పంకజభవుడి జన్మ వృత్తాంతం
శ్రీ మహాభాగవత కథ-24
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
పూర్వం ప్రళయ సమయంలో అనంతమైన
దివ్యజలాలు తప్ప వేరేమీ లేవు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేశువును పాన్పుగా
చేసుకుని ఆ దివ్య జలాల మీద పవళించాడు. ఆయన నిద్రిస్తున్నట్లుగా కళ్లుమూసుకుని
అద్వితీయ, ఆనందమయుడై విరాజిల్లాడు. అలా వెల యుగాలు
గడిచిన తరువాత సృష్టికార్యానికి పూనుకున్నాడు. అప్పటిదాకా తన గర్భంలో ఉంచుకున్న
అనేక బ్రహ్మాండాలను తిరిగి సృజించడానికి సాధనమైన సూక్ష్మ పదార్థాన్ని చిత్తంలో
భావించి కాలానుగుణమైన రజో గుణాన్ని సృష్టించాడు. దానివల్ల పరమేశ్వరుడి నాభిలో తామరతూడు పుట్టింది. తన
తేజస్సుతో ఆ మొగ్గను సూర్యుడిలాగా వికసింప చేసి, సర్వలోకాలకు
ఆశ్రయం ఇచ్చే స్థితిని, సర్వ గుణాలతో ఒప్పే గతిని కలిగి ఉన్న
ఆ పద్మంలో పరమేశ్వరుడు తన కళను కలిపాడు. దాని మూలాన చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. ఆయన
కళ్ళుతెరిచి లోకాలను, దిక్కులను,
ఆకాశాన్ని తన నాలుగు ముఖాలతో చూశాడు. ఇదంతా, ఇవన్నీ ఏమిటో
తెలియక తనలో తానే తర్కించుకున్నాడు.
నీళ్లలో పద్మం మూలం ఎక్కడ ఉందో
కనుక్కుందామని చతుర్ముఖ బ్రహ్మ ఆ తామర తూడు లోపలి బ హాగం నుండి ప్రవేశించాడు. అలా
వేల దివ్య సంవత్సరాలు వెతికి-వెతికి, తామర
తూడు మూలాన్ని కనిపెట్టలేక, భగవంతుడి మాయా ప్రభావానికి భయపడి
తిరిగి తాను బయల్దేరిన ప్రదేశానికే వచ్చాడు. అలా చేరిన బ్రహ్మ పద్మ పీఠంమీద
కూర్చుని తపస్సమాధిలో వంద సంవత్సరాలు గడిపాడు. తన ధ్యానాన్ని హృదయంలో నిలిపి హృదయ
కర్ణికలో తనను కన్న శ్రీహరిని, ఆదిశేషుడిని తల్పంగా చేసుకుని శయనిస్తున్న
శ్రీహరిని చూడగలిగాడు. ఆయన నాభి నుండి పుట్టిన కమలాన్ని,
జలాన్ని, అగ్నిని, ఆకాశాన్ని, భువన నిర్మాణం చెయ్యాలనే దృష్టిని చూశాడు బ్రహ్మ. ఆయనకు ఇంకేమీ కనిపించ
లేదు. తాను నెరవేర్చబోయే సృష్టి కార్యానికి కారణభూతమైన రజోగుణం అనే బీజం తనలో
ప్రభవించగా అంతం లేని ప్రజాసృష్టికి కారణభూతుడై నిలిచాడు. శ్రీహరి తత్త్వాన్ని
బ్రహ్మ స్తుతించాడు అనేక విధాలుగా.
బ్రహ్మ ప్రార్థనను మన్నించిన స్వామి
ప్రసన్నుడై ఈ సృష్టి చేయాలనే సంకల్పంతో ప్రళయకాలంలో పుట్టిన అనంతమైన జలరాశిని
అవలోకించాడు. బ్రహ్మతో ఇలా అన్నాడు: ‘జీవులను సృష్టిస్తూ, ఆ జీవ సమూహంలో ఉంటూ, నన్ను ఎప్పుడూ
తలచుకో. నా ప్రీతికోసమే నిన్ను సృష్టించాను. నాలో అణిగి కదలకుండా ఏకరూపంలో వున్న
లోకాలన్నిటినీ అహంకారమే మూల తత్త్వంగా నువ్వు పుట్టించు’ అని
చెప్పి శ్రీమహా విష్ణువు అంతర్థానమయ్యాడు.
విష్ణువు వరప్రభావం వల్ల బ్రహ్మ నూరు
దివ్య సంవత్సరాలు భగవంతుడిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు వీచిన కాల వాయువుకు
తన నివాసమైన పద్మం కదిలింది. నీరు చలించింది. దాన్ని చూసిన బ్రహ్మ తన తపశ్శక్తితో
వాయువును బంధించి కనిపిస్తున్న మహా జలాన్నంతా ఇక్క గుక్కతో తాగి గగన వ్యాప్తమైన
జలాన్ని చూశాడు. భాగంతుడిని మళ్లీ ధ్యానించాడు. అప్పుడు ఆయనకు గగనతలంలో ఒక పద్మం, దానిలో దాగి ఉన్న లోక సమూహం కనిపించాయి. వెంటనే బ్రహ్మ తాను
విష్ణువు నియమించిన వాడిగా తలచి, అ అపద్మం లోపలి పోయి, అందులో ఉన్న మూడు లోకాలను చూసి, ఆ తరువాత, తన మహిమతో చతుర్దశ భువనాలను సుందరంగా సృష్టించాడు. తన ధర్మానికి
ఫలస్వరూపంగా దేవతలు, పశుపక్ష్యాదులు,
నరులు, ఇతరాలతో కూడిన ఈ అనంత సృష్టిని బ్రహ్మ నిర్మించాడు.
ఆది,
అంతం లేనిది, అవ్యయమైనది అయిన తత్త్వమే ఈ సృష్టికి మూల
కారణం. ఈశ్వరుడు కాలానికి తగిన రూపం ధరించి, కాలానికి తగిన
రూపాన్ని గైకొని, కేవలం వినోదానికై తనను తానే
సృష్టించుకున్నాడు. ఆ ఈశ్వరుడిలోనే లోకాలన్నీ ఉంటాయి. అన్ని లోకాలలోనూ ఈశ్వరుడు
ఉంటాడు. ఈ అనంత విశ్వానికి కార్యం, కారణం రెండూ ఆయనే! ఆ
మహాపురుషుడి నుండి వెలువడి ఈ విశ్వం ప్రకాశిస్తున్నది. శ్రీమహావిష్ణువు మాయవల్ల ఈ
విశ్వమంతా ఒక పద్ధతిలో పుట్టి, పెరిగి,
నాశనమవుతూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది.
ఇలాంటి సృష్టి తొమ్మిది విధాలు.
వాటిలో ‘ప్రాక్రుతాలు’, ‘వైకృతాలు’ అనేవి కాల, ద్రవ్య, గుణాలు అనే మూడు విధాలైన
భేదాలతో పరస్పరం సంకరం అవుతుంటాయి. అందులో ‘మహత్తత్వం’ మొదటి సృష్టి. అది నారాయణుడి సమీపంలో గుణభేదాన్ని పొందుతుంది.
ద్రవ్యజ్ఞాన క్రియాత్మకమైన ‘అహంకార తత్త్వం’
రెండవ సృష్టి. శబ్దస్పర్శరూపరసగందాలు అనే పంచతన్మాత్రల ద్రవ్యశక్తితో కూడిన పృథ్వి
మొదలైన ‘పంచభూతాల’ సృష్టి మూడవది. జ్ఞానేంద్రియాలైన చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు; కర్మేంద్రియాలైన వాక్కు, చేతులు, కాళ్లు, పాయువు, ఉపస్థ; అనే ‘పది
ఇంద్రియాల పుట్టుక’ నాలుగవ సృష్టి. సాత్త్వికాహంకారం వల్ల పుట్టిన ‘దేవతాగణాల’ సృష్టి ఐదవ సృష్టి. ప్రాణి సమూహానికి అజ్ఞానకృత్యాలైన ఆవరణ విక్షేపాలు
కలిగించే ‘తామస’ సృష్టి ఆరవది. ఈ ఆరు భగవంతుడి
లీలా విలాసాలైన ‘ప్రాకృత’ సృష్టులు.
వనస్పతులు, ఓషధులు, తీగలు,
వెదుళ్ళు, దుబ్బులు, పొదలు, ఫల వృక్షాలు, అవ్యక్తమైన చైతన్యంతో పైకి
పెల్లుబుకుతూ తమోమయాలై లోపల మాత్రమె స్పర్శ జ్ఞానం కలవై కదిలిపోలేని ఇవన్నీ ఏడవ
సృష్టి. ఎనిమిదవ సృష్టిలో 28 భేదాలున్నాయి. రేపు అనే జ్ఞానం లేనివి, ఆహారం మీదే ఆసక్తి కలవి, పెద్దగా ఆలోచన చేయనివి, చీలిన గిట్టలు (ఎద్దు, ఎనుము,
మేక లాంటివి) కలవి, చీలని గిట్టలు (గాడిద, గుర్రం లాంటివి)
కలవి, ఐదు గోళ్లు
(కుక్క, నక్క లాంటివి) కలవి, జలచరాలు
(మొసలి), రాబందు, గద్ద, కొంగ, డేగ లాంటి ఆకాశంలో తిరిగే తిర్యక్కులు, ఇవన్నీ
ఎనిమిదవ సృష్టి. తోమ్మిదోది ‘మానవ’ సృష్టి. ఏడు, ఎనిమిది, తొమ్మిద సృష్టులు ‘వైకృత’ సృష్టులు.
దేవ సర్గం కూడా ఎనిమిది విధాలు.
అందులో విబుధులు, పితృదేవతలు, సురాదులు
మూడు భేదాలు. గంధర్వులు, అప్సరసలు ఒకటి; యక్షులు, రాక్షసులు ఒకటి; భూత, ప్రేత పిశాచాలు ఒకటి; సిద్ధ,
చారణ, విద్యాధరులు ఒకటి; కిన్నర
కింపురుషులు ఒకటి. ఈ ఎనిమిది కలిసి దేవ సర్గం అయింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు పది
విధాలైన సృష్టులను నిర్మించాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment