Monday, January 4, 2021

ఉద్యోగాల కల్పవల్లి కేసీఆర్ సర్కార్ : వనం జ్వాలా నరసింహారావు

 ఉద్యోగాల కల్పవల్లి కేసీఆర్ సర్కార్

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (05-01-2021)

తెలంగాణ ఉద్యమంలో నియామకాల విషయంలో ఉద్యమనేతగా నినదించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రిగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్న సంగతి జగద్విదితం. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వశాఖల్లో నియమించే ఉద్యోగాలే అన్న అపోహ చాలాందికి ఉంటుంది. కానీ, తెలంగాణ సర్వీసు కమీషన్ ద్వారా జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలేకాక, ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణితో పాటు, విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలు, విశ్వవిద్యాలయాలు, వివిధ కార్పొరేషన్లు, సొసైటీల్లో జరిగే నియామకాలు కూడా ఉద్యోగాల కిందకే వస్తాయని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కేవలం ప్రభుత్వశాఖలలోనే కాకుండా నిరుద్యోగులకు పరిశ్రమల్లో, ఐటీ తదితర ప్రభుత్వేతర రంగాల్లో ప్రత్యక్ష లేదా పరోక్ష రీతిలో ఏవిధమైన ఉపాధి కల్పించినా అవికూడా ఉద్యోగ నియామకాల కిందకే వస్తాయనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇలా దాదాపు 22 లక్షల మందికి ఉపాధి కలిపించడం జరిగింది. 

నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ, ప్రభుత్వేతర, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు, ఐటీ రంగంలో, పరిశ్రమల్లో విరివిగా ఉపాధి అవకాశాలు కలిపించినప్పటికీ ఉద్యోగాల భర్తీ విషయంలో వాస్తవాలకంటే, వక్రీకరణలే ప్రచారంలోకి వస్తున్నందున నిజాలను తెలియచేయాల్సిన అవసరం, రాష్ట్రంలో ఉద్యోగపరంగా ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించాల్సిన అవసరం ఏర్పడిందనాలి.

నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం, మున్నెన్నడూ కనీ-వినీ ఎరుగని రీతిలో, కేవలం ఆరున్నర సంవత్సరాల్లోనే ప్రభుత్వ, ప్రభుత్వేతర, ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు లక్షా ఏబైవేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. (ఇందులో 31,072 ఉద్యోగాలు టీఎస్ పీఎస్సీ ద్వారా, 9,289 ఉద్యోగాలు విద్యుత్ శాఖలో, 13,625 ఉద్యోగాలు సింగరేణి సంస్థలో, 28,277 పోలీసుశాఖలో, 9,355 పంచాయతీ కార్యదర్శులు, 3,463 ఉద్యోగాలు  గురుకుల పాఠశాలల్లో, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో 9600, వైద్య ఆరోగ్యశాఖలో 1,500 ఉద్యోగ నియామకాలతో సహా మరికొన్ని కూడా వున్నాయి).

         అదనంగా ఐటీ రంగంలో, తెలంగాణ ప్రభుత్వ చొరవ,  సానుకూల విధానాల వల్ల 5 లక్షల 82 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ పాలసీ రూపొందించి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కల్పించడంతో రాష్ట్రంలో  దాదాపు 14 వేలకు పైగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 14 లక్షల 59 వేల మందికిపైగా ఉపాధి లభిస్తున్నది. ఇలా మొత్తంగా కలిపి చూస్తే 21 లక్షల 47 వేల మందికి పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన తెలంగాణ దేశంలోనే సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది.

ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాజాగా మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కూడా అధికార యంత్రాంగం ఉపక్రమించింది. బహుశా భారత దేశంలోని ఏ రాష్ట్రంలోకూడా, ఇంత తక్కువకాలంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలోగానీ, ఉద్యోగ భద్రతా విషయంలోగానీ, ఈపాటికే విధుల్లో వున్న ప్రభుత్వ-ప్రభుత్వరంగ ఉద్యోగుల విషయంలోగానీ, ఈ ప్రభుత్వం చేపట్టిన తరహాలో మరే రాష్ట్ర  ప్రభుత్వం కూడా లబ్ధి చేకూర్చే చర్యలు చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు.

వాస్తవంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసం తెలంగాణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. అకడెమిక్, పాలనారంగ నిష్ణాతుడైన ఆచార్య ఘంటా చక్రపాణిని ఈ కమిషన్ కు తొలి ఛైర్మన్ గానూ, తదుపరి డి కృష్ణారెడ్డిని తాత్కాలిక చైర్మన్ గానూ నియమించింది ప్రభుత్వం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2020 చివరినాటికి 36,665 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా 31,072 ఉద్యోగాలను ఇప్పటికే  భర్తీ చేయడం జరిగింది. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ  వివిధ దశల్లో ఉంది.

         అలాగే, రాష్ట్రంలో 3,463 గురుకుల విద్యాలయాల పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది.  రాష్ట్రంలోని 391 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్ల జీతాలను రూ.21,000 నుండి రూ.25,000 లకు, సీఆర్టీల వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పెంచింది. 840 మంది బోధనా, 588 మంది బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలను కలుపుకొని మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 377 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.  వీటిలో 174 మంది బోధన, 203 మంది బోధనేతర సిబ్బందిని నియమిస్తున్నారు.

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల ఆధారిత కుటుంబ సభ్యులకు 10,477 డిపెండెంట్ ఉద్యోగాలు, ఎక్స్టర్నల్ రిక్రూటీలు 3,148 వెరసి 13,625 ఉద్యోగాలు కల్పించారు. ఇవేగాక బోనస్ లు, వార్షిక ఇంక్రిమెంట్లు ప్రకటిస్తూనే ఉన్నారు. ఉద్యోగ భద్రతలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. గురుకుల పాఠశాలల్లో తొమ్మిదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 758 మంది టీచర్లు, అడ్‌హాక్ పద్ధతిలో పని చేస్తున్న 18 మంది టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, 2488 మంది భాషా పండిట్లను, 1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖలో ప్రత్యక్ష నియామకాల ద్వారా 11,869 (జెన్కో, ట్రాన్స్కో కలిపి) ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించగా 9,289 (జెన్కో, ట్రాన్స్కో కలిపి) పోస్టులను భర్తీ చేసి, 2,552 (ట్రాన్స్కో) ఉద్యోగాలను పరిగణలో ఉంచారు.


 ఉద్యోగభద్రత విషయానికొస్తే, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావం నాటికి మున్సిపల్ కార్మికుల వేతనం రూ.8,500గా ఉండేది. వారి వేతనాన్ని రూ.14,000 లకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా 24 వేల మందికి జీతాలు పెరిగాయి. ప్రభుత్వం రెండు పర్యాయాలు అంగన్‌వాడీల జీతాలను పెంచింది. హెల్పర్ల ప్రతినిధులతో జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంగన్ వాడీల జీతాలు రూ.4,200 నుంచి రూ.10,500 (150 శాతం) వరకు పెరిగాయి. 3,989 మినీ అంగన్ వాడి టీచర్ల జీతాలు రూ.4,500 నుండి రూ.6000లకు పెరిగాయి. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు పెంచాలనే నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 35,700 కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది సిబ్బందికి ప్రయోజనం కలిగింది. తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవబడుతున్న 27,045 మంది ఆశ వర్కర్ల పారితోషికాన్ని నెలకు రూ.6 వేలకు పెంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సిని ప్రకటించింది. మూల వేతనంలో 43% శాతం మేర పెంచి (ఫిట్‌మెంట్‌) ఇవ్వడం జరిగింది. సకల జనుల సమ్మెలాంటి అధ్బుత పోరాటాలు చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేసింది. మరో విడత పిఆర్సీ ప్రకటించడానికి కూడా కసరత్తు జరుగుతున్నది. 

ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం వేతనాలను పెంచింది. సెర్ఫ్‌ తో పాటు జాతీయ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు పెరిగాయి. సెర్ప్‌ లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మందికి రూ. 6,260 నుంచి రూ. 12,000 మేర వేతనాలను పెంచారు. మిగతా వారికి 30 శాతం అధికం చేశారు. అలాగే ఉపాధి చట్టంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.6,290 వేతనంగా ఉండగా, దాన్ని రూ.10,000 చేసింది ప్రభుత్వం. మిగతా వారికి 30 శాతం వర్తింపజేసారు. దీంతో మొత్తం 11,415 మందికి జీతాలు పెరిగాయి. ఇందులో 7,402 ఫీల్డ్ అసిస్టెంట్లు కాగా, 4,013 మంది(30 శాతం) ఎఫ్.టి.ఇ.లు వున్నారు.

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 1,703 మంది ‘108’ అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం రూ.4వేలు పెంచింది. వారసత్వంగా విలేజ్ రెవెన్యూ అసెస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు 64.61 శాతం పెంచింది. దీంతో వీఆర్ఏలు రూ.6,500 వేతనం పొందుతున్నారు. ఆ తర్వాత ఈ వేతనాన్ని రూ.10,500కు పెంచింది ప్రభుత్వం. దీంతో పాటు రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ కూడా ప్రకటించింది. దీంతో ఒక్కో విఆర్ఎకు రూ.4,200 వేతనం పెరిగినట్లయింది. వీటితోపాటు అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వి.ఆర్.ఏ.లకు 30 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయనున్నట్లు ప్రకటించింది. పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి వి.ఆర్.ఎ. లుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ తక్కువ వేతనంతో పనిచేస్తున్న రాష్ట్రంలోని 2,900 మంది డెరెక్ట్ రిక్రూట్ వి.ఆర్.ఎ.లకు మేలు కలుగుతుంది. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వి.ఓ.ఎ.) వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18,863 మంది వి.ఓ.ఎ.లు రూ.500 నుంచి రూ.1500 వరకు వేతనం మాత్రమే పొందేవారు. దరిమిలా వారి వేతనాలను రూ.5వేల జీతం పెంచడం జరిగింది. 

రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2010 పిఆర్‌సి సిఫారసుల మేరకు ఎస్జీటిలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్లకు రూ. 14,800 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1892 మంది సిఆర్‌టిలకు మేలు కలుగుతుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన జీతాలను జనవరి 2016 నుండే అమలు చేశారు. రూ.6,700  జీతం వస్తున్న వాళ్ల వేతనాన్ని రూ.12 వేలకు, 8,400 వస్తున్న వారికి 15 వేలకు, 10,900 వస్తున్న వారి జీతాలను రూ.17 వేలకు పెంచారు.

కాంట్రాక్టు లెక్చరర్ల కనీస వేతనం రూ.37,000 పెంచడం వల్ల రాష్ట్రంలో 3,687 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రయోజనం పొందారు. అలాగే కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ల మూల వేతనం రూ.40,270, డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.43,670 పెంచారు. ఈ నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులర్ టీచర్ల మాదిరిగా వేతనాలు పొందుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందికి 44శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించి, అమలు చేసింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల 58,770 మంది కార్మికులకు ప్రయోజనం కలిగింది.

         విద్యుత్ శాఖలోని ట్రాన్స్‌ కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పనిచేస్తున్న దాదాపు 23,667 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరి సర్వీసులను దశలవారీగా క్రమబద్దీకరణ చేయడం జరిగింది. వీరికి ఉద్యోగ భద్రతతోపాటు మెరుగైన జీతభత్యాలు లభిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికి 27.5 శాతం ఫిట్‌మెంట్‌ అలవెన్స్‌ మంజూరు చేసింది ప్రభుత్వం. విద్యుత్‌శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌ కో, డిస్కం ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం 2 డిసెంబర్, 2014న నిర్ణయించింది.

ఉమ్మడి రాష్ట్రంలో 16 వేల మంది హోంగార్డులకు రూ.9 వేలు మాత్రమే ఉండేది. వీరి  డిమాండ్లు విన్న సీఎం కేసీఆర్ తొలి విడతలో వీరి వేతనం 9 వేల నుండి 12 వేలకు పెంచడం జరిగింది. మలివిడతో డిసెంబర్ 2017 నుండి రూ.20 వేలకు పెంచారు. ప్రతి ఏటా వీరి వేతనాన్ని వెయ్యి రూపాయలు పెంచేలా చర్యలు తీసుకుంది. అంతేగాకుండా రాష్ట్రంలోని 30 విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 100 శాతానికి పెంచింది.

ఇక ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ పాలసీ మూలంగా గడిచిన ఆరున్నర సంవత్సరాల్లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులను సాధించింది. రాష్ట్రంలోని ఐటీ సంస్థలలో 5,82,126 మంది ఉద్యోగాలు పొందారు.

          వీటిన్నింటికీ అదనంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలవుతున్న టీఎస్ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక విధానం ద్వారా లైసెన్సులు పొందిన 14,338 పరిశ్రమల్లో  దాదాపు 14,59,639  మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ పరిశ్రమల ద్వారా రూ.2,07,595 కోట్ల విలువ చేసే పెట్టుబడులు వచ్చాయి. వీటితో ప్రత్యక్షంగానే కాక, పరోక్షంగా కూడా లక్షలాదిమందికి ఉపాధి దొరికింది. ఇవన్నీ కూడా ఉద్యోగ, ఉపాధి కల్పన కిందకే వస్తాయి కదా! అన్నిరంగాల్లో కలిపి వీటన్నింటినీ లెక్కించి చూస్తే  మొత్తంగా 21 లక్షల 47 వేల 946  మంది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఆరున్నర సంవత్సరాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లయింది. వాస్తవాలు ఇలా ఉంటే.. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఇప్పటికీ కొందరు వక్రీకరించడాన్ని వారి విజ్ఞతకే వదిలేయాల్సి ఉంటుంది.          

ఇదిలా వుండగా, నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.

Sunday, January 3, 2021

రామాయణం గానం చేస్తున్న కుశ లవులను పిలిపించిన శ్రీరాముడు .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-38 : వనం జ్వాలా నరసింహారావు

 రామాయణం గానం చేస్తున్న కుశ లవులను పిలిపించిన శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-38

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (04-01-2021)

ముని కుమారుల వేషాలను ధరించి మన్మధా కారులై-చంద్ర బింబం లాంటి ముఖం వున్నవారై- అత్యంత తేజస్సుతో అలరారుతూ-చక్కగా రాజవీధుల్లో గానంచేస్తున్న కుశ లవులను, సూర్య తేజస్సుతో ప్రకాశించే శ్రీరామచంద్రమూర్తి,తన ఇంటికి పిలిపించుకుంటాడు. ఆ సమయంలో కుశ లవులు, నల్లని  తుమ్మెదలను మించిన ముంగురులతోను,లేత చంద్రుడితో పోల్చదగే నొసలుతోను,శరీరకాంతితోను మెరిసి పోతుంటారు. తన తమ్ములు, ఇతర సామంత రాజులు, మంత్రులు, మరెందరో తను కూర్చున్న బంగారు సింహాసనం చుట్టూ చేరి, తనకు సేవలు చేస్తున్న సమయంలో, కుశ లవులనుద్దేశించి " నాయన లారా, మీరేదో పాడుతున్నారే ! దానిని నేనూ వింటాను" అని అంటాడు శ్రీరాముడు. మన్మధాకారంగల ముని వేషధారులైన కుశ లవులిద్దరు, ఒకేరకంగా వున్న విషయాన్ని - వారిని చూడగానే సమస్త విద్యలను సరిసమానంగా నేర్చుకున్నట్లుగా తెలుస్తున్న విషయాన్ని, నీతిమంతుడైన శ్రీరామచంద్రుడు గమనించి, తన మనసులో అనుకుంటున్న దాన్ని తమ్ములతో ప్రస్తావిస్తాడు. తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు గానం చేస్తున్నారని అంటాడు.

(రామాయణం వేదార్థం కలది. శ్రుతి కటువుగా కాకుండా, విన సొంపై, కేవలం ఐహికానందం మాత్రమే కాకుండా, అమృతంలాగా మోక్షానందం కూడా కలిగించేది రామాయణం. అలలు ఎలా అంతం లేకుండా వస్తుంటాయో, అలానే రామాయణ కావ్యం కూడా ఎప్పటికప్పుడు బ్రహ్మానందం కలిగిస్తూనే వుంటుంది. అసత్యమంటే ఎరుగని - అసత్యమాడని శ్రీరామచంద్రుడు తన మనసులో వున్న ఇదే విషయాన్ని బయటకంటాడు. ఆనందం రెండు రకాలు: విషయానందం, బ్రహ్మానందం. కమ్మని రుచికరమైన పదార్థాలను తినడం-ఇంపైన ధ్వనులను వినడం-పరిమళ పదార్థాలను చూడడం వలన కలిగే ఆనందం విషయానందం. మోక్ష కాలంలో పరిపూర్ణ బ్రహ్మానుభవం ద్వారా కలిగే ఆనందం బ్రహ్మానందం).

కుశలవుల గానాన్ని వినమని తమ్ముళ్లను ప్రోత్సహిస్తూ: "ఈ బాలకులు ఏ రసాన్నైతే అభినయిస్తూ పాడుతున్నారో, ఆ రసమే మనలో పుట్టి మనకూ అనుభవంలోకి వస్తున్నది. కవిత్వం విషయానికొస్తే, ఆసాంతం, విచిత్ర శబ్దాలతో కూడి వినసొంపుగావుంది. ఏ దోషాలు లేవు. ఇలాంటి నిర్దుష్టమైన-గుణవంతమైన-శ్లాఘ్యమైన కావ్యాన్ని చంద్ర బింబం లాంటి ఈ ముని కుమారులు గానం చేస్తున్నారు" అని సగౌరవంగా మాటలతోనే బహుకరిస్తూ అంటాడు శ్రీరాముడు. ఆలాపాల, రాగాల తీయ దనంతో, ప్రవాహంలాగా రామాయణ గానం చేస్తున్న బాలకుల ప్రతిభను గమనిస్తున్న వారంతా, ఆ రసాస్వాదనలో మునిగి తేలుతూ, ఇంకా తనివితీరా వింటే బాగుంటుందని భావిస్తూ పరవశులై పోతుంటారు. కుశ లవుల గాన మాధుర్యాన్ని-మనోహరత్వాన్ని ఆస్వాదించడమే కాకుండా, పాటకు సంబంధించిన కథలోని విశేషాన్ని కూడా గమనించాలని, శ్రోతలనుద్దేశించి అంటాడు శ్రీరాముడు. ఆయనలా మాట్లాడడంతో, కుశ లవులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తేనెలో చక్కెర కలిపితే, తీపి దనం ఎలా పెరుగుతుందో, అలానే, భగవత్ కథలో తీయదనం కలిగిస్తున్న కుశ లవులు బాలకులైనప్పటికీ, భగవత్ కథను చెప్తున్నందున, వారికంటే ఉన్నత స్థానంలో తను కూర్చోడం భావ్యం కాదని తలచిన శ్రీరాముడు, సందడి చేయకుండా బంగారు సింహాసనం మీదనుండి దిగి, అక్కడున్న నలుగురి మధ్య ఒకడిగా కూచుంటాడు. దీంతో మరింత సంబరపడిన కుశ లవులు, అసలు-సిసలైన సంగీత విధానంలో రామ చరిత్రనంతా గానం చేశారు.


("తపమున స్వాధ్యాయంబున. ... .. " అనే పద్యంతో ఆరంభమై, ఇంతవరకు చెప్పిందంతా ఉపోద్ఘాతం లాంటిది. నాటకానికి నాంది-ప్రస్తావనలు ఎలా అంతర్భాగాలో, రామాయణానికి ఇలాంటి ఉపోద్ఘాతం ఒక అంతర్భాగం. వ్యక్తి వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం అనే మూడు ప్రధాన విషయాలను, రామాయణం చదివే వారికి-దానిపై గౌరవం కలించేందుకు, ఈ ఉపోద్ఘాతం లో వివరించడం జరిగింది. కుశ లవులు రామాయణ గానం చేయడం, గ్రంథ రచన తదుపరి జరిగిన సంఘటన. ఎందుకు ఆరంభంలోనే దీన్ని రాయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. త్రికాల జ్ఞానైన వాల్మీకి మహర్షి యోగ దృష్టితో రామాయణ వృత్తాంతమంతా ఆద్యంతం మొదలే తెలుసుకున్న విధంగానే, ఈ విషయాన్నీ తెలుసుకుని, కుశ లవులతో చెప్పించినట్లుగా భావించాలి. వాస్తవానికి ఉపోద్ఘాతంలో తెలియచేసినట్లుగా, కుశ లవులు రామాయణ గానం చేసిన సంగతి ఉత్తర కాండలో సరైన సందర్భంలో చెప్పడం జరిగింది.దాన్నే పాఠకులకు సంక్షిప్తంగా ముందుగానే వివరించడం జరిగింది.మొదటి మూడు సర్గల్లో స్వవిషయం గురించి, తనకు యోగ దృష్టి కలదని చెప్పడం గురించి, బ్రహ్మ సాక్షాత్కారం గురించి, రాయడాన్ని కొందరు వాల్మీకి ఆత్మ స్తుతిగా ఆక్షేపించవచ్చు. వాస్తవానికి మొదటి మూడు సర్గల్లో "గ్రంథోత్పత్తి" గురించి చెఫ్ఫడం జరిగిందే కాని మరింకేమీ కాదు.

బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతుని అర్థం చేసుకోవాలి. భగవంతునందు చేసిన శరణాగతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగ కాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణా గతికి పురుష కారం అవశ్యం. పురుషకారానికి కావాల్సిన ముఖ్యగుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుషకారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్యవలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే).

రామ సుగ్రీవుల స్నేహం సీతాన్వేషణకేనా? : వనం జ్వాలా నరసింహారావు

 రామ సుగ్రీవుల స్నేహం సీతాన్వేషణకేనా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (03-01-2020) ప్రసారం  

సుగ్రీవుడు పంపగా పోయిన హనుమంతుడు  తన వెంట తీసుకొచ్చిన రామలక్ష్మణులను ఆయనకు సవివరంగా పరిచయం చేశాడు.  విస్తారమైన సత్యం, శౌర్యం, సత్యమైన శౌర్యం, సత్యమే శౌర్యంగా కల వాడు రాముడనీ, సాక్షాత్తూ పరమాత్మ అనుకోవాలనీ చెప్పాడు. దశరథమహారాజు కొడుకైన ఆయన అడవుల్లో తిరుగుతుంటే, రావణాసురుడి వల్ల తన భార్యను కోల్పోయాదనీ, సుగ్రీవుడి స్నేహం కోరి అన్నదమ్ములు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారిని పూజించమనీ చెప్పాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులను సమీపించి, పూజించి, రామచంద్రమూర్తిని చూసి ఇలా అన్నాడు.

          “రామచంద్రా! నాతో స్నేహం చేయడానికి నీకు పరిపూర్ణంగా అంగీకారమైతే, నా చేతిలో నీ చేయి వెయ్యి. ఇదిగో, నా చేతిని స్నేహధర్మ మర్యాద ప్రకారం చాచాను. ఇది అభయహస్త ప్రధానప్రార్థన”. ఆ మాట విన్న రామచంద్రమూర్తి సంతోషించి, తన అరచేతిని, సుగ్రీవుడి అరచేతిలో వుంచి, గౌరవించి నిండు మనస్సుకల స్నేహంతో కౌగలించుకున్నాడు. అప్పుడు అగ్నిహోత్రాన్ని వారిద్దరిమధ్య హనుమంతుడు పెట్టాడు. రామసుగ్రీవులు అడవి పూలతో పూజించి, ఒకరిచేయి మరొకరు పట్టుకుని,  ఆసక్తిగా అగ్నికి ప్రదక్షిణ చేశారు. ఇలా రామసుగ్రీవులు స్నేహం చేసి ఇద్దరూ తమ పని జరిగినట్లే సంతోషించారు.

అప్పుడు సవినయంగా సుగ్రీవుడు తనకు అన్న వాలి చేసిన అపకారాన్ని గురించి ఇలా చెప్పసాగాడు. “రామచంద్రా! నా అన్న వాలి భయంకరమైన పరాక్రమం కలవాడు. వాడు నామీద కోపంతో నన్ను రాజ్యం నుండి పంపించి, నా భార్యను హరించి, నిర్దయుడై వెళ్లగొట్టితే, ప్రాణభయంతో కొండాకోనలలో అల్లల్లాడుతున్నాను. నన్ను కరుణార్ద్ర దృష్టులతో చూసి వాలి భయం నాకు లేకుండా చేసి నన్ను రక్షించు”.

సుగ్రీవుడిలా చెప్పగా స్నేహధర్మం తెల్సిన శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ప్రీతిగా సుగ్రీవుడితో వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేస్తూ రాముడు ఇలా అన్నాడు. “స్నేహితుడంటే ఉపకారం చేసేవాడని అర్థం. ఇది నేను చక్కగా ఎరుగుదును. కాబట్టి నీ భార్యను అపహరించిన ధర్మవిరుద్ధచరిత్రుడైన వాలిని చంపుతాను. భయపడవద్దు. రాముడిలా చెప్పగా, సంతోషించిన సుగ్రీవుడు, “రామచంద్రా! నీ అనుగ్రహంవల్ల నా భార్య, రాజ్యలక్ష్మి లభిస్తే సంతోషిస్తాను. నీ బాణాలతో వాలిని త్వరగా చంపి నా తీవ్ర దుఃఖాన్ని తొలగించి రక్షించు. నీకు నీ భార్యను ఎడబాయడం వల్ల కలిగిన దుఃఖాన్ని నేను తొలగిస్తాను. నువ్వు బాధపడవద్దు. పతివ్రతైన సీతాదేవిని నీచుడైన రాక్షసుడు ఏ ప్రదేశంలో దాచినప్పటికీ, పాతాళంలో వున్నా సరే, ఆకాశాన వున్నా సరే, రామచంద్రా! ఆమెను నేను తేగలను. నువ్వు బాధపడవద్దు”.

          సుగ్రీవుడు శ్రీరాముడితో ఇంకా ఇలా అన్నాడు. “మేం సీతను చూడడమే కాదు. ఆమెకూడా మమ్మల్ని చూసి, ఆమె తనమీది ఉత్తరీయంలో సొమ్ములను మూటగట్టి విసిరివేసింది. వాటన్నింటినీ నేను కొండగుహమీద వున్న హనుమంతుడి చేతికి ఇచ్చి దాచిపెట్టాను. వాటిని త్వరగా తెప్పిస్తాను. నీ భార్యవేమో చూడు” అని వాటిని తెచ్చి రాముడికి చూపించడం జరిగింది. చీరచెరగున కట్టిన సొమ్ములను రామచంద్రమూర్తి చేతికి తీసుకుని, వాటిని చూస్తూ, కళ్లల్లో కన్నీళ్లు వస్తుంటే, అవి చూపులను అడ్డగిస్తుంటే, “హా! ప్రియురాలా! రమణీ!” అంటూ ఆరాటంగా ఆ భూషణాలను ఒత్తిపట్టుకుని పుట్టలోని పాము బుసకొట్టినట్లు పెద్ద శ్వాస విడిచాడు. “లక్ష్మణా, వీటిని నువ్వు చూడు. ఇవి సీతవే కదా?” అని అడిగాడు. జవాబుగా లక్ష్మణుడు, “అన్నా! ఈ బాహుపురులు, ఈ కమ్మలు, సీతాదేవివి అవునో-కాదో నేను చెప్పలేను. ప్రతిదినం ఆమెకు పాదాభివందనం చేసేటప్పుడు చూసేవాడిని కాబట్టి ఈ అందియలు సీతాదేవివే అని చెప్పగలను” అన్నాడు.

         లక్ష్మణుడు ఇలా చెప్పగానే, సుగ్రీవుడిని రావణుడి వృత్తాంతం అడిగాడు రాముడు. ఆ రాక్షసుడు కాపురముండే దేశం కానీ, అతడి బలం కానీ, శక్తికానీ, సామర్థ్యం కానీ, అ అనీచుడి కులంకానీ తనకు తెలియదనీ, అయినా విచారపడవద్దనీ, ఏవిధంగానైనా వాడిని కనుక్కునే మార్గాన్ని అన్వేషిస్తామనీ అన్నాడు సుగ్రీవుడు. సీతాదేవి ఎక్కడున్నా వెతికి ఆ రాక్షసుడిని బంధువులతో, కొడుకులతో, స్నేహితులతో యుద్ధంలో చీల్చివేసి రాముడి మనస్సుకు సంతోషం కలిగేట్లు చేస్తానని మాట ఇచ్చాడు.

         ఇక్కడ సుగ్రీవుడు స్పష్టంగా అబద్ధం చెప్పాడు. రావణాసురుడి విషయం హనుమంతుడికి తెలియదుకాని సుగ్రీవుడికి బాగా తెలసు. రావణాసురుడు వాలిచేతిలో ఓడిపోయి సంధి కుడుర్చుకున్నవాడే. అప్పుడు సుగ్రీవుడు కూడా అక్కడ వున్నాడు. అలాంటప్పుడు తెలిసి-తెలిసి అబద్ధం చెప్పడం మిత్రద్రోహం కాదా? కాదు. కానేకాదు. ఇప్పుడే రావణాసురుడి గురించి సుగ్రీవుడు చెప్తే చాలా తొందరలో వున్న రామచంద్రమూర్తి వెంటనే లంకమీదకు యుద్ధానికి పోదామని అనవచ్చు. వాడి బలం ఈయనకు తెలియదు. తానేమో వాలి జీవించి ఉన్నంతదాకా ఈ స్థలాన్ని విడిచి పోవడానికి వీల్లేదు. ఒకవేళ పోయినా ఇప్పుడున్న ఐదుగురితో చేయగలిగింది ఏమీ లేదు. తాము బయల్దేరిపోతే వాలి సైన్యంతో దండెత్తి వస్తాడు. వాలి, రావణుడు ఒకటైతారు. అప్పుడీయన ఎవరితోనని యుద్ధం చేస్తాడు? తొందరపాటు వల్ల కార్యభంగమే కాని అనుకూలంకావు. వాలిని చంపి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇస్తే తానూ సర్వాధికారి అవుతాడు. అప్పుడు నిర్భయంగా లంకమీదకు దండెత్తవచ్చు. ఇలా కార్యభారం, సాధన మార్గం ఆలోచించి సుగ్రీవుడు అబద్ధం చెప్పాడు. దీనివల్ల రామచంద్రమూర్తి పని పాడవలేదు. స్నేహధర్మాన్ని అనుసరించి ఆడిన అబద్ధం తప్పుకాదు.       

ఈ విధంగా రామసుగ్రీవులు వారి-వారి సుఖ దుఃఖాలు ఒకరితో మరొకరు ఏకాంతంగా చెప్పుకున్నారు. ఏక నిశ్చయంతో రామసుగ్రీవులు ఇలా తమ సుఖదుఃఖాలు ఒకరికొకరు చెప్పగా, సుగ్రీవుడు తన కార్యం సఫలమైంది కదా అని మిక్కిలి సంతోషించాడు.

         వాలి తనకు చేసిన కీడును గురించి సుగ్రీవుడు రాముడికి వివరంగా చెప్పాడు. తన ప్రాణాలకంటే ప్రియమైన భార్యను అపహరించాదనీ, తన స్నేహితులను, బంధువులను, చెరసాలలో బంధించాడనీ, తన ప్రాణాలను తీయడానికి ఆలోచిస్తున్నాదనీ చెప్పాడు. “వాలి మహా పరాక్రమశాలి. సూర్యుడిలాంటివాడు. శత్రువులకు భయంకరుడు. అలాంటివాడు చచ్చి నేలబడితేనేకాని నా దుఃఖాలు పోవు”.

         తనకు, తన అన్నకు విరోధం వచ్చిన విధం చెప్పడం ప్రారంభించాడు. “మయుడి కుమారుడు, దుందుభి సోదరుడైన మాయావి అనేవాడు స్త్రీ కారణాన వాడికీ, వాలికీ వున్న విరోధాన్ని అడ్డం పెట్టుకుని ఒక అర్థరాత్రి అందరూ నిద్రించే సమయంలో వాలిమీదకు యుద్ధానికి వచ్చాడు. రాక్షసులతో అర్థరాత్రి యుద్ధానికి పోవడం మంచిది కాదని నచ్చచెప్పాం. మా మాట వినకుండా వాడిమీదకు యుద్ధానికి పోయాడు”.

“ఒంటరిగా రాక్షసులమీడకు యుద్ధానికి పోతున్న అన్న వాలి వెంట నేను కూడా పోయాను.  ఆ రాక్షసుడు భయంతో వేగంగా పరుగెత్తసాగాడు. ఆ దానవుడు ఒక బిలంలో ప్రవేశించాడు. అప్పుడు మా అన్న దానవుడిని చంపి వస్తానని చెప్పి లోపలికి పోయాడు. నేను బిలం బైట నిలబడ్డాను. ఒక సంవత్సరం నేనా బిలం బైటనే వుండిపోయాను. బిలంలోనుండి నెత్తురు భయంకరమైన నురుగుతో బయటకు రాసాగింది. రాక్షసుల సింహనాదాలు స్పష్టంగా వినపడ్డాయి. వాలి దీనమైన ఏడుపు వినపడ్డది. పరాక్రమం క్షీణించి వాలి రాక్షసుడి చేతిలో చిక్కాడని, మరణించాడని భావించి, కొండను ఆ బిలానికి అడ్డంగా వేసి అక్కడి నుండి వెళ్లిపోయాను. మంత్రులు నన్ను రాజ్యానికి రాజుగా చేసి, పట్టాభిషేకం చేశారు. ఆ విధంగా రాజునైన నేను రాజ్యాన్ని పాలిస్తున్నాను”.

“ఇంతలో, వాలి దైత్యుడిని చంపి, నగరానికి వచ్చి, రాజ్యాన్ని కోరి తనను విడిచి వెళ్ళిపోయానని సందేహించాడు. పట్టాభిషేకం చేసుకున్న నన్ను చూసి కోపంగా చూశాడు. నన్ను తిట్టి, నా దగ్గరున్న మంత్రులందరినీ బంధించి, వాళ్లను చెరసాలలో వేశాడు. నన్ను వూరు వెడలగొట్టాడు. నా భార్యను గ్రహించాడు. అంతటితో ఆగకుండా నన్ను చంపడానికి రావడంతో ప్రాణ భయంతో అనేక దేశాల్లో తిరిగి చివరకు ఈ గుట్టకు అతడు రాలేకపోవడానికి కారణం వుండడం వల్ల ఇక్కడ స్థానం ఏర్పాటు చేసుకున్నాను. బుద్ధిపూర్వకంగా నేను ఏ అపకారం చేయలేదు. అలా అయినప్పటికీ పడరాని కష్టాలను పడుతున్నాను. నన్ను రక్షించు”.

సుగ్రీవుడు జరిగినదంతా సత్యంగానే చెప్పాడు కాని, తాను రాజుగా వున్న సమయంలో అన్న భార్య తారను గ్రహించిన సంగతి చెప్పలేదు. ఈ కలహంలో మొదలు సుగ్రీవుడు మీద అనుమానం రావడం సహజమే. కాని సుగ్రీవుడు బుద్ధిపూర్వకంగా చేయాలని పొరపాటు చేయలేదు. వాస్తవంగా రాజ్యకాంక్ష వల్ల వాలికి ద్రోహం చేసినట్లయితే అతడు కిష్కింధకు వచ్చినప్పుడు తన బలంతో వాలిని నిగ్రహించగలిగేవాడే! వాలిసుగ్రీవులు ఇద్దరూ ఇంచుమించు సమానమైన బలవంతులే. వాలిదగ్గర ఇంద్రదత్తహారం వుండడం వల్ల ఎక్కువ బలశాలి అయ్యాడు. హనుమంతుడు, నీలుడు లాంటివారు సుగ్రీవుడి సహాయకులు. సుగ్రీవుడు వాలితో యుద్ధానికి పూనుకుంటే ఒక్క హనుమంతుడే వాలిని మట్టుబెట్టగలడు. కాబట్టి సుగ్రీవుడిలో ద్రోహబుద్ది లేదు.

సుగ్రీవుడి విషయంలో వాలి అనుమానపడ్డాడు. బిలద్వారం మూయడం, రాజ్యాభిషిక్తుడు కావడం ద్రోహబుద్ధితో చేశాడని నమ్మాడు. తాను జీవించి వుండగా తన భార్య తారను గ్రహించాడని కోపం వచ్చి వుండవచ్చు. అందుకే ఆ తరువాత సుగ్రీవుడి భార్యను వాలి గ్రహించాడు. అయితే సోదరుడు మరణిస్తేనే ఆయన భార్యను స్వీకరించవచ్చని ఒక మర్యాద ఆ జాతుల్లో వుంది. వాస్తవానికి వాలి మరణించాడని నమ్మి ఆయన భార్యను సుగ్రీవుడు గ్రహించాడు. కాని, సుగ్రీవుడు జీవించి ఉన్నాడని తెల్సికూడా వాలి అతడి భార్యను గ్రహించాడు. ఈ కులమర్యాదను రామచంద్రుడు కూడా ఆదరించాడు. ఎందుకంటేవాలి మరణం తరువాత సుగ్రీవుడు తారను గ్రహించాడని తెలిసీ ఆయన ఏం అనలేదు. వాలి కుల మర్యాదను, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించడం వల్లే శిక్షార్హుడయ్యాడు.

సుగ్రీవుడు ఇలా చెప్పడంతో రామచంద్రమూర్తి అతడితో, “మిత్రమా! బాధపడవద్దు. నా బాణాలతో నీ పగ తీరుస్తాను. ఆ పాపాత్ముడెంతవరకు నాకంట పడడో అప్పటివరకే సుఖంగా వుంటాడు. కపీశ్వరా నా దుఃఖంలాంటిదే నీ దుఃఖం. దాన్ని ఉపశమించేట్లు చేస్తా. సంతోషించు”. ఆ తరువాత దుందుభి వృత్తాంతాన్ని చెప్పాడు. వాలి, దుందుభి మధ్య జరిగిన యుద్ధంలో ఏ విధంగా వాలి దుందుభిని చంపి, వాడి కళేబరాన్ని చేతులతో పైకెత్తి, ఆమడ దూరంలో పడేట్లు విసిరి వేసింది చెప్పాడు. “అప్పుడారాక్షసుడి నోటినుండి కారుతున్న నెత్తురు గాలికి కొట్టుకుని వచ్చి మతంగాశ్రమంలో పడింది. అది చూసి మునీశ్వరుడు బాగా కోపం తెచ్చుకున్నాడు. తన తపశ్శక్తితో బలోన్మత్తుడైన వాలి చేసిన పని ఇది అను గ్రహించాడు. వాలిమీద కోపం తెచ్చుకున్నాడు ముని. వాలి ఇక్కడికి వస్తే చచ్చిపోతాడు అని శపించాడు. అప్పటి నుండి వాలి ఇక్కడికి రాడు. ఆ విషయం నాకు తెలిసినందువల్ల భయం లేకుండా ఇక్కడ తిరుగుతున్నాను. అదిగో అదే ఆ రాక్షసుడి ఎముకల గూడు. నేలపడి వుంది చూడు. రామచంద్రా! వాలి భుజబలం ఎలాంటిదో నీకు చెప్పాను. అలాంటి మహాబలశాలి వాలిని నువ్వెలా చంపుతావో చెప్పు” అని అంటాడు సుగ్రీవుడు.

         రాముడు తనలో తానే నవ్వుకుని, తన బలాన్ని ఆయన నమ్మేట్లు ప్రదర్శిస్తానని సుగ్రీవుడితో అన్నాడు. దుందుభి శరీరాన్ని దూదిలాగా తన వేలితో అవలీలగా ఎత్తి పది యోజనాల అవతల పడేట్లు చిమ్మాడు. రామచంద్రమూర్తి ఇంకా సుగ్రీవుడికి నమ్మకం కలిగేట్లు చేయడానికి, ఆయన చూపించిన మద్దిచెట్టును గురిచూసి కొట్టాడు. రామచంద్రమూర్తి వేసిన బాణం త్వరగా పోయి, ఆ ఏడు చెట్లను త్వరగా నరికి, కొండబద్దలయ్యేలా భేదించి, భూమిలో దూరి, మళ్లీ త్వరగా బయటకు వచ్చి ఆయన అంబులపొదిలో చేరింది. తన రెండు చేతులు జోడించి, రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ తన అన్న వాలి ఆయనకు ఒక లెక్క కాదన్నాడు. అన్నను రాముడు చంపుతాడన్న నమ్మకం కుదిరింది. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Saturday, January 2, 2021

హనుమంతుడు ఆచార్యపదవికి తగినవాడేనా? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమంతుడు ఆచార్యపదవికి తగినవాడేనా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (02-01-2021) ప్రసారం  

పంపా తీరం చేరిన రామచంద్రమూర్తి, అపహరించబడిన భార్య సీత కోసం బేలవలె ఏడుస్తూ వుండడం చూసిన లక్ష్మణుడు సమాయనుకూల హితబోధ చేసి సంతాపాన్ని ఉపశమింప చేసే ప్రయత్నం చేశాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సత్యమని భావించిన రాముడు దుఃఖాన్ని విడిచి ధైర్యం వహించాడు. ఆ తరువాత శీఘ్రంగా నిర్భయంగా నడుస్తూ, తమ్ముడు ధర్మ వాక్యాలు చెప్తుంటే వినుకుంటూ ఋశ్యమూక పర్వతం దిశగా ముందుకు సాగిపోయారు.

రాముడు, లక్ష్మణుడు ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, వారిని, కొండమీద వున్న సుగ్రీవుడు చూసి భయపడ్డాడు. సుగ్రీవుడితో పాటు ఇతర వానరులు కూడా చూశారు. రామలక్ష్మణులను చూసిన వానరులకు వీరిని వాలి పంపగా తమను చంపడానికి వచ్చారని భావించారు. పంపానదికి ఉత్తరాన రామలక్ష్మణులు, దక్షిణాన సుగ్రీవాదులు వున్నారు. వారి వెంట ఇంకా ఎవరైనా వస్తున్నారేమోనని నలుదిక్కులా చూశాడు. ఒకచోట నిల్వలేకపోయాడు. పరుగెత్త సాగాడు.

ఆ సమయంలో ఆంజనేయుడు సుగ్రీవుడి దగ్గరకు పోయి "వానర రాజా! ఎందుకు నీకు భయం వేస్తున్నది? వాలి భయంతో ఎందుకు నువ్వీవిధంగా పరుగెత్తుతున్నావు? ఈ పర్వతం ఋష్యమూకం కదా! ఇక్కడ వాలివల్ల భయం లేదుకదా? ఒకవేళ భయపడడానికైనా వాలి ఇక్కడెక్కడా కనబడడం లేదే? కాబట్టి ఎందుకు తొట్రుపాటు పడుతున్నావు? నీ పిరికితనానికి కారణం ఏమిటి?" అంటాడు. హితమైన మాటలు చెప్పిన ఆంజనేయుడితో సుగ్రీవుడు రామ లక్ష్మణులను చూసిన విషయం చెప్పి, తనను చంపగల వారెవరినో ఇక్కడికి వాలి పంపాడని నిశ్చయించాను కాబట్టి భయపడ్డానని అంటాడు.

“రాజులందరూ తమ శత్రువులను ఉపాయంతోనే కదా చంపుతారు? అలాగే వాలి కూడా చేస్తుండవచ్చు. అయినప్పటికీ ఇది ఇలాగే అని నేను చెప్పలేను. నా జాగ్రత్తలో నేను వుండడం మంచిదని పరుగెత్తి వచ్చాను. నా ఆలోచన సరైందా? కాదా? అని తెలుసుకోవాలి. దానికొరకు ఎవరో ఒక సామాన్యుడిని వారిదగ్గరకు పంపాలి. నువ్వే సామాన్య మనిషి వేషంలో వాళ్ల దగ్గరికి పోయి విషయం తెలుసుకో. ఆంజనేయా! నువ్వు పోయి వాళ్ల మనస్సు నిజంగా ఎలాంటిదో కనుక్కో.  నీమీద ముందుగా నమ్మకం పుట్టించుకుని ఆ తరువాత నామీద వాళ్లకు సదభిప్రాయం కలిగేట్లు చేయి. వాళ్లు నిర్మలమైన మనస్సు కలవారనీ, వంచన గుణం లేనివారనీ నీకు నమ్మకం కుదిరితే, వాళ్లు మాట్లాడే విధానం గమనించు. వారి మాటల్లో నిజమెంతో, మోసమెంతో తెలుసుకో".

అని సుగ్రీవుడు చెప్పగా హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశానికి నిజస్వరూపంలో పోతే, పోయిన పని నెరవేర్చడం కష్టమని భావించి, వానర రూపం వదిలి, సన్న్యాసి లాగా తానున్న కొండ దగ్గరినుండి, వారిదగ్గరికి పోయి ఏకాగ్రచిత్తంతో, వినయంగా వాళ్లకు నమస్కారం చేశాడు.

ఇక్కడ సన్న్యాసి రూపం ధరించిన హనుమంతుడు గృహస్తుడైన రామచంద్రమూర్తికి ముందుగా తానే నమస్కారం చేయడం అంటే సర్వత్రా ఇలాంటి ఆచారం సమంజసమని అనుకోవాలి. సన్న్యాసి గృహస్తుడికి నమస్కారం చేయడం భావ్యం కాదని కొందరంటారు కాని, అది వాస్తవం కాదు. మనువాక్యమూ కాదు. మనుశాస్త్రానికి విరుద్ధం కూడా. ఆ మాటకు మూలం ఏంటో, కర్త ఎవరో కూడా తెలియదు. జ్ఞానాధికుడైన గృహస్తుడికి సన్న్యాసి నమస్కరించాలి అనేదే మనువాక్యం. హనుమంతుడు అత్యద్భుతములైన రామలక్ష్మణుల ఆకారాలు చూసిన వెంటనే అధికానంద పరవశుడై తాను ధరించిన సన్న్యాసి ఆకారాన్ని కూడ మరచిపోయి అవశంగా వారికి నమస్కారం చేశాడు. ఇది సర్వత్రా ప్రామాణికం కాదని కొందరి అభిప్రాయం. ఇది యుక్తంకాదు. హనుమంతుడు నిపుణమతి. గొప్ప మంత్రి. రాముడి అభిప్రాయం కనుక్కొని రమ్మని సుగ్రీవుడు పంపగా వచ్చాడు. అలాంటి వాడు ఆదిలోనే తనను తాను మరచిపోతే తక్కిన కార్యం ఎలా నెరవేర్చగలడు? రామచంద్రమూర్తి ఎలా నమ్ముతాడు? రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు సుగ్రీవుడికి మేలు చేసేవారే కాని పగవారు కాదని నిశ్చయించిన హనుమంతుడు తాను వేసుకున్న వేషం మారు వేషమనీ, తాను చారుడనీ తెలియచేయడానికే నమస్కారం చేశాడు. ఇక్కడ బిక్షువు అంటే సన్న్యాసికాడు. బ్రహ్మచారి అని కొందరంటారు. అదీ యుక్తం కాదు. హనుమంతుడు మొదటినుండీ బ్రహ్మచారే కాని, ఇప్పుడు కొత్తగా వేయలేదు. కాబట్టి హనుమంతుడు సన్న్యాసి వేషం ధరించాడనీ, జ్ఞానాధికుడైన రామచంద్రుడికి, గృహస్తుడికి, నమస్కరించడం తప్పుకాదనీ చెప్పాలి.

ఆ తరువాత సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు హనుమంతుడు రాముడితో ఇలా. "అయ్యలారా! మీరెవరు? ఈ అడవి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు రాజర్షులతో, దేవతలతో సమానంగా వున్నారు. మీలో రాజవేషం , ముని వేషం రెండూ కలిసి వున్నాయి. అలా అయితే మీరు సంకరులని నా అభిప్రాయం కాదు. మీరేదో మంచి వ్రతం పూని ఇలా వున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్రతం మీరు పూనడానికి కారణమేంటి? మహిమలో దేవతలకు సమానంగా వున్నారు. కాబట్టి ఎలాంటి శత్రువునైనా చంపగల సమర్థులు మీరు. మీరెందుకు నారచీరెలు కట్టి జడదారుల్లాగా జడలు ధరించి తిరుగుతున్నారు? మీ యోగ్యతకు, మీ ఇప్పటి స్థితి, పరస్పర విరుద్ధంగా వుండడానికి కారణం ఏంటి?. మీరేదో శత్రుసంహార కార్యక్రమానికి సిద్ధమైనట్లు కనపడుతున్నది”. 

హనుమంతుడు ఇన్ని ప్రశ్నలు వేసినా రామలక్ష్మణులు ఆయన మాటల సొంపు-పెంపు వింటూ వూరకే వున్నారు తప్ప ఒక్కదానికైనా జవాబివ్వలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. ఆయన మాటలపట్ల ఆసక్తి కావచ్చు. తాము మాట్లాడితే ఆయన మాటలు వినే అవకాశం కోల్పోవచ్చు. సన్న్యాసులు తిరగకూడని ప్రదేశంలో తిరుగుతున్న ఈ సన్న్యాసి నిజమైన సన్న్యాసా? కాదా? అన్న సందేహం కావచ్చు. బిక్షకోసం వచ్చిన సన్న్యాసి అయితే ఆయన స్థితిగతులు చెప్పుకోవాలి కాని తమ స్థితిగతులను గురించి ఎందుకు అడగాలి? వేగులవాడేమో! ఇక్కడ పరస్పర శత్రువులైన వాలి-సుగ్రీవులలో ఇతడు ఎవరి పక్షమో? కాబట్టి ముందుగా తానెవరో చెప్పిన తరువాత మాట్లాడుదామని రామలక్ష్మణులు భావించి వుండాలి.

ఇక హనుమంతుడు వేరే విధంగా ఆలోచించ సాగాడు. తానెంత మాట్లాడినా వీళ్లు బదులు చెప్పడం లేదు. తనమీద వీరికి సందేహం కలిగిందేమో? ఆ సందేహం తీరేవిధంగా తాను సంభాషిస్తేనేగాని వాళ్లు తనను నమ్మి తనతో మాట్లాడారని అనుకుంటాడు. వీళ్లు గొప్పవారిలాగా వున్నారు కాబట్టి వీళ్ల స్నేహం తప్పక చేయాలి అని ఆలోచించి తన వృత్తాంతాన్ని కపటం లేకుండా ఇలా చెప్పాడు.

“ఆర్యులారా! నా వృత్తాంతాన్ని చెప్తా వినండి. ఈ ప్రాంతంలో సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడు, కోతిరాజు, వీరుల గౌరవానికి పాత్రుడు వున్నాడు. అతడిని ఆయన అన్న వెళ్లగొట్టితే నిలువనీడలేక, ప్రాణ భయంతో అమితంగా బాధపడ్తూ దేశంలో తిరుగుతున్నాడు. మీ స్నేహం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపుతే మీ దగ్గరికి వచ్చాను నేను. నేనాయన మంత్రిని. వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను వానరుడిని. కోరిన రూపం ధరించి, కోరిన ప్రదేశానికి వెళ్లగలను. సుగ్రీవుడి మేలు కోరి సన్న్యాసి వేషంలో ఋశ్యమూకం నుండి ఇక్కడికి వచ్చాను” అని చెప్పి హనుమంతుడు మౌనం దాల్చాడు.

దీంతో రామలక్ష్మణుల సందేహం తీరింది. వాలి-సుగ్రీవుల పేర్లు, వాలి సుగ్రీవుడిని వెళ్లగొట్టడం, సుగ్రీవుడు ఋశ్యమూకం మీద వుండడం, ఇవన్నీ రామలక్ష్మణులకు తెలిసిన విషయమే. కాబట్టి సందేహానికి తావు లేదు. ఆ తరువాత తాను సుగ్రీవుడి మంత్రినని చెప్పాడు హనుమంతుడు. అంటే సుగ్రీవుడి పక్షంవాడని అర్థమయింది.

హనుమంతుడి మాటలకు సంతోషించిన రాముడు, తమ్ముడు లక్ష్మణుడిని చూసి హనుమంతుడిని ప్రశంసిస్తూ చెప్పాడు. “లక్ష్మణా! ఇతడు సుగ్రీవుడికి ప్రీతిపాత్రుడైన మంత్రి. మనం ఏ సుగ్రీవుడిని చూడాలని పోతున్నామో, అతడి మంత్రే ఈ రూపంలో మనదగ్గరికి వచ్చాడు. అంటే, సుగ్రీవుడితో ఏ పనైతే అవుతుందని అనుకుంటున్నామో, అది ఇతడిద్వారానే జరుగుతుంది. ఆయన్ను మనం ఎలా నమ్మవచ్చో ఇతడిని కూడా అలాగే నమ్మవచ్చు. ఆయనకూ, ఇతడికీ భేదం లేదు”.

         హనుమంతుడు ఆచార్యపదవికి తగినవాడని శ్రీరామచంద్రమూర్తి ఆయన యోగ్యతను గురించి చెప్పాడు. ఆచార్యుడు వేదం తెల్సినవాడిగానూ, విష్ణుభక్తుడుగానూ, మాత్సర్యం లేనివాడుగానూ,  విష్ణుమంత్రం తెలిసినవాడుగానూ, ఆ మంత్రం మీద భక్తికలవాడుగానూ, మంత్రార్థం ఇతరులకు చెప్పగలిగినవాడుగానూ, బాహ్యాభ్యంతరాలలో నిర్మలమైనవాడుగానూ, గురుభక్తికలవాడుగానూ, పురాణాల జ్ఞానంకలవాడుగానూ వుండాలి. ఇలాంటివాడినే ఆచార్యడు అంటారు. ఈ గుణాలు హనుమంతుడిలో వున్నాయని శ్రీరాముడు చెప్పాడు లక్ష్మణుడితో.

         సుగ్రీవుడితో స్నేహం చేస్తే తన పని హనుమంతుడి వల్లే సఫలం అవుతుందని రామచంద్రమూర్తి నిశ్చయించుకున్నాడు. వాక్యజ్ఞుడు లక్ష్మణుడు, వాక్యజ్ఞుడు హనుమంతుడు అని శ్రీరామచంద్రమూర్తి అంటాడు. అంటే, ఈ గుణాలన్నీ లక్ష్మణుడిలో, హనుమంతుడిలో-ఇద్దరిలో- కలవనీ, ఇద్దరూ సమానులే అనీ భావం.

         శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా చెప్పడంతో, వాక్యజ్ఞుడైన లక్ష్మణుడు వాక్యజ్ఞుడైన హనుమంతుడితో ఇలా అన్నాడు. “అయ్యా! పండితుడా! సుగ్రీవుడి గురించి, అతడి ప్రభావం గురించీ, అతడి గొప్ప గుణాలను గురించీ, మేం ఇదివరకే విన్నాం. కాబట్టే ఆయన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వు చెప్పిన సుగ్రీవుడి పనిని మేం సంతోషంతో నువ్వు చెప్పినట్లే చేయగలం”. ఇది విని హనుమంతుడు సుగ్రీవుడి జయం కోరుతూ రామసుగ్రీవులకు స్నేహం కుదర్చాలని అనుకున్నాడు. ఆ తరువాత హనుమంతుడితో తమ యావత్ వృత్తాంతాన్ని చెప్పాడు లక్ష్మణుడు.  

         లక్ష్మణుడు ఇలా చెప్పగానే, అతడిని చూసి, హనుమంతుడు, “ఈ పరాక్రమం, ఈ ఇంద్రియ జయం, ఈ బుద్ధి సంపద, ఇలాంటి సదాచార సంపత్తికల మిమ్మల్ని తన అదృష్టం కొద్దీ సుగ్రీవుడు చూశాడు. సజ్జన స్తోత్ర పాత్రమైన నడవడి కలవారా! ఇక సుగ్రీవుడి చరిత్ర చెప్తాను వినండి” అంటూ చెప్పసాగాడు. “తన అన్న అయిన వాలి పగపట్టి, బాధపెట్టి, ఊరు వెడలగొట్టి అతడి భార్యను అధర్మ పద్ధతిలో హరించడం వల్ల అడవుల్లో కీడు దశ అనుభవిస్తున్నాడు సుగ్రీవుడు. సీతాదేవిని వెతికే పనిలో మాలాంటి కోతులను రంగంలోకి దింపి మీకు తప్పక సహాయం చేస్తాడు”.

         ఇలా చెప్పి సుగ్రీవుడిని చూడడానికి పోదాం రమ్మని రామలక్ష్మణులను అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తితో “అన్నా! హనుమంతుడు యదార్థం చెప్తున్నాడు. సుగ్రీవుడికి నీతో పని వుంది. కాబట్టి సంతోషించు. నీ కార్యం కూడా నెరవేరిందని భావించు. ఒకవేళ యితడు చెప్పింది అబద్ధమైతే దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పనైతే అయింది, లేకపోతె లేదు. ఇప్పుడు మనం వున్న స్థితికంటే తక్కువ స్థితికి పోము. ఆయన మాటలు సంతోషంగా కార్యసాధకుడిలాగా వున్నాయి. సందేహించడానికి తావులేకుండా స్పష్టంగా సాదుభావంతో ప్రసంగిస్తున్నాడు. కాబట్టి హనుమంతుడు కోరినట్లు మనం సుగ్రీవుడి దగ్గరికి పోదాం”. అని లక్ష్మణుడు చెప్పగా రామచంద్రమూర్తి అలాగే చేద్దామన్నాడు.

ఆంజనేయుడు తన సన్న్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. రామలక్ష్మణులను ఇద్దరినీ భుజాలమీద ఎక్కించుకుని, సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)