ్రేయస్సుకు పాటుపడేందుకు యజ్ఞయాగాదులు చేయాలని పూర్వకాలం నాటి మహాఋషులు చెప్పారు. జీవుడు తల్లి గర్భంలో చేరినది మొదలుకుని, భూమిమీద అడుగుపెట్టినప్పటినుంచి, వివిధ సంస్కారాలతో సంస్కరించబడాలని వైదిక సాంప్రదాయాలు ఘోషిస్తున్నాయి. అలా సంస్కరించబడడానికి అమూల్యమైన ప్రక్రియ యాగాలు, యజ్ఞాలు చేయడం, చేయించడం. యజ్ఞాలు మహత్వ పూర్ణాలు, అవశ్యం ఆచరణీయాలు. పూర్వకాలంలో మాదిరిగానే ఈ నాటికీ సాధన, సంపద, నిబద్ధత, సంస్కారం, పూర్వ జన్మ పుణ్యం, నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన కలవారు, యజ్ఞ యాగాలు చేస్తూనే వున్నారు. అలాంటివాటిలో రుద్ర యాగాలు, సూర్య యాగాలు, గణేశ యాగాలు, చండీ యాగాలు, శాంతి యాగాలు లాంటివి బహుళ ప్రచారంలో వున్నాయి.

రాచరికం పోయి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ, పాలకులు, ప్రజలు అనే పద్ధతి మాత్రం ఇంకా ఎదో ఒకరూపంలో కొనసాగుతూనే వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వారు ప్రజల సంక్షేమ, అభివృద్ధికి బాటలు వేస్తూనే, అనేక రకాలుగా వారి ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత కూడా వుంది. ఉదాహరణకు వర్షాలు కురవకపోతే కృత్రిమంగా వర్షాలు కురిపించడం ఒక పద్ధతైతే, ఆధ్యాత్మిక పద్ధతిలో యజ్ఞ యాగాలు కూడా చేయొచ్చు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే రాలొచ్చు, రాలక పోవచ్చు. కాని, ప్రజల నమ్మకాలకు అనుగుణంగా నడచుకుంటే తప్పు లేదు కదా! ఆ బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారిదే.

యాగాలు చేయడం వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపించిన మహత్తర నేపధ్యంలో, లోక కళ్యాణం కొరకు, విశ్వ శాంతి కొరకు, యాగాలన్నింటిలో శ్రేష్ఠమైన సహస్ర మహా చండీ యాగం చేయడానికి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పించు కోవడం, దానిని నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయడం అభినందించాల్సిన విషయం. గతంలో మూడేళ్ళ క్రితం ఆయన అయుత మహా చండీయాగం కూడా చేశారు.

యాగాల మహాత్మ్యం గురించి ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవాలి. 1979 లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. అప్పటి ఈవో స్వర్గీయ పీవీఆర్‍కె ప్రసాద్ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం కనుక్కోవాలని స్వర్గీయ ఉప్పులూరి గణపతి శాస్త్రిని సంప్రదించారు. త్రికరణ శుద్ధిగా యజ్ఞం ఆచరిస్తే ఫలితం తప్పకుండా వుంటుందనీ ఆయన సలహా ఇచ్చారు. వరుణ జపం నిర్వహించి, వరుణ దేవుడి కరుణ పొందాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా వరుణ జపం, ఋత్విక్కుల వేద మంత్రోఛ్ఛారణల మధ్య మూడు రోజులు జరిగింది. యజ్ఞం ముగుస్తూనే క్షణాల్లో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వర్షం కురిసింది. రిజర్వాయర్లన్నీ పొంగి పొర్లుతున్నాయని సమాచారం వచ్చింది. విచిత్రం ఏంటంటే, ఒక్క తిరుమలలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా వర్షం ఛాయలు కూడా కాన రాలేదు.  ఇదంతా కాకతాళీయమా? వేద మంత్రాల శక్తి ప్రభావమా? భక్తులు నమ్ముకున్న దేవ దేవుడి అనుగ్రహమా? ఈ విషయాలను స్వయంగా పీవీఆర్‍కె ప్రసాద్ గారు తన పుస్తకం (నాహం కర్తా, హరిః కర్తా) లో వివరంగా రాశారు.

యజ్ఞ-యాగాలకు సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచిన అమెరికా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇండాలజిస్ట్ స్వర్గీయ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా  ఒకరి నుంచి మరొకరికి, గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!". అందుకే, ఇందుకే యజ్ఞ యాగాలు చేయడం అవశ్యం.

No comments:

Post a Comment