బ్రహ్మ నారదుడికి వివరించిన భగవన్మాయ
శ్రీ మహాభాగవత కథ-23
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మ
దగ్గరకు వచ్చి “భగవన్మాయ” గురించి అడిగాడు. శ్రీమహావిష్ణువు తనకు చెప్పిన విధంగా
బ్రహ్మ, నారదుడికి తెలియచేశాడు ఇలా: ‘భాగవత
తత్త్వంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ మహాపురాణం పది లక్షణాలతో ఉన్నది. అవి: “సర్గం, విసర్గం, స్థానం, పోషణం, ఊతులు, మన్వంతరాలు, ఈశానుచరితం, నిరోధం, ముక్తి, ఆశ్రయం”. మహత్తు,
అహంకారం, ఐదు తన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు
జ్ఞానేంద్రియాలు, మనస్సు, ప్రపంచం,
అంతా భగవంతుడిలో ఉండడాన్ని “సర్గం” అంటారు. బ్రహ్మ విరాట్పురుషుడి
నుండి పుట్టి చర-అచర (కదలికగల, కదలలేని) భూత సృష్టి
చేయడాన్ని “విసర్గం” అంటారు. వైకుంఠవాసుడి కల్పామ్తపు విజయాన్ని “స్థానం”
అంటారు. విష్ణువు తన భక్త జనులను ఆపదలనుండి కాపాడడాన్ని “పోషణం”
అంటారు. పరంపరాగత కర్మవాసనలను “ఊతులు” అంటారు’.
‘ధర్మాన్ని విస్తృతం చేసి చెప్పడాన్ని
“మన్వంతరాలు” అంటారు. పద్మనాభుడి అవతారాలను వచించి, భక్తజనుల వృత్తాంతాన్ని విస్తృతంగా చెప్పేవాటిని “ఈశానుచరితలు”
అంటారు. గోవిందుడు ఆదిశేషుడి పాన్పుమీద యోగనిద్రలో మునిగి ఉన్న అవస్థా విశేషాలను
పలకడాన్ని “నిరోధం” అంటారు. దీనినే “అవాంతర ప్రళయం”
అని కూడా అంటారు. జీవుడు భగవంతుడి కరుణకు పాత్రుడై ఎన్నో జన్మలు ఎత్తుతాడు. చివరకు
జీవి హరి రూపు పొందడాన్ని “ముక్తి” అంటారు. ఇవికాక, పుట్టడం, ఉండడం, పోవడం అనేవి
ఎక్కడ ప్రకాశిస్తాయో దాన్ని “ఆశ్రయం” అంటారు. ఇదే “పరమాత్మ”.
ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆదిభౌతికం అనే
ఆత్మతత్త్వం మూడు విధాలు. వీటిల్లో కన్ను మొదలైన గోళాల ద్వారా తెలుసుకోగలిగేది “ఆధ్యాత్మికం”.
నేత్రం సంరక్షణతో దర్శించేవాడైన జీవుడిని “ఆధిదైవికుడు” అంటారు.
ఆధ్యాత్మికం, ఆధిదైవికాలు ఎవరిలో ఉంటాయో అతడు “ఆధిభౌతికుడు”.
అతడే విరాట్స్వరూపుడు అవుతాడు’.
‘విలాసార్థం జగత్తును పుట్టించాలనే
సంకల్పం ఆ మహాపురుషుడికి కలిగింది. ఆ ఆలోచనతో బ్రహ్మాండాన్ని చీల్చాడు. మొదలు తన
సుఖం కొరకు శుచిగా ఉండే నీళ్లను పుట్టించాడు. ఆ జలరాశిలో పవళించాడు. ఆ
విరాట్స్వరూపుడి హృదయాకాశం నుండి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం
పుట్టింది. నోటి నుండి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. ముఖం
నుండి శోభిల్లి పలుకు తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది.
ఇలా, ముఖం నుండి వాక్కు పుట్టింది. దీనికి దేవత అగ్ని. ఈ
రెండింటి కలయికవల్ల సంభాషణం వెలువడింది. నీరు అగ్నికి ప్రతిరోధకం అయింది.
మహావాయువు వల్ల ముక్కు పుట్టింది. దీని దేవత వాయువు. దీనికి వాసన పట్టే గుణం ఉంది.
తేజస్సు నుండి రెండు కళ్ళు పుట్టాయి. వీటి దేవత సూర్యుడు. భగవతుడి చెవి అనే
ఇంద్రియ కారకుడు అయ్యాడు. దీని దేవత
దిక్కులు. తరువాయ చర్మం ఏర్పడింది. దాని నుండి రోమాలు పుట్టాయి. వీటి మూలదేవత
చెట్లు. వాయువు నుండి చేతులు పుట్టాయి. ఈశ్వరుడి శరీరం నుండి పాదాలు పుట్టాయి.
స్త్రీ-పురుష కలయిక వల్ల సంతానం కలిగింది. అదే విధంగా బొడ్డు అనే ద్వారం
పుట్టింది. పొట్ట, నాడీ మండలం నిర్మితమయ్యాయి. హృదయం
పుట్టింది అలాగే. విరాట్పురుషుడి తనువు నుండి ఏడు ధాతువులు,
ఏడు ప్రాణాలు పుట్టాయి. ఇదంతా ఆ పరమేశ్వరుడి స్థూల శరీరం’.
ఈ స్థూల శరీరం, భూమి, నీరు (పంచ భూతాలు, మనస్సు, బుద్ధి) మొదలైన ఎనిమిది ఆవరణలతో చుట్టుకోబడి ఉంటుంది. సంపూర్ణమైన వైభవంతో
బ్రహ్మాండాన్ని మించి వెలుగుతుంటుంది. విరాట్పురుషుడి రూపానికి ఆది, అంతం ఉండదు. మనస్సుకు కాని, మాటకు కాని గోచరం కాదు.
తేజోవంతమైన ఈ భగవత్ స్వరూపం స్థూల-సూక్ష్మ రూపాలలో మహాపురుషుడి మాయా శక్తి వల్ల
ఏర్పడింది. ఈ మాయా ప్రభావాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. లక్ష్మీపతి బ్రహ్మరూపుడై
జగత్సృష్టి చేశాడు. విష్ణు రూపుడై కాపాడాడు. శివుడి రూపంలో సమస్త విశ్వాన్నీ హరింప
చేస్తాడు. ఈ విధంగా ధర్మరూపుడై ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. రక్షించాడు. అణచి
వేశాడు. సమస్త రూపాలనూ తానే ధరించాడు.
విష్ణుమూర్తి నుండి ఆకాశం, ఆ నింగి నుండి వాయువు, ఆ గాలి నుండి
అగ్ని, దాన్నుండి నీరు, నీటి నుండి
నేల, ఆ భూమి నుండి అనేక రకాల ప్రాణులు పుట్టాయి. ఈ అన్నిటికీ మూలాధారుడైన వాడు
నారాయణుడు. అతడు చిదానంద స్వరూపుడు. అవ్యయుడు. జన్మరహితుడు. అంతం లేనివాడు.
ఆద్యంతాలు కానరానివాడు. ఎంత మహానుభావులైనా కూడా ఇలాంటి దైవం నిర్మించిన ఈ సృష్టికి
హేతువును, సృష్టి సరణిని గ్రహించలేక పోతున్నారు. ఈ విశ్వమంతా
భగవంతుడి స్వరూపమే! సమస్తం ఆయనే! ఆయనే సర్వానికి ప్రభువు. బుద్ధులన్నిటికీ ఆయనే
ఉపలక్షణం.
సృష్టికి పూర్వం తనదైన మాయతో తనలోనే
లయం అయిన శక్తిని తానే విశ్వగర్భుడై, తానొక్కడే అయి వెలుగుతూ ఉంటాడు. ఆయనకు
జన-మరణాలు లేవు. భగవంతుడికి సృష్టి సంకల్పం కలిగేసరికి తానె కార్యం, కారణం, అయి మాయా శక్తిగా పిలవబడుతున్న
అవిద్య పుట్టింది. ఆ మాయను తన శక్తిగా ప్రతిష్ట చేసి పరమాత్మ తన కడుపిలో నుండి
విశ్వాన్ని సృష్టించాడు. తన మాయ వల్ల మహాత్తత్త్వాన్ని పుట్టించాడు. ఇది
భగవంతుడికి మాత్రమే కనిపిస్తూ, సృష్టి చేయాలనే కోరికతో మరో
రూపాన్ని పొందింది. దాంట్లో నుండి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే పేర్లతో భేదాలు ఏర్పడి, పంచ భూతాలు, ఇంద్రియాలు, మనస్సు పుట్టాయి. ఆ తరువాత అహంకారం
ఏర్పడింది. ఇది సత్త్వరజోస్తమో గుణాలతో కూడి ఉంటుంది.
పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు
వేర్వేరుగా ఉండి సమైక్యం కాలేకపోవడంతో సృష్టి సామర్థ్యం వాటికి చాల లేదు. అందువల్ల
దేవతలందరు నారాయణుడిని ప్రార్థించారు. జగత్తును సృష్టించే శక్తిని తమకివ్వమని
అడిగారు. విష్ణుమూర్తి కూడా జగత్తును సృష్టించే శక్తి రాకపోవడాన్ని గమనించాడు.
అప్పుడు ప్రకృతిలో తన శక్తిని ప్రవేశపెట్టి, 27 తత్త్వాలలో
తానూ ప్రవేశించి వాటికి ఏకత్వాన్ని కలిగించాడు. ఆ 27 తత్త్వాలు: పంచభూతాలైన పృథ్వి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం; పంచకర్మేంద్రియాలైన నోరు, కాళ్లు, చేతులు, మల అవయవం, మూత్ర అవయవం; పంచజ్ఞానేనింద్రియాలైన
కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం; చతురాంతః
కరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం; పురుషుడు, ప్రక్రుతి, మహత్తు.
ఈ విధంగా జగత్తును నిర్మించడంలో
శ్రీహరి ఇందులో పాల్గొన్న అన్నిటికీ పరస్పరం అన్యోన్యతను కలిగించగా తత్త్వ సమూహం
అంతా ఆయన విరాట్స్వరూపంగా గోచరించింది. ఈ విరాట్ పురుషుడు బ్రహ్మాండం అనే గర్భ
రూపంలో వేల సంవత్సరాలు ఉన్నాడు. దాని నుండే సృష్టి అంతా వచ్చింది. భగవంతుడు సంకల్ప
రూపంలో ఉంటాడు. అందువల్ల సృష్టి సమస్తం చైతన్య రూపంలో ఉంటుంది కాని ఇంకా శరీరాలు
ఏర్పడవు. క్రమంగా ఆ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడే స్థితి కలుగుతుంది. అదే
కర్మశక్తి. ఈ శక్తి వల్ల అనేక ప్రవృత్తి భేదాలు,
దాని నుండి ప్రాణాలు వస్తాయి. ఇన్ని శక్తులు అంతర్గతంగా ఉన్నందున తనెవరో
తెలుసుకునే శక్తి కూడా ఏర్పడుతుంది. ఆధ్యాత్మ, ఆదిభూత, ఆధిదైవం అనే మూడు కలిసిన విరాట్ పురుషుడు జీవులకు ఆత్మగా పిలవబడుతుంది. ఈ
విధంగా ప్రకటితమైన విరాట్ పురుషుడు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికమనే భేదాలతో ఉంటాడు.
విరాట్పురుషుడి కొంత భాగం ముఖం కాగా, శ్రీహరి అంశతో అగ్నిదేవుడు అక్కడ స్థావరం ఏర్పరుచుకున్నాడు. ఆ
కారణంగా జీవుడు శబ్దాన్ని పలకగలుగుతున్నాడు. కొంత భాగం వేరుగా కన్నులు అయ్యాయి.
సూర్యభగవానుడు కన్నులకు అధికారై జీవులకు రూపవిజ్ఞానాన్ని ఇస్తున్నాడు. మరికొంత
భాగం చర్మమై వాయువు అక్కడ నిలిచాడు. విరాట్పురుషుడి మరికొంత భాగం వేరై చెవులుగా
ఏర్పడింది. ఈశ్వరాంశ అయిన దిక్కులు జీవుడి శ్రవణ ఇంద్రియాన్ని కూడి అతడికి శబ్ద
జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. అలాగే ఈశ్వరాంశ అయిన వరుణుడు జీవుడి రసనేంద్రియంగా
కనిపిస్తూ రుచులను తెలుసుకుంటున్నాడు. అలాగే పరమేశ్వరుడు నుండి ముక్కు విడిగా ఆయన
అంశకల ఆశ్వినీదేవతలకు స్థానమైజీవుడికి వాసన చూసే శక్తిని ఇచ్చింది. పరమపురుషుడు
నుండి వేరైన చర్మం ఆయన అంశాలైన కేశాలను కూడడం వల్ల ప్రాణికి దురదకు గోక్కోవడం
అనేది కలిగింది. ఈశ్వరాంష అయిన ప్రజాపతి శుక్రంతో అమ్యోగం పొందడం వల్ల జీవుడు
అపరిమితమైన ఆనందాన్ని పొందుతున్నాడు. అలాగే గుదస్థానంలో అచ్యుతాంశ అయిన మిత్రుడు
వాయువుతో కూడి ఉండడం వల్ల జీవుడికి మలమూత్ర విసర్జన శక్తి కలుగుతున్నది.
విరాట్పురుషుడి చేతులతో
ఇచ్చిపుచ్చుకునే శక్తి కలవాడై జేవుడు జీవనోపాధిని పొందుతున్నాడు. పాదాలను విష్ణువు
అధిష్టించి నడిచే శక్తిని కలిగించడం వల్ల జీవుడు నడవకలుగుతున్నాడు. చంద్రుడు
మనస్సులో ప్రవేశించడం వల్ల జీవుడు సంకల్ప-వికల్పాలను పొందుతున్నాడు. అలాగే
అహంకారంలో రుద్రుడు ప్రవేశించినప్పుడు జీవుడు కర్తవ్యాన్ని తెలుసుకుని
ప్రవర్తిస్తాడు. బుద్ధి వాగీశ్వరుడి నివాసమై జ్ఞానంశతో కూడినప్పుడు జీవుడికి విషయ
పరిజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మకు నివాసమై చైతన్యాన్ని పొందినప్పుడు జీవుడు విజ్ఞాని
అవుతాడు.
అలాంటి విరాట్పురుషుడి శిరస్సు నుండి
స్వర్గం, పాదాల నుండి భూమి,
నాభి నుండి ఆకాశం ఏర్పడ్డాయి. విరాట్పురుషుడి ముఖం నుండి వేదాలు పుట్టాయి.
బ్రాహ్మణులు, వేదాలు విరాట్పురుషుడి ముఖం నుండి పుట్టిన
కారణాన బ్రాహ్మణుడు అన్ని వర్ణాలకు ముఖ్యుడయ్యాడు. పురుషోత్తముడి భుజాల నుండి
అందరినీ రక్షించడానికి క్షత్రియులు పుట్టారు. వ్యవసాయం,
గోపరిరక్షణ, వ్యాపారం చేయడానికి తొడల నుండి వైశ్య జాతి
పుట్టింది. చరణాల నుండి కులవృత్తులు చేసుకునే శూద్ర సంతతి కలిగారు. ఈ విధంగా
శ్రీహరి సర్వ స్వతంత్రుడు కాగా జీవుడు పరతంత్రుడు అని నిర్ధారణ అయింది.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment