Thursday, September 3, 2020

కాల లక్షణ నిరూపణ .... శ్రీ మహాభాగవత కథ-25 : వనం జ్వాలా నరసింహారావు

 కాల లక్షణ నిరూపణ

శ్రీ మహాభాగవత కథ-25

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

పరమేశ్వరుడి సృష్టికి అంతం, అన్యవస్తు సంయోగం, రెండూ అవసరం లేదు. ఈ యావత్ ప్రపంచం పుట్టుక వేరు. సృష్టిలో విడదియ్యలేని అత్యంతా సూక్ష్మాంశానికే ’పరమాణువు’ అని పేరు. కిటికీ నుంచి ప్రసరించే సూర్యకాంతిలో మనకు కనిపించే చిన్న రేణువులలో ఆరవ భాగానికి ’పరమాణువు’ అని పేరు. సూర్యకాంతి ఈ పరమాణువు ద్వారా ప్రసరించేటప్పుడు పట్టె కాలానికి ’సూక్ష్మకాలం’ అని పేరు. దీన్ని మనం ఊహించుకోవాల్సిందే! సూర్యుడు మేషాది పన్నెండు రాశులలో తిరిగే కాలానికి ’మహత్కాలం’ అని పేరు. దీనినే సంవత్సరం అని కూడా అంటాం. రెండు పరమాణువులు కలిస్తే ఒక ’అణువు’ అవుతుంది. మూడు అణువులు ఒక ’త్రసరేణువు’. మూడు త్రసరేణువులు కలిస్తే ఒక ’త్రుటి’. నూరు త్రుటులు కలిస్తే ఒక ’వేధ’. మూడు వేధలు కలిస్తే ఒక ’లవం’. మూడు లవములు ఒక ’నిమేషం’. మూడు నిమేషాలు ఒక ’క్షణం’. అయుదు క్షణాలు ఒక ’కాష్ట’. పది కాష్టలు ఒక ’లఘువు’. పదిహేను లఘువులు ఒక ’నాడి’. రెండు నాడులు ఒక ’ముహూర్తం’. అలాంటి నాడులు ఆరు కానీ ఏడు కానీ అయితే ఒక ’ప్రహరం’. దానినే ’యామం’ అనీ, ’జాము’ అనీ అంటారు.   

దిన పరిమాణాన్ని తెలిపే నాడిని కొలిచే విధానం ఉన్నది. ఆరు ఫలాల రాగితో పాత్రను సిద్ధం చేసి, నాలుగు మినప గింజల బరువు కల బంగారంతో నాలుగు అంగుళాల పొడవుకల కమ్మీ తయారు చేసి, దానితో ఆ పాత్ర కింద రంధ్రం చేసి, ఆ రంధ్రం గుండా తూమెడు నీరు పూర్తిగా కిందకు కారడానికి ఎంతకాలం పడుతుందో అంత కాలాన్ని ’నాడి’ అంటారు. నాలుగు జాములు ఒక ’పగలు’ అవుతుంది. అలాగే నాలుగు జాములు ఒక ’రాత్రి’ అవుతుంది. పగలు, రాత్రి కలిస్తే మానవులకు ఒక ’దినం’ అవుతుంది. పదిహేను దినాలు ఒక ’పక్షం’ అవుతుంది. ’శుక్ల పక్షం’, ’కృష్ణ పక్షం’ అని రెండు ఉన్నాయి. రెండు పక్షాలు కలిస్తే ఒక ’నెల’. అది పితృదేవతలకు ఒక ’దినం’. రెండు నెలలు ఒక ’ఋతువు’. ఆరు నెలలు ఒక ’ఆయనం’. ఆయనాలు రెండు. ’దక్షిణాయనం’, ”ఉత్తరాయనం’. ఈ రెండూ కలిస్తే ఒక సంవత్సరం. నూరు సంవత్సరాలు మానవులకు పరమాయువు. మానవుల సంవత్సరం దేవతలకు ఒక్క దినం అవుతుంది.

ఈశ్వరుడు అంశ అయిన సూర్యుడు గ్రహ, నక్షత్రాలతో కూడి తారాచక్రంలో ఉండి తారాచక్రంలో ఉండి పరమాణువు మొదలు సంవత్సరం వరకు వున్న కాలంలో పన్నెండు రాశులను చుట్టి వస్తాడు. ఈ సూర్యగమనమే సంవత్సరం, వలీసంవత్సరం, ఇడాసంవత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి ఉంటుంది. సూర్యగమనం వల్ల సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం, బార్హస్పత్యమానం అనే భేదాలతో సంవత్సర కాలం ఏర్పడుతుంది. కాలాన్ని ప్రవర్తింప చేసే సూర్యుడు, విత్తనాల నుండి అంకురాలు మొలకెత్తినట్లు కాలరూపమైన తన శక్తితో అనుకూలంగా మలచుకుంటూ, జీవుల ఆయువు మొదలైనవాటిని తగ్గిస్తూ, ఆయువు తగ్గుతుంటే క్రమంగా విషయాల పట్ల కోరికలు తగ్గుతూ, కోరికలతో యజ్ఞాలు చేసేవారికి గుణాలతో కూడిన స్వర్గాది లోకాలను సమకూరుస్తూ, ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అయిదు విధాలైన సూర్యభగవానుడిని ఆరాధించాలి. 

ఇకపోతే కృతయుగ సంఖ్య నాలుగువేల దివ్య సంవత్సరాలు. దాని సంధ్యాకాలం ఎనిమిదివందల ఏళ్లు. గతించిన యుగానికి, రాబోయే యుగానికి మధ్యకాలాన్ని ’సంధ్య’ అంటారు. త్రేతాయుగ ప్రమాణం మూడువేల దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం ఆరువందల ఏళ్లు. ద్వాపరయుగ ప్రమాణం రెండువేల దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం నాలుగువందల సంవత్సరాలు. కలియుగ ప్రమాణం వెయ్యి దివ్య సంవత్స్రరాలు. సంధ్యాకాలం రెండువందల సంవత్సరాలు. ఈ సంధ్యాంశాల మధ్యకాలంలో ధర్మం అతిశయిస్తుంది. సంధ్యాంశలో ధర్మం అల్పమై వుంటుంది. దర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలు, త్రేతలో మూడు పాదాలు, ద్వాపరలో రెండు పాదాలు, కలియుగంలో ఒక్క పాదంతో సంచరిస్తుంది. ఈ పాదాల భేదం వల్ల ప్రజలలో మర్యాదలు తగ్గుతాయి. అధర్మం పుట్టి వృద్ధిపొందుతుంది.

భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం.....వీటికంటే పైన సత్యలోకం ఉంటుంది. అక్కడ ఉండే బ్రహ్మకు చతుర్యుగాలు వేయి అయితే ఒక పగలు అవుతుంది. అలాగే రాత్రికూడా. బ్రహ్మ రాత్రి నిద్రపోతే లోకాలన్నిటికీ ప్రళయం వస్తుంది. మేల్కొని చూస్తే తిరిగి లోకాలు పుట్తాయి. ఆ బ్రహ్మ ఒక్క దినంలో పద్నాలుగు మన్వంతరాల కాలం గడుస్తుంది. వాళ్లలో ఒక్కొక్క మనువుకాలం 71 దివ్య యుగాలు. దీనికే మన్వంతరం అని పేరు. దేవతలు, మునులు, సప్తఋషులు వీళ్లంతా భగవదంశతో పుట్టి ఈ మన్వంతరాలలో ఈ లోకాలను పాలిస్తారు. శ్రీహరి పితృ, దేవ, పశు, పక్షి, మానవ రూపాలలో జన్మించి ఈ మన్వంతరాలలో తన సత్త్వగుణం వల్ల, పురుష భావం వల్ల ఈ విశ్వాన్ని పాలిస్తాడు. పగలు పూర్తికాగానే బ్రహ్మ శయనిస్తాడు. ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఆయన శక్తిసామర్థ్యాలు, పరాక్రమం అంధకారంతో ఆవరింపబడి వుంటాయి. బ్రహ్మ నిద్రించే సరికి భువనత్రయం కూడా కటిక చీకటిలో సూర్యచంద్రులతో పాటు లీనమై పోతుంది. శ్రీహరి శక్తిరూపమైన సంకర్షణాగ్ని ముల్లోకాలను దహిస్తుంది. ఆ అగ్నికీలలకు వ్యాపించిన వేడికి తట్టుకోలేక మహర్లోకవాసులు జనలోకానికి పరుగెత్తుతారు. ఆ విలయ సమయంలో వీచే భీకరమైన  వాయువులకు ఎగిసిపడే మహా భయంకరమైన సముద్ర జలాలు మూడులోకాలను కప్పేస్తాయి. ఆ మహార్ణవ మధ్యలో శయనించి ఉంతాడు శ్రీమన్నారాయణుడు. తన కడుపులో సమస్త లోకాలను పెట్టుకుని యోగనిద్రలో ఉంటాడు ఆయన.  

ఈ విధంగా అనేక రాత్రుళ్లు, పగళ్లు గడుస్తుంది. మానవుల లాగానే బ్రహ్మ దేవుడి ఆయుర్దాయం కూడా (ఆయన లెక్కలో) వంద సంవత్సరాలే. ఆ వంద సంవత్సరాలలో మొదటి 50 ’పూర్వ పరార్ధం’ అనీ, రెండవ 50ని ’ద్వితీయ పరార్ధం’ అనీ అంటారు. ఈ మొత్తం కాలాన్ని ’బ్రహ్మకల్పం’ అని పిలుస్తారు. ఈ కల్పం ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఉదయించిన కారణంగా బ్రహ్మకల్పం అని పిలుస్తారు. దీనికే ’శబ్దబ్రహ్మం’ అని మరొక పేరుంది. ఎప్పుడైతే పంకజనాభుడి నాభి అనే సరస్సులో సమస్త భువనాలకు ఆశ్రయభూతమై పద్మం ప్రకాశిస్తుందో అది ’పద్మకల్పం’ అనే పేరుతో ఒప్పుతుంది. బ్రహ్మదేవుడి ఆయుర్దాయంలో మొదటి సగం అంటే ’పూర్వ పరార్ధం’ గడిచిపోయింది. ఇక రెండవది అయిన ’ద్వితీయ పరార్ధం’ ప్రారంభం ఎప్పుడంటే సూకరాకారాన్ని ఎప్పుడు ధరిస్తాడో అప్పుడు ప్రారంభమవుతుంది. దానిని ’వరాహకల్పం’ అంటాం. ఇప్పుడు నడుస్తున్న కల్పం వరాహకల్పమే! ఈ శ్వరుడికి పరమాణువు మొదలు పరార్ధం వరకు గల కాలం ఒక్క నిమిషం మాత్రమే. ఈశ్వరుడే కాలానికి కర్తగాని, కాలం ఈశ్వరుడికి కాదు. శ్రీమహావిష్ణువు అన్నిటికీ అతీతుడు. ఆ మహాపురుషుడికి కాలం ఎన్నటికీ కర్తకాదు. ఈ బ్రహ్మాండం పదహారు వికారాలతో కూడి, పంచభూతాలు, పది విధాలైన ఆవరనాలు కలిగి, 50 కోట్ల యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. భగవంతుడు పరమాణు రూపంలో బ్రహ్మాండంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అసంఖ్యాకమైన మహాండ సమూహాలు ఆయనలో అణగి ఉంటాయి. ఆ పరమపురుషుడిని వర్ణించడం ఎవరి తరం కాదు.    

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

Wednesday, September 2, 2020

రామరావణ యుద్ధానికి నాంది శూర్పనఖోపాఖ్యానమా? .... వనం జ్వాలా నరసింహారావు

 రామరావణ యుద్ధానికి నాంది శూర్పనఖోపాఖ్యానమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ, చింతన (03-09-2020)

సీతారామలక్ష్మణులు వనవాసం చేయాల్సిన పద్నాలుగు సంవత్సరాలలో పదమూడవ సంవత్సరం గడుస్తున్న సందర్భంలో, మార్గశిర మాసం నడుస్తున్నప్పుడు ఒక రోజున శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులతో కూడి గోదావరీ నదీ స్నానం చేసి, పూర్వుల, పెద్దల కథలు చెప్పుకుంటూ ముచ్చటించుకుంటుండగా, రావణాసురుడి చెల్లెలు శూర్పణక అందమైన ఆకారంతో ఆశ్రమంలో ప్రవేశించింది. శ్రీరామచంద్రమూర్తిని చూసి కామదగ్దచిత్త అయ్యి, ఆ రాక్షసి, శ్రీరాముడిని చేరవచ్చింది.

వచ్చి, మోహావేశంతో శూర్పణఖ శ్రీరాముడిని చూసి "నువ్వెవరివి? జడలతో మునీశ్వరుడి వేషం ధరించి, కాముకుడవై, భార్యతోనూ, క్షత్రియ రూపంలో విల్లు-బాణాల తోనూ, రాక్షసులు స్వేచ్చగా తిరిగే ఈ స్థలానికి ఎందుకు వచ్చావు? ఈ ప్రకారం ఇక్కడ వుండడానికి కారణం ఏమిటి?" అని అడగగా శ్రీరామచంద్రమూర్తి ఇలా చెప్పాడు.

"దశరథుడనే మహారాజు పెద్ద కొడుకును నేను. నన్ను రాముడని అంటారు. వీడు నా తమ్ముడు లక్ష్మణుడు, వా వెంట వచ్చాడు. ఈ స్త్రీ నా భార్య సీత. తల్లిదండ్రుల ఆజ్ఞ మీరలేక పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని నిర్వహించే కోరికతో తపోరూప ధర్మాన్ని స్థాపించడానికి మేం వచ్చాం. మా చరిత్ర విన్నావు కదా? నువ్వే జాతిదానివి? నీ పేరేంటి? ఎవ్వరిదానవు? సత్యం చెప్పు. ఇది రాక్షస భూమి ఐనా నీ మనోహరాకారం చూసి రాక్షసివి అవుతావని అనుకోను. ఇక్కడికి నువ్వు రావడానికి కారణం ఏంటి?". ఇలా అడిగిన రామచంద్రమూర్తికి నిజం చెప్తా వినమని అంటుంది.

శూర్ఫనఖ శ్రీరాముడితో, "సుందరుడా! నేను శూర్పణఖ అనే స్త్రీని. కోరిన రూపాన్ని ధరించగలను. ఈ అడవుల్లో ఒంటరిగా తిరుగుతుంటాను. విశ్రవసుడి కొడుకు రాక్షసరాజైన రావణాసురుడి పేరు విన్నావా? అతడు మా అన్న. కుంభకర్ణుడు, విభీషణుడు కూడా నా తోడబుట్టిన వారే. ఖరదూషణులు కూడా నా తోబుట్టువులే. వాళ్లు యుద్ధంలో మహాశూరులు. వావి వరుసలకు వాళ్లు నా అన్నలని చెప్పానేకాని వారి ఆజ్ఞకు లోబడి వుండేదాన్ని కాను నేను. నా ఇష్ట ప్రకారం నేను తిరుగుతుంటాను. కాబట్టి నువ్వు నన్ను గ్రహించావా వాళ్లు నీ మీద కోపంగా వుంటారని భయపడాల్సిన పనిలేదు. చక్కదనంలో నీలాంటి వాడిని నేను చూడలేదు. కాబట్టి కళ్లారా నిన్ను చూసింది మొదలు దొడ్డమగవాడా, నువ్వే నాకు తగిన మగడవని నిన్ను కోరుతున్నాను. నువ్వు నన్ను తిరస్కరించావా, మా అన్నలందరనీ నీమీదకు యుద్ధానికి పిలుచుకొనివచ్చి నిన్ను చంపిస్తాను” అంటుంది.

"రామా! నాకిదివరకే భార్య వుందంటావేమో? చీ, చీ, ఇదేమి సీత? చూడడానికి రోత పుడ్తున్నది. వేలెడు ముక్క. వెన్నంటు డొక్క విరిచిన బొందె తుంటెలాగా విరుగు కాళ్లు, చేతులు, చింతాకంత కళ్లు, అసలే లేని గోళ్లు, ఇక నా సొగసు నేనే చెప్పకూడదు కాని, నా డొక్క, నా పిక్క, నా ముక్కు, నా చెక్కు, నా గోళ్లు, నా కాళ్లు, నా కళ్లు, నా చన్నులు, నా చేతులు ఎలా వున్నాయో చూడు. సీత వికార రూప. దీన్ని వదిలిపెట్టు. దూరంగా పొమ్మను. నీలాంటివాడికి తగిన పెళ్లాం కాదు. కానేకాదు. నెనే ముద్దు పెళ్లామని అను. నన్ను సరిగ్గా చూడు. నేను నీకు తగిన భార్యను కానా? అవునను. కాబట్టి నన్ను నీ భార్యగా చేసుకో. దీన్నేం చేద్దామంటావా? దీన్ని నీ తమ్ముడితో సహా ఇప్పుడే గుటుక్కున మింగుతా. ఆ తరువాత నీకు ఇంక భయం లేదు...ఈ జంజాటం వుండదు" అని అంటుంది శూర్ఫణఖ.

శూర్పణఖ చెప్పాడిలా రాముడు: "రాకాసీ! దీనిని ముందు పెళ్లి చేసుకున్నాను. అయినా ఏంటంటావా? ఇప్పుడు ప్రియురాలైన దీనిని నేనెలా విడుస్తాను? అది ధర్మం కాదే? అది వుండవచ్చు. నువ్వూ వుండవచ్చు అంటావా? నీలాంటి అద్భుతమైన అందగత్తెకు సవతి పోరు వుండకూడదు. కాబట్టి నీకు దుఃఖం కలగక తప్పదు. నిన్ను దుఃఖ పెట్టడానికా పెళ్లి చేకోవడం? కాబట్టి నామీద భ్రాంతి వదిలిపెట్టు. నువ్వు కామం నిలుపలేనని అంటావా? ఇదిగో వీడిని చూడు. మంచి శీలం కలవాడు. నా తమ్ముడు. చూడడానికి ప్రియమైన వాడు. సహించరాని తేజం కలవాడు. లక్ష్మణుడనే పేరుకలవాడు. ఈ లక్ష్మణుడు భార్య లేనివాడు. అసమాన శౌర్యవంతుడు. సమర్థుడు. యౌవనంలో వున్నాడు. అందగాడు. ఇదివరకు భార్యా సుఖం తెలియనివాడు. భార్య కావాలని కోరుతున్నాడు. నీ అందమైన రూపం చూడగానే వీడు నీకు పతిత్వయోగ్యుడు అవుతాడు. సవతి పోరులేకుండా అతడిని భజించు”.



అని శ్రీరామచంద్రుడు చెప్పగా విని ఆ రాక్షసి, నిమిషమైనా ఆలశ్యం చేయకుండా, లక్ష్మణుడితో "ఓయీ అందగాడా! నీ చక్కదనానికి సరైన అందగత్తెను నేనే. నీకు పెళ్లాం అవుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. వనాలలో,కొండలలో సంచారం చేద్దామా? రా, పోదాం" అన్నది. 

శ్రీరామచంద్రమూర్తి పరిహాసంగా మాట్లాడిన భావం తెలుసుకొన్న లక్ష్మణుడు, తానూ శూర్పణఖతో పరిహాసంగానే మాట్లాడాడు. "ఓసీ! వెర్రి పిల్లా! నేను బానిసను. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు కూడా బానిసవై వీరి సేవ చేస్తావా? నీ చక్కదనానికి నువ్వు బానిసగా వుంటావా? ఈ మహాత్ముడుకి నేను బంటుగా సేవ చేస్తున్న సంగతి నీకు తెలియదేమో? నీకు తెలిసే అవకాశం లేదు. తెలుస్తే, నేనేంటి, బానిసను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకొనేదానివి. అలాంటి సమృద్ధమైన అర్థం కలవాడిని నువ్వే సంతోషపెట్టగలవు. నిర్మలకాంటి కలదానివి కాబట్టి, నువ్వు, ఆయన్నే వరిస్తే నువ్వు చిన్న భార్యవై, కులుకుతూ ముద్దులొలకవచ్చు. ఇలాంటి వికార స్వరూపం గలదానిని, భయంకర స్వరూపం వున్నదానిని, ఆ సవతిని, పెద్ద పొట్టకలదానిని, ముసలిదానిని, జానకిని నెట్టి నిన్ను భార్యగా గ్రహిస్తాడు. ఇలాంటి పరమ సుందరిని వదిలి ఎవరు మనుష్య స్త్రీకొరకు వేడుక పడతాడు?" అని లక్ష్మణుడు పలికాడు శూర్పణఖతో.

లక్ష్మణుడు చెప్పిన మాటలు పరిహాస వచనాలని తెలుసుకోలేని ఆ బుద్ధిహీన, నిజమని నమ్మి, పర్ణశాలలో సీతతో వున్న శ్రీరామచంద్రుడి దగ్గరకు పోయి ఇలా అంది: "ఈ విరూపను, సవతిని, ఈ కరాళను, నిర్ణతోదరిని గ్రహించి నువ్వు నన్ను గౌరవించడం లేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే మింగి సవతిపోరు లేకుండా సుఖపడతాను". ఇలా అంటూ శూర్పణఖ జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీతమీద దూకింది. ఇది చూసిన శ్రీరాముడు దాన్ని బిగపట్టి, కోపంతో లక్ష్మణుడితో "లక్ష్మణా! నీచులతో పరిహాసం ఆడడం తప్పు. అలా మనం చేసినందువల్ల కష్టం కలిగింది. దీనివాత పడకుండా సీతాదేవి ఎలా బతికి సుఖంగా వుంటుందో ఆలోచించు. ఇది స్త్రీ. ఆయుధం ధరించి యుద్ధానికి వచ్చింది కాదు. కాబట్టి చంపకూడదు. దీన్ని, బలగర్వంతో దేహం తెలియనిదాన్ని, రాకాసిని పట్టుకొని విరూపగా చేయి" అన్నాడు. అప్పుడు శూర్ఫణఖ కంటే మహాబలశాలి అయిన లక్ష్మణుడు తటాలున కత్తి దూసి, అది ఎదిరించినా వదలక, దాని ముక్కు, చెవులు కోశాడు.

ముక్కు-చెవులు ఈ విధంగా మొక్కలు పోగా, లబలబ నోరు కొట్టుకుంటూ, రొమ్ము గుద్దుకుంటూ, వానాకాలంలోని మేఘం అదిరినట్లు, అడవి ప్రతిధ్వనించేట్లు, పెద్ద ధ్వనితో బొబ్బలు పెట్టుకుంటూ, నెత్తురు కారుతుంటే, వికార రూపం మరింత వికారం కాగా, మనుష్యులు తనను ఇలా చేశారే, నలుగురిలో నవ్వుల పాలైతిని కదా అని ఆక్రోశంతో ఏడుస్తూ అడవుల్లో పడి వేగంగా పరుగెత్తింది. 

ఇలా పరుగెత్తుకుంటూ పోయి జనస్థానంలో రాక్షసుల మధ్యన వున్న తమ్ముడు ఖరుడిని చూసి, ఏడుపు ధ్వనితో ఆకాశం నుండి పిడుగుపడ్డట్లు ధభీలున నేలమీదపడి పెద్దపెట్టున ఏడ్చింది.

           దేహమంతా నెత్తురుతో తడిసి నేలమీద పడి, వికార రూపంతో ఏడుస్తున్న శూర్పనఖను చూసి ఖరుడు ఇలా అన్నాడు. “ఎవరినీ తరుమకుండా, బెదిరించకుండా, బుసకొట్టకుండా, తనంతట తాను బుట్టలో కదలకుండా వుండే మహా భయంకర, విషంకల నల్ల త్రాచుపామును ఎవడు వేలితో పొడిచాడు? ఎవడీ విషం తాగింది? ఎవడు తనంతట తానే మృత్యుపాశాన్ని తన కంఠానికి తగిలించి బిగించుకున్నాడు? చెప్పు. నేనిప్పుడే వేగంగా పోయి వాడిని చంపి నెత్తురు తాగుతా. నువ్వు బలం, పరాక్రమం విశేషంగా వున్నదానివి. కాబట్టి సామాన్య బలవంతులు నిన్ను పరాభవం చేయలేరు. నువ్వు కోరిన చోట, కోరిన రూపంతో తిరగగలిగే దానివి. నిన్ను అడ్డగించగలవారు లేరు. అలాంటి నిన్ను ఎవడే దీర్ఘకాలం బతకడానికి ఇష్టపడక ఇలాంటి కష్టాల పాలు చేశాడు? దేవతలలో కాని, గంధర్వులలో కాని, పరమర్షులలో కాని, దౌర్జన్యంగా ఇలాంటి పెద్ద అపకారం చేయడానికి తెగించిన వాడు ఎవడో చెప్పు. వాడిని చంపుతా”. అని ఖరుడు అడగ్గా, తోడ బుట్టిన వాడి మాటలు విని విస్తారంగా కన్నీళ్లు కాల్వలుగా కారుతుంటే, ఈ విధంగా చెప్పింది శూర్పణఖ.

         “నన్నీ ప్రకారం చేసింది ఎవరని అంటావా? చెప్తా విను రాక్షసుడా! వారు యౌవనవంతులు. చక్కటివారు. మునుల వేషంలో వున్నారు. కోమల దేహం కలవారు. మహాబల సంపన్నులు. నార చీరెలు, కృష్ణాజినం వస్త్రాలుగా వున్న వారు. అడవిలో లభించే పళ్ళు తింటారు. ఇంద్రియ నిగ్రహం కలవారు. ధర్మ మార్గంలో వుండేవారు. అన్నదమ్ములు వాళ్ళు. దశరథరాజ కుమారులు. శ్రీరామలక్ష్మణులు అనే పేర్లు కలవారు”.

         తనను విరూపను చేసినవారెవరు? అని ఖరుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శూర్పనఖ దశరథ రాజకుమారులు శ్రీరామలక్ష్మణులు అని చెప్పే బదులు, వారి సౌందర్యాన్ని ఎందుకు వర్ణించాలి? ఆమెలో కామం విఘ్నమై కోపంగా మారిందేకాని, కామం చావలేదు. వైరాగ్యం ఇంకా పుట్టలేదు. గాఢంగా శ్రీరామలక్ష్మణ రూపాలలో మనస్సు నాటుకొని వుండడం వల్ల, వారి మూర్తులే దానికి కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. అలా కామమోహిత అయినందువల్ల దాన్ని నిగ్రహించుకోలేక తమ్ముడి ఎదుట ఆ భావాన్నే బయట పెట్టింది. “కామాతురాణాం నభయం నలజ్జా” అనే నానుడి వుంది. అంటే, కామాతురులకు భయం, సిగ్గు వుండదు. ఈ కారణం వల్లే రామలక్ష్మణుల సౌందర్య వర్ణన చేసింది శూర్పనఖ. ఇలా చేయడం స్త్రీ అయిన శూర్పనఖ గొప్ప కాదు. శ్రీరామచంద్రమూర్తిని చూసిన వారందరూ, అనుకూలమైనా, ప్రతికూలమైనా ఇలానే మాట్లాడుతారు.

         శూర్పణఖ తన జవాబును కొనసాగిస్తూ...”తాము దశరథ రాజకుమారులమని చెప్పారేకాని, వారి తేజస్సు చూస్తే, వాళ్ల మాట నమ్మడం కష్టంగా వుంది. అయినా, వారు అసత్యమాడేవారిలాగా లేరు. కాబట్టి వారి మాట ప్రకారం వాళ్లు మనుష్యులో, నా ఆభిప్రాయం ప్రకారం దేవతలో చెప్పలేను. చూడడానికి రాజచిహ్నాలున్నా గంధర్వరాజుతో సమానంగా వున్నారు. ఆ ఇద్దరిమధ్య ప్రాయంలో వున్నా ఒక పడుచును, సమస్తాభరణాలు ధరించిన దానిని, సన్నటి నడుముకల దానిని, తామర రేకుల్లాంటి కళ్లున్న దానిని చూశాను. అలాంటి సుందరిని నేనింతవరకు చూడలేదు. ఆ పడుచుకోసం నన్ను వారిద్దరూ ఒక్కటై, రంకుటాలిలాగా దిక్కులేని దాన్ని చేసి దురవస్థల పాలు చేశారు” అని అంటుంది. జరగబోయే రామరావణ యుద్ధానికి ఈ విధంగా అంకురార్పణ జరిగిమ్దనాలి ఒక విధంగా.

(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

పంకజభవుడి జన్మ వృత్తాంతం .... శ్రీ మహాభాగవత కథ-24 : వనం జ్వాలా నరసింహారావు

 పంకజభవుడి జన్మ వృత్తాంతం

శ్రీ మహాభాగవత కథ-24

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

పూర్వం ప్రళయ సమయంలో అనంతమైన దివ్యజలాలు తప్ప వేరేమీ లేవు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేశువును పాన్పుగా చేసుకుని ఆ దివ్య జలాల మీద పవళించాడు. ఆయన నిద్రిస్తున్నట్లుగా కళ్లుమూసుకుని అద్వితీయ, ఆనందమయుడై విరాజిల్లాడు. అలా వెల యుగాలు గడిచిన తరువాత సృష్టికార్యానికి పూనుకున్నాడు. అప్పటిదాకా తన గర్భంలో ఉంచుకున్న అనేక బ్రహ్మాండాలను తిరిగి సృజించడానికి సాధనమైన సూక్ష్మ పదార్థాన్ని చిత్తంలో భావించి కాలానుగుణమైన రజో గుణాన్ని సృష్టించాడు. దానివల్ల  పరమేశ్వరుడి నాభిలో తామరతూడు పుట్టింది. తన తేజస్సుతో ఆ మొగ్గను సూర్యుడిలాగా వికసింప చేసి, సర్వలోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిని, సర్వ గుణాలతో ఒప్పే గతిని కలిగి ఉన్న ఆ పద్మంలో పరమేశ్వరుడు తన కళను కలిపాడు. దాని మూలాన చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. ఆయన కళ్ళుతెరిచి లోకాలను, దిక్కులను, ఆకాశాన్ని తన నాలుగు ముఖాలతో చూశాడు. ఇదంతా, ఇవన్నీ ఏమిటో తెలియక తనలో తానే తర్కించుకున్నాడు.

నీళ్లలో పద్మం మూలం ఎక్కడ ఉందో కనుక్కుందామని చతుర్ముఖ బ్రహ్మ ఆ తామర తూడు లోపలి బ హాగం నుండి ప్రవేశించాడు. అలా వేల దివ్య సంవత్సరాలు వెతికి-వెతికి, తామర తూడు మూలాన్ని కనిపెట్టలేక, భగవంతుడి మాయా ప్రభావానికి భయపడి తిరిగి తాను బయల్దేరిన ప్రదేశానికే వచ్చాడు. అలా చేరిన బ్రహ్మ పద్మ పీఠంమీద కూర్చుని తపస్సమాధిలో వంద సంవత్సరాలు గడిపాడు. తన ధ్యానాన్ని హృదయంలో నిలిపి హృదయ కర్ణికలో తనను కన్న శ్రీహరిని, ఆదిశేషుడిని తల్పంగా చేసుకుని శయనిస్తున్న శ్రీహరిని చూడగలిగాడు. ఆయన నాభి నుండి పుట్టిన కమలాన్ని, జలాన్ని, అగ్నిని, ఆకాశాన్ని, భువన నిర్మాణం చెయ్యాలనే దృష్టిని చూశాడు బ్రహ్మ. ఆయనకు ఇంకేమీ కనిపించ లేదు. తాను నెరవేర్చబోయే సృష్టి కార్యానికి కారణభూతమైన రజోగుణం అనే బీజం తనలో ప్రభవించగా అంతం లేని ప్రజాసృష్టికి కారణభూతుడై నిలిచాడు. శ్రీహరి తత్త్వాన్ని బ్రహ్మ స్తుతించాడు అనేక విధాలుగా.

బ్రహ్మ ప్రార్థనను మన్నించిన స్వామి ప్రసన్నుడై ఈ సృష్టి చేయాలనే సంకల్పంతో ప్రళయకాలంలో పుట్టిన అనంతమైన జలరాశిని అవలోకించాడు. బ్రహ్మతో ఇలా అన్నాడు: ‘జీవులను సృష్టిస్తూ, ఆ జీవ సమూహంలో ఉంటూ, నన్ను ఎప్పుడూ తలచుకో. నా ప్రీతికోసమే నిన్ను సృష్టించాను. నాలో అణిగి కదలకుండా ఏకరూపంలో వున్న లోకాలన్నిటినీ అహంకారమే మూల తత్త్వంగా నువ్వు పుట్టించు’ అని చెప్పి శ్రీమహా విష్ణువు అంతర్థానమయ్యాడు.

విష్ణువు వరప్రభావం వల్ల బ్రహ్మ నూరు దివ్య సంవత్సరాలు భగవంతుడిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు వీచిన కాల వాయువుకు తన నివాసమైన పద్మం కదిలింది. నీరు చలించింది. దాన్ని చూసిన బ్రహ్మ తన తపశ్శక్తితో వాయువును బంధించి కనిపిస్తున్న మహా జలాన్నంతా ఇక్క గుక్కతో తాగి గగన వ్యాప్తమైన జలాన్ని చూశాడు. భాగంతుడిని మళ్లీ ధ్యానించాడు. అప్పుడు ఆయనకు గగనతలంలో ఒక పద్మం, దానిలో దాగి ఉన్న లోక సమూహం కనిపించాయి. వెంటనే బ్రహ్మ తాను విష్ణువు నియమించిన వాడిగా తలచి, అ అపద్మం లోపలి పోయి, అందులో ఉన్న మూడు లోకాలను చూసి, ఆ తరువాత, తన మహిమతో చతుర్దశ భువనాలను సుందరంగా సృష్టించాడు. తన ధర్మానికి ఫలస్వరూపంగా దేవతలు, పశుపక్ష్యాదులు, నరులు, ఇతరాలతో కూడిన ఈ అనంత సృష్టిని బ్రహ్మ నిర్మించాడు.

ఆది, అంతం లేనిది, అవ్యయమైనది అయిన తత్త్వమే ఈ సృష్టికి మూల కారణం. ఈశ్వరుడు కాలానికి తగిన రూపం ధరించి, కాలానికి తగిన రూపాన్ని గైకొని, కేవలం వినోదానికై తనను తానే సృష్టించుకున్నాడు. ఆ ఈశ్వరుడిలోనే లోకాలన్నీ ఉంటాయి. అన్ని లోకాలలోనూ ఈశ్వరుడు ఉంటాడు. ఈ అనంత విశ్వానికి కార్యం, కారణం రెండూ ఆయనే! ఆ మహాపురుషుడి నుండి వెలువడి ఈ విశ్వం ప్రకాశిస్తున్నది. శ్రీమహావిష్ణువు మాయవల్ల ఈ విశ్వమంతా ఒక పద్ధతిలో పుట్టి, పెరిగి, నాశనమవుతూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది.

ఇలాంటి సృష్టి తొమ్మిది విధాలు. వాటిలో ‘ప్రాక్రుతాలు’, ‘వైకృతాలు’ అనేవి కాల, ద్రవ్య, గుణాలు అనే మూడు విధాలైన భేదాలతో పరస్పరం సంకరం అవుతుంటాయి. అందులో ‘మహత్తత్వం’ మొదటి సృష్టి. అది నారాయణుడి సమీపంలో గుణభేదాన్ని పొందుతుంది. ద్రవ్యజ్ఞాన క్రియాత్మకమైన ‘అహంకార తత్త్వం’ రెండవ సృష్టి. శబ్దస్పర్శరూపరసగందాలు అనే పంచతన్మాత్రల ద్రవ్యశక్తితో కూడిన పృథ్వి మొదలైన ‘పంచభూతాల’ సృష్టి మూడవది. జ్ఞానేంద్రియాలైన చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు; కర్మేంద్రియాలైన వాక్కు, చేతులు, కాళ్లు, పాయువు, ఉపస్థ; అనే ‘పది ఇంద్రియాల పుట్టుక’ నాలుగవ సృష్టి. సాత్త్వికాహంకారం వల్ల పుట్టిన ‘దేవతాగణాల’ సృష్టి ఐదవ సృష్టి. ప్రాణి సమూహానికి అజ్ఞానకృత్యాలైన ఆవరణ విక్షేపాలు కలిగించే ‘తామస’ సృష్టి ఆరవది. ఈ ఆరు భగవంతుడి లీలా విలాసాలైన ‘ప్రాకృత’ సృష్టులు.

వనస్పతులు, ఓషధులు, తీగలు, వెదుళ్ళు, దుబ్బులు, పొదలు, ఫల వృక్షాలు, అవ్యక్తమైన చైతన్యంతో పైకి పెల్లుబుకుతూ తమోమయాలై లోపల మాత్రమె స్పర్శ జ్ఞానం కలవై కదిలిపోలేని ఇవన్నీ ఏడవ సృష్టి. ఎనిమిదవ సృష్టిలో 28 భేదాలున్నాయి. రేపు అనే జ్ఞానం లేనివి, ఆహారం మీదే ఆసక్తి కలవి, పెద్దగా ఆలోచన చేయనివి, చీలిన గిట్టలు (ఎద్దు, ఎనుము, మేక లాంటివి) కలవి, చీలని గిట్టలు (గాడిద, గుర్రం లాంటివి) కలవి,  ఐదు గోళ్లు (కుక్క, నక్క లాంటివి) కలవి, జలచరాలు (మొసలి), రాబందు, గద్ద, కొంగ, డేగ లాంటి ఆకాశంలో తిరిగే తిర్యక్కులు, ఇవన్నీ ఎనిమిదవ సృష్టి. తోమ్మిదోది ‘మానవ’ సృష్టి. ఏడు, ఎనిమిది, తొమ్మిద సృష్టులు ‘వైకృత’ సృష్టులు.

దేవ సర్గం కూడా ఎనిమిది విధాలు. అందులో విబుధులు, పితృదేవతలు, సురాదులు మూడు భేదాలు. గంధర్వులు, అప్సరసలు ఒకటి; యక్షులు, రాక్షసులు ఒకటి; భూత, ప్రేత పిశాచాలు ఒకటి; సిద్ధ, చారణ, విద్యాధరులు ఒకటి; కిన్నర కింపురుషులు ఒకటి. ఈ ఎనిమిది కలిసి దేవ సర్గం అయింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు పది విధాలైన సృష్టులను నిర్మించాడు.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

Tuesday, September 1, 2020

బ్రహ్మ నారదుడికి వివరించిన భగవన్మాయ ..... శ్రీ మహాభాగవత కథ-23 : వనం జ్వాలా నరసింహారావు

బ్రహ్మ నారదుడికి వివరించిన భగవన్మాయ 

శ్రీ మహాభాగవత కథ-23

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వచ్చి “భగవన్మాయ” గురించి అడిగాడు. శ్రీమహావిష్ణువు తనకు చెప్పిన విధంగా బ్రహ్మ, నారదుడికి తెలియచేశాడు ఇలా: ‘భాగవత తత్త్వంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ మహాపురాణం పది లక్షణాలతో ఉన్నది. అవి: “సర్గం, విసర్గం, స్థానం, పోషణం, ఊతులు, మన్వంతరాలు, ఈశానుచరితం, నిరోధం, ముక్తి, ఆశ్రయం”. మహత్తు, అహంకారం, ఐదు తన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, ప్రపంచం, అంతా భగవంతుడిలో ఉండడాన్ని “సర్గం” అంటారు. బ్రహ్మ విరాట్పురుషుడి నుండి పుట్టి చర-అచర (కదలికగల, కదలలేని) భూత సృష్టి చేయడాన్ని “విసర్గం” అంటారు. వైకుంఠవాసుడి కల్పామ్తపు విజయాన్ని “స్థానం” అంటారు. విష్ణువు తన భక్త జనులను ఆపదలనుండి కాపాడడాన్ని “పోషణం” అంటారు. పరంపరాగత కర్మవాసనలను “ఊతులు” అంటారు’.

‘ధర్మాన్ని విస్తృతం చేసి చెప్పడాన్ని “మన్వంతరాలు” అంటారు. పద్మనాభుడి అవతారాలను వచించి, భక్తజనుల వృత్తాంతాన్ని విస్తృతంగా చెప్పేవాటిని “ఈశానుచరితలు” అంటారు. గోవిందుడు ఆదిశేషుడి పాన్పుమీద యోగనిద్రలో మునిగి ఉన్న అవస్థా విశేషాలను పలకడాన్ని “నిరోధం” అంటారు. దీనినే “అవాంతర ప్రళయం” అని కూడా అంటారు. జీవుడు భగవంతుడి కరుణకు పాత్రుడై ఎన్నో జన్మలు ఎత్తుతాడు. చివరకు జీవి హరి రూపు పొందడాన్ని “ముక్తి” అంటారు. ఇవికాక, పుట్టడం, ఉండడం, పోవడం అనేవి ఎక్కడ ప్రకాశిస్తాయో దాన్ని “ఆశ్రయం” అంటారు. ఇదే “పరమాత్మ”. ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆదిభౌతికం అనే ఆత్మతత్త్వం మూడు విధాలు. వీటిల్లో కన్ను మొదలైన గోళాల ద్వారా తెలుసుకోగలిగేది “ఆధ్యాత్మికం”. నేత్రం సంరక్షణతో దర్శించేవాడైన జీవుడిని “ఆధిదైవికుడు” అంటారు. ఆధ్యాత్మికం, ఆధిదైవికాలు ఎవరిలో ఉంటాయో అతడు “ఆధిభౌతికుడు”. అతడే విరాట్స్వరూపుడు అవుతాడు’.

‘విలాసార్థం జగత్తును పుట్టించాలనే సంకల్పం ఆ మహాపురుషుడికి కలిగింది. ఆ ఆలోచనతో బ్రహ్మాండాన్ని చీల్చాడు. మొదలు తన సుఖం కొరకు శుచిగా ఉండే నీళ్లను పుట్టించాడు. ఆ జలరాశిలో పవళించాడు. ఆ విరాట్స్వరూపుడి హృదయాకాశం నుండి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. నోటి నుండి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. ముఖం నుండి శోభిల్లి పలుకు తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది. ఇలా, ముఖం నుండి వాక్కు పుట్టింది. దీనికి దేవత అగ్ని. ఈ రెండింటి కలయికవల్ల సంభాషణం వెలువడింది. నీరు అగ్నికి ప్రతిరోధకం అయింది. మహావాయువు వల్ల ముక్కు పుట్టింది. దీని దేవత వాయువు. దీనికి వాసన పట్టే గుణం ఉంది. తేజస్సు నుండి రెండు కళ్ళు పుట్టాయి. వీటి దేవత సూర్యుడు. భగవతుడి చెవి అనే ఇంద్రియ కారకుడు అయ్యాడు.  దీని దేవత దిక్కులు. తరువాయ చర్మం ఏర్పడింది. దాని నుండి రోమాలు పుట్టాయి. వీటి మూలదేవత చెట్లు. వాయువు నుండి చేతులు పుట్టాయి. ఈశ్వరుడి శరీరం నుండి పాదాలు పుట్టాయి. స్త్రీ-పురుష కలయిక వల్ల సంతానం కలిగింది. అదే విధంగా బొడ్డు అనే ద్వారం పుట్టింది. పొట్ట, నాడీ మండలం నిర్మితమయ్యాయి. హృదయం పుట్టింది అలాగే. విరాట్పురుషుడి తనువు నుండి ఏడు ధాతువులు, ఏడు ప్రాణాలు పుట్టాయి. ఇదంతా ఆ పరమేశ్వరుడి స్థూల శరీరం’.      

ఈ స్థూల శరీరం, భూమి, నీరు (పంచ భూతాలు, మనస్సు, బుద్ధి) మొదలైన ఎనిమిది ఆవరణలతో చుట్టుకోబడి ఉంటుంది. సంపూర్ణమైన వైభవంతో బ్రహ్మాండాన్ని మించి వెలుగుతుంటుంది. విరాట్పురుషుడి రూపానికి ఆది, అంతం ఉండదు. మనస్సుకు కాని, మాటకు కాని గోచరం కాదు. తేజోవంతమైన ఈ భగవత్ స్వరూపం స్థూల-సూక్ష్మ రూపాలలో మహాపురుషుడి మాయా శక్తి వల్ల ఏర్పడింది. ఈ మాయా ప్రభావాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. లక్ష్మీపతి బ్రహ్మరూపుడై జగత్సృష్టి చేశాడు. విష్ణు రూపుడై కాపాడాడు. శివుడి రూపంలో సమస్త విశ్వాన్నీ హరింప చేస్తాడు. ఈ విధంగా ధర్మరూపుడై ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. రక్షించాడు. అణచి వేశాడు. సమస్త రూపాలనూ తానే ధరించాడు.

విష్ణుమూర్తి నుండి ఆకాశం, ఆ నింగి నుండి వాయువు, ఆ గాలి నుండి అగ్ని, దాన్నుండి నీరు, నీటి నుండి నేల, ఆ భూమి నుండి అనేక రకాల ప్రాణులు పుట్టాయి. ఈ అన్నిటికీ మూలాధారుడైన వాడు నారాయణుడు. అతడు చిదానంద స్వరూపుడు. అవ్యయుడు. జన్మరహితుడు. అంతం లేనివాడు. ఆద్యంతాలు కానరానివాడు. ఎంత మహానుభావులైనా కూడా ఇలాంటి దైవం నిర్మించిన ఈ సృష్టికి హేతువును, సృష్టి సరణిని గ్రహించలేక పోతున్నారు. ఈ విశ్వమంతా భగవంతుడి స్వరూపమే! సమస్తం ఆయనే! ఆయనే సర్వానికి ప్రభువు. బుద్ధులన్నిటికీ ఆయనే ఉపలక్షణం.

సృష్టికి పూర్వం తనదైన మాయతో తనలోనే లయం అయిన శక్తిని తానే విశ్వగర్భుడై, తానొక్కడే అయి వెలుగుతూ ఉంటాడు. ఆయనకు జన-మరణాలు లేవు. భగవంతుడికి సృష్టి సంకల్పం కలిగేసరికి తానె కార్యం, కారణం, అయి మాయా శక్తిగా పిలవబడుతున్న అవిద్య పుట్టింది. ఆ మాయను తన శక్తిగా ప్రతిష్ట చేసి పరమాత్మ తన కడుపిలో నుండి విశ్వాన్ని సృష్టించాడు. తన మాయ వల్ల మహాత్తత్త్వాన్ని పుట్టించాడు. ఇది భగవంతుడికి మాత్రమే కనిపిస్తూ, సృష్టి చేయాలనే కోరికతో మరో రూపాన్ని పొందింది. దాంట్లో నుండి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే పేర్లతో భేదాలు ఏర్పడి, పంచ భూతాలు, ఇంద్రియాలు, మనస్సు పుట్టాయి. ఆ తరువాత అహంకారం ఏర్పడింది. ఇది సత్త్వరజోస్తమో గుణాలతో కూడి ఉంటుంది.

పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు వేర్వేరుగా ఉండి సమైక్యం కాలేకపోవడంతో సృష్టి సామర్థ్యం వాటికి చాల లేదు. అందువల్ల దేవతలందరు నారాయణుడిని ప్రార్థించారు. జగత్తును సృష్టించే శక్తిని తమకివ్వమని అడిగారు. విష్ణుమూర్తి కూడా జగత్తును సృష్టించే శక్తి రాకపోవడాన్ని గమనించాడు. అప్పుడు ప్రకృతిలో తన శక్తిని ప్రవేశపెట్టి, 27 తత్త్వాలలో తానూ ప్రవేశించి వాటికి ఏకత్వాన్ని కలిగించాడు. ఆ 27 తత్త్వాలు: పంచభూతాలైన పృథ్వి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం; పంచకర్మేంద్రియాలైన నోరు, కాళ్లు, చేతులు, మల అవయవం, మూత్ర అవయవం; పంచజ్ఞానేనింద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం; చతురాంతః కరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం; పురుషుడు, ప్రక్రుతి, మహత్తు.

ఈ విధంగా జగత్తును నిర్మించడంలో శ్రీహరి ఇందులో పాల్గొన్న అన్నిటికీ పరస్పరం అన్యోన్యతను కలిగించగా తత్త్వ సమూహం అంతా ఆయన విరాట్స్వరూపంగా గోచరించింది. ఈ విరాట్ పురుషుడు బ్రహ్మాండం అనే గర్భ రూపంలో వేల సంవత్సరాలు ఉన్నాడు. దాని నుండే సృష్టి అంతా వచ్చింది. భగవంతుడు సంకల్ప రూపంలో ఉంటాడు. అందువల్ల సృష్టి సమస్తం చైతన్య రూపంలో ఉంటుంది కాని ఇంకా శరీరాలు ఏర్పడవు. క్రమంగా ఆ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడే స్థితి కలుగుతుంది. అదే కర్మశక్తి. ఈ శక్తి వల్ల అనేక ప్రవృత్తి భేదాలు, దాని నుండి ప్రాణాలు వస్తాయి. ఇన్ని శక్తులు అంతర్గతంగా ఉన్నందున తనెవరో తెలుసుకునే శక్తి కూడా ఏర్పడుతుంది. ఆధ్యాత్మ, ఆదిభూత, ఆధిదైవం అనే మూడు కలిసిన విరాట్ పురుషుడు జీవులకు ఆత్మగా పిలవబడుతుంది. ఈ విధంగా ప్రకటితమైన విరాట్ పురుషుడు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికమనే భేదాలతో ఉంటాడు.

విరాట్పురుషుడి కొంత భాగం ముఖం కాగా, శ్రీహరి అంశతో అగ్నిదేవుడు అక్కడ స్థావరం ఏర్పరుచుకున్నాడు. ఆ కారణంగా జీవుడు శబ్దాన్ని పలకగలుగుతున్నాడు. కొంత భాగం వేరుగా కన్నులు అయ్యాయి. సూర్యభగవానుడు కన్నులకు అధికారై జీవులకు రూపవిజ్ఞానాన్ని ఇస్తున్నాడు. మరికొంత భాగం చర్మమై వాయువు అక్కడ నిలిచాడు. విరాట్పురుషుడి మరికొంత భాగం వేరై చెవులుగా ఏర్పడింది. ఈశ్వరాంశ అయిన దిక్కులు జీవుడి శ్రవణ ఇంద్రియాన్ని కూడి అతడికి శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. అలాగే ఈశ్వరాంశ అయిన వరుణుడు జీవుడి రసనేంద్రియంగా కనిపిస్తూ రుచులను తెలుసుకుంటున్నాడు. అలాగే పరమేశ్వరుడు నుండి ముక్కు విడిగా ఆయన అంశకల ఆశ్వినీదేవతలకు స్థానమైజీవుడికి వాసన చూసే శక్తిని ఇచ్చింది. పరమపురుషుడు నుండి వేరైన చర్మం ఆయన అంశాలైన కేశాలను కూడడం వల్ల ప్రాణికి దురదకు గోక్కోవడం అనేది కలిగింది. ఈశ్వరాంష అయిన ప్రజాపతి శుక్రంతో అమ్యోగం పొందడం వల్ల జీవుడు అపరిమితమైన ఆనందాన్ని పొందుతున్నాడు. అలాగే గుదస్థానంలో అచ్యుతాంశ అయిన మిత్రుడు వాయువుతో కూడి ఉండడం వల్ల జీవుడికి మలమూత్ర విసర్జన శక్తి కలుగుతున్నది.

విరాట్పురుషుడి చేతులతో ఇచ్చిపుచ్చుకునే శక్తి కలవాడై జేవుడు జీవనోపాధిని పొందుతున్నాడు. పాదాలను విష్ణువు అధిష్టించి నడిచే శక్తిని కలిగించడం వల్ల జీవుడు నడవకలుగుతున్నాడు. చంద్రుడు మనస్సులో ప్రవేశించడం వల్ల జీవుడు సంకల్ప-వికల్పాలను పొందుతున్నాడు. అలాగే అహంకారంలో రుద్రుడు ప్రవేశించినప్పుడు జీవుడు కర్తవ్యాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తాడు. బుద్ధి వాగీశ్వరుడి నివాసమై జ్ఞానంశతో కూడినప్పుడు జీవుడికి విషయ పరిజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మకు నివాసమై చైతన్యాన్ని పొందినప్పుడు జీవుడు విజ్ఞాని అవుతాడు.

అలాంటి విరాట్పురుషుడి శిరస్సు నుండి స్వర్గం, పాదాల నుండి భూమి, నాభి నుండి ఆకాశం ఏర్పడ్డాయి. విరాట్పురుషుడి ముఖం నుండి వేదాలు పుట్టాయి. బ్రాహ్మణులు, వేదాలు విరాట్పురుషుడి ముఖం నుండి పుట్టిన కారణాన బ్రాహ్మణుడు అన్ని వర్ణాలకు ముఖ్యుడయ్యాడు. పురుషోత్తముడి భుజాల నుండి అందరినీ రక్షించడానికి క్షత్రియులు పుట్టారు. వ్యవసాయం, గోపరిరక్షణ, వ్యాపారం చేయడానికి తొడల నుండి వైశ్య జాతి పుట్టింది. చరణాల నుండి కులవృత్తులు చేసుకునే శూద్ర సంతతి కలిగారు. ఈ విధంగా శ్రీహరి సర్వ స్వతంత్రుడు కాగా జీవుడు పరతంత్రుడు అని నిర్ధారణ అయింది.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)