Wednesday, September 2, 2020

రామరావణ యుద్ధానికి నాంది శూర్పనఖోపాఖ్యానమా? .... వనం జ్వాలా నరసింహారావు

 రామరావణ యుద్ధానికి నాంది శూర్పనఖోపాఖ్యానమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ, చింతన (03-09-2020)

సీతారామలక్ష్మణులు వనవాసం చేయాల్సిన పద్నాలుగు సంవత్సరాలలో పదమూడవ సంవత్సరం గడుస్తున్న సందర్భంలో, మార్గశిర మాసం నడుస్తున్నప్పుడు ఒక రోజున శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులతో కూడి గోదావరీ నదీ స్నానం చేసి, పూర్వుల, పెద్దల కథలు చెప్పుకుంటూ ముచ్చటించుకుంటుండగా, రావణాసురుడి చెల్లెలు శూర్పణక అందమైన ఆకారంతో ఆశ్రమంలో ప్రవేశించింది. శ్రీరామచంద్రమూర్తిని చూసి కామదగ్దచిత్త అయ్యి, ఆ రాక్షసి, శ్రీరాముడిని చేరవచ్చింది.

వచ్చి, మోహావేశంతో శూర్పణఖ శ్రీరాముడిని చూసి "నువ్వెవరివి? జడలతో మునీశ్వరుడి వేషం ధరించి, కాముకుడవై, భార్యతోనూ, క్షత్రియ రూపంలో విల్లు-బాణాల తోనూ, రాక్షసులు స్వేచ్చగా తిరిగే ఈ స్థలానికి ఎందుకు వచ్చావు? ఈ ప్రకారం ఇక్కడ వుండడానికి కారణం ఏమిటి?" అని అడగగా శ్రీరామచంద్రమూర్తి ఇలా చెప్పాడు.

"దశరథుడనే మహారాజు పెద్ద కొడుకును నేను. నన్ను రాముడని అంటారు. వీడు నా తమ్ముడు లక్ష్మణుడు, వా వెంట వచ్చాడు. ఈ స్త్రీ నా భార్య సీత. తల్లిదండ్రుల ఆజ్ఞ మీరలేక పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని నిర్వహించే కోరికతో తపోరూప ధర్మాన్ని స్థాపించడానికి మేం వచ్చాం. మా చరిత్ర విన్నావు కదా? నువ్వే జాతిదానివి? నీ పేరేంటి? ఎవ్వరిదానవు? సత్యం చెప్పు. ఇది రాక్షస భూమి ఐనా నీ మనోహరాకారం చూసి రాక్షసివి అవుతావని అనుకోను. ఇక్కడికి నువ్వు రావడానికి కారణం ఏంటి?". ఇలా అడిగిన రామచంద్రమూర్తికి నిజం చెప్తా వినమని అంటుంది.

శూర్ఫనఖ శ్రీరాముడితో, "సుందరుడా! నేను శూర్పణఖ అనే స్త్రీని. కోరిన రూపాన్ని ధరించగలను. ఈ అడవుల్లో ఒంటరిగా తిరుగుతుంటాను. విశ్రవసుడి కొడుకు రాక్షసరాజైన రావణాసురుడి పేరు విన్నావా? అతడు మా అన్న. కుంభకర్ణుడు, విభీషణుడు కూడా నా తోడబుట్టిన వారే. ఖరదూషణులు కూడా నా తోబుట్టువులే. వాళ్లు యుద్ధంలో మహాశూరులు. వావి వరుసలకు వాళ్లు నా అన్నలని చెప్పానేకాని వారి ఆజ్ఞకు లోబడి వుండేదాన్ని కాను నేను. నా ఇష్ట ప్రకారం నేను తిరుగుతుంటాను. కాబట్టి నువ్వు నన్ను గ్రహించావా వాళ్లు నీ మీద కోపంగా వుంటారని భయపడాల్సిన పనిలేదు. చక్కదనంలో నీలాంటి వాడిని నేను చూడలేదు. కాబట్టి కళ్లారా నిన్ను చూసింది మొదలు దొడ్డమగవాడా, నువ్వే నాకు తగిన మగడవని నిన్ను కోరుతున్నాను. నువ్వు నన్ను తిరస్కరించావా, మా అన్నలందరనీ నీమీదకు యుద్ధానికి పిలుచుకొనివచ్చి నిన్ను చంపిస్తాను” అంటుంది.

"రామా! నాకిదివరకే భార్య వుందంటావేమో? చీ, చీ, ఇదేమి సీత? చూడడానికి రోత పుడ్తున్నది. వేలెడు ముక్క. వెన్నంటు డొక్క విరిచిన బొందె తుంటెలాగా విరుగు కాళ్లు, చేతులు, చింతాకంత కళ్లు, అసలే లేని గోళ్లు, ఇక నా సొగసు నేనే చెప్పకూడదు కాని, నా డొక్క, నా పిక్క, నా ముక్కు, నా చెక్కు, నా గోళ్లు, నా కాళ్లు, నా కళ్లు, నా చన్నులు, నా చేతులు ఎలా వున్నాయో చూడు. సీత వికార రూప. దీన్ని వదిలిపెట్టు. దూరంగా పొమ్మను. నీలాంటివాడికి తగిన పెళ్లాం కాదు. కానేకాదు. నెనే ముద్దు పెళ్లామని అను. నన్ను సరిగ్గా చూడు. నేను నీకు తగిన భార్యను కానా? అవునను. కాబట్టి నన్ను నీ భార్యగా చేసుకో. దీన్నేం చేద్దామంటావా? దీన్ని నీ తమ్ముడితో సహా ఇప్పుడే గుటుక్కున మింగుతా. ఆ తరువాత నీకు ఇంక భయం లేదు...ఈ జంజాటం వుండదు" అని అంటుంది శూర్ఫణఖ.

శూర్పణఖ చెప్పాడిలా రాముడు: "రాకాసీదీనిని ముందు పెళ్లి చేసుకున్నానుఅయినా ఏంటంటావాఇప్పుడు ప్రియురాలైన దీనిని నేనెలా విడుస్తానుఅది ధర్మం కాదేఅది వుండవచ్చు. నువ్వూ వుండవచ్చు అంటావానీలాంటి అద్భుతమైన అందగత్తెకు సవతి పోరు వుండకూడదుకాబట్టి నీకు దుఃఖం కలగక తప్పదు. నిన్ను దుఃఖ పెట్టడానికా పెళ్లి చేకోవడంకాబట్టి నామీద భ్రాంతి వదిలిపెట్టునువ్వు కామం నిలుపలేనని అంటావాఇదిగో వీడిని చూడుమంచి శీలం కలవాడునా తమ్ముడుచూడడానికి ప్రియమైన వాడుసహించరాని తేజం కలవాడులక్ష్మణుడనే పేరుకలవాడుఈ లక్ష్మణుడు భార్య లేనివాడు. అసమాన శౌర్యవంతుడు. సమర్థుడు. యౌవనంలో వున్నాడు. అందగాడు. ఇదివరకు భార్యా సుఖం తెలియనివాడు. భార్య కావాలని కోరుతున్నాడు. నీ అందమైన రూపం చూడగానే వీడు నీకు పతిత్వయోగ్యుడు అవుతాడు. సవతి పోరులేకుండా అతడిని భజించు.



అని శ్రీరామచంద్రుడు చెప్పగా విని ఆ రాక్షసినిమిషమైనా ఆలశ్యం చేయకుండాలక్ష్మణుడితో "ఓయీ అందగాడానీ చక్కదనానికి సరైన అందగత్తెను నేనేనీకు పెళ్లాం అవుతానునువ్వు నన్ను పెళ్లి చేసుకోవనాలలో,కొండలలో సంచారం చేద్దామారా, పోదాంఅన్నది

శ్రీరామచంద్రమూర్తి పరిహాసంగా మాట్లాడిన భావం తెలుసుకొన్న లక్ష్మణుడుతానూ శూర్పణఖతో పరిహాసంగానే మాట్లాడాడు. "ఓసీవెర్రి పిల్లానేను బానిసనునన్ను పెళ్లి చేసుకొని నువ్వు కూడా బానిసవై వీరి సేవ చేస్తావానీ చక్కదనానికి నువ్వు బానిసగా వుంటావాఈ మహాత్ముడుకి నేను బంటుగా సేవ చేస్తున్న సంగతి నీకు తెలియదేమోనీకు తెలిసే అవకాశం లేదుతెలుస్తేనేనేంటి, బానిసను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకొనేదానివిఅలాంటి సమృద్ధమైన అర్థం కలవాడిని నువ్వే సంతోషపెట్టగలవునిర్మలకాంటి కలదానివి కాబట్టినువ్వుఆయన్నే వరిస్తే నువ్వు చిన్న భార్యవై, కులుకుతూ ముద్దులొలకవచ్చుఇలాంటి వికార స్వరూపం గలదానినిభయంకర స్వరూపం వున్నదానినిఆ సవతినిపెద్ద పొట్టకలదానినిముసలిదానినిజానకిని నెట్టి నిన్ను భార్యగా గ్రహిస్తాడు. ఇలాంటి పరమ సుందరిని వదిలి ఎవరు మనుష్య స్త్రీకొరకు వేడుక పడతాడు?" అని లక్ష్మణుడు పలికాడు శూర్పణఖతో.

లక్ష్మణుడు చెప్పిన మాటలు పరిహాస వచనాలని తెలుసుకోలేని ఆ బుద్ధిహీననిజమని నమ్మిపర్ణశాలలో సీతతో వున్న శ్రీరామచంద్రుడి దగ్గరకు పోయి ఇలా అంది: "ఈ విరూపనుసవతినిఈ కరాళనునిర్ణతోదరిని గ్రహించి నువ్వు నన్ను గౌరవించడం లేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే మింగి సవతిపోరు లేకుండా సుఖపడతాను". ఇలా అంటూ శూర్పణఖ జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీతమీద దూకింది. ఇది చూసిన శ్రీరాముడు దాన్ని బిగపట్టికోపంతో లక్ష్మణుడితో "లక్ష్మణా! నీచులతో పరిహాసం ఆడడం తప్పు. అలా మనం చేసినందువల్ల కష్టం కలిగింది. దీనివాత పడకుండా సీతాదేవి ఎలా బతికి సుఖంగా వుంటుందో ఆలోచించు. ఇది స్త్రీ. ఆయుధం ధరించి యుద్ధానికి వచ్చింది కాదు. కాబట్టి చంపకూడదు. దీన్నిబలగర్వంతో దేహం తెలియనిదాన్నిరాకాసిని పట్టుకొని విరూపగా చేయి" అన్నాడు. అప్పుడు శూర్ఫణఖ కంటే మహాబలశాలి అయిన లక్ష్మణుడు తటాలున కత్తి దూసిఅది ఎదిరించినా వదలకదాని ముక్కుచెవులు కోశాడు.

ముక్కు-చెవులు ఈ విధంగా మొక్కలు పోగాలబలబ నోరు కొట్టుకుంటూరొమ్ము గుద్దుకుంటూవానాకాలంలోని మేఘం అదిరినట్లుఅడవి ప్రతిధ్వనించేట్లుపెద్ద ధ్వనితో బొబ్బలు పెట్టుకుంటూనెత్తురు కారుతుంటేవికార రూపం మరింత వికారం కాగామనుష్యులు తనను ఇలా చేశారేనలుగురిలో నవ్వుల పాలైతిని కదా అని ఆక్రోశంతో ఏడుస్తూ అడవుల్లో పడి వేగంగా పరుగెత్తింది. 

ఇలా పరుగెత్తుకుంటూ పోయి జనస్థానంలో రాక్షసుల మధ్యన వున్న తమ్ముడు ఖరుడిని చూసి, ఏడుపు ధ్వనితో ఆకాశం నుండి పిడుగుపడ్డట్లు ధభీలున నేలమీదపడి పెద్దపెట్టున ఏడ్చింది.

           దేహమంతా నెత్తురుతో తడిసి నేలమీద పడి, వికార రూపంతో ఏడుస్తున్న శూర్పనఖను చూసి ఖరుడు ఇలా అన్నాడు. “ఎవరినీ తరుమకుండా, బెదిరించకుండా, బుసకొట్టకుండా, తనంతట తాను బుట్టలో కదలకుండా వుండే మహా భయంకర, విషంకల నల్ల త్రాచుపామును ఎవడు వేలితో పొడిచాడు? ఎవడీ విషం తాగింది? ఎవడు తనంతట తానే మృత్యుపాశాన్ని తన కంఠానికి తగిలించి బిగించుకున్నాడు? చెప్పు. నేనిప్పుడే వేగంగా పోయి వాడిని చంపి నెత్తురు తాగుతా. నువ్వు బలం, పరాక్రమం విశేషంగా వున్నదానివి. కాబట్టి సామాన్య బలవంతులు నిన్ను పరాభవం చేయలేరు. నువ్వు కోరిన చోట, కోరిన రూపంతో తిరగగలిగే దానివి. నిన్ను అడ్డగించగలవారు లేరు. అలాంటి నిన్ను ఎవడే దీర్ఘకాలం బతకడానికి ఇష్టపడక ఇలాంటి కష్టాల పాలు చేశాడు? దేవతలలో కాని, గంధర్వులలో కాని, పరమర్షులలో కాని, దౌర్జన్యంగా ఇలాంటి పెద్ద అపకారం చేయడానికి తెగించిన వాడు ఎవడో చెప్పు. వాడిని చంపుతా”. అని ఖరుడు అడగ్గా, తోడ బుట్టిన వాడి మాటలు విని విస్తారంగా కన్నీళ్లు కాల్వలుగా కారుతుంటే, ఈ విధంగా చెప్పింది శూర్పణఖ.

         “నన్నీ ప్రకారం చేసింది ఎవరని అంటావా? చెప్తా విను రాక్షసుడా! వారు యౌవనవంతులు. చక్కటివారు. మునుల వేషంలో వున్నారు. కోమల దేహం కలవారు. మహాబల సంపన్నులు. నార చీరెలు, కృష్ణాజినం వస్త్రాలుగా వున్న వారు. అడవిలో లభించే పళ్ళు తింటారు. ఇంద్రియ నిగ్రహం కలవారు. ధర్మ మార్గంలో వుండేవారు. అన్నదమ్ములు వాళ్ళు. దశరథరాజ కుమారులు. శ్రీరామలక్ష్మణులు అనే పేర్లు కలవారు”.

         తనను విరూపను చేసినవారెవరు? అని ఖరుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శూర్పనఖ దశరథ రాజకుమారులు శ్రీరామలక్ష్మణులు అని చెప్పే బదులు, వారి సౌందర్యాన్ని ఎందుకు వర్ణించాలి? ఆమెలో కామం విఘ్నమై కోపంగా మారిందేకాని, కామం చావలేదు. వైరాగ్యం ఇంకా పుట్టలేదు. గాఢంగా శ్రీరామలక్ష్మణ రూపాలలో మనస్సు నాటుకొని వుండడం వల్ల, వారి మూర్తులే దానికి కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. అలా కామమోహిత అయినందువల్ల దాన్ని నిగ్రహించుకోలేక తమ్ముడి ఎదుట ఆ భావాన్నే బయట పెట్టింది. “కామాతురాణాం నభయం నలజ్జా” అనే నానుడి వుంది. అంటే, కామాతురులకు భయం, సిగ్గు వుండదు. ఈ కారణం వల్లే రామలక్ష్మణుల సౌందర్య వర్ణన చేసింది శూర్పనఖ. ఇలా చేయడం స్త్రీ అయిన శూర్పనఖ గొప్ప కాదు. శ్రీరామచంద్రమూర్తిని చూసిన వారందరూ, అనుకూలమైనా, ప్రతికూలమైనా ఇలానే మాట్లాడుతారు.

         శూర్పణఖ తన జవాబును కొనసాగిస్తూ...”తాము దశరథ రాజకుమారులమని చెప్పారేకాని, వారి తేజస్సు చూస్తే, వాళ్ల మాట నమ్మడం కష్టంగా వుంది. అయినా, వారు అసత్యమాడేవారిలాగా లేరు. కాబట్టి వారి మాట ప్రకారం వాళ్లు మనుష్యులో, నా ఆభిప్రాయం ప్రకారం దేవతలో చెప్పలేను. చూడడానికి రాజచిహ్నాలున్నా గంధర్వరాజుతో సమానంగా వున్నారు. ఆ ఇద్దరిమధ్య ప్రాయంలో వున్నా ఒక పడుచును, సమస్తాభరణాలు ధరించిన దానిని, సన్నటి నడుముకల దానిని, తామర రేకుల్లాంటి కళ్లున్న దానిని చూశాను. అలాంటి సుందరిని నేనింతవరకు చూడలేదు. ఆ పడుచుకోసం నన్ను వారిద్దరూ ఒక్కటై, రంకుటాలిలాగా దిక్కులేని దాన్ని చేసి దురవస్థల పాలు చేశారు” అని అంటుంది. జరగబోయే రామరావణ యుద్ధానికి ఈ విధంగా అంకురార్పణ జరిగిమ్దనాలి ఒక విధంగా.

(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

1 comment:

  1. కథాభాగాన్ని ఒకదాన్ని ఉపాఖ్యానం అనకూడదండీ. ఆఖ్యానం‌ అంటే‌ కథ. ఉపాఖ్యానం అంటే ఆకథతో‌ జోడించబడిన మరొక కథ. ఈ‌జోడింపుకు కారణం అన్నది ఆకథను ప్రథానకథలో ప్రవేశపెట్టే‌ పాత్రయే ముందుగా వివరిస్తుంది. ఆ జోడింపును విడదీసి చూస్తే ఆ ఉపకథ దానంతట అది విడిగా ఉండగలుగుతుంది, ఉండితీరాలి. ఇక్కడ శూర్పనఖావృత్తాంతంలో అంతా ప్రథాన కథలోని పాత్రలే ఉన్నారు కాబట్టి అది ఉపాఖ్యానం అనకూడదు. ఇలా విడిగా దానిని పైన అన్నట్లు ఫలానివృత్తాతం అనవచ్చును. అంతవరకేనండి. ధన్యవాదాలు.

    ReplyDelete